ఆశాదూతలు
Jump to navigation
Jump to search
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
స్వర్గాలు కరిగించి,
స్వప్నాలు పగిలించి,
రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి-
ఒకడు తూరుపు దిక్కునకు!
పాపాలు పండించి,
భావాలు మండించి,
కొలిమి నిప్పులు రువ్వి, విలయలయ నవ్వి-
ఒకడు దక్షిణ దిక్కు!
ప్రాకారములు దాటి,
ఆకాశములు తాకి,
లోకాలు ఘాకాల బాకాలతో నించి,
ఒకడు దీచికి!
సింధూర భస్మాలు,
మందార హారాలు
సాంద్రచందన చర్చ సవరించి
ఒకడు పడమటికి!
మానవకోటి సామ్రాజ్యదూతలు, కళా
యజ్ఞాశ్వముల్ గాలులై, తరగలై, తావులై,
పుప్పొళ్లు, కుంకుమల్, పొగలై సాగిరి!