కురాన్ భావామృతం/అల్-ముమ్ తహినా
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
60. ముమ్తహిన (పరీక్షిత మహిళ)
(అవతరణ: మదీనా; సూక్తులు: 13)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
విశ్వాసులారా! మీరు నామార్గంలో పోరాడేందుకు, నాప్రసన్నత కోసం (స్వస్థలం వదలి) బయలుదేరితే నాకూ, మీకూ (ఉమ్మడి) శత్రువులైనవారితో స్నేహం చేయకండి. మీ దగ్గరకొచ్చిన సత్యాన్ని తిరస్కరించినవారికి మీరెలా స్నేహహస్తం అందిస్తారు? మీరు కేవలం మీ ప్రభువైన దేవుడ్ని విశ్వాసించారన్న కారణంగా వారు మిమ్మల్ని, దైవప్రవక్తను దేశంనుండి వెళ్ళగొట్టారే! అలాంటివారికి మీరు రహస్యంగా స్నేహసందేశం పంపుతారా? మీరు రహస్యంగాగాని, బహిరంగంగాగాని చేసే ప్రతిపనీ నాకు బాగా తెలుసు. మీలో ఎవరైనా సరే ఇలాంటి చేష్టలకు పాల్పడితే అతను సన్మార్గం తప్పినట్లే. (1)
వారు మీమీద ఆధిక్యత వహిస్తే, మీపట్ల శత్రువైఖరి అవలంబించి మిమ్మల్ని తప్పక మాటలతో, చేతలతో (రకరకాలుగా) వేధిస్తారు. మీరు ఎలాగైనా మళ్ళీ అవిశ్వాసు లైపోవాలని వారు కోరుకుంటున్నారు. మీ సంతానం, బంధుత్వాలు ప్రళయదినాన ఏ మాత్రం పనికిరావు. ఆరోజు దేవుడు మీమధ్య (ఈనాడున్న) సంబంధ బాంధవ్యాలన్నీ త్రెంచివేస్తాడు. ఆయన మీరు చేస్తున్న పనులన్నీ గమనిస్తూనే ఉన్నాడు. (2-3)
మీకు ఇబ్రాహీం, అతని అనుచరుల గాధలో మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతికి (ఎంతగానో నచ్చజెప్పి చివరికి) ఇలా అన్నారు: “మేము మీతో, దేవుడ్ని వదలి మీరు పూజిస్తున్న మిధ్యాదైవాలతో విసిగెత్తిపోయాం. మిమ్మల్ని (మీ మత విధానాన్ని) తిరస్కరిస్తున్నాం. మీరు ఏకేశ్వరుడైన దేవుడ్ని విశ్వసించనంతవరకు మీకూ, మాకూ ఇక ఎలాంటి సంబంధం లేదు. మన ఉభయవర్గాల మధ్య శాశ్వతంగా విరోధం ఏర్పడింది.”
అయితే ఇబ్రాహీం తన తండ్రితో “మీకోసం దేవుని దగ్గర ఏదైనా సాధించిపెట్టా లంటే నా చేతిలో ఏమీ లేదు. అయినా నేను మీ పాపమన్నింపుకు దేవుడ్ని తప్పక ప్రార్థి స్తాను” అన్నాడు. (తర్వాత అతను, అతని సహచరులు ఇలా ప్రార్థించారు:) “ప్రభూ! మేము నిన్నే నమ్ముకున్నాం. నీ వైపుకే మరలాము. చివరికి మేము నీ సన్నిధికే రావలసి ఉంది. ప్రభూ! మమ్మల్ని అవిశ్వాసుల కోసం పరీక్షగా చేయకు. ప్రభూ! మా తప్పులు మన్నించు. నీవు అపార శక్తిసంపన్నుడవు, అసామాన్య వివేకవంతుడవు.” (4-5)
వారి జీవన సరళిలో మీకు మంచి ఆదర్శం ఉంది. దేవుని సాన్నిధ్యాన్ని, అంతిమ దినం (ఆయన ప్రసాదించే స్వర్గసౌఖ్యాల)ను ఆశించే ప్రతి మనిషికీ అందులో మంచి ఆదర్శం ఉంది. దీనికి ఎవరైనా విముఖులైతే దేవుడు కూడా వారిని ఖాతరు చేయడు. ఆయన నిరపేక్షాపరుడు, స్వతహాగా ప్రశంసనీయుడు. ఎప్పుడో ఓరోజు దేవుడు మీకూ, మీరీనాడు విరోధం తెచ్చుకున్న వారికీ మధ్య ప్రేమాభిమానాలు జనింప జేయవచ్చు. దేవుడు (ఏ కార్యాన్నయినా సాధించగల) సర్వ శక్తిమంతుడు. (అంతేగాక) ఆయన గొప్ప క్షమాశీలి, అపార దయానిధి కూడా. (6-7)
ధర్మానికి సంబంధించిన వ్యవహారంలో మీతో యుద్ధం చేయని, మిమ్మల్ని మీ ఇండ్ల నుండి గెంటివేయనివారి పట్ల మీరు సత్ప్రవర్తనతో, న్యాయవైఖరితో మసలుకో వచ్చు. ఇలా చేయకుండా దేవుడు మిమ్మల్ని వారించడు. పైగా న్యాయంగా వ్యవహరిం చేవారిని ఆయన ప్రేమిస్తాడు. ధర్మం విషయంలో మీపై యుద్ధం చేసినవారితో, మిమ్మల్ని మీఇండ్ల నుండి గెంటివేసినవారితో మాత్రమే మీరు స్నేహం చేయడాన్ని దేవుడు వారిస్తున్నాడు. వారసలు మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో పరస్పరం సహకరించు కున్నారు. కనుక అలాంటివారికి స్నేహహస్తం అందించేవారే దుర్మార్గులు. (8-9)
విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, హిజ్రత్ (వలస) చేసి మీ దగ్గరకు (మదీనా) వచ్చినప్పుడు (వారి విశ్వాసాన్ని) మీరు ఓసారి పరీక్షించుకోండి. నిజానికి వారి విశ్వాసస్థితి దేవునికే బాగా తెలుసు. వారు నిజమైన విశ్వాసులే అని మీరు నిర్థారించుకుంటే ఇక వారిని అవిశ్వాసుల దగ్గరికి తిప్పిపంపకండి. వారు అవిశ్వాసులకు (భార్యలుగా) ధర్మ సమ్మతం కాలేరు. అవిశ్వాసులు కూడా వారికి (భర్తలుగా) ధర్మసమ్మతం కాలేరు. ఆ స్త్రీలకు ఇవ్వబడిన మహర్ ధనాన్ని వారి (భర్తల)కి తిరిగి ఇచ్చివేయండి. అప్పుడు మీరు ఆ స్త్రీలకు మహర్ చెల్లించి వారిని వివాహమాడవచ్చు. అందులో తప్పు లేదు.
మీరు కూడా అవిశ్వాసులైన స్త్రీలను మీ వైవాహికబంధంలో అట్టే ఆపి ఉంచకండి. అవిశ్వాసులైన మీ భార్యలకు మీరిచ్చిన మహర్ ధనాన్ని అడిగి తీసుకోండి. అలాగే అవిశ్వాసులు కూడా తమ ముస్లింభార్యలకు లోగడ ఇచ్చిన మహర్ ధనాన్ని వారి నుండి అడిగి తీసుకోవచ్చు. ఇది దైవాజ్ఞ. దేవుడు మీమధ్య (ఈవిధంగా) తీర్పు చేస్తున్నాడు. ఆయన సర్వం తెలిసినవాడు. ఎంతో వివేకవంతుడు. (10)
ఒకవేళ మీరు (అవిశ్వాసులైన) మీ భార్యలకు ఇచ్చిన మహర్ ధనం అవిశ్వాసుల నుండి మీకు తిరిగి లభించని పక్షంలో, మీ వంతు వచ్చినప్పుడు, అవిశ్వాసులకు మీరు చెల్లించవలసిన ధనాన్ని (వారికి అందజేయకుండా) ఇటు మహర్ నష్టపోయినవారికి ఇచ్చేయండి. మీరు విశ్వసించిన దేవునికి భయపడుతూ మసలుకోండి. (11)
ప్రవక్తా! (సత్యాన్ని) విశ్వసించిన స్త్రీలు నీ దగ్గరకు వచ్చి, దేవునికి (ఎవరినీ) సాటి కల్పించమని, దొంగతనం చేయమని, వ్యభిచరించమని, శిశుహత్యకు పాల్పడమని, అక్రమ సంబంధాల గురించిన అపనిందలు సృష్టించి వ్యాపింపజేయమని, మంచి విష యాల్లో నీకు అవిధేయత చూపమని ప్రమాణం చేస్తే, వారి చేత ప్రమాణం చేయించు. ఆ తరువాత వారి పాపమన్నింపు కోసం దేవుడ్ని ప్రార్థించు. దేవుడు గొప్ప క్షమాశీలి, అపార దయామయుడు. విశ్వాసులారా! దైవాగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడివున్న అవిశ్వాసులు ఎలా నిరాశ చెందారో అలాగే వీరు కూడా పరలోకం(లోని సౌఖ్యాల) పట్ల పూర్తిగా నిరాశ చెందారు. (12-13)