Jump to content

కురాన్ భావామృతం/అల్-అన్ఆమ్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

6. అన్‌ఆమ్‌ (పశువులు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 165)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాలను, చీకటివెలుగులను సృష్టించిన దేవునికే సకలవిధాల ప్రశంసలు శోభిస్తాయి. అయినప్పటికీ సత్యతిరస్కారులు అంతటి శక్తిస్వరూపుడ్ని వదలి ఇతరులను ఆయనకు సాటికల్పిస్తూ దైవాలుగా చేసుకున్నారు. (1)
నిజానికి ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించి మీ మనుగడ కోసం ఒక గడువు నిర్ణయించాడు. (ప్రళయంకోసం) మరో గడువు కూడా ఆయన దగ్గర నిర్ణయించబడి ఉంది. కాని మీరేమో ఇంకా సందేహంలోనే పడిఉన్నారు. ఆయనే ఇటు భూమిపై, అటు ఆకాశంలోనూ ఉన్న ఏకైక దేవుడు. మీ అంతర్‌ బాహ్య స్థితిగతులు ఎరిగినవాడు కూడా ఆయనే. మీరు చేసే ప్రతిపనీ, పలికే ప్రతిపలుకూ ఆయనకు తెలుసు. (2-3)
ప్రజలు తమ ప్రభువు నుండి వచ్చిన ఏ సూచననూ అంగీకరించకుండా ముఖం తిప్పుకుంటున్నారు. ఇప్పుడు వారి దగ్గరకు సత్యం వస్తే దాన్ని కూడా నిరాకరించారు. సరే, ఇప్పటివరకు వారు ఏ విషయాన్ని గురించి హేళన చేస్తూవచ్చారో ఆ విషయాన్ని గురించి వాస్తవం ఏమిటో వారికి త్వరలోనే తెలిసిపోతుంది. (4)
వారికి పూర్వం మేము ఎన్ని జాతుల్ని నిర్మూలించామో వారికి తెలియదా? ఆ జాతులు తమతమ కాలాల్లో ఎంతో వైభవోపేతంగా వెలిగాయి. వారికి మేము ప్రపంచం లో మీకు ప్రసాదించనటువంటి గొప్ప సామ్రాజ్యాలు ప్రసాదించాం. వారి కోసం ఆకాశం నుండి పుష్కలంగా వర్షం కురిపించాం. నేలపై ఎన్నో నదులు ప్రవహింపజేశాం. (కాని వారు మా పట్ల కృతఘ్నులైపోయారు.) చివరికి మేము వారు చేసిన పాపాలకు వారిని సమూలంగా తుడిచిపెట్టాం. వారి స్థానంలో ఇతర జాతులను తెచ్చాం. (5-6)
ప్రవక్తా! ఒకవేళ మేము కాగితాలపై రాసిన గ్రంథాన్ని నీపై అవతరింపజేసినా, దాన్ని ఈ తిరస్కారులు చేత్తో తాకిచూసి కూడా విశ్వసించరు. పైగా వారు ఇదంతా ఏదో మంత్రజాలం తప్ప మరేమీ కాదని వాదిస్తారు. పైగా, ఈ ప్రవక్తతో పాటు (అతడ్ని సమర్థించేందుకు) ఒక దైవదూతను ఎందుకు దించలేదు? అని కూడా అంటారు. మేము దైవదూతల్ని దించివుంటే ఈపాటికి ఎప్పుడో (వారి) వ్యవహారం తేలిపోయి ఉండేది. వారికి ఎలాంటి అవకాశమిచ్చేవారం కాము. మేము దైవదూతను అవతరింప జేయవలసి వస్తే అతడ్ని మానవాకారంలోనే అవతరింపజేస్తాము. వారిప్పుడు ఎలా అనుమానంలో పడిఉన్నారో అప్పుడూ అనుమానంలోనే పడిపోతారు. (7-9)
ప్రవక్తా! నీకుపూర్వం కూడా (ఈ లోకం) అనేకమంది ప్రవక్తలను ఎగతాళి చేసింది. చివరికి వారు ఎగతాళిచేసిన విషయమే వారిని ముంచివేసింది. వారిని కాస్త ప్రపంచం లో పర్యటించి చూడమని చెప్పు, సత్యతిరస్కారులకు ఏం గతి పట్టిందో. (10-11)
భూమ్యాకాశాల్లో ఉన్నదంతా ఎవరిదని అడుగు. అంతా దేవునిదేనని చెప్పు. ఆయన (మానవాళిని) కరుణించడం తన కర్తవ్యంగా చేసుకున్నాడు. (కనుకనే ఆయన మీ అకృత్యాలకు మిమ్మల్ని వెంటనే శిక్షించడం లేదు.) ఆయన మిమ్మల్ని ప్రళయ దినాన తప్పకుండా సమావేశపరుస్తాడు. కాని ఆత్మవినాశానికి పాల్పడినవారు దాన్ని నమ్మలేకపోతున్నారు. రాత్రి చీకటిలో, పగటి వెల్తురులో మనుగడ సాగిస్తున్న ప్రతి సృష్టి రాసీ దేవునిదే. ఆయన సమస్తం వినేవాడు, సర్వం ఎరిగినవాడు. (12-13)
చెప్పు: “దేవుడు భూమ్యాకాశాలకు సృష్టికర్త. ఆయనే అందరికీ ఆహారమిచ్చేవాడు. ఆయన మాత్రం ఎవరినీ ఆహారం అడగడు. అలాంటి మహోన్నతుడైన దేవుడ్ని వదలి నేను మరొకడ్ని సంరక్షకునిగా చేసుకోవాల్నా?” చెప్పు: “నేను అందరికంటే ముందు ఆయనకు విధేయుణ్ణయి పోవాలని నాకు ఆజ్ఞయింది. నేను ఎలాంటి పరిస్థితిలోనూ బహుదైవారాధకుల్లో చేరిపోకూడదని కూడా నాకు తాకీదు చేయబడింది.” (14)
చెప్పు: “ఒకవేళ నేను నా ప్రభువు మాట వినకుండా అవిధేయుణ్ణయిపోతే ఓ గొప్ప (భయంకర) దినాన (నరక) శిక్షకు గురికావలసి వస్తుందని భయపడుతున్నాను. ఆరోజు శిక్ష నుండి తప్పించుకున్నవాడు (నిజంగా ఎంతో అదృష్టవంతుడు.)- అతడ్ని దేవుడు ఎంతగానో కరుణించినట్లే. అదే సాఫల్యం, స్పష్టమైన మోక్షం.” దేవుడు నీకేదైనా కీడు చేయదలచుకుంటే ఆ కీడు నుండి ఏశక్తీ నిన్ను కాపాడ లేదు. అలాగే ఆయన నీకేదైనా మేలు చేయగోరితే ఆయన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆయన ప్రతిపనీ చేయగల సర్వశక్తిమంతుడు. ఆయన తన దాసులపై సర్వాధికారాలు కలిగివున్నాడు. ఆయన ఎంతో వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.” (15-18)
అందరికంటే బలమైన సాక్ష్యం ఎవరిదో వారిని అడుగు. ఇంకా ఇలా చెప్పు: “నాకూ, మీకూ మధ్య దేవుడే సాక్షి. ఈ ఖుర్‌ఆన్‌ మిమ్మల్నీ, మరెవరికిది చేరుతుందో వారందర్నీ హెచ్చరించడానికి దివ్యావిష్కృతి ద్వారా నాకు ప్రసాదించబడింది. మరి మీరు దేవుడు మాత్రమే గాక మరికొందరు కూడా దేవుళ్ళున్నారని చెప్పగలరా? నేను మాత్రం అలా ఎన్నటికీ చెప్పను. వారికిలా చెప్పు: “నిజానికి దేవుడు ఒక్కడే. మీరు చేస్తున్న బహు దైవారాధనతో నేను పూర్తిగా విసుగెత్తిపోయాను.” (19)
మేము గ్రంథం ప్రసాదించినవారు తమ కన్నకొడుకుల్ని ఎలా గుర్తిస్తున్నారో అలా ఇతడ్ని (అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ని) కూడా నిస్సంకోచంగా గుర్తిస్తున్నారు. కాని ఆత్మవినాశానికి పాల్పడినవారు మాత్రం ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. దేవునిపై అసత్యం మోపి ఆయన సూక్తులు తిరస్కరించిన వాడికంటే పరమదుర్మార్గుడు మరెవ రుంటారు? అలాంటి దుర్మార్గులు ఎన్నటికీ సఫలీకృతులు కాలేరు. (20-21)
మేము మానవులందర్నీ సమావేశపరచినప్పుడు బహుదైవారాధకులతో “మీరు కల్పించుకొని దేవుళ్ళుగా నమ్ముతుండిన వారంతా ఇప్పుడు ఎటు పోయారు?” అని అడుగుతాం. అప్పుడు వారు తమను రక్షించుకోవడానికి “దైవసాక్షి! మేము ఎన్నడూ బహుదైవారాధకులుగా ఉండలేదు” అంటారు (పచ్చి అబద్ధమాడుతూ). అంతకుమించి వారికి వేరే సాకు దొరకదు. వారు తమపై ఎలాంటి అబద్ధం కల్పించుకుంటారో చూడు! అక్కడ వారి కల్పిత దైవాలంతా మటుమాయమైపోతాయి. (22-24)
వారిలో కొందరు నీ మాటలు చెవియొగ్గి వినేవారు కూడా ఉన్నారు. కాని మేము వారి హృదయకవాటాలు మూసివేయడం వల్ల వారు ఏ విషయాన్నీ అర్థం చేసుకోలేరు. వారి చెవుల్ని మొద్దుబారేలా చేశాము. (అందువల్ల వారసలు ఏ మంచి విషయం విన లేరు.) వారు ఏ సూచన(మహిమ) చూసినా విశ్వసించరు. పైగా వారు నీ దగ్గరకు వచ్చి వాదిస్తారు. వారిలో నీమాటల్ని వ్యతిరేకించాలని ముందే నిర్ణయించుకున్నవారు (అంతా విని) “ఇది పాతపురాణం తప్ప మరేమీ కాదు” అంటారు. (25)
వారు సత్యాన్నుండి పారిపోవడమే గాక, ప్రజలను కూడా సత్యాన్ని స్వీకరించ నీయకుండా నిరోధిస్తున్నారు. ఆవిధంగా చేసి వారు (సాధిస్తున్నదేమీ లేకపోగా) తమను తామే నాశనం చేసుకుంటున్నారు. ఆ సంగతి వారు గ్రహించడం లేదు. (26)
వారిని నరకం అంచుపై నిలబెట్టినప్పుడు నీవు వారి పరిస్థితి చూస్తే బాగుండు! అప్పుడు వారు (తల బాదుకుంటూ) “అయ్యయ్యో! ఎలాంటి దుస్థితి దాపురించింది మాకు!! మమ్మల్ని మరోసారి ఇహలోకానికి పంపితే బాగుండు. అప్పుడు మేము మా ప్రభువు సూక్తులు నిరాకరించకుండా విశ్వాసులలో చేరిపోతాం” అనంటారు. వారు ఇంతకుపూర్వం దాచినది ఈ రోజు వారిముందు బట్టబయలై పోవడం వల్లనే అలా అంటారు. వారిని (ఇహలోకానికి) తిరిగి పంపినా, చేయవద్దన్న పనులే మళ్ళీ చేస్తారు. వారు పరమ అబద్ధీకులు. (27-28)
