సాక్షి

వికీసోర్స్ నుండి

సాక్షి


(అన్ని సంపుటాలు కలిపి)


శ్రీ మధునాపంతుల సత్యన్నారాయణ శాస్త్రిగారి పీఠికతో

శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారిచే వ్యావహారికభాషలో

ప్రతి ఉపన్యాసానికి ముందు వివరణలతో

తొలి కంబైండ్ ఎడిషన్‌కు డా॥ నండూరి రామమోహనరావు గారి

“యువ పాఠకుల కోసం......” శీర్షికతో


కవిశేఖర

పానుగంటి లక్ష్మీనరసింహారావు

అభినందన పబ్లిషర్స్

28-9-24, జలీల్ వీధి, అరండల్ పేట,

విజయవాడ-2. ఫోన్ : 2572211/22

SAAKSHI

Panuganti Lakshmi Narasimha Rao

with

Preface
by
Madhunapantula
Satyanarayana Sastry.


Preface
by
Dr. Nanduri
Ramamohana Rao.


Preface
by
Indraganti
Srikantha Sarma.







First Combined Edition : 2006

Publishers
Abhinandana Publishers
Vijayawada - 520 002.

Director of Publishing :
B. Babjee

Price : Rs. 550/-

Title : Sri Bapu

Printing
Sri Chaitanya Offset Printers
Vijayawada - 520 002.

ISBN 81-85591-01-6

సాక్షి
పానుగంటి లక్ష్మీ నరసింహారావు,
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
గారి పీఠికతో,


డా❘❘ నండూరి రామమోహనరావుగారి
"యువపాఠకులకోసం.... " శీర్షిక తో
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారిచే వ్యావహారిక భాషలో
వివరణలతో (అదనంగా సుమారు
175 పేజీలు చేర్చబడినవి)










తొలి కంబైన్డ్ ఎడిషన్ : 2006

పబ్లిషర్స్
అభినందన పబ్లిషర్స్
విజయవాడ - 520 002.

డైరెక్టర్ అఫ్ పబ్లిషింగ్ :
బి. బాబ్జీ

వెల : రూ. 500/-

టైటిలు : శ్రీ బాపు

ప్రింటింగ్
శ్రీ చైతన్య ఆఫ్సెట్ ప్రింటర్స్
విజయవాడ - 520 002.

ISBN 81-85591-01-6



మా మాట

మంచి రచనలు అందించాలనీ,
మంచి అభిరుచి పెంపొందించాలనీ,

పాఠకులు కలకాలం తమ సొంత గ్రంథాలయంలో మంచి పుస్తకాలు పెట్టుకుని పదే పదే వాటిని చదువుకోవడానికి దోహదం చెయ్యాలనీ - మా చిరకాల వాంచితం.

ఈ ప్రయత్నంలో మా సోదర సంస్థ 'న్యూ స్టూడెంట్స్ బుక్ సెంటర్' యిప్పటివరకు చాలా విజ్ఞాన దాయకమైన పుస్తకాలను, ఉత్తమ సాహిత్య గ్రంథాలను ప్రచురించి, చేతనైనంత కృషి చేస్తూందని మీకు తెలుసు.

ఇప్పుడు మా నూతన సంస్థ 'అభినందన పబ్లిషర్స్' ఒక సాహసం చేస్తోంది. అయితే, ఈ సాహసం ఆనందకరమైనది. ఒకరకంగా గర్వకారణమైనది. అదే, 'కవిశేఖర' పానుగంటి లక్ష్మి నరసింహారావు గారు రచించిన 'సాక్షి' వ్యాసాలను ప్రచురించి - అభిమాన పాఠకులకు అందించడం.

కొందరు - కథలు వ్రాసి, గొప్ప కథకు లనిపించుకున్న వారున్నారు. కొందరు నవలలు వ్రాసి గుర్తింపు, గౌరవం పొందిన వారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణకెక్కిన వారున్నారు. కాని - 'వ్యాసం' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న మహా రచయిత బహుశా పానుగంటి వారొక్కరే. నాటకం వ్రాసి గురజాడవారు గిరీశం పాత్రను చిరంజీవినిచేస్తే, పానుగంటివారు వ్యాసాలను ఉపన్యాసాలుగా, ఉపన్యాసాలను వ్యాసాలుగా జలకాలాడించి - జంఘాలశాస్త్రి ప్రాతను చిరంజీవిని చేశారు. ఈ వ్యాసాలలో పానుగంటి వారి శైలి, విషయ విన్యాసం చూస్తుంటే, చురకత్తి కొసను మల్లెదండ వ్రేలాడ దీసి నట్టుంటుంది. 1913లో కొంతకాలం, 1920లో కొంతకాలం 'సాక్షి' వ్యాసాలను ఆయన రచించారు. ఎందరో అసంఖ్యాక పాఠకుల్ని ఆకర్షించారు. ఆలరించారు. పానుగంటే సాక్షి, సాక్షే పానుగంటి అనిపించారు.

