సాక్షి మూడవ సంపుటం
శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారిచే వ్యావహారికభాషలో వివరణలతో, శ్రీమధునాపంతుల సత్యన్నారాయణ శాస్త్రిగారి పీఠికతో
మూడవ సంపుటం
కవిశేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు
అభినందన పబ్లిషర్స్
28-10-1 కారల్ మార్క్స్ రోడ్డు విజయవాడ-520002 |
SAAKSHI PART-III |
సాక్షి మూడవ సంపుటం |
మా మాట
మంచి రచనలు అందించాలనీ,
మంచి అభిరుచి పెంపొందించాలనీ,
పాఠకులు కలకాలం తమ సొంత గ్రంథాలయంలో మంచి పుస్తకాలు పెట్టుకొని పదే పదే వాటిని చదువుకోవడానికి దోహదం చెయ్యాలనీ - మా చిరకాల వాంచితం.
ఈ ప్రయత్నంలో మా సోదర సంస్థ ' న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్ ' యిప్పటివరకు చాలా విజ్ఞాన దాయకమైన పుస్తకాలను, ఉత్తమ సాహిత్య గ్రంథాలను ప్రచురించి, చేతనైనంత కృషి చేస్తూందని మీకు తెలుసు.
ఇప్పుడు మా నూతన సంస్థ ' అభినందన పబ్లిషర్స్ ' ఒక సాహసం చేస్తోంది. అయితే, ఈ సాహసం ఆనందకరమైనది. ఒకరకంగా గర్వకారణమైనది. అదే, ' కవిశేఖర ' పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన ' సాక్షి ' వ్యాసాలను ప్రచురించి - అభిమాన పాఠకులకు అందించడం.
కొందరు - కథలు వ్రాసి, గొప్ప కథకు లనిపించుకున్న వారున్నారు. కొందరు నవలను వ్రాసి గుర్తింపు, గౌరవం పొందిన వారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణకెక్కిన వారున్నారు. కాని - ' వ్యాసం ' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న మహా రచయిత బహుశా పానుగంటి వారొక్కరే. నాటకం వ్రాసి గురజాడవారు గిరీశం పాత్రను చిరంజీవినిచేస్తే, పానుగంటివారు వ్యాసాలను ఉపన్యాసాలుగా, ఉపన్యాసాలను వ్యాసాలుగా జలకాలాడించి - జంఘాలశాస్త్రి పాత్రను చిరంజీవిని చేశారు. ఈ వ్యాసాలలో పానుగంటి వారి శైలి, విషయ విన్యాసం చూస్తుంటే, చురకత్తి కొసను మల్లెదండ వ్రేలాడ దీసి నట్టుంటుంది. 1913లో కొంతకాలం, 1920లో కొంతకాలం ' సాక్షి ' వ్యాసాలను ఆయన రచించారు. ఎందరో అసంఖ్యాక పాఠకుల్ని ఆకర్షించారు. అలరించారు. పానుగంటే సాక్షి, సాక్షే పానుగంటి అనిపించారు.
తొలుత ఈ వ్యాసాలను పిఠాపురం రాజావారు ముద్రించి ప్రచారం చేశారు. ఆ తరువాత మద్రాసులోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారు ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఈ విషయాలు జరిగి దాదాపు నలబై సంవత్సరాలు గడిచాయి. (వావిళ్లవారికి సంబంధించినంతవరకు)
ప్రస్తుతం ఆ ఆరు సంపుటాలు ' సాక్షి ' వ్యాసాలను - అక్షరం పొల్లుపోకుండా మొత్తం - మూడు సంపుటాలుగా పాఠకులకు అందించగలిగే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాం.
1920 లెక్కవేసుకున్నా, ఈ వ్యాసాల రచన జరిగి ఇప్పటికి 70 ఏళ్లు కావస్తోంది. వీటి భాష గ్రాంథికం. విషయాలు ఎంత ఆసక్తి కరమైనవైనా, ఎంత హాస్యరస ప్రధానంగా వున్నా, ఈ నాటి పాఠకులకు ఈ ' సాక్షి ' ని చేరువ చెయ్యాలంటే, వ్యావహారిక భాషలో, ప్రతి వ్యాసం సారాంశం ముందు ' టూకీ ' గా అందిస్తే బాగుంటుందని తోచింది. ఈ మా లక్ష్యం చెప్పగానే సహకరించి, వ్యాసాలన్నిటికి 'క్లుప్త కథనాన్ని' వ్రాసి యిచ్చిన మిత్రులు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు. మా ప్రచురణ సంకల్పం తెలిపిన వెంటనే ఆనందంతో ఆశీర్వదించి పీఠిక వ్రాసి యిచ్చినవారు మహాకవి, కళా ప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, ఇటువంటి ఆదరాభిమానాలతోనే ఈ సంపుటాలకు ముఖపత్ర రచన చేసినవారు ప్రముఖ చిత్రకారులు శ్రీబాపుగారు. ఈ సంపుటాలు అందంగా - అచ్చుతప్పులు లేకుండా - పాఠకులకు అందించాలని ఆశించి, శ్రమించి సహకరించిన వారు పండిత మిత్రులు పి.జగన్నాధరావుగారు. వీరికి మా 'హార్ద' కృతజ్ఞతులు.
