Jump to content

కురాన్ భావామృతం/అల్-అంబియా

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

21. అంబియా (దైవప్రవక్తలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 112)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
మానవుల (కర్మ)విచారణ సమయం సమీపంలోనే ఉంది. కాని వీరేమో ఏమరు పాటులో పడి, దానికి విముఖులై పోతున్నారు. వారిముందు వారిప్రభువు నుండి ఏకొత్త హితోపదేశం అవతరిస్తున్నా దాన్ని వారు నిర్లక్ష్యంతో వింటూ ఆటాడుకుంటున్నారు. (1-2)
వారి హృదయాలు (ఐహిక వ్యామోహంలో) మునిగిపోయాయి. దుర్మార్గులు (నీ గురించి) “ఈవ్యక్తి మీలాంటి మనిషే. అలాంటప్పుడు మీరు చూస్తూ చూస్తూ అతని మాయాజాలంలో ఎందుకు పడతారు?” అని గుసగుసలాడుకుంటారు. అప్పుడు దైవ ప్రవక్త “భూమ్యాకాశాలలో జరిగే సమస్త విషయాలు నా ప్రభువుకు తెలుసు. ఆయన అన్నీ వింటున్నాడు, తెలుసుకుంటున్నాడు” అన్నాడు. (3-4)
“ఇవన్నీ అస్పష్టమైన కలలకు సంబంధించిన విషయాలు; అతని స్వీయకల్పనలు. అసలితను (గొప్ప)కవి. కాకపోతే గతప్రవక్తల్లా ఇతను కూడా మనకు ఏదైనా నిదర్శనం చూపాలి. గత ప్రవక్తలంతా నిదర్శనాలిచ్చే కదా పంపబడ్డారు” అంటారు వారు. (5)
కాని ఇంతకు పూర్వం మేము నాశనం చేసిన పట్టణాలలోని ప్రజలు సత్యాన్ని విశ్వసించలేదు. మరి వీరు విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారా? (6)
ముహమ్మద్‌ (స)! పూర్వం కూడా మేము మానవుల్నే ప్రవక్తలుగా నియమించి వారి ద్వారా మా సందేశం అందజేస్తూ వచ్చాం. (అవిశ్వాసులారా!) మీకు తెలియకపోతే గ్రంథప్రజల్ని అడిగి తెలుసుకోండి. ఆ ప్రవక్తలక్కూడా మేము కూడు తినకుండా ఉండ గలిగే దేహాలు ఇవ్వలేదు. వారు శాశ్వతంగా ఉండే మనుషులు కూడా కాదు. (7-8)
వారి గురించి మేము చేసిన వాగ్దానాలు నెరవేర్చాం. మేము ప్రవక్తలను, (ప్రజల్లో) మేము తలచుకున్న వారిని రక్షించాం. హద్దుమీరినవారిని అంతమొందించాం. (9)
మానవులారా! మేము మీ దగ్గరికి ప్రయోజనకరమైన గ్రంథం పంపాము. అందు లో మీగురించిన ప్రస్తావనే ఉంది. మరి మీరు విషయాన్ని అర్థం చేసుకోరా? (10)
మేము ఎన్నో దుర్మార్గ (ప్రజలున్న) పట్టణాలను తుడిచిపెట్టాం. వారి తరువాత మరో జాతిని తెచ్చాం. వారు మాశిక్ష వచ్చే సూచనలు కన్పించగానే అక్కడ్నుంచి పారిపోవడానికి సిద్ధమయ్యారు..... “పారిపోకండి. వెనక్కి తిరగండి, మీరు సుఖంగా ఉంటున్న మీ ఇండ్లు, మీరు అనుభవిస్తున్న మీ భోగభాగ్యాల వైపుకే మరలండి; బహుశా మిమ్మల్ని (ఈవిషయం గురించి) ఎవరైనా సమాచారం అడగవచ్చు”... వారు (బెంబేలెత్తిపోతూ) “అయ్యయ్యో! మా తలరాత మండిపోను!! నిజంగా మేము చాలా దుర్మార్గులం” అని అరవసాగారు. వారలాగే అరుస్తుంటే, మేము వారిని పంటపైరు మాదిరిగా కోసి ఆర్పి తుడిచిపెట్టాం. (11-15)
మేము భూమ్యాకాశాలను, వాటిలో ఉన్నవాటిని ఏదో ఆట (తమాషా) కోసం సృష్టించ లేదు. మేమేదైనా ఆటవస్తువును తయారు చేసుకోదలచుకుంటే, ఈ విధంగానే చేయాలనుకుంటే మా దగ్గర ఉన్నవాటితోనే తయారు చేసుకునేవారము. కాని మేము (ఇక్కడ) సత్యం ద్వారా అసత్యంపై దెబ్బతీస్తున్నాము. ఇలా సత్యం అసత్యం తలను పగలగొడ్తుంది. చూస్తుండగానే అసత్యం అంతిమశ్వాస విడుస్తుంది. కనుక మీ అభూత కల్పనలకు మీకు వినాశం తప్పదు. (16-18)
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు దేవుని సొత్తే. ఆయన దగ్గర ఉన్నవారు (అంటే దైవదూతలు) తామేదో గొప్పవారన్న అహంభావంతో ఆయన్ని ఆరాధించడానికి నిరాకరించరు. ఆయన్ని ఆరాదిస్తూ అలసిపోరు కూడా. వారు క్షణంపాటు కూడా ఊపిరి పీల్చుకోకుండా రేయింబవళ్ళు ఆయన్ని స్తుతిస్తూనే ఉంటారు. (19-20)
వారు తయారుచేసుకున్న భూసంబంధ మిధ్యాదైవాలు (నిర్జీవసృష్టితాలకు) ప్రాణం పోసి లేపుతాయా? భూమ్యాకాశాల్లో ఒక్క దేవుడే కాకుండా ఇతర దైవాలు కూడా ఉంటే భూమ్యాకాశాల వ్యవస్థ (ఏనాడో) విచ్ఛిన్నమైఉండేది. వారు కల్పిస్తున్నవాటికి విశ్వ సామ్రాజ్య సింహాసనాధీశుడైన దేవుడు అతీతుడు, పరమపావనుడు. ఆయన ఎవరి ముందూ జవాబుదారుడు కాదు, ఇతరులే ఆయన ముందు జవాబుదారులు. (21-23)
వారు ఆయన్ని వదలి ఇతరుల్ని దైవాలుగా చేసుకున్నారా? అయితే వారిని ఇలా అడుగు: “అందుకు మీ ప్రమాణాలేమిటో తీసుకురండి. ఈ గ్రంథం కూడా ఉంది. ఇందులో నా యుగానికి చెందిన ప్రజలకు హితబోధ ఉంది. నాకు పూర్వముండిన ప్రజలకు హితబోధ ఉన్న గ్రంథాలు కూడా ఉన్నాయి.” కాని వారిలో చాలామందికి వాస్తవం తెలియదు. అందువల్ల వారు సత్యానికి విముఖులవుతున్నారు. నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలకు కూడా “నేను తప్ప మరో దేవుడు లేడని, కనుక నన్నే ఆరాధించాల” ని మేము సందేశం పంపాము. (24-25)
వారు కరుణామయునికి సంతానం ఉందని అంటారు. (ఎంత మాత్రం లేదు.) దేవుడు పరిశుద్ధుడు. వారు (అంటే దైవదూతలు) గౌరవనీయులైన దైవదాసులు. ఆయన సన్నిధిలో వారు ఏమాత్రం ఎదురుచెప్పరు. ఆయన ఇచ్చే ఆజ్ఞల్ని (వినయంగా) పాటిస్తారు. వారి కళ్ళ ముందున్నదేమిటో, వారికి కనుమరుగై ఉన్నదేమిటో అంతా దేవునికి తెలుసు. దేవుడు ఎవరి విషయంలో సిఫారసు వినడానికి ఇష్టపడతాడో అలాంటి వ్యక్తులను గురించి తప్ప మరెవరి విషయంలోనూ వారు సిఫారసు చేయరు. వారసలు దేవుడంటే ఎంతో భయపడతారు. (26-28)
