Jump to content

కురాన్ భావామృతం/ఆల్-ఎ-ఇమ్రాన్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

3. ఆలిఇమ్రాన్‌ (ఇమ్రాన్‌ కుటుంబం)
(అవతరణ: మదీనా; సూక్తులు: 200)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌- లామ్‌- మీమ్‌. అల్లాహ్‌ (మాత్రమే అసలైన ఆరాధ్యదైవం). ఆయన తప్ప మరోదేవుడు లేడు. ఆయన సజీవుడు, శాశ్వితుడు, సకలసృష్టికి ఆధారభూతుడు. (1,2)
ఆయనే నీపై సత్యపూరితమైన ఈ గ్రంథం అవతరింపజేశాడు. ఇది గత గ్రంథా లను ధృవీకరిస్తోంది. దీనికి పూర్వం మానవాళికి సన్మార్గం చూపేందుకు వచ్చిన తౌరాత్‌, ఇన్జీల్‌ గ్రంథాలను కూడా ఆయనే అవతరింపజేశాడు. ఆతర్వాత ఆయన (సత్యాసత్యా లను వేరుచేసి చూపే ఈ గీటురాయి (ఫుర్ఖాన్‌)ని అవతరింపజేశాడు. కనుక దేవుడు పంపిన సూక్తులు విశ్వసించేందుకు నిరాకరించేవారికి అత్యంత కఠినశిక్ష తప్పదు. దేవుడు అపార శక్తిసంపన్నుడు, (దుర్మార్గులకు) దుష్పర్యవసానం చవిచూపేవాడూను. (3-4)
భూమ్యాకాశాల్లోని ఏవస్తువూ దేవునికి కానరాకుండా మరుగుగాలేదు. ఆయనే (స్త్రీల) గర్భాల్లో మీ రూపురేఖల్ని తాను తలచినవిధంగా రూపొందించేవాడు. అపార శక్తి సంపన్నుడు, అద్భుత వివేచనాపరుడయిన ఆ స్వామి తప్ప (మీకు) మరో ఆరాధ్యుడు లేడు. (ప్రవక్తా!) ఆయనే నీ (హృదయఫలకం) పై ఈ గ్రంథాన్ని అవతరింపజేసినవాడు. ఇందులో రెండురకాల సూక్తులున్నాయి. ఒకటి, (ఏమాత్రం సందిగ్ధానికి ఆస్కారంలేని) స్పష్టమైన సూక్తులు. ఇవి గ్రంథానికి మాతృకలు వంటివి. (అంటే గ్రంథ సారాంశాలు). రెండు, అస్పష్టమైనవి. వక్రబుద్ధి కలవారు కలహాలు సృష్టించే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ అస్పష్టమైన సూక్తుల వెంటే పడతారు. వాటికి లేనిపోని అర్థాలు ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. నిజానికి వాటి అసలు భావం దేవునికి తప్ప మరెవరికీ తెలియదు. దీనికి భిన్నంగా విషయపరిజ్ఞానంలో స్థితప్రజ్ఞులయినవారు “మేము వీటిని నమ్ముతున్నాము. ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే” అని అంటారు. నిజానికి ఏ విషయం ద్వారా నయినా బుద్ధిమంతులే గుణపాఠం నేర్చుకుంటారు. (5-7)
(ఆ బుద్ధిమంతులు ఇలా వేడుకుంటారు:) “ప్రభూ! నీవు మాకు (ఒకసారి) సన్మార్గం చూపిన తరువాత తిరిగి మా హృదయాల్ని వక్రమార్గం వైపు పోనివ్వకు. నీ సన్నిధి నుండి మాకు కారుణ్యం ప్రసాదించు. నీవే గొప్ప (కారుణ్య) ప్రదాతవు. ప్రభూ! ఒక రోజు నీవు మానవులందర్నీ సమావేశపరచనున్నావు. ఆరోజు తప్పకుండా వస్తుంది. దేవుడు తన వాగ్దానాన్ని ఎన్నటికీ మీరడు.” (8-9)
సత్యాన్ని తిరస్కరించేవారికి దేవుని సమక్షంలో వారి సంతానం, సిరి సంపదలు ఏమాత్రం ఉపయోగపడవు. వారు నరకాగ్నికి సమిధలైపోతారు. ఫిరౌనీయులకు, వారికి పూర్వం గత సత్యతిరస్కారులకు ఎలాంటి గతి పట్టిందో వీరిక్కూడా అదే గతి పడ్తుంది. వారు మా సూక్తులను, సూచనలను తిరస్కరించారు. తత్ఫలితంగా దేవుడు వారిని వారి అకృత్యాల కారణంగా పట్టుకున్నాడు. దేవుడు అత్యంత కఠినంగా శిక్షించేవాడు. (10-11)
(ముహమ్మద్‌!) వారికిలా చెప్పెయ్యి: “మీరు త్వరలోనే పరాధీనులయి (పశువుల కన్నా నికృష్టంగా) నరకం వైపు తోలబడతారు. నరకం అతి చెడ్డ నివాసస్థలం. (12)
పరస్పరం తలపడిన రెండు వర్గాలలో గుణపాఠం గరిపే చిహ్నాలు మీకు ఇదివరకే (బద్ర్‌ యుద్ధంలో) గోచరించాయి. అందులో ఒకవర్గం దైవమార్గంలో పోరాడేవారిది. రెండోవర్గం అవిశ్వాసులది. చూసేవారు తమ కళ్ళారా ఆ దృశ్యాన్ని చూశారు. అప్పుడు అవిశ్వాసుల వర్గం విశ్వాసుల వర్గానికి రెట్టింపు సంఖ్యలో ఉందని వారు గ్రహించారు. దేవుడు తాను తలచుకున్నవారిని తన సహాయ సహకారాల ద్వారా బలోపేతం చేస్తాడు. కళ్ళున్నవారికి ఈ సంఘటనలో గొప్ప గుణపాఠం ఉంది. (13)
స్త్రీలు, సంతానం, వెండి బంగారం రాశులు, మేలుజాతి గుర్రాలు, పశుసంపద, సేద్యభూములు (వగైరా) వ్యామోహవస్తువులు మానవులకు మనోహరమైనవిగా చేయ బడ్డాయి కాని ఇదంతా ఇహలోకంలో మూన్నాళ్ళ ముచ్చటగా ఇవ్వబడిన జీవనసామగ్రి మాత్రమే. (శాశ్వత సౌఖ్యాలతో కూడిన) శ్రేష్ఠమైన నివాసం దేవుని దగ్గరే లభిస్తుంది. (14)
(కనుక) వారికిలా చెప్పు: “వీటికంటే శ్రేష్ఠమైన వస్తువులేమిటో మీకు చెప్పనా? భయభక్తులుకలవారి కోసం సెలయేరులు పారే స్వర్గవనాలు సిద్ధంగాఉన్నాయి. అక్కడే వారు శాశ్వతజీవితం గడుపుతారు. అదీగాక, వారికక్కడ ఈడు-జోడు, తోడు-నీడగా పవిత్రసహచరులు కూడాఉంటారు. అన్నిటికన్నా మించి దేవుని ప్రసన్నతాభాగ్యం ప్రాప్త మవుతుంది. దేవుడు తన దాసుల వైఖరిని గమనిస్తున్నాడు. (15)
వారీవిధంగా వేడుకుంటారు: “ప్రభూ! మేము (నిన్ను, నీ ప్రవక్తను) విశ్వసించాం. మా తప్పులు మన్నించు. మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు.” వీరు సహనశీలురు, స్థిరచిత్తులు, సత్యమంతులు, రుజువర్తనులు, వినమ్రులు, దానశీలురు, రాత్రి చివరి ఘడియల్లో దేవుడ్ని క్షమాభిక్ష వేడుకునేవారు. (16-17)
తాను తప్ప మరో ఆరాధ్యనీయుడు లేడని స్వయంగా దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. సర్వశక్తిమంతుడు, మహావివేకి అయిన ఆయన తప్ప మరో దేవుడు లేడని దైవ దూతలు, నీతిమంతులైన జ్ఞానసంపన్నులు కూడా సాక్ష్యమిస్తున్నారు. (18)
దేవుని దగ్గర (ఆమోదిత) ధర్మం ఇస్లాం మాత్రమే. కాని గ్రంథప్రజలు తమకు జ్ఞానసంపద లభించినప్పటికీ, పరస్పరం విభేదాలలో పడి మంకుతనంతో ఇలాంటి ధర్మాన్ని కాదని విభిన్న మార్గాలు అవలంబించారు. దైవసూక్తులు తిరస్కరించినవారిని దేవుడు త్వరలోనే నిలదీసి లెక్క తీసుకుంటాడు. (19)
(ముహమ్మద్‌!) వీరు నీతో వాదనకుదిగితే “నేను, నా అనుచరులు దేవునికి విధే యులై పోయాము.” అని స్పష్టంగా చెప్పు. గ్రంథప్రజలను, నిరక్షరాస్యులను “మరి మీరు కూడా (మాలాగే) ఇస్లాం స్వీకరించి (దేవునికి) విధేయులైపోతారా?” అని అడుగు. వీరు గనక ఇస్లాం స్వీకరిస్తే తప్పకుండా సన్మార్గం పొందుతారు. (ఈమాట) అంగీక రించకపోతే (పోనీ), దైవసందేశం అందజేయడమే నీపని. దేవుడు ప్రజలను గమనిస్తూనే ఉన్నాడు. ఆయనే తన దాసుల తదుపరి వ్యవహారం చూసుకుంటాడు. (20)
కొందరు దేవుని ఆజ్ఞల్ని ధిక్కరించడమే గాక, ఆయన ప్రవక్తలను, నీతి న్యాయాల్ని గురించి మాట్లాడేవారిని కూడా అన్యాయంగా చంపుతున్నారు. అలాంటి దుర్మార్గులకు బాధాకరమైన నరకశిక్ష ఉందని శుభవార్త విన్పించు! వారే ఇహపరలోకాల్లో కర్మలన్నీ వ్యర్థపరచుకున్న మూర్ఖులు. వారికిక ఎవరూ సహాయపడలేరు. (21-22)
