Jump to content

కురాన్ భావామృతం/అన్-నహల్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

16. నహల్‌ (తేనెటీగ)
(అవతరణ: మక్కా; సూక్తులు: 128)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
దేవుని ఆజ్ఞ వచ్చింది. దానికోసం తొందరపడకు. వారు చేస్తున్న బహుదైవారాధ నకు దేవుడు ఎంతో అతీతుడు, పవిత్రుడు, మహోన్నతుడు. ఆయనే ఈ సందేశాన్ని తన ఆజ్ఞతో దైవదూతల ద్వారా తాను కోరిన దాసులపై అవతరింపజేస్తున్నాడు. కనుక నేను తప్ప మీకు మరోఆరాధ్యుడు లేడని, కనుక మీరు నాకే భయపడాలని చెప్పు. (1-2)
ఆయన భూమ్యాకాశాలను సత్యం ప్రాతిపదికపై సృష్టించాడు. వారు చేస్తున్న బహుదైవారాధనకు ఆయన ఎంతో అతీతుడు, మహోన్నతుడు. ఆయన మానవుడ్ని వీర్యబిందువుతో పుట్టించాడు. అలాంటి మానవుడు చూస్తుండ గానే (పెద్దవాడైపోయి) జగడాలమారిగా తయారయ్యాడు. (3-4)
ఆయన జంతుజాలాన్ని సృష్టించాడు. వాటిలో మీకోసం ఆహారమూ ఉంది; దుస్తులూ ఉన్నాయి. ఇంకా వివిధ రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు ఉదయం మేపడానికి తీసికెళ్తున్నప్పుడు, సాయంత్రం (ఇండ్లకు) తోలుకొస్తున్న ప్పుడు వాటిని చూస్తూ మీరెంతో ఆనందిస్తారు. అదీగాక, మీరెంతో శ్రమ పడనిదే చేరుకో లేని ప్రదేశాలకు సైతం అవి మిమ్మల్ని మోసుకొని సునాయాసంగా వెళ్తాయి. మీ ప్రభువు అపార దయామయుడు, ఎంతో వాత్సల్యం కలవాడు. (5-7)
మీరు స్వారీ చేయడానికి, మీ జీవితానికి శోభ చేకూర్చడానికి ఆయన గుర్రాలు, గాడిదలు, కంచరగాడిదలను కూడా సృష్టించాడు. ఆయన మీకోసం మీకు తెలియని ఎన్నో వస్తువుల్ని సృష్టించాడు. (ప్రపంచంలో) ఎన్నో వక్రమార్గాలు ఉన్నందున రుజు మార్గమేదో చూపవలసిన బాధ్యత కూడా ఆయనదే. ఆయన తలచుకుంటే మీకందరికీ సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించేవాడు. (8-9)
ఆయనే మీకోసం ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు. దాన్ని మీరూ తాగుతారు; మీ పశువులక్కూడా అది మేత సమకూరుస్తుంది. ఈ వర్షం ద్వారా ఆయన పంటలు పండిస్తున్నాడు. ఆలివ్‌, ద్రాక్ష, ఖర్జూర పండ్లు, ఇంకా ఇతర అనేకరకాల పండ్లు పండి స్తున్నాడు. యోచించేవారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. (10-11)
ఆయన మీ శ్రేయస్సుకోసం రేయింబవళ్ళను, సూర్యచంద్రుల్ని అదుపులో ఉంచాడు. తారలు కూడా ఆయన అదుపాజ్ఞల్లోనే ఉన్నాయి. విజ్ఞులకు ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి. లోకంలోని రంగురంగుల అనేక వస్తువుల్ని ఆయనే మీ కోసం సృష్టించాడు. వాటిలోనూ గుణపాఠం, గ్రహించేవారికి నిదర్శనాలున్నాయి. (12-13)
ఆయనే మీకోసం సముద్రాన్ని అదుపులో ఉంచాడు. అందులోనుంచి మీరు తినడానికి మాంసం, ధరించడానికి నగలు తీస్తారు. సముద్రంలో ఓడలు నీటిని చీల్చి వేస్తూ ఎలా ముందుకు సాగుతాయో మీరు చూస్తూనేఉన్నారు. మీరు మీప్రభువు అను గ్రహం అన్వేషిస్తూ, ఆయనకు కృతజ్ఞులై ఉండటానికే ఇదంతా సృష్టించబడింది. (14)
భూమండలం మిమ్మల్ని తీసుకొని దొర్లకుండా ఉండేందుకు ఆయన దానిమీద పర్వతాలను మేకులుగా పాతాడు. ఆయన (మీ కోసమే) నదుల్ని ప్రవహింపజేశాడు. మీరు దారి తెలుసుకోవడానికి వీలుగా సహజ మార్గాలు, ఇతర అనేక చిహ్నాలు కూడా ఏర్పరిచాడు. నక్షత్రాల ద్వారా కూడా మీరు దారి తెలుసుకుంటున్నారు. (15-16)
(వివిధ సృష్టిరాసుల్ని) సృష్టించేవాడు, ఏ వస్తువునీ సృష్టించలేనివాడు (ఇద్దరూ) సమానులవుతారా? మీరు ఆమాత్రం అర్థం చేసుకోలేరా? మీరు దేవుని అనుగ్రహాలు లెక్కించ దలచుకుంటే వాటిని ఎన్నటికీ లెక్కించలేరు. నిజంగా ఆయన గొప్ప క్షమాశీలి, పరమ దయామయుడు. ఆయనకు మీ అంతర్‌బాహ్యాలన్నీ తెలుసు. (17-19)