వారిలో ఎవరైనా “దేవుడే గాక నేను కూడా ఒక దేవుడ్ని” అనంటే అతనికి మేము నరకశిక్ష విధిస్తాము. మా దగ్గర దుర్మార్గులకు తగిన శాస్తి ఇదే. (29)
భూమ్యాకాశాలు కలసిఉన్నప్పుడు మేము వాటిని విడదీయడాన్ని వారు చూడ లేదా? అలాగే ప్రతిప్రాణిని మేము నీటితో సృజించిన విషయాన్ని వీరు గమనించ లేదా? మరి వారు (మాయీ సృష్టి చాతుర్యాన్ని) ఎందుకు విశ్వసించరు? (30)
భూమి దొర్లిపడకుండా ఉండేందుకు మేము దానిపై పర్వతాలను (మేకులుగా) పాతాము. ప్రజలు దారి తెలుసుకోవడానికి వీలుగా అందులో విశాలమైన మార్గాలు కూడా ఏర్పరిచాము. అంతేకాదు, ఆకాశాన్ని మేము సురక్షితమైన కప్పుగా చేశాం. కాని వీరు మాత్రం ఆయన నిదర్శనాల వైపు దృష్టి సారించడమే లేదు. రేయింబవళ్ళను సృష్టించినవాడు దేవుడే. సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఆయనే సృజించాడు. అవన్నీ తమ తమ నిర్ణీత కక్ష్యల్లో తేలియాడుతున్నాయి. (31-33)
ముహమ్మద్‌ (స)! మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ అమరత్వం ప్రసా దించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వీరు శాశ్వతంగా ఇక్కడే బ్రతికి ఉంటారా? ప్రతిపాణీ చావును చవిచూడవలసిందే. మేము మిమ్మల్ని మంచీ-చెడు స్థితులు కలిగించి పరీక్షి స్తున్నాం. చివరికి మీరంతా మా దగ్గరికే తిరిగిరావలసి ఉంది. (34-35)
అవిశ్వాసులు నీవైపు చూపిస్తూ “మీ దేవతల్ని విమర్శిస్తున్న మనిషి ఇతనేనా?” అని హేళనచేస్తారు. కాని కరుణామయుని ప్రస్తావనను మాత్రం ఖండిస్తారు. మానవుడు మహాతొందరపాటు జీవి. ఇప్పుడే నేను మీకు నా నిదర్శనాలు (శిక్ష రూపేణ) చూపిస్తాను తొందరపడకండి. “నీ అభిప్రాయం నిజమైతే నీయీ బెదిరింపు ఎప్పుడు నిజమవుతుంది” అని అడుగుతారు వారు. ఈ తిరస్కారులకు ఆరోజు గురించి వాస్తవం తెలిసివుంటే బాగుండు! అప్పుడు వీరు తమ ముఖాలను, వీపులను నరకాగ్నిలో మాడిపోకుండా తప్పించుకోలేరు. వారికి ఎటు నుండీ ఎలాంటి సహాయం అందదు. (36-39)
ఆ మహోపద్రవం వారిపై హఠాత్తుగా వచ్చిపడుతుంది. అది వారిని అమాంతం కబళించి వేస్తుంది. వారు దాన్ని ఏవిధంగానూ నిరోధించలేరు. (తప్పించుకోవడానికి) వారికి ఏమాత్రం అవకాశం లభించదు. నీకు పూర్వం వచ్చిన ప్రవక్తల్ని కూడా (ఆనాటి తిరస్కారులు) హేళనచేశారు. అయితే వారిని హేళనచేసినవారు అలా హేళన చేసిన దాని బారినే పడి నాశనమయ్యారు. (40-41)
