మహాప్రస్థానం/ఐ
స్వరూపం
(ఐ నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
భూతాన్ని,
యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!
స్మరిస్తే పద్యమ్,
అరిస్తే వాద్యమ్,
అనల వేదికముందు అస్ర నైవేద్యమ్!
లోకాలు,
భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్య డోల!
నా ఊళ కేదార గౌళ!
గిరులు,
సాగరులు, కంకేళికా మంజరులు,
ఝురులు నా సోదరులు!
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం!