Jump to content

మహాప్రస్థానం/దేశ చరిత్రలు

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

ఏ దేశచరిత్ర చూచినా

ఏమున్నది గర్వకారణం

నరజాతి చరిత్ర సమస్తం

పరపీడన పరాయణత్వం

నరజాతి చరిత్ర సమస్తం

పరస్పరాహరణోద్యోగం:

రణరక్త ప్రవాహసిక్తం

బీభత్సరస ప్రధానం.

పిశాచగణ సమవాకారం:

నరజాతి చరిత్ర సమస్తం

దరిద్రులను కాల్చుకుతినడం

బలవంతులు దుర్బల జాతిని

బానిసలను కావించారు:

నరహంతలు ధరాధిపతులై

చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి

రణరంగం కానిచోటు భూ

స్థలమంతా వెదికిన దొరకదు

గతమంతా తడిసె రక్తమున,

కాకుంటే కన్నీళ్ళతో

చల్లారిన సంసారాలూ

మరణించిన జన సందోహం

అసహాయుల హహాకారం

చరిత్రలో నిరూపించినవి

జెంఘిజ్‌ఖాన్‌, తామర్లేనూ,

నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,

సికిందరో ఎవడైతేనేం?

ఒక్కొక్కడూ మహాహాంతకుడు

వైకింగులు, శ్వేత హుణులూ

సిధియన్లు, పారశీకులూ,

పిండారులు, థగ్గులు కట్టిరి

కాలానికి కత్తుల వంతెన

అజ్ఞానపు టంధయుగంలో

ఆకలిలో, ఆవేశంలో-

తెలియని ఏ తీవ్రశక్తులో

నడిపిస్తే నడిచి మనుష్యులు

అంతా తమ ప్రయోజకత్వం

తామే భువి కధినాధులమని,

స్థాపించిన సామ్యాజ్యాలూ,

నిర్మించిన కృత్రిమచట్టాల్‌

ఇతరేతర శక్తులు లేస్తే

పడిపోయెను పేక మేడలై

పరస్పరం సంఘర్షించిన

శక్తులలో చరిత్ర పుట్టెను.

చిరకాలం జరిగిన మోసం,

బలవంతుల దౌర్జన్యాలూ,

ధనవంతుల పన్నాగాలూ

ఇంకానా! ఇకపై చెల్లవు

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,

ఒక జాతిని వేరొక జాతీ,

పీడించే సాంఘిక ధర్మం

ఇంకానా ? ఇకపై సాగదే.

చీనాలో రిక్షావాల,

చెక్‌ దేశపు గని పనిమనిషీ,

ఐర్లాండున ఓడ కళాసీ,

అణగారిన ఆర్తులందరూ-

హటెన్‌టాట్‌, జాలూ, నీగ్రో

ఖండాంతర నానా జాతుల

చారిత్రక యథార్థతత్వం

చాటిస్తారొక గొంతుకతో

ఏ యుద్ధం ఎందుకు జరిగినొ?

ఏ రాజ్యం ఎన్నాళ్లుందో?

తారాఖులు, దస్తావేజులు

ఇవి కావోయ్‌ చరిత్రకర్థం

ఈ రాణీ ప్రేమపురాణం,

ఆ ముట్టడికైన ఖర్చులూ,

మతలబులూ, కైఫీయతులూ

ఇవి కవోయ్‌ చరిత్రసారం

ఇతిహాసపు చీకటి కోణం

అట్టడుగున పడి కాన్పించని

కథలన్నీ కావాలిప్పడు!

దాచేస్తే దాగని సత్యం

నైలునదీ నాగరికతలో

సామాన్యుని జీవనమెట్టిది?

తాజమహల్‌ నిర్మాణానికి

రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో

సామాన్యుల సాహసమెట్టిది?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌,

అది మోసిన బోయీ లెవ్వరు?

తక్షశిలా, పాటలీ పుత్రం,

హారప్పా, మొహంజొదారో,

క్రో-మాన్యాన్‌ గుహముఖాల్లో

చారిత్రక విభాత సంధ్యల

మానవకథ వికాసమెట్టిది?

ఏ దేశం ఏ కాలంలో

సాధించిన దే పరమార్థం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం?

ఏ శాస్త్రం?ఏ గాంధర్వం?

ఏ వెల్గుల కీ ప్రస్థానం?

ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?