వారు నిజదేవుడ్ని వదలి ఆరాధిస్తున్న మిధ్యాదైవాలు ఏఒక్క వస్తువుకూ సృష్టికర్తలు కారు. వారు స్వతహాగా సృష్టితాలు, నిర్జీవులు; సజీవులు కాదు. వారికి తాము ఎప్పుడు (బ్రతికించి) లేపబడతారో కూడా తెలియదు. (20-21)
మీ దేవుడు ఒక్కడే. పరలోకాన్ని నమ్మనివారి హృదయాల్లో (సత్య) తిరస్కారం గూడు కట్టుకొని ఉంది. వారు అహంకారంతో విర్రవీగుతున్నారు. వారి అంతర్‌ బాహ్య చేష్టలన్నీ దేవునికి తెలుసు. గర్వపోతుల్ని ఆయన ఎన్నటికీ ప్రేమించడు. (22-23)
వారిని ఎవరైనా మీప్రభువు ఏం అవతరింపజేశాడని అడిగితే “అదా, అవేవో పూర్వీకుల పుక్కిటి పురాణాలు లెండి” అనంటారు. ప్రళయదినాన వారు తమ (పాప) భారంతో పాటు, తమ అజ్ఞానం అభూతకల్పనలతో ఎవరెవరిని అపమార్గం పట్టించారో వారందరి (పాప)భారం కూడా మూట కట్టుకుంటారు. చూడు, వారు ఎంత నీచమైన భారం తలకు ఎక్కించుకుంటున్నారో! (24-25)
వారికి పూర్వం కూడా అనేకమంది (సత్యానికి వ్యతిరేకంగా) ఇలాంటి దుష్టపన్నా గాలే పన్నారు. చూడు, దేవుడు వారి దుష్టపన్నాగాల కట్టడాన్ని ఎలా సమూలంగా కూల్చి వేశాడో. అప్పుడు పైనుండి దాని కప్పు హఠాత్తుగా వారి నెత్తి మీద పడింది. ఈవిధంగా వారి ఊహకు సైతం తట్టని వైపు నుండి వారిపైకి (దైవ)శిక్ష వచ్చిపడింది. (26)
ఇక ప్రళయదినాన దేవుడు వారిని ఘోరాతిఘోరంగా అవమానం, అప్రతిష్ఠల పాలుజేస్తాడు. “ఏరి నా భాగస్వాములు? వారిని గురించి మీరు (విశ్వాసులతో) జగడ మాడుతుండేవారే! వారిప్పుడు ఎటు పోయారు?” అని దేవుడు వారిని ప్రశ్నిస్తాడు. సత్యజ్ఞానం పొందినవారు వారిని చూసి “ఈరోజు సత్యతిరస్కారులకు అవమానం, దౌర్భాగ్యాలు తప్పవు” అనంటారు. (27)
ఔను, ఆత్మవంచనకు పాల్పడి దైవదూతలకు పట్టుబడిన సత్యతిరస్కారులకే (ఈ ఘోరం). దైవదూతలకు పట్టుబడి పోయినప్పుడు వారు వెంటనే (తమ తిరస్కారం, తల బిరుసుతనాలు వదలి) పూర్తిగా లొంగిపోతూ “మేము ఏపాపం ఎరగం” అనంటారు. దానికి దైవదూతలు “ఎందుకు ఎరగరు? మీ చేష్టలన్నీ దేవునికి తెలుసు. మీరిప్పుడు నరకంలోకి పోయిపడండి. అక్కడే మీరిక శాశ్వతంగా ఉండవలసి ఉంది” అని సమాధా నమిస్తారు. నిజంగా ఇది గర్విష్ఠుల పాలిట పరమ చెడ్డనివాసం. (28-29)
ఇక దైవభీతిపరుల సంగతి: వారిని ఎవరైనా “మీ ప్రభువు నుండి (మీ దగ్గరకు) ఏం అవతరించింది” అని అడిగితే “మంచి విషయమే అవతరించింది” అని చెబుతారు వారు. ఇలాంటి సజ్జనులకు ఇటు ఇహలోకంలోనూ మేలు చేకూరుతుంది; అటు పర లోకంలోనైతే (ఇక చెప్పనవసరం లేదు.)- పరలోకగృహం వారిపాలిట అత్యంత శ్రేష్ఠమైన బహుమానం. దైవభీతిపరులకు లభించే ఈగృహం ఎంతో శుభదాయకమైనది. (30)
వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో (చల్లటి)సెలయేరులు పారుతుంటాయి. వారి కోరికలకు పూర్తి అనుగుణంగా అక్కడ సమస్త వస్తువులు లభిస్తాయి. దైవభీతిపరు లకు దేవుడు ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తాడు. దైవదూతలు వారి ఆత్మలను పవిత్రం గా ఉన్నప్పుడు స్వాధీనంచేసుకుంటూ “మీకు శాంతి కలుగుగాక! మీరు చేసుకున్న (సత్‌)కర్మలకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి” అనంటారు. (31-32)
ముహమ్మద్‌ (స)! వీరిప్పుడు దేనికోసం ఎదురుచూస్తున్నారు? (మరణ) దూతల రాకకోసం ఎదురుచూస్తున్నారా? లేక నీ ప్రభువు పంపే ఆజ్ఞ (శిక్ష) కోసమా? ఇలాంటి తలబిరుసు చేష్టలు వీరికి పూర్వం కూడా అనేకమంది చేశారు. (ఆతర్వాత జరగవలసిన శాస్తి జరిగిపోయింది). దేవుడు వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు. వారే ఆత్మ వంచనకు పాల్పడ్డారు. చివరికి వారిచేష్టల దుష్ఫలమే వారిని చుట్టుకుంది. ఏ విషయం గురించి వారు హేళన చేస్తుండేవారో అదే వారిపై విరుచుకుపడింది. (33-34)