గ్రంథ (జ్ఞాన)ంలో కొంత భాగం ఇవ్వబడినవారిని చూడు. వారిమధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు దైవగ్రంథం (ఖుర్‌ఆన్‌) వైపు పిలుస్తుంటే, వారిలో ఒక వర్గం తిరస్కారభావంతో ఎలా ముఖం తిప్పుకుంటుందో చూడు; దీనిక్కారణం వారు, నరకాగ్ని తమను ఒకటి రెండు రోజులు తప్ప తాకనైనా తాకదని భావించడమే. ధర్మం విషయంలో వారు కల్పించుకున్న మూఢనమ్మకాలే వారిని ఇలా మోసానికి గురిచేస్తు న్నాయి. తప్పనిసరిగా వచ్చే (ప్రళయ)దినాన వారిని సమావేశ పరచినప్పుడు వారి గతి ఏమవుతుందో! ఆరోజు ప్రతి మనిషికీ అతని సంపాదనకు తగిన ప్రతిఫలమే లభిస్తుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (23-25)
(విశ్వాసులారా!) ఇలా ప్రార్థించండి: “దేవా! (విశ్వ)సామ్రాజ్యాధిపతీ! నీవు తలచు కున్న వారికి రాజ్యం ప్రసాదిస్తావు: తలచుకున్న వారి నుండి రాజ్యాన్ని ఊడబెరుకుతావు. అలాగే నీవు కోరిన విధంగా కొందరికి గౌరవ ప్రతిష్ఠలు అనుగ్రహిస్తావు; మరికొందరిని పరాభవం పాల్జేస్తావు. అన్ని విధాల మేళ్ళు నీ చేతిలోనే ఉన్నాయి. నిస్సందేహంగా నీవు ప్రతి పనీ చేయగల శక్తిమంతుడవు. నీవే రాత్రిని పగటిలోకి, పగటిని రాత్రిలోకి ప్రవేశపె డ్తున్నావు. అలాగే నిర్జీమైన దాన్నుండి సజీవమైనదాన్ని, సజీవమైన దాన్నుండి నిర్జీవమైన దాన్ని వెలికితీస్తావు. నీవే తలుచుకున్న వారికి ఇతోధికంగా ఉపాధినిస్తావు.” (26-27)
విశ్వాసులారా! మీరు తోటివిశ్వాసుల్ని కాదని (ఇస్లాంకు బద్ధవిరోధులైన) అవిశ్వాసు లతో స్నేహం చేయకండి. అలా చేసేవారితో దేవునికి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే హింసావేధింపుల నుండి తప్పించుకోవడానికి పైకి అలాంటి వైఖరి అవలంబిస్తే అందులో తప్పు లేదు. దేవుడు మిమ్మల్ని తనను గురించి భయపెడ్తున్నాడు. చివరికి మీరంతా ఆయన సన్నిధికే మరలి పోవలసివుంది. (28)
(ప్రవక్తా!) చెప్పు : “మీరు ఏ విషయమైనా మీ అంతరంగాల్లో దాచుకున్నా, లేక బయటికి వెలిబుచ్చినా దేవుడు దాన్ని తప్పకుండా తెలుసుకుంటాడు. భూమ్యాకాశాల్లోని సమస్తం ఏది ఎక్కడుందో అంతా ఆయనకు తెలుసు. ఆయన సకల విషయాలపై అధికారం కలిగిన అపార శక్తిసంపన్నుడు. ప్రతి మనిషీ తాను చేసుకున్న పాపపుణ్యాలను ప్రత్యక్షంగా తన ముందు చూసుకునే రోజు “తనకూ, ఈ పాపానికీ మధ్య ఆమడ దూరముంటే బాగుండ!”ని భావిస్తాడు. దేవుడు తనను గురించి మిమ్మల్ని భయపెడ్తు న్నాడు. ఆయన తన దాసుల విషయంలో అమిత దయామయుడు. (29-30)
వారికిలా చెప్పు: “మీరు నిజంగా దేవుడ్ని అభిమానిస్తుంటే నన్ను అనుసరించండి; దేవుడు మిమ్మల్ని అభిమానిస్తాడు; మీ పాపాలు క్షమిస్తాడు. దేవుడు ఎంతో క్షమించే వాడు, కరుణించేవాడు.” చెప్పు: “దేవుని ఆజ్ఞల్ని, ప్రవక్త హితవుల్ని పాటించండి. వీటిని తిరస్కరిస్తే గుర్తుంచుకోండి, సత్యతిరస్కారుల్ని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు.” (31-32)
దేవుడు యావత్ప్రపంచం నుండి ఆదంను, నూహ్‌ను, ఇబ్రాహీం కుటుంబాన్ని, ఇమ్రాన్‌ కుటుంబాన్ని (దైవదౌత్యం కోసం) ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వారిలో కొందరు కొందరి సంతానం. దేవుడు సమస్తం వినేవాడు, సర్వం ఎరిగినవాడు. (33-34)
(ఈ సంఘటన గుర్తుచేసుకో) ఇమ్రాన్‌ (వంశపు) స్త్రీ దేవుడ్ని వేడుకుంటూ “ప్రభూ! నా గర్భంలోఉన్న శిశువును నీకు అంకితం చేస్తున్నాను. ప్రాపంచిక వ్యవహారాలకు ఈ శిశువును దూరంగా ఉంచుతాను. నానుండి దీన్ని స్వీకరించు. నీవే (అందరి మొరలు) ఆలకించేవాడవు, అన్నీ ఎరిగినవాడవు” అని అన్నది. (35)
ఆమె ఆడపిల్లను కన్న తర్వాత “ప్రభూ! (నేను మగ పిల్లవాడనుకుంటే) ఆడపిల్ల పుట్టిందే!” అన్నది. ఆమె కన్నదేమిటో దేవునికి బాగాతెలుసు. మగపిల్లవాడు ఆడపిల్ల వంటివాడు కాలేడు. “నేనీ పాపకు మర్యం అని పేరుపెట్టాను. ఈమెను, ఈమె సంతా నాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారిన పడకుండా నీ రక్షణలో ఇస్తున్నాను” అన్నది ఆమె.
ఆ తరువాత దేవుడు ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి, చక్కగా పెంచి పోషించాడు. (కొన్నాళ్ళకు) జకరియ్యాను ఆమెకు సంరక్షకునిగా నియమించాడు. జకరియ్యా ఆమె ప్రార్థనాగదిలోకి ప్రవేశించినప్పుడల్లా అక్కడ ఆహారపదార్థాలు ప్రత్యక్షమై ఉండేవి. అది చూసి (ఓరోజు) “మర్యం! నీకీ ఆహారం ఎక్కడ్నుంచి వస్తోంది?” అని అడిగాడు అతను (ఆశ్చర్యంగా). దానికామె “దేవుని దగ్గర్నుంచి. ఆయన తాను తలచు కున్న వారికి ఇతోధికంగా ఆహారం ప్రసాదిస్తాడు” అని సమాధానమిచ్చింది. (36-37)
అప్పుడు జకరియ్యా తన ప్రభువును వేడుకుంటూ “ప్రభూ! నీ సన్నిధి నుండి నాకు ఉత్తమ సంతానం ప్రసాదించు. నిస్సందేహంగా నీవే మొరాలకించేవాడివి” అని అన్నాడు. అతనలా ప్రార్థనగదిలో నిలబడి ప్రార్థన చేస్తుండగానే దైవదూతలు వచ్చి అతడ్ని పిలిచారు: “జకరియ్యా! దేవుడు నీకు యహ్యా (పుడతాడని) శుభవార్త తెలియజేస్తున్నాడు. అతను దేవుని నుండి వెలువడే ఒక వాణి (ఈసాప్రవక్త)ని ధృవపరుస్తాడు. పైగా అతను నాయకత్వపు లక్షణాలతో భాసిల్లుతూ ఎంతో నిగ్రహశక్తి కలవాడై ఉంటాడు; దైవప్రవక్త అవుతాడు; సజ్జనులలో పరిగణించబడతాడు” అని చెప్పారు వారు. (38-39)
అప్పుడు జకరియ్యా “ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నేను ముసలివాణ్ణ య్యాను. నాభార్య చూస్తే గొడ్రాలు!!” అన్నాడు. దానికి “అలాగే ఇది జరుగుతుంది. దేవుడు తాను తలచిన పని చేసి తీరుతాడు” అని సమాధానం వచ్చింది. (40)
“అయితే ప్రభూ! ఈ విషయంలో నాకేదయినా సూచన నిర్ణయించు” అన్నాడు జకరియ్యా. “నీవు మూడు రోజుల దాకా సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడలేవు. (అప్పుడు) నీవు నీ ప్రభువును వీలైనంత ఎక్కువగా స్మరిస్తూఉండు. ఉదయం, సాయం త్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు” అని (దూతలు) చెప్పారు. (41)
ఆ తరువాత దైవదూతలు మర్యంతో “మర్యం! దేవుడు నిన్ను (ఓ ముఖ్యమైన పని కోసం) ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచాడు. యావత్ప్రపంచ మహిళలలో నీకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి తన సేవ కోసం నియమించాడు. కనుక మర్యం! నీవిక నీ ప్రభువుకు విధేయురాలివైఉండు. ఆయన సన్నిధిలో సాష్టాంగపడుతూఉండు. మోకరిల్లే వారితో పాటు నీవూ మోకరిల్లి ధ్యానం చేస్తూవుండు” అని అన్నారు. (42-43)
ప్రవక్తా! ఇదంతా మేము నీకు దివ్యావిష్కృతి ద్వారా అందజేస్తున్న రహస్య సమా చారం. ఇలా మేము తెలియజేయకపోతే నీకు వాస్తవం ఎలా తెలుస్తుంది? మర్యంకు సంరక్షకుడిగా ఎవరు ఉండాలనే విషయాన్ని నిర్ణయించేందుకు ధర్మకర్తలు తమతమ కలాలు విసరినప్పుడు, వారి మధ్య వివాదం చెలరేగినప్పుడు నీవక్కడ లేవు. (44)
దైవదూతలు ఇలా అన్నారు: “మర్యం! దేవుడు నీకు తన వైపునుండి ఒక‘వాణి’కి సంబంధించిన శుభవార్త విన్పిస్తున్నాడు. అతని పేరు మర్యం కుమారుడైన మసీహ్‌ఈసా. అతను ఇహలోకంలో, పరలోకంలోనూ గౌరవనీయుడవుతాడు. దైవసాన్నిధ్యం పొందిన వారిలో ఒకడై పోతాడు. పైగా తల్లిఒడిలో ఉన్నప్పుడూ, ఆ తరువాత పెరిగి పెద్దవాడై నప్పుడూ అతను ప్రజలతో మాట్లాడుతాడు, ఒక సత్పురుషుడిగా వర్థిల్లుతాడు.”
మర్యం ఈమాట విని (కంగారుపడుతూ) “ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నన్ను ఏ పురుషుడూ తాకనైనా తాకలేదే!!” అన్నది. “అలాగే ఇది జరిగి తీరుతుంది. దేవుడు తాను తలచిన దాన్ని సృష్టించగలడు. ఆయన ఒక పని చేయదలచుకున్నప్పుడు ‘అయిపో’ అంటే చాలు, ఆపని జరిగిపోతుంది. దేవుడు అతనికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్‌, ఇన్జీల్‌ గ్రంథాల జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు” అన్నారు దైవదూతలు. (45-48)
దేవుడు అతడ్ని తన ప్రవక్తగా నియమించి ఇస్రాయీల్‌ సంతతి ప్రజల దగ్గరకు పంపిస్తాడు. (అతను ప్రవక్తగా వారి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు:) “నేను మీ ప్రభువు నుండి మీకోసం కొన్ని సూచనలు తెచ్చాను. ఇప్పుడు మీ ముందు మట్టితో పక్షి ఆకారం గల బొమ్మ చేసి అందులో గాలి ఊదుతాను. అది దైవాజ్ఞతో సజీవ పక్షిగా మారుతుంది. నేను దేవుని ఆజ్ఞతో పుట్టుగుడ్డిని, కుష్ఠురోగిని నయం చేస్తాను; మృతుల్ని కూడా బ్రతికిస్తాను. మీరు ఏమేమి తింటారో, మీ ఇండ్లలో ఏమేమి నిలువచేసి ఉంచుతారో అంతా మీకు తెలియజేస్తాను. మీరు విశ్వసించేవారైతే వీటిలో మీకోసం గొప్ప నిదర్శనా లున్నాయి. నాకు పూర్వం అవతరించిన తౌరాత్‌ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. గతంలో మీకు నిషేధించబడిన కొన్ని వస్తువుల్ని ధర్మసమ్మతం చేయడానిక్కూడా వచ్చాను. నేను మీదగ్గరికి మీప్రభువుకు సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలు తెచ్చాను. కనుక అల్లాకు భయపడండి. నన్ను అనుసరించండి. అల్లాహ్‌ నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. అంచేత ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఇదే (సాఫల్యానికి) సరైన మార్గం.” (49-51)
ఈసా (ప్రవక్త) వారిలో అవిధేయత, అవిశ్వాసాల ధోరణి చూసి “దైవమార్గంలో నాకు తోడుగా నిల్చేవారు ఎవరైనా ఉన్నారా మీలో?” అని అడిగాడు. దానికి హవారీలు (శిష్యులు) ఇలా అన్నారు: “మేము దేవుని (మార్గంలో మీకు తోడుగా నిలిచే) సహాయ కులం. మేము దేవుడ్ని విశ్వసిస్తున్నాము. ఆయనకు విధేయులయి (ముస్లిములయి) పోయాము. దీనికి మీరే సాక్షి. ప్రభూ! నీవు అవతరింపజేసిన దాన్ని (దివ్యగ్రంథాన్ని) విశ్వసిస్తున్నాము. నీ సందేశహరుడ్ని అనుసరించడానిక్కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా పేర్లు (సత్య)సాక్షుల జాబితాలో వ్రాయి.” (52-53)
సత్యాన్ని తిరస్కరించినవారు (ఈసాను చంపడానికి) ఒక యుక్తి పన్నారు. దేవుడు (ఈసాను కాపాడేందుకు) మరోయుక్తి పన్నాడు. దేవుడు అందరికన్నా గొప్ప యుక్తి పరుడు. అప్పుడు దేవుడు (ఈసాతో) ఇలా అన్నాడు: “ఈసా! నేనిప్పుడు నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను. నా వైపునకు ఎత్తుకుంటాను. నిన్ను ధిక్కరించినవారి (దుష్ట పరిసరాల) నుండి (తీసి) నిన్ను పావనం చేస్తాను. నిన్ను తిరస్కరించినవారిపై నిన్ను అనుసరించినవారికి ప్రళయం వరకు ఆధిక్యత నిస్తాను. చివరికి మీరంతా నా దగ్గరికే తిరిగివస్తారు. అప్పుడు నేను మీమధ్య ఏర్పడిన విభేదాలను గురించి తీర్పు చెబుతాను. సత్యతిరస్కారుల్ని ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ కఠినంగా శిక్షిస్తాను. వారిక ఎలాంటి సహాయం పొందలేరు. విశ్వసించి సత్కార్యాలు చేసినవారికి వారి ప్రతి ఫలం పూర్తిగా లభిస్తుంది. దుర్మార్గుల్ని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. (54-57)
మేము మీముందు పఠిస్తున్న ఈ సూక్తులలో అనేక సూచనలు, (కళ్ళు తెరిపించే) ప్రస్తావనలూ ఉన్నాయి. దేవుని దృష్టిలో ఈసా జన్మ ఆదం జన్న లాంటిదే. దేవుడు ఆదమ్‌ను మట్టితో సృజించి ‘అయిపో’ అని ఆదేశించగానే అతను రూపొంది ఉనికిలోకి వచ్చాడు. (ముహమ్మద్‌!) ఇది నీ ప్రభువు వైపునుండి మీకు తెలియజేయబడుతున్న సత్యం. కనుక నీవు శంకించేవారిలో చేరకు. (58-60)
వాస్తవ జ్ఞానం నీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నీతో ఎవరైనా వాదనకు దిగితే వారికిలా చెప్పు: “రండి (ప్రమాణం చేద్దాం), మేము మా భార్యాపిల్లల్ని పిలుస్తాం. మీరుకూడా మీ భార్యాపిల్లల్ని పిలుచుకోండి. తర్వాత మనమందరం కలసి, అసత్యం పలికేవారిపై దేవుని అభిశాపం (ఆగ్రహం) పడుగాక అని ప్రార్థిద్దాం.” (61)
ఇవన్నీ పూర్తిగా యదార్థగాధలు. అల్లాహ్‌ తప్ప మరో దేవుడు లేడు. ఆయన అపార శక్తిసంపన్నుడు, అమిత యుక్తిపరుడు. వారు (ఈ షరతుపై ప్రమాణం చేయడా నికి) అంగీకరించకపోతే (పోనీ), నీతిలేనివారి సంగతి దేవునికి బాగా తెలుసు. (62-63)
వారికి చెప్పు : “గ్రంథప్రజలారా! మీకూ మాకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ఒక మంచి విషయాన్ని అంగీకరిద్దాం రండి, మనం అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ఆరాధించ కూడదు. ఆయనకు సాటి కల్పించకూడదు. మనలో ఎవరూ అల్లాహ్‌ను తప్ప ఇతరుల్ని ప్రభువుగా, పోషకుడుగా స్వీకరించకూడదు.” దీన్నికూడా వారంగీకరించకపోతే “మేము ముస్లింలం (అల్లాహ్‌కు విధేయులం). దీనికి మీరే సాక్షులు” అని వారికి చెప్పు. (64)
గ్రంథప్రజలారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు వాదిస్తారు? తౌరాత్‌, ఇన్జీల్‌ గ్రంథాలు ఆయన వెళ్ళిపోయిన తరువాతే అవతరించాయి కదా! మీకా మాత్రం జ్ఞానం లేదా? మీకు తెలిసిన విషయాలను గురించి ఎటూ మీరు వాదిస్తూనే ఉన్నారు. ఇక ఏమాత్రం తెలియని విషయాన్ని గురించి అనవసరంగా ఎందుకు వాదిస్తారు? (వాస్తవం ఏమిటో) దేవునికి మాత్రమే తెలుసు, మీకు తెలియదు. (65-66)
ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. అతను అందర్నీ వదలి ఒక్క దేవునికి మాత్రమే అంకితమైపోయిన రుజువర్తనుడు. బహుదైవారాధకుడు ఎంతమాత్రం కాదు. ఇబ్రాహీం సన్నిహితులమని చెప్పుకునే హక్కు అతడ్ని అనుసరించేవారికే ఉంది. అంటే ఈ ప్రవక్తకు, (ఇతడ్ని) విశ్వసించినవారికి మాత్రమే ఇబ్రాహీంతో సంబంధం కలిగి ఉండే హక్కుంది. విశ్వసించినవారికే దేవుని రక్షణ, సహాయం లభిస్తాయి. (67-68)
(ముస్లింలారా!) గ్రంథప్రజలలో (అంటే యూదుల్లో) కొందరు మిమ్మల్ని రుజు మార్గం నుండి తప్పించగోరుతున్నారు. నిజానికి వారు తమను తాము తప్ప మరెవరినీ దారి తప్పించలేరు. కాని ఆ సంగతి వారు గ్రహించలేకపోతున్నారు. (69)
గ్రంథప్రజలారా! మీరు దేవుని సూక్తులు, సూచనలను గుర్తించినప్పటికీ వాటిని ఎందుకు నిరాకరిస్తున్నారు? గ్రంథప్రజలారా! మీరు సత్యాసత్యాలను కలగాపులగం చేసి సత్యాన్ని ఎందుకు అనుమానాస్పదం చేస్తున్నారు? వాస్తవం తెలిసి కూడా సత్యాన్ని ఎందుకు దాచుతున్నారు? (70-71)
గ్రంథప్రజలలో కొందరు కూడబలుక్కుంటూ “విశ్వాసులపై అవతరించినదాన్ని మీరు ఉదయం విశ్వసించి(నట్లు నటించి) సాయంత్రానికల్లా తిరస్కరించండి. ఈ విధంగా వారిని మనం మార్గభ్రష్టులయ్యేలా చేయగలం” అని చెప్పుకుంటారు. (72)
అంతేకాదు, “మన మతస్థుల్ని తప్ప మరెవరినీ మనం నమ్మకూడదు” అని కూడా వారు చెప్పుకుంటారు. (ముహమ్మద్‌!) వారికి చెప్పు: “మార్గదర్శకత్వమంటే అసలు దేవుని మార్గదర్శకత్వమే. ఆయన చూపేదే రుజుమార్గం. గతంలో మీకు ఇవ్వబడిన (తౌరాత్‌, ఇన్జీల్‌) వంటిదే (ఇప్పుడు) ఇతరులక్కూడా ఇవ్వబడిందంటే అది దేవుని అనుగ్రహం. మీకు వ్యతిరేకంగా మీ ప్రభువు సన్నిధిలో సమర్పించడానికి ఇతరులకు బలమైన సాక్ష్యం (దివ్యఖుర్‌ఆన్‌) లభించిందంటే అదీ దేవుని అనుగ్రహమే.”
