మహాప్రస్థానం/కవితా! ఓ కవితా!

వికీసోర్స్ నుండి
(కవితా! ఓ కవితా! నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search
శ్రీశ్రీ
మహాప్రస్థానం
1. కొంపెల్ల జనార్ధనరావు కోసం
2. మహాప్రస్థానం (కవిత)
3. జయభేరి
4. ఒకరాత్రి
5. గంటలు
6. ఆకాశదీపం
7. ఋక్కులు
8. అవతారం
9. బాటసారి
10. ఆశాదూతలు
11.
12. శైశవగీతి
13. అవతలిగట్టు
14. సాహసి
15. కళారవి
16. భిక్షువర్షీయసి
17. ఒకక్షణంలో...
18. పరాజితులు
19. ఆః!
20. ఉన్మాది
21. స్విన్ బర్న్ కవికి
22. అద్వైతం
23. వాడు
24. అభ్యుదయం
25. వ్యత్యాసం
26. మిథ్యావాది
27. ప్రతిజ్ఞ
28. చేదుపాట
29. కవితా! ఓ కవితా!
30. దేశ చరిత్రలు
31. నవ కవిత
32. మానవుడా!
33. సంధ్యాసమస్యలు
34. జ్వాలాతోరణం
35. దేనికొరకు
36. కేక
37. నిజంగానే
38. నీడలు
39. గర్జించురష్యా!
40. పేదలు
41. జగన్నాథుని రథచక్రాలు

కవితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో,
నిను నే నొక సుముహూర్తంలో,
అతిసుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రదుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందున నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో,
నీ రూపం కనరానందున
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?

నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా
మస్తిష్కంలో
ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో?
నే నేయే చిత్రవిచిత్ర శ్యమంత
రోచిర్నివహం చూశానో!
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో?
నీకై నే నేరిన వేయే ధ్వనులో,
ఏయే మూలల వెదకిన ప్రోవుల
ప్రోవుల రణన్నినాదాలో!
నడిరే యాకస మావర్తించిన,
మేఘా లావర్షించిన,
ప్రచండ ఝంఝా ప్రభంజనం
గజగజ లాడించిన
నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం!

ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులో?
నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు,
విప్లవం, యుద్ధం,
అన్నీ నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం!

మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే దృశ్యాలా?
వినిపించే భాష్యాలా?
అగ్నిసరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగ నాదం!

ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెదడ నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు!
శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మృతులూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావుబ్రదుకుల సంధ్యాకాలంలో
కన్నులు మూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువనీళులలో జారిపడి
కదలగనైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేలాపన!

కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధనిమీలిత నేత్రాల
భయంకర బాధల పాటల పల్లవి!
ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఘూకం కేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటిచిచ్చుల

హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతాల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
నా విన్నవి కన్నవి విన్నవించగా
మాటలకై వెదుకాడగబోతె--
అవి,
పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి--
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగిడినై, నా యెద నడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా సృష్టించిన గానంలో
ప్రక్షాలితమామక పాపపరంపర
లానందవశంవదహృదయుని జేస్తే-
నీకై మేలుకొనిన
సకలేంద్రియంఉలతో
ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో,
ఊపిరి తీస్తున్నానో,
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి,
తారానివహపు ప్రేమసమాగమంలో
జన్మించిన సంగీతానికి...
నా నాడుల తీగలపై సాగిన
నాదబ్రహ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవేళాజనితం,
నానాగానానూనస్వానావళితం,
బ్రదుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం,
అమోఘ, మగాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మానుభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘృణీ!
రమణీ!
కవితా! ఓ కవితా!

నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న
నా అహంకారానికి
ఆకలి గొల్పించిననాడో!
నా బహిరంతరింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నేనీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడనై,
విహ్వలంగా వర్తించే వేళ
అభయహస్తముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా!
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా!

నేడో, నా ఊహాంచల
సాహసికాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని,
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందకపోయే
నీ చేలాంచలముల విసరుల
కొసగాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హృద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విసృమర
కుసుమ పరాగం!
ఓహో! ఓ రసధుని! మణిఖని! జననీ! ఓ కవితా!
కవితా! కవితా! ఓ కవితా!

