సాక్షి మూడవ సంపుటం/గానకళ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

25. గానకళ

జంఘాలశాస్త్రి, ఏమీ తోచకుండా వుంటే, ఒకనాడు పిచ్చివాణ్ణి చూడబోయాడు. అలా తనకు అనిపించడం కూడా ఒక మానవ సహజగుణం అంటాడు. ప్రకృతిగతికి భిన్నమైనది మనల్ని ఆకర్షిస్తుందంటాడు.

ఈ పిచ్చివాణ్ణి రాజమండ్రిలో జంఘాలశాస్త్రీ కలుసు కున్నాడు. పేరు కొంపెల్ల రామభట్టుగారు. ఆయన్ని యోగి అని చెపుతారట జనం.

జంఘాలుడు ఆయనతో మాటలాడి, ఆయన వెర్రి ధోరణిని నెమ్మదిగా మరలించుకొని వచ్చి-ఉపన్యాస ధోరణిలో పెట్టాడు.

ఆ పిచ్చి మనిషి మాట్లాడడం సాగించాడు. మన సిద్ధాంత ప్రకారం ఉన్న దొక్కటేురసం. అది శృంగారం. అదే అవస్థా భేదం వల్ల కరుణగా, భక్తిగా మారింది. సృష్టిలో వేదాలతోపాటే కాదు, అంతకుముందే పుట్టిన కళ గానం. ఇదే లలితకళలన్నింటలో ఉత్తమం. మొదట రసం భక్తి. మొదటి కళ గానం. భక్తిపూర్ణమైన దేవతాగానంలో గానం. భక్తిపూర్ణమైన దేవతాగానంలో అక్షరాలక్కరలేదు. ఋక్కులకంటె, అక్షరాలేవీ లేని 'కూత’ ముందు పుట్టింది. కోయిలపాటలో, రాగాలాపనలో, అక్షరాలు లేవే! గానకళ అత్యంత స్వతంత్రకళ. మనవాళ్లు అక్షరాల సాయమిచ్చి సార్థకమూ, విశాలమూ చేశారు. తొలిసారస్వతమంతా గానమే. గానకళే ప్రథమ గణ్యం. దానికి రవ్వంత తోడుగా మాత్రమే కవిత్వం ఉండదగినది. ఒక్క గానానికే ప్రత్యేక ’కళాత్వం' గాని, కవిత్వానికి కాదు. చిత్రలేఖనం కృత్రిమం. గానకళ ప్రత్యేకంగా పరమాత్మతో సంబంధించిన కళ.

ఇలా మాట్లాడి మాట్లాడి పిచ్చివాడు హఠాత్తుగా పరవశంలోపడి నందకుమారా! నవనీతచోరా అంటూ, కృష్ణకీర్తనం చేసి పడిపోయాడు—అని జంఘాలశాస్తి ముగించాడు.

జంఘాలశాస్తి యిట్టు పలికెను:-

నాయనలారా! ఏమియుఁ, దోపక పోవుటచేత వినోదము కొఱకుఁ బిచ్చివానిఁ జూడ బోయితిని. చూచితిరా! మనుజప్రకృతి యెట్లున్నదో! స్వభావసిద్దముగ నున్నవానిని జూడ మనకు వేడుకగా నుండదు. స్వభావములోనో, స్వరూపములోనో, యొక్కడనో రవంత వ్యత్యాసము కాసంత తెటుకు నున్న గాని మన కక్కడకు మనస్సు పోదు. ప్రకృతిగతి భిన్నమైన దేదియైనసరే మనల నాకర్షింపక తప్పదు.

గీ. చిన్నబొట్టున్న వాని వీక్షింప రెవరు
పెద్దబొట్టున్నవాని భావింత్రు జనులు
పిలుపంగనె పల్కు వానిని బెద్ద సేయు

రెంతకైనఁ బల్కనివాని నెంత్రు జనులు
తనువు గప్పినవానికి ఘనత లేదు
గోచిపాతయు దిసమొల గొప్ప యండ్రు

నెత్తివెండ్రుక లున్న నోరెత్త రెవరు
నేలవెండ్రుక లున్న గణింత్రు జనులు
ఇంటఁ గూర్చున్న వాని యోజింప రెవ్వ
రడవి మిడికెడువాని నాహా యటండ్రు

కాళ్లు తలక్రింద నుండుట ఘనత కాదు
కాళ్లు తలపైన నుండుట గౌరవంబు
చావపైఁబ్రక్క ఘనతకు సంజ్ఞకాదు

శంకుపర్యంక మతిగౌరవాంక మగును
నిండుకడుపును జనుల గణింపకుండ్రు
మండుకడుపును భావింత్రు మహిత మనుచు.

ఇట్లు మనవాడుకలలో, మన యలవాటులలో, వేషభాషలలో బుద్దిపూర్వకముగ మనము జేసికొన్న స్వల్పములైన మార్పులే జనులను మనవంక కాకర్షించుచుండ శక్తిస్వరూ పిణియగు ప్రకృతినుండి బయలువెడలిన యనేకాంధశక్తులయొక్క తొందరపాటులవలనం, దికమకలవలన, దేడాలవలన, గందరగోళములవలన, గంగవెర్రులవలన బ్రాణులలోఁ గలిగిన యస్వభావ సన్నివేశములు జనుల నెంతగాటముగ నాకర్షించునో చెప్పవలయునా? ఆడోరివానిఁ జూచుటకు మనకెంత యుత్సాహముగ నుండును? కొజ్ఞావానిఁ జూచుకుతూ హల మింతింతయా? మగచెంపల మానినికున్న యాకర్షణశక్తి దోరజామి ప్రాయంపుదొయ్య లికి లేదే! కవలదూడలను బెట్టినయావునే యందరు చూడవత్తురుకదా! మనుష్యులలో వేరే చెప్పనేల? చేతులులేక నోటితో నీరు కదకువానికి జనుల వలననే జీవనము జరిగిపోవుచు న్నది. గంగిరెద్దునకు మూపురము దిగువనున్న మూరెడుతోలే గంగి రెద్దువాని కడపరాల మిద్దెకు గారణమైనది. మరుగుజ్జువారి వక్రత్వమే వారి వడ్డివ్యాపారమునకుఁ బెట్టుబడియై నది. రెండుతలలరాకాసిపిండమే తండ్రిని లక్షాధికారిఁ జేసినది.

ఇవియన్నియు బాహ్యవికృతులు. వీని యాకర్షణమే యింతగా నున్నప్పడు అంతర వికృతులమాట వేరే చెప్పవలయునా? పుట్టుక తోడనే కొన్ని మనస్సులు స్వభావవిరుద్దముగ నుండును. అనేక కారణములచేతఁ దరువాతఁ గొన్ని స్వభావ విరుద్దములుగనగును. వీనిలో భేదము లనేకము లున్నవి. వీనిచింత యిప్పడు మన కక్కఱలేదు. మతిలేనివానితోఁ గూడనున్న మనుజసంఘము మహారాజునకు లేదు. ఆతండొక్క యాస్థానమునకే యధికారి. ఈతఁడు నర్వప్రపంచమునకుఁ బ్రభువు. ఆతనికిఁ గొలఁదియైన రాబడి యే కాని, యీతనిధనమునకు హద్దు లేదు. ఆతని కనేక కారణములవలన విచారము, ఈతని కెప్పడో కాని విచారము కలిగినను జిత్తజల్లుగ వచ్చి వెంటనే పోవును. ఉత్తరకణము ననే భావప్రపంచమునం దిరుగాడుచు నాడుచుఁ బాడుచు నెగురుచుఁ బరుగెత్తుచు నాతం డుండును.

నేనొకసారి రాజమహేంద్రవరమున కొంపెల్ల రామభట్టు గారిని జూచితిని. ఆయన యోగి యని చెప్పిరి. నా కాసంగతి తెలియదు. కాని యున్నత్తుఁడు. ఆతడాజాను బాహుఁడు. స్టూలకాయుడు. రోమశుడు. కౌపీనమాత్రధారి. నిత్యమందహాస వికసితవదనుఁడు. ఆతనిమందహాసముననున్న సౌందర్యమును నే నెక్కడను జూచియుండ లేదు. అదియేమో కాని యప్రాపంచిక తేజస్సుతోఁ బ్రకాశించె నని నా నమ్మకము. చిరునవ్వు నవ్వునప్పడు ధ్వనియన్నమాట లేదు. పెదవులు కదలకుండ బిగించుకొనియుండెడివాఁడు కాడు. పై పెదవియు నడుగు పెదవియు నరయంగుళము వెడల్పుగ వేరుచేసి వింతగ, విలక్షణముగ, నప్రయత్నముగ, నాశ్చర్యకరముగ పువ్వు వికసించునట్టు మొగమంతయు వికసింపఁ జేసెడివాఁడు. ఇట్టు మొగమునుండి బయలుదేరిన యలెకికకాంతి గుండ్రముగ మొగముచుట్టు వ్యాపించి చంద్రునిచుట్టు పరివేష్టమువలె నుండెనని చెప్పిన నతిశయోక్తికాదు. చిన్నచిన్న గులకరాలు, బొమ్మరాలు గ్రహించుచు విసర్జించుచుఁ దనలోదా నేదో మాటలాడు కొనుచు నా నందమయుఁడై యుండెడివాఁడు. ఏచక్రవర్తి కీయానందము సుఖము నున్నవి! సుఖమొందుటకు మతి పోగొట్టుకొనుటకంటె మార్గాంతరము గోచరించుటలే దని నాలో నేమో తెలివితక్కువగ భావించుకొనుచు బిచ్చవానియొద్ద కేగితిని.

