మహాప్రస్థానం/అవతారం
స్వరూపం
(అవతారం నుండి మళ్ళించబడింది)
శ్రీశ్రీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
యముని మహిషపు లోహఘంటలు
మబ్బుచాటున
ఖణేల్మన్నాయి!
నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు
ఉరికిపడ్డాయి!
ఉదయ సూర్యుని సప్తహయములు
నురుగులెత్తే
పరుగు పెట్టేయి!
కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది!
ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ, సవాల్చేసింది!
నందికేశుడు
రంకెవేస్తూ,
గంగడోలును కదిపిగెంతేడు!
ఆదిసూకర
వేదవేద్యుడు
ఘర్ఝరిస్తూ, కోరసాచాడు!
పుడమి తల్లికి
పురుటినొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి!