కురాన్ భావామృతం/అల్-ఘాషియా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
88. గాషియా (ముంచుకొస్తున్న ముప్పు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 26)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ముంచుకొస్తున్న ముప్పు సంగతి నీకేమైనా తెలుసా? ఆరోజు కొందరి ముఖాలు అవమానభారంతో చిన్నబోయి ఉంటాయి. వారెంతో శ్రమపడుతుంటారు. అలసిపోతూ ఉంటారు. ఘోరమైన అగ్నికీలల మధ్య మాడిపోతూ ఉంటారు. త్రాగేందుకు వారికి సలసల కాగే నీరు ఇవ్వబడుతుంది. ముండ్లతో కూడిన ఎండుగడ్డి పరకలు తప్ప వారికి ఎలాంటి తిండి దొరకదు. అది వారికి బలమూ ఇవ్వదూ, ఆకలీ తీర్చదూ. (1-7)
(ఆరోజు) మరికొందరి ముఖాలు కళకళలాడుతుంటాయి. వారు తమ కృషి పట్ల సంతోషిస్తూ అద్భుతమైన స్వర్గసీమలో ఉంటారు. అక్కడ ఎలాంటి వ్యర్ధ విషయాలు వినరు. ఆ స్వర్గంలో (చల్లటి)సెలయేరులు ఉంటాయి. ఎత్తయిన ఆసనాలుంటాయి. (వారు త్రాగడానికి) మధుపాత్రలు కూడా పెట్టబడి ఉంటాయి. ఇంకా వరుసలు వరుస లుగా దిండ్లు పేర్చి ఉంటాయి. పట్టుతివాచీలు పరచి ఉంటాయి. (8-16)
వీరు ఒంటెలు ఎలా సృజించబడ్డాయో గమనించలేదా? ఆకాశం ఎలా పైకెత్తబడి ఉందో పరికించలేదా? పర్వతాలు (బలంగా)ఎలా పాతబడి ఉన్నాయో పరిశీలించలేదా? భూమి ఎలా విశాలంగా పరచబడి ఉందో చూడలేదా? (17-20)
ప్రవక్తా! నీవు మటుకు హితబోధ చేస్తూనే ఉండు. నీ పని హితబోధ చేయడమే. గాని, వారిని బలవంతంగా దారికి తెచ్చే బాధ్యత నీపై లేదు. కాని సత్యానికి విముఖుడై దాన్ని నిరాకరించేవాడికి దేవుడు ఘోరశిక్ష విధిస్తాడు. చివరికి వారు మా వద్దకే రావలసి ఉంది. వారిని విచారించి లెక్కతీసుకునే పని మా చేతిలోనే ఉంది. (21-26)