ఇన్నాళ్లకు మళ్లీ 'సాక్షి' వ్యాసాలను వెలువరించమంటే, చాలా అందంగా చెయ్యాలని ఆత్యాధునిక ముద్రణ పద్ధతిని అనుసరించాం. ఇది బరువైనదైనా 'పరువైనదని' సాహసించాం. ఈ సంపుటాలను మీ చేతిలో సవినయంగా సగౌరవంగా ఉంచుతున్నాం. ప్రోత్సహించి, ఆశీర్వదించమని విన్నవించుకొంటున్నాం.
"సాక్షి మూడు సంపుటాల వ్యాసాల సాక్షిగా"
"తెలుగు సాహిత్యానికి సాక్షి నామసంవత్సరం"
డైరెక్టర్ ఆఫ్ పబ్లిషింగ్ అభినందన పబ్లిషర్స్ బి.బాబ్జి డైరెక్టర్ |
తెలుగువారి బృహత్సంహిత
'మృదుమధుర నవార్థభాసుర వచనరచనా విశారదులైన' మహాకవి ఆధునిక కాలమున ఎవరు?-అని ఎవరైన ప్రశ్నించినచో నా ప్రత్యుత్తరము - పానుగంటి లక్ష్మీనరసింహారావుగారని.
వచనరచనాధురీణులు మరికొందమంది వుండిన జాతికి ప్రయోజనదాయకమే కాని, నష్టదాయకము కాదు గదా-
కాని తమదైన శైలీవిన్యాస మాధుర్యము కలవారు కావలెనన్నచో-
రావలసిన పేరు లక్ష్మీనరసింహారావుగారిదే. రావలసిన పేరు వచ్చినది. వచ్చినది శాశ్వతమైన యశస్సు తప్ప కొన్ని కేలండర్లకే పరిధి అయినది కానే కాదు.
నిబ్బరమైన పానుగంటి వచనమున కబ్బురపడని గద్య ప్రేమికులుండరు.
అంతగొప్ప వచన మాయనకు వచ్చుట వింతకాదు. తపఃఫలితము. భాషామాధ్యుర్య మధనోద్భూతము. జీవము భావమని వేరుగా చెప్పనవసరము రాదు.
గద్య సాహిత్య రంగమున జరుగవలసిన దానికైనాడు 1922లో పానుగంటి వారెంతగా అభిలషించిరో, ఆశించిరో తెలియుటకు ఆంధ్రసాహిత్య పరిషదేకాదశ వార్షికోత్సవమున వారి అధ్యక్ష వచనమే సాక్షివచనము.
"చిత్రములైన శైలీ భేదములు, మన భాషలో మిగుల నరుదుగా నున్నవని వేరే చెప్పనేల? రైమని పేకచువ్వ పై కెగిరినట్లున్న శైలి భేదమేది? కాకి పై కెగిరి యెగిరి ఱెక్కలు కదలకుండ జందెపు బెట్టుగ సాపుగ వాలుగ దిగునప్పటి లఘుపతన చమత్కృతి కనబఱచు శైలి పద్ధతి యేది? తాళము వాయించునప్పటి తళుకు బెళుకులు, టింగుటింగులు, గలగలలు, జలజలలు గల శైలియేది?.... భయంకరమయ్యును మనోహరమై, మహాశక్తి సక్తమయ్యు, మార్దవయుక్తమై, ధారాళమయ్యు విశాలమై, స్వభావ సమృద్ధమయ్యు సరసాలంకార భూయిష్ఠమై, సముద్ర ఘోషము గలదయ్యు సంగీత ప్రాయమై.... చదువరులకు గనుకట్టై, వాకట్టై, ముదిగట్టై తలపులిమినట్లు శ్వాసమైన సలుపకుండ జేసినట్లు, ముష్టివాని చిప్పనుండి మూర్ధాభిషిక్తుని కిరీటము వఱకు, భూమి క్రింది యరల నుండి సముద్రంలోని గుహల వఱకు నెవరెస్టు కొండనుండి యింద్ర ధనుస్సు రంగుల వఱకు, మందాకినీ తరంగ రంగద్దంసాంగనా క్రేంకారముల నుండి మహాదేవసంధ్యా సమయ నాట్య రంగమున వఱకు మనోవేగముతో నెగురు శక్తి కల చిత్ర విచిత్ర శైలి భేదము లింక నెన్నియో భాషలో బుట్టవలసియిన్నవి".