ఈ విషయం కూడా చెప్పు: “ఘనత, గౌరవాలు దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన వాటిని తాను తలచిన వారికి అనుగ్రహిస్తాడు. దేవుడు సర్వోపగతుడు, సర్వం ఎరిగినవాడు. ఆయన తాను కోరినవారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. దేవుడు గొప్ప అనుగ్రహశీలి.” (73-74)
గ్రంథప్రజలలో కొందరు నిజాయితీపరులు కూడా ఉన్నారు. వారి దగ్గర మీరు భద్రపరచడానికి ఎంతపెద్ద ధనరాశి ఉంచినా వారు దాన్ని యధాతథంగా తిరిగిస్తారు. అలాగే వారిలో కొందరు మొండిఘటాలు కూడా ఉన్నారు. వారి దగ్గర మీరు నమ్మి ఒక్క రూపాయి దాచి పెట్టినాసరే, నెత్తిమీద కూర్చుంటే తప్ప వారు దాన్ని తిరిగివ్వరు. ఈ నైతిక దిగజారుడికి కారణం, నిరక్షరాస్యుల (యూదేతరుల) వ్యవహారంలో (దేవుడు) తమల్ని పట్టుకోవడం జరగదని వారు చెప్పడమే. కాని వాస్తవం తెలిసి కూడా వారు పచ్చి అబద్దం చెబుతూ దేవుని మీద లేనిపోని నిందలు మోపుతున్నారు. (75)
చేసిన ప్రమాణాలను నెరవేర్చేవారు, భయభక్తులు కలిగివుండేవారు మాత్రమే దేవునికి ప్రీతిపాత్రులవుతారు. కాని కొందరు తమ వాగ్దానాలను, దేవుని విషయంలో చేసిన ప్రమాణాలను అతిస్వల్ప మూల్యానికి అమ్ముకుంటారు. అలాంటి (అమ్ముడు బోయిన) వారికి పరలోకంలో ఎలాంటి (సుకృతఫలం)వాటా లభించదు. వారితో దేవుడు మాట్లాడడు. చివరికి ప్రళయదినాన వారి వైపు కన్నెత్తి కూడా చూడడు. వారిని పరిశుద్ధ పరిచే ప్రసక్తి అంతకన్నా లేదు. వారికి వ్యధాభరితమైన ఘోరశిక్ష పడుతుంది. (76-77)
గ్రంథప్రజలలో కొందరు తాము పఠిస్తున్నది (దైవ)గ్రంథంలోనిదేనని మిమ్మల్ని నమ్మించడానికి నాలుకలు పలు మెలికలు తిప్పి పఠిస్తారు. కాని వారు పఠించేది (దైవ) గ్రంథంలోని విషయాలు కావు. వారవి దేవుడు అవతరింపజేసినవని చెబుతారు. నిజానికి అవి దేవుడు అవతరింపజేసినవి కావు. వారు వాస్తవం తెలిసి కూడా దేవుని మీద అబద్ధాలు మోపుతున్నారు. (78)
దేవుడు ఒక మనిషికి గ్రంథం, రాజ్యాధికారం, దైవదౌత్యం ప్రసాదించినప్పుడు, ఆ వ్యక్తి ప్రజలతో మీరు దేవుడ్ని వదలి తనకు భక్తులుగా మారమని అనడం తగదు. దానికి బదులు “మీరు (దైవ)గ్రంథాన్ని (ప్రజలకు) బోధిస్తున్నారు, స్వయంగా పఠిస్తున్నారు కూడా. అందువల్ల మీరు (మీ)ప్రభువుకు విశ్వసనీయులైన దాసులుగా రూపొందండి” అని అంటాడు అతను. అంతేకాకుండా మీరు దైవదూతలను, దైవప్రవక్తలను దేవుళ్ళుగా చేసుకొని ఆరాధించండని కూడా అతను ప్రజలతో అనడు. మీరొకసారి ముస్లింలయిన తరువాత తిరిగి అవిశ్వాస వైఖరి అవలంబించమని అతనెలా చెప్పగలడు? (79-80)
దేవుడు తన ప్రవక్తల నుండి తీసుకున్న ఈవాగ్దానం గురించి ఆలోచించండి. ఆయన ఇలా అన్నాడు: “నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ తరువాత మీకివ్వబడిన గ్రంథాన్ని ధృవీకరిస్తూ మరో ప్రవక్త వస్తే అతడ్ని మీరు విశ్వసించి అతనికి సహాయం చేయాలి.” ఇలా అన్న తర్వాత “దీన్ని మీరు అంగీకరిస్తున్నారా? నేను మీపై మోపిన ఈ ప్రమాణబాధ్యతను మీరు స్వీకరిస్తున్నారా?” అనడిగాడు దేవుడు. దానికి దైవప్రవక్తలు “ఆ..మేము అంగీకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం” అన్నారు. అప్పుడు దేవుడిలా అన్నాడు: “దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు తమ వాగ్దానాన్ని భంగపరుస్తారో వారే నీతిలేని దుర్మార్గులు” (81-82)
భూమ్యాకాశాలలోని సమస్త చరాచరాలు ఇష్టమున్నా లేకపోయినా దేవునికి లొంగి ఆయన ధర్మానికి కట్టుబడి ఉన్నాయి. చివరికి అందరూ ఆయన దగ్గరికే చేరుకోవలసి ఉంది. అలాంటప్పుడు వీరు దేవుడు పంపిన ధర్మం కాదని మరో ధర్మాన్ని కోరు తున్నారా? వారికి చెప్పు: “మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరించిన గ్రంథాన్ని; ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌లపై, వారి సంతానంపై అవత రించిన బోధనలను; మూసా, ఈసా, ఇంకా ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు నుండి లభించినవాటిని కూడా మేము విశ్వసించాం. మేమీ దైవప్రవక్తలలో ఎవరినీ భేదభావం తో చూడము. (మాదృష్టిలో వారంతా సత్యవంతులైన దైవప్రవక్తలే.) మేము ఆయనకే ముస్లింలు (విధేయులు) అయ్యాము.” (83-84)
ఎవరు (ఇలాంటి) దైవవిధేయతా మార్గం (ఇస్లాం) కాదని ఇతర జీవిత విధానా లను (అంటే ఇస్లామేతర పద్ధతులను) అవలంబించగోరుతారో వాటిని ఎన్నటికీ ఆమో దించడం జరగదు. అలాంటివారు పరలోకంలో ఘోరంగా నష్టపోతారు. (85)
(సత్యాన్ని) ఒకసారి విశ్వసించిన తరువాత, తిరిగి అవిశ్వాస వైఖరి అవలంబించే తిరస్కారులకు దేవుడు సన్మార్గం ఎలా చూపుతాడు? వీరు ఈయన్ని సత్యప్రవక్త అని సాక్ష్యం కూడా ఇచ్చిఉన్నారు. వారి ముందుకు తగిన ఆధారాలు, ప్రమాణాలు కూడా వచ్చాయి. (అయినా వారు తమ తలబిరుసు ధోరణి మానుకోలేదు.) అలాంటి దుర్మార్గు లకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. దేవుని అభిశాపం, యావత్తు దైవదూతల, మానవుల ఛీత్కారం వారిపై పడుతుంది. ఇదే వారికి తగిన ప్రతిఫలం. (86-87)
వారు ఎల్లప్పుడూ శాపం, ఛీత్కారాలకే గురయి ఉంటారు. వారికి విధించే శిక్షను తగ్గించడంగాని, (ఊపిరి పీల్చుకోవడానికి) కాస్తంత అవకాశం ఇవ్వడంగాని జరగదు. అయితే ఆ తర్వాతయినా వారు పశ్చాత్తాపం చెంది తమ నడవడిక సరిదిద్దుకుంటే (మంచిది). దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు. పోతే విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరి అవలంబించి అవిశ్వాసంలోనే పడి కొట్టుకుపోయేవారిని దేవుడు ఎన్నటికీ క్షమిం చడు. వారి పశ్చాత్తాపం స్వీకరించబడదు. వారు పరమ మార్గభ్రష్టులు. అవిశ్వాస వైఖరి అవలంబించి, అవిశ్వాసస్థితిలోనే ఊపిరి వదిలేవారు నరకశిక్ష నుండి కాపాడుకోవడా నికి (పరిహారంగా) భూమండలమంత బంగారం ఇచ్చినా స్వీకరించడం జరగదు. వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. ఇక వారిని ఎవరూ ఆదుకోలేరు. (88-91)
(విశ్వాసులారా!) మీరు అమితంగా ప్రేమించేవాటిని సైతం (దైవమార్గంలో) వినియోగించనంత వరకూ మీరు ధర్మపరాయణులు కాలేరు. మీరు (దైవమార్గంలో) ఏది వినియోగించినా అది దేవునికి తెలుసు. (92)
తౌరాత్‌ అవతరణకు పూర్వం ఇస్రాయీల్‌ (యాఖూబ్‌ ప్రవక్త) తనకు తాను కొన్ని వస్తువుల్ని నిషేధించుకున్నాడు. అవి తప్ప (ముహమ్మద్‌ షరీఅత్‌లో ధర్మసమ్మతమైన) ఈ ఆహారపదార్థాలన్నీ గతంలో ఇస్రాయీల్‌ సంతతికి కూడా ధర్మసమ్మతంగా ఉండేవి. వారిని ఇలా అడుగు: “మీరు నిజాయితీపరులైతే తౌరాత్‌ తీసుకొచ్చి అందులో ఏదైనా ఒక విషయం (ఆధారంగా) చూపండి.” (మీరు ఎలాంటి ఆధారం చూపలేరు. అంటే మీ వాదన నిరాధారమైనదని తేలిపోయింది.) ఆతర్వాత కూడా ఎవరైనా అబద్ధం కల్పించి దాన్ని దేవునికి ఆపాదించినట్లయితే వారే అసలు దుర్మార్గులు. (93-94)
చెప్పు: “దేవుడు చెప్పిందే నిజం. కనుక మీరు ఏకాగ్రచిత్తులై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించాలి. ఇబ్రాహీం దేవునికి సాటికల్పించేవారి కోవకు చెందినవాడు కాదు.” (95)
మానవుల కోసం నిర్మించిన మొట్టమొదటి ఆరాధనాలయం మక్కాలో ఉన్నదే. (కాబా.) అది ఎంతో శుభప్రదమైనది, యావత్‌ మానవాళికి మార్గదర్శకమైనది. అందులో (కళ్ళున్న వారికి) అనేక సూచనలు ఉన్నాయి. ఆ సూచనల్లో ఇబ్రాహీం (ప్రార్థన కోసం నిలబడే) చోటొకటి. అందులో (అంటే కాబాలో) ప్రవేశించే ప్రతి వ్యక్తీ శాంతీ, రక్షణా పొందగలడు. అక్కడకు చేరుకోగలిగేవారు దాన్ని విధిగా సందర్శించాలి. (అంటే హజ్‌ చేయాలి.) ఇది ప్రజలపై దేవునికున్న హక్కు. ఈ ఆజ్ఞ శిరసావహించడానికి నిరాకరించే వాడు దేవుడు నిరపేక్షాపరుడని తెలుసుకోవాలి. (96-97)
