కురాన్ భావామృతం/అల్-ఆరాఫ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ


7. ఆరాఫ్‌ (శిఖరాలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 206)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-మీమ్‌-సాద్‌. ముహమ్మద్‌ (స)! ఈ గ్రంథం ద్వారా నీవు (ప్రజల్ని) హెచ్చరించడానికే దీన్ని నీ వద్దకు పంపడం జరిగింది. కనుక (సందేశప్రచారం గురించి) నీవు ఏమాత్రం సంకోచించకు. ఇది విశ్వసించినవారి కోసం ఒక హితబోధ. (1-2)
మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు అవతరించినదాన్ని అనుస రించండి. మీ ప్రభువుని వదలి (ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా) ఇతరుల్ని అనుసరించ కండి. కాని మీరు (మా)హితోపదేశం పట్ల చాలా తక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. (3)
మేము ఎన్నో జనపదాలు తుడిచిపెట్టాం. వారిపై మాశిక్ష రాత్రివేళ హఠాత్తుగా వచ్చింది. లేదా పట్టపగలు వారు విశ్రాంతి తీసుకునే వేళ వచ్చింది. మాశిక్ష వచ్చినప్పుడు వారు (పశ్చాత్తాపంతో) ‘మేము నిజంగా చాలా దుర్మార్గులం’ అని మాత్రమే అన్నారు#
ఏమైనప్పటికీ, మేము ఎవరి దగ్గరకు దైవప్రవక్తలను పంపామో వారిని తప్పకుండా (వారి కర్మల్ని గురించి) ప్రశ్నిస్తాము. (మా సందేశం అందజేసే బాధ్యతను మీరు ఏ మేరకు నెరవేర్చారు, దానికి ప్రజల నుండి ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది? అని) మేము దైవప్రవక్తలను కూడా అడుగుతాం. ఆ తర్వాత మేము జరిగినదంతా మా జ్ఞానంతో వారి ముందు పెడ్తాము. (వారి స్థితిగతులు తెలియకపోవడానికి) మేము అదృశ్యమై ఎక్కడికీ పోలేదు. (4-7)
ఆరోజు (కర్మల త్రాసులో) బరువైనదే సత్యమవుతుంది. ఎవరి త్రాసుపళ్ళెం బరు వుగా ఉంటుందో వారికే మోక్షం లభిస్తుంది. మరెవరి త్రాసుపళ్ళెం తేలికగా ఉంటుందో వారు ఘోరంగా నష్టపోతారు. వారు మాసూక్తుల పట్ల అన్యాయంగా ప్రవరిస్తుండేవారు#
మేము ధరణిలో మీకు పూర్తి అధికారాలిచ్చి వసింపజేశాం. మీకోసం ఇక్కడ జీవన సామగ్రి సమకూర్చాం. కాని మీరు చాలాతక్కువగా కృతజ్ఞత చూపుతున్నారు. (8-10)
మేము మిమ్మల్ని సృష్టించి మీకు రూపురేఖలు కల్పించాం. తర్వాత ఆదంకు గౌరవసూచకంగా అభివాదం చేయండని దైవదూతల్ని ఆదేశించాం. మా ఆదేశం పాటిస్తూ అందరూ అభివాదంచేశారు ఇబ్లీసు తప్ప. అతను అభివాదం చేసేవారిలో చేరలేదు#
“(ఇబ్లీస్‌!) నేను ఆజ్ఞాపించినా (నువ్వెందుకు అభివాదం చేయలేదు?) ఏ విషయం నిన్ను అభివాదం చేయకుండా నిరోధించింది?” అని మేము ప్రశ్నించాము.
దానికి వాడు “నేను ఇతనికంటే శ్రేష్ఠుడ్ని. నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతడ్ని (ఎలాంటి విలువలేని) మట్టితో సృజించావు” అన్నాడు. (11,12)
“అలాగానా! అయితే నీవిక్కడ్నుంచి దిగిపో. ఇక్కడ అహంకారంతో విర్రవీగడానికి నీకెలాంటి హక్కులేదు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. నీవు (మా ఆదేశాన్ని ధిక్కరించి) పరమ నీచుడవయి పోయావు” అన్నాము మేము. (13)
“అయితే (దేవా!) మానవులు మళ్ళీ బ్రతికించబడే వరకు నాకు గడువునివ్వు” అన్నాడు (ఇబ్లీసు). (14)
“అలాగే ఇస్తున్నాం వెళ్ళు” అన్నాము (మేము). (15)
“సరే, నీవు నన్ను ఏవిధంగా మార్గభ్రష్టుడ్ని చేశావో, నేనూ మానవజాతిని దారి తప్పించడానికి నీ రుజుమార్గంలో మాటువేసి కూర్చుంటాను. వీరిని ముందు నుంచి, వెనుకనుంచి, కుడినుంచి, ఎడమనుంచి అన్ని వైపులనుంచీ చుట్టుముట్టుతాను. వీరిలో చాలామందిని నీవు విశ్వసనీయులుగా, కృతజ్ఞులుగా చూడలేవు” అన్నాడు ఇబ్లీస్‌#
“ఓరి నీచుడా! శాపగ్రస్తుడవయి ఇక్కడ్నుంచి వెళ్ళిపో. (బాగా విను,) నీతో సహా నిన్ను అనుసరించే వారందర్నీ నరకంలోకి విసరివేస్తాను”. (16-18)
“ఆదం! నీవు, నీ భార్యా ఇద్దరూ స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు కోరిందల్లా తింటూ హాయిగా ఉండండి. అయితే (అదిగో) ఆ చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకండి. వెళ్ళారా, మీరు దుర్మార్గులలో చేరిపోతారు” అన్నాము మేము. (19)
ఆ తరువాత షైతాన్‌ వారి ఆచ్ఛాదిత మర్మావయవాలను పరస్పరం వారి ముందు బహిర్గతం చేయడానికి మాయమాటలతో వారిని మభ్యపెట్టాడు. వాడు (వారిద్దరి దగ్గరకు వెళ్ళి) “మీ ప్రభువు మిమ్మల్ని ఆ చెట్టు దగ్గరికి పోవద్దని ఎందు కన్నాడో తెలుసా? మీరు దైవదూతలయి పోతారని, లేదా శాశ్వత (స్వర్గ) జీవితం లభిస్తుందని దాని దగ్గరకు పోనివ్వకుండా మిమ్మల్ని వారించాడు” అని చెప్పాడు. పైగా వాడు ప్రమాణం చేసి మరీ “నేను మీకు నిజమయిన శ్రేయోభిలాషిని (నా మాట నమ్మండి)” అని నమ్మబలికాడు. (20-21)
ఈ విధంగా వాడు మోసపుటెత్తుగడలతో వారిద్దర్నీ వలలో వేసుకున్నాడు. చివరికి వారిరువురు (నిషేధిత) వృక్షాన్ని రుచిచూశారు. దాంతో వెంటనే వారి మర్మావయవాలు ఒకరి ముందు మరొకరివి బహిర్గతమై పోయాయి. వారు (సిగ్గుతో బిక్క చచ్చిపోయి) స్వర్గంలోని ఆకులతో తమ దేహాలను కప్పుకోవడానికి ప్రయత్నించారు.
అప్పుడు వారి ప్రభువు “నేను మిమ్మల్ని ఆ చెట్టు వద్దకు పోవద్దని వారించలేదా? షైతాన్‌ మీకు బద్ధవిరోధి అని చెప్పలేదా?” అని అడిగాడు.
“ప్రభూ! (మేము ఆత్మవంచనకు పాల్పడి) మాకు మేమే అన్యాయం చేసు కున్నాం. (ఇక నీవే మాకు దిక్కు.) నీవు మమ్మల్ని కనికరించి క్షమించకపోతే మేము సర్వనాశనమైపోతాము” అన్నారు వారిద్దరూ (పశ్చాత్తాపంతో కుమిలిపోతూ). (22-23)
“దిగిపోండి. మీరంతా ఒకరికొకరు శత్రువులు. మీరు ఒక నిర్ణీతకాలం వరకు భూ లోకంలో గడపవలసి ఉంది. మీకక్కడ నివాసం, జీవనోపాధి (వగైరా) సదుపాయాలు ఉన్నాయి. అక్కడే మీరు జీవించాలి, అక్కడే చనిపోవాలి. చివరికి అక్కడ్నుంచే మిమ్మల్ని పునర్జీవంతో తిరిగి లేపడం జరుగుతుంది” అన్నాము మేము. (24-25)
“ఆదం సంతానమా! మీరు మీ మర్మావయవాలను కప్పుకోవడానికి, మీ దేహానికి రక్షణగా, అలంకరణగా ఉపయోగపడటానికి మేము మీకు దుస్తులు ప్రసాదించాము. అయితే అన్నిటికంటే భయభక్తుల దుస్తులే ఎంతోశ్రేష్ఠమైనవి. ఇది (వస్త్రధారణ) దేవుని సూచనల్లో ఒక సూచన. మీరు విషయం గ్రహిస్తారని (ఇలా తెలుపుతున్నాం).” (26)
ఆదం సంతానమా! (షైతాన్‌ చేష్టలపట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉండండి.) వాడు మీ తల్లిదండ్రుల్ని మభ్యపెట్టి స్వర్గం నుండి తీసివేయించాడు. ఒకరి మర్మావ యవాలు మరొకరి ముందు బహిర్గతం కావడానికి వారి దుస్తులు తొలగించాడు. జాగ్రత్త! ఆవిధంగా వాడు మిమ్మల్ని కూడా మాయమాటలతో మభ్యపెట్టవచ్చు. వాడు, వాడి అనుచరమూకలు మిమ్మల్ని మీరు చూడని వైపు నుండి చూస్తారు. ఈ పిశాచమూకలను మేము విశ్వసించనివారికి సహచరులుగా, సంరక్షకులుగా చేశాము. (27)
వారేదైనా సిగ్గుమాలిన పని చేస్తూ, తమ తాతముత్తాతలు ఇలాగే చేస్తుండేవారని అంటారు. పైగా దేవుడే అలా చేయమని తమను ఆజ్ఞాపించాడని చెబుతారు. వారికి చెప్పు: “నీతిబాహ్యమైన పనులు చేయమని దేవుడు ఎన్నటికీ ఆజ్ఞాపించడు. మీరు దేవుని పేరుచెప్పి మీకు తెలియని విషయాల్ని గురించి దేవుడే బోధిస్తున్నాడని అంటారా?” (28)
చెప్పు: “నాప్రభువు ఇలా ఆదేశించాడు-మీరు న్యాయంగా వ్యహరించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మనస్సును ఒక్కదేవుని మీదే లగ్నంచేయండి. ఆయన్నే వేడుకోండి. మీ జీవనధర్మాన్ని ఆయన కోసమే ప్రత్యేకించుకోండి. ఆయన ఈరోజు మిమ్మల్ని ఎలా సృష్టించాడో రేపు (ప్రళయదినాన) కూడా అలాగే మిమ్మల్ని పునఃసృష్టిస్తాడు.” (29)
ఒక వర్గానికి ఆయన సన్మార్గం చూపాడు. రెండో వర్గం నొసట మార్గభ్రష్టత్వమే రాసి పెట్టిఉంది. దానిక్కారణం వారు దేవునికి బదులు భూతపిశాచాలను రక్షకులుగా చేసుకొని తాము సన్మార్గంలో ఉన్నామని భావిస్తుండేవారు. (30)
ఆదం సంతానమా! ప్రార్థన చేసే ప్రతిసారీ పూర్తి వస్త్రధారణతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. తినండి, త్రాగండి. (హాయిగా ఉండండి.) కాని హద్దులు మాత్రం మీరకండి. హద్దులు మీరేవారిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. (31)
ముహమ్మద్‌ (స)! వారినడుగు: “దేవుడు తన దాసుల కోసం సమ్మతించిన ఈ అలంకరణలను ఎవరు నిషేధించారు? ఎవరు దేవుడు ప్రసాదించిన పరిశుద్ధ వస్తువుల్ని నిషేధించినది?” చెప్పు: “ఇవన్నీ ఇటు ప్రపంచ జీవితంలోనూ విశ్వాసుల కోసమే ఉన్నాయి; అటు ప్రళయదినాన కూడా వారికే లభిస్తాయి.” ఈవిధంగా మేము విషయం గ్రహించే వారికోసం మా సూక్తులు విడమరచి తెలియజేస్తున్నాము. (32)
ముహమ్మద్‌ (స)! వారికిలా చెప్పు: “నా ప్రభువు ఈ విషయాలు నిషేధించాడు:

  • సిగ్గుమాలిన పనులు- అవి బహిరంగమైనవయినా, రహస్యమైనవయినా సరే.
  • పాపకార్యాలు
  • సత్యానికి వ్యతిరేకంగా హద్దుమీరి ప్రవర్తించడం
  • దేవుడు ఎలాంటి ప్రమాణం పంపకపోయినా ఆయనకు ఇతరుల్ని సాటికల్పించడం
  • దేవుడే ఆదేశించాడని ఆయన పేరుమీద మీకు తెలియని విషయాలు చెప్పడం.”

ప్రతి జాతికీ (నైతిక నియమావళి విషయంలో) ఒక గడువు నిర్ణయించబడింది. ఆ గడువు ముగిస్తే మాత్రం ఇక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయడంగాని, వాయిదా వేయడంగాని జరగదు. (ఆతర్వాత ఆజాతి కాలగర్భంలో కలసిపోతుంది.) (33-34)
(సృష్టిప్రారంభంలోనే దేవుడిలా చెప్పాడు:) ఆదం సంతానమా! మీ నుండే మీ దగ్గరికి మాసూక్తులు విన్పించే ప్రవక్తలు వచ్చినప్పుడు (వారి మాటలు విని) భయభక్తు లతో దుష్కార్యాలు మానుకొని తమ వైఖరి సరిదిద్దుకున్నవారికి ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. మా సూక్తులు తిరస్కరించి, ప్రవక్తల పట్ల తిరుగుబాటు వైఖరి అవలంబించేవారు నరకానికి పోతారు. అక్కడే వారిక శాశ్వతంగాఉంటారు. (35-36)
అసత్య విషయాలు కల్పించి వాటిని దేవునికి ఆపాదించే వాడికంటే, లేదా దేవుని సూక్తులు తిరస్కరించిన వాడికంటే పరమ దుర్మార్గుడు ఎవరుంటారు? అలాంటివారికి వారి విధివ్రాతలో రాయబడినది మాత్రమే (కొన్నాళ్ళపాటు) లభిస్తుంది. చివరికి మేము పంపే దూతలు వారి ప్రాణాలు తీయడానికి వస్తారు. అప్పుడా దూతలు “ఏరి, దేవుడ్ని వదలి మీరు మొరపెట్టుకున్న మీ మిధ్యాదైవాలు ఇప్పుడెక్కడికి పోయారు?” అని ప్రశ్నిస్తారు. దానికి వారు “వారంతా మానుండి కనుమరుగైపోయారు” అంటారు. “మేము నిజంగా సత్యతిరస్కారులం” అని వారే తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారు. (37)
“అయితే మీకు పూర్వం మానవుల, జిన్నుల వర్గం (ఒకటి) ఎలా నరకంలోకి పోయిపడిందో మీరూ నరకంలోకి పోయిపడండి”అని దేవుడు సెలవిస్తాడు. ప్రతిగుంపూ నరకంలో ప్రవేశించేటప్పుడు తనకు ముందు ప్రవేశించిన గుంపును దూషిస్తుంది.
ఇలా అందరూ నరకంలో చేరి గుమిగూడిన తరువాత ముందు చేరిన వర్గాన్ని తర్వాత చేరిన వర్గం నిందిస్తూ “ప్రభూ! వీరే మమ్మల్ని దారితప్పించినవారు, కనుక వీరికి రెట్టింపు శిక్ష విధించు” అంటుంది. దానికి “ప్రతి ఒక్కరికీ రెట్టింపు శిక్షే విధించబడింది. ఆ సంగతి మీరు గ్రహించలేకపోతున్నారు” అని సమాధానం లభిస్తుంది.
ఆతర్వాత మొదటివర్గం రెండవవర్గంతో “(మమ్మల్నెందుకు అనవసరంగా నింది స్తారు?) మాకంటే మీరేం తక్కువ తిన్నారా? ఇక (మాటలు చాలించి) మీరు చేజేతులా సంపాదించుకున్నదానికి ఫలితంగా నరకయాతనలు చవిచూడండి”అంటుంది. (38-39)
మా సూక్తులు తిరస్కరించి వాటిపట్ల తలబిరుసుతనంతో వ్యవహరించినవారి కోసం ఆకాశ ద్వారాలు ఎన్నటికీ తెరవబడవు. సూది బెజ్జం గుండా ఒంటె దూరడం ఎంత అసాధ్యమో వారు స్వర్గంలో ప్రవేశించడం కూడా అంతే అసాధ్యం. నేరస్థులకు మాదగ్గర ఇలాంటి దుష్పలమే లభిస్తుంది. వారి పడకకూడా నరకాగ్నిపడకే; దుప్పటికూడా నరకాగ్ని దుప్పటే అవుతాయి. ఇదే దుర్మార్గులకు మేమిచ్చే ప్రతిఫలం. (40-41)
మా సూక్తులు విశ్వసించి మంచి పనులు చేసేవారు (ఎంతో అదృష్టవంతులు.)- మేము ఏ మనిషిపైనా అతని శక్తికి మించిన బాధ్యత మోపము- (వారు) స్వర్గవాసు లవుతారు. అక్కడే వారిక శాశ్వతంగా (సుఖసంతోషాలతో) ఉంటారు. (42)
వారి హృదయాల్లో ఒకరికి వ్యతిరేకంగా మరొకరి విషయంలో ఏదైనా ద్వేషభావం ఉంటే దాన్ని మేము తీసివేస్తాం. వారి (మేడల) మధ్య సెలయేరులు ప్రవహిస్తుంటాయి. వారు (ఈ వైభవాలు చూసి) “సకల స్తోత్రాలు దేవునికే శోభిస్తాయి. ఆయనే మాకీ మార్గం చూపాడు. ఆయన మాకు సన్మార్గం చూపకపోయివుంటే మాఅంతట మేమీ మార్గం పొందగలిగేవారం కాము. మా ప్రభువు పంపిన ప్రవక్తలు నిజంగా సత్యాన్నే తెచ్చారు” అనంటారు. అప్పుడు “మీరీ స్వర్గానికి వారసులయ్యారు. మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా ఈస్వర్గం మీకు లభించింది” అని అశరీరవాణి విన్పిస్తుంది వారికి. (43)
ఆ తర్వాత స్వర్గవాసులు నరకవాసుల్ని పిలిచి “మాప్రభువు మాకు చేసిన వాగ్దానా లన్నీ నెరవేరాయి. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాలు నెరవేరాయని తెలుసుకున్నారా?” అని అడుగుతారు. దానికి వారు “ఆ...తెలుసుకున్నాం” అని సమా ధానమిస్తారు. అప్పుడు ఒక ప్రకటనకర్త వారి మధ్యకు వచ్చి “దైవమార్గంలోకి రాకుండా ప్రజల్ని నిరోధించిన దుర్మార్గులపై దైవశాపం విరుచుకుపడుగాక! వారు దైవమార్గాన్ని వక్రీకరించ దలిచారు, పరలోకాన్ని తిరస్కరించారు” అని అంటాడు. (44-45)
ఆ రెండు వర్గాల మధ్య ఒక అడ్డుగోడ ఉంటుంది. దాని శిఖరాలపై కొందరు ఉంటారు. వారు (స్వర్గ, నరకాల్లోని) అందర్నీ వారి ముఖచిహ్నాలను బట్టి గుర్తిస్తారు. అప్పుడు వారు స్వర్గవాసుల్ని ఉద్దేశించి “మీకు శాంతి కలుగుగాక!” అంటారు. వారింకా స్వర్గంలో ప్రవేశించలేదు. కాని ప్రవేశించగలమని ఆశిస్తున్నారు. తర్వాత వారి దృష్టి నరక వాసులపై పడగానే “ప్రభూ! మమ్మల్నీ దుర్మార్గుల్లో చేర్చకు” అని ప్రార్థిస్తారు. (46-47)
ఆతర్వాత శిఖరాలపై ఉన్నవారు నరకంలోని కొందరిని వారి ముఖచిహ్నాల్ని బట్టి గుర్తించి పిలిచి ఇలా అంటారు: “చూసుకున్నారుగా, ఈరోజు మీ ముఠాలుగాని, మీరు ఘనమైనవని భావించిన మీ వస్తుసామగ్రి గాని మీకు ఏమాత్రం ఉపయోగపడలేదు. స్వర్గంలో ఉన్న వీరిని చూడండి. మీరు ఎన్నో ప్రమాణాలుచేసి, వీరిపై దేవుడు దయ చూపడని అన్నారే!” అని అంటారు. అప్పుడు వారికి “స్వర్గంలో ప్రవేశించండి. ఇక మీకు ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు” అని చెప్పబడుతుంది. (48-49)
నరకవాసులు స్వర్గవాసుల్ని కేకవేసి పిలిచి “(మేమిక్కడ మాడి చస్తున్నాం) మామీద కొంచెం నీళ్ళు చల్లండి. లేదా మీకు దేవుడు ప్రసాదించిన దాన్నయినా కాస్త మావైపు విసరి వేయండి” అని అంటారు. దానికి స్వర్గవాసులు “దేవుడు ఈ రెండిటినీ సత్య తిరస్కారులకు నిషేధించాడు. వారు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారు. ప్రాపంచిక జీవితం వారిని మోసగించింది” అని సమాధానమిస్తారు. (అప్పుడు) దేవుడు ఇలా అంటాడు: “వీరు మా సూక్తులు, నిదర్శనాలు తిరస్కరిస్తూ ఈ దినాన్ని గురించి పట్టించుకోకుండా ఎలా వదిలేశారో మేము కూడా ఈరోజు వీరిని పట్టించుకోకుండా (వారి ఖర్మకు) వదిలేస్తున్నాము.” (50-51)
మేము వారి దగ్గరకు (దివ్య)గ్రంథం పంపాము. అందులో మేము (జీవిత విధానానికి సంబంధించిన) విషయాలన్నీ వివరంగా తెలియజేశాము. ఇది విశ్వసించే వారికి హితోపదేశం, కారుణ్యప్రదాయిని. ఇక వీరు దేని కోసం ఎదురుచూస్తున్నారు? ఈ గ్రంథం తెలియజేసిన (పరలోక) పరిణామం కోసమేనా? ఆ పరిణామం సంభవించే రోజు, దాన్ని గతంలో విస్మరించినవారే (వాస్తవం కళ్ళారా చూసి బెంబేలెత్తి పోయి) ఇలా అంటారు:
“నిజంగా మన ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యాన్నే తెచ్చారు. (కాని మనమే దాన్ని విశ్వసించ లేదు.) ఇప్పుడు మన కోసం సిఫారసు చేసేవారు ఎవరైనా ఉన్నారా? పోని, మనల్ని మరొకసారి ఇహలోకానికి పంపించడమైనా జరుగుతుందా? అలా జరిగితే మనం ఇదివరకు చేస్తుండిన (చెడ్డ) పనులు మానేసి వేరే (మంచి)పనులు చేసి చూపెడదాము.”