“దేవుడు తలిస్తే మేము, మా తాతముత్తాతలు ఆయన్నితప్ప మరెవరినీ ఆరాధించే వాళ్ళము కాము. అలాగే ఆయన ఆదేశించనిదే ఏ వస్తువుని కూడా మాఅంతట మేము నిషేధించుకునేవాళ్ళము కాము” అంటారు ఈ బహుదైవారాధకులు. ఇలాంటి సాకులు వారికి పూర్వం కూడా అనేకమంది చెప్పారు. అయితే విషయాన్ని (ప్రజలకు) స్పష్టంగా చేరవేయడం తప్ప దైవప్రవక్తలపై మరొక బాధ్యత లేదు. (35)
మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేశాము. వారి ద్వారా “దేవుడ్ని ఆరాధించండి. దుష్టశక్తిని ఆరాధించకండి” అని అందరికీ బోధపర్చాము. తరువాత వారిలో కొందరికి దేవుడు సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించాడు. మరికొందరిపై అజ్ఞానపు కారుచీకట్లు ముసురుకున్నాయి. సత్యతిరస్కారులు ఎలాంటి దుష్పర్యవసానం చవిచూశారో కాస్త ప్రపంచంలో తిరిగి చూడండి. ముహమ్మద్‌ (స)! వారిని దారికి తీసుకురావాలని నువ్వెంత కోరుకున్నా (లాభంలేదు.) దేవుడు దారితప్పించగోరిన వారికి మరెవరూ దారి చూపించలేరు. అలాంటివారిని ఎవరూ ఆదుకోలేరు. (36-37)
వారు దేవుని పేరుతో గట్టిగా ప్రమాణాలు చేస్తూ “దేవుడు చనిపోయిన వారెవరినీ తిరిగి బ్రతికించి లేపడు” అనంటారు. ఎందుకు లేపడు? అదొక తిరుగులేని వాగ్దానం. దాన్ని తప్పక నెరవేర్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాని చాలామందికి తెలియదు. వారు విభేదిస్తున్న విషయం గురించి వారిముందు వాస్తవం బట్టబయలు చేయవలసిన అవసరముంది. అదీగాక, అవిశ్వాసులకు తాము అసత్యవాదులమని కూడా తెలియాలి. కాబట్టి ఇది జరిగితీరుతుంది. మేమేదైనా వస్తువుని ఉనికిలోకి తీసుకు రాదలచుకుంటే “అయిపో” అని ఆజ్ఞాపిస్తే చాలు, ఆ పని ఇట్టే జరిగిపోతుంది. (38-40)
దౌర్జన్యం సహించిన తర్వాత చివరికి దైవప్రసన్నత కోసం వలసపోయే వారికి మేము ప్రపంచంలో మంచి ఆశ్రయం ప్రసాదిస్తాం; పరలోకంలో అంతకంటే గొప్ప ప్రతి ఫలం ఉంది. సహనం వహిస్తూ తమ ప్రభువు మీద భారంవేసి పనిచేసే ఈ పీడితులు (పరలోకంలో ఎంతమంచి బహుమానముందో) తెలుసుకుంటే బాగుండు. (41-42)
ప్రవక్తా! నీకు పూర్వం కూడా మేము వారి దగ్గరకు మా సందేశాన్నిచ్చి మానవుల్నే ప్రవక్తలుగా పంపాము. మీకు తెలియకపోతే తెలిసినవారిని అడిగి తెలుసుకోండి. గత ప్రవక్తలక్కూడా మేము స్పష్టమైన సాక్ష్యాధారాలు, దివ్యగ్రంథాలు ఇచ్చి పంపాము. ఇప్పుడీ జ్ఞాపిక (ఖుర్‌ఆన్‌)ను నీపై అవతరింపజేశాం. ప్రజలకోసం పంపినదాన్ని ప్రజలకు వివరించడానికి, వారు కూడా యోచించడానికి ఇలా చేశాము. (43-44)
దుష్టపన్నాగాలు పన్నుతున్నవారు తమను దేవుడు భూమిలోకి అణగత్రొక్కడని లేక వారు ఊహించని వైపు నుండి తమపైకి ఆపద రాదని నిశ్చింతగా ఉన్నారా? లేక అటూ ఇటూ తిరుగుతున్నప్పుడైనా తమను దేవుడు పట్టుకోడని నిర్భయంగా ఉన్నారా? లేక వారేదైనా ఆపద వస్తుందని భయపడి దానిపట్ల అప్రమత్తులై ఉన్న స్థితిలోనైనా దేవుడు తమను పట్టుకోడని భావిస్తున్నారా? దేవుడు చేయదలచుకున్న దాన్ని మీరు ఏమాత్రం అడ్డుకోలేరు. నిజంగా నీప్రభువు ఎంతో దయామయుడు, దాక్షిణ్యమూర్తి. (45-47)
వారు దేవుడు సృష్టించిన ఏ వస్తువునీ పరికించి చూడలేదా? ఆ వస్తువుల నీడలు కుడి ఎడమల వైపు పడుతూ దేవుని ముందు ఎలా సాష్టాంగపడుతున్నాయో గమ నించరా? ఈవిధంగా సృష్టిలోని అణువణువూ (దేవునిపట్ల) తన వినమ్రత వ్యక్తపరు స్తోంది. భూమ్యాకాశాల్లోని సమస్త జీవకోటి, దైవదూతలు దేవుని ముందు వినమ్రులై తలవంచుతున్నారు. వారు ఎలాంటి అహంకారం చూపకుండా పైనున్న తమ ప్రభువుకు భయపడుతుంటారు; తమకు జారీచేసే ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు. (48-50)
“ఇద్దరు దేవుళ్ళను చేసుకోకండి. దేవుడు ఒక్కడే. కనుక మీరు నాకే భయపడండి” అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం ఆయన సొత్తే. (యావత్తు విశ్వంలో) ఆయన నిర్దేశించిన జీవన విధానమే నడుస్తోంది. అలాంటప్పుడు మీరు దేవుడ్ని కాదని ఇతరులకు ఎలా భయపడతారు? (51-52)
