కురాన్ భావామృతం/అల్-హాక్ఖా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
69. హాఖ్కా (పరమయదార్థం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 52)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
పరమయదార్థం! ఏమిటా పరమయదార్థం? ఆ పరమయదార్థం ఏమిటో నీకే మైనా తెలుసా? ఆద్, సమూద్ జాతులు హఠాత్తుగా వచ్చిపడే (ప్రళయ) విపత్తుని తిరస్కరించారు. అందువల్ల సమూద్ ప్రజలు ఒక ఘోరమైన ప్రమాదానికి గురై హత మయ్యారు. ఆద్ ప్రజలు ఒక భయంకరమైన తుఫాను దెబ్బకు నాశనమయ్యారు. దేవుడు దాన్ని వరుసగా ఏడురాత్రుళ్ళు, ఎనిమిదిపగళ్ళు వారిమీద పడవేశాడు. (అప్పుడు నీవక్కడ ఉండివుంటే) వారక్కడ ఖర్జూరపు మొదళ్ళు పడినట్లు నిర్జీవంగా పడివుండటం నీకు కన్పించేది. చూడు, వారిలో ఎవడైనా ప్రాణాలతో బయటపడ్డాడా? (1-8)
ఫిరౌన్, అతనికి పూర్వముండిన జాతులు, తల్లక్రిందులయి ధ్వంసమైన జన పదాల జనం కూడా ఘోరపాపానికి పాల్పడ్డారు. వారంతా తమప్రభువు (పంపిన) ప్రవక్త లకు ఎదురుతిరిగారు. అప్పుడాయన వారిని కఠినంగా పట్టుకున్నాడు. (9-10)
(నూహ్ ప్రవక్త కాలంలో) తుఫానువరద ఉధృతమైనప్పుడు మేము మిమ్మల్ని ఓడ లోకి ఎక్కించాం. ఈ సంఘటన మీకు కనువిప్పు కల్గించే జ్ఞాపికగా మిగిలిపోతుందని, గుర్తుంచుకునే చెవులు దాన్ని భద్రపరచుకుంటాయని మేమిలా చేశాం. (11-12)
ఆ తర్వాత (ప్రళయ)శంఖం ఓసారి పూరించగానే భూమిని, పర్వతాల్ని అమాంతం ఎత్తికుదేసి తునాతునకలు చేయడం జరుగుతుంది. ఆరోజు జరగవలసిన సంఘటన జరుగుతుంది. అప్పుడు ఆకాశం బ్రద్దలై, అస్తవ్యస్తమైపోతుంది. (సరికొత్త విశ్వం ఆవిర్బ విస్తుంది.) నలుదిశలా దైవదూతలు ప్రత్యక్షమై ఉంటారు. ఆరోజు ఎనిమిది మంది దైవ దూతలు నీప్రభువు సింహాసనం ఎత్తిపట్టుకొని ఉంటారు. ఆరోజు మీరు (దేవుని న్యాయ స్థానంలో) ప్రవేశపెట్టబడతారు. (అక్కడ) మీరు ఏ రహస్యాన్నీ దాచలేరు. (13-18)
అప్పుడు కుడిచేతికి కర్మలపత్రం ఇవ్వబడిన మనిషి (ఎంతో సంతోషిస్తూ తన బంధుమిత్రుల్ని కలుసుకొని) “ఇదిగో నా కర్మలపత్రం, చదవండి. నేను నా (కర్మఫలం) లెక్క నాకు తప్పక లభిస్తుందని భావిస్తుండేవాణ్ణి” అనంటాడు. అతనిక కోరిన సుఖ సంతోషాలు అనుభవిస్తాడు. మహా అద్భుతమైన స్వర్గవనంలో ఉంటాడు. దాని పండ్ల గుత్తులు బరువుతో వంగిఉంటాయి. “హాయిగా తినండి, త్రాగండి మీరు గతజీవితంలో చేసుకున్న సుకృతఫలం అనుభవించండి” (అంటారు దైవదూతలు). (19-24)
ఇక ఎడమచేతికి కర్మల పత్రం ఇవ్వబడినవాడు (తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ) ఇలా అంటాడు: “అయ్యయ్యో! నా కర్మపత్రం నాకసలు లభించకుండా, నా లెక్కేమిటో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది! నాకొచ్చిన (తొలి)చావే నన్ను పూర్తిగా తుదముట్టించి ఉంటే బాగుండేది!! ఈరోజు నా సిరిసంపదలు నాకేమాత్రం పనికి రాలేదు. నా అధికారం, ఆధిపత్యాలన్నీ మట్టిలో కలిసిపోయాయి.” (25-29)
(అప్పుడిలా ఆజ్ఞవుతుంది:) “పట్టుకోండి వాడ్ని. వాడిమెడకు గుదిబండ కట్టి నరకం లోకి త్రోసేయండి. తర్వాత డెబ్భయిమూరల గొలుసుతో వాడ్ని బిగించికట్టండి. మహోన్న తుడైన దేవుడ్ని వీడు నమ్మేవాడు కాదు; పేదవాడికి పట్టెడన్నం కూడా పెట్టేవాడు కాదు. అలాంటి సహాయకార్యాల కోసం ఇతరుల్ని ప్రోత్సహించేవాడు కాదు. అందువల్ల ఈ రోజిక్కడ వీడ్ని పట్టించుకునేవాడే లేడు. చీము, నెత్తురు తప్ప వాడికి తినడానికి మరేమీ లభించదు. పాపాత్ములే ఇలాంటి (జుగుప్సాకరమైన) తిండితింటారు” (30-38)
కాబట్టి, (మీరనుకునేది నిజం) కాదు. మీకు గోచరించేదాని పేర, గోచరించనిదాని పేర ప్రమాణంచేసి చెబుతున్నాను. ఇది గౌరవనీయుడైన సందేశహరుని వాక్కు. ఏ కవి నోటో వెలువడిన మాటకాదు. మీరసలు బహుతక్కువగా విశ్వసిస్తారు. ఇది ఏ మాంత్రి కుడి వాక్కు కూడా కాదు. మీరసలు చాలాతక్కువగా ఆలోచిస్తారు. (39-42)
ఇది సర్వలోకప్రభువు నుండి అవతరించిన (దివ్య)వాణి. ఇతను కల్పించి ఏదైనా విషయం ప్రచారం చేస్తే, మేమితని కుడిచేయి పట్టుకొని కంఠనాళం కోసివేసే వాళ్ళం. అప్పుడు మమ్మల్ని ఈపని నుండి ఏశక్తీ అడ్డుకోలేదు. (43-47)
ఇది భయభక్తులు కలవారి కోసం అవతరించిన హితోపదేశం. మీలో కొందరు నిరాకరించేవారున్నారని మాకు తెలుసు. అలాంటి తిరస్కారులకిది తప్పనిసరిగా పశ్చాత్తా పానికి కారణమవుతుంది. ఇదిపూర్తిగా నమ్మదగిన సత్యం. కనుక ప్రవక్తా! నీవు మాత్రం మహోన్నతుడైన నీ ప్రభువు నామం స్మరిస్తూ ఉండు. (48-52)