ప్రవక్తా! రాత్రివేళో, పగటివేళో మిమ్మల్ని కరుణామయుని శిక్ష నుండి కాపాడే వాడెవడని వారినడుగు. వారు తమ ప్రభువు హితోపదేశానికి విముఖులై పోతున్నారు. మాకు వ్యతిరేకంగా తమను ఆదుకోగల దైవాలేమైనా వారికున్నాయా? ఆ దైవాలు అసలు తమకుతామే సహాయం చేసుకోలేవు. వాటికి మా సహకారం కూడా లేదు. అసలు విషయం (అదికాదు.)- మేము వారికి, వారి తాతముత్తాతలకు జీవితాంతం భోగ భాగ్యాలు ప్రసాదిస్తూవచ్చాం. కాని (వారికి జ్ఞానోదయం కలగడంలేదు.) మేము భూమిని అనేక దిశల నుండి నరుక్కుంటూ వస్తున్న దృశ్యం వారికి కన్పించడం లేదా? మరి వారు (మమ్మల్ని నిరాకరించి) ఆధిక్యత పొందగలరా? (42-44)
ఇలా చెప్పు: “నేను దివ్యావిష్కృతి ఆధారంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాన”ని. కాని పిలిచేవాడు (రానున్న ప్రమాదం గురించి) ఎంత హెచ్చరించినా బధిరులకు ఆ హెచ్చరిక విన్పించదు. నీ ప్రభువు శిక్ష వారికి కాస్తంత అంటితే చాలు, “అయ్యయ్యో! మేమెంతటి దౌర్భాగ్యులం! నిజంగా మేము పాపాత్ములం” అని గగ్గోలుపెడ్తారు. (45-46)
ప్రళయదినాన మేము కచ్చితంగా తూచే త్రాసు ఏర్పాటుచేస్తాము. ఇక ఏ ఒక్కరికీ ఎలాంటి అన్యాయం జరగదు. ఎవరైనా సరే, ఆవగింజంత కూడా ఏదైనా చేసి ఉంటే, దాన్ని మేము ముందుకు తెస్తాము. లెక్క చూడటానికి మేమే చాలు. (47)
ఇంతకు పూర్వం మేము దైవభీతిపరుల శ్రేయస్సు కోసం గీటురాయిని, జ్యోతిని, జ్ఞాపికను మూసా, హారూన్‌లకు ప్రసాదించాం. ఆ దైవభీతిపరులు కన్పించని తమ ప్రభువు పట్ల భయభక్తులు కలిగివుంటూ, ప్రళయం గురించి (అనుక్షణం) భయపడు తుండేవారు. ఇప్పుడీ శుభ జ్ఞాపిక (ఖుర్‌ఆన్‌)ను (మీకోసం) అవతరింపజేశాము. మరి ఇప్పటికయినా మీరు దీన్ని విశ్వసిస్తారా లేదా? (48-50)
అంతకు పూర్వం మేము ఇబ్రాహీంకు విచక్షణాజ్ఞానం ప్రసాదించాము. అతడ్ని గురించి మాకు బాగా తెలుసు. అతను తన తండ్రిని, తనజాతి ప్రజల్ని ఉపదేశిస్తూ:-
“మీరంతగా అభిమానిస్తున్న ఈవిగ్రహాల సంగతేమిటీ?” అనడిగాడు. (51-52)
“మా తాతముత్తాతలు వీటిని పూజిస్తుండేవారు. అందువల్ల మేము కూడా వీటిని పూజిస్తున్నాం” అన్నారు వారు. (53)
“అయితే మీరు దారి తప్పారు; మీ తాతముత్తాతలు అంతకన్నా ఘోరంగా దారి తప్పారు” అన్నాడు ఇబ్రాహీం (54)
“నువ్వు మాముందు నీ అసలు భావాలు వ్యక్తపరుస్తున్నావా లేక పరిహాసమాడు తున్నావా?” అడిగారు వారు. (55)
