కురాన్ భావామృతం/అల్-కహఫ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

18. కహఫ్‌ (మహాబిలం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 110)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
సమస్త ప్రశంసలు దేవునికే శోభిస్తాయి. ఆయనే తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈ గ్రంథంలో ఆయన ఎలాంటి వక్ర విషయాలు ఉంచలేదు. ఇందులో అన్ని విషయాలు సవ్యంగా, సమంజసంగా, సహేతుకంగానే ఉన్నాయి. ఇది దేవుడు విధించే కఠినాతి కఠిన శిక్ష గురించి ప్రజలను హెచ్చరిస్తోంది. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి (స్వర్గం రూపంలో) మంచి ప్రతిఫలం లభిస్తుందని, అందులో వారు కలకాలం సుఖసంతోషాలతో ఉంటారని శుభవార్త (కూడా) తెలియజేస్తోంది. ఇదే దీని అవతరణ ఉద్దేశ్యం. (1-3)
దేవునికి సంతానం ఉందని చెప్పేవారిని ఇది హెచ్చరిస్తోంది. దాన్నిగురించి వారికి గాని, వారి పూర్వీకులకుగాని వాస్తవం ఏమిటో తెలియదు. వారి నోట వెలువడుతున్న ఈమాట చాలా తీవ్రమైన విషయం. వారు పచ్చిఅబద్ధాలు పేలుతున్నారు. (4-5)
ప్రవక్తా! వారీ గ్రంథాన్ని నమ్మకపోతే, నీవు వారి వెంటబడి పుట్టెడు దుఃఖంతో ప్రాణం పోగొట్టుకునేలా ఉన్నావు. ప్రజల్లో ఎవరు సత్కార్యాలు చేస్తూ సదాచార సంప న్నులవుతారో పరీక్షించడానికే, మేము సకల వస్తుసామగ్రితో భూమిని శోభాయమానంగా తీర్చిదిద్దాము. చివరికి మేము దాన్నంతటినీ బంజరుభూమిగా మార్చివేస్తాం. (6-8)
మహాబిలంవాళ్ళను, శిలాశాసనంవాళ్ళను మా సూచలలో కొన్ని వింత సూచనలని భావిస్తున్నావా నీవు? ఆ యువకులు ఆశ్రయం పొందడానికి ఒక గుహలో ప్రవేశించి “ప్రభూ! మాపై నీ విశేష కారుణ్యం వర్షింపజెయ్యి. మా వ్యవహారం చక్కబెట్టు” అని ప్రార్థించారు. అప్పుడు మేమా యువకుల్ని ఆగుహలో పరుండబెట్టి సంవత్సరాల తరబడి ప్రగాఢ నిద్రావస్థలో ఉంచాము. ఆ తరువాత వారిలో ఎవరు తమ నిద్రావస్థ కాలాన్ని కచ్చితంగా లెక్కగడ్తారో తెలుసుకోవడానికి మేము వారిని లేపాము. (9-12)
మేము వారి అసలు గాధ తెలియజేస్తున్నాము: వారు కొందరు యువకులు. ఆ యువకులు తమ ప్రభువును విశ్వసించారు. మేము వారి మార్గం సుగమం చేశాం. వారు లేచి నిలబడి “భూమ్యాకాశాల ప్రభువే మా ప్రభువు. ఆయన్ని వదలి మేము మరే దైవాన్నీ ప్రార్థించము. ఒకవేళ మేమలా చేస్తే అది చాలా బుద్ధిహీనమయిన పని అవుతుంది” అని ప్రకటించారు. అప్పుడు మేము వారికి మరింత మనోబలం, (దృఢ విశ్వాసం) ప్రసాదించాము. (13-14)
(తరువాత వారిలా మాట్లాడుకున్నారు:) “మనజాతి ప్రజలు విశ్వప్రభువుని వదలి ఇతరులను ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. అవి నిజంగా ఆరాధ్యదైవాలైతే అందుకు వారు సరైన ప్రమాణం ఎందుకు చూపరు? దేవుని మీద అబద్ధాలు మోపేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా? (15)
సరే, మనమిప్పుడు వారితో, దేవుడ్ని కాదని వారు పూజిస్తున్న మిధ్యాదైవాలతో సంబంధాలు తెంచివేసుకున్నాం. (ఇక ఇక్కడుండటం మనకు మంచిది కాదు) పదండి, ఏదైనా గుహలోకి వెళ్ళి దాక్కుందాం. మన ప్రభువు మనపై తన కారుణ్యఛాయను విస్తృతం చేస్తాడు. మన పనులకు కావలసిన సౌలభ్యాలు సమకూర్చుతాడు.” (16)
ప్రవక్తా! నీవు గనక ఆ గుహలో ఆ యువకుల్ని చూస్తే ఆ దృశ్యం నీకీ విధంగా కన్పిస్తుంది: సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అతను వారి గుహ (ముఖద్వారం) వదలి కుడి వైపుగా పైకి ఎక్కిపోతాడు. అస్తమిస్తున్నప్పుడు వారిని తప్పించి ఎడమ వైపుగా క్రిందికి దిగిపోతాడు. (ఈవిధంగా ఆ గుహలోకి సూర్యకిరణాలు చొచ్చుకురాకుండా ఎల్లప్పుడూ చీకటిగానే ఉండేది.) వారా గుహలో ఒక సువిశాల స్థలంలో పడిఉన్నారు. ఇది దేవుని సూచనల్లో ఒక సూచన. దేవుడు ఎవరికి దారి చూపగోరుతాడో అతనే దారిలోకి వస్తాడు; ఎవరిని దారి తప్పించదలచుకుంటాడో అతనికి ఏ మార్గదర్శీ, కార్యసాధకుడూ లభించడు. (17)
నీవు వారిని చూసి మేల్కొనివున్నారని భావిస్తావు. కాని వారు నిద్రపోతున్నారు. మేము వారిని కుడిప్రక్కకు, ఎడమప్రక్కకు తిరుగుతూ పడుకునేలా చేశాం. వారి కుక్క గుహ ముఖద్వారంలో ముందుకాళ్ళు చాచి కూర్చున్నది. నీవు గనక కాస్త ఆ గుహలోకి తొంగి చూశావంటే చాలు, గిర్రున వెనక్కి తిరిగి పరుగు లంకించుకుంటావు. అక్కడి భయంకర దృశ్యానికి నీ గుండెలు ఠారెత్తిపోతాయి. (18)
వారు పరస్పరం (తమ పరిస్థితిని గురించి) చర్చించుకోవడానికి మేము వారిని తిరిగి అదేవిధంగా లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకడు “మనం ఈ స్థితిలో ఎంత సేపు ఉన్నాం?” అని అడిగాడు. దానికి రెండోవాడు “బహుశా (మనమీ స్థితిలో) ఒక రోజో లేక అంతకంటే కొంచెం తక్కువ సేపో ఉండివుంటాం” అన్నాడు.
