మహాప్రస్థానం/ఒకక్షణంలో...
Appearance
(ఒకక్షణంలో... నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఒక క్షణంలో
మనస్సులో ఏదో స్మృతి
తటిన్మణి
మణీఘృణి
ఏదో మతి వికాసించి
క్షణంలో
అదే పరుగు
మరేడకో...
ఆకులలో చీకటిలో
ఇరుల ఇరుకులలో
చినుకులలో
ఏడనో మరపులలో
మరపుల మడతలలో
కనబడక!
ఒక క్షణంలో
పూర్వపు సఖుని ముఖం
నవ్వులతో
రంగుల పువ్వులతో
కలకలమని కళలు కురిసి
హర్షంతో
ఆశావర్షంతో
కనుల వెనుక తెర ముందర
కనిపించి,
మరుక్షణం
విడివడి మరేడకో-
వడివడి మరేడకో!
ఒక క్షణంలో
సకలజగం
సరభసగమనంతో...
పిమ్మట నిశ్శబ్దం
ఆ క్షణమందే
గుండెల కొండలలో
మ్రోగును మార్మోగును
హుటాహుటి పరుగెత్తే
యుగాల రథానాదం.