పిచ్చివాఁడు నన్ను జూచుటతోడనే నమస్తే యని కేకవైచెను. నీవు వచ్చెదవని యనుకొనుచునే యున్నాను. ద్రౌపదీవస్త్రాపహరణము ప్రక్కసందులో రాత్రి యాడినారు. డాక్టరుగారు నన్నుగూడ నాటకములోనికిఁ దీసికొని వెళ్లినారు. ధృతరాష్టసభ జరుగుచున్నది. పాండవులోడిపోయి ఖిన్నులై కూరుచుండినారు. దుర్యోధనుడు మీసాలు వడివేసి సకిలించుచున్నాఁడు. దుశ్శాసనుఁడు ద్రౌపదిచీర లొలుచుచున్నాఁడు. ఎంతమట్టునకు లాగవలయునో దుశ్శాసనునికిఁ దెలియదు. ఎంతమట్టుకు లాగించుకొనవలయునో ద్రౌపదికిఁ దెలియదు. ఇద్దరుకూడ చెడద్రాగి యున్నారు. వద్దు వద్దని తెరచాటునుండి కేకలు వినఁడుచునే యున్నవి. తుట్టతుదకు రైకతో నెత్తిపై సవరపుబుట్టతో నడుమునకు గావంచతో సృష్టికంతకు నొక్కటే దిష్టిపిడతగ ద్రౌపది మిగిలినది. దుర్యోధనాదుల తోడు లేకుండనే జాత్యంధుడైన ధృతరాష్ట్రడుగూడ రెప్పపాటులోఁ దెఱచాటునకుఁ బరుగెత్తినాఁడు. తెర వేయబోవఁగ బడలేదు. అప్పడు ద్రౌపది లోనికిఁబోయినయెడల నధికారి కొట్టునని భయముచేత గాఁబోలు బెద్దమనుష్యులు గూరుచుండిన గోతిలో నురికి బ్రచ్చన్నత కొఱకో, పురుషులు కొట్టుదురను భయముచేతనో, స్త్రీలకు బ్రత్యేకించిన స్థలములో దాగినాఁడు. స్త్రీలు పాక కాలిపోయినంతకేకలు వేసి యటునిటు పారిపోవ యత్నించిరి. కొందఱు పురుషులు స్త్రీలస్థలములోనికి వచ్చి ద్రౌపదిని జావంగొట్టి గెంటివైచిరి." ఇట్లు పలికి యాతండు. లోనికిఁ బోవుటకు సిద్దపడినాఁడు. అది చూచి నే నాతని కడ్డుదగిలి 'అయ్యా యుపన్యాసమీయరా" యని తొందరపెట్టితి. "నీకుఁ బిచ్చి యాసుపత్రివదలి వెళ్లుటకు బైవారి యనుమతి వచ్చినదా యని యడుగ' నింకఁ గొన్నాళ్లిక్కడనే యుండుమన్నారు. పైవాఁడెవడు? క్రిందివాఁడెవఁడు? అందఱును దొంగ ముండకొడుకులే. ప్రపంచమునకం తకు మతిలేదని నేను గనిపెట్టి వెల్లడించుట యేమి? నాకు మతిలేదని వీరు నన్నిక్కడ బంధించుట యేమి? శ్రీకృష్ణభగవానుఁ డేమనినాఁడు.

