కురాన్ భావామృతం/యూసుఫ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

12. యూసుఫ్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 111)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లాం-రా. ఇవి సత్యాన్ని స్పష్టంగా తెలియజేసే గ్రంథానికి చెందిన సూక్తులు. మేము దీన్ని పఠనగ్రంథంగా చేసి, విషయాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా అరబీ భాషలో అవతరింపజేశాము. ముహమ్మద్‌ (సల్లం)! నీ దగ్గరకు పంపుతున్న ఈ పఠన గ్రంథం (ఖుర్‌ఆన్‌) ద్వారా మేము చక్కటి శైలిలో నీకొక యదార్థ గాధ విన్పించ బోతున్నాం. దీనికిపూర్వం (ఈగాధ) నీకేమాత్రం తెలియదు. (1-3)
యూసుఫ్‌ (తన స్వప్నం గురించి ప్రస్తావిస్తూ) మాట్లాడిన సందర్భం: అప్పుడతను తన తండ్రితో “నాన్నా! నేనొక కలగన్నాను. అందులో పదకొండు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నాకు సాష్టాంగప్రణామం చేస్తున్నట్లు కన్పించాయి” అన్నాడు. (4)
“అయితే బాబూ! ఈకల గురించి నీఅన్నల దగ్గర ప్రస్తావించకు. వారు నీకు వ్యతి రేకంగా ఏదైనా కుట్ర పన్నవచ్చు. షైతాన్‌ మానవుని బహిరంగ శత్రువు. సరే, (నీవు కల గన్నట్లు) అలాగే జరుగుతుంది. నీప్రభువు (ఓమహాకార్యం కోసం) నిన్ను ఎంచుకున్నాడు. అందుకాయన నీకు విషయ లోతుపాతుల్ని తరచి చూడగల విశేషజ్ఞానం ప్రసాదిస్తాడు. గతంలో మన పెద్దలైన ఇబ్రాహీం, ఇస్‌హాఖ్‌లకు నీ ప్రభువు ఎలా మహా భాగ్యాలు అను గ్రహించాడో అలాగే ఇప్పుడు నీకూ, యాఖూబ్‌ సంతానానికి కూడా మహాభాగ్యాలు అను గ్రహిస్తాడు. నీప్రభువు సర్వజ్ఞాని, మహావివేకవంతుడు” అన్నాడు యాఖూబ్‌. (5-6)
ప్రశ్నించేవారికి యూసుఫ్‌, అతనిసోదరుల గాధలో గొప్ప సూచనలున్నాయి. (7)
అప్పుడతని సోదరులు పరస్పరం ఇలా కూడబలుక్కున్నారు: “మనమంతా ఒక జట్టుగా ఉన్నా (ఏం లాభం?) మన తండ్రికి మనమీద కంటే యూసుఫ్‌ మీద, అతని తమ్ముడి మీదనే ఎక్కువ మమకారం ఉంది. అసలు మన నాన్నకు (వయస్సు బాగా మీద పడటం వల్ల) మతి భ్రమించింది. (అంచేత మనం ఏదో ఒకటి తేల్చుకోవాలి.) పదండి, యూసుఫ్‌ని చంపివేద్దాం, లేదా ఎక్కడయినా తీసికెళ్ళి పారేద్దాం గుట్టుచప్పుడు కాకుండా. అప్పుడే మీ తండ్రి మీ వైపు మరలుతాడు. ఈ పని కాస్తా ముగిశాక మనం (ఏమీ ఎరగనట్టు) మంచివాళ్ళుగా కన్పించాలి.” (8-9)
ఈ మాటలు విని వారిలో ఒకడు ఇలా అన్నాడు: “యూసుఫ్‌ని చంపవద్దు. దానికి బదులు అతడ్ని పిలిచికెళ్ళి ఏదైనా పాడుబడ్డ బావిలో పడవేద్దాం. అటుగా బాటసారులు ఎవరైనా వస్తే, వారే అతడ్ని బయటికి లాగి తీసికెళ్తారు.” (10)
ఇలా తీర్మానించుకున్న తర్వాత వారు తమతండ్రి దగ్గరకెళ్ళి ఇలాఅన్నారు: “నాన్నా! మీరు యూసుఫ్‌ విషయంలో మమ్మల్ని నమ్మరేమిటీ? నిజంగా మేము అతని శ్రేయోభి లాషులమని చెబుతున్నాంగా! రేపు మావెంట పంపండి. అవీఇవీ బొక్కి కాస్సేపుహాయిగా ఆడుకుంటాడు. అతడ్ని భద్రంగా చూసుకోవడానికి మేము దగ్గరే ఉంటాం కదా!” (11-12)
(అయినా యాఖూబ్‌కు వారి మీద నమ్మకం కుదరలేదు.) “మీరితడ్ని తీసికెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. మీరు మీ పనిలో పడి అజాగ్రత్తగా ఉంటే వీడ్ని ఏ తోడేలో తినేస్తుందేమోనని నాకు భయంగా ఉంది” అన్నాడతను. (13)
“మేమంతా కలసి జట్టుగా దగ్గరున్నప్పటికీ అతడ్ని తోడేలు తినేస్తుందంటే ఇక మేము ఎందుకూ పనికిరాని దద్దమ్మలన్న మాట” అన్నారు వారు. (14)
ఇలా వారు పట్టుబట్టి అతడ్ని తమవెంట తీసికెళ్ళారు. వారతడ్ని పాడుబడ్డ బావిలో పడవేయాలని ముందే నిర్ణయించుకున్నారు. కనుక మేమతనికి దివ్యావిష్కృతి ద్వారా (ధైర్యం చెబుతూ) “వీరికి తమ చేష్టల పర్యవసానం ఏమిటో బొత్తిగా తెలియదు. నీవు వారికి వారినిర్వాకం గురించి ఎత్తిచూపే రోజొకటి తప్పక వస్తుంద”ని తెలియజేశాం#
ఆరోజు సాయంత్రం వారు లబోదిబోమంటూ తమ తండ్రి దగ్గరికొచ్చి ఇలా అన్నారు: “నాన్నా! మేము పరుగుపందెంలో ఉండి, యూసుఫ్‌ని మా సామాను దగ్గర (కాపలా కోసం) వదలిపెట్టాం. అంతలో ఎక్కడ్నుంచో ఒక తోడేలు వచ్చి అతడ్ని చీల్చి తినేసింది. ఔను నాన్నా! మేము నిజంచెప్పినా మీరు మామాటలు నమ్మేటట్లు లేరు”#
