మహాప్రస్థానం/జగన్నాథుని రథచక్రాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్ప దష్టులార !

బ్రదుకు కాలి,

పనికిమాలి,

శని దేవత రథచక్రపు

టిరుసులలో పడి నలిగిన

దీనులార !

హీనులార !

కూడు లేని, గూడు లేని

పక్షులార ! భిక్షులార !

సఖులవలన పరిచ్యుతులు,

జనులవలన తిరస్కృతులు,

సంఘానికి బహిష్కృతులు---

జితాసువులు,

చ్యుతాశయులు,

హృతాశ్రయులు,

హతాశులై

ఏడవకం డేడవకండి !

మీరక్తం, కలగి కలగి

మీ నాడులు కదలి కదలి

మీ ప్రేవులు కనలి కనలి

ఏడవకం డేడవకండి.

ఓ వ్యథానివిష్టులార !

ఓ కథావశిష్టులార !

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్పదష్టులార !

ఏడువకం డేడవకండి !

వస్తున్నా యొస్తున్నాయి...

జగన్నాథ,

జగన్నాథ,

జగన్నాథ రథచక్రాల్‌ !

జన్నాథుని రథచక్రాల్‌ !

రథచక్రాల్‌,

రథచక్రాల్‌,

రథచక్రాల్‌, రథచక్రా

లోస్తున్నా యొస్తున్నాయి !

పతితులార !

భ్రష్టులార !

మొయిల్దారిని

బయల్దేరిని

రథచక్రాల్‌, రథచక్రా

లొస్తున్నా యొస్తున్నాయి !

సింహాచలం కదిలింది,

హిమాలయం కరిగింది,

వింధ్యాచలం పగిలింది---

సింహాచలం,

హిమాచలం,

వింధ్యాచలం, సంధ్యాచలం...

మహానగా లెగురుతున్నాయి !

మహారథం కదులుతున్నాది !

చూర్ణమాన

ఘూర్ణమాన

దీర్ణమాన గిరిశిఖరాల్‌

గిరగిరగిర తిరుగుతున్నాయి !

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్పదష్టులార !

రారండో ! రండో! రండి!

వూరవతల నీరింకిన

చెరువుపక్క, చెట్టునీడ---

గోనెలతో, కుండలతో,

ఎటు చూస్తే అటు చీకటి,

అటు దుఃఖం, పటునిరాశ---

చెరసాలలు, ఉరికొయ్యలు,

కాలువలో ఆత్మహత్య !

దగాపడిన తమ్ములార !

మీ బాధలు నే నెరుగుదును...

వడలో, కడు

జడిలో, పెను

చలిలో తెగనవసి కుములు

మీ బాధలు, మీ గాధలు

అవగాహన నాకవుతాయి

పతితులార !

భ్రష్టులార !

దగాపడిన తమ్ములార !

మీ కోసం కలం పట్టి ,

ఆకసపు దారులంట

అడావుడిగ వెళిపోయే,

అరుచుకుంటు వెళిపోయే

జగన్నాథుని రథచక్రాల్‌,

రథచక్ర ప్రళయఘోష

భూమార్గం పట్టిస్తాను !

భూకంపం పుట్టిస్తాను !

నట ధూర్జటి

నిటాలాక్షి పగిలిందట !

నిటాలాగ్ని రగిలిందట !

నిటాలాగ్ని !

నిటాలాగ్ని !

నిటాలాక్షి పటాలుమని

ప్రపంచాన్ని భయపెట్టింది !

అరెఝా ! ఝా!

ఝుటక్‌, ఫటక్‌ ...

హింసనణచ

ధ్వంసరచన

ధ్వంసరచన

హింసరచన

విషవాయువు, మరఫిరంగి,

టార్పీడో, టోర్నిడో!

అది విలయం,

అదిసమరం,

అటో యిటో తెగిపోతుంది ?

సంరంభం,

సంక్షోభం,

సమ్మర్దన, సంఘర్షణ !

హాలహలం పొగ చూరింది !

కోలాహలం చెలరేగింది !

పతితులార !

భ్రష్టులార !

ఇది సవనం,

ఇది సమరం !

ఈ యెగిరిన ఇనుప డేగ,

ఈ పండిన మంట పంట,

ద్రోహాలను తూలగొట్టి,

గోషాలను తుడిచిపెట్టి,

స్వాతంత్య్రం,

సమభావం,

సౌభ్రాత్రం

సౌహార్దం

పునాదులై ఇళ్లు లేచి,

జనావళికి శుభం పూచి---

శాంతి, శాంతి, శాంతి, శాంతి

జగమంతా జయిస్తుంది,

ఈ స్వప్నం నిజమవుతుంది !

ఈ స్వర్గం ఋజువవుతుంది !

పతితులార !

భ్రష్టులార !

బాధాసర్పదష్టులార !

దగాపడిన తమ్ములార !

ఏడవకం డేడవకండి !

వచ్చేశాయ్‌ , విచ్చేశాయ్‌,

జగన్నాథ,

జగన్నాథ,

జగన్నాథ రథచక్రాల్‌,

జగన్నాథుని రథచక్రాల్‌

రథచక్రాల్‌,

రథచక్రాల్‌,

రథచక్రాల్‌, రథచక్రాల్‌,

రారండో! రండో! రండో!

ఈ లోకం మీదేనండి!

మీ రాజ్యం మీ రేలండి