మహాప్రస్థానం/చేదుపాట
స్వరూపం
(చేదుపాట నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఔను నిజం, ఔను నిజం
ఔను నిజం, నీవన్నది,
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, నిజం!
లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖం జగత్తులో!
బ్రదుకు వృథా, చదువు వృథా,
కవిత వృథా! వృథా, వృథా!
మనమంతా బానిసలం,
గానుగలం, పీనుగలం!
వెనుక దగా, ముందు దగా,
కుడి యెడమల దగా, దగా!
మనదీ ఒక బతుకేనా?
కుక్కల వలె, నక్కల వలె!
మనదీ ఒక బతుకేనా?
సందులలో పందులవలె!
నిజం సుమీ, నిజం సుమీ,
నీవన్నది నిజం సుమీ!
బ్రతుకు ఛాయ, చదువు మాయ,
కవిత కరక్కాయ సుమీ!
లేదు సుఖం, లేదు రసం,
చేదు విషం జీవఫలం!
జీవఫలం చేదువిషం,
చేదు విషం, చేదు విషం!
ఔను నిజం, ఔను సుమా,
ఔను నిజం నీవన్నది!
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, నిజం!