మహాప్రస్థానం/ఉన్మాది
(ఉన్మాది నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
అలకలన్నీ అట్టకట్టిన,
బొమికలన్నీ ప్రోవుపట్టిన,
కాగితంవలె పలచబారిన
వెర్రివాడా! కుర్రవాడా!
వీధికంతా వెక్కిరింతగ,
వూరికంతా దిష్టిబొమ్మగ,
తూముప్రక్కన ధూళిలోనే
తూలుతున్నావా!
నీవు చూసే వెకిలిచూపూ,
నీవు తీసే కూనిరాగం,
మాకు తెలియని నీ ప్రపంచపు
మహారణ్యపు చిక్కుదారులు!
వెర్రివాడా! కుర్రవాడా!
నిన్ను చూసీ చూడనట్లే
తెలివిమీరిన పెద్దమనుషులు
తొలగిపోతారు!
వెర్రివాడా! కుర్రవాడా!
క్షమిస్తావా! సహిస్తావా!
బుద్ధిమంతులు నీకు చేసిన
దురన్యాయాన్ని!
అట్లు చూడకు, అట్లు పాడకు,
మమ్ము వేళాకోళమాడకు!
వెర్రివాడా! కుర్రవాడా!
వేడుకుంటాము.