కురాన్ భావామృతం/అల్-మునాఫిఖూన్
కురాన్ భావామృతం అధ్యాయములు |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114 |
63. మునాఫిఖూన్ (కపటులు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 11)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రవక్తా! కపటులు నీ దగ్గరికొచ్చినప్పుడు “మీరు నిజంగా దైవప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం” అనంటారు. నిజమే. దేవునికి తెలుసు నీవు తప్పకుండా ఆయన ప్రవక్తవేనని. కాని ఈ కపటులు పచ్చిఅబద్ధాలకోరులని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. (1)
వీరసలు తమ ప్రమాణాలు అడ్డంపెట్టుకొని ఇలా తాము దైవమార్గానికి దూరమై పోవడమేగాక, ఇతరుల్ని కూడా దైవమార్గంలోకి రాకుండా నిరోధిస్తున్నారు. ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు వీరు! దీనికంతటికీ కారణం, వారు సత్యాన్ని విశ్వసించి తిరిగి అవిశ్వాసవైఖరి అవలంబించడమే. అందువల్ల వారి హృదయకవాటాలు మూసి వేయబడ్డాయి. ఇక వారు ఏ(మంచి) విషయాన్నీ అర్థం చేసుకోలేరు. (2-3)
ఈ కపటవిశ్వాసుల్ని చూస్తే, వారి విగ్రహ పుష్టి, రూపురేఖలు నీకెంతో హుందాగా కన్పిస్తాయి. వారు మాట్లాడితే వారి మాటలను నీవు ఇట్లే (ఎంతో ఆసక్తిగా) వింటావు. కాని (వారిదంతా పైన బటారమే.) వారసలు గోడకు ఆనిచ్చి నిలబెట్టిన బోలు కర్రల్లాం టివారు. బిగ్గరగా విన్పించే ప్రతిశబ్దాన్నీ తమకు వ్యతిరేకంగా (ముంచుకొస్తున్న ముప్పని) భావిస్తారు. వారసలు తేనెపూసిన కత్తులు. అందువల్ల వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. దేవుడు వారిని నాశనం చెయ్య! వారెలా పెడదారి పట్టిపోతున్నారు!! (4)
వారితో “రండి, దైవప్రవక్త మీకోసం పాపమన్నింపుకై ప్రార్థిస్తాడ”ని చెప్పినప్పుడు వారు తలవిదిలించి వెళ్ళిపోతారు. పైగా విర్రవీగుతో నీ దగ్గరకు రాకుండా ముఖం చాటే స్తారు. ప్రవక్తా! వారికోసం నీవు పాపమన్నింపు ప్రార్థన చేసినా, చేయకపోయినా ఒకటే. దేవుడు వారిని ఎన్నటికీ మన్నించడు. దుర్జనులకు దేవుడు సన్మార్గం చూపడు. (5-6)
“ప్రవక్త అనుచరుల కోసం ఖర్చుపెట్టకండి, దాంతో వారు (ఆయన్ని వదిలేసి) వెళ్ళిపోతారు” అని చెప్పేవారు వీరే. కాని భూమ్యాకాశాల్లోని నిక్షేపాలన్నీ దేవునివేనన్న సంగతి ఈ కపటులు గ్రహించడం లేదు. వారు (మాట్లాడుకుంటూ) “మదీనా తిరిగి వెళ్ళిన తరువాత (మనలో) గౌరవనీయులైనవారు నీచుల్ని అక్కడ్నుంచి వెళ్ళగొట్టాలి” అనంటారు. నిజానికి గౌరవప్రతిష్ఠలు దేవునికి, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకు (మాత్రమే) ఉన్నాయి. కపటులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. (7-8)
విశ్వాసులారా! మీ సంతానం, సిరిసంపదలు మిమ్మల్ని దైవధ్యానం నుండి మర పింపజేయకూడదు. అలా చేసేవారే నష్టపోయేవారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి (మామార్గంలో) ఖర్చుపెట్టండి. మీలో ఎవరికైనా మరణసమయం ఆసన్నమయి “ప్రభూ! నాకు మరికొంత గడువియ్యలేదే? ఇస్తే నేను దానధర్మాలు చేసి సజ్జనుల్లో చేరిపోతాను కదా?” అని అతను అనవచ్చు. అలాంటి దుస్థితి దాపురించక ముందే ఈ సత్కార్యం చేయండి. ఎవరికైనా ఆచరణగడువు ముగిసే సమయం వస్తే, ఇక అతనికి దేవుడు ఏమాత్రం అవకాశం ఇవ్వడు. మీరు చేసేదంతా దేవునికి తెలుసు. (9-11