గ్రంథప్రజలారా! మీరు దేవుని సూక్తుల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? దేవుడు మీ చేష్టలన్నిటిని గమనిస్తూనే ఉన్నాడు. వారిని అడుగు: “గ్రంథప్రజలారా! మీరు విశ్వాసుల్ని దైవమార్గంలో నడవనీయకుండా ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారు? వారు సన్మార్గం లో ఉన్నారని తెలిసి కూడా మీరు వారిని దారితప్పించ జూస్తున్నారెందుకు? దేవుడు మీ చర్యల్ని గమనిస్తూనే ఉన్నాడు.” (98-99)
విశ్వాసులారా! గ్రంథప్రజలలో ఒక వర్గం చెప్పే మాటలు గనక వింటే వారు మిమ్మల్ని అవిశ్వాసులుగా మార్చివేస్తారు. మీకు దేవుని సూక్తులు మాటిమాటికి చదివి విన్పించడం జరుగుతున్నది. మీ మధ్య దైవప్రవక్త కూడా ఉన్నాడు. అలాంటప్పుడు మీరు అవిశ్వాసవైఖరి ఎలా అవలంబించగలరు? అల్లాహ్‌ (గ్రంథం)ను గట్టిగా పట్టుకునే (అంటే నమ్ముకునే) వారు తప్పకుండా సన్మార్గంలో ఉంటారు (100-101)
విశ్వాసులారా! మీరు దేవునికి భయపడవలసిన విధంగా భయపడండి. ( దేవునికి అంకితమైన) ముస్లింలుగా వున్న స్థితిలో తప్ప (ఇతర స్థితిలో) చనిపోకండి. (102)
మీరంతా కలసి దైవత్రాటిని (అంటే దైవధర్మాన్ని) దృఢంగా పట్టుకోండి. విభేదా లలో పడి చీలిపోకండి. దేవుడు చేసిన మేళ్ళను ఓసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు పరస్పరం శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం అన్నదమ్ములై పోయారు. మీరు అగ్నిగుండం అంచుకు చేరినప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడాడు. ఈవిధంగా దేవుడు మిమ్మల్ని సన్మార్గంలో నడిపేందుకు తన సూక్తులు విడమరచి బోధిస్తున్నాడు. (103)
మీలో ఒకవర్గం (ప్రజల్ని) మంచి వైపునకు పిలిచేవారు, సత్కార్యాలు చేయమని ఆజ్ఞాపించేవారు, చెడు పనుల నుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. అలాంటి వారే (ఇహపరలోకాల్లో) సాఫల్యం చెందేవారు. స్పష్టమైన సూచనలు, ప్రమాణాలు వచ్చి నప్పటికీ పరస్పరం విభేదించుకొని విభిన్నవర్గాలుగా చీలిపోయినవారిలా మీరూ కాకండి. అలాంటివారికి ఘోరమైన (నరక) యాతనలు కాచుకొని ఉన్నాయి. (104-105)
కొందరి ముఖాలు (ఆనందోత్సాహాలతో) ప్రకాశిస్తుంటే, మరికొందరి ముఖాలు (పుట్టెడు దుఃఖంతో) నల్లబడిపోయే (ప్రళయ)దినాన దేవుడు మాడిపోయిన ముఖాల వారిని ఉద్దేశించి “ఏమిటీ, మీరు విశ్వసించిన తరువాత మళ్ళీ అవిశ్వాసులైపోయారా? అయితే మీ అవిశ్వాసానికి పర్యవసానంగా (నరక)యాతనలు చవిచూడండి” అంటాడు. దీనికి భిన్నంగా ప్రకాశవంతమైన ముఖాలవారు దేవుని అనుగ్రహభాగ్యం (స్వర్గం) పొందుతారు. వారక్కడ కలకాలం (సుఖసంతోషాలతో) ఉంటారు. (106-107)
ఇవి దైవసూక్తులు. వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. దేవుడు ప్రపంచ మానవులకు ఎన్నటికీ అన్యాయం చేయడు. భూమ్యాకాశాల్లో ఉన్న సర్వం దేవునిదే. సమస్త వ్యవహారాలు చివరికి ఆయన సమక్షంలోనే ప్రవేశపెట్టబడతాయి. (108-109)
విశ్వాసులారా! ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ఠసమాజం మీరే. మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు. చెడుల నుండి వారిస్తారు. దేవుడ్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు. గ్రంథప్రజలు (కూడా) విశ్వసించిఉంటే వారికెంతో మేలు జరిగేది. వారిలో విశ్వసించినవారు కూడా కొందరున్నారు. కాని చాలామంది అవిధేయులే ఉన్నారు. (110)
వారు మిమ్మల్ని కొంచెం బాధించడం తప్ప పెద్దగా హాని కలిగించలేరు. వారొక వేళ మీతో పోరాడినా (మీధాటికి నిలువలేక) ద్‌న్నుజూపి పారిపోతారు. వారికి సహాయం లభించదు, దేవుని శరణులోనో మానవుల రక్షణలోనో ఆశ్రయం లభిస్తే తప్ప. వారెక్క డున్నా అవమానం, అప్రతిష్ఠలే వారిని వెన్నంటి ఉంటాయి. వారు దైవాగ్రహంలో చిక్కు కున్నారు. వారిని దౌర్భాగ్యం వెంటాడుతోంది. దీనిక్కారణం వారు దేవుని సూక్తుల్ని, ఆయన మహిమల్ని నిరాకరించారు. ఆయన పంపిన ప్రవక్తలను అన్యాయంగా హత మార్చారు. వారు మహా తలబిరుసుతో దేవునికి అవిధేయులై హద్దుమీరిపోయారు.
అయితే గ్రంథప్రజలంతా అలాంటివారు కాదు. వారిలో సన్మార్గగాములు కూడా ఉన్నారు. వారు రాత్రి వేళల్లో దేవుని సూక్తులు పఠిస్తూ ఆయన ముందు సాష్టాంగ పడతారు. దేవుడ్ని, పరలోకాన్ని విశ్వసిస్తారు. ప్రజలకు మంచిని బోధిస్తారు. చెడుల నుండి వారిస్తారు. సత్కార్యాలు చేయడంలో పరస్పరం పోటీపడతారు. ఇలాంటివారే సజ్జనులు. వారు ఏ సత్కార్యం చేసినా దాన్ని విస్మరించడం జరగదు. దేవునికి భక్తిపరా యణులు ఎవరో బాగా తెలుసు. దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాసులకు (పరలోకంలో) వారి సంతానం, సిరిసంపదలు ఏమాత్రం పనికిరావు. వారే నరకవాసులు. అందులోనే వారు (నానాయాతనలు అనుభవిస్తూ) ఎల్లకాలం పడిఉంటారు. (111-116)
వారు ఐహికజీవితంలో చేసే ధనవ్యయం తీవ్రమైన మంచుతుఫాన్‌ వంటిది. అది ఆత్మద్రోహం చేసుకున్నవారి పంటపొలాలపై వీచి సర్వనాశనం చేస్తుంది. దేవుడు వారికి అన్యాయం చేయడం లేదు. వారు తమకుతామే అన్యాయం చేసుకుంటున్నారు. (117)
విశ్వాసులారా! మీవారిని తప్ప ఇతరుల్ని ఆంతరంగీకులుగా చేసుకోకండి. వారు మీకు హాని తలపెట్టడంలో ఎలాంటి అవకాశాన్నీ జారవిడుచుకోరు. ఏ విధంగానయినా మిమ్మల్ని బాధించాలనే వారు కాచుకొని ఉంటారు. వారి మాటల్లో వైరం ఎప్పుడో బయటపడింది. ఇక వారి హృదయాల్లోనయితే అంతకన్నా ఎన్నో రెట్లు ద్వేషం నిండి ఉంది. మీరు వివేచనాపరులయితే విషయాన్ని గ్రహించండి; మేము మా సూక్తుల్ని స్పష్టంగా విడమరచి చెబుతున్నాము. (118)
మీరు వారిని ప్రేమిస్తారుగాని, వారికి మీరంటే ఏమాత్రం అభిమానం లేదు. మీరు (దైవ)గ్రంథాలన్నీ విశ్వసిస్తారు. (కాని వారు మీగ్రంథాన్ని విశ్వసించరు.) వారు మిమ్మల్ని కలసినప్పుడు “మేము కూడా (మీగ్రంథాన్ని, మీప్రవక్తను) విశ్వసిస్తున్నాం” అంటారు. అయితే మీ దగ్గర్నుండి ద్‌ళ్ళిపోగానే మీ మీద పెంచుకున్న కసితో వారు పళ్ళు పటపట నూరుతారు. (దౌర్భాగ్యులారా!) మీరు పెంచుకున్న కసిలోనే మాడి చావండి. దేవునికి మీ అంతరంగాల్లో దాగివున్న ప్రతి విషయమూ తెలుసు. మీకేదైనా మేలు జరిగితే వారు విలవిల్లాడి పోతారు. కీడు జరిగితే మాత్రం తెగ సంబరపడిపోతారు. ఏమైనప్పటికీ మీరు సహనం వహించి దేవుని పట్ల భయభక్తులతో మసలుకుంటే, మీ మీద వారి కుట్రలు, కుయుక్తులేవీ పనిచేయవు. వారి చేష్టలన్నీ దేవునికి బాగా తెలుసు.(119-120)
(ముహమ్మద్‌! ఓరోజు) నీవు ఉదయం ఇంటి నుండి బయలుదేరి విశ్వాసుల్ని యుద్ధానికి సమాయత్తపరచడం ప్రారంభించావు. ఆ సందర్భం గుర్తుచేసుకో. దేవుడు సమస్తం వింటాడు, ఆయన సర్వం ఎరిగినవాడు. అప్పుడు మీలో రెండు వర్గాలు ధైర్యం కోల్పోయి (యుద్ధరంగం నుంచి) దాదాపు పారిపోజూశాయి. కాని దేవుడు వారిని ఆదుకున్నాడు. అసలు దేవుడే వారి రక్షకుడు, సహాయకుడు. కనుక విశ్వాసులు ఎల్లప్పుడూ ఆయన్నే నమ్ముకొని ఉండాలి. (121-122)
దేవుడు మిమ్మల్ని బద్ర్‌ యుద్ధంలో కూడా ఆదుకున్నాడు. అప్పుడు కూడా మీకు సరైన ఆయుధాలు, సరిపడ ఒనరులు లేవు. (అయినా మీకు మేము విజయం చేకూర్చాం.) అందువల్ల దేవునికి భయపడండి; ఆయనకు కృతజ్ఞులై ఉండండి. (123)