“(పరిహాసం) కాదు, నిజంగానే (చెబుతున్నాను). భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు. ఆయనే వాటిని సృష్టించాడు. అందుకు నేను మీ ముందు సాక్ష్యమిస్తున్నాను. దైవసాక్షి! మీరు లేనప్పుడు నేను తప్పకుండా మీ విగ్రహాల సంగతేమిటో తేల్చు కుంటాను” అన్నాడతను. (56-57)
తరువాత అతను (అన్నట్లే వారు జాతరకు పోయారో లేదో గుడిలోకి ప్రవేశించి) ఆ విగ్రహాలను తునాతునకలుగా విరగ్గొట్టాడు. వాటిలో పెద్దవిగ్రహాన్ని మాత్రం వదలి పెట్టాడు, వారు (విచారించడానికి తనవైపు) మరలుతారన్న ఉద్దేశ్యంతో. (58)
జనం (జాతర నుంచి తిరిగొచ్చి చూసి) “మన దైవాలకు ఈదుస్థితి కలిగించిం దెవరో, చూస్తే పరమ దుర్మార్గుడిలా ఉన్నాడు” అన్నారు. “మేము ఇబ్రాహీం అనే యువకుడు వాటిని గురించి ప్రస్తావిస్తుంటే విన్నాం” అన్నారు (కొందరు). (59-60)
“అయితే అతడ్ని పట్టి తీసుకురండి జనం ముందుకు, అందరూ (అతని సంగతి) చూస్తారు” అన్నారు వారు. (ఇబ్రాహీం వచ్చిన తరువాత) “ఇబ్రాహీం! నువ్వేనా మా దేవతల పట్ల ఇలా ప్రవర్తించింది?” అని అడిగారు వారు. (61-62)
“అసలు ఇదంతా వాటి నాయకుడే చేసి ఉంటాడు, అడిగి చూడండి మాట్లడితే” అన్నాడు ఇబ్రాహీం. (63)
ఈమాట వినగానే వారు తమ అంతరాత్మల వైపు మరలి “నిజంగా మనం చాలా దుర్మార్గులం” అని అనుకున్నారు స్వగతంలో. కాని ఆతర్వాత వారి బుద్ధి వక్రీకరించింది. అందువల్ల “ఇవి మాట్లాడలేవని నీకు తెలుసుకదా?” అన్నారు వారు. (64-65)
“మరి మీరు (నిజ) దేవుడ్ని వదలి మీకెలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించ లేని ఈ మిధ్యాదైవాలను ఎందుకు పూజిస్తున్నారు? ఛీ! దేవుడ్ని వదలి మీరు పూజిస్తున్న మీ మిధ్యాదైవాలు పాడుగాను!! మీకు కాస్తయినా బుద్ధీ-జ్ఞానం లేదా?” అన్నాడు ఇబ్రాహీం. (66-67)
“మీరేదైనా చేయాలనుకుంటే ఇతడ్ని కాల్చివేయండి, మీ దేవతల్ని కాపాడుకోండి” అన్నారు వారు. (చివరికి వారు ఇబ్రాహీంని అగ్ని గుండంలోకి విసరివేశారు. అప్పుడు) మేము “అగ్నీ! ఇబ్రాహీం కోసం శాంతించు, చల్లబడిపో” అని ఆదేశించాం. (68-69)
వారు ఇబ్రాహీంకు కీడు చేయజూశారు. అయితే మేము వారి దుష్టయత్నాన్ని తిప్పి కొట్టాము. (70)
(ఇలా) మేము ఇబ్రాహీంని, లూత్‌ని కాపాడి ప్రపంచవాసుల కోసం శ్రేయో శుభాలు ఉంచిన భూభాగం వైపు తీసికెళ్ళాం. మేమతనికి (ఓ కొడుకు) ఇస్‌హాఖ్‌ని, ఆపై (ఓ మనవడు) యాఖూబ్‌ని ప్రసాదించాం. వారిలో ప్రతి ఒక్కడ్నీ సత్పురుషుడిగా తీర్చిదిద్దాం. వారిని మేము మాఆజ్ఞ ప్రకారం (ప్రజలకు) మార్గదర్శకత్వం వహించే నాయకులుగా చేశాం. సత్కార్యాలు చేస్తుండాలని, నమాజు (వ్యవస్థ) నెలకొల్పాలని, (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ చెల్లించాలని వారికి దివ్యావిష్కృతి ద్వారా ఉపదేశించాము. వారు మా (ప్రియ)భక్తులు. (71-73)
లూత్‌కు మేము వివేకాన్ని, (దౌత్య) జ్ఞానాన్ని ప్రసాదించాము. మేమతడ్ని అశ్లీల కార్యాలు చేస్తుండిన ప్రజల ఊరు నుంచి తప్పించి (వేరే చోటికి) తరలించాము. అసలా జాతి పరమ దుర్మార్గపు జాతి. లూత్‌కు మేము మా కారుణ్యఛాయలో చోటిచ్చాము. అతను సజ్జనులలోని వాడు. (74-75)
నూహ్‌ వృత్తాంతం (కూడా గుర్తుకు తెచ్చుకో): వారందరికీ పూర్వం అతను మమ్మల్ని వేడుకున్నాడు. మేమతని ప్రార్థన ఆలకించి అతడ్ని, అతని కుటుంబాన్ని ఒక పెద్ద ఆపద నుండి రక్షించాము. మా సూక్తులు నిరాకరించిన జాతికి వ్యతిరేకంగా అతనికి సహాయం చేశాము. ఆ జాతి ప్రజలు పరమ దుర్మార్గులు. అందువల్ల మేము వారందర్నీ (నడి సముద్రంలో) ముంచివేశాము. (76-77)
దావూద్‌, సులైమాన్‌లను గురించి (విను): వారిద్దరు ఒక పొలానికి సంబంధిం చిన వ్యవహారం గురించి తీర్పు చేయసాగారు. రాత్రివేళ ఆ పొలంలో ఇతరుల మేకలు పడి మేశాయి. మేము వారి న్యాయస్థానాన్ని చూస్తున్నాము. మేము వారిద్దరికీ వివేకం, (దౌత్య)జ్ఞానం ప్రసాదించాము. అయినప్పటికీ మేమప్పుడు సరయిన తీర్పు గురించి సులైమాన్‌కు మాత్రమే అవగాహన కలిగించాము.
మేము దావూద్‌ కోసం పక్షులు, పర్వతాలను అదుపులో ఉంచాం. అవి అతనితో పాటు దైవస్థుతి చేస్తుండేవి. ఈపని నిర్వహించేది మేమే. మీప్రయోజనం కోసం మేమత నికి యుద్ధకవచాలు తయారుచేసే విధానం కూడా నేర్పాం. వాటితో మీరు ఒకరి దాడి నుండి మరొకరు కాపాడుకుంటారు. మరి మీరు (ఇప్పుడైనా) కృతజ్ఞత చూపుతారా?
సులైమాన్‌ కోసం మేము తీవ్రమైన గాలులను అదుపులో ఉంచాం. అవి అతని ఆదేశంతో మేము శుభాలు ఉంచిన భూభాగంలో వీస్తుండేవి. మాకు ప్రతి విషయమూ తెలుసు. మేము అనేక భూతాలను కూడా అతని అదుపాజ్ఞలలో ఉంచాం. అవి అతని కోసం (రత్నాలు వెలికి తీయడానికి సముద్రంలో) మునకలు వేస్తుండేవి. అదేకాకుండా అవి వేరేపనులు కూడా అనేకం చేస్తుండేవి. వాటన్నిటికీ మేమే పర్యవేక్షకులం. (78-82)
అయ్యూబ్‌ గాధ కూడా గుర్తుకుతెచ్చుకో. అతను (వ్యాధిగ్రస్త స్థితిలో ఉండి) “ప్రభూ!) నేను జబ్బుపడ్డాను. నీవు అందరికంటే గొప్ప దయామయుడవు” అని ఎలుగెత్తి మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతని బాధ దూరం చేశాం. అతనికి మేము అతని భార్యాపిల్లలనే కాదు, మా ప్రత్యేక అనుగ్రహంతో ఇంకా అనేక భాగ్యాలు కూడా ప్రసాదించాం. దైవభక్తులకు ఇదొక (మంచి) గుణపాఠం. (83-84)