తొలుత ఈ వ్యాసాలను పిఠాపురం రాజావారు ముద్రించి ప్రచారం చేశారు. ఆ తరువాత మద్రాసులోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారు ఆరు సంపుటాలుగా ప్రచురించారు. ఈ విషయాలు జరిగి దాదాపు నలభై సంవత్సరాలు గడిచాయి. (వావిళ్లవారికి సంబంధించినంతవరకు)

ప్రస్తుతం ఆ ఆరు సంపుటాలు 'సాక్షి' వ్యాసాలను - అక్షరంపొల్లుపోకుండా మొత్తం మూడు సంపుటాలుగా పాఠకులకు అందించగలిగే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాం.

1920 లెక్కవేసుకున్నా, ఈ వ్యాసాల రచన జరిగి ఇప్పటికి 70 ఏళ్లు కావస్తోంది. వీటి భాష గ్రాంథికం. విషయాలు ఎంత ఆసక్తి కరమైనవైనా, ఎంత హాస్యరసప్రధానంగా వున్నా, ఈ నాటి పాఠకులకు ఈ 'సాక్షి' ని చేరువ చెయ్యాలంటే, వ్యావహారిక భాషలో, ప్రతి వ్యాసం సారాంశం ముందు 'టూకీ' గా అందిస్తే బాగుంటుందని తోచింది. ఈ మా లక్ష్యం చెప్పగానే సహకరించి, వ్యాసాలన్నింటికి ‘క్లుప్త కథనాన్ని’ వ్రాసి యిచ్చిన మిత్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు. మా ప్రచురణ సంకల్పం తెలిపిన వెంటనే ఆనందంతో ఆశీర్వదించి పీఠిక వ్రాసి యిచ్చినవారు మహాకవి, కళా ప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, ఇటువంటి ఆదరభామానాలతోనే ఈ సంపుటాలకు ముఖపత్ర రచన చేసినవారు ప్రముఖ చిత్రకారులు శ్రీ బాపుగారు. ఈ సంపుటాలు అందంగా - అచ్చుతప్పులు లేకుండా - పాఠకులకు అందించాలని ఆశించి, శ్రమించి సహకరించిన వారు పండితమిత్రులు పి. జగన్నాధరావుగారు. వీరికి మా ‘హార్ద’ కృతజ్ఞతులు.

ఇన్నాళ్లకు మళ్లీ ‘సాక్షి’ వ్యాసాలను వెలువరించడమంటే, చాలా అందంగా చెయ్యాలని ఆత్యాధునిక ముద్రణ పద్ధతిని అనుసరించాం. ఇది బరువైనదైనా ‘పరువైనదని’ సాహసించాం. ఈ సంపుటాలను మీ చేతిలో సవినయంగా సగౌరవంగా ఉంచుతున్నాం. ప్రోత్సహించి, ఆశీర్వదించమని విన్నవించుకొంటున్నాం.


“సాక్షి మూడు సంపుటాల వ్యాసాల సాక్షిగా”


“తెలుగు సాహిత్యానికి సాక్షి నామసంవత్సరం”



డైరక్టర్ ఆఫ్ పబ్లిషింగ్

అభినందన పబ్లిషర్స్

బి. బాబ్జి

డైరెక్టర్.

ఒక్క క్షణం....

‘సహస్ర చంద్రదర్శనం’ తరహాలో గత తరాల వారి జాతీయసంపద ‘సాక్షి’ ని ఆధునిక రూపలావణ్యాలతో తెలుగు పాఠకులకు అందిస్తున్నందుకు సగర్వంగా వుంది. 1913-20 మధ్యకాలంలో ‘కవిశేఖర’ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు రచించిన ‘సాక్షి’ వ్యాసాలు తెలుగు సాహితీరంగంలో వ్యాసరచనా ప్రక్రియకు అపూర్వగౌరవ ప్రతిష్టలను చేకూర్చాయి.

దేశభక్తి, సంఘసంస్కరణ, స్వదేశ పరిశ్రమలు, స్త్రీ స్వాతంత్య్రం, నాటకం, సాహిత్యం, మతం, ఆధ్యాత్మికత, భాష, ఎన్నికలు, వైద్యం, నాగరికత మొ॥ వందలాది అంశాలమీద సునిశిత విమర్శనాస్త్రాలను సంధించిన ‘సాక్షి’ వ్యాసరచనలకు ఈనాటికీ కాలదోషం పట్టకపోవడంలో ఆశ్చర్యం లేదు గాని, రచయిత ఊహాబలం, రచనాపటిమ దాదాపు శతాబ్దకాలం వరకు సజీవంగా ఉన్నందుకు గర్వించాలి.

‘ఆంధ్రపత్రిక’ ఆదివారం సారస్వతానుబంధంలో వారంవారం వెలువడిన ఈ అపురూప వ్యాస పరంపరను తొలుత పిఠాపురం రాజా వారు పుస్తకరూపంలో వెలువరించి మరింత ప్రచారం కల్పించారు. తదనంతరం వావిళ్ల ప్రచురణ సంస్థ మొత్తం ఆరు సంపుటాలలో ప్రచురించిన ఈ వ్యాసాలు బహుళ పాఠకాదరణ పొందాయి. చాలాకాలం పునర్ముద్రణ కాకపోవడంతో 1991లో మేము ఈ బృహత్తర బాధ్యతను చేపట్టి మూడు సంపుటాలుగా వెలువరించాము. కాలపరిణామంలో తెలుగుభాష ఎంతో ఆధునికతను సంతరించుకోవటంతో నూతనతరాల పాఠకుల పఠనాసౌలభ్యం నిమిత్తం ప్రతి వ్యాసరచనకు ప్రారంభంలో వ్యావహారికభాషలో ఆ వ్యాసరచన ముఖ్యోద్దేశాన్ని శ్రీ ఇంద్రకంటి శ్రీకాంతశర్మ గారి వివరణల రూపంలో అందించాము. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని పాఠకులు యావన్మందీ హర్షించారు. ఈ ఉత్సాహబలంతో 1999లో రెండవ ముద్రణ జరిపాము.

విశ్వసాహిత్యంలో సజీవనదులవలే అన్ని కాలాల్లోనూ ప్రవహించుతూ, అన్ని తరాల పాఠకులను అలరించే సజీవరచనలు కొన్ని అయినా ఉండటం సహజం. ఈ పోలిక గల సాహిత్యసంపదలో ‘సాక్షి’ వ్యాసాలు స్థానం సంపాదించుకున్నాయని అనుభవపూర్వకంగా మాకు తెలియడంతో తృతీయ ముద్రణకు అరుదెంచాము. ‘సాక్షి’ మూడు సంపుటాలను ఒకే బృహత్ సంపుటముగా రూపకల్పన చేసి, ఆధునిక సాంకేతిక సహకారంతో ముద్రించి, మీ ముందుకు తీసుకువచ్చాం.

‘సాక్షి’ వ్యాసాలలో సునిశిత విమర్శకు లోనైన, వ్యంగ్యభరితమైన, అవహేళనకు గురయిన అంశాలన్నీ ఈనాటికీ చర్చనీయాంశములు కావడం విశేషం. ఈ తరం యువపాఠకులకు సైతం ఈ వ్యాసరచనలు స్ఫూర్తిమంతములు కాగలవని మా దృఢవిశ్వాసం.

మా ఈ మూడవ ముద్రణ బృహత్ సంపుటానికి కోరినంతనే ‘యువపాఠకులకు....’ సహృదయతతో రాసిన సన్మిత్రులు, సుప్రసిద్ధ పాత్రికేయులు డా॥ నండూరి రామమోహనరావు గారికి కృతజ్ఞతలు.

మేము సర్వాంగసుందరంగా అందిస్తున్న ఈ నూతన ముద్రణ ‘సాక్షి’ సంపుటమును మా ప్రియతమ పాఠకులు సమాదరించాలని ఆకాంక్షిస్తున్నాం.