వారు యూసుఫ్‌ చొక్కా మీద బూటకపు నెత్తుటి మరకలు పూసి తీసుకొచ్చారు. యాఖూబ్‌ వారి మాటలు విని “కాదు, మీరేదో కథఅల్లి చెబుతున్నారు. సరే కానివ్వండి. నేను దీన్ని మౌనంగా భరిస్తాను. మీరల్లిన ఈ కట్టుకథ చిక్కుముడి నుంచి బయటపడా లంటే దేవుని సహాయమే అర్థించాలి” అని అన్నాడు. (15-18)
అటు కొందరు బాటసారులు వచ్చారు. వారు తమ నీటి నౌకర్‌ని నీళ్ళ కోసం పంపించారు. నీటి నౌకరు బావిలో చేద వదలగానే “ఎంత అదృష్టం! ఇక్కడ ఒక అబ్బాయి దొరికాడు (మనకు)” అన్నాడు సంతోషంతో బిగ్గరగా. (తరువాత) యూసుఫ్‌ని వారు వ్యాపార సామగ్రిగా భావించి దాచుకున్నారు. వారు చేస్తున్నదేమిటో దేవునికి బాగా తెలుసు. చివరికి వారు కొన్ని కాసుల కోసం అతడ్ని అతి స్వల్పధరకు అమ్మివేశారు. అతని ధర విషయంలో వారు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. (19-20)
ఈజిప్టులో అతడ్ని కొన్న వ్యక్తి (ఇంటికెళ్ళి) తన భార్యతో “ఈ అబ్బాయిని మనం బాగా చూసుకోవాలి. ఇతను మనకు (భవిష్యత్తులో) ఉపయోగపడవచ్చు. లేదా మనం ఇతడ్ని కొడుకుగానైనా చేసుకుందాం” అన్నాడు. ఇలా మేము యూసుఫ్‌కు (ఆ) దేశంలో స్థిరపడే పరిస్థితి కల్పించి, అతనికి వ్యవహారదక్షత గురించిన శిక్షణ యేర్పాటు చేశాం. దేవుడు తానుతలచిన పని చేసితీరుతాడు. కాని చాలామంది ఈవిషయం గ్రహించరు. యూసుఫ్‌ యుక్తవయస్సుకు చేరుకున్న తర్వాత మేమతనికి నిర్ణయశక్తి, (విశేష)జ్ఞానం ప్రసాదించాం. ఇలా మేము సహృదయులకు ప్రతిఫలం అనుగ్రహిస్తాం. (21-22)
అతను నివసిస్తున్న ఇంట్లో ఆ ఇంటావిడ అతడ్ని మరులుగొల్పుతూ తనవైపు ఆకట్టుకోవడానికి ప్రయత్నించసాగింది. ఓరోజు ఆమె తలుపులు మూసేసి ‘రా, వచ్చేయి’ అన్నది. దానికి యూసుఫ్‌ “అపచారం! అపచారం!! నేను దేవుని శరణు కోరు తున్నాను. నాప్రభువు నాకు మంచిస్థితి కల్పించాడు. (నేనీ పాపకార్యానికి ఎలా పాల్పడ గలను?) అలాంటి దుర్మార్గులు ఎన్నటికీ సఫలం కాలేరు” అన్నాడు. (23)
అయినప్పటికీ ఆమె తీవ్రమైన కోరికతో అతని వైపు రాసాగింది. యూసుఫ్‌ తన ప్రభువు చూపిన హేతువు చూడకపోతే అతను కూడా తీవ్రమైన కోరికతో ఆమె వైపు కదిలేవాడు. మేమతడ్ని చెడుకు, అశ్లీలానికి దూరంగా ఉంచదలిచాం. అందువల్ల అతనా చేష్టకు వడిగట్టలేదు. అతను మేము ప్రత్యేకంగా ఎంచుకున్న దాసుడు. (24)
చివరికి యూసుఫ్‌, అతని వెనుక ఆ స్త్రీ ఇద్దరూ పరుగిడుతూ తలుపు దగ్గరకు చేరుకున్నారు. ఆమె యూసుఫ్‌ వెనకాల పడి అతని చొక్కా (లాగి)చింపేసింది. అంతలో తలుపు దగ్గర వారిద్దరూ (హఠాత్తుగా) ఆమె భర్త కంటపడ్డారు.
ఆమె తన భర్తను చూడగానే “దుష్టసంకల్పంతో నీఇల్లాలి వెంటపడే వాడికి శిక్ష ఏమిటీ? అలాంటివాడ్ని జైల్లో పడవేయడమో లేక కఠిన యాతనలకు గురిచేయడమో తప్ప మరే శిక్ష కాగల్గుతుంది?” అని అన్నది (తానేపాపం ఎరగనట్టు నటిస్తూ). (25)
దానికి యూసుఫ్‌ ‘అసలు ఈమే నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది’ అన్నాడు. అప్పుడు ఆ స్త్రీకుటుంబ సభ్యులలో ఒకతను (మధ్యవర్తిగా) ముందుకు వచ్చి “యూసుఫ్‌ చొక్కా గనక ముందు భాగం చినిగివుంటే ఈమె చెప్పేది నిజం, అతను చెప్పేది అబద్ధం. ఒకవేళ అతని చొక్కా వెనుకభాగం చినిగివుంటే మాత్రం ఈమె చెప్పేది అబద్ధం. అతను చెప్పేది నిజం అవుతుంది” అని తీర్పిచ్చాడు. (26)
ఆమె భర్త చూస్తే యూసుఫ్‌ చొక్కా వెనుక భాగమే చినిగి ఉంది. దాంతో అతను (మండిపడుతూ) “ఇవన్నీ మీఆడవాళ్ళ పన్నాగాలు. నిజంగా మీపన్నాగాలు చాలా భయం కరంగా ఉంటాయి. యూసుఫ్‌! ఈ విషయాన్ని నీవింతటితో మరచిపో. ఇక నీసంగతి- నువ్వే అసలు దోషివి. సరే చేసిన తప్పుకు క్షమాపణ(యినా) చెప్పుకో” అన్నాడు.#
(ఈ వార్త స్త్రీలలో కార్చిచ్చులా వ్యాపించిపోయింది.) నగరంలోని (గొప్పింటి) స్త్రీలు ఈ విషయమయి పరస్పరం చర్చించుకుంటూ “(మన) మంత్రిగారి భార్య తన బానిస కుర్రోడి వెంట పడిందట! (పాపం) మోహావేశం ఆమెను అదుపు తప్పేలా చేసింది. కాని మన దృష్టిలో మటుకు ఆవిడ పెద్ద తప్పే చేస్తోంది” అని చెప్పుకోసాగారు. (27-30)
ఈ టక్కరిమాటలు (ఆనోటాఈనోటా ప్రాకి) చివరికి ఆస్త్రీ చెవిలో కూడా పడ్డాయి. ఆమె వారిని పిలిపించి ఆనుడుదిండ్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. విందులో (పండ్లు పలహారాలతో పాటు) ప్రతిఒక్కరి ముందు ఓ కత్తి కూడా ఉంచింది.