వారు చేజేతులా నష్టం కొని తెచ్చుకున్నారు. వారి అభూత కల్పనలన్నీ వారినుండి కనుమరుగైపోతాయి. (వారు కట్టుకున్న పేకమేడలు కుప్పకూలి పోతాయి). (52-53)
వాస్తవానికి అల్లాహ్‌యే మీ ప్రభువు, పోషకుడు. ఆయనే భూమ్యాకాశాలను ఆరు దినాలలో సృష్టించాడు. తరువాత తన అధికార సింహాసనం అధిష్ఠించాడు. ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. తిరిగి పగటి వెనుక రాత్రి పరుగెడుతూవస్తుంది. ఆయనే సూర్య, చంద్ర, నక్షత్రాలను సృష్టించినవాడు. సకల సృష్టిరాసులు ఆయన ఆజ్ఞే శిరసావ హిస్తున్నాయి. వినండి! సృష్టి ఆయనదే, ఆజ్ఞ (అధికారం) కూడా ఆయనదే. సకలలోక ప్రభువయిన ఆ దేవుడు ఎంతో శుభదాయకుడు. (54)
కనుక (మానవులారా!) మీ ప్రభువును దీనంగా, దయనీయంగా, రహస్యంగా వేడుకోండి. (గుర్తుంచుకోండి) ఆయన హద్దుమీరేవారిని ఎన్నటికీ ప్రేమించడు. ప్రపంచంలో శాంతి, సామరస్యాలు ఏర్పడిన తర్వాత అరాచకం, అలజడులు సృష్టించ కండి. భయంతో, ఆశతో మీరు దేవుడ్ని మాత్రమే వేడుకోండి. ఆయన కారుణ్యం సద్వర్తునులకు అతి చేరువలోనే ఉంది. (55-56)
దేవుడే తన అనుగ్రహ(వర్షా)నికి ముందు చల్లటి గాలిని శుభసూచకంగా పంపు తున్నాడు. తరువాత ఆ గాలి నీటితో నిండిన మేఘాలను ఏదయినా మృతభూభాగం వైపు మోసుకెళ్లేలా చేస్తున్నాడు. అక్కడ వర్షం కురిపించి రకరకాల పండ్లు పండిస్తున్నాడు. అదేవిధంగా మేము మృతులను కూడా (ప్రళయదినాన) బ్రతికించి లేపుతాము. మీరు హితబోధ గ్రహించడానికే మేము ఇలాంటి దృష్టాంతాలు ఇస్తున్నాము. (57)
సారవంతమైన నేల తన ప్రభువు అనుజ్ఞతో పుష్కలంగా మంచి పంటనిస్తుంది. సారంలేని చవిటినేల నాసిరకాన్నే ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా మేము కృతజ్ఞులయిన వారి కోసం మా సూక్తులు, సూచనలను మాటిమాటికి విశదీకరిస్తున్నాము. (58)
మేము నూహ్‌ను అతని జాతిప్రజల వద్దకు పంపించాము. అప్పుడతను వారితో “నా జాతి సోదరులారా! దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యదైవం లేడు. మీవిషయంలో నేను ఒక భయంకరదినాన సంభవించే ఆపద గురించి భయపడు తున్నాను” అన్నాడు. దానికి అతని జాతినాయకులు (ఆ ఆపద సంగతేమోగాని) నీవు మాత్రం స్పష్టంగా మార్గభ్రష్టుడై పోయినట్లు మాకు కన్పిస్తున్నావు” అన్నారు. (59-60)
నూహ్‌ ఇలా అన్నాడు: “సోదరులారా! నేనెలాంటి మార్గభ్రష్టత్వానికి గురికాలేదు. నేను సర్వలోక ప్రభువు వైపున ప్రవక్తగా వచ్చాను. మీకు మీప్రభువు సందేశం అంద జేస్తున్నాను. మీ శ్రేయోభిలాషిని. మీకు తెలియని విషయాలు దేవుని వైపు నుండి నేను తెలుసుకున్నాను. మీజాతికే చెందిన మనిషిద్వారా మీవద్దకు మీప్రభువు సందేశం వచ్చి నందుకు ఆశ్చర్యంగాఉందా మీకు? మిమ్మల్ని హెచ్చరించడానికి, మీరు దుష్కార్యాలకు దూరంగా ఉండటానికి, మీరు కరుణించబడటానికే ఈ సందేశం వచ్చింది.” అయితే వారు (ఈ హితబోధ వినకుండా) అతడ్ని తిరస్కరించారు. చివరికి మేము నూహ్‌ని, అతని అనుచరుల్ని ఒక ఓడలో ఎక్కించి కాపాడాము. మా సూక్తులు తిరస్కరించిన వారిని (నీట) ముంచివేశాం. వారు (సత్యం కానలేని) అంధులు. (61-64)
మేము ఆద్‌జాతి వద్దకు వారిసోదరుడు హూద్‌ (అ)ని పంపాము. అతను వారిని సంబోదిస్తూ “నాజాతి ప్రజలారా! దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యదైవం లేడు. మీరు ఇప్పుడైనా తప్పుడు వైఖరి నుండి బయటపడరా?” అన్నాడు. కాని అతని జాతినాయకులు ఈ మాటలు నమ్మడానికి నిరాకరిస్తూ “నీవు వట్టి వెర్రివాడి లా కన్పిస్తున్నావు నీవసలు అబద్ధాలరాయుడవని మాఉద్దేశ్యం” అన్నారు. (65-66)
అప్పుడు హూద్‌ ఇలా అన్నాడు: “నాజాతి ప్రజలారా! నేను వెర్రివాణ్ణేమీ కాను. సకలలోక ప్రభువు తరఫున నియమించబడ్డ దైవప్రవక్తను. నేను మీకు మీ ప్రభువు సందేశం అందజేస్తున్నాను. మీ శ్రేయోభిలాషిని, నమ్మకస్తుడ్ని. స్వయంగా మీజాతి మనిషి ద్వారా మీ దగ్గరికి మీప్రభువు సందేశం వచ్చినందుకు మీకు ఆశ్చర్యంగా ఉందా? మిమ్మల్ని హెచ్చరించడానికే ఈ సందేశం వచ్చింది. జ్ఞాపకం తెచ్చుకోండి; మీ ప్రభువు నూహ్‌జాతి తర్వాత మిమ్మల్ని వారికి వారసులుగా చేశాడు. ఆయన మీకు అన్నివిధాలా ప్రగతి కలిగించాడు. దేవుని అనుగ్రహాలు, ఆయన శక్తియుక్తులు గుర్తుకు తెచ్చుకోండి, మీ జీవితం సార్థకమవుతుంది.” (67-69)
దానికి వారిలా అన్నారు:“మా తాతముత్తాతలు పూజిస్తూవచ్చిన దైవాల్ని వదలి ఒక్క దేవుడ్ని ఆరాధించాలా? ఈసంగతి చెప్పడానికేనా నీవు వచ్చింది? నీవు మమ్మల్ని బెదిరిస్తున్న ఆశిక్ష ఏమిటో తీసుకురా. నీవు చెప్పేది నిజమైతే ఈపని చేసిచూపించు.”
అప్పుడు హూద్‌ మళ్ళీ ఇలా అన్నాడు: “అయితే కాచుకోండి, మీ మీద మీప్రభువు దెబ్బ పడబోతోంది. ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడింది. మీరు, మీ తాతముత్తా తలు పెట్టుకున్న (మిధ్యాదైవాల) పేర్ల విషయంలో నాతో వాదిస్తున్నారా? వాటికి దేవుడు ఎలాంటి ప్రమాణం పంపకపోయినా వితండవాదం చేస్తారా? అలాగైతే (ఆ శిక్ష కోసమే) ఎదురుచూడండి. మీతోపాటు నేనూ ఎదురుచూస్తాను.” (70-71)
చివరికి మేము మా కారుణ్యంతో హూద్‌ని, అతని అనుచరుల్ని కాపాడాము. మా సూక్తులు తిరస్కరించినవారిని తుడిచిపెట్టాం. వారసలు సత్యాన్ని నమ్మేవారే కాదు.(72)
మేము సమూద్‌ జాతిప్రజల వద్దకు వారిసోదరుడు సాలిహ్‌ని పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: “నాజాతి ప్రజలారా! దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యదైవం లేడు. మీ దగ్గరకు మీప్రభువు నుండి స్పష్టమైన ప్రమాణం వచ్చింది. ఇదిగో, దేవుని ఒంటె. మీ కోసం ఇదొక నిదర్శనం. కనుక దీన్ని దేవుని నేలపై స్వేచ్ఛగా మేయడానికి వదలిపెట్టండి. ఎలాంటి దురుద్దేశంతో నయినా దీన్ని తాకకూడదు. అలా చేస్తే మీపై దుర్భరమైన ఆపద వచ్చిపడుతుంది. ఆద్‌జాతి తర్వాత మీ ప్రభువు ఆ జాతికి మిమ్మల్ని వారసులుగా చేసిన విషయం జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన మీకు ఎంతో ఔన్నత్యం ప్రసాదించాడు. తద్వారా ఈనాడు మీరు చదునైన మైదానాల్లో అద్భుతమైన మేడల కడ్తున్నారు. కొండలు చెక్కి ఇండ్లు నిర్మిస్తున్నారు. కనుక దేవుని అనుగ్రహాలు విస్మరించకండి. ధరణిలో అరాచకం, అలజడులు సృష్టించకండి.” (73-74)
అతని జాతిలో అహంకారులైన నాయకులు సత్యాన్ని విశ్వసించిన బలహీనవర్గాల వారిని “సాలిహ్‌ తనప్రభువు వైపున నియమించబడిన దైవప్రవక్తని మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు “తప్పకుండా దైవప్రవక్తే. ఆయన తీసుకొచ్చిన సందేశాన్ని కూడా మేము విశ్వసించాము” అని సమాధానమిచ్చారు. అప్పుడా గర్విష్ఠులు “అయితే మీరు విశ్వసించినదాన్ని మేము తిరస్కరిస్తున్నాం” అన్నారు. (75-76)
ఆ తర్వాత వారు తలబిరుసుతో తమ ప్రభువాజ్ఞ ఉల్లంఘించి ఒంటెను చంపే శారు. పైగా “సాలిహ్‌! నీవు మమ్మల్ని బెదరగొడ్తున్న ఆ శిక్ష ఏమిటో ఇక తీసుకురా చూద్దాం. నీవు నిజంగా దైవప్రవక్తవయితే ఈపని చేసి చూపు” అని సవాలు విసిరారు.
చివరికి ఆసాంతం ఊపేసే మహోపద్రవం వారిపై వచ్చిపడింది. దాంతో వారు తమ ఇండ్లలో బోర్లాపడి ఊపిరివిడిచారు. సాలిహ్‌ ఈ భయానకదృశ్యం చూసి “నా జాతి ప్రజలారా! నేను మీకు నాప్రభువు సందేశం అందజేశాను. మీశ్రేయస్సు కోరి ఎంతో నచ్చ జెప్పాను. కాని నేనేం చేయగలను? మీరు మీ శ్రేయోభిలాషినే ప్రేమించలేక పోయారు” అని చెబుతూ అక్కడ్నుంచి (బాధాతప్త హృదయంతో) వెళ్ళిపోయాడు. (77-79)
మేము లూత్‌ని ప్రవక్తగా నియమించి (అతని జాతి వద్దకు) పంపాము. అతను తన జాతిప్రజలతో అన్న మాటలు గుర్తుకుతెచ్చుకో, “మీరెలాంటి అశ్లీలచేష్టలకు పాల్పడు తున్నారు! మీకు పూర్వం ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి సిగ్గుమాలిన పని చేస్తున్నారే!! మీరు కోర్కెల్ని తీర్చుకోవడానికి స్త్రీలను వదలి పురుషుల వెంటపడ్డారా? (ఎంతసిగ్గుచేటు!) మీరసలు హద్దుమీరిపోయారు” అని అన్నాడతను. (80-81)
అతని జాతిప్రజలు (తలబిరుసుతో) “గెంటేయండి వీరిని మన ఊళ్ళో నుంచి. పేద్ద పవిత్రులట!” అన్నారు. అంతకుమించి ఎలాంటి జవాబు ఇవ్వలేకపోయారు. (82)
చివరికి మేము వెనుకుండిపోయినవారిలో చేరిన అతని భార్యని తప్ప లూత్‌ని, అతని కుటుంబసభ్యుల్ని అక్కడ్నుంచి తీసి కాపాడాం. తర్వాత ఆజాతిపై మేము (రాళ్ళ) వర్షం కురిపించాం. చూడు, ఆ పాపాత్ములకు ఎలాంటి దుర్గతి పట్టిందో! (83-84)
మేము మద్యన్‌ ప్రజల వద్దకు వారి సోదరుడు షుఐబ్‌ను పంపాము. అతను తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మీ దగ్గరకు మీప్రభువు నుండి స్పష్టమైన నిదర్శనం వచ్చింది కనుక మీరు తూనికలు, కొలతలు పూర్తిగా పాటించండి. ప్రజలకు రావలసిన సరుకు తగ్గించి ఇవ్వకండి. ధరణిలో శాంతీసామరస్యాలు ఏర్పడ్డాక అరాచకం సృష్టించకండి. మీరు విశ్వాసులైతే (విషయం గ్రహించండి), అందులోనే మీ శ్రేయస్సు ఉంది.” (85)
(జీవితానికి సంబంధించిన) ప్రతి మార్గంలో అడ్డుగోడలై కూర్చోకండి. అలా ప్రజలను బెదరగొట్టి ‘విశ్వసించేవారిని’ దైవమార్గంలోకి రాకుండా నిరోధించకండి. ఆ మార్గాన్ని చెడగొట్టే చేష్టలకు వడిగట్టకండి. మీరు అల్పసంఖ్యాకులుగా ఉన్న రోజులు గుర్తుకుతెచ్చుకోండి. ఆ తర్వాత దేవుడు మీ జనాభాను పెంచాడు. లోకంలో దుర్మార్గు లకు ఎలాంటి గతి పట్టిందో కళ్ళుతెరచి చూడండి. మీలో కొందరు నేను తెచ్చిన బోధనలు నమ్ముతున్నారు. మరికొందరు నమ్మడంలేదు. కనుక మనల్ని గురించి దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కాస్త ఓపిక పట్టి చూడండి, ఆయనే అందరి కంటే మంచి నిర్ణయం తీసుకునేవాడు.” (86-87)
అతని జాతినాయకులు అధికార గర్వంతో విర్రవీగుతూ “షుఐబ్‌! నీవు, నిన్ను విశ్వ సించినవారు (మర్యాదగా) మా మతంలోకి తిరిగి వచ్చేయండి. లేదంటారా, మిమ్మల్నం దర్నీ మేము మా పట్నం నుంచి గెంటివేస్తాం (తెలుసా?)” అన్నారు.
అప్పుడు షుఐబ్‌ ఇలా అన్నాడు: “ఏమిటీ బలాత్కారం! మాకిష్టం లేకపోయినా బల వంతంగా మమ్మల్ని వెనక్కి మరలింపజేస్తారా? దేవుడు మమ్మల్ని మీ (మతం) నుండి విముక్తి కల్గించాడు. మేము మళ్ళీ మీమతంలోకి వస్తే మేము దేవునికి అబద్ధం ఆపా దించిన వారమవుతాం. మేము మీ మతంలోకి మళ్లీ అడుగుపెట్టడం అసంభవం. మా ప్రభువైన దేవుడలా చేయగోరితే తప్ప (ఎన్నటికీ వెనక్కి మరలం). మాప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునీ పరివేష్ఠించిఉంది. ఆయన మీదే మేము భారం వేశాం. ప్రభూ! మాకూ, మాజాతికి మధ్య సరైన తీర్పుచేయి. నీవే అందరికంటే మంచి తీర్పరివి.” (88-89)
అతని జాతిలో సత్యాన్ని తిరస్కరించిన నాయకులు (ఒకరోజు సమావేశమయి) “మనం గనక షుఐబ్‌ని అనుసరిస్తే నాశనమైపోతాం” అని పరస్పరం చెప్పుకున్నారు. అయితే చివరికి ఆసాంతం ఊపివేసే భయంకరమైన విపత్తు వారిని చుట్టుముట్టింది. దాంతో వారు తమ ఇండ్లలో బోర్లాపడిపోయి ఊపిరి విడిచారు. (90-91)
షుఐబ్‌ను తిరస్కరించినవారు తమ ఇండ్లలో అసలు నివసించనే లేదన్నట్లు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయారు. ఈవిధంగా షుఐబ్‌ని తిరస్కరించినవారే చివరికి సర్వనాశనమయ్యారు. షుఐబ్‌ (ఈ భయానక దృశ్యం చూసి) “నా జాతి ప్రజలారా! నేను నా ప్రభువు పంపిన సందేశం మీకందజేశాను. చివరిదాకా మీ శ్రేయస్సు నే కోరుకున్నాను. ఇప్పుడిక సత్యాన్ని నిరాకరించిన ఈ జాతి (దుర్గతి) పట్ల నేనెందుకు విచారించాలి?” అని పలుకుతూ ఆ పట్నం నుంచి నిష్క్రమించాడు. (92-93)
మేము ఏ పట్టణానికి దైవప్రవక్తను పంపినా ఆపట్టణవాసులు వినయ వినమ్రత లకు దిగి వచ్చేందుకు వీలుగా మొదట వారిని లేమికి, కష్టాలకు గురిచేస్తుంటాము. అలా లేమికి, కష్టాలకు గురిచేయకుండా ఉండటమన్నది ఎన్నడూ జరగలేదు. తర్వాత ఆ దుస్థితిని మార్చి వారికి మంచి స్థితి కలిగించాం. ఆవిధంగా వారు బాగా అభివృద్ధి చెంది (ఆ అభివృద్ధికి కారకుడైన సృష్టికర్తను విస్మరించి) “మంచిరోజులు, చెడ్డరోజులు మన పూర్వీకులక్కూడా వచ్చాయి”అని చెప్పసాగారు. చివరికి మేము హఠాత్తుగా వారిని పట్టుకున్నాం. వారప్పుడు పూర్తిగా ప్రాపంచిక మైకంలో పడిఉన్నారు. (94-95)
పట్టణవాసులు గనక సత్యాన్ని విశ్వసించి దేవుని పట్ల భయభక్తులు కలిగిఉంటే, మేము వారి కోసం భూమ్యాకాశాల శుభాల (ద్వారాల)ను తెరచి పెట్టేవారము. కాని వారు సత్యాన్ని విశ్వసించడానికి నిరాకరించారు. అందువల్ల వారు చేసుకున్న కర్మలకు శిక్షగా మేము (ఉపద్రవం తెచ్చి) వారిని పట్టుకున్నాము. (96)
మరి ఈ పట్టణవాసులు కూడా అలాగే ఏమరుపాటులో పడివున్నారా? రాత్రివేళ గాఢనిద్రలో ఉన్నప్పుడు వారిపై మా శిక్ష అకస్మాత్తుగా విరుచుకుపడదని తలచి గుండెల మీద చేతులు వేసుకొని ఉన్నారా? లేక పగటివేళ ఆడుతూ పాడుతూ (ప్రాపంచిక వ్యామోహంలో మునిగి) ఉన్నప్పుడు మా ఉక్కు పిడికిలి వారి మెడలు పట్టుకోబోదని నిర్భయంగా ఉన్నారా? దేవుని ఎత్తుగడలంటే వారికి ఏమాత్రం భయం లేదా? సర్వ నాశనమయ్యే జాతి మాత్రమే ఇలా దేవుని ఎత్తుగడల పట్ల భయమూ, భక్తీ లేకుండా మనుగడ సాగిస్తుంది. (97-99)
గత భూవాసుల తదనంతరం ఇప్పుడు భూమికి వారసులైనవారు, మేము తలచు కుంటే వారిపై ఆపద తెచ్చిపెడతామని, ఏ మంచి విషయం వినకుండా వారి హృదయ కవాటాలు మూసివేస్తామని గ్రహించరా? ఇలా మేము కొన్ని జాతుల గాధలను నీకు విన్పిస్తున్నాము. వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చారు. కాని ఒకసారి తిరస్కరించినదాన్ని వారు మళ్ళీ విశ్వసించే మనుషులు కాదు. చూశావా! ఈవిధంగా మేము సత్యతిరస్కారుల హృదయ కవాటాలు మూసివేస్తున్నాము. వారిలో చాలామంది వాగ్దానభంగం చేసేవారినే మేము చూశాము. అలాగే వారిలో అనేక మంది నీతిలేనివారిని కూడా మేము చూశాము. (100-102)
వారి తరువాత మేము మూసా (ప్రవక్త)కు నిదర్శనాలిచ్చి ఫిరౌన్‌, అతని రాజ్యాధి కారుల దగ్గరకు పంపాము. అయితే వారు కూడా మా నిదర్శనాల పట్ల అన్యాయంగానే ప్రవర్తించారు. చూడు, ఆ దుర్మార్గులకు (చివరికి) ఎలాంటి గతి పట్టిందో. (103)
మూసా ఇలా అన్నాడు: “ఫిరౌన్‌! నేను విశ్వప్రభువు వైపున వచ్చిన ప్రవక్తను. నేను దేవుని పేరుతో ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడటం నా విధ్యుక్త ధర్మం. నేను మీ దగ్గరికి మీ ప్రభువు నుండి స్పష్టమైన నిదర్శనం తీసుకొచ్చాను. కనుక నీవు ఇస్రాయీల్‌ సంతతి ప్రజలను నా వెంట పంపించు.” (104-105)
దానికి ఫిరౌన్‌ “నీవేదయినా నిదర్శనం తీసుకొని వస్తే, నీవు చెప్పేది నిజమయితే దాన్ని మా ముందు ప్రదర్శించు” అన్నాడు. (106)
అప్పుడు మూసా తన చేతికర్ర క్రింద పడవేశాడు. వెంటనే ఆ కర్ర సర్పంగా మారి పోయింది. (తరువాత) అతను తన చేతిని (చంకలో పెట్టి) బయటికి తీశాడు. అది చూపరులకు ధగధగ మెరిసిపోతూ కన్పించింది. (107-108)
అయితే ఫిరౌన్‌జాతికి చెందిన కొందరు నాయకులు (మూసా వల్ల ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భయపడి) “ఇతను తప్పకుండా పెద్ద మాంత్రికుడయి ఉంటాడు. ఇతను (తన మంత్రబలంతో) మిమ్మల్ని మీరాజ్యం నుండి వెడలగొట్ట జూస్తున్నాడు. ఇప్పుడు మీరేం చేయదలచుకున్నారో చెప్పండి” అన్నారు ఫిరౌన్‌తో. (109-110)
తరువాత వారంతా ఫిరౌన్‌కు సలహా ఇస్తూ “ఇతడ్ని, ఇతని సోదరుడ్ని కొన్నాళ్ళు ఆపిఉంచండి. ఈలోగా అన్ని పట్టణాలకు మన దూతల్ని పంపి మంత్రవిద్యలో ఆరి తేరినవారిని మీ దగ్గరకు పిలిపించుకోండి” అని చెప్పారు. (111-112)
దాని ప్రకారం ఆరితేరిన మాంత్రికులు ఫిరౌన్‌ దగ్గరికొచ్చారు. అప్పుడా మాంత్రి కులు “మేము గెలిస్తే అందుకు మాకేదైనా ప్రతిఫలం ఇప్పిస్తారా?”అని అడిగారు. (113)
“తప్పకుండా. మీరు మా సన్నిహితులలో చేరుతారు” చెప్పాడు ఫిరౌన్‌. (114)
ఆ తరువాత మాంత్రికులు మూసాను ఉద్దేశించి “మొదట నీవు (నీ కర్రను) పడ వేస్తావా లేక మమ్మల్ని (మా తాళ్ళను) పడవేయమంటావా?” అని అడిగారు. దానికి మూసా “మీరే పడవేయండి” అన్నాడు.
అప్పుడు మాంత్రికులు (తమ దగ్గరున్న త్రాళ్ళను నేలమీద) పడవేశారు. (తక్షణమే) అవి ప్రేక్షకులకు కనికట్టు కలిగించి భీతావహం సృష్టించాయి. ఆవిధంగా వారు అద్భుత మైన తాంత్రికవిద్య ప్రదర్శించారు. (115-116)
సరిగ్గా అదే సమయంలో మేము మూసాకు, అతని కర్ర క్రింద పడవేయమని చెప్పాము. అతనలా (కర్ర) క్రింద పడవేశాడో లేదో తృటిలో అది విజృంభించి, వారి అభూత కల్పనలన్నిటినీ చకచకా స్వాహాచేస్తూ పోయింది. (117)
ఈ విధంగా సత్యం సత్యంగా రుజువయింది. వారు కల్పించినవన్నీ అసత్యమని తేలిపోయింది. ఫిరౌన్‌, అతని అనుయాయులు ఈ పోటీలో ఘోరంగా పరాజితులయి పరాభవం పాలయ్యారు. మాంత్రికులు ఈ అద్భుత మహిమ చూసి అప్రయత్నంగా సాష్టాంగపడి “మేము సర్వలోక ప్రభువును విశ్వసించాం. మూసా, హారూన్‌లు విశ్వసిం చిన ప్రభువును మేమూ విశ్వసించాం” అని బిగ్గరగా అన్నారు. (118-122)
అప్పుడు ఫిరౌన్‌ (మండిపడుతూ) ఇలాఅన్నాడు: “ఏమిటీ, నేను అనుమతి ఇవ్వక ముందే మీరితడ్ని విశ్వసిస్తారా? ఇదంతా ఈపట్నం నుంచి ఇక్కడి పౌరుల్ని వెళ్ళగొట్టడా నికి మీరంతా కలసి పన్నినపన్నాగం. ఉండండి, త్వరలోనే (దాని పర్వవసానం) మీకు తెలుస్తుంది. మొదట నేను ఒక వైపున్న మీ చేతుల్ని, (వాటికి అభిముఖంగా) రెండో వైపున్న మీకాళ్ళను నరికిస్తాను. తర్వాత మిమ్మల్ని ఉరికంబం ఎక్కిస్తాను”. (123-124)
వారిలా అన్నారు: “మా ముందుకు మాప్రభువు నిదర్శనాలు వచ్చాయి. మేము వాటిని విశ్వసించాం. అదేకదా నీవు మాపై పగ సాధించడానికి కారణం? మేము ఎటూ మాప్రభువు సన్నిధికి పోవలసిన వాళ్ళమే- దేవా! మాకు సహనస్థయిర్యాలు ప్రసాదించు. మేము నీకు విధేయులమైఉన్న స్థితిలోనే మాకు మరణం కల్గించు.” (125-126)
ఫిరౌన్‌జాతి నాయకులు ఫిరౌన్‌ని మరింత ఎగదోస్తూ “మీరు మూసాను, అతని జాతివాళ్ళను దేశంలో అరాచకం సృష్టించడానికి అలాగే వదలిపెడ్తారా? వారు మిమ్మల్ని, మీ దైవాలను ఆరాధించడం మానేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా?” అని అడిగారు. దానికి ఫిరౌన్‌ “నేను వారి కొడుకుల్ని హతమార్చి, వారి కూతుళ్ళను మాత్రమే బ్రతక నిస్తాను. వారిమీద మాకు పూర్తి అధికారం ఉంది” అని చెప్పాడు. (127)
మూసా తనజాతిని ఓదార్చుతూ “దైవసహాయం వేడుకోండి. సహనం వహించండి. ఈభూమి దేవునిది. దేవుడు తన దాసులలో తాను కోరినవారిని దానికి వారసులుగా చేస్తాడు. దేవుని పట్ల భయభక్తులతో మసలుకునేవారిదే అంతిమవిజయం” అన్నాడు#
అప్పుడు అతనిజాతి ప్రజలు “నీవు రాక ముందుకూడా మేము పీడించబడుతుండే వాళ్ళం. ఇప్పుడు నీవు వచ్చిన తర్వాత కూడా పీడించబడుతున్నాం” అన్నారు.
మూసా (వారికి ధైర్యం చెబుతూ) “మీప్రభువు త్వరలోనే మీశత్రువుల్ని తుద ముట్టించి వారి స్థానంలో మిమ్మల్ని పుడమిపై (తన) ప్రతినిధులుగా నియమిస్తాడు. అప్పుడు మీరెలా నడుచుకుంటారో చూస్తాడు” అని అన్నాడు. (128-129)
ఫిరౌనీయులలో (సత్యం పట్ల) స్పృహ రావడానికి మేము కొన్నేళ్ళపాటు వారిని దుర్భిక్షానికి, పంటల కొరతకు గురిచేశాం. (అయినా వారిలో మార్పు రాలేదు.) మంచి రోజులు వచ్చినప్పుడు తామందుకు అర్హులమని అంటారు; దుర్దినాలు దాపురించి నప్పుడు మూసాని, అతని అనుచరుల్ని దుశ్శకునాలుగా పరిగణిస్తారు. వారి దుశ్శకునం దేవుని చేతిలో ఉంది. కాని వారిలో చాలామంది ఆ సంగతి గ్రహించడం లేదు. వారు మూసాతో “నీవు మాపై మంత్రతంత్రాలు ప్రయోగిస్తూ మాముందు ఎన్ని చమత్కారాలు ప్రదర్శించినా మేము నిన్ను ఎన్నటికీ విశ్వసించం” అని తెగేసి చెప్పారు. (130-132)
చివరికి మేము వారిపైకి తుఫాను పంపించాము; మిడతల దండు వదిలాము; పేలు, పురుగుల్ని పంపాము; కప్పలు వదిలాము; నెత్తుటి వర్షం కురిపించాము. ఈ మహిమలన్నిటినీ మేము విడివిడిగా చేసి చూపాము. కాని వారు తిరస్కారం, తల బిరుసుతనాలనే ప్రదర్శించారు. వారసలు పరమ దుర్మార్గులు. (133)
ఏదైనా ఆపద వస్తే వారు మూసా దగ్గరికెళ్ళి ఇలా బ్రతిమాలుతారు: “మూసా! నీకు నీప్రభువు నుండి లభించిన (ప్రవక్త)పదవి సహాయంతో ఈఆపద నుండి మమ్మల్ని గట్టెక్కించమని దేవుడ్ని ప్రార్థించు. ఈసారి నీవు మానుండి ఈ ఆపదను తొలిగిస్తే మేము నీమాట విని ఇస్రాయీల్‌ సంతతిని నీవెంట పంపుతాం.” అయితే వారిపై విరుచుకుపడ నున్న శిక్షను మేము కొంతకాలం తొలగించగానే వారు ఆడినమాట తప్పేవారు. ఇలా వారు మా మహిమల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా తిరస్కరించారు. చివరికి మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. వారిని నడిసముద్రంలో ముంచివేశాము. (134-136)
ఆ తరువాత మేము వారి స్థానంలో అణచివేతకు గురైన బలహీనవర్గం ప్రజల్ని తెచ్చిపెట్టాము. తూర్పు నుండి పడమర వరకు మేము ఎన్నో శుభాలు కలిగించిన భూభాగానికి వారిని వారసులుగా చేశాము. ఈవిధంగా ఇస్రాయీల్‌ సంతతివారి విషయంలో నీ ప్రభువు చేసిన వాగ్దానం నెరవేరింది. దీనికి కారణం వారు సహనం వహించడమే. ఫిరౌన్‌, అతని తాబేదార్లు కట్టించిన వాటిని (అంటే మేడలను), ఎక్కించిన వాటిని (అంటే పందిళ్ళపై ద్రాక్ష తోటల్ని) మేము సర్వనాశనం చేశాము. (137)
ఇస్రాయీల్‌ సంతతివారిని మేము సముద్రం దాటించి ఆవలకు చేర్చాము. అక్కడ నుండి వారు మరోచోటికి ప్రయాణం సాగించారు. దారిలో వారికి విగ్రహాలు పట్టుకొని కూర్చున్న ఒక జాతి తారసపడింది. అప్పుడు వారు “మూసా! వారు పూజిస్తున్న దైవం లాంటిది మాక్కూడా ఏదైనా దైవాన్ని చేసివ్వు” అన్నారు.