ఆ తరువాత వారిలో కొందరిలా అన్నారు: “మనమీ స్థితిలో ఎంతసేపు ఉన్నామో దేవునికే బాగా తెలుసు. సరే, ఇప్పుడు మనలో ఒకనికి ఒక వెండినాణెం ఇచ్చి నగరం లోకి పంపుదాం. అతను మనకు మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందో చూసి తెస్తాడు. అయితే అతను జాగ్రత్తగా మసలుకోవాలి. మనం ఇక్కడ ఉన్నట్లు అతని అజాగ్రత్త వల్ల ఎవరికైనా తెలిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. విధివశాత్తు మనం వారి చేతుల్లో పడితే మాత్రం వారు మనల్ని (ఎట్టి పరిస్థితిలోనూ) వదలరు. రాళ్ళతో కొట్టి చంపేస్తారు. లేదా బలవంతంగా మనల్ని తమ మతంలోకి లాక్కుంటారు. అలా జరిగితే మనమిక ఎన్నటికీ మోక్షం పొందలేము.” (19-20)
ఇలా మేము వారి పరిస్థితి గురించి నగరవాసులకు తెలియజేశాం. దేవుని వాగ్దా నం నిజమైనదని, ప్రళయం తప్పక వస్తుందని ప్రజలు తెలుసుకోవడానికే ఇలా చేశాం. (అయితే ఈ విషయం విస్మరించి) వారా సమయంలో గుహవాసుల విషయమై ఎలా వ్యవహరించాలన్న మాటపై వాదులాడుకోసాగారు. వారిలో (దైవధర్మం పట్ల సరైన అవగాహన కలిగిన) కొందరు “వారి (గుహ)మీద (స్మారక చిహ్నంగా) ఒక గోడ కట్టండి. వారి వ్యవహారం గురించి వారి ప్రభువుకే బాగా తెలుసు” అన్నారు. అయితే వారి వ్యవ హారంపై అధికారం కలిగివున్నవారు (అంటే ప్రభుత్వాధికారులు, క్రైస్తవ మతనాయకులు) “మేము వారిపై ప్రార్థనా మందిరం నిర్మిస్తాం” అన్నారు. (21)
(కొంతకాలానికి యువకుల సంఖ్య, వారి నిద్రావస్థకాలం గురించి ప్రజల్లో భిన్నా భిప్రాయాలు ఏర్పడ్డాయి.) కొందరు “వారు ముగ్గురు, నాలుగోది వారి కుక్క” అన్నారు. మరికొందరు “వారు అయిదుగురు, ఆరవది వారి కుక్క” అన్నారు. ఇంకా కొందరు “వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క” అన్నారు. ఇవన్నీ వారి ఊహాగానాలు, వ్యర్థ ప్రేలాపనలు మాత్రమే. “వారెంతమందో నా ప్రభువుకే బాగా తెలుసు” అని చెప్పు
వారి కచ్చితమైన సంఖ్యను గురించి చాలా తక్కువమందికే తెలుసు. కనుక నీవు ముక్తసరిగా సమాధానం ఇవ్వడం తప్ప వారి సంఖ్యను గురించి ప్రజలతో వాదించకు. దాన్ని గురించి ఇతరుల్ని అడగటానిక్కూడా ప్రయత్నించకు. (22)
ఒకటి గుర్తుంచుకో. ఏవిషయం గురించైనా ‘నేనీ పని రేపు చేస్తాను’ అని అనకు. దేవుడు తలిస్తే తప్ప (నీవేమీ చేయలేవు). ఒకవేళ మరచిపోయి ఇలాంటి మాట నీనోట వెలువడితే వెంటనే నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ‘ఈ విషయంలో నా ప్రభువు ఇంత కంటే దగ్గరిమాట వైపు నాకు దారిచూపుతాడని ఆశిస్తున్నాన’ని చెప్పు. (23-24)
(నిద్రావస్థ కాలం గురించి కొందరు) “గుహలో వారు మూడొందల సంవత్సరాలు ఉన్నారు” (అన్నారు. మరికొందరు ఈసంఖ్యలో) తొమ్మిదేండ్లు (ముందుకు పోయారు). “వారెంత కాలం (ఆ స్థితిలో) ఉన్నారో దేవునికే బాగాతెలుసు” అని చెప్పు.