(వారు తిందామని సరిగ్గా పండ్లు కోస్తున్న సమయంలో) ఆమె యూసుఫ్‌ని వారి ముందుకు రమ్మని సైగచేసింది. (యూసుఫ్‌ పక్కగది నుంచి హఠాత్తుగా వారిముందు కొచ్చి నిలబడ్డాడు.) అతనిపై దృష్టి పడగానే ఆ స్త్రీలు (అతని అసాధారణ సౌందర్యానికి) మంత్రముగ్ధులై పోయారు. ఆ స్థితిలో వారు తమనుతాము మరచిపోయి చేతులు కోసుకున్నారు. (ఆశ్చర్యంతో) “దేవ దేవ! (ఏమి సౌందర్యం!) ఇతను మానవుడు కాదు, మహోత్కృష్టుడైన ఏ దైవదూతో అయివుంటాడు” అన్నారు అప్రయత్నంగా. (31)
వెంటనే మంత్రిభార్య ఇలా అన్నది: “చూశారుగా! నా గురించి మీరు ఏవేవో చెప్పు కున్నారు. ఆవ్యక్తి ఇతనే. నేను నిజంగానే ఇతడ్ని నావైపు తిప్పుకోవడానికి ప్రయత్నిం చాను. కాని తప్పించుకొని బయటపడ్డాడు. (ఏమైనా సరే) ఇతను నామాట వినకపోతే మాత్రం జైలు పాలయి ఘోర అవమానం చవిచూడవలసి వస్తుంది.” (32)
అప్పుడు యూసుఫ్‌ (విశ్వప్రభువును తలచుకుంటూ) “ప్రభూ! వీరు నానుండి కోరుతున్న దానికంటే నాకు జైలుశిక్షే ఇష్టం. నీవు నన్ను వీరి పన్నాగాల నుండి తప్పించక పోతే నేను వీరి వలలో చిక్కుకొని మూఢుల్లో చేరిపోయే ప్రమాదం ఉంది” అని (దైవాన్ని) వేడుకున్నాడు. (33)
అతని ప్రభువు అతని మొరాలకించి అతడ్ని ఆ స్త్రీల కుట్రల నుండి కాపాడాడు. ఆయనే మొరలను ఆలకించేవాడు, సమస్తం ఎరిగినవాడు. (34)
వారు (యూసుఫ్‌ ఎలాంటి సచ్ఛీలుడో, తమ స్త్రీలు ఎలాంటి దుర్నడత కలవారో వాటికి సంబంధించిన) స్పష్టమైన నిదర్శనాలు చూశారు. అయినా వారతడ్ని కొంతకాలం జైల్లో ఉంచాలన్న నిర్ణయానికే వచ్చారు. (అలా యూసుఫ్‌ జైలు పాలయ్యాడు.) (35)
జైల్లో అతనితో పాటు మరో ఇద్దరు బానిసలు కూడా చేరారు. ఓరోజు వారిద్దరిలో ఒకడు“నేను రాత్రి సారాయి పిండుతున్నట్లు కలగన్నాను” అన్నాడు. రెండోవాడు “నేనూ కలగన్నాను. ఆకలలో నా తలమీద కొన్ని రొట్టెలున్నాయి. వాటిని పక్షులు తినసాగాయి” అన్నాడు. ఆ తరువాత వారిద్దరు (యూసుఫ్‌ని ఉద్దేశించి) “చూస్తే మీరు ధర్మాత్ములుగా కన్పిస్తున్నారు. కాస్త మా కలల గూఢార్థం ఏమిటో చెప్పండి” అని అడిగారు. (36)
“మీకిక్కడ లభించే భోజనం రాకముందే నేను మీ కలల గూఢార్థం చెబుతాను. ఇది నాకు నాప్రభువు నేర్పిన విద్య. నేను దేవుడ్ని, పరలోకాన్ని నమ్మనివారి పద్ధతులు వదలి మన పెద్దలైన ఇబ్రాహీం, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ల మార్గం అనుసరిస్తున్నాను. దేవునికి ఇతరుల్ని సాటికల్పించడం నా విధానం కాదు. (మనల్ని ఇతరులకు దాసులుగా చేయలేదంటే) ఇది నిజంగా మనపై, యావత్తు మానవాళిపై దేవుని అనుగ్రహమే. కాని చాలామంది (దేవునికి) కృతజ్ఞత చూపడంలేదు” అన్నాడు యూసుఫ్‌. (37-38)
నా సహఖైదీలారా! కాస్త ఆలోచించండి. మనకు చాలామంది (చిల్లర) దేవుళ్ళు ఉండటం మంచిదా లేక అందరిపై ఆధిక్యత కలిగివున్న ఒక్క అల్లాహ్‌ ఉండటం మంచిదా? ఆయన్ని వదలి మీరు ఏఏ దైవాలను ఆరాధిస్తున్నారో అవన్నీ మీరు, మీ తాతముత్తాతలు పెట్టుకున్న కొన్ని పేర్లు (అభూతకల్పనలు) మాత్రమే. వాటి కోసం దేవుడు ఎలాంటి ప్రమాణం పంపలేదు. పాలానాధికారం దేవునికి తప్ప మరెవ్వరికీ లేదు. ఆయన తనను తప్ప మరెవరినీ ఆరాధించకూడదని శాసించాడు. ఇదే సరైన జీవన మార్గం. కాని చాలామంది (ఈ యదార్థం) గ్రహించడం లేదు. (39-40)
నా సోదర ఖైదీలారా! ఇప్పుడు మీకలల గూఢార్థం చెబుతా వినండి. మీలో ఒకడు తన ప్రభువుకు (అంటే ఈజిప్టు చక్రవర్తికి) సారాయి తాగిస్తాడు. రెండోవాడ్ని ఉరికంబం ఎక్కిస్తారు. పక్షులు అతని తలను పొడిచిపొడిచి తింటాయి. (అంతే) మీరడిగిన ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.” ఆ తరువాత యూసుఫ్‌ వారిద్దరిలో జైలు నుంచి విడుదల కాబోతున్నాడని తెలిసిన వ్యక్తితో “నీ ప్రభువు (ఈజిప్టు చక్రవర్తి) దగ్గర నా గురించి కాస్త ప్రస్తావించు” అన్నాడు. కాని షైతాన్‌ అతడ్ని మరపింపజేశాడు. అతనా విషయం తన ప్రభువు దగ్గర ప్రస్తావించడం మరచిపోయాడు. దాంతో యూసుఫ్‌ అనేక సంవత్సరాలు జైల్లోనే ఉండిపోవలసి వచ్చింది. (41-42)