సరియగు వచనము ఎట్టిది అనుటకు ఈ అధ్యక్ష వచనమే నిర్వచనము-
ఆయన ఆశించిన వచనము వచ్చినది, ఆ వచ్చుట యితరుల వలన కాదు-సాక్షి వలననే. అధునాతన సంఘమునకు షడ్దర్శనములుగా సాక్షి దర్శన మిచ్చినది. అది వ్యాస దర్శనము. అనేకములను గద్య గ్రంథములని మనము సరిపెట్టుకొనవచ్చును. కాని, సాక్షి సంపుటములు గద్యకావ్యము లనిపించగల గుణ సమంవితములు. కోణములు మార్చి సాక్షిపైన వంద పరిశోధన గ్రంథము లుదయింపజేయ వచ్చును, వేయి వుపన్యాసము లీయవచ్చును.
వాటి నాటకములలో సంగీతము అన్ని తావుల నుండరాదని తెలుపు నుపన్యాసమున "సాయంతన పాకసామగ్రీ సందర్భమును సంగీతములో వెల్లడించి యుంటమా? అట్లే చేసి యుండిన యెడల మన యిరుగుపొరుగు వారు మన చేతులు కాళ్ళు గట్టి తాలు నున్నగా గొఱిగించి నిమ్మకాయ పులుసుతో రుద్ది, బెత్తముచే మోది యున్మత్త శాలకు పంపించి యుండరా? అజ్ఞాన స్వరూపమగు గ్రుడ్డయినను గడుపునొప్పి రాగ గ్యారుక్యారున నేడ్చును గాని సరళ స్వరము పాడునా? ప్రొయ్యి యలుకుచుండగ దేలుచే గుట్టబడిన వనిత మొఱ్ఱోమొఱ్ఱో యని యేడ్చును గాని ముఖారిపాడి తాండవించునా? అట్లే చేసియుండిన యెడల దేలుమాట యటుంచి దయ్యపుబాధయని చీపురుకట్టలతో వీపు తట్టు దేర జావగొట్టి యుండరా?
కన్నకొడుకు మరణింపగ దల్లి తలకొట్టుకొని యేడ్చి యేడ్చి కొయ్యవాఱిపోవలసినదికాని మొలకట్టుకొని యుత్కంఠమున బాడిపాడి ముక్తాయించి తీరవలసినదా? దూడచచ్చిన యావైన దిగులు పడి డిల్లపడి, గడ్డిమాని నీరు మాని దూడను ముట్టితో స్పృశించి కంటనీరు పెట్టుకొని తహతహచే గింజుకొని 'యంబా' యని యఱచునే! మనమంత కంటె నధమ స్థితిలో నుండవలసి వచ్చెనే-ఎంత మహాప్రారబ్ధము పట్టినది! పాట కొఱకే మనమప్పుడుప్పుడు పాడుకొనుచున్నాము.కాని ప్రాపంచిక సర్వవ్యాపారములను బాటలతో గాక మాటలతోడనె మనము నిర్వహించు కొనుచుంటిమని మన మందఱమెఱిగి వ్రాసిన పానుగంటి తత్త్వమును మనము గ్రహించవలెను. వాస్తవిక దృక్పథమునకు మనలను తీసికొని వచ్చుటలో ఆయన చెప్పునని దెప్పునని కొల్లలు కొల్లలు. ఒక్కొక్కప్పుడాయన రచన గిల్లునట్లుండును. గిల్లును. అవసరమైనప్పుడు మన చర్మము దళసరి అని భావించినప్పుడు రక్కియైన నొక్కి చెప్పును గాని వదులుట యనునది యుండదు. అందువలనే సాక్షి, ఛాందసులకు లక్ష్మీనరసింహ స్వప్నము!
పానుగంటి వంటివారుకాక మరియొకరు అట్టి గ్రాంథిక వచన రచనము అరసున్నలతో బండిరాలతో చేసియున్నచో నీ కాలమున నిగిరిపోయి వుండును. కారణము ఒఠి వచన రచనా పాటవము చాలదు.
పానుగంటి వారు కవి. విమర్శకులు. భావుకులు. సమాజ దర్శనము మరువని వారు. సంఘసంస్కరణము కోరినవారు. పైబడి రచనా సంస్కరణము కోరిన వారు. ఆకట్టుకొనుటలో కనికట్టు కనిపెట్టినవారు.
కొంచెము ముందునకు వెళ్ళినట్లనిపించవచ్చు గాని-
నాటకములలో 'కన్యాశుల్కము'ఎట్టిదో గద్యరచనాలలో 'సాక్షి' అటువంటిది. ఆయన వచన కవిత్వము వ్రాయకపోవచ్చును. గాని వచనమున గవిత్వము వ్రాసిన వారు.
పానుగంటివారిని వచన యోధులని చెప్పవలెను. మనము చెప్పనవసరము లేదు. ఈ వాక్యములు పల్కుచున్నవి.
"వచనము వ్రాయువారిని దీసివ్రేత సరకుగ గుక్కమూతి పిందెగ దృణీకరింప న్యాయమా? పద్యమున గవిత్వముండి వచనమున లేకుండునా? ఎచ్చట రసముండునో అచ్చటనే కవిత్వమున్నది. అన్ని నాగరక దేశములందు గూడ వచన ప్రబంధములు లక్షోపలక్షలుగా వృద్ధి పొందుచున్నప్పుడు మన దేశమందట్లు జరగకపోవుట కడుశోచనీయము గాదా?
వచన గ్రంథ రచనా బాహుళ్యము గాని భాష యభివృద్ధి పొంద నేరదు"-
ఇవి నాటుకొనవలసిన మాటలు.
వీరేశలింగమువారు, చిలకమర్తివారు, పానుగంటివారు-వీరందఱూ ఒఠి రచనలను చేయుట కాదు, భాషా వికాసమునకు, సాహిత్య సమున్మీలనమునకు, దేశ ప్రయోజనములకు పాటు పడుట వారి రక్తమున నున్న అంశములు. వర్తమాన రచయితలు వారి ఆదర్శస్ఫూర్తి పొందవలసిన జాత్యవసరమున్నది.
వెగటుదనము, పచ్చి శృంగారము లేకుండగ హాస్యము పుట్టించు పానుగంటి సాక్షి రచనలలో-ఉల్లేఖించివలసినచో సవాలక్ష కన్పడును. విజ్ఞానము, పరిశీలనము అనునవి పానుగంటి వారికి రెండు కన్నులుగ రచనకు దారులు చూపించినవి. తోలు బొమ్మలాటలో బాటలు పాడు ఆడుదానిని పరిశీలనాత్మకముగా వర్ణించు సందర్భమున "గ్రామమున రాత్రివేళ యందది యేమూల బాడుచున్నను గ్రామమంతయు దాని కంఠము వినిపించును. చెక్కుచెదరలేదు. నలి లేదు. తొలి లేదు. బొంగు జీరలేదు. అపస్వరము వెలితి లేదు. 'కై' మనిన నక్షత్ర మార్గమున గఱ్ఱుమని తిరుగుచు బలిటీలు గొట్టును. సంగతుల పై సంగతులు పూలు చల్లినట్లది వర్షించును" అనుటలో చివరి వాక్యములు కవి వాక్యములు.
పానుగంటి వారి ఆలోచనలు దేశీయమైనవి. సాహిత్యరంగమున, సంఘ సంస్కరణమున మాత్రమే కాదు; పారిశ్రామిక రంగమున కూడ మనదేశము అభివృద్ధి గాంచవలెనని నేసి యంత్రములు చేయలేని వస్త్రోత్పత్తిని చేయ మన వారి నేర్పు నాయన ఎన్నియో వాక్యములలో ప్రశంసించినారు. ఇప్పుడైనా కన్నులు తెఱవరా? స్వదేశ పరిశ్రమ విద్యా సంరక్షణ మాచరించరా? మీ ధనము మీలో నుండునట్లు చేసికొనరా? అని ప్రశ్నించినారు. దేశభక్తి-స్వార్థ త్యాగము వ్యాసము పానుగంటి అంతరంగమునకు వేదిక వంటిది. మాతృభక్తి, పితృభక్తి వంటివి లేకనే దేశభక్తి యుండుట, కల్గుట వీలుకాదని నొక్కి చెప్పుచు నిజమైన దేశభక్తుల అవసరము తెలుపుచు దేశభక్తి, ప్రదర్శనముగా నుండరాదని అభిప్రాయపడినారు.
"బజారులో దేశభక్తులు. మంద బయట దేశభక్తులు. ఇంటిలో దేశభక్తులు. దొడ్డిలో దేశభక్తులు. వాకిటిలో దేశభక్తులు. రైలు స్టేషనులో దేశభక్తులు. నేల ఈనినట్లందఱు దేశభక్తులు-వందలు, వేయి లక్షలు. ఇందఱు దేశభక్తులు మన దేశమున నున్న తరువాత మన దేశమునకిక గొఱత యేమి? ఇంకను దేశమునకు దురవస్థ యేమి? ఏమియు లేదు, ఇదియే స్వతంత్ర్య రాజ్యము. ఇదియే స్వర్గలోకము"-
ఈ పానుగంటి వాక్యములు పరోక్షముగా క్రియాత్మక దేశభక్తి ప్రభోదించుచున్నవి. ఆంగ్లభాషావ్యామొహమున తెలుగు మాటాడుటకు నిష్టపడని వారిని ఆయన దులిపిన తీరు గమనించవలెను.
"మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటనైన నున్నదా?... ఈతరాని కప్ప ఏ దేశముందైనా నుండునా? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుట కేమైన సందేహమా? ఆంధ్రదేశమున బుట్టిన పక్షులైన ననవరతశ్రవణమున నాంధ్రమున మాటలాడుచుండగా - అయ్యయో మనుజుడే అంత మనుజుడే-ఆంధ్రమాతాపితలకు బుట్టిన వాడే - ఆంధ్ర దేశీయ వాయు నీరాహార పారణ మొనర్చినవాడే - అధమాధ మాఱు సంవత్సరముల యీడు వఱకైన నాంధ్రమున మాట లాడినవాడే - అట్టివా డాంగ్లేయ భాష నుపన్యసించిన మాత్రమున నిప్పుడాంధ్రమున మాటలాడ లేకుండునా-" అనిన పానుగంటివీరాంధ్ర వాక్యములు ఎంత దళసరి చర్మము వారినైన మార్చగల శక్తి సంభరితములు కదా?
కవి వ్యాసమున వచనము వెంబడి గల పద్యము పానుగంటికవి ఆంతరంగిక దశా విశేషములు తెలుపునది.
"మల్లెపూవుదూఱి మధుపంబుతో బాడి
గంధవాహుతోడ గలసి వీచి
యబ్ధిలోన మునిగి యౌర్వవహ్నిని గ్రాగికి
నీటి బుగ్గయగుచు నింగి బ్రాకి
తోకచుక్క తోడ డీకొని శ్రమజెంది
సాంధ్యగార నదిని స్నానమాడి
తనువునిండ నింద్రధనుసు రంగులు పూసి
కైవారప్తు సుధను గైపుజెంది
గోళగాన రుతికి మేళవింపు బాడి
పాడియాడు యాడిపాడి సోలి
భావనామహత్వ పటిమను బ్రహ్మమై
పోవు కవికి కోటి మ్రొక్కులిడుదు"
కవియనగా ఎవరనగా- "సమయానుసార సర్వతోముఖ సమ్మోహినీ కరణ సరస్వతీ మూర్తి" ఇది సాక్ష్యుక్తి. దీని కన్వర్థము పానుగంటి వారే. అది కల దిది లేదు. ఇది కల దదిలేదు అనునది సాక్షి విషయమున చెప్పలేము.
సాక్షి సంపుటములు అధునాతన కాలమున తెలుగువారికి బృహత్సంహితలు. సాక్షి సంపుటములు పునర్ముద్రణము చేయుటకు పై నుండి పీఠికాపుర మహారాజు గారు, నాటి వావిళ్లవారు, అభినందించుచున్నట్లు, పానుగంటివారు ఆశీర్వదించు చున్నట్లు, నా కనిపించుచున్నది.
ఇది తెలుగువారికి తమ జాతీయ సంపదను తిరిగి చూచుకొనుటకు, అనుభవించుటకు బృహదవకాశము.
లలితానగరు రాజమహేంద్రి. |
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 15-11-90. |
విషయసూచిక
[మార్చు]విషయసూచిక
1 |
4 |
8 |
15 |
23 |
34 |
44 |
52 |
62 |
68 |
77 |
82 |
85 |
94 |
102 |
109 |
112 |
120 |
127 |
132 |
138 |
146 |
151 |
157 |
165 |
173 |
179 |
187 |
196 |
200 |
210 |
219 |
227 |
236 |
244 |