కురాన్ భావామృతం/ముందుమాట
ఖుర్‌ఆన్ అంటే పఠించబడేది, పారాయణం చేయబడేది అని అర్థం.
ఈ భావంలో దీన్ని పఠణగ్రంథం అని కూడా చెప్పవచ్చు. హిందూమత గ్రంథాల్లోని కొన్ని భవిష్యత్ ప్రకటనల్ని పరిశీలిస్తే వాటిలో ప్రస్తావించబడిన పఠణవేదం ఖుర్‌ఆనే అయివుండ వచ్చన్న అనుమానం కూడా కలుగుతుంది.
ఇది దైవదూత జిబ్రీల్ ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (స) హృదయఫలకంపై అవతరించిన చివరి దైవగ్రంథం.
ఇది గత ప్రవక్తలపై అవతరించిన జబూర్ (దావూద్ ప్రవక్త), తౌరాత్ (మూసా ప్రవక్త), ఇంజీల్ (ఈసా ప్రవక్త) తదితర గ్రంథాలను కూడా ఖుర్‌ఆన్ అనే పేర్కొన్నది. అంటే అవి ఆయాకాలాల ప్రజల మార్గదర్శనం కోసం ఆయా ప్రవక్తలపై అవత రించిన ఖుర్‌ఆన్‌లు అన్నమాట. మరోమాటలో చెప్పాలంటే అవి ఆయా కాలాలప్రజల కోసం నిర్ణయించబడిన పాఠ్యప్రణాలికలు. ఈనాటి ప్రజల కోసం ప్రళయం వరకూ సృష్టికర్త నిర్ణయించిన పాఠ్యప్రణాలికా గ్రంథమే మీ చేతిలో ఉన్న ఈ ఖుర్‌ఆన్.
ఈ గ్రంథాలన్నిటి సారాంశం ఒక్కటే. సృష్టికర్త, సర్వేశ్వరుడు, ప్రభువు, పోషకుడు, ఆపద్బాంధవుడు, ఆదిమధ్యాంత రహితుడయిన దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఆయన తప్ప మరోఆరాధ్యుడు లేడు; సమస్త జీవనరంగాల్లో ఆయన ఆజ్ఞల్నే శిరసావ హించాలి; ఆయన దైవత్వంలో ఇతరుల్ని భాగస్వాములుగా చేయకూడదు. ఈ ప్రపంచం ఓ ప్రయాణమజిలి, పరీక్షావేదిక, తాత్కలికాశ్రయం. మరణానంతరం ప్రతిమనిషీ తన కర్మలకు దైవన్యాయస్థానంలో లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. కర్మవిచారణ తర్వాత స్వర్గం లేదా నరకం రూపంలో అతనికి శాశ్వత ప్రతిఫలం లభిస్తుంది. ఇవీ ఆ గ్రంథాల్లోని మౌలిక బోధనలు. ఈ బోధనలతో కూడిన ధర్మాన్నే “ఇస్లాం” అంటారు. అంటే తొట్టతొలి దైవప్రవక్త హజ్రత్ ఆదం (అలైహి) నుండి చిట్టచివరి దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లం) వరకు దైవప్రవక్తలంతా ఇస్లాం ధర్మాన్నే మానవులకు బోధిస్తూ వచ్చారన్నమాట.
కాని ఈ బోధనలు ఈనాడు ఖుర్‌ఆన్‌లో తప్ప మరే మతగ్రంథాల్లో పూర్తిగా కాన రావు. వాటిలో ఏకదైవారాధనతో పాటు త్రిత్వం, బహుదైవారాధనలు కూడా చోటుచేసు కున్నాయి. పరమపవిత్రుడు, అసాధారణ శక్తిసంపన్నుడైన దేవునికి మానవ బలహీనతలు ఆపాదించబడ్డాయి. ఆరాధనాభావం దేవాలయాలకు, ధ్యానమందిరాలకు పరిమితమై పోయింది. సమానత్వం, సాంఘికన్యాయాలకు తూట్లు పడ్డాయి. పునర్జీవం పునర్జన్మగా మారిపోయింది. మరణానంతరపు జవాబుదారీ భావన మటుమాయమై పోయింది. దైవప్రవక్త విషయాలు మానవకల్పితాలతో కలుషితమై పోయాయి. ఈ కారణంగానే దేవుడు ఈ కలియుగంలో కట్టకడపటి మార్గదర్శినిగా ఖుర్‌ఆన్‌ని అవతరింపజేశాడు.
ఖుర్‌ఆన్ సూక్తులు సందర్భానుసారం 23 సంవత్సరాల్లో అవతరించాయి.