శ్రీ వ్యయనామ ఉగాది

30-3-2006


డైరక్టర్ ఆఫ్ పబ్లిషింగ్

అభినందన పబ్లిషర్స్

బి. బాబ్జీ.

డైరెక్టర్

తెలుగువారి బృహత్సంహిత

“మృదుమధుర నవార్థభాసుర వచనరచనా విశారదులైన' మహాకవి ఆధునిక కాలమున ఎవరు? -అని ఎవరైన ప్రశ్నించినచో నా ప్రత్యుత్తరము - పానుగంటి లక్ష్మీనరసింహారావుగారని.

వచనరచనాధురీణులు మరికొంతమంది వుండిన జాతికి ప్రయోజనదాయకమే కాని, నష్టదాయకము కాదు గదా-

కాని తమదైన శైలివిన్యాస మాధుర్యము కలవారు కావలెనన్నచో -

రావలసిన పేరు లక్ష్మీనరసింహారావుగారిదే. రావలసిన పేరు వచ్చినది. వచ్చినది శాశ్వతమైన యశస్సు తప్ప కొన్ని కేలండర్లకే పరిధి అయినది కానే కాదు.

నిబ్బరమైన పానుగంటి వచనమున కబ్బురపడని గద్య ప్రేమికులుండరు.

అంతగొప్ప వచన మాయనకు వచ్చుట వింతకాదు. తపఃఫలితము. భాషామాధుర్య మధనోద్భూతము. జీవము భావమని వేరుగా చెప్పనవసరము రాదు.

గద్య సాహిత్య రంగమున జరుగవలసిన దానికై నాడు 1922లో పానుగంటి వారెంతగా అభిలషించిరో, ఆశించిరో తెలియుటకు ఆంధ్రసాహిత్య పరిషదేకాదశ వార్షికోత్సవమున వారి అధ్యక్ష వచనమే సాక్షివచనము.

“చిత్రములైన శైలీ భేదములు, మన భాషలో మిగుల నరుదుగా నున్నవని వేరే చెప్పనేల? రైమని పేకచువ్వ పై కెగిరినట్లున్న శైలి భేదమేది? కాకి పై కెగిరి యెగిరి ఱెక్కలు కదలకుండ జందెపు బెట్టుగ సాపుగ వాలుగ దిగునప్పటి లఘుపతన చమత్కృతి కనబఱచు శైలి పద్ధతి యేది? తాళము వాయించునప్పటి తళుకు బెళుకులు, టింగుటింగులు, గలగలలు, జలజలలు గల శైలియేది?..... భయంకరమయ్యును మనోహరమై, మహాశక్తి సక్తమయ్యు మార్దవయుక్తమై, ధారాళమయ్యు విశాలమై, స్వభావ సమృధ్ధమయ్యు సరసాలంకార భూయిష్ఠమై, సముద్ర ఘోషము గలదయ్యు సంగీత ప్రాయమై.... చదువరులకు గనుకట్టై, వాకట్టై, మదిగట్టై తలపులిమినట్లు శ్వాసమైన సలుపకుండ జేసినట్లు, ముష్టివాని చిప్పనుండి మూర్దాభిషిక్తుని కిరీటము వఱకు, భూమి క్రింది యరల నుండి సముద్రములోని గుహల వఱకు నెవరెస్టు కొండనుండి యింద్ర ధనుస్సు రంగుల వఱకు, మందాకినీ తరంగ రంగద్దంసాంగనా క్రేంకారముల నుండి మహాదేవసంధ్యా సమయ నాట్య రంగమున వఱకు మనో వేగముతో నెగురు శక్తి కల చిత్ర విచిత్ర శైలి భేదము లింక నెన్నియో భాషలో బుట్టవలసియున్నవి".

సరియగు వచనము ఎట్టిది అనుటకు ఈ అధ్యక్ష వచనమే నిర్వచనము-

ఆయన ఆశించిన వచనము వచ్చినది, ఆ వచ్చుట యితరుల వలన కాదు-సాక్షాత్తు ఆయన వలననే, సాక్షి వలననే. అధునాతన సంఘమునకు షడ్దర్శనములుగా సాక్షి దర్శన మిచ్చినది. అది వ్యాస దర్శనము. అనేకములను గద్య గ్రంథములని మనము సరిపెట్టుకొనవచ్చును. కాని, సాక్షి సంపుటములు గద్యకావ్యము లనిపించగల గుణ సమన్వితములు. కోణములు మారి సాక్షిపైన వంద పరిశోధన గ్రంథము లుదయింపజేయ వచ్చును. వేయి వుపన్యాసము లీయవచ్చును.

నాటి నాటకములలో సంగీతము అన్ని తావుల నుండరాదని తెలుపు నుపన్యాసము, “సాయంతన పాకసామగ్రీ సందర్భమును సంగీతములో వెల్లడించి యుంటమా? అట్లే చేసి యుండిన యెడల మన యిరుగుపొరుగు వారు మన చేతులు కాళ్ళు గట్టి తలలు నున్నగా గొఱిగించి నిమ్మకాయ పులుసుతో రుద్ది, బెత్తముచే మోది యున్మత్త శాలకు పంపించి యుండరా? అజ్ఞాన స్వరూపమగు గ్రుడ్డయినను గడుపునొప్పి రాగ గ్యారుక్యారున నేడ్చును గాని సరళ స్వరము పాడునా? ప్రొయ్యి యలుకుచుండఁగ దేలుచేఁ గుట్టబడిన వనిత మొఱ్ఱో మొఱ్ఱో యని యేడ్చును గాని ముఖారిపాడి తాండవించునా? అట్లే చేసియుండిన యెడల దేలుమాట యటుంచి దయ్యపుబాధయని చీపురుకట్టలతో వీఁపు తట్టుఁ దేరఁ జావగొట్టి యుండరా?

కన్నకొడుకు మరణింపఁగఁ దల్లి తలకొట్టుకొని యేడ్చి యేడ్చి కొయ్యవాఱ పోవలసినదికాని మొలకట్టుకొని యుత్కంఠమున బాడిపాడి ముక్తాయించి తీరవలసినదా? దూడచచ్చిన యావైన దిగులు పడి డిల్లపడి, గడ్డిమాని నీరు మాని దూడను ముట్టితో స్పృశించి కంటనీరు పెట్టుకొని తహతహచే గింజుకొని 'యంబా' యని యఱచునే మనమంత కంటె నధమ స్థితిలో నుండవలసి వచ్చెనే-ఎంత మహాప్రారబ్దము పట్టినది! పాట కొఱకే మనమప్పుడుప్పుడు పాడుకొనుచున్నాము. కాని ప్రాపంచిక సర్వవ్యాపారములను బాటలతో గాక మాటలతోడనె మనము నిర్వహించు కొనుచుంటిమని మన మందఱమెఱింగిననంశమే కదా!.... ఆహా మనుష్యత్వము పశుత్వమున కంటె నేడాకులు తగ్గినదా? ” అని వ్రాసిన పానుగంటి తత్త్వమును మనము గ్రహించవలెను. వాస్తవిక దృక్పథమునకు మనలను తీసికొని వచ్చుటలో ఆయన చెప్పునవి దెప్పునవి కొల్లలు కొల్లలు. ఒక్కొక్కప్పుడాయన రచన గిల్లునట్లుండును. గిల్లును. అవసరమైనప్పుడు మన చర్మము దళసరి అని భావించినప్పుడు రక్కియైన నొక్కి చెప్పును గాని వదలుట యనునదియుండదు. అందువలననే సాక్షి, ఛాందసులకు లక్ష్మీనరసింహ స్వప్నము!

పానుగంటి వంటివారుకాక మరియొకరు అట్టి గ్రాంథిక వచన రచనము అరసున్నలతో బండిరాలతో చేసియున్నచో నీ కాలమున నిగిరిపోయి వుండును. కారణము ఒఠి వచన రచనా పాటవము చాలదు.

పానుగంటివారు కవి. విమర్శకులు. భావుకులు. సమాజ దర్శనము మరువని వారు. సంఘ సంస్కరణము కోరినవారు. పైబడి రచనా సంస్కరణము కోరిన వారు. ఆకట్టుకొనుటలో కనికట్టు కనిపెట్టిన వారు.

కొంచెము ముందునకు వెళ్ళినట్లనిపించవచ్చు గాని-

నాటకములలో ' కన్యాశుల్కము' ఎట్టిదో గద్యరచనములలో 'సాక్షి' అటువంటిది. ఆయన వచన కవిత్వము వ్రాయకపోవచ్చును. గాని వచనమున గవిత్వము వ్రాసిన వారు.