యా నిశాసర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః

నేను వెల్లులోనున్నాను. ప్రపంచమంతయుఁ జీఁకటిలో నున్నది. నావెలుఁగు వారికిఁ జీఁకటి. వారివెలుగు నాకుఁ జీఁకటి. కాని నాకు బాధ, వారికి సుఖము.

గీ. వీరవరుకంఠ మునం దరవారికోత
భీరుగశమున విజయమందారమాల
శేముషీమంతు పెప్టెలోఁ జెదలుపుట్ట
వాలుతలవాని మొులను బత్రాలకట్టు.

విద్యావంతుల కెప్పడు విద్యావిహీనులచేత, జ్ఞానవంతుల కెప్పడులచేత, నర్హుల కెప్ప డనర్డులచేత బాధతప్పదు. ప్రపంచ చరిత్రములో మొదటిపంక్తిలోనున్న యీపాఠమే యిప్పటికి తుదిపంక్తిలో నున్నది. Socrates కేమయినది. విద్యాదూరులనోటికి విందు, పాత్ర విజ్ఞల నోటికి విషపాత్ర, పాపాత్ముల కడుగడుగునకు మెత్తనిమడుగు. పవిత్రాత్మునకు సంధిసంధికి కొరతమేకు. గజం మిథ్య పలాయనం మిథ్య యని పారిపోయినను నేనుగు కాలిక్రిందఁ ద్రొక్కింపక మానుదురా?

అయ్యా అయ్యా నీవు చెప్పచున్నది నాకేమియు బాగుగా లేదు. మనస్సున కేమియుఁ దోపకపోవుటచేత వినోదమునకై నీయొద్దకు వచ్చితిని. ఏదైనసరే యుపన్యాసమొకటి యిమ్మని యాతనిఁ దొందరపెట్టితిని. నా ధోరణికి నీవడ్డు రాకుండనుందువా? అది ముందు చెప్పమని యాతడు నన్నడిగెను. సాధ్యమయినంతవఱ కట్టె యని నే నంటిని.

సరే విను. హరిఃఓమ్ ప్రపంచమం దున్నది యేకత్వమే గాని ద్వివిధత్వము కాదు. ఏదియున్నను నొక్కటియే యున్నదికాని యిన్ని లేవు. రెండునునది మనము తరువాత కల్పించుకొన్నదికాని స్వయముగా లేదు. నాషడ్డకుడు నాయంతవాడు సుమాEconomical depression (ధనలోపము) దేశమునకుఁ గలిగిన తరువాతనే సానివీధిలో Commission agency (పొసగుడు వ్యాపారము) పెట్టిసానిదానియింటిలోనే నేరాత్రియైన సరసుడు లేఁడన్న యప్రతిష్టమాట లేకుండఁజేసినాఁడు. సానివాండ్రను దేల్చినాడు. తాను దేలినాఁడు. వహవ్వా అట్టుభయతారకముగ.

తప్పదారినిఁ బోవుచున్నావని నేనతని మందలింపగ నేను జెప్పను పోపో యని యాతండు కేకవైచెను. ఈమాత్రము కూడ నుండదేమోయని భయపడి సరే నీయిష్టమువచ్చి నట్టు కానిమ్మని బతిమాలితిని. నన్నడ్డకుము, జాగ్రత్తగనే మాటలాడుదును. ఏదో యొక ప్రణాళిక చేసి కొంటిని. ఆదారిని నన్నుఁ బోనిమ్ము సరే యెంతవఱకుఁ జెప్పితిని అని యాతండు నన్నడిగెను. సానివీథిని సరసుడు లేడన్న మాట లేకుండజేసి సరే సరే ఇంక జెప్పనక్కఱలేదు. ఈ నడుమను దురకపేటలో మంగలివానిమేడలో జరిగిన యఖిలాంధ్రక ళావతి పరిషత్తులో మాషడ్డకుఁ డధ్యక్షుడై యేమని యుపన్యసించె ననఁగా:-

ప్రపంచమున నున్న దొక్కటే రసము. అది శృంగారరసము. భవభూతి యది కరుణ రస మనుగాక! ధూ!

“భవభూతి సాహితీప్రజ్ఞాప్రభాయుక్తుండా మాటమాయొద్దననఁగరాదు"

అందుచేత స్వయంప్రకాశులైన మన పరిషత్తులో సారస్వతపండితునకుఁ దావులేదు. ఆతని నావలి కీడ్చివేయవలసినదే. మన సిద్దాంత ప్రకారమున్న దొక్క శృంగారరసమే. ఆరసమే పరిస్థితి విభేదములఁ బట్టి వీరరసమగుచున్నది. అన్నియు యథావిధిగా జరుగుచు న్నంతసేపు శృంగార రసము నిప్ర్చమాదముగ బ్రవహించుచుండును. మన ముంచుకొన్న సానివారి చక్కని చుక్కయొద్ద నెవఁడైన పైసరసుఁడు మనకంటఁబడినాఁడనఁగ శృంగారరస మునకుఁ దొట్రుపాటు. పరిణామావస్థ కలిగినదా లేదా? మనము గొడుగుకామతోను వాడు పై జారుతోను దారసిల్లినప్ప డరగంట క్రిందటి శృంగారరసమే వీరరసమైనదా లేదా? అంతేకాని ఇంతలో స్వర్గమునుండి వీరరసము దిగినదా? తప్ప. మనము వాడు కొంతసేపు గుంజులాడిన పిదప వాడు మన క్రిందఁ బడఁద్రౌక్కగ మన మలో యని యేడ్చితిమా లేదా? నిముసము క్రిందట వీరరసముగా మారిన శృంగార రసమే యిప్పడు కరుణరనముగా మారినదా లేదా? మeటికొంతసేపైన తరువాత సానివారి మణిపూస మనయోుద్దకు దీండ్రించు చువచ్చి నాయింటి కెవ్వడైన పెద్దమనుష్యుడు బందుమర్యాదచే వచ్చినప్పడు నీవింతయల్లరి చేయుదువా? పో యని మనపైఁ గోపపడఁగ దాని దయకొఱకు “అకించనో నన్యగతిశ్శరణ్య స్త్వత్పాదమూలం శరణం ప్రపద్యే' యని బట్టమెడ జట్టుకొని మనము దానికాళులపై బడినప్పడు వెనుకటి శృంగార రసమే యిప్పడు దివ్యమైన భక్తిరసముగా మారలేదా? అందుచేనున్న దొక్క శృంగారరసమే శాస్త్రీజీ ఈ గొడవ యంతయు నే నెందులకుఁ జెప్పితినో జ్ఞప్తియున్నదా? నే నెట్టుపన్యాస మారంభించితినో చెప్పఁ గలవా?" యని యాతడు న న్నడిగినాడు.

ప్రపంచములో నేకత్వమే కాని ద్వివిధత్వము లేదని యుపపాదించి నావు. దానిని స్థిరపఱచుకొనుటకు మీషడ్డకుని శృంగార రసైక్య ప్రవచనమును చేసినావు. అని నే నతనికి జ్ఞప్తిచేసితిని. -

సరి సరి. ఇంక దారిలోఁ బడినాను. తొందరలేదు. మాషడ్డకుని శృంగారరసవిషయకో పన్యాసమున కలరి యాతనిని మా బంధువులలో బ్రహ్మ రథము పట్టినారు. నేను నట్టి యైక్యమునే మeజీయొక సన్నివేశమున స్థాపింప దలచినాను.

నీకు నీతండ్రికి వస్తుతత్త్వమున నేమైన భేదమున్నదా? లేదు. లేనప్పడు నీతండ్రికి నీవు మ్రొక్కవలసినదని జనులేల యనుచున్నారు? నీకుఁ గారకుడగుటచేతనే కాదా? అట్టిచో నీవంటి మనుష్యులను నితర జీవములను, ననంతగోళములను సృష్టించిన భగవంతు నెడల నీవు చేతులు జోడించి మ్రొక్కి భక్తిగనుపఱుపవలసినదేనా? అట్టుచేయుచున్నావా? సోదర సోదరీమణుల ద్యజించుచున్నామే. గురువులను ధిక్కరించు చున్నామే. తల్లిదండ్రు లను తిట్టుచున్నామే. ఇన్ని దుర్గుణములు మనకుండ దైవభక్తికలుగునా? ఏమియును లేదు. ఇక మనబ్రతుకు లెందులకు? కడుపునిండించుకొనుటకు, కైపుకలుగునట్టు త్రాగుటకు, కఱవునకుఁ జచ్చి నంతమంది నిర్బాగ్యులను గనుటకు, అంతేనా?