వారిలా అంటారు: “జీవితమంటే ఈ ప్రాపంచిక జీవితమే. (ఇది తప్ప మరో జీవితం లేదు.) మేము చనిపోయాక మళ్ళీ బ్రతికించబడటమనే ప్రశ్నే తలెత్తదు.” వారు తమ ప్రభువు ముందు ప్రవేశపెట్టబడినప్పుడు నీవు వారి పరిస్థితి చూస్తే బాగుండు! అప్పుడు వారి ప్రభువు “ఇది యదార్థం కాదా?” అని అడిగితే “ఔను ప్రభూ! ఇది యదార్థమే” అంటారు వారు (గత్యంతరంలేక). “అయితే సత్యనిరాకరణకు పర్యవ సానంగా ఇప్పుడు (నరక) యాతన చవిచూడండి” అంటాడు దేవుడు. (29-30)
దేవుడ్ని కలుసుకోవలసి ఉంటుందన్న సమాచారాన్ని అసత్యవిషయంగా భావించిన వారు ఘోరంగా నష్టపోతారు. వారా ఘడియ అకస్మాత్తుగా వచ్చినప్పుడు “అయ్యయ్యో! ఈ విషయంలో మేమెంత పొరబడ్డాము!!” అని వాపోతారు. అప్పుడు వారు తమ పాప భారం వీపులపై మోసుకొస్తారు. చూడు ఎంత నీచమైన భారమో అది! ఇహలోక జీవితం ఒక ఆట, తమాషా మాత్రమే. (పరలోక జీవితమే అసలుజీవితం.) భయభక్తులు కల వారికి పరలోక (స్వర్గ)ధామమే శ్రేష్ఠమైనది. ఆమాత్రం జ్ఞానం లేదా మీకు? (31-32)
ముహమ్మద్‌! వారి మాటలవల్ల నీకు బాధ కలుగుతుందని మాకు తెలుసు. కాని ఈ దుర్మార్గులు నిన్ను నిరాకరించడం లేదు. వారసలు దేవుని సూక్తులు నిరాకరిస్తు న్నారు. నీకు పూర్వం కూడా అనేకమంది ప్రవక్తలు నిరాకరించబడ్డారు. అయితే వారు లోకుల తిరస్కార వైఖరిపట్ల, వారు పెట్టిన బాధలపట్ల సహనం వహించారు. చివరికి మా సహాయం వారికి లభించింది. దేవుని మాటలు ఎవరూ మార్చలేరు. గత ప్రవక్తలకు ఎదురైనవన్నీ నీకు చేరాయి. (కనుక నీవు సహనంతో పరిస్థితుల్ని ఎదుర్కో). (33-34)
ఒకవేళ వారి నిరాకరణ, నిరాదరణలను నీవు సహించలేకపోతే, నీలో శక్తి ఉంటే భూమిలో సొరంగంచేసి, లేదా ఆకాశానికి నిచ్చెన వేసి వెళ్ళి వారికోసం ఏదైనా మహిమ తీసుకురావడానికి ప్రయత్నించు. దేవుడు తలచుకుంటే వారందర్నీ దారికి తీసుకురా గలడు. (కాని మానవులకు ఇవ్వబడిన స్వేచ్ఛ హరించి వారిని బలవంతంగా దారిలో పెట్టడం దేవుని అభిమతంకాదు.) కనుక నీవు అజ్ఞానిలా ప్రవర్తించకు. (మనస్పూర్తిగా) వినేవాళ్ళే సత్యం స్వీకరిస్తారు. (సత్యంకానలేని) మృతుల్ని దేవుడు (ప్రళయదినానే) లేపు తాడు. తర్వాత వారిని దైవన్యాయస్థానానికి తీసుకుపోవడం జరుగుతుంది. (35-36)
ఈ ప్రవక్తపై అతని ప్రభువు నుండి ఏదైనా మహిమ ఎందుకు అవతరించలేదని వారు అడుగుతున్నారు. మహిమల్ని అవతరింపజేయగల శక్తి దేవునికి పూర్తిగా ఉందని చెప్పు. కాని వారిలో చాలామంది మహిమలను అర్థం చేసుకునే స్థితిలో లేరు. నేలపై సంచరించే జంతువుల్ని, రెక్కలతో గాలిలో ఎగిరే పక్షుల్ని కాస్త గమనించండి. అవి కూడా మీలాంటి జీవరాసులే. మేము విధివ్రాతలో ఏ విషయాన్నీ వదలిపెట్ట లేదు. చివరకు అవన్నీ తమ ప్రభువు వద్దకే సమీకరించబడతాయి. మా సూక్తుల్ని అంధులు, బధిరులే నిరాకరిస్తారు. వారు అజ్ఞానాంధకారంలో పడిఉన్నారు. దేవుడు తానుతలచిన విధంగా కొందరికి దారి చూపుతాడు; మరికొందరిని దారి తప్పిస్తాడు. (37-39)
ఇంకా ఇలా చెప్పు: “ఒకవేళ మీపై దేవుని వైపునుండి ఏదైనా ఆపద వచ్చిపడితే, లేదా అంతిమ ఘడియలు సమీపిస్తే మీరు దేవుడ్ని వదలి ఇతరుల్ని వేడుకుంటారా? మీరు సత్యవంతులైతే దీనికి జవాబివ్వండి. అలాంటి విపత్కరస్థితిలో మీరు కల్పించు కున్న మిధ్యాదైవాలన్నిటిని మరచిపోయి నిజదేవుడ్ని మాత్రమే వేడుకుంటారు. ఆయన తలచుకుంటే మీపై వచ్చిపడిన ఆపదను తప్పకుండా దూరంచేస్తాడు.” (40-41)
మీకు పూర్వం మేము అనేకజాతుల దగ్గరకు ప్రవక్తలను పంపాము. ఆ జాతులు (తలబిరుసుతనం వహించినప్పుడల్లా) మేము వాటిని కష్టాలకు గురిచేశాం, దాని ద్వారా నైనా వారు దీనంగా మాముందు తలవంచుతారన్న ఉద్దేశ్యంతో. ఈవిధంగా మేము వారిని కఠినపరీక్షలకు గురిచేసినప్పుడు వారు మాముందు ఎందుకు దీనంగా తలవంచ లేదు? అసలు వారి హృదయాలు పాషాణాల్లా కఠినమయిపోయాయి. వారు చేస్తున్న దుష్కార్యాల్ని షైతాన్‌ వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు. (42-43)
(మా ప్రవక్తలు) చేసిన ఉపదేశాలను వారు పూర్తిగా విస్మరించారు. అప్పుడు మేము వారికోసం సుఖసంతోషాలు అవతరించే ద్వారాలన్నీ తెరచి పెట్టాము. వారు మేము ప్రసాదించిన అనుగ్రహాలు ఆస్వాదిస్తూ అందులో పూర్తిగా మునిగిపోయారు. అలాంటి స్థితిలో మేము హఠాత్తుగా వారిని పట్టుకున్నాము. దాంతో వారిక చేసేదిలేక పూర్తిగా నిరాశచెందారు. ఆవిధంగా మేము దుర్మార్గానికి పాల్పడినవారిని సమూలంగా తుడిచిపెట్టాం. సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన దేవునికే శోభిస్తాయి. (44-45)
వారినిలా అడుగు: “దేవుడు గనక మీ దృష్టి, వినికిడి శక్తుల్ని పోగొట్టి మీ హృదయ కవాటాలు మూసేస్తే ఆ తర్వాత దేవుడు తప్ప మరెవరు వాటిని తిరిగి రప్పించగలరు? దీన్ని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” చూడు, వారికి మా నిదర్శనాలను మాటి మాటికి ఎలా చూపుతున్నామో! అయినా వారు అంధులుగానే ప్రవర్తిస్తున్నారు. (46)
వారిని అడుగు: “సరే, ఈ విషయమైనా ఆలోచించారా మీరు ఎప్పుడైనా? దేవుని వైపునుండి అకస్మాత్తుగా లేదా బహిరంగంగా మీపై శిక్ష(గా ప్రకృతి విపత్తు) విరుచుకు పడితే, అప్పుడు దుర్మార్గులు కాక మరెవరు నాశనమవుతారు?” మేము ఏ ప్రవక్తను పంపినా (స్వర్గ)శుభవార్త అందజేయడానికి, దైవశిక్ష గురించి హెచ్చరించడానికి మాత్రమే పంపుతాం. వారి మాటలు విశ్వసించి, జీవితాన్ని సరిదిద్దుకునే వారికి (పరలోకంలో) ఎలాంటి భయంగాని, దుంఖఃగాని ఉండదు. అయితే మా సూక్తులు నిరాకరించినవారు తమ దుష్కార్యాలకు పర్యవసానంగా తగినశిక్ష చవిచూడవలసి వస్తుంది. (47-49)
ముహమ్మద్‌ (స)! వారితో ఇలా అను: “నా దగ్గర దేవుడు ప్రసాదించిన నిధి నిక్షేపా లున్నాయని నేను మీతో అనడంలేదు. నాకు అగోచర జ్ఞానం ఉందని, (అతీంద్రియ శక్తులున్నాయని), నేను సాక్షాత్తు దైవదూతనని కూడా చెప్పుకోవడం లేదు. నాపై అవత రిస్తున్న దివ్యావిష్కృతిని మాత్రమే నేను అనుసరిస్తున్నాను.” ఇంకా వారిని అడుగు: “గుడ్డివాడు, కళ్ళున్నవాడు ఒకటేనా? దీన్ని గురించి మీరు ఆలోచించరా?” (50)
కొందరు తాము ఓరోజు దేవుని సన్నిధికి చేరుకోవలసిఉందని గ్రహించి ఆయనకు భయపడుతుంటారు. అక్కడ దేవుడు తప్ప తమకు సహాయం, సిఫారసు చేసేవారు ఎవరూ ఉండరని కూడా వారికి తెలుసు. అలాంటివారికి దీని (ఖుర్‌ఆన్‌) ద్వారా హితో పదేశం చెయ్యి. దానివల్ల వారు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు. (51)
మరికొందరు రేయింబవళ్ళు తమ ప్రభువునే వేడుకుంటూ ఆయన ప్రసన్నతను అర్థిస్తూ ఉంటారు. అలాంటివారిని నీ నుండి దూరంచేయకు. వారి (కర్మల) లెక్క విషయమై నీపై ఎలాంటి బాధ్యత లేదు. అలాగే నీ (కర్మల) లెక్క విషయమై వారిపై ఎలాంటి బాధ్యత లేదు. ఈ విషయం తెలుసుకున్న తరువాత కూడా నీవు వారిని నీ దగ్గర్నుండి తొలిగిస్తే నీవు దుర్మార్గునిగా పరిగణించబడతావు. (52)
(ధనికులు పేదలను చూసి) “మాలో దైవానుగ్రహం పొందినవారు వీరేనా?” అని అనడానికి వారిలో కొందరిని మేము కొందరి ద్వారా పరీక్షకు గురిచేశాము. మరి దేవుడు కృతజ్ఞులైన తన దాసులను గురించి ఎరగడా? కాబట్టి మా సూక్తుల్ని విశ్వసించినవారు నీ దగ్గరకొస్తే “మీకు శాంతి కల్గుగాక!” అని వారిని దీవించు. నీ ప్రభువు దయాదాక్షిణ్యా లను (విశ్వసించిన దాసులపై కురిపించడాన్ని) తన కర్తవ్యంగా చేసుకున్నాడు.
మీలో ఎవరైనా అజ్ఞానంతో ఏదైనా పాపకార్యం చేసి, ఆ తరువాత పశ్చాత్తాపంతో (దేవుడ్ని) మన్నింపు వేడుకొని తనను తాను సరిదిద్దుకుంటే దేవుడు అతడ్ని క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. పాపాత్ముల వైఖరి స్పష్టంగా వెల్లడి కావడానికి ఇలా మేము మా సూక్తుల్ని విడమరచి తెలియజేస్తున్నాం. (53-55)
చెప్పు: “నిజదేవుడ్ని వదలి మీరు మొరపెట్టుకుంటున్న మిధ్యాదైవాలను ఆరాధించ కూడదని నన్ను వారించడం జరిగింది.” చెప్పు: “నేను మీ మనోకాంక్షలను అనుస రించను. అలా చేస్తే నేనూ మార్గభ్రష్టుణ్ణయి పోతాను; సన్మార్గం పొందినవారిలో ఇక ఉండను.” చెప్పు: నేనొక స్పష్టమైన ప్రమాణాన్ని నమ్ముతూ దానిపై స్థిరంగా ఉన్నాను. కాని మీరేమో దాన్ని తిరస్కరించారు. ఇక మీరు తొందరపెడ్తున్న (దైవశిక్ష) విషయం నా చేతిలో లేదు. నిర్ణయాధికారాలన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన వాస్తవం వివరిస్తున్నాడు. ఆయనే అందరికన్నా మంచి నిర్ణయం తీసుకునేవాడు.” (56-57)
చెప్పు: “మీరు తొందరపెడ్తున్న (శిక్ష) విషయం నా చేతిలో వుంటే మీకూ, నాకూ మధ్య వివాదం ఎప్పుడో తీరిపోయి ఉండేది. కాని దుర్మార్గుల పట్ల ఎలా వ్యవహరిం చాలో దేవునికి బాగా తెలుసు.” అగోచర విషయాలకు సంబంధించిన నిగూఢ రహస్యా లన్నీ ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు తప్ప వాటిని గురించి మరెవరికీ తెలియదు. నదీనదాల్లో, కీకారణ్యాల్లో ఏముందో ఆయనకే తెలుసు. చెట్టునుండి రాలే ఏఆకూ ఆయన దృష్టిపథం నుండి తప్పించుకోజాలదు. చివరికి భూపొరలలో నిక్షిప్తమై ఉండే విత్తనం సైతం ఆయన జ్ఞానపరిధిలో ఉంటుంది. పచ్చి వస్తువులు, ఎండు వస్తువులు సైతం ఆయన దగ్గర స్పష్టంగా గ్రంథస్తం చేయబడి ఉన్నాయి. (58-59)
రాత్రివేళ మీ ఆత్మలను స్వాధీనం చేసుకునేవాడు, పగటివేళ మీరు చేసే పనులు గమనించేవాడు కూడా ఆయనే. మీ నిర్ణీతజీవితకాలం సాగడానికి మరునాడు మిమ్మల్ని దైనందిన ప్రపంచంలోకి పంపుతున్నవాడు కూడా ఆయనే. చివరికి ఓరోజు మీరంతా ఆయన సన్నిధికే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు (ఇహలోకంలో ఉండగా) ఏమేమి చేస్తుండేవారో మీకు తెలియజేస్తాడు. (60)
ఆయనకు తన దాసులపై పూర్తి అదుపు, అధికారాలున్నాయి. ఆయన మిమ్మల్ని పర్యవేక్షించేవారిని నియమించి పంపుతున్నాడు. మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన పంపే దూతలే అతని ప్రాణం తీసికెళ్తారు. వారు కర్తవ్యనిర్వ హణలో ఎలాంటి లోటు రానివ్వరు. చివరికి అందరూ తమ అసలుయజమాని అయిన దేవుని దగ్గరికే తీసుకురాబడతారు. గుర్తుంచుకోండి, నిర్ణయాధికారాలన్నీ ఆయనకే హస్తగతమైఉన్నాయి. (మీ)లెక్క తేల్చడానికి ఆయనకు ఎంతోసేపు పట్టదు. (61-62)
ముహమ్మద్‌ (స)! వారిని ఈ విషయం అడుగు: “మీరు అడవుల్లో, సముద్రాల్లో చిక్కుకున్నప్పుడు ఆ చీకటికూపాల నుండి మిమ్మల్ని కాపాడేదెవరు? (ఆపద సమయం లో) మీరు ఘోరంగా విలపిస్తూ దీనంగా మొరపెట్టుకునేది ఎవరిని? ‘ఈ ఆపద నుండి మమ్మల్ని గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులై ఉంటామ’ని మీరు ఎవరిని వేడుకుంటారు?” చెప్పు: “దేవుడే మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడుతున్నాడు. మరి మీరు ఆయనకు ఇతరులను ఎలా సాటికల్పిస్తున్నారు?” (63-64)
వారికీ సంగతి కూడా చెప్పు: “ఆయన తలచుకుంటే మీ మీదికి పైనుండిగాని, లేదా మీకాళ్ళ కింద నుండిగాని శిక్ష రప్పించగలడు. లేదా మిమ్మల్ని విభిన్న వర్గాలుగా చీల్చి ఒకవర్గం శక్తిని మరొక వర్గానికి చవిచూపించగలడు.” చూడు, వారు వాస్తవం తెలుసుకోవడానికి మేము వివిధరకాలుగా మాసూక్తులు వారి ముందు ఎలా వివరి స్తున్నామో. కాని నీ జాతిప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చెప్పు: “మీ (తిరస్కార) వైఖరికి నేనెలాంటి బాధ్యుడ్ని కాను. ప్రతి సంఘటన దాని నిర్ణీత సమయంలోనే సంభవిస్తుంది. త్వరలోనే వాస్తవం ఏమిటో మీకే తెలుస్తుంది.” (65-67)
ప్రజలు మా సూక్తుల్ని గురించి కువిమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే నీవు వారి దగ్గర కూర్చోకు. అక్కడ్నుంచి లేచి వెళ్ళు. వారా విషయం మానేసి మరో విషయం మాట్లాడుకునేదాకా వారి చెంతకు వెళ్ళకు. ఎప్పుడయినా షైతాన్‌ నిన్ను మరిపింపజేస్తే జ్ఞాపకం వచ్చిన వెంటనే అలాంటి దుర్మార్గుల దగ్గర్నుంచి లేచి వెళ్ళిపో. వారి (దుష్క ర్మల) లెక్క గురించి దైవభీతిపరులపై ఎలాంటి బాధ్యత లేదు. అయితే తప్పుడు వైఖరి విడనాడినవారికి మాత్రం హితోపదేశం తప్పనిసరిగా చేస్తూఉండాలి. (68-69)
తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నవారిని వదిలెయ్‌. వారిని ఐహిక జీవితం మోసగించింది. అయితే వారికి ఖుర్‌ఆన్‌ సూక్తులు విన్పించి హితోపదేశం చేస్తూండు. మనిషి తన దుష్కార్యాలకు పర్యసానంగా పరలోకంలో పట్టుబడకుండా ఉండేందుకు వారిని ఖుర్‌ఆన్‌ బోధనల ద్వారా హెచ్చరించు. పట్టుబడితే మాత్రం ఇక అతడ్ని దేవుని పట్టు నుండి ఎవరూ కాపాడలేరు. అతని కోసం సిఫారసు చేసేవారు కూడా ఎవరూ ఉండరు. అంతేకాదు, ఒకవేళ అతను తనకు వీలైన వస్తు సంపదలన్నీ పాపపరిహారంగా ఇవ్వడానికి సిద్ధపడినా సరే, వాటిని స్వీకరించి అతడ్ని రక్షించడం ఎన్నటికీ జరగదు. వీరసలు తమ (దుష్‌)కర్మలకు పర్యవసానంగా పట్టుబడనున్న పరమ దుర్మార్గులు. సత్య నిరాకరణకు ప్రతిఫలంగా వారికి త్రాగేందుకు సలసల కాగే నీళ్ళు ఇవ్వబడతాయి. ఆపై వ్యధాభరితమైన యాతనలు చవిచూడవలసి ఉంటుంది. (70)
ముహమ్మద్‌ (సల్లం)! వారిని ఇలా అడుగు: “మేము దేవుడ్ని వదలి మాకు ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించలేని వాటిని ఆరాధించాలా? దేవుడు మాకు ఒకసారి సన్మార్గం చూపిన తరువాత మేము మళ్ళీ వెనక్కి తిరిగిపోవాలా? అలాగయితే మా పరిస్థితి కూడా కీకారణ్యంలో షైతాన్‌మూకలు దారి తప్పించగా దిక్కుతోచని స్థితిలో పడిపోయే వ్యక్తిలా అవుతుంది. మరో వైపు వాడి సహచరులు అతడ్ని ఇటు వచ్చేయి, సరైన దారి ఇక్కడుంది అని పిలుస్తున్నారే!”