ఒకరోజు చక్రవర్తి (తన సభాసదులతో) ఇలా అన్నాడు: “రాత్రి నేనొక కలగన్నాను. అందులో ఏడు బలిసిన ఆవులను ఏడు బక్కచిక్కిన ఆవులు తినేస్తున్నాయి. అలాగే ధాన్యసంబంధమైన ఏడు పచ్చటి వెన్నులు, ఏడు ఎండిన వెన్నులున్నాయి. కనుక సభా సదులారా! మీకు స్వప్నభావం తెలిస్తే నా స్వప్నంలోని గూఢార్థం ఏమిటో చెప్పండి.” దానికి సభాసదులు “ఇవి పీడకలలకు సంబంధించిన విషయాలు. ఇలాంటి కలల గూఢార్థం మాకు తెలియదు” అని సమాధానమిచ్చారు. (43-44)
అప్పుడా ఇద్దరు ఖైదీలలో విడుదలయిన వ్యక్తికి చాలా కాలం తర్వాత (యూసుఫ్‌) సంగతి గుర్తుకొచ్చింది. అతను సభను ఉద్దేశించి “నేను మీకు దాని గూడార్థం చెబుతా. నన్ను కాస్త జైలు దగ్గరకు వెళ్ళడానికి అనుమతించండి” అన్నాడు. (45)
(రాజు అనుమతి లభించిన తరువాత) అతను వెళ్ళి “యూసుఫ్‌! సత్యం మూర్తీ భవించిన మహానుభావా!! నాకీ కల గురించిన గూఢార్థం ఏమిటో చెప్పు. ఏడు బలిసిన ఆవులను ఏడు బక్కచిక్కిన ఆవులు తినేస్తున్నాయి. ఏడు పచ్చటి వెన్నులు, ఏడు ఎండిన వెన్నులు ఉన్నాయి. దీనర్థం ఏమిటో చెబితే నేను వెళ్ళి వారికి తెలియజేస్తాను. దానివల్ల వారు నిన్ను (నీ విలువను) గుర్తించవచ్చు” అని అన్నాడు. (46)
అప్పుడు యూసుఫ్‌ (స్వప్న భావం వివరిస్తూ) ఇలా అన్నాడు: “మీరు ఏడేండ్లపాటు నిరంతరాయంగా వ్యవసాయం చేస్తారు. ఆ కాలంలో పండే పంటలో కొంత పంటను మీరు తిండికోసం వాడుకొని మిగతా పంటను వాటి వెన్నులలోనే ఉంచండి. ఆతర్వాత మరో ఏడేండ్లపాటు (కరువుకాటకాలతో) పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ స్థితిలో మీరు కూడబెట్టుకున్న ధాన్యం (హాయిగా) తినవచ్చు. ఒకవేళ ఏదైనా మిగిలితే మీరు భద్రపరుచుకున్నదే మిగులుతుంది. ఆతర్వాత పుష్కలంగా వర్షాలు కురిసే సంవ త్సరం వస్తుంది. ఆ ఏడు ప్రజలు (పాలు, పండ్లరసం) బాగా పిండుతారు.” (47-49)
చక్రవర్తి ఈ కల గూఢార్థం విన్న తరువాత అతడ్ని తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశించాడు. కాని రాజదూత యూసుఫ్‌ దగ్గరకు వెళ్తే అతనిలా అన్నాడు: “ముందు నీవు నీ ప్రభువు దగ్గరికెళ్ళి చేతులు కోసుకున్న స్త్రీల సంగతేమిటో కాస్త అడిగిరా. నా ప్రభువుకు మాత్రం ఆ జిత్తులమారి స్త్రీల సంగతి బాగా తెలుసు.” (50)
చక్రవర్తి ఈ మాటలు విని (ఆ స్త్రీలను పిలిపించాడు.) వారితో “మీరు యూసుఫ్‌ని మరులు గొల్పడానికి ప్రయత్నించినప్పుడు మీ అనుభవం ఏమిటీ?” అనడిగాడు. దానికి ఆ స్త్రీలంతా “దేవ దేవ! అతనిలో మేము చెడుకు సంబంధించిన ఛాయ కూడా చూడ లేదు” అని ముక్తకంఠంతో పలికారు. అప్పుడు మంత్రిభార్య (ముందుకొచ్చి) “ఇప్పుడు నిజం బయటపడింది. అతడ్ని వలలో వేసుకోవడానికి ప్రయత్నించినదాన్ని నేనే. అతను మాత్రం సచ్ఛీలుడే. అందులో ఎలాంటి సందేహం లేదు” అని చెప్పింది. (51)
యూసుఫ్‌ (రాజదూత ద్వారా ఈ వృత్తాంతం విని) ఇలా అన్నాడు: “ఈ ప్రశ్న అడగ డంలో నా ఉద్దేశ్యం ఒక్కటే. మంత్రిగారు ఇంట్లో లేనప్పుడు నేనాయనకు నమ్మక ద్రోహం తలపెట్టలేదని ఆయనకు తెలియాలి. అసలా స్త్రీలే నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. వారి కుట్రలను దేవుడు ఏమాత్రం సాగనివ్వడని వారూ తెలుసుకోవాలి. నేను నా ఆత్మశుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. నా ప్రభువు కారుణ్యభాగ్యం లభిస్తే తప్ప మనస్సు ఎల్లప్పుడూ చెడు వైపుకే పురిగొల్పుతుంది. నా ప్రభువు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు.” (52-53)
చక్రవర్తి (రాజదూతను ఆదేశిస్తూ) “అతడ్ని నా దగ్గరకు పిలుచుకు రా. నేనతడ్ని (ఆంతరంగిక కార్యదర్శిగా) నాకోసం ప్రత్యేకించుకుంటాను” అన్నాడు. (రాజదూత వెళ్ళి యూసుఫ్‌ని పిలుచుకొని వచ్చాడు.) అతనితో చక్రవర్తి మాట్లాడిన తర్వాత “ఇప్పుడు మీకు మాదగ్గర హోదా, గౌరవప్రతిష్ఠలున్నాయి. మీ నిజాయితీపై మాకు నమ్మకముంది” అన్నాడు. “అయితే దేశ ఒనరులన్నీ నాకప్పగించండి. నేను వాటిని కాపాడుతాను. నాదగ్గర తగిన జ్ఞానసంపత్తి కూడా ఉంది” అన్నాడు యూసుఫ్‌. (54-55)
ఇలా మేమా దేశంలో యూసుఫ్‌ పాలనకోసం దారి సుగమం చేశాం. అతనిప్పుడు సర్వాధికారి. ఆ దేశంలో అతను తాను కోరుకున్న చోటల్లా స్థావరం ఏర్పరుచుకోగలడు. మేము తలచుకున్నవారికి మా కారుణ్యభాగ్యం ప్రసాదిస్తాం. మాదగ్గర సజ్జనుల సత్కార్య ఫలం హరించడం జరగదు. సత్యాన్ని విశ్వసించి దేవుని పట్ల భయభక్తులతో జీవితం గడిపేవారికి పరలోక ప్రతిఫలం (ఇంతకంటే) ఎంతో శ్రేష్ఠమైనది. (56-57)
(ఆ తరువాత కొన్నాళ్ళకు) యూసుఫ్‌ సోదరులు ఈజిప్టు దేశానికి వచ్చారు. వారు (తమ కార్యసిద్ధి కోసం) అతని దగ్గరకు వెళ్ళారు. అతను వారిని వెంటనే గుర్తుపట్టాడు. వారు మాత్రం అతడ్ని గుర్తుపట్టలేక పోయారు. (58)
వారికోసం యూసుఫ్‌ వారిసామగ్రి ఏర్పాటుచేయించిన తర్వాత, వారిని సాగ నంపుతూ “(మరోసారి ఎప్పుడైనా వస్తే) మీ మారుసోదరుడ్ని నా దగ్గరకు తీసుకురండి. చూశారు కదా, నేనెంత న్యాయంగా (ధాన్యం) కొలిచి ఇచ్చానో, ఎంత మంచి ఆతిథ్య మిచ్చానో? మీరు గనక అతడ్ని తీసుకురాకపోతే మాత్రం మీకు నాదగ్గర ఎలాంటి ధాన్యం లభించదు. అదీగాక మీరు నా దరిదాపులక్కూడా రాలేరు” అని అన్నాడు. (59-60)
“సరే, మా ప్రయత్నం మేము చేస్తాము. మా నాన్నగారు అతడ్ని పంపడానికి ఒప్పు కుంటే మేము తప్పకుండా తీసుకొస్తాము” అన్నారు వారు. (61)
యూసుఫ్‌ తన సేవకుల్ని పిలిచి “వారు ధాన్యం తీసుకొని మనకిచ్చిన ధనాన్ని రహస్యంగా వారి సామగ్రి ఉన్న గోతంలో పెట్టేయండి” అని సూచించాడు. ఇలా చేయ డానిక్కారణం వారు ఇంటికి వెళ్ళి, ధాన్యం తీసుకొని తమకిచ్చిన ధనాన్ని గుర్తుపడ్తారని, దాంతో వారు మళ్ళీ (ఈజిప్టుకు) రావచ్చని యూసుఫ్‌ ఆశించాడు. (62)
యూసుఫ్‌ సోదరులు (స్వదేశంలో) తమ తండ్రి దగ్గరికెళ్ళి “నాన్నా! ఇకముందు వారు మనకు ధాన్యం ఇవ్వమని చెప్పేశారు. అంచేత మీరు మా తమ్ముడ్ని మావెంట పంపితే మేము (మళ్ళీ) ధాన్యం తీసుకొస్తాం. అతడ్ని మేము భద్రంగా చూసుకుంటాం” అని అన్నారు. (63)
“ఇతని విషయంలో నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఇంతకు ముందు ఇతని అన్న విషయంలో నమ్మినట్లు నమ్మాల్నా? దేవుడు మాత్రమే మంచి రక్షకుడు. ఆయన అందరికన్నా ఎంతో కరుణామయుడు కూడా” అన్నాడు వారి తండ్రి. (64)
ఆ తరువాత వారు తమ సామగ్రి గోతాలు విప్పిచూశారు. అందులో ఉన్న ధనం చూసి, తమ ధనాన్ని తిరిగిచ్చి వేసినట్లు కనుగొన్నారు. దాన్ని చూడగానే వారు (ఎంతో సంబరపడిపోతూ) “నాన్నా! ఇదిగో చూడండి! మా (మూల)ధనం కూడా మాకు తిరిగి చ్చారు. ఇంతకంటే మనకేం కావాలి!! ఈసారి మేము మళ్ళీపోయి మన కుటుంబానికి (సరిపడ్డ) ధాన్యం తెస్తాం. మా తమ్ముడ్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. అదనంగా మేము మరొక ఒంటె (మోసే) ధాన్యం కూడా తెచ్చుకోగలం. అదనంగా అంత ధాన్యం మనకు సులభంగా లభిస్తుంది” అని అన్నారు. (65)
“మీరు తప్పకుండా (సురక్షితంగా) నా దగ్గరకు తిరిగి తీసుకొస్తామని దేవుని మీద ప్రమాణం చేయనంతవరకు నేను ఇతడ్ని మీవెంట పంపను. దురదృష్టవశాత్తు మీరెక్క డైనా చిక్కుకుంటే, అది వేరే విషయం” అన్నాడు వారి తండ్రి. దాంతో వారంతా దేవుని మీద ప్రమాణం చేసి వాగ్దానం చేశారు. అప్పుడతను “(గుర్తుంచుకోండి) మనం చెప్పు కున్న ఈ విషయానికి దేవుడే సాక్షి” అన్నాడు. (66)
ఆ తర్వాత అతనిలా ఉపదేశించాడు: “ బిడ్డలారా! ఈజిప్టు రాజధానిలో ఒకద్వారం గుండా కాకుండా విభిన్నద్వారాల గుండా ప్రవేశించండి. అయితే విధినిర్ణయం (ఎలా ఉందోగాని దాని) నుంచి నేను మిమ్మల్ని కాపాడలేను. (యావత్‌ విశ్వంలో) దేవుని ఆజ్ఞ తప్ప మరెవరి ఆజ్ఞా పనిచేయదు. ఆయన్నే నేను నమ్ముకున్నాను. నమ్ముకోవలసిన వారు ఆయన్నే నమ్ముకోవాలి.” (67)
తండ్రి ఉపదేశం ప్రకారమే వారు (ఈజిప్టు వెళ్ళి) విభిన్నద్వారాల గుండా నగరంలో ప్రవేశించారు. అయితే (ముందుజాగ్రత్త కోసం) అతను సూచించిన యుక్తి విధినిర్ణయం ముందు ఎందుకూ పనికిరాకుండా పోయింది. కాకపోతే యాఖూబ్‌ తన హృదయంలో మెదలుతున్న సంకోభం దూరం చేసుకోవడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఏమైనా అతను గొప్ప జ్ఞానసంపన్నుడు. మేమతనికి విశేషజ్ఞానం ప్రసాదించాం. కాని చాలామంది (ఈ యదార్థం) గ్రహించరు. (68)
వారు యూసుఫ్‌ దగ్గరికి చేరుకున్నారు. యూసుఫ్‌ వారిలో తన (సొంత)తమ్ముడ్ని చాటుగా తన దగ్గరకు పిలిపించుకొని “నేను నీ(తప్పిపోయిన) అన్నయ్యను. ఇప్పుడు నీవు వారి చేష్టలను గురించి బాధపడనవసరం లేదు” అని ధైర్యం చెప్పాడు. (69)
ఆ తరువాత యూసుఫ్‌ వారికోసం (ధాన్యం, తదితర) సామగ్రి ఏర్పాట్లు చేయిం చాడు. ఆ సమయంలో అతను తన గిన్నె నొకదాన్ని తన తమ్ముడి సామాను ఉన్న గోతంలో పెట్టించాడు రహస్యంగా. కాస్సేపటికి అరిచేవాడొకడు (రాజభటుడు) హఠా త్తుగా “బాటసారులారా! (ఆగండి) మీరు దొంగలు” అని అరిచాడు. (70)
వారు వెనక్కి తిరిగి “మీ వస్తువు ఏదైనా పోయిందా?” అని అడిగారు. (71)
“రాజుగారి గిన్నె ఒకటి మాకు కన్పించడం లేదు” అన్నారు రాజోద్యోగులు. “దాన్ని తెచ్చిచ్చేవానికి ఒక ఒంటె (మోసే) బహుమానం ఇస్తాం. అలా ఇప్పించే బాధ్యత నాది” (అన్నాడు వారిలో ప్రధాన రాజోద్యోగి). (72)
“దైవసాక్షి! మేమీ దేశంలో అలజడి సృష్టించడానికి రాలేదు. మేము దొంగతనాలు చేసేవాళ్ళం కాము. ఈసంగతి మీక్కూడా బాగాతెలుసు” అన్నారు వారన్నదమ్ములు.
“సరే, మీమాట అబద్ధమని తేలితే దొంగకు శిక్షేమిటి?” రాజోద్యోగులు అడిగారు.
“(పోయిన) వస్తువు ఎవరి సామగ్రిలో దొరుకుతుందో అతడ్ని శిక్షగా మీ దగ్గర (బానిసగా చేసుకొని) పెట్టుకోండి. అలాంటి దుర్మార్గులకు మా రాజ్యంలో విధించే శిక్ష ఇదే” అన్నారు వారు. (73-75)
అప్పుడు యూసుఫ్‌ తన తమ్ముడి సామగ్రి సంచి వెతకడానికి ముందుగా వారి సామగ్రి సంచులు వెతికాడు. తరువాత తమ్ముడి సంచి వెతికి అందులో నుంచి పోయిన వస్తువుని బయటికి తీశాడు.
ఈ విధంగా మేము మా యుక్తితో యూసుఫ్‌కు సహాయం చేశాము. రాజధర్మం (రాచరికపు చట్టం) ప్రకారం తన తమ్ముడ్ని పట్టుకోవడం యూసుఫ్‌ (వంటి దైవభక్తుని)కి శోభించదు. ఒకవేళ ఆ విధంగా జరగాలని దేవుడు నిర్ణయిస్తే అది వేరే విషయం. మేము తలచుకున్న వారికి వారిస్థాయి, అంతస్తులను ఉన్నతం చేస్తాం. జ్ఞానసంపత్తిలో అందరినీ మించిన ఒక (అద్భుత) జ్ఞానసంపన్నుడు ఉన్నాడు. (76)
అప్పుడు యూసుఫ్‌ సవతిసోదరులు (పోయిన రాజవస్తువు తమ మారుతమ్ముడి సంచి నుండి బయల్పడటం చూసి) “ఇతను దొంగతనానికి పాల్పడ్డాడంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇంతకు ముందు ఇతని అన్న (యూసుఫ్‌) కూడా ఇలాగే దొంగతనానికి ఒడిగట్టాడు” అని అన్నారు (అసూయతో).
ఈమాట విని యూసుఫ్‌ వస్తున్న కోపాన్ని లోలోనే దిగమింగాడు. వాస్తవం బయటపెట్టకుండా “మీరెంత చెడ్డవాళ్ళు! (నాముందే) నాపై ఈ అపనింద మోపుతు న్నారా? దాని నిజానిజాలేమిటో దేవునికి బాగా తెలుసు” అని (మెల్లగా) అన్నాడు. (77)
రాజ్యాధిపతీ! అతని తండ్రి చాలా వృద్ధుడైపోయాడు. అందువల్ల మీరు అతనికి బదులు మాలో ఒకడ్ని ఉంచుకోండి. చూస్తే మీరు చాలా పరోపకారిలా, దయామయు డిలా కన్పిస్తున్నారు” అన్నారు వారు యూసుఫ్‌తో. (78)
“(అలాంటి అక్రమపద్ధతి నుండి) మేము దేవుని శరణుకోరుతున్నాం. ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతడ్ని వదలి మరొకడ్ని ఎలా ఉంచుకుంటాం? అలా చేస్తే మేము దుర్మార్గుల్లో చేరినట్లవుతుంది” అన్నాడు యూసుఫ్‌. (79)
దాంతో వారు నిరాశచెంది ఒక మూలకు వెళ్ళి పరస్పరం సంప్రదించుకోసాగారు. అప్పుడు వారిలో అందరికంటే పెద్దవాడు తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు:
“మీ తండ్రి మీచేత దేవునిపేరుతో ప్రమాణం చేయించిన సంగతి మీకు తెలిసిందే. ఇంతకుపూర్వం యూసుఫ్‌ విషయంలో మీరు చేసిన దౌర్జాన్యాలు కూడా గుర్తుండే ఉంటాయి. నేను మాత్రం నాతండ్రి అనుమతి ఇవ్వనంతవరకు ఇక్కడ్నుంచి రానేరాను. లేదా నావిషయంలో దేవుడే ఏదైనా పరిష్కారం చేయాలి. ఆయన అందరికంటే మిన్నగా పరిష్కారం చేసేవాడు. కాబట్టి మీరు వెళ్ళిపోయి మీ నాన్నగారికి ఇలా చెప్పండి:
“నాన్నగారూ! మీ (ముద్దుల) కొడుకు దొంగతనం చేశాడు. మేము మాత్రం అతను దొంగతనం చేస్తుండగా చూడలేదు. మేము చెబుతున్నదే మాకు తెలిసిన సంగతి. అగోచర విషయాల్ని మేము గమనించలేము కదా! కావాలంటే మేము వెళ్ళొచ్చిన నగరంలోని ప్రజల్ని అడగండి. మాతోపాటు వచ్చిన బాటసారుల్ని కూడా అడిగి చూడండి. మేము చెబుతున్నది ముమ్మాటికీ నిజం.” (80-82)
(ఆతర్వాత వారు స్వదేశానికి తిరిగెళ్ళి తమ తండ్రికి జరిగిన వృత్తాంతం వివరిం చారు.) అది విని యాఖూబ్‌ (తీవ్ర మనస్తాపానికి గురై) ఇలా అన్నాడు: “కాదు, (అసలు సంగతి అదికాదు.) మళ్ళీ మీరేదో కథ అల్లి చెబుతున్నారు. సరే కానివ్వండి. దీన్ని కూడా నేను మౌనంగా భరిస్తాను. దేవుడు వారందర్నీ నా దగ్గరకు తీసుకురావచ్చు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన సర్వం ఎరిగినవాడు, మహాయుక్తిపరుడు.” (83)
ఇలా చెప్పి అతను వారి వైపు నుండి ముఖం తిప్పుకొని “అయ్యో యూసుఫ్‌!” అంటూ బాధపడసాగాడు. (పాపం!) అతను లోలోనే కుమిలిపోతూ క్రుంగిపోసాగాడు. దాని వల్ల అతని కళ్ళు జీవకళ కోల్పోయి పాలిపోయాయి. (84)
కొడుకులు (అతని పరిస్థితి చూసి) “అయ్యో దేవా! మీరు ఇలాగే ఎప్పుడూ యూసుఫ్‌నే తలచుకుంటూ బాధపడుతుంటే జబ్బుపడతారు. లేదా (ఆ జబ్బుతో చివరికి) ప్రాణాలు కూడా కోల్పోవచ్చు” అన్నారు. (85)
“నేను నాబాధ గురించి దేవునితో తప్ప ఎవరితోనూ చెప్పుకోవడం లేదు. దేవుడ్ని గురించి నాకు తెలిసినంత మీకు తెలియదు. నాయనలారా! వెళ్ళి యూసుఫ్‌ గురించి, అతని తమ్ముడ్ని గురించి ఆరాతీయండి. దేవుని కారుణ్యంపట్ల నిరాశచెందకండి. దేవుని కారుణ్యంపట్ల అవిశ్వాసులు మాత్రమే నిరాశచెందుతారు”అన్నాడు యాఖుబ్‌. (86-87)
వారు మళ్ళీ (ఈజిప్టులో ఉన్న) యూసుఫ్‌ దగ్గరకు వెళ్ళి “రాజ్యాధిపతీ! మేమూ, మా భార్యాపిల్లలు పెద్దఆపదలో చిక్కుకున్నాం. మా దగ్గర పెట్టుబడి తక్కువగా ఉంది. (ఈసారి కూడా) మాకు ధాన్యం పూర్తిగా ఇప్పించండి. (దయచేసి) దానం చేయండి. దానం చేసేవారికి దేవుడు మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడు” అని ప్రాధేయపడ్డారు. (88)
యూసుఫ్‌ (ఇక ఉండబట్టలేక) “మీరు అజ్ఞానాంధకారంలో పడి యూసుఫ్‌ పట్ల, అతని తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించారో మీకేమైనా గుర్తుందా?” అని అడిగాడు. (89)
ఈ మాట విని వారు ఉలిక్కిపడి “ఏమిటీ! నువ్వు యూసుఫ్‌వా!?” అన్నారు.
“ఔను నేను యూసుఫ్‌నే. ఇతను నాతమ్ముడు. దేవుడు మాకెంతో మేలుచేశాడు. పాపకార్యాలకు దూరంగాఉంటూ, (కష్టకాలంలో) సహనం వహించే సజ్జనులకు దేవుని వద్ద అన్యాయం జరగదు. వారి ప్రతిఫలం ఎన్నటికీ వృధాపోదు” అన్నాడు యూసుఫ్‌.
“దైవసాక్షి! దేవుడు మీకు మాకంటే ఎక్కువ ఔన్నత్యం ప్రసాదించాడు. మేము నిజంగా పాపాత్ములం” అన్నారు వారు. “ఈరోజు మీ గురించి ఎలాంటి ఆరోపణలు, ఆక్షేపణలు లేవు. దేవుడు మిమ్మల్ని క్షమించుగాక! ఆయన ఎంతో దయామయుడు. ఇక వెళ్ళండి. ఇదిగో నాచొక్కా తీసికెళ్ళి నాతండ్రి ముఖంపై వేయండి. ఆయనకు చూపు తిరిగొస్తుంది. మీ భార్యాపిల్లలు మొత్తం కుటుంబాన్ని నాదగ్గరకు పిలుచుకురండి” అన్నాడు యూసుఫ్‌. (90-93)
బాటసారుల బృందం (ఈజిప్టు నుంచి) బయలుదేరింది. అప్పుడు (కనాన్‌లో ఉన్న) వారితండ్రి (అనిర్వచనీయమైన ఉత్సాహం వెలిబుచ్చుతూ) “నాకు యూసుఫ్‌కు సంబంధించిన సువాసన ఏదో వస్తున్నట్లనిపిస్తోంది. నేను ముసలితనంలో మతిభ్రమించి ఇలా అంటున్నానని మీరనుకోవచ్చు. (కాని ఇది నిజం)” అన్నాడు. (94)
“అయ్యో దేవా! మీరింకా అదే పిచ్చిలో ఉన్నారు” అన్నారతని కుటుంబసభ్యులు ఆ తర్వాత కొన్నాళ్ళకు శుభవార్తాహరుడు వచ్చాడు. రాగానే యూసుఫ్‌చొక్కా తీసి యాఖూబ్‌ ముఖంపై వేశాడు. అంతే మరుక్షణమే యాఖూబ్‌కు చూపు వచ్చింది. అప్పుడ తను (సంతోషిస్తూ) “నేను చెప్పలేదూ, (యూసుఫ్‌ దగ్గర్నుంచి సువాసన వస్తోందని)? మీకు తెలియని విషయాలెన్నో దేవుని తరఫున నాకు తెలుసు” అన్నాడు.
“నాన్నగారూ! మేము నిజంగా పాపాత్ములం. మా పాపాల మన్నింపు కోసం దేవుడ్ని ప్రార్థించండి” అన్నారు వారన్నదమ్ములంతా ముక్తకంఠంతో. “మీ క్షమాపణ కోసం నేను నా ప్రభువు సన్నిధిలో (తప్పకుండా) వేడుకుంటాను. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు” అన్నాడు యాఖూబ్‌. (95-98)
ఆ తరువాత (కొన్నాళ్ళకు) వారంతా (ఈజిప్టులో) యూసుఫ్‌ దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు యూసుఫ్‌ తన తల్లిదండ్రుల్ని (ఘనంగా స్వాగతించాడు.) దగ్గర కూర్చోబెట్టుకొని (అన్నదమ్ములు, ఇతర బంధువులతో) “పదండి, నగరంలో ప్రవేశించండి. దైవం కోరితే (ఇకనుంచి) మీరంతా శాంతీసుఖాలతో జీవితం గడుపుతారు” అని చెప్పాడు. (99)
(ఇలా ఆబాలగోపాలం వెంటరాగా ఆనందోత్సాహాలతో వారు నగరంలో ప్రవేశిం చారు.) తర్వాత యూసుఫ్‌ తల్లిదండ్రుల్ని సింహాసనంపై తనపక్కన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు అందరూ అప్రయత్నంగా అతనికి గౌరవసూచకంగా అభివాదం చేశారు.
“నాన్నా! నేనా రోజు చూసిన కలలోని గూఢార్థం ఇదే. నాప్రభువు దాన్ని (ఈరోజు) ఇలా నిజం చేసి చూపాడు. ఆయన తన అనుగ్రహంతో నన్ను జైలు నుంచి విడుదల చేయించాడు. అంతేకాదు, మిమ్మల్నందర్నీ ఎడారిప్రాంతం నుండి తీసుకొచ్చి నాతో కలిపాడు. అంతకు ముందు షైతాన్‌ నాకు, నాసోదరులకు మధ్య కలహం సృష్టించాడు. (దేవుడు దాన్ని తిప్పికొట్టాడు.) వాస్తవం ఏమిటంటే నా ప్రభువు ఇతరులెవరూ గ్రహించ లేని అద్భుతమైన యుక్తులతో తన పథకాన్ని అమలుపరుస్తాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు, మహా వివేకవంతుడు. (100)
ప్రభూ! నీవు నాకు రాజ్యాధికారం ప్రసాదించావు, విషయ లోతుపాతుల్ని తరచి చూడగల అసాధారణజ్ఞానం కూడా అనుగ్రహించావు. భూమ్యాకాశాల సృష్టికర్తా! నీవే ఇహపర లోకాల్లో నా సంరక్షకుడివి. (ఇహలోకంలో) నన్ను ఇస్లామీయ స్థితిలోనే అంత మొందించు. పరలోకంలో సత్పురుషులలో చేర్చు” అన్నాడు యూసుఫ్‌. (101)
మేము నీకు దివ్యావిష్కృతి ద్వారా తెలుపుతున్న ఈ గాధ రహస్య సమాచారానికి సంబంధించిన విషయం. యూసుఫ్‌ సోదరులు కూడబలుక్కొని కుట్ర పన్నుతున్నప్పుడు నీవక్కడ లేవు. కాని నీవు తలచుకున్నా వారిలో చాలామంది సత్యాన్ని విశ్వసించరు. ఈపని కోసం నీవు వారిని ఎలాంటిప్రతిఫలం అడక్కపోయినా వారు నమ్మే రకం కాదు. ఇది యావత్ప్రపంచ మానవాళి కోసం పంపబడిన హితబోధ. (102-104)
భూమ్యాకాశాల్లో ఎన్నోనిదర్శనాలు వారికి (అనుదినం) తారసపడుతున్నాయి. ఐనా వారు వాటివైపు దృష్టి సారించరు. వారిలో చాలామంది (నిజ)దేవుడ్ని నమ్మేవారున్నారు; కాని ఆ దేవునికి సాటికల్పిస్తున్నారు. వారు దేవుని వైపు నుండి ఎలాంటిశిక్ష వచ్చినా అది తమను తుదముట్టించదని నిర్భయంగా ఉన్నారా? లేక ఏమరుపాటులో ఉన్నప్పుడైనా హఠాత్తుగా తమపై ప్రళయం వచ్చిపడదని నిశ్చింతగా ఉన్నారా? (105-107)
ముహమ్మద్‌ (స)! వారికిలా స్పష్టంగా చెప్పు: “నామార్గం మటుకు ఇదే. నేను, నాతోపాటు నా సహచరులు ప్రమాణబద్ధంగా, పరిపూర్ణ జ్ఞానంతో (ప్రజల్ని) దైవ(మార్గం) వైపు పిలుస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు, సమస్త బలహీనతలకు అతీతుడు. మిధ్యాదైవా లను పూజించేవారితో నాకెలాంటి సంబంధం లేదు.” (108)
నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలంతా కూడా మానవులే. వారు మానవులుండే ఊళ్ళకు చెందినవారే. వారి దగ్గరికే మేము మాసందేశం పంపుతూ వచ్చాం. మరి వారు ప్రపంచంలో తిరిగి గతజాతులు ఎటువంటి పర్యవసానం చవిచూశారో గమనించరా? దేవుని పట్ల భయభక్తులతో నడుచుకునేవారికే పరలోకగృహం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. మీరు ఇప్పటికైనా విషయాన్ని అర్థం చేసుకుంటారా లేదా? (109)
(పూర్వం కూడా దైవప్రవక్తలు ఏళ్ళ తరబడి బోధించినా ప్రజలు దారికి రాలేదు.) చివరికి దైవప్రవక్తలు ప్రజల పట్ల నిరాశచెందారు. ప్రజలు కూడా తమకు అభూత కల్పనలు విన్పించడం జరిగిందని భావించారు. అప్పుడు హఠాత్తుగా ప్రవక్తల దగ్గరకు మా సహాయం వచ్చింది. అప్పుడు మేము తలచుకున్న వారిని రక్షించాం. నేరస్థులపై విరుచుకు పడే మాశిక్ష ఎట్టి పరిస్థితిలోనూ తొలగిపోదు. (110)
బుద్ధీజ్ఞానం కలవారికి వీరి చారిత్రక గాధలలో ఎంతో గుణపాఠం ఉంది. ఈ విషయం పుక్కిటిపురాణం కాదు (ఈచెవిన విని ఆచెవిన వదలేయడానికి). ఇది గత గ్రంథాలను ధృవీకరిస్తున్న (అంతిమ దైవ)గ్రంథం. ప్రతి విషయాన్నీ విపులీకరించి చెప్పే దివ్యవాణి. విశ్వసించేవారికి ఇదొక హితోపదేశం, కారుణ్యప్రదాయిని. (111)