ముఖ్యమైన పదాలకు అర్థాలు :[మార్చు]

యువకాశల = యువకులకు యవ్వన దశలో ఉన్నప్పుడు కలిగే ఆశలు
నవపేశల = కొత్త కోయిల; అంటే కొత్తగా కూత మొదలుపెట్టిన కోయిల
సుమగీతావరణం = పూలలాంటి సున్నితమైన గీతాలతో కూడిన ఆవరణం
సుస్యందనం = మంచి రథం
వినువీధులలో = ఆకాశపు వీధులలో
విహరించు = తిరుగు
వెదుకాడే నిమిషాలందున = వెతికే కాలంలో
నిషాలందున = ఒకే కలవరంలో, ఒకే ధ్యాసలో
చటులాలంకార = చటుక్కున మెరిసే అందమైన శబ్దాలంకారపు ధ్వని
మటుమాయ = లేని చూపించుతూ ఉన్నది మాయ చెయ్యడం
గుహలో = గుహలో
కుటిలో = ఇంటిలో
స్రుక్కిన = కృంగి పోయిన, బలహీనమయి

ప్రాబల్యం = ప్రభావం
చిరదీక్ష = చాలా కాలం చేసిన దీక్ష
శిక్ష = శిక్షణ, అభ్యాసం
తపస్సమీక్షణ = తపః + సమీక్షణ = అన్వేషణకోసం చేసిన తపస్సు
నిశ్చల సమాధిలో = ఎలాంటి అవాంతరంలేని సమాధి - ధ్యానంలో
సర్గద్వారం = సింహ ద్వారం, అందరూ వెళ్ళగలిగే ఓ మార్గం
తోరణం = మాలలు, దండలు
వ్రేలిన = వేలాడు
మస్తిష్కం = మెదడు, మనస్సు
ఘోషలు = అరుపులు, ధ్వనులు
చిత్ర విచిత్ర = అందమైన, విచిత్రమైన
శ్యమంత = శమంతకమణి
రోచిర్నివహం = రోచిః+నివహం = కాంతి సమూహం
గీతం = పాట/ కవిత్వం
ఏయే శక్తుల లో = ఏయే శక్తులనుంచి
ప్రాణస్పందన = ప్రాణం ఉందన్న భావన
ప్రోవులు = పోగులు, గుంపు, సమూహం
రణన్నినాదాలు = యుద్దశబ్దాలు
ఆకసమావర్తించిన = ఆకాశాన్ని ఆవరించిన ( మరల మరల రావడం )
మేఘాలావర్షించిన = మేఘాలు లా కురిసిన
ప్రచండ = తీవ్రమైన
ఝంఝా ప్రభంజనం = గాలివాన / తుఫాను
గజగజలాడించు = వణికించు
శంఖారావం = శంఖం పూరించినప్పుడు వచ్చే ధ్వని
ఢంకాధ్వానం = ఢంక వాయిస్తే వచ్చే మోత/ శబ్దం

కారడవులు = నల్లని / దట్టమైన అడవులు
లయాతీతం = నాశనానికి అతీతంగా / లయకు అతీతంగా
విరుతించు = పెద్దగా అరచు
నానాజంతు ధ్వనులు = రకరకాల జంతువుల అరపులు
నక్షత్రాంతర్నిబిడ = నక్షత్ర+అంతర+నిబిడ = నక్షత్రాల మధ్య పూర్తిగా వ్యాపించిన
నిఖిలగానం = నిఖిల (సర్వం) గానం (పాట) = విశ్వగానం
పతనం = పడిపోవడం, నశించి పోవడం
నీ చైతన్యం = నీ ప్రభావంవల్లకలిగేవే
నీ విశ్వరూపం = నీ సంపూర్ణ స్వరూపం
సాక్షాత్కారం = ప్రత్యక్షం కావడం, కనిపించడం

స్మరించు = తలచు
దృశ్యాలు = కనిపించేవి
భాష్యాలు = ఒక విషయానికి సంబంధించిన వ్యాఖ్యానం