చెప్పు: “నిజానికి దేవుడు చూపే మార్గమే సరయిన మార్గం. ఆయన వైపు నుండి మాకీ విధంగా ఆదేశం లభించింది- సకలలోక ప్రభువుకు విధేయులై ఉండండి. ప్రార్థనా (నమాజ్‌) వ్యవస్థ నెలకొల్పండి. ఆయన ఆగ్రహం నుండి తప్పించుకోండి. ఆయన సన్నిధికే మీరంతా మరలిపోవలసి ఉంది”. (71-72)
ఆయనే భూమ్యాకాశాల్ని సత్యం ప్రాతిపదికపై (ఓ మహోన్నత లక్ష్యంకోసం) సృష్టిం చాడు. ఆయన ఏరోజయితే ‘అయిపో’ అని అంటాడో ఆరోజు (పునరుత్థానం) సంభ విస్తుంది. ఆయన ఆజ్ఞ సత్యమైనది. (ప్రళయ)శంఖం పూరించే రోజు రాజ్యాధికార మంతా ఆయనదే అవుతుంది (అని మీకు తెలిసిపోతుంది). ఆయనే గోచర, అగోచర విషయాలన్నీ ఎరిగినవాడు. ఆయనే వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు. (73)
ఇబ్రాహీం తనతండ్రి ఆజర్‌తో అన్న మాటలు గుర్తుకుతెచ్చుకో. అతను తన తండ్రితో “ఏమిటీ, మీరు విగ్రహాలను దేవుళ్లుగా చేసుకున్నారు? మీరు, మీజాతి ప్రజలు పూర్తిగా మార్గభ్రష్టత్వంలో పడిపోయారు” అనిఅన్నాడు. ఇబ్రాహీం నమ్మేవారిలో చేరడా నికి మేమతనికి ఇలా భూమ్యాకాశాల సామ్రాజ్య వ్యవస్థను చూపించాము:
ఒకరోజు అతనిపై చీకటి కమ్ముకోగానే అతనొక నక్షత్రం చూసి “ఇతను నా ప్రభువు” అన్నాడు. కాని ఆ నక్షత్రం అస్తమించగానే “ఇలాంటి అస్తమించేవాటిని నేను ప్రేమించను” అన్నాడు. తర్వాత చంద్రుడు ప్రకాశిస్తూ కన్పించగానే ఇతనే నాప్రభువు” అన్నాడు. (కాస్సేపటికి) చంద్రుడు కూడా అస్తమించడంతో “(ఇతనూ నాప్రభువు కాదు.) నాప్రభువు నాకు మార్గం చూపకపోతే నేను మార్గభ్రష్టుణ్ణయిపోతాను”అన్నాడు. (74-77)
ఆతర్వాత (మరునాడుదయం) సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ కన్పిం చాడు, అప్పుడు ఇబ్రాహీం “ఇతనే నాప్రభువు, అందరికంటే గొప్పప్రభువు” అన్నాడు. అయితే సూర్యుడు కూడా అస్తమించడంతో (అతనికి జ్ఞానోదయం అయింది.) అతను తన జాతితో “నాజాతి ప్రజలారా! మీరు దేవునికి సాటికల్పిస్తున్న మిథ్యాదైవాలతో నేను విసిగిపోయాను. నేనిప్పుడు పూర్తి ఏకాగ్రతతో భూమ్యాకాశాల్ని సృష్టించినవాని వైపుకు మరలాను. నేను ఏమాత్రం బహుదైవారాధకుడ్ని కాను” అనిఅన్నాడు. (78-79)
ఈ విషయంలో ఇబ్రాహీంజాతి ప్రజలు అతనితో వాదనకు దిగారు. అప్పుడతను వారితో ఇలా అన్నాడు: “ఏమిటీ, మీరు దేవుని విషయంలో నాతో వాదనకు దిగారు? అసలు ఆయనే నాకు రుజుమార్గం చూపింది. ఏమైనప్పటికీ మీరు దేవునికి సాటి కల్పించిన మిథ్యాదైవాలకు నేను ఏమాత్రం భయపడను. ఏదైనా సరే నాప్రభువు తలచుకుంటేనే జరుగుతుంది. నా ప్రభువు జ్ఞానం ప్రతిదాన్నీ పరివేష్ఠించిఉంది. మీరు ఇప్పుడైనా స్పృహలోకి వస్తారా?” (80)
“బహుదైవారాధన గురించి దేవుడు మీకెలాంటి ప్రమాణం పంపకపోయినా, మీరు ఆయన దైవత్వంలో ఇతరుల్ని భాగస్వాములు చేశారు. అలాంటి పని చేసి కూడా మీరు దేవునికి భయపడనప్పుడు, మీ కల్పితదైవాలకు నేనెందుకు భయపడాలి? మన ఉభ యుల్లో నిర్భయం, నిశ్చింతలకు ఎవరెక్కువ అర్హులో మీరే చెప్పండి తెలిస్తే. సత్యాన్ని విశ్వసించి, అందులో బహుదైవారాధనా భావానికి ఏమాత్రం ఆస్కారమివ్వని వారికే శాంతీస్థిమితాలు ప్రాప్తమవుతాయి. అలాంటివారే సన్మార్గంలో ఉంటారు.” (81-82)
ఇదీ మావాదన. దీన్ని మేము ఇబ్రాహీంకు అతని జాతిప్రజలపై ప్రయోగించడానికి ప్రసాదించాం. మేము తలచుకున్నవారికి ఉన్నత స్థానాలు ప్రసాదించి, వారి అంతస్తులు పెంచుతాం. నీప్రభువు ఎంతో వివేకవంతుడు, జ్ఞానసంపన్నుడు. (83)
ఆ తర్వాత మేము ఇబ్రాహీం (అలై)కు ఇస్‌హాఖ్‌ (లాంటి కొడుకు)ను, యాఖూబ్‌ (లాంటి మనవడి)ని అనుగ్రహించాము. వారందరికీ సన్మార్గం చూపాం. దీనికి పూర్వం నూహ్‌ (అలై)కు కూడా సన్మార్గం చూపాం. అతని సంతతి నుండి మేము దావూద్‌, సులైమాన్‌, అయ్యూబ్‌, యూసుఫ్‌, మూసా, హారూన్‌ (అలై)లను (సన్మార్గగాములుగా) ప్రభవింపజేశాం. ఇలా మేము సజ్జనులకు వారి సద్వర్తనకు (తగిన) ప్రతిఫలం ప్రసాది స్తున్నాం. (అతని సంతతి నుండే) మేము జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్‌ (అలై) లను కూడా ప్రభవింపజేశాం. వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే. (అతని సంతతి నుండే) ఇస్మాయీల్‌, అల్‌యసఅ, యూనుస్‌, లూత్‌ (అలై)లను (సన్మార్గగాములుగా) ప్రభ వింపజేశాము. వారిలో ప్రతి ఒక్కరికీ ప్రపంచ మానవులందరిలో కెల్లా ఎక్కువ గౌరవం, ఔన్నత్యాలను ప్రసాదించాము. (84-86)
పైగా, వారి తాతముత్తాతలు, సంతానం, సోదరుల్లో కూడా చాలామందికి మేము (ఎంతగానో) అనుగ్రహించాం. వారిని ప్రత్యేకంగా మా సేవకోసం ఎన్నుకొని సన్మార్గం వైపు నడిపించాం. ఇది దేవుని మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గదర్శనం చేస్తాడు. వారు దేవునికి సాటికల్పించిఉంటే వారి పుణ్యకార్యాలన్నీ వృధాఅయిపోయేవి. వారికి మేము గ్రంథం, వివేకం, ప్రవక్తృత్వాలను ప్రసాదించాం.