మన పూర్వులే కాదా సృష్టి చిత్ర్యమునకు వింతపడి సృష్టిక్రమమును బరిశీలించి సృష్టినంతయు నిండిన యద్వితీయశక్తికి భక్తివినమ్రులైవేదబుక్కులతో దేవతాగాన మొనర్చి నారు. అందుచే మొదటస్పష్ట్యవ లోకనమునఁ గలిగిన రసమేది? భక్తి ప్రపంచమున మొట్టమొదట వేదములతో బాపేకాదు. వేదములకంటెఁ గొంతముందుగాఁ బుట్టినకళ యేది? గానము. ఈ కళయే లలితకళ లన్నిటిలో నుత్తమమైనది. కవిత్వమే? ప్రపంచమున మొట్టమొదట బుట్టినకళ యని పాశ్చాత్యులేకాదు. పౌర్వాత్యులే కాదు. ప్రపంచజనుల యందఱ యభిప్రాయ ముయియున్నది. అది కేవలము తప్ప. సర్వప్రపంచముగూడ నాపై దిరుగఁబడి నను దోకచుక్క చేత బుచ్చుకొని తోపతోప క్రిందంగొట్టనియెడల -మూతిమీసము కదపా పచ్చిరొయ్యలు గోంగూరలో వేసినప్పటి మజా-

ఉండు. ఉండు నిదానించుకో తోకచుక్కమాట, గోంగూరమాట యిప్పడెందు లకు? శాంతింపు మని యాతనిని శాంతిపఱచితిమి. ఈతని పిచ్చిలో వెనుకటికి నిప్పటి కెంత వ్యత్యాసమున్నదో నా కాశ్చర్యముగ నున్నది. నిముసనిముసమునకుఁ బెడమార్గము సట్టి తిరుగ ద్వరలో దారికి రాలేని వాఁడింతమట్టునకు తాజపడుట గొప్ప సంగతి కాదా? అని లోన ననుకొంటుని.

ఒక్కనిముసమైన పిమ్మట నెంతవఱకు జెప్పితి నని యాతడు నన్నడిగెను. మొదటి రసము భక్తియని, మొదటికళ గానమని చెస్పితివి. తరువాతఁ జెప్పమని వేడితిని.

సరే. సరే. ఆశ్చర్యకరమైన సన్నివేశము మనము తిలకించునప్పడు దానిపై మనకు భక్తి గలిగినప్పడు నిప్ర్పయత్నముగ నబుద్దిపూర్వకముగ 'ఓ' యని ధ్వనికలుగునట్టు మనము నోరు తెఱతుము. వేదములకు ముందు ఓంకార ముద్బుద్దమైనదని మనపూర్వులు జెప్పిన దదియే కాని వారి ఓం, లో నక్షరము లున్నవి. నా, ఓమ్, ఇట్టినాదమే కాని యక్షర సహిత మెంతమాత్రము కాదు. నాదమును విని సంతసింపక యందులో నక్షరములున్నవని దానిన ముక్కల క్రిందఁ గొట్టనేల? ఉదయపర్వతముపై గెంపులసింహాసనముపై గెందామ రల కిరీటముతోఁ దలచూపుచున్న భానుబింబమును గాంచి మహానందభరితమై భక్తిపారవశ్య సహితమై భరతపక్షి గానముచేయుచున్నది గాదా! ఆగానములో నేయక రములున్నవో పరిశీలనయేల? ఏయకరములు లేవు. స్వరంసంఘాతము తప్ప యది మతేదియునుగాదు. షడ్డమస్వరము ముందుబుట్టిన తరువాత దానికి 'స' అనుగుర్తు వచ్చినదా? కాక అది పుట్టినప్పడే 'స' యను గుర్తు దానియందున్నదా? పిల్లవానికి వట్టిధ్వని ముందువచ్చినదా? కాక మాట ముందువచ్చినదా? భక్తిపూర్ణమైన దేవతాగానమం దకరము లక్కరలేదు. నీలాల నిగనిగలీనుచున్న నీరదమును గాంచి మహానందముగఁ గప్పకూసినకూఁతకు, వరుణదేవతా కములగు ఋక్కులకు, నంతఃకరణపరిశుద్దియందు భేద మున్నదని యెవ్వడైనా జెప్పగ లడా? కప్పకూఁతలో నకరములు లేవు. వేద ఋక్కనం దక్షరము లున్నవి. ఋక్కుల కంటె కూఁతయే ముందుఁబుట్టినదని నేననుచున్నాను. పండ్లండ దలంచుకొనినయెడల నీవు కాదనగలవా? అదికాక యక్షరసాహాయ్యము లేని గానము ప్రపంచమున నెంతలేదు? సంవత్సరమునకు నాల్గుమాసములు పాడిన కోయిలపాట నిరక్షరము కాదా? అదిగాక రాగాలాపన నిరక్షరము కాదా? రాగమువలన కలిగినయానందమున కీర్తనవలనఁ గలుగునా? గాయకులలోఁ బదుగుఱ నేయొక్కఁడో గాత్రజ్ఞఁడున్నాడు. కాని మిగిలినవారందఱు యంత్రజ్ఞలే కాదా? గానకళ యత్యంతస్వతంత్రమైన కళ. దానికి మనవా రకరములు సాయమిచ్చి సార్డముగ, విశాలముగ జేసినారు. మొదటఁబుట్టిన సారస్వతమంతయు గానమే. అప్పటివలకింక యూరుపేరు లేదు. మృదువులైన యక్షరములు, నభిప్రాయములు. గానధ్వనులలోఁ జేరుచున్నవి కాని వానికిఁ గవిత్వమని పేరులేదు. ఏదైన రవంత పేరున్నను నది గానమునకు సహాయకళగా నున్నదిగాని స్వతంత్రకళగా లేనేలేదు.

