మహాప్రస్థానం/గంటలు

వికీసోర్స్ నుండి
(గంటలు నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

పట్టణాలలో, పల్లెటూళ్లలో,

బట్టబయలునా, పర్వతగుహలా,

ఎడారులందూ, సముద్రమందూ,

అడవుల వెంటా, అగడ్తలంటా,

ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ

గంటలు! గంటలు! గంటలు! గంటలు!

గంటలు! గంటలు!

గణగణ గణగణ గణగణ గంటలు!

గణగణ గణగణ

గంటలు! గంటలు!

భయంకరముగా, పరిహాసముగా

ఉద్రేకముతో, ఉల్లాసముతో,

సక్రోధముగా, జాలిజాలిగా,

అనురాగముతో, ఆర్భాటంతో,

ఒకమారిచటా, ఒకమారచటా,

గంటలు! గంటలు!

గంటలు! గంటలు!

సింహములాగూ, సివంగిలాగూ,

ఫిరంగిలాగూ, కురంగిలాగూ,

శంఖములాగూ, సర్పములాగూ,

సృగాలమట్లూ, బిడాలమట్లూ,

పండితులట్లూ, బాలకులట్లూ,

గొణగొణ గణగణ

గణగణ గొణగొణ

గంటలు! గంటలు!

గంటలు! గంటలు!

కర్మాగారము, కళాయతనమూ,

కార్యాలయమూ, కారాగృహముల,

దేవునిగుడిలో, బడిలో, మడిలో,

ప్రాణము మ్రోగే ప్రతిస్థలములో,

నీ హృదయములో, నా హృదయములో

గంటలు! గంటలు!

గంటలు! గంటలు!

ఉత్తరమందూ, దక్షిణమందూ,

ఉదయమునందూ, ప్రదోషమందూ,

వెన్నెలలోనూ, చీకటిలోనూ,

మండుటెండలో, జడిలో, చలిలో,

ఇపుడూ, అపుడూ, ఎపుడూ మోగెడు

గంటలు! గంటలు! గంటలు! గంటలు!

గంటలు! గంటలు! గంటలు! గంటలు!

గణగణ గణగణ గంటలు! గంటలు!

గణగణ గంటలు!

గంటలు! గంటలు!