భూమ్యాకాశాల్లోని రహస్యాలన్నీ ఆయనకే తెలుసు. ఆ చూసేవాడు, వినేవాడు ఎంత అద్భుత శక్తిసంపన్నుడు! యావత్తువిశ్వంలో ఆయన తప్ప వారికి మరో రక్షకుడు, సహాయకుడూ లేడు. ఆయన తన రాజ్యాధికారంలో ఇతరులకెవరికీ భాగస్వామ్యం కల్పించడు. (25-26)
ముహమ్మద్‌ (స)! నీప్రభువు గ్రంథం నుంచి నీపై అవతరించిన విషయాలన్నిటినీ యథాతథంగా (ప్రజలకు) విన్పించు. అందులో ఏదైనా మార్చడానికి ఎవరికీ అధికారం లేదు. (ఒకవేళ ఎవరి కోసమైనా ఏదైనా మార్చడానికి సాహసిస్తే గుర్తుంచుకో,) నీప్రభువు బారినుండి తప్పించుకోవడానికి నీకు ఎక్కడా ఎలాంటి ఆశ్రయం లభించదు. (27)
నీ ప్రభువు ప్రసన్నతాభాగ్యం ఆశిస్తూ ఉదయం, సాయంత్రం ఆయన్ని వేడుకునే వారితో కలసిమెలసి ఉండు. వారి వైపునుండి ఎన్నటికీ దృష్టి మరల్చుకోకు. నీవు ప్రాపంచిక వైభవం కోరుకుంటున్నావా? (ఇహలోకంలోని తళుకు బెళుకులన్నీ మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. కనుక) మేము మాజ్ఞాపకాన్ని విస్మరింపజేసి (ప్రాపంచికవ్యామోహానికి గురిచేసి)న వ్యక్తిని నీవు ఎన్నటికీ విధేయించకు. (అతని ఆజ్ఞలు పాటించకు.) అతను మనోవాంఛలకు బానిసయి విశృంఖల జీవితానికి అలవాటుపడ్డాడు. (28)
వారికిలా చెప్పు: ఇది మీ ప్రభువు దగ్గర్నుండి వచ్చిన పరమసత్యం. దీన్ని ఇష్టమైన వారు విశ్వసించవచ్చు, ఇష్టంలేనివారు తిరస్కరించవచ్చు. (మీకా స్వేచ్ఛ ఉంది.)
అయితే (సత్యాన్ని తిరస్కరించే) దుర్మార్గుల కోసం మేము నరకాగ్ని సిద్ధపరచి ఉంచాము. భయంకరమైన దాని జ్వాలలు వారిని చుట్టుముట్టి దహించివేస్తాయి. వారక్కడ త్రాగడానికి నీళ్ళు అడిగినప్పుడల్లా సలసలకాగే చమురు తెట్టు లాంటి నీటితో వారికి ఆతిథ్యం ఇవ్వబడుతుంది. అది వారి ముఖాలను తీవ్రంగా మాడ్చివేస్తుంది. అత్యంత హేయమైన నీరది! మహాచెడ్డ విశ్రాంతి స్థలమది!! (29)
ఇక సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారి విషయానికొస్తే, అలాంటి సదా చారసంపన్నులకు లభించవలసిన ప్రతిఫలాన్ని మేము ఎన్నటికీ వృధాచేయం. వారికోసం సెలయేరులు పారే నిత్యహరిత స్వర్గవనాలున్నాయి. వారికక్కడ బంగారపు మురుగు లతో ముస్తాబు చేస్తారు. వారు బంగారు జరీతో కూడిన పచ్చటి పట్టువస్త్రాలు ధరిస్తారు. అద్భుతమైన ఉన్నతాసనాలపై మెత్తటి దిండ్లకు ఆనుకొని కూర్చుంటారు. ఎంత మంచి ప్రతిఫలం అది! అత్యున్నత శ్రేణికి చెందిన నివాసస్థలమది!! (30-31)
వారికి ఇద్దరువ్యక్తుల ఉపమానం విన్పించు. వారిలో ఒకనికి మేము రెండు ద్రాక్ష తోటలు ఇచ్చాం. వాటిచుట్టు ఖర్జూరపు చెట్లను కంచెలా పెట్టాం. మధ్యలో సేద్యభూమి ఉంచాం. రెండుతోటలు పుష్కలంగా పండాయి. ఫలోత్పాదనలో మేము ఏ కొరతా చేయలేదు. ఆ తోటలో ఓ కాలువ కూడా ఉంచాం. (ఆ ఏడు) అతనికి మంచి లాభం వచ్చింది. దాంతో అతను (గర్వంతో) ఓరోజు తన పొరుగింటి మిత్రునితో “నేను నీకంటే పెద్ద ధనికుడ్ని. నీకంటే ఎక్కువ మందీమార్బలం గలవాడ్ని” అన్నాడు. (32-34)
ఆ తర్వాత అతను తన తోటలో ప్రవేశించి, ఆత్మవంచితుడై “ఈ సిరిసంపదలు ఇక నాశనమవుతాయని నేను అనుకోను. (జనం ఏదో ప్రళయం గిళయం అంటున్నారు గాని) నాకు మాత్రం ప్రళయమ్మీద నమ్మకం లేదు. ఒకవేళ నేను నాప్రభువు దగ్గరికి పంపబడినా, అక్కడ నాకు ఇంతకంటే గొప్పస్థానం లభిస్తుంది”అని అన్నాడు. (35-36)
అతని పొరుగింటి స్నేహితుడు అతనితో ఇలా అన్నాడు: “ఏవిటీ, నిన్ను మట్టితో నీచమైన బిందువుతో పుట్టించి పరిపూర్ణ మానవునిగా రూపొందించిన శక్తిస్వరూపుడ్నే తిరస్కరిస్తున్నావా? నా విషయానికి వస్తే, నేను మాత్రం దేవుడ్నే నా ప్రభువుగా స్వీక రించాను. ఆయన దైవత్వంలో మరెవరికీ భాగస్వామ్యం కల్పించను. (37-38)
నీవు నీతోటలో ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు తలచినదే అవుతుందని; దేవునికి తప్ప మరెవరికీ ఎలాంటి శక్తిలేదని ఎందుకనలేదు? సంతానం సిరిసంపదల విషయంలో నీవు నన్ను నీకంటే తక్కువవాణ్ణని భావిస్తుంటే భావించు. నాప్రభువు నాకు నీ తోటకంటే శ్రేష్ఠమైన తోట ప్రసాదించవచ్చు. అటు నీ తోటపైకి ఆకాశంనుండి ఏదైనా విపత్తు పంప వచ్చు. దాంతో అది తుడిచిపెట్టుకుపోయి ఉత్తమైదానంగా మారవచ్చు. లేదా ఆ తోట లోని నీరంతా భూమిలోకి ఇంకిపోవచ్చు. ఇక దాన్ని తీయడం నీతరం కాకపోవచ్చు.”#
చివరికి (అతనన్నట్లే జరిగింది.) అతని పండ్లతోటపై విపత్తు వచ్చిపడి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. అతను తన పెట్టుబడి అంతా వృధా అయిపోయినందుకు చేతులు నులుపుకుంటూ “అయ్యయ్యో! నేను నా ప్రభువుకు సాటి కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది!” అని బాధపడ్డాడు. (39-42)
అప్పుడు దేవునికి వ్యతిరేకంగా అతడ్ని ఏ మందీమార్బలం ఆదుకోలేక పోయింది. తనంతటతాను కూడా అతను కాపాడుకోలేకపోయాడు. అప్పుడు తెలిసిందతనికి పనులు నెరవేర్చే శక్తి, అధికారం సత్యస్వరూపుడైన దేవునికే ఉన్నాయని; ఆయన ప్రసాదించే బహుమానమే మేలైనదని; ఆయన చూపే పర్యవసానమే శ్రేష్ఠమైనదని. (43-44)
ప్రవక్తా! మరో ఉదాహరణ ద్వారా వారికి ప్రపంచజీవితం గురించి చెప్పు. ఈరోజు మేము ఆకాశం నుండి వర్షం కురిపిస్తుంటే భూమి సస్యశామలమవుతుంది. రేపు ఈ చెట్లు, చేమలే నుగ్గునుగ్గయి గాలికి ఎగిరిపోతాయి. దేవునికి అణువణువుపై అధికార ముంది. ఈ సంతానం, సిరిసంపదలు ప్రాపంచిక జీవితపు పైపై మెరుగులు మాత్రమే. నీప్రభువు దృష్టిలో ఫలితంరీత్యా ఎంతో శ్రేష్ఠమైనవి, శాశ్వతంగా ఉండేవి సత్కార్యాలు మాత్రమే. వాటి ద్వారానే మేలు ఆశించడానికి ఆస్కారముంది. (45-46)
కనుక మేము పర్వతాలను పెకలించి నడిపించే దినం గురించి మీరు యోచిం చాలి. ఆ రోజు భూమి చదునైన మైదానంగా మారిపోవడం నీకు కన్పిస్తుంది. మేము యావత్తు మానవుల్ని చుట్టుముట్టి (ఓచోట) సమీకరిస్తాం. ఒక్కడ్నీ వదలిపెట్టము. అందర్నీ వరుసలు తీర్చి నీ ప్రభువు సమక్షంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది.