ఇక ఇస్మాయీల్‌, ఇద్రీస్‌, జుల్‌కిఫ్ల్‌లను గురించి: వీరంతా ఎంతో సహనశీలురు. వీరికి మేము మా కారుణ్యఛాయలో చోటిచ్చాం. వీరంతా సజ్జనులు. (85-86)
మత్స్యబాధితుడి సంగతి జ్ఞాపకంతెచ్చుకో. అతను కోపం వచ్చి వెళ్ళిపోయాడు. మేము తనను నిలదీయబోమని భావించాడు. చివరికతను (చేప కడుపులో చిక్కుకొని) గాఢాంధకారంలో “నీవుతప్ప మరోఆరాధ్యుడు లేడు. నీవు పరిశుద్ధుడవు. నేను నిజంగా దుర్మార్గుణ్ణయ్యాను” అని మొరపెట్టుకున్నాడు. మేమతని మొరాలకించి అతడ్ని బాధ, పరితాపాల నుండి విముక్తి కల్గించాం. ఇలాగే మేము విశ్వాసుల్ని రక్షిస్తాం. (87-88)
జకరియ్యా వృత్తాంతం కూడా. అతను తన ప్రభువు సన్నిధిలో “ప్రభూ! నన్ను (సంతానం లేకుండా) ఒంటరివాడ్ని చేయకు. నీవే అందరికంటే మంచి వారసుడివి” అని ప్రార్థించాడు. మేమతని ప్రార్థన ఆలకించి అతనికి యహ్యాను అనుగ్రహించాం. అతని కోసం అతని భార్యను (గర్భధారణకై) తీర్చిదిద్దాము. వీరంతా అమితోత్సాహంతో సత్కార్యాలు చేస్తుండేవారు. మమ్మల్ని ఎంతో ఆశతో, భయభక్తులతో ప్రార్థించేవారు. మాముందు ఎంతో అణుకువతో ఉండేవారు. (89-90)
శీలం కాపాడుకున్న స్త్రీ వృత్తాంతం కూడా. మేమామె (గర్భం)లోకి మా ఆత్మను ఊదాము. ఆమెను, ఆమె కుమారుడ్ని యావత్‌ ప్రపంచానికి నిదర్శనంగా చేశాం. (91)
మీ సమాజం(ధర్మం) నిజానికి ఒకే సమాజం. నేను మీ ప్రభువును. కనుక మీరు నన్నే ఆరాధించండి. కాని ఆ ప్రజలు పరస్పరం విభేదించుకొని తమ ధర్మాన్ని చీలికలు గా చేసుకున్నారు. కాని చివరికి అందరూ మా దగ్గరికే రావలసిఉంది. (92-93)
ఆతర్వాత ఎవరైనా విశ్వాసిఅయి సత్కార్యాలు చేసివుంటే, అలాంటి వ్యక్తి ఆచర ణకు విలువ నివ్వకపోవడమంటూ జరగదు. దాన్ని మేము నమోదుచేస్తున్నాం. (94)
మేము ఏఊరిని నాశనంచేసినా ఆ ఊరిప్రజలు తిరిగి కోలుకోవడం అనేదే జరగదు. చివరికి యాజూజ్‌, మాజూజ్‌ (జాతు)లను వదిలేయడం జరుగుతుంది. వారు ప్రతి గుట్టా, మిట్టా నుండి వెలువడి (ఇతర జాతులపై) విరుచుకుపడతారు. (95-96)
(ఆ తరువాత) అసలు వాగ్దానం నెరవేరే సమయం త్వరలోనే ఆసన్నమవుతుంది. అప్పుడు హఠాత్తుగా సత్యతిరస్కారులకు (భీతావహంతో) నిలువుగుడ్లు పడతాయి. వారు (తమనుతాము నిందించుకుంటూ) “అయ్యయ్యో! మా పాడుగాను, మేమెంత ఏమరు పాటులో పడిఉన్నాం. (కాదు) మేమసలు పాపాత్ములం” అనంటారు. (97)
