Jump to content

మహాప్రస్థానం/ప్రతిజ్ఞ

వికీసోర్స్ నుండి
(ప్రతిజ్ఞ నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

పొలాలనన్నీ,

హలాలదున్నీ,

ఇలాతలంలో హేమం పిండగ-

జగానికంతా సౌఖ్యం నిండగ-

విరామమెరుగక పరిశ్రమించే,

బలం ధరిత్రికి బలికావించే,

కర్షక వీరుల కాయం నిండా

కాలువకట్టే ఘర్మజలానికి,

ఘర్మజలానికి

ధర్మజలానికి,

ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌!

నరాల బిగువూ,

కరాల సత్తువ

వరాలవర్షం కురిపించాలని,

ప్రపంచభాగ్యం వర్ధిల్లాలని-

గనిలో, వనిలో, కార్ఖానాలో

పరిక్లమిస్తూ,

పరిప్లవిస్తూ,

ధనిక స్వామికి దాస్యం చేసే,

యంత్రభూతముల కోరలు తోమే,

కార్మిక వీరుల కన్నుల నిండా

కణకణమండే,

గలగల తొణకే

విలాపాగ్నులకు, విషాదాశ్రులకు

ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌!

నిరపరాధులై దురదృష్టంచే

చెరసాలలో చిక్కేవాళ్లూ-

లోహ రాక్షసుల పదఘట్టనచే

కొనప్రాణంతో కనలేవాళ్లూ-

కష్టం చాలక కడుపుమంటలే

తెగించి సమ్మెలు కట్టేవాళ్లూ-

శ్రమ నిష్ఫలమై,

జని నిష్ఠురమై,

నూతిని గోతిని వెదకేవాళ్లూ-

అనేకులింకా అభాగ్యులంతా,

అనాథులంతా,

అశాంతులంతా

దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో

విప్లవశంఖం వినిపిస్తారోయ్‌!

కావున- లోకపుటన్యాయాలూ,

కాల్చే ఆకలి, కూల్చే వేదన,

దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ

పరిష్కరించే, బహిష్కరించే

బాటలు తీస్తూ,

పాటలు వ్రాస్తూ,

నాలో కదలే నవ్యకవిత్వం

కార్మికలోకపు కళ్యాణానికి,

శ్రామిక లోకపు సౌభాగ్యానికి

సమర్పణంగా

సమర్చనంగా-

త్రిలోకాలలో

త్రికాలాలలో,

శ్రమైక జీవన సౌందర్యానికి

సమానమైనది లేనేలేదని

కష్టజీవులకు

కర్మవీరులకు

నిత్యమంగళం నిర్దేశిస్తూ,

స్వస్తివాక్యములు సంధానిస్తూ,

స్వర్ణవాద్యములు సంరావిస్తూ

వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం

పునాదిగా ఇక జనించబోయే

భావివేదముల జీవనాదములు

జగత్తుకంతా చవులిస్తానోయ్‌!

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,

జాలరి పగ్గం,

సాలె లల మగ్గం,

శరీరకష్టం స్ఫురింపజేసే

గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,

సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు-

నా వినుతించే,

నా విరుతించే,

నా వినిపించే నవీన గీతికి,

నా విరచించే నవీన రీతికి,

భావం!

భాగ్యం!

ప్రాణం!

ప్రణవం.