ఇక చూడండి, వచ్చేశారుగా మా దగ్గరకు మీరు! మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా పుట్టించామో అలాగే మీరు (బ్రతికించబడి) మా దగ్గరకు వచ్చారు. మేము మీ (కర్మవిచారణ)కు ఎలాంటి సమయం నిర్ణయించలేదని భావిస్తుండేవారు. (47-48)
కర్మపత్రాలు తీసి ముందుంచబడతాయి. అప్పుడు నీవు పాపాత్ముల పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తావు. వారా కర్మపత్రాల్లోని విషయాలు చూసుకొని భయపడుతుంటారు. (చేసిన అకృత్యాలకు ఎంతో బాధపడిపోతూ) “అయ్యయ్యో, ఎంతటి దౌర్భాగ్యం దాపు రించింది! ఈ కర్మలచిట్టా ఏమిటోగాని, మేము చేసిన చిన్నాపెద్దా కర్మల్లో ఒక్కటీ ఇందులో రాయకుండా వదలిపెట్టలేదే!!” అనంటారు. వారు తమ కర్మలన్నిటినీ ప్రత్య క్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయడు. (49)
మేము (తొలిమానవుడు) ఆదంకు గౌరవసూచకంగా అభివాదం చేయమని దైవ దూతల్ని ఆదేశించినప్పుడు అందరూ అభివాదం చేశారు. కాని ఇబ్లీస్‌ మాత్రం చేయ లేదు. వాడు జిన్నుల జాతికి చెందినవాడు. అంచేత వాడు తన ప్రభువాజ్ఞను జవదాటి పోయాడు. అలాంటప్పుడు మీరు నన్ను వదలి వాడ్ని, వాడి సంతతిని సంరక్షకులుగా ఎలా చేసుకుంటారు? వారు మీకు విరోధులు కదా? దుర్మార్గులు అనుసరిస్తున్న ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంతో హేయమైనది! (50)
నేను భూమ్యాకాశాలు సృష్టిస్తున్నప్పుడు వారిని పిలువలేదు. వారిని సృష్టించే కార్యంలో కూడా వారి పాత్రను తీసుకోలేదు. అపమార్గం పట్టించేవారిని సహాయకులుగా తీసుకోవడం నా పనికాదు. “నాదైవత్వంలో భాగస్థులని మీరు భావించిన మిధ్యాదైవాల్ని మొరపెట్టుకోండ”ని వారి ప్రభువు అంటాడు. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారా మిధ్యాదైవాల్ని మొరపెట్టుకుంటారు. కాని ఆ దైవాలేవీ వారికి సహాయం చేయడా నికి రావు. మేము వారి వినాశం కోసం ఒకే ఒక ఉమ్మడి గొయ్యి ఏర్పాటు చేస్తాము. పాపాత్ములంతా ఆరోజు నరకాగ్నిని చూస్తూ, తామిక ఆ గొయ్యిలో పడక తప్పదని భావిస్తారు. దాన్నుండి తప్పించుకునే దారేదీ వారికి కన్పించదు. (51-53)
మేమీ ఖుర్‌ఆన్‌లో ప్రజలకు అనేక నిదర్శనాలు చూపుతూ రకరకాలుగా నచ్చజెప్పి చూశాం. కాని ఈ మానవుడు జగడాలమారిగా తయారయ్యాడు. వారి ముందుకు హిత బోధ వచ్చినప్పుడు దాన్ని నమ్మకుండా, తమ ప్రభువు సన్నిధిలో క్షమాపణ కోరుకో కుండా వారిని ఏ విషయం నిరోధించింది? వారసలు గత జాతులకు ఏగతి పట్టిందో ఆగతి తమకూ పట్టాలని ఎదురుచూస్తున్నారు. ఈ విషయమే వారిని నిరోధించింది. లేక ఏదైనా ఆపద తమపై వచ్చిపడితేగాని వారు విశ్వసించేటట్లు లేదు! (54-55)
మేము ఏప్రవక్తను పంపినా (స్వర్గ)శుభవార్తలు విన్పించడానికి, (నరకయాతనల్ని గురించి) హెచ్చరించడానికి మాత్రమే పంపుతాము. అది తప్ప మరే లక్ష్యం కోసం పంపము. కాని సత్యతిరస్కారులు ఎల్లప్పుడూ అధర్మం, అసత్యవాదనలతో సత్యాన్ని పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తున్నారు. వారు నా సూక్తులను, వారికి నేను చేస్తున్న హెచ్చరికలను పరిహాస విషయాలుగా చేసుకున్నారు. (56)
దేవుని సూక్తులు విన్పించి నచ్చజెప్పినా వాటిని పెడచెవిన పెట్టి, చేజేతులా చేసుకున్న (దుష్‌)కర్మల పర్యవసానం విస్మరించే వాడికంటే పరమ దుర్మార్గుడు మరెవ రుంటారు? ఆ దుర్మార్గుల హృదయ కవాటాలను మేము మూసివేశాము. దాంతో వారు ఖుర్‌ఆన్‌కు సంబంధించిన ఏవిషయాన్నీ అర్థం చేసుకోలేరు. అంతేకాదు, వారి చెవులకు మేము చెవుడు కల్పించాము. కనుక నీవు వారిని సన్మార్గం వైపు ఎంత పిలిచినా వారా స్థితిలో ఎన్నటికీ సన్మార్గం పొందలేరు. (57)
నీ ప్రభువు ఎంతో క్షమాగుణం కలవాడు. ఆయన వారి అకృత్యాలకు వారిని వెంటనే పట్టదలచుకుంటే శిక్ష(ఆపద) పంపేవాడు. కాని వారికోసం ఒక నిర్ణీతసమయం ఉంది. ఆ సమయం వస్తే ఆయనశిక్ష నుండి తప్పించుకునే దారేదీ వారికి లభించదు#
ఈ శిక్షకు గురయి (సర్వనాశనమై)న జనపదాలు (మీరు ప్రయాణించే దారిలోనే ఉన్నాయి). వారు అన్యాయం, అక్రమాలకు పాల్పడినందువల్లనే వారిని మేము నాశనం చేశాం. వారి వినాశం కోసం ఒక సమయం నిర్ణయించాము. (58-59)
(వారికి మూసా గాధ విన్పించు.) అప్పుడు మూసా తన సేవకునితో “రెండు నదుల సంగమానికి చేరుకోనంత వరకూ నేనీ ప్రయాణం ముగించను. అప్పటిదాకా నేను ఓ సుదీర్ఘకాలం పాటు ఇలా నడుస్తూనే ఉంటాను” అన్నాడు. చివరికి వారు ఆ నదీ సంగమానికి చేరుకున్నారు. అయితే వారు తమ చేప సంగతి మరచిపోయారు. అది (వారి దగ్గర్నుంచి) జారి నదిలో ఈదుకుంటూ పారిపోయింది. (60-61)
మూసా అక్కడ్నుంచి ముందుకు కొద్దిదూరం నడిచాక తన సేవకునితో “ఇక తీసుకురా మా భోజనం. మేమీ ప్రయాణంలో చాలా అలసిపోయాం” అన్నాడు. (62)
అప్పుడు సేవకుడు (ఇలా అన్నాడు:) “అది సరేగాని, అసలు ఏం జరిగిందో చూశారా? మనం ఆ చట్టుబండ దగ్గర కూర్చున్నామా...అప్పుడు నాకు చేప సంగతే గుర్తుకు రాలేదు. షైతాన్‌ నన్ను ఏమరుపాటుకు గురిచేశాడు. నేనా సంగతి మీకు చెప్పడం మరచిపోయాను. చేప భలే విచిత్రంగా నదిలోకి దూకి పారిపోయింది.” (63)
మూసా (ఈమాట విని) “(అయ్యయ్యో!) దాన్ని గురించే కదరా బాబూ! నా అన్వేషణ, (పదపద)” అన్నాడు. అలా వారిద్దరు తమ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెనక్కి వెళ్ళారు. అక్కడ మా దాసులలో ఒక (ప్రత్యేక)దాసుడ్ని చూశారు. మేమా దాసునికి మా కారుణ్యభాగ్యం ప్రసాదించాము. మా దగ్గర నుండి విశేష జ్ఞానం నేర్పాము. మూసా అతనితో “మీకు (దేవుడు) నేర్పిన దివ్యజ్ఞానం నాక్కూడా నేర్పుతారా? దాని కోసం నేను మీదగ్గర శిష్యరికం చేయవచ్చా?” అని అడిగాడు. (64-66)
దానికి ఆ దాసుడు “మీరు నాదగ్గర సహనంగా ఉండలేరు. అయినా మీకు తెలియని విషయాల్ని గురించి మీరెలా సహనం వహించగలరు?” అన్నాడు. (67-68)
“దైవచిత్తమయితే మీరు నన్ను సహనశీలిగా చూడగలరు. నేను ఏ విషయంలోనూ మీకు వ్యతిరేకంగా వ్యవహరించను” అన్నాడు మూసా. (69)
“సరే, మీరు నావెంట రాదలచుకుంటే ఏ విషయమైనా నేను మీకు చెప్పనంత వరకు దాన్ని గురించి మీరు నన్నడగ వద్దు” అన్నాడు ఆ దాసుడు. (70)
(ఇలా మాట్లాడుకున్న తరువాత) వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరారు. (కొంత దూరం నడిచి) చివరికి ఒక పడవ ఎక్కారు. (కాస్సేపటికి) అతను పడవలో అడుగున రంధ్రం వేశాడు. అది చూసి మూసా “ఏమిటీ మీరు ఇందులో రంధ్రం వేశారు? పడవ లోని వారందర్నీ ముంచదలిచారా? చాలాఘోరమైన పని చేశారు” అన్నాడు. (71)
“నేను చెప్పలేదా, నీవు నాతోపాటు సహనంగా ఉండలేవని” అన్నాడతను. (72)
“మరచిపోయాను. మతిమరుపు గురించి నన్ను పట్టుకోకండి. (దయచేసి) నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి” అన్నాడు మూసా (73)
వాళ్ళిద్దరు తిరిగి ప్రయాణం సాగించారు. కొంతదూరం పోయాక వారికొక అబ్బాయి కన్పించాడు. అప్పుడావ్యక్తి (ముందుకుపోయి) ఆ పిల్లవాడ్ని హతమార్చివేశాడు.
“మీరు ఏపాపం ఎరగని ఒక అమాయకుడ్ని దారుణంగా చంపేశారు! పాపం అతను ఎవర్నీ హత్య చేయలేదే!! మీరు చాలా చెడ్డపని చేశారు”అన్నాడు మూసా. (74)
“నేను చెప్పలేదూ నీవు నాతోపాటు సహనంగా ఉండలేవని?” అన్నాడతను. (75)
“(పొరపాటయింది.) ఇకముందు నేనేదైనా మీకు ఎదురుచెప్తే నన్ను మీతోపాటు ఉంచకండి. ఇప్పుడు మాత్రం నావైపున మీకు సాకు దొరికింది” అన్నాడు మూసా. (76)
అక్కడ్నుంచి వారు ముందుకుసాగి ఓ ఊరికి చేరుకున్నారు. ఆ ఊరిప్రజల్ని భోజనంపెట్టమని అడిగారు. కాని వారు వారిద్దరికి ఆతిథ్యమివ్వడానికి నిరాకరించారు.
తరువాత వారా ఊళ్ళో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక గోడ చూశారు. అప్పుడా వ్యక్తి వెంటనే ఆ గోడకు మరమ్మత్తు చేశాడు. మూసా (ఉండబట్టలేక) “మీరు కావాలను కుంటే ఈ పనికి ప్రతిఫలం అడిగి తీసుకోవచ్చు కదా?” అన్నాడు. (77)
ఇకచాలు, నాతో నీ శిష్యరికం ముగిసింది. ఇప్పుడు నీవు సహనం వహించలేక పోయిన వ్యవహారాలను గురించి వాస్తవం ఏమిటో చెబుతా విను: (78)
పడవ సంగతి: ఆ పడవ కొందరు పేదవాళ్ళది. వారు జీవనోపాధి కోసం నదిలో ఆ పడవ నడుపుకుంటున్నారు. నది ఆవల బలవంతంగా పడవలను స్వాధీనం చేసు కునే ఒక రాజున్నాడు. (అతను మంచి పడవలను మాత్రమే స్వాధీనం చేసుకుంటాడు.) అందువల్ల నేనా పడవకు ఏదైనా లోపం కలిగించాలనుకున్నాను. (79)
పోతే బాలుడి సంగతి. ఆబాలుడి తల్లిదండ్రులు విశ్వాసులైన దైవభక్తులు. అయితే ఆ బాలుడు (పెద్దవాడయి) తన తిరస్కారం, తలబిరుసుతనాలతో వారిని వేధిస్తాడని మేము భయపడ్డాం. అంచేత వారి ప్రభువు గుణగణాలలో, దయాభిమానలలో ఆ బాలుడి కన్నా మంచి సంతానం వారికి ప్రసాదించాలని మేము కోరుకున్నాం. (80-81)
ఇక గోడ వ్యవహారం గురించి చెప్పాలంటే, ఆగోడ ఆఊళ్ళో వుండే ఇద్దరు అనాథ బాలలది. దాని క్రింద ఆ పిల్లల కోసం ఒక నిధి పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి చాలా పుణ్యాత్ముడు. అందువల్ల ఈ పిల్లలిద్దరూ పెద్దవారయిన తరువాత ఆ గోడ క్రింద ఉన్న తమ నిధిని తీసుకోవాలని నీ ప్రభువు నిర్ణయించాడు.
ఇదంతా నీ ప్రభువు కారుణ్యకటాక్షాల ఫలితమేగాని, నాఅంతట నేనేదీ చేయలేదు. నీవు సహించలేకపోయిన విషయాల వెనక ఉన్న మర్మహేతువు ఇదే.” (82)
ముహమ్మద్‌ (సల్లం)! వారు నిన్ను ‘జుల్ఖర్‌నైన్‌’ గురించి అడుగుతున్నారు. వారికి చెప్పు: “నేను వారి వృత్తాంతం గురించి కాస్త చెబుతాన”ని. (83)
మేమతనికి ప్రపంచంలో రాజ్యాధికారమిచ్చాం. అన్నిరకాల ఒనరులు, సాధన సంపత్తులు అనుగ్రహించాం. అతను (మొదట పశ్చిమదేశాల పర్యటన కోసం) ప్రయాణ సామగ్రి ఏర్పాటు చేసుకున్నాడు. (ప్రయాణంచేస్తూ) సూర్యాస్తమయమయ్యే హద్దుకు చేరుకొని సూర్యుడు బురదనీటిలో అస్తమించడం చూశాడు. అతనికక్కడ ఒక జాతి కన్పించింది. అప్పుడు మేమతనితో “జుల్ఖర్‌నైన్‌! నీవు వారికి బాధ కల్గించనూవచ్చు; మేలు చేకూర్చనూవచ్చు. అంతా నీఇష్టం” అన్నాం.
దానికి జుల్ఖర్‌నైన్‌ “వారిలో దౌర్జన్యానికి పాల్పడినవాడ్ని నేను శిక్షిస్తా. తర్వాత అతను తన ప్రభువు వైపు మరలించబడినప్పుడు అతడ్ని ఆయన మరింత కఠినంగా శిక్షిస్తాడు. వారిలో సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. నేనతని పట్ల మృదువుగా వ్యవహరిస్తాను” అని అన్నాడు. (84-88)
తర్వాత అతను (మరోదిక్కు పర్యటనకు) సిద్ధమయ్యాడు. అతను (ప్రయాణం చేస్తూ) సూర్యోదయమయ్యే హద్దుకు చేరుకున్నాడు. అక్కడ ఓ జాతిని చూశాడు. ఆ జాతిపై సూర్యుడు ఉదయిస్తుంటే అది ఎండనుండి కాపాడుకోవడానికి మేమెలాంటి సౌకర్యం కల్పించలేదు. ఇదీ వారి పరిస్థితి. జుల్ఖర్‌నైన్‌ విషయాలన్నీ మాకు తెలుసు. ఆతర్వాత అతను (వేరొకదిక్కు పర్యటనకు) సమాయత్తమయ్యాడు. అతను (ప్రయాణం చేస్తూ) చివరికి రెండుకొండల మధ్యకు చేరుకున్నాడు. అక్కడ అతనికొక జాతి కన్పిం చింది. ఆ జాతిప్రజలు అతి కష్టంమీద (అతని) మాట గ్రహిస్తారు. (89-93)
వారతనితో “జుల్ఖర్‌నైన్‌! ఈ భూభాగంపై యాజూజ్‌, మాజూజ్‌ (అనే ఆటవిక జాతు)లు విధ్వంసకాండ సాగిస్తున్నాయి. మరి నీవు మాకు, వారికి మధ్య ఒక అడ్డుగోడ నిర్మించగలవా? అందుకు మేమేదైనా నీకు పన్ను చెల్లించాలా?” అని అన్నారు. (94)
దానికతను సమాధానమిస్తూ “నాకు నాప్రభువు ఇచ్చిన (సంప)దే ఎంతో ఉంది. మీరు శారీరకశ్రమతో నాకు సహాయపడండి చాలు. నేను మీకూ వారికీ మధ్య అడ్డుగోడ నిర్మిస్తాను. నాక్కాస్త ఉక్కు పలకలు తెచ్చిపెట్టండి” అని అన్నాడు.