పానుగంటివారిని వచన యోధులని చెప్పవలెను. మనము చెప్పనవసరము లేదు. ఈ వాక్యములు పల్కుచున్నవి.

వచనము వ్రాయువారిని దీసివ్రేత సరకుగ గుక్కమూతి పిందెగఁ దృణీకరింప న్యాయమా? పద్యమున గవిత్వముండి వచనమున లేకుండునా? ఎచ్చట రసముండునో అచ్చటనే కవిత్వమున్నది. అన్ని నాగరక దేశములందు గూడ వచన ప్రబంధములు లక్షోపలక్షలుగా వృద్ధి పొందుచున్నప్పుడు మన దేశమందట్లు జరగకపోవుట కడుశోచనీయము గాదా?

వచన గ్రంథ రచనా బాహుళ్యము గాని భాష యభివృద్ధి పొంద నేరదు-

ఇవి నాటుకొనవలసిన మాటలు.

వీరేశలింగమువారు, చిలకమర్తివారు, పానుగంటివారు - వీరందఱునూ ఒఠి రచనలను చేయుట కాదు, భాషా వికాసమునకు, సాహిత్య సమున్మీలసమునకు, దేశ ప్రయోజనములకు పాటు పడుట వారి రక్తమున నున్న అంశములు. వర్తమాన రచయితలు వారి ఆదర్శ స్ఫూర్తి పొందవలసిన జాత్యవసరమున్నది.

వెగటుదనము, పచ్చి శృంగారము లేకుండగ హాస్యము పుట్టించు పానుగంటి సాక్షి రచనలలో-ఉల్లేఖించివలసినచో సవాలక్ష కన్పడును. విజ్ఞానము, పరిశీలనము అనునవి పానుగంటి వారికి రెండు కన్నులుగ రచనకు దారులు చూపించినవి. తోలు బొమ్మలాటలో బాటలు పాడు ఆడుదానిని పరిశీలనాత్మకముగా వర్ణించు సందర్భమున "గ్రామమున రాత్రివేళ యందది యేమూల బాడుచున్నను గ్రామమంతయు దాని కంఠము వినిపించును. చెక్కుచెదరలేదు. నలి లేదు. తొలి లేదు. బొంగు జీరలేదు. అపస్వరము వెలితి లేదు. 'కైఁ' మనిన నక్షత్ర మార్గమున గఱ్ఱుమని తిరుగుచుఁ బలిటీలు గొట్టును. సంగతుల పై సంగతులు పూలు చల్లినట్లది వర్షించును" అనుటలో చివరి వాక్యములు కవి వాక్యములు.

పానుగంటి వారి ఆలోచనలు దేశీయమైనవి. సాహిత్యరంగమున, సంఘ సంస్కరణమున మాత్రమే కాదు; పారిశ్రామిక రంగమున కూడ మనదేశము అభివృద్ధి గాంచవలెనని వారాశించుట 'స్వదేశ పరిశ్రమలు' అను శీర్షిక గల రచనమే తెలుపును. కడుసన్నని నూలు నేసి యంత్రములు చేయలేని వస్త్రోత్పత్తిని చేయు మన వారి నేర్పు నాయన ఎన్నియో వాక్యములలో ప్రశంసించినారు. ఇప్పుడైనా కన్నులు తెఱవరా? స్వదేశ పరిశ్రమ విద్యా సంరక్షణ మాచరించరా? మీ ధనము మీలో నుండునట్లు చేసికొనరా? అని ప్రశ్నించినారు. దేశభక్తి - స్వార్థ త్యాగము వ్యాసము పానుగంటి వారి అంతరంగమునకు వేదిక వంటిది. మాతృభక్తి పితృభక్తి వంటివి లేకనే దేశభక్తి యుండుట, కల్గుట వీలుకాదని నొక్కి చెప్పుచు నిజమైన దేశభక్తుల అవసరము తెలుపుచు దేశభక్తి, ప్రదర్శనముగా నుండరాదని అభిప్రాయపడినారు.