రుచిర స్వప్నాలు = అందమైన కలలు
జవరాలు = యవ్వనవతి
మనఃప్రపంచపు = మానసిక ప్రపంచంపు, మనస్సులో
ఆవర్తాలు = సుడులు మళ్ళీ మళ్ళీ తిరిగే నీటి సుడులు
చిత్రనిద్ర = అందమైన నిద్ర;
ప్రాచీన స్మృతులు = పాతకాలపు జ్ఞపకాలు;
శస్త్రకారుడు = వైద్యుడు;
మహేంద్రజాలం = గారడి;
సంధ్యాకాలం = సాయం సమయం;
కన్నులు మూసిన = మరణించిన;
రోగార్తుని = రోగపీడితుడు;
రక్తనాళ సంస్పందన = రక్తనాళాల ప్రతిస్పందన;
వ్యక్తావ్యక్తాలాపన = స్పష్టమైన అస్పష్టమైన మాటలు;
ప్రేలాపన = ఇష్టం వచ్చినట్లుమాట్లాడు;

కడుపుదహించు = కడుపు మంట/ ఆకలి వల్ల కలిగే బాధ;
పడుపుకత్తె = వేశ్య;
రాక్షసరతి = బలాత్కారించడం,
ఇష్టం లేకుండా చేసే రతి;
అర్ధనిమీలిత నేత్రాలు = సగం మూసిన కన్నులు;
ఘాకం కేకా,= గుడ్లగూబ అరుపులు కేకలు;
భేకం = కప్ప; బాకా = అవసరానికి ఎటుపడితే అటు గెంతే కప్పదాటు మనుషులు కాకా పట్టి పొగుడే పొగడ్తలు;
ఆకటి = ఆకలి; చీకటి = రాత్రి/బాధ;
చిచ్చు = నిప్పు జ్వాల

హాహాకారం = భయంతో కూడిన కేకలు;
ఆర్తారావం = ఆర్తి/దుఃఖం తో కూడిన అరుపులు;
నక్షత్రాల మాటలు = నక్షత్రాల్లా కాంతివంతమైన మాటలు;
జలపాతాల పాటలు = జలపాతాల హోరులా పాడే పాటలు;
సముద్రతరంగాల మ్రోతలు = సముద్రతరంగాల్లా హోరెత్తించే శబ్దాలు;
నా విన్నవి కన్నవి = నేను విన్నవాటిని, చూసిన వాటిని;
విన్నవించగా = చెప్పడానికి/ రాయడానికి;
సర్పపరిష్వంగం = పాము కౌగిలిలో చిక్కుకున్న;
పుంఖానుపుంఖంగా = ఒకటి తరువాత ఒకటికాకుండా చాలా ఎక్కువగా గుంగులుగా.; చెలరేగి = విజృంభించిన;
కలగా పులగపు = కలగలిసిపోయిన;
విలయావర్తపు = విలయకాలపు శబ్దం;
బలవత్ ఝరవత్ = శక్తిమంతమైన; = బలంగా దూకే ప్రవాహంలా
పరివర్తన = మార్పు/ తిరుగు;
చంక్రమణం = తిరుగుట/ మెల్లగా వెళ్ళడం;
నా సృష్టించిన గానం = నేను రాసిన పాట/కవిత్వం;
ప్రక్షాళిత = పరిశుభ్రంచేసిన;
మామక = నాది అనే భావం;
పాపపరంపర = పాపాల వరుస
వశంవద = వశమైన వదనం ముఖము;
సకలేంద్రియములు = సకల + ఇంద్రియాలు, అన్ని ఇంద్రియములతో (కన్ను,ముక్కు,చెవి,నాలుక,మనస్సు);
నిర్వికల్ప సమాధి = రెండు మనస్సులుగా లెని ధ్యాన సమాధిలో;
నిర్వాణం = ముక్తి మరణం;
మంత్రించు = లీనమయ్యేట్టు చేయు;
సమ్ముగ్ధం గావించు = చాలా గొప్పగా మోహపరవశుణ్ణి చేసే;
గాంధర్వం = గంధర్వ గానంలో;
తారానివపు = నక్షత్ర సమూహం;
ప్రేమ సమాగమం = ప్రేమతో కూడిన కలయిక;
నాడుల తీగలు = నాడులనే తీగలు;
నాదబ్రహ్మపు = నాద సృష్టికర్త;
పరి చుంబన లో = చాలా గాఢంగా చుంబించే ముద్దు పెట్టడంలో
ప్రాణావసానవేళాజనితం = ప్రాణం పోతుందేమో అన్న ఓ సమయంలో పుట్టిన,; నానాగానానూన = వివిధరకాలయిన గాన ధ్వనుల;
స్వానావళితం = స్వనం = శబ్దాల సమ్మేళనం;
ప్రచండ భేరుండ = తీవ్రమైన తీక్షణమయిన భేరుండ పక్షి;
గరుత్పరిరంభం = గరుత్మంతుడి కౌగిలిలో;
సుఖదుఃఖాధిక = సుఖానికి దుఃఖానికి అతీతమైనది;
ద్వంద్వాతీతం = రెంటికి అంటే పరస్పర విరుద్దతత్త్వాలకు అతీతమైనది,;
అమోఘ = అద్భుతంగా/బ్రహ్మాండంగా సఫలమయినది;
అగాథ = లోతైన; అచింత్య = అలోచించనవసరంలేని;
అమేయం = అంతులేని; ఏకాంతం = ఒంటరి;
ఏకైకం = ఏకమే ఒక్కటైపోయిన
క్షణికమై శాశ్వతమైన = క్షణకాలం కనిపించి శాశ్వతంగా నిలిచిపోయిన; దివ్యానుభవం = గొప్పదైన అనుభవం; బ్రహ్మానుభవం = మహా అనుభవం; కవనఘృణీ = కవితాకిరణం వెలుగు;
రమణీ = అందమైన;

అహంకారం = నేను మాత్రమే గొప్ప వాడిని అనే భావన;
నా జనని గర్భంలో = నా కన్న తల్లి కడుపులో;
ఆకారంలేకుండా = రూపురేఖలు దిద్దుకోకుండా వున్న;
నా అహంకారానికి = నేనూ నాది అనే భావానికి, నా వ్యక్తిత్వనికి;
ఆకలి గొల్పించిన నాడో = తపన కలిగించిన నాడో;
బహిరంతరింద్రియాలు = బాహిరమయిన, అంతరమున ఇంద్రియాలు;
ప్రసరించు = వ్యాపించు; ప్రపంచ పరిణాహం = విశాలమయిన ప్రపంచం; పరివ్రాజకుడు = సర్వాన్నిత్యజించిన సన్యాసి;
విహ్వలము = ఆందోళన ఉద్వేగం;
వర్తించు = తిరుగుతూ ప్రవర్తించు;
అభయ హస్త ముద్ర = భయంలేదని చెప్పి సహాయంగా నిలబడడం.;
దరిసిన = చేరిన; పునీతుడు = పవిత్రమైన మనస్సుకలవాడు;
లలిత = అందమైన; అనుపమిత = సాటిలేని;
అపరిమిత = అపరిమితంగా హద్దులు లేకుండా

ఊహాంచల = ఊహా+అంచల ఎల్లలు లేని ఊహల్లో
సాహసి కాంసయము= సాహసంతో మోగించె గంటల శబ్దంతో కప్పిన
నా నిట్టూర్పులు = నెను అలసిపోయాక నా నుంచి వెలువడే
నిట్టూర్పులు. = పెద్దగా ఊపిరి వదలే శబ్దాలు వినిపిస్తాయా..
విరచించు = విశేషంగా రచిస్తానని, ప్రతిఫలించి = ప్రతిబింబించి;
ఘూర్ణిల్లగ = ప్రతిధ్వనించగా;
నా ఆకాశాలను = అత్యున్నమైన నా అభిప్రాయాలను;
లోకానికి చేరువగా = ప్రజలకు దగ్గరగా; రవ్వలజడి = వజ్రాల వానగా;
చేలాంచలం = వస్త్రాల అంచులు కొన;
విసరుల = వీచు; కొసగాలులు = చివరిగాలులు;
నుడి = మాట వ్రాసే తీరు;
హృద్యంగా = హృదయానికి ఇష్టంగా;
విసరిన = వ్యాపించిన; రస విసృమర = రసం ప్రసరింపం చేసె స్వభావం కల; కుసుమపరాగం = పుప్పొడి;
రసధుని = రస నదీ; (నదీ ప్రవాహం)
మణిఖని = మణులగని;
జననీ = తల్లీ;