కురాన్ భావామృతం/అల్-వాఖియా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
56. వాఖిఆ (సంఘటన)
(అవతరణ: మక్కా; సూక్తులు: 96)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
జరగవలసిన సంఘటన జరిగినప్పుడు ఇక దాన్ని ఏ ఒక్కరూ నిరాకరించలేరు. అది (విశ్వవ్యవస్థను) అస్తవ్యస్థం చేసివేసే మహోపద్రవం! అప్పుడు యావత్తు భూ మండలం ఒక్కసారిగా కుదిపి వేయబడుతుంది. పర్వతాలు సైతం తునాతునకలయి ఆకాశంలో ధూళిరేణువుల్లా ఎగురుతాయి. (1-6)
అప్పుడు మీరు మూడు వర్గాలుగా చీలిపోతారు: కుడిపక్షంవారు, ఆహా కుడిపక్షం వారి (అదృష్టం) గురించి ఏమని వర్ణించాలి! ఎడమపక్షంవారు, ఎడమపక్షంవారి (దౌర్భాగ్యం) గురించి ఇక చెప్పేదేముంది! ముందుండేవారు, (ప్రతి సత్కార్యంలో) వారు ముందుండేవారే! వారే (దైవ)సన్నిహితులు. వారు అపార సౌఖ్యాలతో కూడిన స్వర్గవనాలలో ఉంటారు. (7-12)
ముందు తరాలవారిలో (దైవసన్నిహితులు) అత్యధికంగా ఉంటారు. తర్వాతి తరాలవారిలో తక్కువమంది ఉంటారు. వారు రత్నఖచిత ఆసనాల మీద మెత్తటి దిండ్ల కానుకొని పరస్పరం ఎదురెదురుగా కూర్చుంటారు. (13-16)
వారి సమావేశాలలో నిత్యబాలకులు వారుణీవాహిని నుండి స్వచ్ఛమైన మధువు తో నిండిన గిన్నెలు-గ్లాసులు-కూజాలు తీసుకొని అటూఇటూ తిరుగుతారు. ఆ మధువు సేవిస్తే వారికి ఏమాత్రం మైకం కమ్మడంగాని, బుద్ధి మందగించడంగాని జరగదు. వారు కోరిన పండ్లు తినడానికి ఆ బాలకులు వారి ముందు రకరకాల రుచికరమైన పండ్లు ఉంచుతారు. అలాగే వారికిష్టమైన పక్షుల మాంసం కూడా. (17-21)
వారికోసం అక్కడ అందమైన కళ్ళుగల సుందరాంగులుంటారు. ప్రత్యేకంగా వారి కోసమే దాచిపెట్టిన ముత్యాల్లాంటి ముగ్ధమనోహర సౌందర్యరాసులు వారు. ఇవన్నీ వారు ఐహిక జీవితంలో చేసుకున్న సత్కార్యాలకు ప్రతిఫలంగా ప్రసాదించబడతాయి. వారక్కడ ఎలాంటి వ్యర్థవిషయాలుగాని, దూషణలుగాని వినరు. ప్రతి మాటా సమంజ సంగా, సుహితంగానే ఉంటుంది. (22-26)
ఇక కుడిపక్షంవారు, కుడిపక్షంవారి అదృష్టమే అదృష్టం! ముళ్ళులేని రేగుచెట్ల పండ్లు, అరటిగెలలు, సుదూరంగా విస్తరించిన చల్లటినీడలు, ఎడతెగకుండా ప్రవహించే మంచినీరు, ఎన్నటికీ అంతంగాని సులభంగా అందుబాటులోఉండే అసంఖ్యాకమైన సుమధుర ఫలాలు, ఎత్తయిన పరుపులు (మొదలైన) భోగభాగ్యాలలో వారు ఓలలాడు తుంటారు. వారి భార్యలను మేము ప్రత్యేక పంథాలో సరికొత్తగా సృజిస్తాం. వారిని మేము నిత్యనూతన కన్యలుగా రూపొందిస్తాం. వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు. సమవయస్కులైన సతులు వారు (27-38)
ఇవన్నీ కుడిపక్షంవారికి లభించే మహాభాగ్యాలు. ఇలాంటివారు ముందు తరాలలో, తరువాతి తరాలలోనూ చాలామంది ఉంటారు. (39-40)
పోతే ఎడమపక్షంవారు- ఎడమపక్షంవారి దౌర్భాగ్యం గురించి ఏమని చెప్పాలి? వారు (నరకంలో శరీరాన్ని మలమల మాడ్చివేసే వడగాల్పుల మధ్య సలసల మరిగే నీటిని తాగుతూ, ఎలాంటి సుఖాన్నిగాని, చల్లదనాన్నిగాని ఇవ్వని నల్లటి కారుపొగల్లో (నానా యాతనలు అనుభవిస్తూ) ఉంటారు. (41-44)
ఈ పర్యవసానానికి ముందు వీరు (ఇహలోకంలో) భోగభాగ్యాలు అనుభవిస్తూ, ఘోరమైన పాపకార్యాల్లో కూరుకుపోయి వాటి విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఉండేవారు. పైపెచ్చు “మేము చచ్చి మట్టిలో కలసిపోయి అస్తిపంజరాల్లా మారి పోయాక మళ్ళీ బ్రతికించి లేపబడతామా? గతంలో చనిపోయిన మా తాతముత్తాతలను కూడా బ్రతికించి లేపడం జరుగుతుందా?” అని అనేవారు. (45-48)
“మీ పూర్వీకుల్ని, ఆ తర్వాత తరాలవారందర్నీ తప్పకుండా (బ్రతికించి) సమావేశ పరచడం జరుగుతుంది. దాని సమయం నిర్ణయించబడింది” అని చెప్పు. (49-50)
కనుక సత్యాన్ని నిరాకరించిన భ్రష్టులారా! మీరు జఖ్ఖూమ్ (నాగజెముడు) వృక్షాన్ని తప్పక తినవలసిఉంటుంది. దాంతోనే మీరు (భరించలేనిఆకలితో) ఆవురావురుమంటూ కడుపు నింపుకుంటారు. ఆపై దప్పికగొన్న ఒంటెల్లా సలసలకాగే నీటిని (గటగట) త్రాగు తారు. ఇదే తీర్పుదినాన ఎడమపక్షంవారికి లభించే ఆతిథ్యం! (51-56)
మేము స్వయంగా మిమ్మల్ని సృష్టించామే, మరి మీరెందుకు(మామాటలు) అంగీ కరించరు? మీరు వదిలే రేతస్సును గురించి ఎప్పుడైనా ప్రశాంతంగా ఆలోచించారా? దాని ద్వారా శిశువుని రూపొందిస్తున్నది మీరా లేక మేమా? మేము మీకోసం మరణం నిర్ణయించాం. మేము మీరూపురేఖల్ని మార్చి మీరెరుగని ఆకారంలో మిమ్మల్ని తిరిగి సృజించలేని అశక్తులం కాము. (మేము తలచుకుంటే ఏదైనా చేయగలం.)- (57-61)
మీకు మీ తొలిపుట్టుక గురించి తెలిసేవుంది. (ఈ విషయంలో మా శక్తిసామర్థ్యాల్ని మీరు అనుదినం చూస్తూనే ఉన్నారు.) అలాంటప్పుడు (మరణానంతరం కర్మవిచారణ కోసం మిమ్మల్ని పునర్జీవింపజేస్తామన్న మామాటల్ని) మీరెందుకు గ్రహించరు? (62)
మీరు పొలాల్లో నాటే విత్తనాల్ని గురించి ఆలోచించారా? ఆ విత్తనాలతో పంటలు మీరు పండిస్తున్నారా లేక మేమా? మేము తలచుకుంటే ఆ పంటపొలాల్ని నుగ్గునుగ్గు చేసేయగలం. అప్పుడు మీరు విచారపడుతూ “అయ్యయ్యో! మా శ్రమ, పెట్టుబడి అంతా వృధా అయ్యిందే! అసలు మా నొసటే దౌర్భాగ్యం రాసిఉంది” అని రకరకాలుగా చెప్పుకుంటారు. సరే మీరు త్రాగే ఈనీటిని కళ్ళుతెరచి చూశారా? దాన్ని మేఘాల నుండి మీరు కురిపిస్తున్నారా లేక మేమా? మేము తలచుకుంటే దాన్ని తీవ్రమైన ఉప్పునీటిగా మార్చేయగలం. మరి మీరు (మాపట్ల) ఎందుకు కృతజ్ఞులై ఉండరు? (63-70)
పోనీ, మీరు మండించే ఈ నిప్పు గురించి ఎప్పుడైనా కాస్త ఆలోచించారా? దానికి ఉపయోగపడుతున్న చెట్లను మీరు సృష్టించారా లేక మేమా? మేము దాన్ని స్మారక చిహ్నంగా, వినియోగదారులకు జీవనసామగ్రిగా చేశాం. (71-73)
కనుక ప్రవక్తా! మహోన్నతుడయిన నీ ప్రభువు పేరు స్మరించు. (74)
అందువల్ల మానవులారా! మీరనుకున్నది ఎంతమాత్రం నిజంకాదు. నేను నక్షత్రాల కక్ష్యల సాక్షిగా చెబుతున్నాను. మీరు గ్రహించగలిగితే ఇది గొప్ప ప్రమాణం. ఇది సురక్షిత గ్రంథంలో (రాయబడి) ఉన్న మహిమాన్వితమైన ఖుర్‌ఆన్. దీన్ని పవిత్రులు, పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సర్వలోక ప్రభువు నుండి అవతరించిన (దివ్య)వాణి. ఇలాంటి (అద్భుత)వాణిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? దీన్ని నిరాకరించ డమే బ్రతుకు తెరువుగా పెట్టుకున్నారా? (75-82)
సరే, (మరో విషయం వినండి.) చనిపోతున్న మనిషి ప్రాణం మీరు కళ్ళారా చూస్తుండగానే అతని కంఠందాకా వచ్చి, బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని మీరెందుకు ఆపలేరు? మీరు ఎవరి అదుపాజ్ఞలో లేరనుకుంటే ఈపని ఎందుకు చేయలేరు? అప్పుడా చనిపోతున్న వాడికి మీకంటే మేమే చాలా దగ్గరగా ఉంటాము. అయితే మీ కళ్ళకు కన్పించము. (83-87)
ఆ వ్యక్తి (దైవ)సన్నిహితుల్లోని వాడయిఉంటే అతనికి అపరిమితమైన సౌఖ్యాలు, మంచి ఆహారం, భోగభాగ్యాలతో కూడిన స్వర్గవనాలు లభిస్తాయి. ఒకవేళ కుడిపక్షానికి చెందిన వాడయితే ‘నీకు శాంతి కలుగుగాక! నీవు కుడిపక్షం వారిలోని వాడవు’ అని అతనికి స్వాగతం చెప్పబడుతుంది. ఒకవేళ అతను సత్యాన్ని తిరస్కరించి మార్గభ్రష్టుల్లో చేరినవాడయిఉంటే అతడ్ని నరకంలోకి విసిరేసి, సలసల కాగే నీటితో ఆతిథ్యం ఇవ్వ బడుతుంది. (88-94)
ఇవన్నీ తిరుగులేని సత్యాలు. కనుక మహోన్నతుడయిన నీప్రభువు పేరు స్మరించు. (95-96)