(గోడనిర్మాణం ప్రారంభమై శరవేగంతో సాగిపోతోంది.) అతను రెండుకొండల మధ్య ఉన్న ఖాళీస్థలాన్ని పూరించాడు. అప్పుడు కొందరు అగ్ని రాజెయ్యండని అన్నారు. చివరికి (ఉక్కుగోడ) అగ్నిగోళంలా ఎర్రగా మారిపోయింది. అప్పుడు జుల్ఖర్‌నైన్‌ “దీనిపై నేనిప్పుడు కరిగిన రాగి కుమ్మరిస్తా తీసుకురండి” అన్నాడు. (95-96)
(ఇలా గోడనిర్మాణం పూర్తయింది) దాంతో వారికి ఆగోడ ఎక్కివచ్చే శక్తి లేకుండా పోయింది. దానికి కన్నం వేయడం కూడా సాధ్యంకాదు. (అప్పుడు) జుల్ఖర్‌నైన్‌ ఇలా అన్నాడు: “ఇది నాప్రభువు అనుగ్రహం. అయితే నాప్రభువు వాగ్దానం నెరవేరే సమయం వచ్చినప్పుడు ఆయన దీన్ని నేలమట్టం చేస్తాడు. నాప్రభువు వాగ్దానం నిజమైనది.#
ఆరోజు మేము జనాన్ని వదలిపెడ్తాం. వారు (సముద్ర కెరటాల్లా) ఒకరిమీద ఒకరు పడిపోతారు. (తీవ్రమైన తొక్కిసలాట ఏర్పడుతుంది.) శంఖం పూరించబడుతుంది. మేము మానవులందరినీ సమావేశపరుస్తాం. ఆరోజు మేము నరకాన్ని సత్యతిరస్కారుల ముందు తెచ్చిపెడ్తాం. వారు (ఐహిక జీవితంలో) మా హితబోధ ఖాతరుచేయకుండా అంధులైపోయారు. ఒక్కమాటా వినడానికి సిద్ధపడలేదు. (97-101)
సత్యతిరస్కారులు నన్ను వదలి నా దాసుల్ని తమ రక్షకులుగా చేసుకోవాలని భావిస్తున్నారా? అలాంటి తిరస్కారులకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము నరకాన్ని సిద్ధపరచి ఉంచాము. వారికీ విషయం చెప్పు: “ఆచరణ రీత్యా అందరికంటే ఎక్కువ నష్టపోయే వారెవరో నేను మీకు తెలుపనా? ప్రపంచ జీవితంలో తమ కృషి, శక్తిసామర్థ్యాలన్నీ సన్మార్గం తప్పి వృధా అవుతున్నా సరే, తాము అంతా మంచే చేస్తున్నామని భావించే వారే ఎక్కువ నష్టపోయేవారు. (102-104)
వారే తమ ప్రభువు సూక్తులు విశ్వసించడానికి నిరాకరించినవారు. (ఒక రోజు) తాము ఆయన సన్నిధికి చేరుకోవలసి ఉందన్న విషయాన్ని వారు నమ్మడం లేదు. అందువల్లనే వారి కర్మలన్నీ వ్యర్థమైపోయాయి. ప్రళయదినాన వారికి మేము ఎలాంటి విలువనివ్వము. సత్యం పట్ల వారి తిరస్కారానికి, నా సూక్తులు నా ప్రవక్తలను గురించి వారు చేస్తుండిన పరిహాసం, పరాచికాలకు ప్రతిఫలం నరకమే. (105-106)
పోతే సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారికి ఆతిథ్యంగా అత్యున్నత స్వర్గవనాలు ఉన్నాయి. అక్కడ వారు కలకాలం (హాయిగా) ఉంటారు. ఇక ఎన్నటికీ అక్కడ్నుంచి వేరే చోటికి పోవడానికి వారికి మనస్కరించదు. (107-108)
వారికిలా చెప్పు: “నా ప్రభువు మాటలను వర్ణించడానికి సముద్రంలోని నీరంతా సిరాగా మార్చిరాసినా, ఆ సిరా మొత్తం అయిపోతుందిగాని, నాప్రభువు మాటలు పూర్తి కావు. అంతేకాదు, ఇంకా అంతటి సిరా తెచ్చినా అదీ సరిపోదు.” (109)
వారికీ ఈ విషయం కూడా చెప్పు: “నేను మీలాంటి మానవుడ్నే. కాకపోతే మీ దేవుడు ఒక్కడేనని నా దగ్గరకు సందేశం వస్తుంది. కనుక తమ ప్రభువు దర్శనభాగ్యం ఆశిస్తున్నవారు సత్కార్యాలు చేస్తుండాలి. అదీగాక తమ ప్రభువు ఆరాధనలో ఇతరులకు ఎలాంటి చోటివ్వకూడదు.” (110)