గానమున్నంతసేపు, భక్తియున్నంతసేపు కవితాకళకుస్వాతంత్ర్యమేర్పడదని వారి తరువాతవార లెంచి గానమనుండి దానిని తప్పించి, భక్తిని దీసిపారవైచి పరమాత్మభక్తికి వ్యతిరేకమైన ప్రాపంచకభభక్త్యాదులను రసనులుగా నేర్పఱచుకొని యైహికవిషయములందు మాత్రమే కవిత్వమును జెప్పి దానికి గళాస్వాతంత్ర్య మిచ్చుట కెన్నిపాటులైనఁ బడినారు. అంతటినుండి వేదగానము వదలి దానికి కవిత్వముబయలుదేరినది. రామాయణమును వ్రాసి వాల్మీకి దానిని రాముని యెదుట బాడించెనఁట. వాల్మీకి యెంతగడుసువాండో గానకళ మొదటికళ యని, కవిత్వము దానికి సహాయకళయని యంగీకరించుటకు వాల్మీకి యెంత మాత్రము నిష్టపడక గానమకంటె గవిత్వమే ముందని వెల్లడిజేయుట కిట్టు కవిత్వము చెప్పి పాడించినానని చెప్పినాడు. తెలిసినదా? కవిత్వము చెప్పి గానముచేయించుట కల్ల, పాడి పాడించెననుట పరమార్ధము.

తరువాత నన్నిరసములందు నన్ని రసహినవిషయములందుఁగూడ గవిత్వము విచ్చలవిడిగ బయలుదేరినది. కవిత్వముననే నిఘంటువులు, వైద్యశాస్త్రము, జ్యొతిషశా స్త్రము, పాకశాస్త్రము, సాముద్రికశాస్త్రము, నశ్వాది సమస్తశాస్త్రములు గూడఁ జెలరేగి బయలుదేరినవి. చిట్టచివరకు చరిత్రలు కథలు కూడ కవిత్వముననే బయలుదేరినవి. పంచాంగం మాత్రము పద్యములతో బయలుదేరలేదు. ఇట్టి దుస్థితిని బరిశీలించి భవబంధమో కణసాధనమగు గానమునకుఁ దిరుగ బ్రాధాన్య మిచ్చి పూర్వపవిత్రస్థితిని నిలువఁబెట్టఁ దలఁచి త్యాగరాజు, క్షేత్రయ్య, భక్తిరసమున భవతారకగాన మొనర్చిరి. అందువలన దుస్ల్పితి రవంత యడ్డినదేగాని యాగలేదు. గానమునకుఁ బతనము భ్రష్టమార్గమునఁ గవిత్వమునకు బుష్టి వృద్దియగుచునే యుండెను. "చేతులెత్తి మ్రొక్కుచుంటిరా నాతండ్రి" యను భక్తికీర్తనకుఁ బాఠాంతరముగ 'చెఱఁగు మాసియున్నదా నరా నాసామి" యని యవకతవక శృంగారరసకీర్తన బయలుదేరిన గానమునకు మొదట సహాయ కళగానున్న కవిత్వ మిట్టను చితమార్గముల నస్వభావముగ విజృంభించి యిప్పడు గానముల కంటె బలవత్తరముగ గానబడుచున్నది. కాని ఈబలము కృత్రిమము. గానకళయే ప్రథమమయినది. దానికి రవంతతోడుగనే కవిత్వముండదగినది. గానము వట్టిధ్వని కదా? అక్షరసాహాయ్యము లేనిదే అది యెట్లు శాశ్వతముగా నిల్చునవి నన్నధిక్షేపింతురా? ధూ! కళయగునా కాదా యనునదే పరిశీలనాంశము. కాని స్థిరమా యస్థిరమా యనునది కాదే. సృష్టిలో స్థిరమైన దొకటియు న్నదా? ఒకగానమునకే ప్రత్యేకకళాత్వము కాని కవిత్వమునకు గాదు, కవిత్వమే కళకానప్ప డింక జిత్రలేఖనమా? అది మఱింత కృత్రిమమైనది. కళ గానకళ యొక్కటియే. ప్రత్యేకముగాఁ బరమాత్మతో సంబంధించిన కళ. ఇప్పడన్నియుఁ గళలే. పంట యొకకళ. కల్లుగీత యొకకళ. దొంగ తన మొకకళ. క్షౌర మొకకళ. తుదకు “Murder is a fine art” (జీవహత్య యొక్క లలితకళ) వఱకు వచ్చినది.

కవీ! నీకొక్క శబ్దమయిన నీయను. కవిత్వముఁ జెప్పగలవా? ఏమనుచున్నావు? గట్టిగఁ జెప్పము? నావలనఁ గాదనుచున్నావా? అటులైన దూరముగఁ గూరుచుండుము. గాయకుడా! నీ కొక్క యక్షరమున నీయను. పాడఁగలవా? ఏమనుచున్నావు? అద్దేఅద్దే. అవలీలగ బాడంగల ననుచున్నావా? సరే పాడుదువుగాని ఒక్క నిముసముండుము అదేమి? అదేమి?

సీ. మెఱుఁగుఁగుండలముల మిసమిసల్ గండభా
గములపై నట్టిట్టు గంతులిడగ
రంగారఁగట్టిన బంగారుపుట్టంబు
చిఱుబొజ్జనుండి కొంచెముగ జార
బవనపూరణమున జవుజవ్వుమని లేఁత
చెక్కులు బూరెలై పూరటిల్ల
నిగనిగల్ గలగుజ్జ సిగనున్న శిఖిపింఛ
మొయ్యారమునఁ దలయూపుచుండ

నుత్తమోత్తమజన్మమై యొప్పమురళి
నధరమునఁబూనిజల్టల్లు మనఁగజగతి
గానమును జేయు నీలాల కాంతిరాశి
గొల్లభామలబంగారు కొంగు మూటు!

ఆహాహా! ఏమిగానము తీఁగలు పుష్పించుచున్నవి. రాలు ద్రవించుచున్నవి. ముక్కులు తెఱచుకొని పక్షులు విని పరవశము లగుచున్నవి. పశువులు మోరలెత్తి గానామ్పత మును ద్రావి సోలుచున్నవి. కదలిన యెడల నేమగునోయని గాలి స్తంభించియున్నది. లక్షలకొలది యింద్రధనుస్సులనుండి సుధావర్షము దేవతల పుష్పవృష్టితో గురియుచున్నది. నాయనా! నందకుమారా! నవనీతచోరా! యని కేకలు పెట్టి పెద్దపెట్టున నేడ్చుచు నా పిచ్చివాఁడు క్రిందపడినాఁడు.......

ఓహో! నాయనలారా! పిచ్చివాడు మనల నెట్టి పవిత్రసన్నివేశమున విడిచి తాను విస్మితుడైనాడు. ఆహాహా ఏమియేడు పేడ్చినాడు? ఇట్టియవసరమున నేడ్వలేనివాఁడీశ్వధ ద్రోహి. శారదాగానము కంటెఁ దుంబురునారదాది వైణికులగానము కంటె బిచ్చివానియేడ్పు నాతండ్రీ! నీ కెక్కువగాఁ బ్రీతికరముగా నుండును గదా! వెఱ్ఱబాగులవాని భక్తిరోదన మొక్కటి, తల్లిచావుపిల్లకు ద్రోదన మొక్కటి, పదునాల్గు భువనములను బునాదులతో గూడ నల్లలాడింప సమర్ధములైనవి. కృష్ణా! ఆపదుద్దారకా! రక్షింపుము.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.