మీరూ, మీ మిధ్యాదైవాలూ నరకాగ్నికి సమిధలైపోవడం ఖాయం. నరకానికే మీరంతా పోవలసి ఉంటుంది. అవి నిజంగా దైవాలయితే నరకానికి పోవు. అప్పుడు మీరంతా అక్కడే శాశ్వతంగా పడిఉండాలి. వారక్కడ తీవ్రమైన యాతనలతో హాహాకా రాలు చేస్తుంటారు. రొదలు, రోదనల మధ్య వారికి ఏదీ సరిగా విన్పించదు. (98-100)
ఇక మానుండి ఎవరికి మేలు జరుగుతుందని ముందే నిర్ణయమైపోయిందో వారు తప్పక నరకానికి దూరంగా ఉంటారు. దాని (భీకర)ధ్వని కాస్తయినా వారికి విన్పించదు. వారు కలకాలం తమకిష్టమైన భాగ్యాలలో ఓలలాడుతుంటారు. తీవ్రమైన (ప్రళయ) బీభత్స సమయంలోను వారు ఏమాత్రం ఆందోళన చెందరు. దైవదూతలు వారిని స్వాగతిస్తూ “మీకు వాగ్దానం చేయబడిన (శుభ)దినం ఇదే” అనంటారు. (101-103)
మేము ఆకాశాన్ని లేఖచుట్టలా చుట్టబెట్టే రోజు (ఇది జరుగుతుంది). మొదట్లో మేము సృష్టినిర్మాణాన్ని ఎలా ప్రారంభించామో అలాగే దాన్ని మళ్ళీ సృష్టిస్తాం. ఇదొక వాగ్దానం. దీన్ని నెరవేర్చవలసిన బాధ్యత మాపై ఉంది. మేమీ పని తప్పకుండా చేస్తాం. జబ్బూర్‌లో మేము హితోపదేశం చేసిన తర్వాత, మా పుణ్యదాసులు భూమికి వారసు లవుతారని వ్రాశాం. భక్తిపరులకు ఇందులో గొప్ప సందేశం ఉంది. (104-106)
ముహమ్మద్‌ (స)! మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట (దైవ) కారుణ్యంగా చేసి పంపాము. (అంటే మేము నిన్ను యావత్‌మానవాళి కోసం కారుణ్య మూర్తిగా ప్రభవింపజేశాము.) (107)
వారికిలా చెప్పు: “నా దగ్గరకు వస్తున్న దివ్యావిష్కృతి ప్రకారం మీ దేవుడు ఒక్కడే. మరి మీరు (ఆ దేవుని ముందు) విధేయత ప్రకటిస్తారా?.” వారు గనక (నీ మాటలు అంగీకరించకుండా) ముఖం తిప్పుకుంటే వారికీ విధంగా చెప్పెయ్యి:
“నేను మిమ్మల్ని ఎలాంటి అరమరికలు లేకుండా స్పష్టంగా, బాహాటంగా హెచ్చ రించాను. ఇప్పుడిక మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం (అంటే దైవశిక్ష) సమీపం లో ఉందో దూరాన ఉందో నాకైతే తెలియదు. మీరు బహిరంగంగా మాట్లాడుతున్న విషయాలు, రహస్యంగా ఉంచుతున్న విషయాలు అన్నీ దేవునికి తెలుసు. నేను మాత్రం ఇది (అంటే శిక్షలో జాప్యం) మీకొక పరీక్షని భావిస్తున్నాను. ఒక నిర్ణీత దినం వరకు (ప్రాపంచిక) రుచులు ఆస్వాదించడానికే ఇలా మిమ్మల్ని ఉపేక్షిస్తూ అవకాశం ఇవ్వబడుతోంది.” (108-111)
(చివరికి) ప్రవక్త ఇలా అన్నాడు: “ప్రభూ! సత్యానుసారం తీర్పు చెయ్యి... ప్రజలారా! మాప్రభువు ఎంతో దయామయుడు. మీరు కల్పిస్తున్న విషయాలకు (పన్ను తున్న పన్నాగాలకు) వ్యతిరేకంగా ఆయనే మాకు సహాయం చేసేవాడు.” (112)