ఇప్పుడు వీరు ఈ విషయాల్ని విశ్వసించడానికి నిరాకరిస్తే (నిరాకరించనీ), మేమీ (విశ్వాస)భాగ్యం దాన్ని నిరాకరించనివారికి ప్రసాదించాం. ముహమ్మద్‌! గుర్తుంచుకో. దేవుని నుండి సన్మార్గభాగ్యం పొందినవారు వీరే. కనుక నీవు వారు నడచిన బాటనే నడు. వారికి చెప్పు: “నేనీ (ప్రచార)కార్యం కోసం మీనుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించ డంలేదు. ఇది యావత్మానవాళి కోసం వచ్చిన సార్వజనీన హితోపదేశం.” (87-90)
వారు తమ తప్పుడు అంచనాలతో దేవుని విషయంలో చాలాపొరబడ్డారు. దేవుడు ఏ మానవమాత్రుడిపై ఎలాంటి విషయాన్నీ అవతరింపజేయలేదని అంటున్నారు. వారి నడుగు: “ఇంతకూ మూసా తెచ్చిన గ్రంథాన్ని ఎవరు అవతరింపజేశారనుకుంటున్నారు? అది మానవులకు (జ్ఞాన)కాంతినిచ్చి సన్మార్గంచూపే గ్రంథం. అలాంటి గ్రంథాన్ని మీరు అనేక భాగాలుగా విడదీసి పెట్టారు. వాటిలో కొన్నిటిని మాత్రమే వెల్లడిస్తూ మిగిలిన వాటిని దాచిపెట్టారు. మీరు, మీ తాతముత్తాతలు ఎరగని ఎన్నో విషయాలను మేము (ఈగ్రంథం ద్వారా) మీకు తెలియజేశాం.” చెప్పు (దాన్ని) దేవుడు (అవతరింపజేశాడు) అని. ఆ తర్వాత వారిని వారి పనికిమాలిన వాదనల్లోనే పడి ఉండనివ్వు. (91)
(ఆ గ్రంథంలాగే) ఈ గ్రంథాన్ని కూడా మేమే అవతరింపజేశాము. ఇది ఎంతో శుభ దాయకమైన గ్రంథం. నీకు పూర్వం అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తోంది. ఈ గ్రంథం లోని బోధనల ద్వారా నీవు రాజధాని (మక్కా) నగర వాసుల్ని, దాని పరిసర ప్రాంతాల్లో నివసించేవారిని హెచ్చరించడానికి దీన్ని అవతరింపజేశాము. పరలోకాన్ని నమ్మేవారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తున్నారు. పైగా వారు తమ ప్రార్థన (నమాజ్‌) పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తూ అత్యంత శ్రద్ధాసక్తులతో దాన్ని ఆచరిస్తున్నారు. (92)
దేవుని మీద అసత్యం మోపేవాడి కంటే పరమదుర్మార్గుడు ఎవరుంటారు? అతని పై ఎలాంటి దైవసందేశం అవతరించకపోయినా తనపై కూడా దైవసందేశం అవతరి స్తోందని లేదా దేవుడు అవతరింపజేసి నటువంటి వాటిని తాను కూడా అవతరింపజేసి చూపుతానని అతను కారుకూతలు కూస్తున్నాడు. ఈ దుర్మార్గులు మరణావస్థలో దుర్భర యాతనతో ఎంత తల్లడిల్లిపోతారో నీవు చూస్తే బాగుండు. అప్పుడు దైవదూతలు చేతులు ముందుకు చాపుతూ ఇలాఅంటారు: “తీయండిక మీ ప్రాణాలు బయటికి. మీరు దేవుని మీద అసత్యవిషయాలు మోపి అన్యాయంగా కారుకూతలు కూశారు. తలబిరుసుతో ఆయన సూక్తులపై కువిమర్శలు చేస్తుండేవారు. అందుకు ఈరోజు మీరు అత్యంత అవమానకరమైన యాతన చవిచూడండి.” (93)
“మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా ఒంటరిగా పుట్టించామో అలాగే ఈరోజు మీరు మా దగ్గరికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ఇహలోకంలో ప్రసాదించినదంతా అక్కడే వదిలేసి వచ్చారు. మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని మీరు భావించిన మీ సిఫారసు కర్తలు ఈరోజు మీదగ్గర లేకుండాపోయారు. మీ పరస్పర సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు ఎంతో ఆశపెట్టుకున్న వారంతా ఈరోజు మీనుండి కనుమరుగైపోయారు.” (94)
దేవుడే విత్తనాన్ని, టెంకను చీల్చి తీసేవాడు. ఆయనే నిర్జీవపదార్థం నుండి జీవిని, జీవి నుండి నిర్జీవపదార్థాన్ని తీసేవాడు. ఈ పనులన్నీ చేసేవాడు దేవుడే కదా! అలాం టప్పుడు మీరు దారితప్పి ఎటు పోతున్నారు? రాత్రి చీకటితెరలను చీల్చి ఉదయాన్ని తెస్తున్నవాడు ఆ దేవుడే. ఆయనే రాత్రిని విశ్రాంతి సమయంగా చేసి సూర్యచంద్రుల ఉదయాస్తమయాలకు తగిన వేళల్ని నిర్ణయించినవాడు. ఇదంతా మహా శక్తిమంతుడు, అపార జ్ఞానసంపన్నుడైన దేవుడు నిర్దేశించిన అద్భుతనియమావళి. (95-96)
ఆయనే మీకోసం కీకారణ్యం, భీకర సముద్రాలలోని కారుచీకట్లలో నక్షత్రాలను దారి తెలుసుకునే సాధనాలుగా చేశాడు. విజ్ఞుల కోసం మా సూచనల్ని ఎలా విశదీకరి స్తున్నామో చూడు! ఆయనే మిమ్మల్ని ఏకజీవి నుండి పుట్టించాడు. తర్వాత మీలో ప్రతి ఒక్కరికీ నివసించడానికి ఒకచోటు, అప్పగించబడేందుకు ఒక స్థలం నిర్ణయించ బడ్డాయి. ఈసూచనలు విజ్ఞులు కోసం మేము విడమరచి తెలుపుతున్నాం. (97-98)
ఆయనే ఆకాశం నుండి వర్షం కురిపించి రకరకాల మొక్కలు మొలకెత్తిస్తున్నాడు. తిరిగి ఆ మొక్కల నుండి పచ్చటి పొలాలు, వృక్షాలు తీస్తున్నాడు. వాటిద్వారా పొరలు పొరలుగా ఒకదానిపై మరొకటి పడివుండే ధాన్యం, గింజలు, కాయలు పండిస్తున్నాడు. ఖర్జూరమొగ్గల నుండి బరువుతో వ్రేలాడే పండ్లగుత్తులు సృజిస్తున్నాడు. ఆయనే ద్రాక్ష, ఆలివ్‌, దానిమ్మ తోటలు సృష్టిస్తున్నాడు. ఆలివ్‌, దానిమ్మపండ్లు ఆకారంలో దాదాపు ఒకేలాఉన్నా దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ చెట్లు పుష్పించి, పండ్లుకాసి పండే తీరు చూడు. విశ్వసించేవారికి వాటిలో (అనేక)సూచనలు, నిదర్శనాలున్నాయి. (99)
అయినా మానవులు తమ సృష్టికర్తయిన దేవునికి భూతపిశాచాలను సాటికల్పించి పూజిస్తున్నారు. పైగా వారు తెలిసో తెలియకో ఆయనకు కొడుకుల్ని, కూతుళ్ళను అంట గడ్తున్నారు. కాని దేవుడు ఎంతో పరిశుద్ధుడు. వారు కల్పించి పలుకుతున్న మాటలకు ఆయన ఎంతో అతీతుడు. ఆయన యావత్తు భూమ్యాకాశాలనే సృష్టించిన అద్భుత శక్తి సంపన్నుడు. ఆయనకసలు భార్యే లేనప్పుడు సంతానం ఎలా కలుగుతుంది? ఆయనే ప్రతిదాన్నీ సృష్టించేవాడు, ప్రతి విషయమూ తెలిసినవాడు. (100-101)
అలాంటి దేవుడే మీప్రభువు. ఆయన తప్ప మరోదేవుడు లేడు. ఆయనే సర్వసృష్టి కర్త. కనుక మీరు ఆయన్నే ఆరాధించండి. ఆయనే అందరికీ సంరక్షకుడు. ఎవరి చూపులూ ఆయన్ని అందుకోలేవు. ఆయన మాత్రం అందరి చూపుల్నీ అందుకోగలడు. ఆయన ఎంతో సునిశితదృష్టి కలవాడు, ప్రతిదాన్నీ తెలుసుకోగలవాడు. (102-103)
“ఇప్పుడు మీ ప్రభువు నుండి మీదగ్గరికి స్పష్టమైన ఆధారాలు వచ్చాయి. కనుక కళ్ళుతెరచి చూసేవాడే ప్రయోజనం పొందగలడు. (కళ్ళుండీ చూడలేని) గుడ్డివాడు తననే నష్టపరచుకుంటాడు. నేను మీపై పర్యవేక్షకుడ్ని కాను” (అని చెప్పు). ఈవిధంగా మేము మాసూక్తుల్ని మాటిమాటికి విభిన్న రీతులలో విశదీకరిస్తున్నాం. నీవు ఎవరి వద్దనో విని (ఈ సూక్తులు) చెబుతున్నావని వీరు ఆరోపిస్తున్నందున, బుద్ధీజ్ఞానం కలవారి ముందు ఇలా యదార్థం బట్టబయలు చేస్తున్నాం. (104-105)
ముహమ్మద్‌! నీవు మాత్రం నీ ప్రభువు నుండి నీపై అవతరించిన దివ్యావిష్కృతి (వహీ)ని అనుసరిస్తూఉండు. ఆ ప్రభువు తప్ప మరో దేవుడు లేడు. బహుదైవారాధకుల్ని ఎన్నటికీ అనుసరించకు. దేవుడు తలచుకుంటే వారిని బహుదైవారాధన చేయకుండా ఆపగలడు. మేము నిన్ను వారిపై పర్యవేక్షకునిగా నియమించలేదు. అలాగే వారిపై నీవు రక్షకభటుడి పాత్ర వహించనవసరం లేదు. (106-107)
(విశ్వాసులారా!) వారు నిజదేవుడ్ని వదలి ప్రార్థించే మిధ్యాదైవాల్ని మీరు దూషించ కండి. అలాచేస్తే వారు బహుదైవారాధనను కూడా మించిపోయి, అజ్ఞానంతో నిజదేవుడ్నే దూషించడానికి సిద్ధపడతారు. మేము ప్రతివర్గానికీ వారు చేస్తున్న పనులనే ఆకర్షణీయ మైనవిగా చేశాం. చివరికి వారు తమ ప్రభువు సన్నిధికే పోవలసి ఉంది. అప్పుడాయన గతంలో వారు చేస్తుండిన (తప్పుడు) పనులేమిటో వారికి తెలియజేస్తాడు. (108)
వారు పెద్దపెద్ద ఒట్లు వేసుకుంటూ, తమ ముందు ఏదయినా మహిమ వస్తే తాము తప్పకుండా దాన్ని విశ్వసిస్తామని అంటారు. ముహమ్మద్‌ (సల్లం)! మహిమల్ని చూపించే శక్తి దేవునికి మాత్రమే ఉందని చెప్పు. ముస్లిములారా! వారి సంగతి మీకు తెలియదు. ఒకవేళ మేము మహిమల్ని చూపినా వారు విశ్వసించే మనుషులు కారు. వారసలు (ఈ ఖుర్‌ఆన్‌ని) ఒక్క సారైనా విశ్వసించని విధంగా మేము వారి హృదయా లను, దృష్టిని మార్చివేస్తున్నాం. ఈవిధంగా మేము వారిని వారి తిరస్కారం, తలబిరుసు తనాల్లోనే (ఎల్లప్పుడూ) పడివుండేలా వదలి పెడ్తున్నాము. (109-110)
ఒకవేళ వారిముందు మేము దైవదూతల్ని ప్రత్యక్షపరచినా, మృతులు లేచివచ్చి వారితో మాట్లాడినా, చివరికి ప్రపంచంలోని వస్తువులన్నీ వారి దగ్గరకు తీసుకువచ్చినా సరే, వారు ఏమాత్రం విశ్వసించరు, విశ్వసించాలని దేవుడు వారి నొసట రాసిపెడ్తే తప్ప. వారిలో చాలామంది మూఢుల్లా మాట్లాడుతారు. (111)
అదేవిధంగా మేము పైశాచిక (స్వభావంగల) మానవుల్ని, జిన్నుల్ని ప్రతి దైవ ప్రవక్తకు శత్రువులుగా చేశాం. వారు ఆత్మవంచనతో పరస్పరం మనోహరమైన మాటలు చెప్పుకుంటారు. అలా చేయకూడదని ముందే నీ ప్రభువు నిర్ణయించి ఉంటే వారలా ఎన్నటికీ చేయరు. కనుక వారు అలాగే తియ్యటి మాటలతో ఒకర్నొకరు మోసగించు కునేలా వారి మానాన వారిని వదలిపెట్టు. పరలోకాన్ని విశ్వసించనివారి హృదయాలు సహజంగానే తియ్యటి మాటల వైపు మొగ్గుతాయి. అవంటేనే వారికి ఇష్టం. (యదార్థం వారికిప్పుడు చేదుగానే ఉంటుంది.) అందువల్ల వారు (యదార్థం తెలిసినప్పటికీ) లోగడ చేస్తూ వచ్చిన (దుష్ట)కార్యాలే ఇప్పుడూ చేస్తున్నారు. (112-113)
(వారినడుగు:) “నేను దేవుడ్ని వదలి వేరే మరో తీర్పరిని అన్వేషించాలా? అసలు ఆయనే కదా పూర్తి వివరాలతో ఈ గ్రంథాన్ని మీ దగ్గరకు పంపినవాడు.” నీకు పూర్వం గ్రంథం ఇవ్వబడినవారికి నీ ప్రభువు నుండే సత్యపూరితమైన ఈగ్రంథం కూడా అవత రించిందని తెలుసు. కనుక నీవు అనుమానించేవారిలో చేరిపోకు. నీ ప్రభువు వాక్కు సత్యం, న్యాయాల దృష్ట్యా స్వచ్ఛమైనది, సమగ్రమైనది. ఆయన వచనాలను ఎవరూ మార్చలేరు. ఆయన సమస్తం వింటున్నాడు, సర్వం ఎరిగినవాడు. (114-115)
ముహమ్మద్‌ (స)! నీవు భూవాసుల్లోని అధిక సంఖ్యాకులు చెప్పే మాటలు గనక వింటే వారు నిన్ను దైవమార్గంనుండి తప్పిస్తారు. వారు కేవలం ఊహాలోకంలో విహరిస్తూ నిరాధారమైన విషయాలు అనుసరిస్తారు. నిజానికి ఎవరు నీప్రభువు మార్గం తప్పి వున్నారో, ఎవరు సరైనమార్గంలో ఉన్నారో నీ ప్రభువుకు బాగా తెలుసు. (116-117)
(విశ్వాసులారా!) మీరు దేవుని సూక్తులు విశ్వసించినవారైతే దేవుని పేరు స్మరించ బడిన పశువునే తినాలి. దేవుడు కొన్ని పశువుల్ని మీకు గత్యంతరం లేనప్పుడు తప్ప సాధారణ పరిస్థితుల్లో తినడాన్ని నిషేధించాడు. వాటి వివరాలు మీకు తెలియజేశాడు. అలాంటప్పుడు మీరు దేవుని పేరు స్మరించబడిన పశువుల్ని ఎందుకు తినరు? చాలా మంది సరైన జ్ఞానం లేకుండా మనోవాంఛలకు బానిసలై (మాయమాటలతో) జనాన్ని దారితప్పిస్తారు. అలా హద్దుమీరినవారి సంగతి నీప్రభువుకు బాగాతెలుసు. (118-119)
మీరు మాత్రం బహిరంగ పాపాలక్కూడా దూరంగా ఉండండి, రహస్య పాపాలకు కూడా దూరంగా ఉండండి. పాపకృత్యాలకు పాల్పడుతున్నవారు త్వరలోనే తమ పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తారు. దేవుని పేరు స్మరించకుండా కోసిన పశువును తినకండి. అలా తినడం పాపం. పైశాచిక శక్తులు తమ అనుచరుల హృదయాల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తించి వారిని మీపై ఉసిగొల్పుతాయి. వారి మాటలు విని నడచుకుంటే మీరు కూడా బహుదైవారాధకులయి పోతారు. (120-121)
ఒక మృత వ్యక్తికి మేము ప్రాణం పోసి (జ్ఞాన)జ్యోతి ప్రసాదించగా అతను దాని వెలుగులో సవ్యమైన జీవితం సాగిస్తుంటాడు. దానికి భిన్నంగా మరొకడు అంధకారంలో పడిపోయి ఇక ఏవిధంగానూ అందులో నుంచి బయటపడలేడు. ఆ ఇద్దరు సమాను లవుతారా? (చీకటి-వెలుగులు ఎన్నటికీ ఒకటి కాజాలవు. అలాగే విశ్వాసులు, అవిశ్వాసులు కూడా.) అదేవిధంగా అవిశ్వాసులకు వారు చేస్తున్న (చెడ్డ) పనులు మంచివిగానే తోచేటట్లు చేయబడ్డాయి. మేము ప్రతి ఊళ్ళో కుట్రలు, కుయుక్తులు పన్నే పరమ దుర్మార్గులను కూడా పుట్టించాము. అయితే వారు పన్నే కుట్రల వలలో చివరికి వారే చిక్కుకుంటారు. కాని వారా సంగతి గ్రహించడం లేదు. (122-123)
వారు తమ ముందుకు ఏదైనా దైవసూక్తి వస్తే “దైవప్రవక్తకు ఇవ్వబడిన ప్రవక్త హోదా మాకూ ఇవ్వబడనంత వరకు మేము దీన్ని విశ్వసించం” అంటారు. ప్రవక్తపదవి ఎవరికి అప్పగించాలో దేవునికి బాగా తెలుసు. త్వరలోనే ఈ నేరస్థులు తమ కుట్రల ఫలితంగా దేవుని వద్ద ఘోర పరాభవాన్ని, దుర్భర శిక్షను చవిచూస్తారు. (124)
దేవుడు ఎవరికి సన్మార్గం చూపదలచుకుంటాడో అతని హృదయ కవాటాలను ఇస్లాం కోసం తెరచి ఉంచుతాడు. అలాగే ఎవరిని అపమార్గం పట్టించ దలచుకుంటాడో అతని హృదయ కవాటాలు మూసేసి, అతడ్ని సంకుచిత మనస్కుడిగా చేస్తాడు. దాంతో అతను (ఇస్లాం ప్రస్తావన వస్తే చాలు) తన ప్రాణం అనంత వాయువుల్లో కలసిపోయి ఆకాశానికి ఎగబ్రాకి పోతున్నదా అన్నట్లు తల్లడిల్లిపోతాడు. ఈవిధంగా దేవుడు సత్యాన్ని విశ్వసించనివారి మీద నైచ్యం, నికృష్టతలను రుద్దుతాడు. (125)
ఇదే నీప్రభువు మార్గం, (ఏకైక)రుజుమార్గం. మేము యోచించేవారికి మాసూక్తుల్ని విడమరచి తెలియజేశాం. అలాంటివారికి వారిప్రభువు వద్ద ప్రశాంత నిలయం ఉంది. వారి సదాచారవైఖరి కారణంగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. (126-127)
దేవుడు వారందరినీ చుట్టుముట్టి సమీకరించే రోజు జిన్నులను ఉద్దేశించి “జిన్ను లారా! మీరు మానవజాతి నుండి ఎన్నోలాభాలు పొందారు, (కదూ?)” అని అడుగు తాడు. దానికి వారి మానవమిత్రులు “ప్రభూ! మాలో ప్రతిఒక్కడూ ఇతరుల్ని బాగా వాడుకున్నాడు. చివరికి మేము మాకోసం నీవు నిర్ణయించిన సమయానికి చేరుకున్నాం” అంటారు. అప్పుడు దేవుడు “అయితే మీనివాసం ఇక నరకమే. అందులోనే మీరు శాశ్వ తంగా పడివుంటారు” అంటాడు. అయితే దేవుడు కాపాడ దలచినవారు మాత్రం దాని నుండి తప్పించుకుంటారు. నీప్రభువు ఎంతో వివేకవంతుడు, సర్వజ్ఞాని. దుర్మార్గులు (ప్రపంచంలో ఉండగా పరస్పరం కలసి) చేసిన దుష్కర్మల ఫలితంగా ఈవిధంగా మేము వారిని (నరకంలో) ఒకరికొకరు స్నేహితులుగా చేస్తాము. (128-129)
(దేవుడిలా ప్రశ్నిస్తాడు:) “జిన్నులారా! మానవులారా!! మీ దగ్గరికి మీలో నుండే దైవ ప్రవక్తలు రాలేదా? వారు నాసూక్తులు విన్పిస్తూ ఈదినం గురించి మిమ్మల్ని హెచ్చరించ లేదా?” దానికి వారు “ఔను (ప్రభూ! కాని మేమే పెడచెవిన పెట్టాం). మాకు వ్యతిరేకం గా మేమే సాక్ష్యమిస్తున్నాం” అంటారు. ఈనాడు ఐహిక జీవితం వారిని మోసగించింది. కాని తాము తిరస్కారవైఖరి అవలంబించామని రేపటిరోజు వారే తమకు వ్యతిరేకంగా (ఇలా) సాక్ష్యం చెబుతారు. ప్రజలు సత్యం ఏమిటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి జనావాసాలను అన్యాయంగా తుడిచిపెట్టేవాడు కాదు. ఈవిషయం తెలియడానికే (వారినుండి ఈవిధంగా సాక్ష్యం తీసుకోబడుతుంది). (130-131)
ప్రతి వ్యక్తి కర్మలను బట్టే అతని హోదా, అంతస్తులుంటాయి. నీ ప్రభువు మానవులు చేస్తున్న కర్మల్ని ఓకంట గమనిస్తూనే ఉన్నాడు. నీప్రభువు నిరపేక్షాపరుడు, కరుణామయుడు. ఆయన గతంలో వేరే జాతుల్ని తొలగించి వారి స్థానంలో మిమ్మల్ని ఎలా వారసులుగా చేశాడో ఇప్పుడూ ఆయన తలచుకుంటే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో ఇతరుల్ని తీసుకురాగలడు. మీకు వాగ్దానం చేయబడుతున్నది (ప్రళయం) తప్పకుండా వస్తుంది. దాన్ని మీరు ఏవిధంగానూ అడ్డుకోలేరు. (132-134)
ముహమ్మద్‌! ఇలా చెప్పు: “ప్రజలారా! మీరు మీస్థానంలో ఉండి పనిచేయండి. నేను నా స్థానంలో ఉండి పనిచేస్తాను. పర్యవసానం ఎవరి పక్షంలో బాగుంటుందో త్వరలోనే మీకు తెలుస్తుంది. దుర్మార్గులు ఎన్నటికీ సఫలికృతులు కాలేరు.” (135)
వారు దేవుడు సృష్టించిన పొలాలు, పశువుల నుండే ఆయన కోసం కొంత భాగం కేటాయించి ‘అది దేవుని భాగమని, ఇది తమ దేవతల భాగమని’ అంటారు. అయితే వారు తమ దేవతల కోసం నిర్ణయించిన భాగం దేవుని దగ్గరకు చేరుకోదుగాని, దేవుని కోసం నిర్ణయించిన భాగం మాత్రం వారి (కల్పిత)దైవాలకు చేరుతుందా! వారు ఎలాంటి దుష్ట నిర్ణయాలకు పాల్పడుతున్నారు!! అదేవిధంగా వారి మిథ్యాదైవాలు వారిని వినాశపు ఊబిలోకి నెట్టివేసి వారి మతాన్ని వారికి అనుమానాస్పదమైనదిగా చేయడానికి శిశు హత్యను సైతం పుణ్యకార్యంగా చేసి చూపించాయి. దేవుడు తలచుకుంటే వారలా చేసేవారు కాదు. కనుక వారిని వారి మానాన వదిలెయ్యి. వారి అసత్యాలు, అభూత కల్పనల్లోనే వారిని పడిఉండనీ. (136-137)
(వారింకా ఎన్నెన్ని దురాచారాలు సృష్టించుకున్నారో చూడు:) “ఈ పశువులు, ఈ పంటలు నిషేధించబడ్డాయి. మేము ఎవరికి ఇవ్వగోరుతామో వారు మాత్రమే వీటిని తినవచ్చు” అంటారు వారు. ఈ ఆంక్షలు వారు స్వయంగా సృష్టించుకున్నవే. అలాగే కొన్ని జంతువుల మీద స్వారీ చేయకూడదని, వాటిచేత సామగ్రి మోయించకూడదని ఆంక్షలు విధించుకున్నారు. మరికొన్ని జంతువుల్ని కోసేటప్పుడు దేవుని పేరే స్మరించరు. ఇవన్నీ వారు దేవుని మీద వేసిన అభాండాలు మాత్రమే. ఈ అభాండాలు, అభూత కల్పనలకు త్వరలోనే దేవుడు వారికి వాటి పర్యవసానం చవిచూపిస్తాడు. (138)
వారింకా ఇలాఅంటారు: “ఈపశువుల గర్భాలలో ఉన్నవి మా పురుషులకు ప్రత్యే కించబడ్డాయి, మా స్త్రీలకు నిషేధించబడ్డాయి. అయితే అవి మృత్యువాత పడిన వయితే వాటిని ఉభయులూ తినవచ్చు.”ఈ అభూతకల్పనలకు దేవుడు వారిని తప్ప కుండా శిక్షిస్తాడు. ఆయన ఎంతో వివేకవంతుడు, సమస్తం ఎరిగినవాడు. (139)
అజ్ఞానంతో తమ సంతానాన్ని హతమార్చినవారు, దేవుడు ప్రసాదించిన ఆహార వస్తువుల్ని దేవుని మీద అబద్ధాలుమోపి నిషేధించుకున్నవారు ఘోరంగా నష్టపోతారు. వారు పూర్తిగా మార్గభ్రష్టులైపోయారు. వారిక ఎన్నటికీ దారికి రారు. (140)
(మీకోసం) పందిళ్ళ మీద ప్రాకే, ప్రాకని చెట్లతో సహా రకరకాల తోటలు, తోపు లను సృష్టించినవాడు ఆ దేవుడే. వివిధరకాల ఆహారపదార్థాలు ఉత్పత్తి చేసే పొలాలు, ఖర్జూరపు చెట్లను కూడా ఆయనే సృష్టించాడు ఆయనే ఆలివ్‌, దానిమ్మ వృక్షాలను సృజి స్తున్నాడు. వాటి పండ్లు చూడటానికి ఆకారంలో దాదాపు ఒకేలా ఉన్నా రుచిలో తేడా ఉంటుంది. అవి పంటకు వచ్చినప్పుడు వాటి పండ్లు హాయిగా తినండి. దాంతోపాటు పంట కోతకు వచ్చినప్పుడు అందులో నుంచి దేవుని హక్కు (పేదల ఆర్థికహక్కు) కూడా నెరవేర్చండి. దుబారా చేయకండి. దుబారా చేసేవారిని దేవుడు ప్రేమించడు. (141)
మీరు స్వారీచేయడానికి, సామగ్రి రవాణాచేయడానికి ఉపయోగించే జంతువుల్ని, తినడానికి, (చర్మం) పరచుకోవడానికి ఉపయోగపడే పశువుల్ని కూడా ఆయనే సృష్టిం చాడు. కనుక వాటిలో దేవుడు ధర్మసమ్మతం చేసిన పశువుల్ని నిరభ్యంతరంగా తినండి. అయితే షైతాన్‌ అడుగుజాడల్లో నడవకండి. షైతాన్‌ మీకు బహిరంగ శత్రువు. (142)
ఇవి పెంటి, పోతూ కలసి మొత్తం ఎనిమిది రకాల పశువులు; రెండు గొర్రెజాతికి, రెండు మేకజాతికి చెందినవి. వారిని అడుగు: “దేవుడు వాటిలో పోతుజాతిని నిషేధిం చాడా? లేక పెంటిజాతినా? లేక గొర్రె, మేకల గర్భాలలో ఉన్న పిల్లలను నిషేధించాడా? మీరు సత్యవంతులైతే సరైన ఆధారాలతో నాకు సమాధానం ఇవ్వండి.” (143)
అలాగే రెండు ఒంటెజాతికి చెందినవి, రెండు ఆవుజాతికి చెందినవి ఉన్నాయి. వారిని అడుగు:“దేవుడు వాటిలో పోతుజాతిని నిషేధించాడా లేక పెంటిజాతినా? లేక ఒంటె, ఆవుల గర్భాలలో ఉన్న పిల్లలనా? వాటిని నిషేధించినట్లు దేవుడు మీకేమైనా ఆజ్ఞ జారీచేశాడా? అప్పుడు మీరు ఉన్నారా? సరైన జ్ఞానం లేకుండా ప్రజలను పెడదారి పట్టించడానికి ఇలా దేవునిపై అబద్ధాలు మోపేవాడి కంటే పరమ దుర్మార్గుడు మరెవరు ఉంటారు?” అలాంటి దుర్మార్గులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (144)
ప్రవక్తా! వారిని అడుగు: “చచ్చిన జంతువు, స్రవించిన రక్తం, అపవిత్రమైన పంది మాంసం, లేదా పాపభూయిష్టమైన జంతువు, అంటే దైవేతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప మరేదీ తినడం నిషేధించినట్లు నావద్దకు పంపబడిన దివ్యావిష్కృతిలో లేదు. కాకపోతే గత్యంతరంలేని పరిస్థితిలో ఈ నిషేధితాలు తినవచ్చు. అయితే అలా తినేవ్యక్తి కూడా అవిధేయతకు పాల్పడకుండా మితిమీరే ఉద్దేశ్యం లేకుండా మసలు కోవాలి. నిస్సందేహంగా నీ ప్రభువు గొప్ప క్షమాశీలి, అపార దయామయుడు. (145)
యూదులైనవారికి మేము గోళ్ళుగల జంతువుల్ని నిషేధించాం. ఆవు, మేకల కొవ్వు కూడా నిషేధించాం- వాటి వీపు, పేగులు, ఎముకలకు అంటివుండే కొవ్వు తప్ప. వీటిని వారి తిరస్కారం, తలబిరుసుతనాలకు శిక్షగా నిషేధించాం. మేము చెబుతున్నది నిజం. వారు నిన్ను నిరాకరిస్తే నీప్రభువు కరుణామయుడు, దాంతోపాటు ఆయన శిక్ష నుండి నేరస్థుల్ని ఎవరూ తప్పించలేరని కూడా వారికి చెప్పు. (146-147)
బహుదైవారాధకులు “దేవుడు తలచివుంటే మేముగాని, మా తాతముత్తాతలుగాని బహుదైవారాధన చేసేవారము కాము; ఏ వస్తువునీ నిషేధించుకునే వారమూ కాము” అని అంటారు. వారికి పూర్వం కూడా బహుదైవారాధకులు ఇలాంటి మాటలే పలికి సత్యాన్ని నిరాకరించారు. చివరికి మాశిక్ష చవిచూశారు. వారిని అడుగు: “దీనికి మీదగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఉంటే మాకు చూపండి. ఇవన్నీ కేవలం మీ అనుమానాలు, అభూతకల్పనలే. మీరు ఊహాగానాలు మాత్రమే చేస్తారు.” (148)
వారికి చెప్పు: “సరైన బలమైన సాక్ష్యాధారం దేవుని దగ్గరే ఉంది. ఆయన తలచు కుంటే మీకందరికీ సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించేవాడు.” దేవుడే వాటిని నిషేధిం చాడని అంటే దానికి సాక్ష్యం తీసుకురండని చెప్పు. ఆ విధంగా వారొకవేళ సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితోపాటు సాక్ష్యం ఇవ్వకూడదు. వారి కోరికల్ని నీవు ఎన్నటికీ అనుస రించకు. వారు మా సూక్తులు తిరస్కరించారు. పరలోకాన్ని విశ్వసించ లేదు. పైగా నీ ప్రభువుకు ఇతరులను సాటి కల్పిస్తున్నారు. (149-150)
“మీప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెలుపనా” అని వారికిలా చెప్పు:

  • ఆయనకు ఎవరినీ సాటి కల్పించకూడదు.
  • తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి.
  • దారిద్య్రభయంతో మీ సంతానాన్ని (చేజేతులా) హతమార్చుకోకండి. మేము మీకూ ఆహారమిస్తున్నాము, వారికీ ఆహారమిస్తున్నాము.
  • నీతిబాహ్యమైన పనుల దరిదాపులక్కూడా వెళ్ళకండి- రహస్యంగానైనా, బహిరంగంగానైనా సరే.
  • న్యాయప్రాతిపదికపై తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ చంపకండి. మీరు అర్థంచేసుకొని మసలుకుంటారని దేవుడు మీకీ విషయాలు బోధిస్తున్నాడు.
  • అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకోనంతవరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి పోకండి.
  • తూనికల్లో, కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. ప్రతి వ్యక్తిపై మేము అతను మోయగలిగినంత బాధ్యతాభారమే మోపుతాము.
  • వ్యవహారం మీ బంధువులకు సంబంధించినదైనా సరే న్యాయంగా మాట్లాడండి.
  • దేవుని విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. మీరు విషయాన్ని గుర్తుంచుకుంటారని దేవుడు మీకిలా హితోపదేశం చేస్తున్నాడు.
  • ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, మీరు ఈ మార్గానే నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని నచ్చజెప్తున్నాడు.

మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసలుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. (151-153)
సద్వర్తనులకు మా వరాలు ప్రసాదించడానికి మేము మూసాకు (తౌరాత్‌) గ్రంథం ఇచ్చాము. అందులో ప్రతి విషయానికీ సంబంధించిన వివరాలు ఉన్నాయి. అది పూర్తిగా మార్గకదర్శక గ్రంథం, కారుణ్యప్రదాయిని. ప్రజలు తమ ప్రభువుని కలుసుకునే విషయం విశ్వసిస్తారన్న ఉద్దేశ్యంతో దాన్ని అవతరింపజేశాము. (154)
అలాగే మేమీ గ్రంథాన్ని కూడా అవతరింపజేశాము. ఇది ఎంతో శుభదాయకమైన గ్రంథం. కనుక మీరు దీన్ని అనుసరిస్తూ భయభక్తుల వైఖరి అవలంబించండి; మీరు కరుణించబడతారు. ఇక మీరు “మాకు పూర్వం రెండు వర్గాలకు (యూదులకు, క్రైస్తవులకు) గ్రంథాలు ఇవ్వబడ్డాయిగాని, వారు ఏమి చదివేవారో మాకేమీ తెలియదు” అని సాకులు చెప్పలేరు. అలాగే “మాపై గ్రంథం అవతరించివుంటే మేము వారికన్నా ఎక్కువ సన్మార్గగాములుగా ఉండేవారము” అని కూడా సాకు చెప్పలేరు.
మీ ప్రభువు నుండి ఇప్పుడు మీ దగ్గరకు తిరుగులేని ప్రమాణం (దివ్య ఖుర్‌ఆన్‌) వచ్చింది. ఇది గొప్ప మార్గదర్శక గ్రంథం. మీపాలిట దైవకారుణ్యం. (ఇలాంటి) దైవ వాణిని తిరస్కరించి తలబిరుసుతో ముఖం తిప్పుకునేవాడి కంటే పరమదుర్మార్గుడు మరెవరుంటాడు? మా సూక్తులు నమ్మకుండా ముఖం చాటేవారికి మేము అతి కఠినశిక్ష విధిస్తాం. (155-157)
ఇక వారు దేని కోసం ఎదురుచూస్తున్నారు? వారి ముందు దైవదూతలు ప్రత్యక్షం కావాలని లేదా నీ ప్రభువు దిగిరావాలని చూస్తున్నారా? లేక నీ ప్రభువు సూచనలు కొన్ని బహిర్గతమయ్యే సమయం కోసం నిరీక్షిస్తున్నారా? నీప్రభువు సూచనలు బహిర్గతమయ్యే రోజు, సత్యాన్న్ని విశ్వసించనివాడు దాన్నివిశ్వసించినా ఆ విశ్వాసంవల్ల అతనికి ఎలాంటి లాభంఉండదు. సత్యాన్ని విశ్వసించి ఆతర్వాత ఎలాంటి సత్కార్యం చేయనివాడికి సైతం అతని విశ్వాసం ఆరోజు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ముహమ్మద్‌ (స)! “సరే అలాగే ఎదురుచూడండి, మేమూ ఎదురుచూస్తాం” అని వారికి చెప్పెయ్యి. (158)
తమ ధర్మాన్ని చీలికలు పేలికలుగా చేసుకొని విభిన్న వర్గాలుగా విడిపోయిన వారితో నీకెలాంటి సంబంధం లేదు. వారి వ్యవహారం దేవుడే చూసుకుంటాడు. వారు చేసిందేమిటో ఆయనే వారికి తెలియజేస్తాడు. ఒక సత్కార్యం చేసిన వ్యక్తికి దేవుని దగ్గర పదిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఒక దుష్కార్యం చేసిన వ్యక్తికి మాత్రం ఆ ఒక్క పాప కార్యంఫలమే లభిస్తుంది. అక్కడ ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (159-160)
ప్రవక్తా! చెప్పు: “నాప్రభువు నాకు రుజుమార్గం చూపించాడు- ఎలాంటి వంకలు, వ్యత్యాసాలులేని సరైన జీవనధర్మం. బహుదైవారాధనతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తి ఏకాగ్రతతో ఇబ్రాహీం అవలంబించిన ధర్మం ఇది.” వారికి స్పష్టంగా ఇలా చెప్పు: “నా ప్రార్థన-ఆరాధనలు, నా జీవన్మరణాలు సమస్తం సర్వలోక ప్రభువయిన అల్లాహ్‌కే సమర్పితం. ఆయనకెవరూ భాగస్వాములు లేరు. దీన్ని గురించే నాకు ఆజ్ఞ లభించింది. అందుకే నేను అందరికన్నా ముందు ఆయనకు విధేయుణ్ణయి పోయాను.” (161-163)
చెప్పు: “దేవుడే సకల సృష్టిరాసులకు ప్రభువు, పోషకుడు. అలాంటి దేవుడ్ని వదలి నేను వేరే ప్రభువుని అన్వేషించాలా?” ప్రతి మనిషీ తన కర్మలకు తానే బాధ్యుడు. ఒకరి (దుష్కర్మల) బరువు మరొకరు మోయలేరు. మీరంతా మీ నిజప్రభువు సన్నిధికే చేరుకోవలసి ఉంది. అప్పుడాయన మీ మధ్య ఏర్పడిన విభేదాలలోని నిజానిజాలేమిటో మీకు తెలియజేస్తాడు. (164)
ఆయనే మిమ్మల్ని ధరణిపై దైవప్రతినిధులు (ఖలీఫాలు)గా నియమించాడు. మీకు ప్రసాదించిన దాని విషయమయి మిమ్మల్ని పరీక్షించడానికి ఆయన మీలో కొందరికి కొందరి కన్నా ఎక్కువ హోదా, అంతస్తులు ప్రసాదించాడు. నీ ప్రభువు తప్పకుండా (నేరస్థుల్ని) కఠినంగా శిక్షిస్తాడు. దాంతోపాటు ఆయన (సజ్జనులపట్ల) గొప్ప క్షమాశీలి, అపార దయామయుడు కూడా. (165)