మీకు లభించిన భాగ్యాలన్నీ దేవుడు ప్రసాదించినవే. మీపై ఏదైనా ఆపద వచ్చి పడితే మీరు ఆయన్నే మొరపెట్టుకుంటారు. కాని దేవుడు ఆ కష్టాన్ని దూరంచేయగానే మీలో కొందరు ఆయనకు ఇతరుల్ని సాటికల్పిస్తారు. ఇలా వారు, చేసినమేలు మరచి తమ ప్రభువుపట్ల కృతఘ్నులైపోతారు. సరే (కొన్నాళ్ళు) ఐహికసుఖాలు అనుభవించండి, త్వరలోనే (దాని పర్యవసానం ఏమిటో) మీకు తెలుస్తుంది. (53-55)
మేము ప్రసాదించిన ఉపాధిలో వారు తమకు తెలియనివాటి (విగ్రహాల) కోసం కొంతభాగం (నైవేద్యంగా) నిర్ణయిస్తున్నారు. “(అవిశ్వాసులారా!) దైవసాక్షి! ఈ అభూత కల్పనలను గురించి మిమ్మల్ని తప్పక నిలదీసి ప్రశ్నించడం జరుగుతుంది.” (56)
వారు తమ కోసమైతే తమకిష్టమైనవారిని (కుమారుల్ని) ఎంచుకుంటారు! కాని దేవుని కోసం కుమార్తెల్ని ప్రతిపాదిస్తున్నారు. ఎంతటి అపచారానికి పాల్పడ్డారు! (57)
వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందని శుభవార్త విన్పిస్తే, వెంటనే అతని మొహం మాడి ముడుచుకు పోతుంది. అతను లోలోన తెగ బాధపడిపోతాడు. “ఈ దుర్వార్త విన్నాక ఇక నా మొహం జనానికి ఎలా చూపించను?” అని భావిస్తూ ప్రజల నుండి తప్పించుకుంటూ తిరుగుతాడు. అదీగాక. ఈ అవమానభారంతో కూతుర్ని అలాగే అట్టిపెట్టుకోవాలా లేక మట్టిలో పూడ్చిపెట్టాలా? అని తీవ్రంగా ఆలోచిస్తాడు. చూడు, (దేవుని విషయంలో) వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో! (58-59)
పరలోకపై విశ్వాసం లేనివారికే (ఇలాంటి) దుర్గుణాలు, దుర్లక్షణాలు శోభిస్తాయి. దేవుడు అత్యున్నత సుగుణాలు కలవాడు. ఆయనే అందర్నీ మించిన శక్తిమంతుడు, వివేకవంతుడు. ప్రజలు పాల్పడుతున్న దౌర్జన్యాలు, దౌష్ట్యాలకు దేవుడు వారిని వెంటనే పట్టుకోదలిస్తే భూమిపై ఒక్కడూ మిగలడు. ఆయన వారికి నిర్ణీతకాలందాకా గడువిస్తు న్నాడు. ఆ గడువు తీరగానే ఇక ఒక్కఘడియ కూడా వెనుకాముందూ కాదు. (60-61)
వారు తమకోసం ఇష్టపడని వాటిని దేవుని కోసం ప్రతిపాదిస్తున్నారు. వారు తమ కంతా మేలే జరుగుతుందని అబద్ధాలు పేలుతున్నారు. వారికి ఒక్కటే రాసిఉంది. అదే నరకాగ్ని. అందరికంటే ముందు వారినే అందులోకి త్రోయడం జరుగుతుంది. (62)
ప్రవక్తా! దైవసాక్షి! పూర్వం మేము అనేకజాతుల దగ్గరకు ప్రవక్తలను పంపాము. షైతాన్‌ వారి చేష్టల్ని మనోహరమైనవిగాచేసి చూపాడు. ఆ షైతానే ఈనాడు వీరిక్కూడా సంరక్షకుడయ్యాడు. వీరికోసం దుర్భరయాతన ఉంది. వారు కల్పించుకున్న విభేదాలను గురించి నిజానిజాలు వెల్లడిచేయడానికే మేమీ గ్రంథం నీపై అవతరింపజేశాం. విశ్వ సించేవారికి ఈగ్రంథం మార్గదర్శినిగా, కారుణ్యప్రదాయనిగా అవతరించింది. (63-64)
దేవుడే ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు. ఆయనే దానిద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. (సత్యబోధ) ఆలకించేవారికి ఇందులో గొప్ప సూచన ఉంది. మీ కోసం పశువుల్లో కూడా గుణపాఠం ఉంది. వాటి పొట్టలోని పేడకు, రక్తానికి మధ్య నుండి మేమొక (సుమధుర) పానీయం తీసి మీకు త్రాగడానికి ప్రసాదిస్తున్నాము. అంటే స్వచ్ఛమైన పాలు. త్రాగేవారికి ఇవి ఎంతో కమ్మగా ఉంటాయి. (65-66)
ఖర్జూరపండ్ల నుండి, ద్రాక్షపండ్ల నుండి కూడా మేమొక విధమైన పానీయం తీసి మీకు త్రాగడానికి ఇస్తున్నాం. దాన్ని మీరు మత్తుపానీయంగా, పరిశుద్ధ ఆహారంగా తయారుచేస్తారు. బుద్ధిమంతులకు ఇందులో కూడా గొప్పసూచన ఉంది. (67)
నీ ప్రభువు తేనెటీగకు సందేశం పంపుతూ “కొండల్లో, చెట్లలో, పందిళ్ళపై ఎక్కిం చిన లతల మధ్య తేనెతెట్లు నిర్మించుకో. రకరకాల పండ్లరసాన్ని (పుష్పమకరందాన్ని) ఆస్వాదిస్తూ నీప్రభువు సుగమం చేసిన మార్గాలలో నడు” అని ఆదేశించాడు. ఈ తేనె టీగ నుంచి ఒక విధమైన రంగురంగుల పానకం వెలువడుతుంది. అందులో ప్రజలకు స్వస్థత కూడా ఉంది. యోచించేవారికి ఈవిషయంలో గొప్ప సూచన ఉంది. (68-69)
దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. ఆతర్వాత మీప్రాణాలు కూడా ఆయనే తీస్తున్నాడు. మీలోకొందరు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనంత సుదీర్ఘ వయస్సుకు చేరుకుంటు న్నారు. దేవుడే సంపూర్ణ జ్ఞానసంపన్నుడు, సర్వశక్తిమంతుడు. (70)
దేవుడే మీలో కొందరికి కొందరిపై ఉపాధిలో ఆధిక్యత నిచ్చాడు. ఇలా అధిక్యత పొందినవారు తమ బానిసలతో సమానులయ్యేలా వారికి తమౌపాధి పంచివ్వరు కదా! మరి వారు దేవుడు చేసిన మేలును ఎలా మరచి ఆయన్ని నిరాకరిస్తున్నారు? (71)
దేవుడే మీకోసం మీ జాతినుండి స్త్రీలను సృష్టించాడు. ఆయనే ఆ స్త్రీలద్వారా మీకు కొడుకులు, మనవళ్ళను ప్రసాదిస్తున్నాడు. అంతేకాకుండా తినడానికి కూడా మీకు ఎన్నో మంచి మంచి పదార్థాలు ఇస్తున్నాడు. మరి (ఇదంతా తెలిసి కూడా) వీరు మిధ్యా విషయాలనే నమ్ముతున్నారా? దేవుడు చేసిన మేళ్ళను మరచి కృతఘ్నులైపోతున్నారా? వారు నిజదేవుడ్ని వదలి, భూమ్యాకాశాల నుండి తమకు ఏమాత్రం ఉపాధినిచ్చే శక్తిలేని మిధ్యాదైవాలను ఆరాధిస్తున్నారు. అసలా దైవాలు ఈపని చేయలేవు కూడా. కనుక దేవుని విషయంలో (ఆయన్ని ఇతరులతో పోల్చుతూ తప్పుడు) ఉదాహరణలు ఇవ్వకండి. (సరైన ఉదాహరణలు) దేవునికే తెలుసు, మీకు తెలియదు. (72-74)
దేవుడు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు (చూడండి): ఒక బానిస ఉన్నాడు ఇతరుల అధీనంలో. తనంతట తాను ఏపనీ చేయడానికి అతనికి అధికారంలేదు. (స్వేచ్ఛాపరు డైన) మరొకడు ఉన్నాడు. మేమతనికి మంచి ఉపాధి ప్రసాదించాం. అందులో కొంత అతను రహస్యంగాను, బహిరంగంగానూ (మా మార్గంలో) ఖర్చుపెడ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. వీరిద్దరూ ఒకటేనా? (కాదని చెప్పక తప్పదు.) దేవుడే ప్రశంసనీయుడు. కాని చాలామంది (ఈ ముక్కుసూటి మాట కూడా) అర్థం చేసుకోలేక పోతున్నారు. (75)
దేవుడు మరొక ఉదాహరణ ఇస్తున్నాడు: ఇద్దరు మనుషులున్నారు. వారిలో ఒకడు మూగవాడు. పైగా ఏపనీ చేయలేని అసమర్థుడు. అందువల్ల అతను తన యజమానికి భారమయి ఉన్నాడు. యజమాని అతడ్ని ఎక్కడికి పంపినా ఎలాంటి లాభాన్నీ తీసుకు రాలేడు. అయితే రెండవ వ్యక్తి (ప్రజలకు) మంచిని బోదిస్తూ ఉంటాడు. తాను కూడా సన్మార్గంలో నడుచుకుంటాడు. చెప్పండి, వీరిద్దరు ఒకటేనా? (76)
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త అగోచరాలు దేవునికి మాత్రమే తెలుసు. ప్రళయం రావడానికి ఎంతోసేపు పట్టదు. రెప్పపాటులో అది వచ్చిపడుతుంది. అంతకంటే తక్కువ సమయంలోనే రావచ్చు. దేవునికి అణువణుపై అధికారం ఉంది. దేవుడు మిమ్మల్ని మీకేమీ తెలియని స్థితిలో మీతల్లుల గర్భాల నుండి తీశాడు. ఆయన మీకు చూడటానికి కళ్ళిచ్చాడు, వినడానికి చెవులిచ్చాడు, ఆలోచించడానికి హృదయాన్నిచ్చాడు. మీరు కృతజ్ఞత చూపుతారనే ఆయన ఇవన్నీ మీకు ప్రసాదించాడు. (77-78)
వారు ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూడలేదా? వాటిని (శూన్యంలో) దేవుడు తప్ప మరెవరైనా నిలిపిఉంచగలరా? విశ్వసించేవారికి ఇందులో గొప్ప సూచనలున్నాయి.#
దేవుడు మీకోసం మీగృహాలను ప్రశాంతనిలయాలుగా చేశాడు. ఆయన మీకోసం పశువుల చర్మాలతో తేలికపాటి గుడారాలు (కూడా) నిర్మించాడు. మీరు ప్రయాణంలో ఉన్నా, ఒకచోట బసచేసినా అవి (మోసుకెళ్ళడానికి) తేలిగ్గా ఉంటాయి. ఆ పశువుల రోమాలతో, ఉన్నితో, వెండ్రుకలతో మీరు ధరించే, వాడుకునే వివిధ వస్తువులు తయారు చేస్తారు. అవి కొంతకాలం వరకు మీకు ఉపయోగపడుతున్నాయి. (79-80)
దేవుడు తాను సృష్టించిన అనేక వస్తువుల ద్వారా మీకోసం నీడ ఏర్పాటు చేశాడు. ఆశ్రయం కోసం కొండలలో గుహలు నిర్మించాడు. ఎండవేడిమి నుండి కాపాడే దుస్తులు సృజించాడు. యుద్ధంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడే దుస్తులు సృజించాడు. మీరు విధేయులైఉంటారనే దేవుడు మీకిలా అనేక ప్రయోజనాలు చేకూర్చి మేలుచేశాడు. (81)
ముహమ్మద్‌ (స)! (ఇంత నచ్చజెప్పినా) వీరు విముఖులైపోతే (పోని), సందేశాన్ని స్పష్టంగా అందజేయడమే నీ పని. దేవుడు చేసిన మేళ్ళేమిటో వారికి తెలుసు. అయినా వారు సత్యాన్ని నిరాకరిస్తున్నారు. వారిలో చాలామంది కృతఘ్నులే ఉన్నారు. (82-83)
మేము (తీర్పుదినాన) ప్రతి అనుచర సముదాయం నుండి ఒక సాక్షి (ప్రవక్త)ని తెచ్చి నిలబెట్టినప్పుడు అవిశ్వాసులకు (తమ గోడు వెళ్ళబోసుకోవడానికి) ఏమాత్రం అనుమతి లభించదు. క్షమాపణ వేడుకోండని కూడా వారికి చెప్పడంజరగదు. ఈ దుర్మా ర్గులు (నరక)యాతనను ఓసారి (చవి)చూసుకుంటే ఇక ఆ యాతన తీవ్రత ఏమాత్రం తగ్గించబడదు. (తప్పించుకోవడానికి) ఎలాంటి అవకాశం ఇవ్వబడదు. (84-85)
బహుదైవారాధకులు (తాము కల్పించుకున్న) మిధ్యాదైవాల్ని చూసినప్పుడు “ప్రభూ! నిన్ను వదలి మేము ప్రార్థించిన మా భాగస్వాములు (మిధ్యాదైవాలు) వీరే” అనంటారు. కాని ఆ మిధ్యాదైవాలు వారిమాటలు ఖండిస్తూ ‘మీరు అసత్యవాదుల’ని చెప్పేస్తాయి. అప్పుడు వారు దేవుని ముందు పూర్తిగా లొంగిపోతారు. వారి అభూత కల్పనలన్నీ వారి నుండి కనుమరుగైపోతాయి. తాము సత్యాన్ని తిరస్కరించడమేగాక (ఇతరుల్ని కూడా) దైవమార్గంలోకి రాకుండా నిరోధించినవారికి వారి దుర్మార్గానికి ప్రతిఫలంగా మేము (నానా యాతనలకు గురిచేసి) శిక్షపై శిక్ష విధిస్తాం. (86-88)
(ప్రవక్తా!) మేము ప్రతి అనుచర సముదాయంలో ఆ సముదాయానికే చెందిన ఒక సాక్షి (ప్రవక్త)ని తెచ్చి నిలబెడ్తాం. అతనా సముదాయానికి ప్రతికూలంగా సాక్ష్య మిస్తాడు. అప్పుడు వీరికి ప్రతికూలంగా సాక్ష్యమివ్వడానికి మేము నిన్ను తీసుకొచ్చి నిల బెడ్తాం. (ఈసాక్ష్యం కోసమే) మేము ప్రతి విషయాన్నీ స్పష్టంగా వివరించే గ్రంథాన్ని నీపై అవతరింపజేశాం. ఈ గ్రంథం (మాకు) విధేయులైనవారి కోసం చక్కటి మార్గదర్శినిగా, కారుణ్యప్రదాయినిగా, శుభవార్త ప్రకటనగా అవతరించింది. (89)
దేవుడు మిమ్మల్ని న్యాయంగా వ్యవహరించాలని, మేలు చేయాలని, బంధువుల పట్ల దయతో మెలగాలని ఆదేశిస్తున్నాడు. చెడు, అశ్లీలం, దౌర్జన్యాల జోలికి పోకూడదని వారిస్తున్నాడు. మీరు విషయం గ్రహించడానికి దేవుడు మీకిలా ఉపదేశిస్తున్నాడు#
దేవుని పేరుపై మీరేదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చండి. అలాగే దేవుని సాక్షిగా మీరేదైనా ప్రమాణంచేస్తే దాన్ని భంగపరచకండి. మీరు చేసేపనులన్నీ దేవునికి తెలుసు. (90-91)
కష్టపడి నూలు వడికి దాన్ని చేజేతులా ముక్కలు ముక్కలుగా త్రెంచివేసిన స్త్రీలా మీ పరిస్థితి మారకూడదు. ఒకజాతి మరొకజాతి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందే దురుద్దేశ్యంతో మీరు పరస్పరం మోసగించుకోవడానికి మీ ప్రమాణాలను పనిముట్లుగా వాడుతున్నారు. కాని దేవుడు ఈ ప్రమాణాలు, వాగ్దానాల ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురిచేస్తున్నాడు. మీరు పరస్పరం విభేదించుకున్న విషయాల్లోని నిజానిజాలేమిటో ప్రళయదినాన దేవుడు తప్పకుండా మీముందు వెల్లడిస్తాడు. (92)
(మీలో ఎలాంటి విభేదాలు లేకుండా ఉండాలని) దేవుడు తలచుకుంటే ఆయన మిమ్మల్నందర్నీ ఒకే జాతిగా, ఒకే సమాజంగా చేసేవాడు. కాని దేవుడు తాను కోరిన విధంగా కొందరిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు; మరికొందరికి రుజుమార్గం చూపిస్తాడు. (ఆపై తీర్పుదినాన) మీ కర్మల్ని గురించి తప్పకుండా విచారణ జరుగుతుంది. (93)
(ముస్లిములారా!) మీరు పరస్పరం మోసగించుకోవడానికి మీ ప్రమాణాలను పని ముట్లుగా వాడకండి. అలాచేస్తే (ధర్మంలో) స్థిరంగా ఉన్న (నవముస్లింల) పాదాలు తడబడవచ్చు. (ఇలా) దైవమార్గంలో అవరోధం సృష్టించిన నేరానికి మీరు దుష్ఫలితం చవిచూడవలసి వస్తుంది; కఠినాతి కఠినశిక్ష అనుభవించవలసి వస్తుంది. (94)
దేవునిపేరుతో మీరు చేసిన ప్రమాణం, ఒప్పందాలను స్వల్పమూల్యానికి అమ్మకండి. మీరు గ్రహించగలిగితే దేవుని దగ్గరున్న (పరలోకసంప)దే మీకోసం ఎంతో శ్రేష్ఠ మైనది. మీ దగ్గరున్న (ఐహిక)సంపద ఖర్చయి (అంతమయి) పోయేదే. దేవుని దగ్గరున్న (పరలోక) సంపద మాత్రమే ఎన్నటికీ తరగకుండా శాశ్వతంగా ఉంటుంది. సహనం వహించేవారికి మేము వారి సత్కర్మలకు తప్పక శ్రేష్ఠమైన ప్రతిఫలం ప్రసాదిస్తాం#
పురుషుడైనా, స్త్రీ ఐనా విశ్వాసిఅయి సత్కార్యాలు చేస్తే, వారికి మేము పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాం. వారి సత్కర్మలకు అతిశ్రేష్ఠమైన ప్రతిఫలం ప్రసాదిస్తాం. (95-97)
మీరు ఖుర్‌ఆన్‌ పఠించడానికి ఉపక్రమించినప్పుడు (ముందుగా) శాపగ్రస్తుడైన షైతాన్‌ బారినుండి దేవుడ్ని శరణు వేడుకోండి. విశ్వప్రభువును నమ్ముకున్న విశ్వాసులపై వాడి పాచిక పారదు. వాడ్ని సంరక్షకుడిగా చేసుకొని (వాడు ఆడించినట్లు ఆడుతూ) మిధ్యాదైవాల్ని ఆరాధించేవారిపై మాత్రమే వాడి ఆటలు సాగుతాయి. (98-100)
ఏసూక్తిని అవతరింపజేయాలో దేవునికి బాగా తెలుసు. మేము ఒక సూక్తిని రద్దు చేసి దాని స్థానంలో మరొక సూక్తిని దించినప్పుడు ఈ అవిశ్వాసులు (ముఖం చిట్లిస్తూ) “నీవే ఈ ఖుర్‌ఆన్‌ని కల్పించి తెస్తున్నావ”ని అంటారు. అసలు వారిలో చాలా మంది. అజ్ఞానులే ఉన్నారు#
వారికిలా చెప్పు: “దీన్ని పరిశుద్ధాత్మ యధాతథంగా మీ ప్రభువు దగ్గర్నుండి అవతరింపజేశాడు. విశ్వాసుల విశ్వాసాన్ని మరింత పటిష్ఠం చేయడానికి, విధే యులైనవారికి సన్మార్గం చూపి, శుభవార్త అందజేయడానికి (ఈ గ్రంథం అవతరిం చింది)”#
నీగురించి వారు, ఒక వ్యక్తి ఇతనికి నేర్పుతున్నాడని చెబుతున్న సంగతి మాకు తెలుసు. కాని వారు ఏ మనిషిని ఉద్దేశించి ఈమాటలు అంటున్నారో అతను అరబ్బే తరుడు. ఇదేమో స్పష్టమైన అరబీభాషలో అవతరించింది. (101-103)
దేవుని సూక్తులు విశ్వసించని వారికి దేవుడు ఎన్నటికీ సన్మార్గబుద్ధి ప్రసాదించడు. అలాంటివారికి దుర్భరయాతన తప్పదు. దేవుని సూక్తులు విశ్వసించనివారే (ఇలాంటి) అబద్ధాలు పలుకుతారు. వారే అసలు అసత్యవాదులు. ఎవరైనా దైవాన్ని విశ్వసించాక వత్తిడి బలప్రయోగాల వల్ల అవిశ్వాస ధోరణి వ్యక్తం చేస్తే, అప్పుడతని హృదయం మాత్రం విశ్వాసస్థితిలోనే ఉంటే అలాంటి వ్యక్తిపై దోషంలేదు. అలాగాకుండా ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగానే తిరస్కారవైఖరి అవలంబిస్తే అతనిపై దైవాగ్రహం వచ్చిపడుతుంది. అలాంటివారికి ఘోరమైన యాతన ఉంది. (104-106)
వారసలు పరలోక జీవితానికి బదులు ఐహిక జీవితాన్ని కోరుకున్నారు. అలాంటి అవిశ్వాసులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. దేవుడు వారి హృదయ కవాటాలు మూసేశాడు. వారి చెవులకు, కళ్ళకు సీలువేశాడు. వారసలు ఏమరుపాటుకు గుర య్యారు. కనుక వారు తప్పక పరలోకంలో ఘోరంగా నష్టపోతారు. (107-109)
(సత్యాన్ని విశ్వసించిన కారణంగా) పీడించబడి, స్వస్థలం వదలి వలసపోయిన వారు; ఆ తర్వాత దైవమార్గంలో పోరాడుతూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నవారు; సహనంతో వ్యవహరించినవారు- అలాంటివారి పట్ల నీ ప్రభువు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు#
మానవులంతా తమనుతాము కాపాడుకునే ప్రయత్నంలో మునిగి వుండే (ప్రళయ)దినాన ప్రతి మనిషికీ అతను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (110-111)
దేవుడు ఒక పట్టణం గురించిన ఉదాహరణ ఇస్తున్నాడు (గమనించండి): ఆ పట్టణవాసులు ఎంతో ప్రశాంతజీవితం గడుపుతున్నారు. నలువైపుల నుండి వారికి బాగా ఉపాధి లభిస్తోంది. కాని ఆ ప్రజలు దేవుడు చేసిన ఈ మేళ్ళను విస్మరించి ఆయనకు కృతఘ్నులైపోయారు. అప్పుడు దేవుడు వారికి వారిదుష్కర్మల పర్యవసానం చవిచూపిం చాడు. ఆకలి, భయాందోళనల మహోపద్రవం వారిపై వచ్చిపడింది. వారి దగ్గరికి వారి జాతికి చెందిన ఒక ప్రవక్త వచ్చినప్పటికీ వారతని మాటలు వినకుండా నిరాకరించారు. చివరికి ఆ దుర్మార్గులపై (దైవ)శిక్ష విరుచుకుపడింది. (112-113)
కాబట్టి మానవులారా! దేవుడు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధ ఉపాధిని తింటూ ఆయనకు కృతజ్ఞులయి ఉండండి. మీరు నిజంగా దేవుడ్ని ఆరాధించేవారయితే ఇలా చేయండి. ఆయన మీకు మృతజంతువుని, రక్తాన్ని, పందిమాంసాన్ని, దైవేత రులకు నివేదించబడినదాన్ని నిషేధించాడు. అయితే ఎవరైనా ఆకలికి తాళలేక గత్యం తరంలేని పరిస్థితిలో ఈ నిషేధితాలు తింటే తప్పు లేదు. కాకపోతే అతను దైవాజ్ఞను ఉల్లంఘించే, హద్దు మీరిపోయేవాడై ఉండకూడదు. (అలాంటివారి విషయంలో) దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు. (114-115)
మీరు ఇట్టే నోటికొచ్చినట్లు “ఇది ధర్మసమ్మతమైనది, అది అధర్మమైనది” అని అబద్ధాలాతున్నారు. ఇలాంటి ఆజ్ఞలు జారీచేస్తూ దేవుని మీద అసత్యాన్ని మోపకండి. దేవుని మీద అసత్యారోపణలు చేసేవారు ఎన్నటికీ సాఫల్యం చెందలేరు. (అసత్య విష యాల ద్వారా) కొన్నాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందగల్గుతారు. కాని చివరికి వారు (తమ పాపాలకు పరలోకంలో) దుర్భర శిక్ష చవిచూడవలసి వస్తుంది. (116-117)
దీనికి పూర్వం మేము నీకు తెలియజేసినవాటిని యూదులకు నిషేధించాము. మేము వారికి అన్యాయం చేయలేదు. వారే తమకుతాము అన్యాయం చేసుకునేవారు. అయితే ఎవరైనా అజ్ఞానం వల్ల పాపకార్యం చేసి ఆ తరువాత పశ్చాత్తాపం చెంది తమ నడవడికను సరిదిద్దుకుంటే, అలాంటివారి పాలిట నీప్రభువు అపార క్షమాశీలి, అమిత దయామయుడు అవుతాడు. (118-119)
ఇబ్రాహీం (యావత్సమాజానికి) గొప్ప నాయకుడు. దేవుని పట్ల పూర్తి విధేయతతో కూడిన అంకితభావంగల భక్తుడు. అతను ఏనాడూ దైవేతరశక్తుల్ని ఆరాధించినవాడు కాదు. అదీగాక దేవుడు చేసిన మహోపకారాల పట్ల ఆయనకు సదా కృతజ్ఞుడయి ఉండేవాడు. (అంచేత) దేవుడు అతడ్ని ప్రత్యేకంగా ఎన్నుకొని రుజుమార్గం చూపాడు. పైగా ప్రపంచంలో అతనికి మంచిని ప్రసాదించాడు. పరలోకంలో అతను తప్పకుండా సజ్జనులలో పరిగణించబడతాడు. అందువల్ల నీవు ఏకాగ్రచిత్తుడవయి బహుదైవా రాధకుడుకాని ఇబ్రహీం (జీవన)విధానాన్ని అనుసరించమని మేము నీ దగ్గరకు దివ్యా విష్కృతి (వహీ) అవతరింపజేశాము. (120-123)
శనివారం సంప్రదాయంతో విభేదించినవారి పైన్నే మేము దాన్ని విధించాం. వారు విభేదించినవాటి గురించి నీప్రభువు తప్పక ప్రళయదినాన తీర్పుచేస్తాడు. (124)
ప్రవక్తా! ప్రజలను వివేకంతో, చక్కని ఉపదేశంతో నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు. ఉత్తమోత్తమ రీతిలో విషయాన్ని వారితో చర్చించు. ఎవరు సన్మార్గంలో ఉన్నారో, ఎవరు ఆ మార్గం తప్పారో నీ ప్రభువుకు బాగా తెలుసు. (125)
మీరు ప్రతీకారం తీర్చుకోదలచుకుంటే మీపై ఏమేరకు దౌర్జన్యం జరిగిందో ఆమేరకు మాత్రమే ప్రతీకారం తీర్చుకోండి. అయితే మీరు సహనం వహిస్తే (మంచిది), ఆ సహనం సహనశీలురకు ఎంతో ప్రయోజనకరమవుతుంది. (126)
ప్రవక్తా! సహనం వహించు. ఈ సహనగుణం నీకు దైవానుగ్రహం వల్లనే అబ్బింది. (కనుక) వారి చేష్టల పట్ల బాధపడకు. వారి దుష్టపన్నాగాలకు మనస్సు చిన్నబుచ్చుకోకు. దేవుడు పరోపకారులు, దైవభీతిపరాయణుల పక్షానే ఉంటాడు. (127-128)