నీవు విశ్వాసులలో ధైర్యం కలిగించడానికి వారితో అన్నమాటలు జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు “(మన) ప్రభువు మూడువేల మంది దైవదూతల్ని దించి మనల్ని ఆదు కోవడం చాలదా మీకు?” అన్నావు. మీరు సహనం వహించి దేవునిపట్ల భయభక్తులతో మసలుకుంటే, శత్రువులు మీపై మెరుపుదాడి చేసినప్పుడు (మూడువేలేమిటి) ఆయన మీకు ప్రత్యేకచిహ్నాలుగల ఐదువేలమంది దూతల్ని పంపి తప్పకుండా ఆదుకుంటాడు. మీకు ధైర్యం వచ్చి మీమనస్సు కుదుటపడేందుకే దేవుడిలా చేశాడు. నిజానికి ఏసహాయ మైనా దేవుని నుండే లభిస్తుంది. ఆయన సర్వశక్తిమంతుడు, ఎంతో వివేచనాపరుడు. అవిశ్వాసుల్లో ఒక వర్గాన్ని తుడిచిపెట్టే ఉద్దేశ్యంతో లేదా వారి పీచమణచి పరాజయం, పరాభవాలతో పారిపోయేలా చేయడానికి ఆయన మీకీ సహాయం చేశాడు. (124-127)
(ప్రవక్తా!) దేవుడు వారిని క్షమించనైనా క్షమిస్తాడు. లేదా దుర్మార్గులైనందున వారిని శిక్షించనైనా శిక్షిస్తాడు. ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి నీకెలాంటి అధికారం లేదు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం దేవునిదే. ఆయన తానుతలచిన విధంగా కొందర్ని క్షమిస్తాడు, కొందర్ని శిక్షిస్తాడు. ఆయన గొప్పక్షమాశీలి, అపారకృపాశీలుడు. (128-129)
విశ్వాసులారా! రెండింతలు, నాల్గింతలు పెరిగే ఈ వడ్డీని తినడం ఇకనైనా మాను కోండి. దేవునికి భయపడండి, మీ జీవితాలు సార్థకమవుతాయి. సత్యతిరస్కారుల కోసం సిద్ధం చేయబడిన నరకాగ్ని నుండి తప్పించుకోండి. దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులయి ఉండండి, మీరు కరుణించబడతారు. మీ ప్రభువు క్షమాభిక్ష వైపు పరుగెత్తండి. అలాగే భూమ్యాకాశాలంత విశాలమైన స్వర్గసీమ వైపుక్కూడా పరుగెత్తండి. అది భయభక్తులు కలవారి కోసం సిద్ధం చేయబడిఉంది. (130-133)
వారు కలిమిలోనూ, లేమిలోనూ తమ సంపద (దైవమార్గంలో) ఖర్చు పెడతారు. కోపోద్రేకాలు దిగమింగుతారు. ఇతరుల తప్పులు క్షమిస్తారు. ఇలాంటి సద్వర్తునులనే దేవుడు ప్రేమిస్తాడు. అదీగాక దేవుడు తప్ప మరెవరూ పాపాలు క్షమించేవారు లేరుగనక తమవల్ల ఏదైనా నీతిమాలిన పనిగాని, లేదా మరేదైనా పాపకార్యంగాని జరిగితే వెంటనే వారు దేవుడ్ని స్మరించి క్షమాపణ చెప్పుకుంటారు. అంతేగాని, తాము చేసిన దానిపై మంకుపట్టు పట్టరు. అలాంటివారికి ప్రతిఫలంగా వారి ప్రభువు నుండి మన్నింపుతో పాటు సెలయేరులు పారే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడే వారు కలకాలం (హాయిగా) ఉంటారు. మంచి పనులకు ఎంత మంచి ప్రతిఫలం లభిస్తుంది! (134-136)
మీకు పూర్వం కూడా అనేక పరిణామాలు సంభవించాయి కాస్త నేల నాలుగు చెరగులా తిరిగిచూడండి, తిరస్కరించినవారికి ఏంగతి పట్టిందో! ఇది (ఖురాన్‌) ప్రజలకు ఓ బహిరంగ ప్రకటన; భయభక్తులుకలవారికి హితబోధిని, మార్గదర్శిని. (137-138)
(విశ్వాసులారా!) బాధపడకండి. అధైర్యంతో క్రుంగిపోకండి. మీరు నిజమైన విశ్వా సులైతే చివరికి మీరే విజయం సాధిస్తారు. (సత్యాసత్యాల సమరంలో) మీరేకాదు, వారు కూడా దెబ్బతిన్నారు. (ఆమాత్రానికే ధైర్యం కోల్పోవడమా!) ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే. ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షిం చడానికి, కొందరిని సత్యానికి సాక్షులు (అమరగతులు)గా చేయడానికి ఈవిధంగా చేశాడు. దేవుడు దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు. ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజ మైన విశ్వాసులు ఎవరో ఏరివేసి, అవిశ్వాసుల్ని అణచి వేయదలిచాడు. (139-141)
మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశిస్తామనుకుంటున్నారా? మీలో దైవమార్గంలో పోరాడే వారిని దేవుడు ఇంకాసరిగా పరీక్షించనే లేదు. వారు ఏమేరకు సహనం వహించి ధ్యేయ పథంలో స్థిరంగా ఉంటారో ఆయన చూడదలిచాడు. ఇదివరకు (దైవమార్గంలో పోరాడి) మరణించే అవకాశం రాకముందు మీరు దాన్ని కోరుతుండేవారు. ఇప్పుడది మీముందుకు వచ్చింది. మీరు దాన్ని కళ్ళారా చూసుకున్నారు కూడా. (కనుక మీరు ప్రాణాలకు తెగించి పోరాడాలిగాని, ధైర్యం కోల్పోయి ఢీలా పడిపోకూడదు.)-(142-143)
ముహమ్మద్‌ దైవప్రవక్త మాత్రమే. ఇతనికి పూర్వం కూడా అనేకమంది దైవప్రవక్తలు వచ్చిపోయారు. మరి ఇతనిప్పుడు చనిపోతే లేక చంపబడితే మీరు (ధర్మపథం నుండి) వెనుదిరిగిపోతారా? గుర్తుంచుకోండి, అలా వెనుదిరిగిపోయేవాడు దేవునికి ఎలాంటి నష్టం కల్గించలేడు. దేవుడు తనకు కృతజ్ఞత చూపేవారికే తగినబహుమానం ఇస్తాడు.
దేవుని అనుజ్ఞ లేనిదే నిర్ణీత సమయానికి ముందు ఏ ప్రాణికీ చావు రాదు. ప్రతి ప్రాణికీ మరణకాలం వ్రాయబడి ఉంది. కేవలం ప్రాపంచిక ప్రతిఫలాపేక్షతో పనిచేసే వారికి మేము ప్రపంచంలోనే వారి ప్రతిఫలం ఇచ్చివేస్తాం. పరలోక ప్రతిఫలాపేక్షతో పని చేసేవారికి పరలోకంలో వారికి రావలసిన ప్రతిఫలం అనుగ్రహిస్తాం. కృతజ్ఞులై ఉండే వారికి మేము తప్పకుండా తగిన బహుమానం ప్రసాదిస్తాము. (144-145)
ఇంతకు పూర్వం ఎంతోమంది దైవప్రవక్తలు గతించారు. వారితో కలసి దైవభక్తులు ప్రాణాలొడ్డి పోరాడారు. అప్పుడు దైవమార్గంలో ఎదురైన కష్టాలవల్ల వారు ధైర్యం కోల్పో లేదు. పిరికిచర్యలకు పాల్పడి అధర్మానికి తలవంచనూ లేదు. అలాంటి స్థిరచిత్తులనే దేవుడు ప్రేమిస్తాడు. వారు (దైవాన్ని వీడకుండా) “ప్రభూ! మా తప్పులు మన్నించు. నీ మార్గంలో మేమేదైనా హద్దుమీరి వుంటే దాన్ని కూడా క్షమించు. మా కాళ్ళకు స్థిరత్వం చేకూర్చి అవిశ్వాసులపై మాకు విజయం చేకూర్చు” అని వేడుకున్నారు. కనుక దేవుడు వారికి ప్రపంచంలో తగినప్రతిఫలం ఇచ్చాడు; పరలోకంలో అంతకంటే ఎంతోశ్రేష్ఠమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అలాంటి సద్వర్వునులనే దేవుడు ప్రేమిస్తాడు. (146-148)
విశ్వాసులారా! మీరు గనక అవిశ్వాసులు చేప్పే మాటలు వింటే వారు మిమ్మల్ని తిరిగి అవిశ్వాసం వైపు తీసికెళ్తారు. అప్పుడు మీరు ఘోరంగా నష్టపోతారు. (వారు మీ శ్రేయోభిలాషులు కాదు.) దేవుడే మీ శ్రేయోభిలాషి, సహాయకుడు. ఆయనే అందరికన్నా గొప్ప సహాయకుడు. త్వరలోనే మేము సత్యతిరస్కారుల హృదయాల్లో మీపట్ల భయో త్పాతం కలిగిస్తాము. దేవుడు ఎలాంటి ప్రమాణం పంపకపోయినా, వారాయనకు (దైవత్వంలో) సాటి కల్పించారు. కనుక వారి అంతిమ నివాసం నరకమవుతుంది. అది దుర్మార్గుల కోసం తయారయిఉన్న పరమ చెడ్డనివాసం. (149-151)
దేవుడు మీకు చేసిన (సహాయ) వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రారంభంలో మీరే దేవుని ఆజ్ఞతో అవిశ్వాసుల్ని వధిస్తుండేవారు. కాని ఆ తరువాత మీరు కోరుకున్నదాన్ని (అంటే సమర సొత్తును) దేవుడు చూపగానే మీరు ధైర్యం కోల్పోయారు. (ప్రవక్త ఇచ్చిన) ఆజ్ఞ విషయంలో మీరు పరస్పరం విభేదాలకు లోనై అవిధేయత చూపారు. మీలో కొందరు ప్రాపంచిక సంపదను ఆశించారు. మరికొందరు పరలోక ప్రతిఫలం కోరుకున్నారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి శత్రువుల నుండి మీదృష్టిని (వేరే వైపునకు) మరల్చి పారిపోయేలా చేశాడు. అయితే మీరలా పారిపోయినప్పటికీ దేవుడు మిమ్మల్ని క్షమించాడు. ఆయన విశ్వాసుల పాలిట అత్యంత దయామయుడు. (152)
(ఉహుద్‌ యుద్ధంలోని) మరో సంఘటన గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీరు వెనుదిరిగి చూడనైనా చూడకుండా పారిపోసాగారు. వెనకాల దైవప్రవక్త మిమ్మల్ని పిలు స్తున్నా మీరు విన్పించుకునే స్థితిలో లేకపోయారు. ఈ వైఖరికి శాస్తిగా దేవుడు మీకు పుట్టెడు దుఃఖం కలిగించాడు. భవిష్యత్తులో మీనుండి ఏదైనా వస్తువు చేజారిపోయినా లేక మరేదైనా ఆపద వచ్చినా మీరు చింతించకుండా ఉండేందుకు ఈవిధంగా దేవుడు మీకొక గుణపాఠం నేర్పాడు. మీరు చేసే పనులన్నీ దేవునికి బాగా తెలుసు. (153)
ఈ బాధ, దుఃఖం తర్వాత దేవుడు మీలో కొందరిపై ప్రశాంతి అవతరింపజేశాడు. తత్ఫలితంగా వారు ఒక విధమైన కునుకుపాటుకు లోనయ్యారు.