దానికి మూసా “మీరు మరీ మూఢుల్లా మాట్లాడుతున్నారు. వారు అవలంబించిన ఆరాధన నాశనమవుతుంది. వారు చేస్తున్నది పనికిమాలిన పని” అన్నాడు. ఇంకా “దేవుడు మిమ్మల్ని యావత్తు మానవాళిపై ఔన్నత్యం ప్రసాదించాడు. అలాంటి దేవుడ్ని వదలి నేను మీకోసం వేరే (మిధ్యా)దైవాన్ని వెదకిపెట్టాలా?” అన్నాడతను. (138-140)
జ్ఞాపకంతెచ్చుకోండి. మేము ఫిరౌనీయుల బారినుండి మిమ్మల్ని విముక్తం చేశాం. వారు మిమ్మల్ని ఘోరంగా పీడిస్తుండేవారు. మీ కొడుకుల్ని చంపుతూ మీ కుమార్తెల్ని మాత్రమే బ్రతకనిస్తుండేవారు. మీప్రభువు తరఫున మీకది కఠినపరీక్షగా ఉండింది. మేము ముప్ఫయి రోజుల గడువుకోసం మూసాను పిలిపించాం. తర్వాత ఈ గడువును పదిరోజులు పొడిగించాం. ఇలా అతని ప్రభువు నిర్ణయించిన గడువు నలభై రోజుల యింది. మూసా బయలుదేరే ముందు తన సోదరునితో “నేను వెళ్ళిన తర్వాత నీవు నాతరఫున మన జాతిప్రజలకు నాయకత్వం వహించి సరైన రీతిలో పనిచేస్తూ ఉండాలి. విచ్ఛిన్నకారుల త్రోవ నడవకు” అని అన్నాడు. (141-142)
ఆ తర్వాత మూసా మా నిర్ణీత సమయానికి (కొండ దగ్గరకు) చేరుకున్నప్పుడు అతని ప్రభువు అతనితో ప్రత్యక్షసంభాషణ జరిపాడు. (అప్పుడు) మూసా తన ప్రభువును వేడుకుంటూ “ప్రభూ! నా కళ్ళకు శక్తి ప్రసాదించి నీ దర్శనభాగ్యం కలిగించు” అన్నాడు. దానికి దేవుడు “నీవు నన్ను (ఇహలోకంలో) చూడలేవు. సరే, ఈకొండ వైపు కాస్త దృష్టి సారించు. అది తన స్థానంలో యధాతథంగా ఉంటే నీవు నన్ను చూడగలవు” అన్నాడు.
ఆ తరువాత అతని ప్రభువు తన దివ్యతేజస్సును ఆ కొండపై ప్రసరింపజేయగానే అది మరుక్షణం తునాతునకలైపోయింది. దాంతో మూసా స్పృహతప్పి పడిపోయాడు. కాస్సేపటికి స్పృహ రాగా “ప్రభూ! నీవు ఎంతో పరిశుద్ధుడవు. జరిగిన పొరపాటుకు పశ్చా త్తాపపడుతూ నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను. (నన్ను క్షమించు.) అందరికంటే ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను” అని ప్రార్థించాడు మూసా. (143)
అప్పుడు దేవుడు “మూసా! నేను నీకు ప్రవక్త పదవినిచ్చాను. నీతో ప్రత్యక్ష సంభాషణ జరిపాను. ఇలా నీకు యావత్తు మానవాళిపై ప్రాధాన్యత నిచ్చాను. కనుక నేను ప్రసాదించేదాన్ని స్వీకరించి నాకు కృతజ్ఞుడవై ఉండు” అని ఉపదేశించాడు. (144)
ఆ తరువాత మేము జీవిత సమస్త రంగాలకు సంబంధించిన హితవులు, ప్రతి విషయానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు (రాతి) పలకలపై రాసి మూసాకు ప్రసాదించాము. ఆ సందర్భంలో మేము ఇలా ఉపదేశించాము:
“ఈ హితోక్తులను దృఢంగా పట్టుకొని ఉండాలి. ఇందులోని విషయాలను (మార్చ కుండా) సక్రమరీతిలో అనుసరించమని నీ జాతిప్రజలను ఆదేశించు. సమీపకాలంలోనే నేను మీకు దుష్టజనుల గృహాల (అవశేషాల)ను చూపిస్తాను. ఎలాంటి నీతి, నియమం లేకుండా ధరణిలో పెద్దలుగా చలామణయ్యే గర్విష్ఠులు నా మహిమలు చూడకుండా వారి దృష్టిని మార్చేస్తాను. వారిక ఏ మహిమ చూసినా (సత్యాన్ని) విశ్వసించలేరు. వారి కళ్ళెదుటకు సన్మార్గం వచ్చినా వారు దాన్ని అవలంబించలేరు. వక్రమార్గం కనిపిస్తే మాత్రం దానివైపు పరుగెత్తేవారు. దీనిక్కారణం వారు మా సూక్తుల్ని నిరాకరించి నిర్లక్ష్యం చేస్తుండేవారు. మా సూక్తుల్ని, పరలోక ఉనికిని తిరస్కరించినవారి కర్మలన్నీ వ్యర్థమ య్యాయి. వారికి వారి కర్మల్ని బట్టే తగిన శిక్ష విధించబడుతుంది. (145-147)
మూసా వెళ్ళిన తరువాత అతని జాతిప్రజలు తమ దగ్గరున్న ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహం తయారు చేసుకున్నారు. అందులోనుంచి దూడ అరుపులాంటి ధ్వని వస్తుండేది. కాని అది తమతో మాట్లాడదని, ఏవిషయంలోనూ తమకు దారి చూపదని వారికి తెలియదా? (తెలుసు.) అయినా వారు దాన్ని దైవంగా చేసుకొని పూజించ సాగారు. వారసలు పరమదుర్మార్గులు. (తమ ఆత్మవంచన మైకం వదలగానే తాము నిజంగా దారితప్పామని తెలుసుకున్నారు. అప్పుడు వారు “మా ప్రభువు మమ్మల్ని కనిక రించి క్షమించకపోతే మేము సర్వనాశనమైపోతాం” అని పలికారు. (148-149)
అటునుండి మూసా విచారం, ఆగ్రహం కలగలిపిన భావోద్రేకాలతో తన జాతి ప్రజల దగ్గరకు తిరిగొచ్చాడు. వచ్చిరాగానే “నేను వెళ్ళిన తరువాత మీరు చాలా దుర్మార్గానికి పాల్పడ్డారు. మీ ప్రభువాజ్ఞ కోసం ఎదురుచూసే అంత ఓపిక కూడా మీకు లేకపోయిందా?” అని విరుచుకుపడ్డాడు. (ఆ కోపంలో) అతను (తౌరాత్‌) రాతి పలక లను విసిరిపారేశాడు; సోదరుడి తల (వెండ్రుకలు) పట్టి లాగాడు.
అప్పుడు హారూన్‌ ఇలా అన్నాడు: “నాతలి క్లుమారుడా! వీరు నన్ను బలహీనుడిగా భావించి నానోరు నొక్కేశారు. ఇంకాస్తయితే నన్ను చంపేసేవారే. అంచేత (నన్నర్థం చేసుకో.) ప్రత్యర్థులు నన్ను చూసి హేళనచేసే అవకాశం కల్పించకు. ఈ దుర్మార్గులతో నన్ను కలిపేయకు.” ఈ మాటలు విని మూసా (కొంచెం మెత్తబడ్డాడు.) “ప్రభూ! నన్ను, నా సోదరుడ్ని క్షమించు. మమ్మల్నిద్దర్నీ నీ కారుణ్యాశ్రయంలో చోటివ్వు. నీవు అందరి కంటే గొప్ప కరుణామయుడవు” అని దైవాన్ని వేడుకున్నాడు. (150-151)
(దేవుడిలా సెలవిచ్చాడు:) “ఆవుదూడను దైవంగా చేసుకున్నవారు తమ ప్రభువు ఆగ్రహానికి తప్పకుండా గురవుతారు. వారు ఇహలోక జీవితంలో అవమానం, అప్రతిష్ఠల పాలౌతారు. అభూతకల్పనలకు పాల్పడేవారికి మేము ఇలాంటి శిక్షే విధిస్తాం. దుష్కా ర్యాలు చేసినవారు తర్వాత పశ్చాత్తాపంచెంది సత్యాన్ని విశ్వసిస్తే, అప్పుడు నీ ప్రభువు (వారిపాలిట) గొప్ప క్షమాశీలి, అపార దయామయుడు (అవుతాడు).” (152-153)
చివరికి మూసా కోపం చల్లారింది. అప్పుడతను (రాతి) పలకలను ఎత్తి చేతుల్లోకి తీసుకున్నాడు. వాటిపై తమ ప్రభువుకు భయపడేవారి కోసం మార్గదర్శనం, కారుణ్యం ఉన్నాయని వ్రాయబడి ఉంది. (154)
మేము నిర్ణయించిన సమయానికి రావడానికి అతను తనజాతి ప్రజల్లో డెబ్భె మందిని ఎన్నుకున్నాడు. (వారు తూర్‌కొండ దగ్గరకు చేరుకున్నారు. కాని దేవునికి అవిధేయులై పోవడంతో) వారిని తీవ్రమైన భూకంపం కుదిపేసింది. అప్పుడు మూసా ఇలా ప్రార్థించాడు:
“స్వామీ! నీవు కోరివుంటే నన్ను, వీరిని ఎప్పుడో చంపేవాడివి. కాని (ఇప్పుడు) మాలో కొందరు బుద్ధిహీనులు చేసిన ఈపనికి మమ్మల్నందర్నీ చంపుతావా? ఇది నీవు పెట్టిన పరీక్షే. దీనిద్వారా నీవు తలచిన విధంగా కొందరిని దారి తప్పిస్తావు; మరికొందరికి సన్మార్గబుద్ధి ప్రసాదిస్తావు. (దేవా!) నీవే మా రక్షకుడివి. మమ్మల్ని క్షమించు, కనికరించు. నీవే అందరికంటే గొప్ప క్షమాశీలివి. (ప్రభూ!) మాకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మేలు రాసిపెట్టు. మేము నీ వైపు మరిలాము. (ఇక నీవే మాకు దిక్కు).”
దానికి (విశ్వప్రభువు ఇలా) అన్నాడు: “శిక్ష విషయంలో నేను తలచుకున్న వారిని శిక్షిస్తాను. కాని నా కారుణ్యం యావత్తు సృష్టిని ఆవరించిఉంది. అలాగే దుష్కార్యాలు మానేసి, నా సూక్తులు విశ్వసించి (పేదల ఆర్థిక హక్కయిన) జకాత్‌ విధి నెరవేర్చేవారికి మాత్రమే నేను మేలు రాసిపెడ్తాను.” (155-156)
దైవసందేశహరుడు, నిరక్షరాస్యుడైన ఈ (ముహమ్మద్‌) ప్రవక్తను అనుసరించే వారికి (నేడీ మేలు రాయబడింది). ఇతని ప్రస్తావన వారి దగ్గరున్న తౌరాత్‌, ఇన్జీల్‌ గ్రంథాలలో కూడా ఉంది. అతను మంచిపనులు చేయమని (ప్రజలను) ఆదేశిస్తాడు. చెడుల నుండి వారిస్తాడు. వారికోసం పరిశుద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం చేస్తాడు. అశుద్ధ వస్తువుల్ని నిషేధిస్తాడు. వారి మీద పడిన (ఆంక్షల) భారం తొలగిస్తాడు. వారు చిక్కు కున్న (దురాచార) బంధనాల నుండి వారికి విముక్తి కలిగిస్తాడు. కనుక ఎవరు అతడ్ని విశ్వసించి సమర్థించి అతనితో సహకరిస్తూ, అతనిపై అవతరించిన (ఖుర్‌ఆన్‌) జ్యోతిని అనుసరిస్తారో వారే సార్థకజీవులు. వారినే విజయం వరిస్తుంది. (157)
ప్రవక్తా! ఇలా చెప్పు: ప్రజలారా! “నేను మీఅందరి కోసం వచ్చిన దైవప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపతిచే నియమించబడిన సందేశహరుడ్ని. ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఆయనే జీవన్మరణాలకు మూలకారకుడు. కనుక అలాంటి దేవుడ్ని, ఆయన పంపిన నిరక్షరాస్య ప్రవక్తను విశ్వసించండి. దేవుడ్ని, ఆయన ఆజ్ఞల్ని నమ్ము తున్న ఈ ప్రవక్తను అనుసరించండి. అప్పుడే మీరు సన్మార్గగాములవుతారు.” (158)
మూసా జాతిలో సత్యానికి అనుగుణంగా మార్గం చూపిస్తూ, సత్యం ప్రాదిపదిక పైన్నే న్యాయం, నిర్ణయాలు చేసే వర్గం కూడా ఒకటుంది. మేమా జాతిని పన్నెండు కుటుంబాలుగా విభజించి శాశ్వత వర్గాలుగా రూపొందించాము. మూసాను అతని జాతి ప్రజలు నీరు అడిగితే, మేము ఒక చట్టుబండపై తన చేతికర్రతో కొట్టమని అతడ్ని ఆదేశించాం. (మూసా చేతికర్రతో చట్టుబండపై కొట్టగానే) ఆ చట్టుబండ నుండి ఒక్క సారిగా పన్నెండు ఊటలు పెల్లుబికాయి. ప్రతివర్గం తన త్రాగునీటి స్థలాన్ని గుర్తించింది.
మేము వారిపై (ఎండనుండి కాపాడుకోవడానికి) మేఘచ్ఛాయ కల్పించాం. వారికి (ఆహారంగా) మన్న, సల్వాలను అవతరింపజేశాం. “మేము మీకు ప్రసాదించిన ఈ పరి శుద్ధపదార్ధాలు తినండి” (అనిచెప్పాం). అయితే ఆతర్వాత వారు చేసిన నిర్వాకం మాకె లాంటి నష్టం కలిగించలేదు. వారే తమకుతాము నష్టపరచుకున్నారు. (159-160)
మేమిలా చెప్పాము: “ఆ పట్టణానికి వెళ్ళి నివసించండి. అక్కడ లభించే వాటిలో మీకిష్టమైనవి తినండి. అయితే క్షమాభిక్ష కోరుతూ, సాష్టాంగపడుతూ పట్టణ ప్రధాన ద్వారం గుండా ప్రశించాలి. అప్పుడే మేము మీ పొరపాట్లు క్షమిస్తాము. సదాచార సంపన్నులకు మరింత భాగ్యం అనుగ్రహిస్తాము.” కాని ఆ దుర్మార్గులు మేము ఆదే శించిన విషయాన్ని మార్చివేశారు. అప్పుడు మేము వారి విద్రోహచర్యలకు శిక్షగా ఆకాశం నుండి వారిపై ఆపద తెచ్చి పడవేశాం. (161-162)
కాస్త వారిని సముద్రతీరాన వున్న పట్టణం గురించి అడుగు. ఆ పట్టణప్రజలు శనివార నియమాన్ని ఉల్లంఘిస్తుండేవారు. శనివారం రోజే చేపలు సముద్రపు ఉపరి తలంపై వారి ముందుకు వస్తుండేవి. శనివారం తప్ప మరే దినాలలోనూ పైకి వచ్చేవి కావు. వారి దుశ్చర్యల్ని బట్టబయలు చేయడానికే మేమిలా వారికి పరీక్ష పెట్టాం. (163)
వారిలో కొందరు (సత్యసందేశ ప్రచారం చేస్తున్నవారిని విమర్శిస్తూ) “దేవుడు అంతమొందించనున్న లేక తీవ్రంగా శిక్షించనున్న వారికి మీరు అనవసరంగా ఎందుకు హితబోధ చేస్తారు?” అని అడిగారు. దానికి వారు “మీ ప్రభువు సన్నిధిలో మా పాప మన్నింపుకు కారణభూతమవుతుందన్న ఉద్దేశ్యంతో, వారాయన అవిధేయతకు దూరంగా ఉంటారన్న ఆశతో మేమిలా చెబుతున్నాం” అని సమాధానమిచ్చారు. (164)
అయితే వారు తమకు బోధించిన విషయాలన్నీ మరచిపోయారు. అప్పుడు మేము చెడులను నివారిస్తుండేవారిని రక్షించి, అవిధేయతకు పాల్పడిన దుర్మార్గుల్ని పట్టుకొని తీవ్రంగా శిక్షించాం. అయినా వారు మరింత బరితెగించి చేయవద్దన్న పనులే మళ్ళీ చేయసాగారు. మేము వారిని నీచమైన కోతులుగా మారిపోండని శపించాం#
“నేను ఇస్రాయీల్‌ సంతతివారిని తీవ్ర యాతనలకు గురిచేసే ప్రజలను వారిపై ప్రళయదినం వరకూ పెత్తనం చలాయించేలా చేస్తాను” అని నీ ప్రభువు ప్రకటించాడు. నీ ప్రభువు (దుర్మార్గుల్ని) శిక్షించడంలో ఏమాత్రం ఆలస్యం చేయడు. అలాగే ఆయన సజ్జనుల పాలిట గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు కూడా. (165-167)
మేము వారిని అనేక జాతులుగా చీల్చి ప్రపంచంలో చెల్లాచెదురుగా చేశాం. వారిలోకొందరు సజ్జనులుంటే మరికొందరు వేరేవారున్నారు. వారిని మేము మంచివైపు తిరిగొస్తారేమోనని మంచిస్థితిద్వారా, దుస్థితిద్వారా పరీక్షకు గురిచేశాం. పూర్వతరాలు గతించిన తర్వాత అంతకంటే దిగజారిన తరాలు వారికి ప్రాతినిధ్యం వహించాయి. వీరు దైవగ్రంథానికి వారసులై కూడా తుచ్ఛమైన ప్రాపంచిక ప్రయోజనాల వెంటపడ్డారు.
వారు (చెడ్డపని చేసినప్పుడల్లా) ‘మేము క్షమించబడతామని ఆశిస్తున్నాం’అంటారు. అందువల్లనే వారి ముందుకు ఏదైనా ఐహికసంపద వస్తే చాలు, దాని మీదికి లంఘి స్తారు. దేవుని పేరు మీద ఏంమాట్లాడినా సత్యం, న్యాయమే మాట్లాడాలని దైవగ్రంథం గురించి వారి చేత ప్రమాణం చేయించ లేదా? వారు గ్రంథంలోని విషయాలు చదివి ఉన్నారు. (అయినా పాపకార్యాలుచేస్తూ దేవుడు తమను క్షమిస్తాడని భ్రమపడుతున్నారు. కాని) దేవునికి భయపడుతూ దుష్కార్యాలకు దూరంగా ఉండేవారికే పరలోక (స్వర్గ) ధామం శోభిస్తుంది. ఆమాత్రం మీరు గ్రహించలేరా? దైవగ్రంథాన్ని పాటిస్తూ నమాజు స్థాపించే సాత్వికుల ప్రతిఫలాన్ని మేము ఎన్నటికీ వృధా చేయము. (168-170)
మేము కొండను పెకలించి వారిపై గొడుగుగా ఎత్తిపట్టిన సంఘటన వారికి గుర్తుందా? అప్పుడు వారు కొండ తమపై వచ్చి పడుతుందేమోనని భయపడసాగారు. అలాంటి స్థితిలో “మేము ప్రసాదించిన (తౌరాత్‌) గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో వ్రాయబడిన విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి, దుష్కార్యాలకు దూరంగా ఉండగలరు” అని చెప్పాము. (171)
నీ ప్రభువు ఆదంసంతతి వీపుల నుండి వారి భావితరాల్ని తీసి ప్రమాణం చేయిం చిన సందర్భం. అప్పుడు మేము వారిని సాక్షులుగా పెడుతూ ‘నేను మీ ప్రభువుని కానా’ అని అడిగాం. దానికి వారు “మీరే మాప్రభువు. అందుకు మేమే సాక్షులం” అన్నారు.
మేమిలా చేయడానిక్కారణం, ప్రళయదినాన మీరు “మాకీ విషయం తెలియద”ని చెప్పవచ్చు. లేదా “బహుదైవారాధన మాకు పూర్వం మా తాతముత్తాతలు ప్రారంభిం చారు. మేము ఆతర్వాత వారి సంతతి నుండి పుట్టాము. అలాంటప్పుడు దుర్జనులు చేసిన ఈతప్పుకు మమ్మల్ని పట్టుకుంటారా?”అని చెప్పవచ్చు. వారు సన్మార్గం వైపు మర లుతారన్న ఉద్దేశ్యంతో మేమిలా మాసూక్తులు విడమరచి తెలుపుతున్నాం. (172-174)
ప్రవక్తా! కాస్త ఈ మనిషి గాధ వారికి విన్పించు: మేమతనికి మా సూక్తుల జ్ఞానం ప్రసాదించాము. కాని అతను వాటిని ఆచరించకుండా పారిపోయాడు. షైతాన్‌ అతని వెంటపడ్డాడు. ఈ విధంగా అతను చివరికి దారి తప్పినవారిలో కలసిపోయాడు. మేము తలచుకుంటే అతనికి ఆ సూక్తుల ద్వారా ఉన్నతి ప్రసాదించి ఉండేవారం. కాని అతను ప్రపంచవ్యామోహం వైపుకే మొగ్గి మనోవాంఛలకు బానిసై పోయాడు. కుక్కను కొట్టినా కొట్టకపోయినా అది నాలుకను చాచిపెట్టే ఉంచుతుంది. ఇలా తయారయింది ఆ మనిషి పరిస్థితి. మాసూక్తులు తిరస్కరించేవారికి కూడా ఈ దృష్టాంతమే వర్తిస్తుంది. నీవీ గాధ వారికి విన్పిస్తూ ఉండు, (సత్యం గురించి) ఆలోచిస్తారేమో. (175-176)
మా సూక్తులు తిరస్కరించి ఆత్మవినాశానికి పాల్పడినవారి దృష్టాంతం చాలా హేయమైనది. దేవుడు ఎవరికి సద్బుద్ధి ప్రసాదిస్తాడో వారే సన్మార్గం అవలంబిస్తారు. దేవుని మార్గదర్శకత్వానికి నోచుకోనివారు ఘోరంగా నష్టపోతారు. (177-178)
మేము అనేకమంది మానవులను, జిన్నులను నరకం కోసమే పుట్టించాం. వారికి హృదయాలున్నాయిగాని, వాటితో అర్థం చేసుకోరు; కళ్ళున్నాయిగాని, వాటితో చూడరు; చెవులున్నాయిగాని, వాటితో వినరు. వారు పశువుల్లాంటివారు. వారసలు అంతకంటే కూడా దిగజారిపోయారు. వారు పూర్తిగా ఏమరుపాటుకు లోనయ్యారు. (179)
దేవుడు మంచిపేర్లకే అర్హుడు. ఆయన్ని మంచి పేర్లతోనే వేడుకోండి. దేవునికి పేర్లు ప్రతిపాదించడంలో తప్పుడు వైఖరి అవలంబించేవారిని వదలిపెట్టండి. వారు చేస్తున్నదానికి పర్యవసానం అనుభవించి తీరుతారు. మేము సృష్టించినవారిలో ఒకవర్గం (ఎల్లప్పుడూ ప్రజలకు) సత్యం వైపుకే దారి చూపుతుంది; సత్యానికి అనుగుణంగానే నిర్ణయాలు చేస్తుంది. మా సూక్తులు తిరస్కరించినవారిని మేము వారు గ్రహించలేని రీతిలో క్రమంగా పతనానికి చేర్చుతాము. నేను వారిని చూసీచూడనట్లు వదిలేస్తున్నాను. (నేను తలచుకుంటే మాత్రం) నా పన్నాగానికి తిరుగే ఉండదు. (180-183)
వారెప్పుడైనా (ప్రశాంత మనస్సుతో) ఆలోచించారా? వారి సహచరునికి ఎలాంటి పిచ్చి పట్టలేదు. అతను (పరలోకంలో ఎదురయ్యే దుష్పరిణామాలను గురించి) ఎలాంటి అరమరికలు లేకుండా హెచ్చరిస్తున్న దైవసందేశరుడు. (184)
వారు భూమ్యాకాశాల వ్యవస్థ గురించి ఎప్పుడూ యోచించలేదా? దేవుడు సృష్టించిన ఏవస్తువుని కూడా కళ్ళుతెరచి చూడలేదా? వారు తమ జీవితవ్యవధి ముగిసి పోయే సమయం ఆసన్నమైందేమోనని కూడా ఆలోచించరా? (ఇన్ని నిదర్శనాలు వారి ముందుకొచ్చినా సత్యాన్ని నమ్మకపోతే) ఇక ఏవిషయాన్ని వారు నమ్ముతారు? (185)
దేవుడు దారి తప్పించదలచుకున్న వాడికి ఎవరూ దారి చూపలేరు. అలాంటివారిని దేవుడు వారి తిరస్కారం, తలబిరుసుతనాల్లోనే పడి కొట్టుకుపోయేలా వదలిపెడ్తాడు#
వారు నిన్ను ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందని అడుగుతున్నారు. వారికిలా చెప్పు: “దాని సంగతి నాప్రభువుకు మాత్రమే తెలుసు. దాన్ని దాని నిర్ణీత సమయానికి ఆయనే బహిర్గతం చేస్తాడు. అది యావత్తు భూమ్యాకాశాల్లో (గుండెలను అదరగొట్టే) భయంకర దినం. అది మీపై హఠాత్తుగా విరుచుకుపడుతుంది.” దాన్ని గురించి నీకేదో తెలియ జేయబడినట్లు వారు నిన్ను గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. “దాన్ని గురించి దేవునికి మాత్రమే తెలుసు. ఈవాస్తవం చాలా మందికి తెలియదు” అని చెప్పు వారికి. (186-187)
ముహమ్మద్‌ (స)! వారికిలా స్పష్టంగా చెప్పు: “నేను నాకోసం ఎలాంటి లాభం గాని, నష్టంగాని కలిగించుకునే శక్తి లేదు నాలో. ఏదైనా జరగాలంటే దేవుడు తలిస్తేనే జరుగుతుంది. నాకే గనగ అతీంద్రియ శక్తులుంటే నాకు కావలసిన ప్రయోజనాలను సమకూర్చుకునేవాడ్ని; నాకు ఎన్నడూ ఎలాంటి నష్టం వాటిల్లదు. నేను (పరలోక దుష్ప రిణామాలను గురించి ప్రజలను) హెచ్చరిస్తూ, నా బోధనలు విశ్వసించేవారికి (స్వర్గ) శుభవార్త అందజేసేవాడ్ని మాత్రమే.” (188)
దేవుడే మిమ్మల్ని ఏకైక ఆత్మ నుండి సృష్టించాడు. అదే జీవి నుండి దాని జతను కూడా సృష్టించాడు, దాని దగ్గర సౌఖ్యం పొందడానికి. పురుషుడు స్త్రీని కప్పివేసుకున్న ప్పుడు ఆమె ఒక తేలికపాటి భారం ధరిస్తుంది. దాన్ని తీసుకొని తిరుగుతుందామె. అది (కొంత కాలానికి) మరింత భారంగా తయారయిన తరువాత వారుభయులు “(దేవా!) నీవు గనక మాకు మంచి పిల్లవాడ్ని అనుగ్రహిస్తే మేము నీపట్ల కృతజ్ఞులై ఉంటాము” అని తమ ప్రభువయిన దేవుడ్ని వేడుకుంటారు. (189)
అయితే దేవుడు ఏ లోపంలేని చక్కటి పిల్లవాడ్ని ప్రసాదించగానే వారు (దేవుడ్ని మరచి) ఆయన అనుగ్రహించిన ఈ భాగ్యంలో ఇతరుల్ని ఆయనకు సాటి కల్పిస్తారు. వారి బహుదైవారాధనా చేష్టలకు దేవుడు ఎంతో అతీతుడు, ఉన్నతుడు. (190)
ఎంత మూఢులు వీరు, ఎలాంటి వస్తువుని కూడా సృజించలేని వాటిని దేవునికి సాటి కల్పిస్తున్నారు! అవి స్వయంగా సృజించబడ్డాయి (అని వారికి తెలియదా?) అంతే కాదు, అవి వారికి ఏవిధమైన సహాయం కూడా చేయలేవు. అసలవి తమకు తామే సహాయం చేసుకోలేవు. మీరు వాటిని సన్మార్గం వైపుకు పిలిస్తే అవి మీ పిలుపుకు ఏ మాత్రం స్పందించలేవు. మీరు అరిచి గీపెట్టినా లేక మౌనంగాఉన్నా సరే, అవి మీ మాటలు ససేమిరా ఆలకించ లేవు. (191-193)
మీరు నిజదేవుడ్ని వదలి ఎవరిని ప్రార్థిస్తున్నారో అవి మీలాంటి దాసులు మాత్రమే. మీ నమ్మిక నిజమైతే వాటిని మొరపెట్టుకోండి, అవి మీ మొరలు ఆలకిస్తా యేమో చూద్దాం. నడవడానికి వాటికేమైనా (సహజసిద్ధమైన) కాళ్లున్నాయా? పట్టుకోవ డానికి వాటికేమైనా చేతులున్నాయా? పోనీ, చూడటానికి వాటికేమైనా కళ్ళున్నాయా? వినడానికి వాటికేమైనా చెవులున్నాయా?
చెప్పు: “మీరు కల్పించుకున్న భాగస్వాములందర్నీ పిలుచుకొని నాకు వ్యతిరేకంగా ఏదైనా పన్నాగం పన్నదలచుకుంటే పన్నండి. నాకెలాంటి అవకాశం ఇవ్వనవసరం లేదు. దేవుడే నాకు సహాయం చేసేవాడు. ఆయనే ఈగ్రంథం అవతరింపజేసినవాడు. సజ్జను లకు శ్రేయోభిలాషి కూడా ఆయనే. మీరు దేవుడ్ని వదలి ప్రార్థిస్తున్న మిధ్యాదైవాలు మీకేమాత్రం సహాయపడలేవు. అసలవి తమకుతామే సహయం చేసుకో లేవు. పైగా, మీరు వాటిని సన్మార్గం వైపునకు పిలిస్తే అవి మీమాటలు ఆలకించలేవు. అవి మీవైపు చూస్తున్నట్లు పైకి కన్పిస్తాయి. నిజానికి అవి దేన్నీ చూడటం లేదు.” (194-198)
ముహమ్మద్‌(స)! క్షమ, మృదువైఖరులతో మసలుకో. ప్రజలకు మంచిని గురించి ఉపదేశిస్తూఉండు. మూఢుల జోలికిపోకు. ఎప్పుడైనా షైతాన్‌ నిన్ను ఉసిగొల్పితే వెంటనే దేవుని శరణువేడుకో. ఆయన సమస్తం వినేవాడు, సర్వం తెలిసినవాడు. (199-200)
దైవభీతిపరుల మదిలో ఎప్పుడైనా షైతాన్‌ ప్రేరణవల్ల ఏదైనా దురాలోచన జనిస్తే వెంటనే వారు అప్రమత్తులైపోతారు. ఆతర్వాత అనుసరించాల్సిన విధానమేమిటో వారికి తెలిసిపోతుంది. షైతాన్‌, వాడి (దుష్ట)పరివారం తమ (మానవ) సోదరుల్ని (అనుక్షణం) మార్గభ్రష్టత్వం వైపుకు లాగుతుంటారు. ఈపనిలో వారు ఎలాంటి కొరతా చేయరు.#
వారి ముందు నీవు ఏ మహిమా ప్రదర్శించకపోతే “నీవు నీకోసమైనా ఏదైనా మహిమను ఎందుకు రప్పించుకోవు?” అని అడుగుతారు. వారికిలా చెప్పు: “నేను నా దగ్గరికి నాప్రభువు పంపిన దివ్యావిష్కృతి (వహీ)ని మాత్రమే అనుసరిస్తాను. ఇది (ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు నుండి వచ్చిన దివ్యతేజం; దాన్ని స్వీకరించేవారి పాలిట అద్భుత మార్గదర్శిని, గొప్ప కారుణ్యప్రదాయిని.” (కనుక) మీ ముందు ఖుర్‌ఆన్‌ పఠిస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండి దాన్ని శ్రద్ధగా వినండి, మీరు కరుణించబడతారు. (201-204)
ముహమ్మద్‌ (స)! నీవు నీప్రభువును భయభక్తులతో, వినయ వినమ్రతలతో ఉద యం, సాయంత్రం మనస్సులో స్మరిస్తూఉండు. నోటితో కూడా మెల్లిగా స్మరిస్తూఉండు. నీవు ఏమరపాటుకు లోనైనవారిలో చేరకు. నీ ప్రభువు దగ్గర ఎంతో గౌరవ ప్రతిష్ఠలు కలిగివున్న దైవదూతలు సయితం ఎన్నడూ అహంకారంతో ఆయన్ని ఆరాధించకుండా ముఖం తిప్పుకోరు. వారసలు ఎంతో గౌరవభావంతో, భయభక్తులతో ఆయన్ని (సదా) స్తుతిస్తూ ఆయన ముందు మోకరిల్లుతూ ఉంటారు. (205-206)