బజారులో దేశభక్తులు. మంద బయట దేశభక్తులు. ఇంటిలో దేశభక్తులు. దొడ్డిలో దేశభక్తులు. వాకిటిలో దేశభక్తులు. రైలు స్టేషనులో దేశభక్తులు. నేల యీనినట్లిందఱు దేశభక్తులు - వందలు, వేయి లక్షలు. ఇందఱు దేశభక్తులు మన దేశమున నున్న తరువాత మన దేశమునకిఁక గొఱతయేమి? ఇంకను దేశమునకు దురవస్థ యేమి? ఏమియులేదు, ఇదియే స్వతంత్ర్య రాజ్యము. ఇదియే స్వర్గలోకము-

ఈ పానుగంటి వాక్యములు పరోక్షముగా క్రియాత్మక దేశభక్తి ప్రబోధించుచున్నవి. ఆంగ్ల భాషావ్యామోహమున తెలుగు మాటాడుటకు నిష్టపడని వారిని ఆయన దులిపిన తీరు గమనించవలెను.

‘‘మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటనైన నున్నదా?... ఈతరాని కప్ప ఏ దేశమందైనా నుండునా? పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుట కేమైన సందేహమా? ఆంధ్రదేశమున బుట్టిన పక్షులైన ననవరతశ్రవణమున నాంధ్రమున మాటలాడుచుండగా - అయ్యయో మనుజుడే అంత మనుజుడే - ఆంధ్రమాతాపితలకు బుట్టిన వాడే - ఆంధ్ర దేశీయ వాయు నీరాహార పారణ మొనర్చినవాడే - అధమాధ మాఱు సంవత్సరముల యీడు వఱకైన నాంధ్రమున మాట లాడినవాడే - అట్టివాఁ డాంగ్లేయ భాష నభ్యసించినంత మాత్రమున నిప్పుడాంధ్రమున మాటలాడ లేకుండునా- " అనిన పానుగంటివీరాంధ్ర వాక్యములు ఎంత దళసరి చర్మము వారినైన మార్చగల శక్తి సంభరితములు కదా?

'కవి' వ్యాసమున వచనము వెంబడి గల పద్యము. పానుగంటికవి ఆంతరంగిక దశా విశేషములు తెలుపునది.

‘‘మల్లెపూవుఁదూఱి మధుపంబుతోఁ బాడి
           గంధవాహుతోడఁ గలసి వీచి
 యబ్దిలోన మునిగి యోర్వవహ్నిని గ్రాగికి
          నీటి బుగ్గయగుచు నింగి బ్రాకి
 తోఁక చుక్క తోడ డీకొని శ్రమఁ జెంది
          సాంధ్యరాగ నదిని స్నానమాడి
 తనువునిండ నింద్రధనుసు రంగులు పూసి
         కైరవాప్తు సుధను గైపుజెంది

 గోళగాన రుతికి మేళవింపు బాడి
 పాడియాడి యాడిపాడి సోలి
 భావనామహత్వ పటిమను బ్రహ్మమై
 పోవు కవికి కోటి మ్రొక్కులిడుదు

కవి యనగా, ఎవరనగా-

“సమయానుసార సర్వతోముఖ సమ్మోహినీ కరణ సరస్వతీ మూర్తి ఇది సాక్ష్యుక్తి. దీని కన్వర్ధము పానుగంటివారే. అది కల దిది లేదు, ఇదికల దదిలేదు అనునది సాక్షి విషయమున చెప్పలేము.

సాక్షి సంపుటములు అధునాతన కాలమున తెలుగువారికి బృహత్సంహితలు. సాక్షి సంపుటములు పునర్ముద్రణము చేయుటను పై నుండి పీఠికాపుర మహారాజుగారు, నాటి వావిళ్లవారు, అభినందించుచున్నట్లు, పానుగంటివారు ఆశీర్వదించు చున్నట్లు, నా కనిపించుచున్నది.

ఇది తెలుగువారికి తమ జాతీయ సంపదను తిరిగి చూచుకొనుటకు, అనుభవించుటకు బృహదవకాశము.

లలితానగరు

రాజమహేంద్రి.

మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

15-11-90.

యువపాఠకులకు....

నా చిన్నతనంలో నేను చదివిన మొదటి జనరల్ బుక్స్‌లో 'సాక్షి' ఒకటి. మా స్వగ్రామానికి సమీపంలోని లైబ్రరీ నుంచి 'సాక్షి' సంపుటాలను వారంవారం తెచ్చుకొని చదవడం నాకు ఒక హాబీగా ఉండేది. నాకు ఏ కాస్తో తెలుగు రాయడం; రావడానికి ఒక కారణం ఆనాడు నేను చదివిన పానుగంటి వారి 'సాక్షి' అని సగర్వంగా చెప్పగలను.

పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు 'సాక్షి' వ్యాసాలను గ్రాంథికశైలిలో రాశారు. అయితే, అది గొడ్డు గ్రాంథికం కాదు. వ్యావహారికానికి దగ్గరగా వుండే గ్రాంథికశైలి. అప్పటికే, ప్రముఖ రచయితలందరు వ్యావహారిక భాషనే అవలంభించినప్పటికీ ఇంకా గ్రాంథికభాషలో పలువురు రాస్తూ ఉండేవారు. అయినా, ఆ గ్రాంథికం దాదాపు వ్యావహారికమనే అనిపించేది. ముఖ్యంగా పానుగంటి వారిది గ్రాంథికశైలి అయినా చాలా సులభంగా, సరళంగా, సుందరంగా ఉండేది. 'సాక్షి' వ్యాసాల శైలి ఝరీవేగంతో పరుగులెట్టేది. రాజమండ్రి వద్ద వరద వచ్చినప్పటి గోదావరిలా ప్రవాహ సదృశంగా ఉండేది. ఆ రోజుల్లో కుర్రకారుతో సహా ఎందరో ఎంతో ఆసక్తిగా 'సాక్షి' వ్యాసాలను చదివేవారు.

ఈ వ్యాసాలను 1920 ప్రాంతాలలో మొదటగా 'ఆంధ్రపత్రిక' సారస్వతానుబంధంలో వారంవారం ప్రచురించేవారట. ఆ వ్యాసాలు ఆగిపోయిన తర్వాత అవన్నీ సంపుటాల రూపంలో వచ్చాయి. ఆ రోజుల్లో అవి కలిగించిన సంచలనం ఇంతా అంతాకాదు. 'జంఘాల శాస్త్రి' అనే పాత్ర ముఖతః పానుగంటి వారు సమకాలిక సంఘ దురాచారాల మీద, అనాచారాలమీద, మూఢవిశ్వాసాల మీద పదునైన విమర్శలు చేసేవారు. ఇన్నేళ్ళ తర్వాత వాటి పునర్ముద్రణకు ముందుకు వచ్చిన 'అభినందన పబ్లిషర్స్'ను ఎంత అభినందించినా తీరదు.

'సాక్షి' వ్యాసాలపట్ల ఆనాటి ఆకర్షణ, కుతూహలం ఈనాటికీ తగ్గలేదనడానికి ఒక నిదర్శనం 'అభినందన' వారు అనతికాలంలోనే 'సాక్షి' సంపుటాలను పునః పునర్ముద్రించవలసి రావడం. ఇప్పటికే వారు ఒక 15 సంవత్సరాలలో రెండు సార్లు వాటిని మూడేసి సంపుటాలలో పునర్ముద్రించారు. ఈసారి వారు అన్ని సంపుటాలను కలిపి ఒకే బృహత్ సంపుటంగా ప్రచురిస్తున్నారు. 'అభినందన' వారు పునర్ముద్రించిన సంపుటాలలో ప్రతి వ్యాసానికి ముందు వివరణలు రాసిన వారు ప్రముఖ రచయిత శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు. ఆయన వ్యాస సారాంశాన్ని ప్రతి వివరణలోను పొందుపరిచి వ్యాసం చదవడానికి కుతూహలం కలిగించారు. అలాగే పండితకవి శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఈతరం వారికి 'సాక్షి' వ్యాసాలను పరిచయం చేస్తూ రాసిన ప్రశంసా వాక్యాలు కూడా ఈ సంపుటాలలో పొందుపరిచారు. ఈ సంపుటాలలో అదొక ఆకర్షణ.

ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. మొదటిసారి నా చిన్నతనంలో చదివినప్పుడు కలిగిన త్రిల్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత 'సాక్షి' వ్యాసాలను చదువుతున్నప్పుడు కలిగింది. అదంతా పానుగంటి వారి శైలి మహత్యం. ఆ త్రిల్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే మీరూ ఈ వ్యాసాలను ఆమూలాగ్రం చదవండి.

21-03-2006

విజయవాడ.

నండూరి రామమోహనరావు

"https://te.wikisource.org/w/index.php?title=సాక్షి&oldid=380201" నుండి వెలికితీశారు