అయితే స్వప్రయోజనాలు ఆశిస్తుండినవారు దేవుని విషయంలో అజ్ఞానంతో కూడిన అనుమానంతో “ఈ విషయంలో మాకేమీ అధికారం లేదా?” అని అడిగారు. “అన్ని విషయాల్లో దేవుడే సర్వాధికారి” అని చెప్పు. వారు కొన్ని విషయాలు నీ ముందు వెలిబుచ్చకుండా మనసులోనే దాచుకున్నారు. పైగా “మాకే గనక అధికారం ఉంటే మేమిక్కడికి వచ్చి వధించబడేవారం కాదు” అంటారు. చావు మీ నొసట రాసిఉంటే, మీరు మీ ఇండ్లలో ఉన్నా సరే మీమీ వధ్య స్థలాలకు తప్పకుండా తరలివస్తారు. మీ అంతరంగాల్లో దాగివున్నదాన్ని పరీక్షించి దాని కాపట్యాన్ని కడిగివేయాలనే దేవుడిలా చేశాడు. అంతరంగాల స్థితి అందరికన్నా ఆయనకే బాగా తెలుసు. (154)
మీలో కొందరు (ఉహుద్‌ యుద్ధంలో) శత్రువుల్ని ఎదుర్కొనేటప్పుడు వెన్నుజూపి పారిపోయారు. వారిలోని కొన్ని బలహీనతల కారణంగానే షైతాన్‌ వారి మనోస్థయి ర్యాన్ని దెబ్బతీసి పారిపోయేలా చేశాడు. అయినప్పటికీ దేవుడు వారిని క్షమించాడు. దేవుడు గొప్ప క్షమాశీలి, అత్యంత ఉదారుడు. (155)
విశ్వాసులారా! మీరు అవిశ్వాసుల మాదిరిగా మాట్లాడకండి. వారి (ముస్లిం) బంధుమిత్రులు ఎప్పుడైనా ప్రయాణావస్థలోనో, యుద్ధరంగంలోనో ఉండి ఏదైనా ప్రమా దానికి గురైతే, “వారు తమతో పాటు ఉండినట్లయితే చనిపోవడంగాని, చంపబడటం గాని జరిగిఉండేది కాదు” అని అంటారు వారు. వారు పలికిన ఈ పలుకులకు దేవుడు వారిని తీవ్రమైన పశ్చాత్తాపం, నిస్పృహలకు గురిచేస్తాడు. నిజానికి జీవన్మరణాలు దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన మీ చర్యల్ని గమనిస్తూనే ఉన్నాడు. (156)
మీరు దైవమార్గంలో చనిపోయినా లేక చంపబడినా దేవుని నుండి మీకు లభించే క్షమాభిక్ష, కారుణ్యాలు వారు కూడబెడ్తున్న ఐహికసంపదలకన్నా ఎంతో శ్రేష్ఠమైనవి. మీరు చనిపోయినా, చంపబడినా దైవసన్నిధిలో మీరంతా తప్పక సమీకరించబడతారు.#
(ముహమ్మద్‌!) దైవానుగ్రహంవల్లనే నీవు వారి విషయంలో ఎంతో మృదుహృద యుడవయ్యావు. నీవు కోపిష్టి, కఠిన హృదయుడవైఉంటే వారంతా నీకు దూరమయ్యే వారు. ఒక్కడూ నీ చెంతకు చేరేవాడు కాదు. కనుక నీవు వారిని క్షమించు. వారి పొరపాట్ల కోసం (దేవుని) మన్నింపు అర్థించు. నీవు తలపెట్టే పనుల విషయంలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని మీద భారం వెయ్యి. దేవుడు తనను నమ్ముకున్నవారినే ప్రేమిస్తాడు. (157-159)
దేవుడు సహాయం చేయదలిస్తే ఇక ఏశక్తీ మీపై ఆధిక్యత వహించదు. ఒకవేళ ఆయన మిమ్మల్ని మీమానాన వదిలేస్తే, ఆతర్వాత మీకెవరు సహాయం చేయగలరు? కనుక నిజమైనవిశ్వాసులు దేవుడ్నే నమ్ముకోవాలి. ఏ దైవప్రవక్త కూడా ఎలాంటి పరిస్థితి లోనూ నమ్మకద్రోహానికి పాల్పడడు. నమ్మకద్రోహం చేసినవాడు ఆ నమ్మకద్రోహంతో ప్రళయదినాన హాజరవుతాడు. అప్పుడు ప్రతివ్యక్తికీ అతను చేసుకున్న కర్మల ప్రకారమే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (160-161)
ఎల్లప్పుడూ దేవుని అభీష్టం ప్రకారం నడచుకునే వ్యక్తి దైవాగ్రహానికి గురైనవాడిలా ఎలా ప్రవర్తించగలడు? దైవాగ్రహానికి గురైనవాడికి నరకమే తగిన నివాసం. అది మహా చెడ్డ నివాసం. దేవుని దృష్టిలో వారిద్దరి మధ్య అనేక రెట్ల వ్యత్యాసముంది. దేవుడు వారి పనుల్ని గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు విశ్వసించినవారిలో వారి జాతికి చెందిన ఒక ప్రవక్తను ప్రభవింపజేసి వారికి గొప్ప మేలు చేశాడు. ఆ ప్రవక్త వారికి దేవుని సూక్తులు విన్పిస్తూ వారిజీవితాల్ని తీర్చిదిద్దుతున్నాడు. వారికి గ్రంథజ్ఞానం, వివేకాలు బోధిస్తున్నాడు. ఇదివరకు వారు పూర్తిగా అపమార్గంలో పడిఉండేవారు. (162-164)
ఇప్పుడు మీ పరిస్థితి ఇలా అయ్యిందేమిటీ? (దైవమార్గంలో) మీపై కాస్తంత ఆపద వచ్చిపడగానే ఇదెక్కడ్నుంచి దాపురించింది అంటారేమిటీ? (బద్ర్‌ యుద్ధంలో) మీ చేతుల మీదుగా దీనికి రెండింతల ఆపద (మీ ప్రత్యర్థి వర్గంపై) విరుచుకుపడింది కదా! (ఆ సంగతి మరచిపోయారా?) ప్రవక్తా! “ఈ ఆపద మీరు చేజేతులా కొనితెచ్చుకున్నదే నని” వారికి చెప్పు. దేవుడు ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (165)
(ఉహుద్‌) యుద్ధంలో మీకు జరిగిన నష్టం దేవుని అనుజ్ఞతోనే జరిగింది. మీలో నిజమైన ముస్లిములెవరో, కపట ముస్లిములెవరో పరీక్షించడానికే దేవుడిలా చేశాడు. ఆ కపటులతో “రండి, దైవమార్గంలో పోరాడండి. (శత్రు)దాడిని తిప్పికొట్టి (మీ నగరాన్ని) కాపాడుకోండి” అని అన్నప్పుడు “యుద్ధం సంగతి మాకు తెలిసివుంటే మేము తప్ప కుండా మీతో చేరేవాళ్ళం” అని సమాధానమిచ్చారు. ఈ మాటలు అంటున్నప్పుడు వారు విశ్వాసం కన్నా అవిశ్వాసానికే ఎక్కువ చేరువగా ఉన్నారు. వారు తమ హృదయాల్లోలేని మాటలు పైకి చెబుతున్నారు. వారు తమ హృదయాల్లో దాచినదేమిటో దేవునికి బాగా తెలుసు. (166-167)
వారు (యుద్ధానికి బయలుదేరకుండా ఇంట్లో)కూర్చొని (దైవమార్గంలో ప్రాణ త్యాగం చేయడానికి వెళ్ళిన) తమ బంధుమిత్రుల్ని గురించి “వారు మామాట విని ఉంటే ఇలా వధించబడి ఉండేవారు కాదు” అని చెప్పారు. ప్రవక్తా! వారినిలా అడుగు: “మీ అభిప్రాయం నిజమైతే మీకు దాపురించే మృత్యువుని అడ్డుకోండి చూద్దాం.” (168)
(దైవమార్గంలో వధించబడినవారిని) మృతులని భావించకండి. వారసలు (చనిపో లేదు.) దేవునిదృష్టిలో బ్రతికేఉన్నారు. పైగా వారు తమ ప్రభువు దగ్గర ఉపాధి (ఆహారం) కూడా పొందుతున్నారు. వారు తమకు దేవుడు దయతో ప్రసాదించిన దానిపట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. తమతో చేరకుండా ఇంకా ఇహలోకంలోనే ఉండిపోయినవారికి కూడా (పరలోకంలో) ఎలాంటి భయంగాని, విచారంగాని ఉండదని తెలుసుకొని వారు నిశ్చింతగాఉన్నారు. వారు దేవుని కరుణాకటాక్షాల పట్ల ఎంతో ఆనందిస్తున్నారు. దేవుడు విశ్వాసుల పుణ్యఫలాన్ని ఎన్నటికీ వృధాచేయడని వారికి తెలుసు. (169-171)
(యుద్ధంలో) గాయపడిన తరువాత కూడా చాలామంది దేవుడు, ఆయన ప్రవక్త ఇచ్చిన పిలుపుకు వెంటనే స్పందించారు. వారిలో సజ్జనులు, దైవభీతిపరులైన వారి కోసం (దేవుని దగ్గర) గొప్ప ప్రతిఫలం ఉంది. “మీపై దాడిచేయడానికి అవిశ్వాసులు పెద్ద ఎత్తున సైన్యాలు సమీకరిస్తున్నారు, వారికి భయపడండి” అని జనం అన్నప్పుడు వారు ద్విగుణీకృత విశ్వాసంతో “మాకు దేవుడే చాలు, ఆయన గొప్ప కార్యసాధకుడు” అని సమాధానమిచ్చారు. చివరికి వారు దేవుని అనుగ్రహంతో, బహుమానాలతో తిరిగి వచ్చారు. వారికి ఎలాంటి నష్టం జరగలేదు. వారు దేవుని అభీష్టం ప్రకారం నడుచు కున్నారు. దేవుడు (ఇలాంటివారికే) అపారంగా అనుగ్రహించేవాడు. (172-174)
అసలు షైతానే తన మిత్రమూకను గురించి ప్రజలను భయపెట్టేవాడు. జాగ్రత్త! మీరు నిజమైన విశ్వాసులైతే ఈ పిశాచ మిత్రమూకకు ఎన్నటికీ భయపడకూడదు. నాకే భయపడాలి. అవిశ్వాసం వైపు పరుగెత్తేవారి చేష్టల పట్ల నీవు బాధపడకు. వారు దేవునికి ఎలాంటి నష్టం కలగజేయలేరు. దేవుడు వారికి పరలోకంలో ఎలాంటి ప్రతిఫలం ఇవ్వ దలచుకోలేదు. వారికి ఘోరమైన (నరక) యాతన రాసిపెట్టి ఉంది. (175-176)
విశ్వాసానికి బదులు అవిశ్వాసం కొని తెచ్చుకున్నవారు దేవునికి ఎలాంటి నష్టం కల్గించలేరు. వారికోసం అతి బాధాకరమైన శిక్ష కాచుకొనిఉంది. కనుక మేము అవిశ్వా సుల్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నామని, ఇది తమకెంతో మంచిదని వారు భావించ రాదు. వారు మరిన్ని పాపాలు చేసుకోవడానికే మేమిలా ఉపేక్షించి అవకాశమిస్తున్నాం. చివరికి వారు అతి నీచమైన యాతనకు గురికావలసిఉంటుంది. (177-178)
దేవుడు విశ్వాసుల్ని ప్రస్తుతం వారున్న స్థితిలో ఎంతోకాలం ఉండనివ్వడు. ఆయన అపవిత్రుల నుండి పవిత్రుల్ని తప్పకుండా వేరుచేస్తాడు. అయితే (ముందు జరగబోయే) అగోచరవిషయాల్ని గురించి మీకు తెలియజేయడం దేవుని అభిమతం కాదు. దీనికోసం ఆయన తన ప్రవక్తల నుండి తాను కోరినవారిని ఎన్నుకుంటాడు. కనుక మీరు దేవుడ్ని, ఆయన ప్రవక్తల్ని విశ్వసించండి. మీరు సత్యాన్ని విశ్వసించి భయభక్తులతో నడచుకుంటే మీకు గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. (179)
దేవుడు తన అనుగ్రహంతో ప్రసాదించిన సంపద విషయంలో పిసినారితనం వహించేవారు ఆ పిసినారితనం తమకు మేలు చేకూరుస్తుందని భావించకూడదు. అది వారికి హాని కలిగిస్తుంది. వారు ఏ ధనం విషయంలో పిసినారితనం వహిస్తున్నారో అది రేపు ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. యావత్తు భూమ్యాకాశాలకు దేవుడే వారసుడు. మీరు చేస్తున్నదంతా దేవునికి బాగా తెలుసు. (180)
“దేవుడు దరిద్రుడు, మేమే ధనికులం”అన్నవారి ఆ పలుకులు దేవుడు విన్నాడు. వారి కారుకూతల్ని మేము (వారి కర్మచిట్టాలో) వ్రాస్తున్నాం. వారు దైవప్రవక్తల్ని అన్యా యంగా హతమార్చిన విషయాన్ని కూడా మేము వ్రాశాం. మేము ప్రళయదినాన వారితో “మీరు చేజేతులా చేసుకున్న కర్మల పర్యవసానంగా ఇప్పుడిక నరక యాతనలు చవి చూడండ”ని అంటాం. దేవుడు తనదాసులపై ఎన్నటికీ దౌర్జన్యం చేయడు. (181-182)
వారిలా అంటారు: “మేము ఏ దైవప్రవక్తను విశ్వసించాలన్నా అతను మాముందు ఏదైనా బలివ్వాలి. దాన్ని ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చివేయాలి. అలాంటి బలివ్వనంత వరకు ఏ దైవప్రవక్తనూ విశ్వసించరాదని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు.” (ముహమ్మద్‌!) వారిని అడుగు: “నాకు పూర్వం ఎందరో ప్రవక్తలు మీ దగ్గరకు స్పష్టమైన సూచనలు, నిదర్శనాలు తెచ్చారు. ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్న మహిమలు (నిదర్శనాలు) కూడా తెచ్చారు. మరి మీరు నీతిమంతులైతే వారిని ఎందుకు హతమార్చారు?” (183)
(ముహమ్మద్‌!) వారు నిన్ను తిరస్కరిస్తే (దానివల్ల నీకు, దైవానికి కలిగే నష్టమేమీ లేదు.) నీకు పూర్వం కూడా స్పష్టమైన ప్రమాణాలు, నిదర్శనాలు, దైవాదేశ ఫలకాలు, తేజోమయ గ్రంథాలు తీసుకొచ్చినా అనేకమంది ప్రవక్తలు తిరస్కరించబడ్డారు. చివరికి ప్రతిమనిషీ ఓరోజు చావాల్సిందే. మీకర్మలకు ప్రళయదినాన పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. నరకానికి దూరంగా స్వర్గానికి పంపబడేవాడే నిజమైన కృతార్థుడు. ఐహిక జీవితం, (దాని సౌఖ్యాలు) ఒట్టి మోసపూరితమైన పైపై మెరుగులు మాత్రమే. (184-185)
ముస్లిములారా! (భవిష్యత్తులో) మీరు ధనప్రాణాల విషయంలో అనేక కఠిన పరీక్ష లకు గురికావలసి వస్తుంది. అదీగాక మీరు గ్రంథప్రజల నుండి, బహుదైవారాధకుల నుండి కూడా మనస్సు నొప్పించే మాటలు అనేకం వినవలసి వస్తుంది. కనుక అలాంటి స్థితిలో మీరు సహనం వహించి, భయభక్తులతో కూడిన జీవితం గడుపుతూ ధర్మమార్గం లో స్థిరంగా ఉండాలి. నిజంగా ఇది ఎంతో సాహసోపేతమైన కార్యం. (186)
గ్రంథప్రజలకు గుర్తు చెయ్యి: “మీకు ప్రసాదించబడిన గ్రంథంలోని విషయాలు దాచకుండా (యధాతథంగా) ప్రజలకు బోధించాలి” అని దేవుడు వారిచేత ప్రమాణం చేయించాడు. కాని ఆతర్వాత వారు దాన్ని అటకాకెక్కించారు. అతిస్వల్ప మూల్యానికి అమ్మివేశారు. ఇలా వారు అతినీచమైన సంపాదనకు పాల్పడ్డారు. (187)
వారు తమనిర్వాకాలు చూసుకొని మురిసిపోతున్నారు. తామసలు చేయని పనుల గురించి ప్రశంసలు పొందగోరుతున్నారు. అలాంటివారు నరకయాతనలు తప్పించు కుంటారని భావించకు. వారు తప్పక దుర్భరమైన నరకయాతనలు చవిచూస్తారు. (188)
దేవుడే భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. భూమ్యాకాశాల నిర్మాణంలో, రాత్రింబవళ్ళ చక్రభ్రమణం లో యోచించేవారికి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఆ యోచనాపరులు నిల్చొని, కూర్చొని, పడుకొని- ఏ స్థితిలో ఉన్నాసరే ఎల్లప్పుడూ దేవుడ్ని స్మరిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు భూమ్యాకాశాల నిర్మాణం గురించి పరిశీలిస్తూ ఇలా ప్రార్థిస్తారు:
“ప్రభూ! నీవు ఈ విశ్వాన్ని నిష్ప్రయోజనంగా, లక్ష్యరహితంగా సృజించలేదు. నీవు పరమ పవిత్రుడవు. మమ్మల్ని నరకయాతనల నుండి కాపాడు. నీవు నరకంలో పడవేసిన వాడ్ని ఘోరమైన అవమానానికి గురిచేసినట్లే. అలాంటి దుర్మార్గులకు ఎవరూ సహాయ పడలేరు. ప్రభూ! మేము విశ్వాసం వైపు పిలిచేవాని పిలుపు విన్నాం. మీ ప్రభువుని విశ్వ సించండని ఆయన మమ్మల్ని చెప్పగానే మేము నిన్ను విశ్వసించాం. కనుక ప్రభూ! మా తప్పులు క్షమించు. మాలోని చెడుల్ని తొలగించు. మాకు పుణ్యాత్ములకు వచ్చే మరణం లాంటి మంచిమరణం కల్గించు. ప్రభూ! నీవు నీప్రవక్తల ద్వారా వాగ్దానం చేసినవాటిని మాకు ప్రసాదించు. నీవు ఎట్టి పరిస్థితిలోనూ వాగ్దాన భంగం చేయవని మాకు తెలుసు. కనుక ప్రళయదినాన మమ్మల్ని నలుగురిలో పరాభవం పాల్జేయకు.”(189-194)
అప్పుడు వారిప్రభువు వారి మొరాలకించి ఇలా అన్నాడు: “నేను మీలో ఎవరి కర్మల్నీ వృధాచేయను. స్త్రీలైనా, పురుషులైనా మీరంతా పరస్పరం ఒకే సృష్టిరాసికి చెందినవారు. నా కోసం ఎవరెవరు తమ స్వస్థలాలు వదలి వచ్చారో, ఎవరెవరు తమ ఇండ్ల నుండి వెడల గొట్టబడ్డారో, ఎవరెవరు వేధించబడ్డారో, ఎవరెవరు పోరాడారో, (ఆ పోరాటంలో ఎవరెవరు) హతమార్చబడ్డారో వారందరి పొరపాట్లు మన్నించి వారిని సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను.” ఇదీ దేవుని దగ్గర (వారికి) లభించే ప్రతిఫలం. దేవుని దగ్గరే శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది. (195)
ప్రవక్తా! ప్రపంచ దేశాలలో సత్యతిరస్కారుల తిరుగుళ్ళు, తీరుతెన్నుల్ని చూసి నీవు మోసపోకు. ఇది మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. తరువాత వారి శాశ్వత నివాసం నరకం అవుతుంది. అది పరమ చెడ్డనివాసం. అయితే తమ ప్రభువు పట్ల భయభక్తులతో మసలుకుంటూ నీతిమంతమైన జీవితం గడిపేవారి కోసం సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయి. అక్కడే వారు కలకాలం (హాయిగా)ఉంటారు. ఇదీ దైవసన్నిధిలో వారికి లభించే ఆతిథ్యం. పుణ్యాత్ములకు దేవుని దగ్గర (స్వర్గంలో) ఉన్నదే అన్నిటికంటే ఎంతో శ్రేష్ఠమైనది. (196-198)
గ్రంథప్రజలలో కూడా కొందరు సదాచారసంపన్నులు ఉన్నారు. వారు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని, దీనికి పూర్వం తమ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తారు. అదీగాక వారు దేవుని ముందు వినమ్రులయి మోకరిల్లు తారు. దేవుని సూక్తులను (ప్రాపంచిక ప్రయోజనాలకు ఆశపడి) అత్యల్ప మూల్యానికి అమ్ముకునేవారు కాదు. వారికి లభించవలసిన ప్రతిఫలం వారి ప్రభువు దగ్గర సుర క్షితంగా ఉంది. దేవుడు విచారణ జరపడంలో ఏమాత్రం ఆలస్యం చేయడు. (199)
విశ్వాసులారా! సహనం పాటించండి. మిధ్యావాదుల ముందు ధైర్యసాహసాలు ప్రదర్శించండి. ధర్మసేవ కోసం నడుం బిగించండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడే మీరు (ఇహపరాల్లో) కృతార్థులవుతారని ఆశించగలరు. (200)