Jump to content

సాక్షి మూడవ సంపుటం/పిచ్చివాని మరణశాసనము

వికీసోర్స్ నుండి

26. పిచ్చివాని మరణశాసనము

మధ్య పిచ్చివాడికి జబ్బు చేసిందని తెలిసి జంఘాలశాస్త్రీ చూడడానికి ఆస్పత్రికి వెళ్లాడు. పిచ్చివాడు, జంఘాలుణ్ణి చూడగానే సంతోషించి తాను మరణ శాసనం వ్రాశాననీ, అతన్ని సాక్షి సంతకం చెయ్యమనీ, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాననీ చెప్పి, లోపలకి వెళ్ళి కొన్ని కాగితాల దొత్తి తెచ్చి చూపించాడు. అతను వ్రాసిందేమిటో చదవకుండా తాను సాక్షి సంతకం పెడతాననీ ఎలా అనుకున్నావనీ, చదవమనీ, జంఘాలుడు, పిచ్చివాణ్ణి కోరాడు. దానిమీద, పిచ్చివాడు విసుక్కుని జమీందార్లంతా సంతకాలు పెట్టవలసిన కాగితాలన్నీ చదివే పెడుతున్నారా? అని గద్దించి నేను చదివేది ఇందులోదే చదువుతున్నానని నమ్మరేమిటని అడిగాడు. ఎప్పడో ఒకప్పడు నమ్మక తప్పదు గనుక, చదవకముందే నమ్మమనీ అడిగాడు. తనకి శనిదశ వచ్చింది కనుక మరణ శాసనం రాశానని చెప్పాడు. హరిః ఓమ్" అని కాకుండా "ఖర్మఃఓమ్" అని మరణ శాసనం చదవడానికి ఉపక్రమించి గాడిదకి, కవికీ, విష్ణువుకి వున్న సంబంధం పురస్కరించుకుని తను "ఖర్మః ఓమ్" అని చదువుతానన్నాడు. తనింక పదిహేనేళ్లు మించి బతకడని తెలిసి, మరణ శాసనం రాశానన్నాడు. గురువు, శిష్యుడు, అశాశ్వతం అని తెలిసినా, జ్ఞానం శాశ్వతం గనక ఇలా శాసనం' రాశానని చెప్పాడు. ఈ శాసనంలో మూడు అంశాలు మూలాధారాలుగా వున్నాయి. ఒకట ఎవరైనా నిన్ను పిచ్చివాడంటే, అన్నవాడికే పిచ్చి అని నమ్ము. రెండు సాధ్యమైనంతగా నీ భటులతో పోరాడు. నువ్వు మహారాజు వనినమ్ము. మూడు! అలౌకికానందం నీ జన్మధనం - ఇవి మూడు సూత్రాలు - ఇవి చెప్పి పోతన్నగారి పద్యం స్మరించుకుంటూండగా – డాక్టరొస్తున్నట్టు తెలియడం వల్లా, శాస్త్రి అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను:-

ఈనడుమఁ బిచ్చివానికి జబ్బుచేసిన దని తెలియుటవలన నాతనిఁ జూడఁబోయితివి. నన్నుఁ జూచుటతోడనే చేటయంత మొగము చేసికొని వచ్చితివఁటయ్యాయని యాతఁడు కేకవైచి “వచ్చినప్పడు రాకుండినవాడువలెగాక రానప్పడు వచ్చియుండినవాడు వచ్చుటయే సిద్దించినయెడల నా వచ్చుటను వచ్చుటతో గుణించినంత వచ్చుట వచ్చునో కాదా అదియే Factorial Zero కాదా" యని యాతం డనెను. ‘ఇప్పడు నే నెందుల’ కని యాతని నడుగ నే నీనడుమను మరణశాసనమును వ్రాసితినిలే. దానిలో నీవు సాక్షి వ్రాలుచేయుదు వని నీరాక కొఱకు నిరీక్షించుచున్నారని చెప్పి తుఱ్ఱున లోపలికిఁబోయి నాల్గు కాగితములబొత్తి నొకదానిని దెచ్చెను. అదియటునిటు రెండుసారులు తిరుగవైచి దీని కొసను సంతకమును జేయుమని నన్ను గోరెను. విననిదే సంతక మెట్టు చేయును? చదువుమని హెచ్చరించితిని. సంతకము చేయుటకుఁ జదువెందులకోయి పూల్. ఒక్క రిద్దఱు తక్క జమీందార్లు పాలక ప్రధానుడు చదివియే సంతకము చేయుచున్నడా? దినమునకుఁ బదివేలో పదునాల్గువేలో సంతకము చేయవలసిన రష్యాచక్రవర్తిమాటు యేమి? నమ్మకము మీద ప్రపంచము దొరలిపోవుచున్నది. సరే నీయిష్టానుసారము చదివెద ననుకో. నే నిందులోనిదే చదువుచున్నామని నీవు నమ్మవలసినదే కాదా? ఎప్పడో యొకప్పడు నీవు నన్ను నమ్మక తప్పనే తప్పదు. అట్టియెడల చదువకముందే నమ్మరాదా?

“అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోస్తిన పరోనసుఖం సంశయాత్మనః"

అదిగాక నీకు విధేయుఁడనై వినిపించి నీ సంతకము గొనుటకు నేను నీ సేవకుడ ననుకొంటివా? పో! ఆవలికిఁ బో! నా ప్రధానగ్రంథము నీసంతకాని కుపోద్ఘాతముగఁ బఠింతునా. ఈ గ్రంథమును బంగాళాఖాతములోఁ బాఱవైచెదనుగాని, నే నట్టి నీచమైన పనిచేయుదునా?

శ్లో. అనా ఫ్రూతం పుష్పం కిసలయమనూనం కరరుహై, రనావిద్దం రత్నం! ఆహా! చూచితివా అది పట్టు. కాళిదాసుడు మంచి గడుసువాడు. ఏనుగమెలికవైచి పట్టినాడు. వహవ్వా శిరఃకంపనము రోమహర్షణమైన పట్టు.

గీ. తగిన కాలమందుఁ దగిన స్థలంబునం
దగిన రీతిఁ దగిన తరుణితగుల
వ్రేలుకుండలాల విద్వాంసుడైనను
గక్కుఱితిని బడక కదలిపోడు.

అంత గట్టివాఁడైన కాళిదాసుగూడ తన అభిజ్ఞానశాకుంతలములోఁ బెసరపప్పవలె జారినాఁడు. ఆతమాషా మఱియొకప్పడు చెప్పెదను. ఉత్తర రామచరిత్రలో సాక్షి కనఁబఱచిన యనౌచిత్యముకంటె నెక్కువ యనె"చిత్యము నట గనఁబఱతును.

ఎందుకయ్యా! ఈ మతిమాలిన గొడవ. మరణశాసనపు సంగతులు చెప్పమని నేను తొందరపెట్టితిని. మరణశాసనముకై నాకులేని తొందర నీ కెందులకోయి Dunce! పండితు డెవ్వఁడు బ్రతికియుండుట నీకిష్టము లేదా? “శ్లో, అతిక్రమ్య గ్రహాన్ సర్వాన్ నిహంతా పాపకృచ్చని” అన్నట్లు శనిదశ వచ్చుటచేత మరణశాసనము వ్రాసితిని. కాని యిందు గొంత కలతకొట్టున్నది కాని లేకపోలేదు. 'శరీరే రుర్ద భూతే వ్యాధిగ్రస్తే కళేబరే! యనియే కాదా మనపూర్వుల యభిప్రాయము. కావున నిట్లు యశాశ్వతత్వము శరీరమునకుఁ బుట్టినప్పటి నుండియునున్నదన్న మాటయే గాదా? అందుచేత బొడ్డుకోత, మరణ శాసనపు వ్రాఁత యొక్కసారి జరుగవలసియుండఁగ వ్యాధివచ్చినవఱకు మనవారేల యుపేక్షించుచున్నారు? రోగముతోనే కాని చావఁ గూడదా? భార్యకు విపరీతమైన.జబ్బు. భర్తయే రేయంబవళ్ళామె కుపచారము చేయుచుండెను. నిద్రహారములు లేక మొద్దువంటి భర్త చచ్చినాడు. చావునకు సిద్దమైన యిల్లాలు భర్తసాపిండపుగారెలతొ సంపూర్ణమైన సాపాటు. కొడుకునకు వెఱ్ఱికుక్క కఱచినది. తండ్రి టారున జచ్చినాడు. ఆత్మావైపుత్రనా మాసి యున్నది నిదర్శనమైకదా. నామాల సుద్దపట్టు మూత్రబంధమునకు మిగుల దురా కట్టు. వడహల సంప్రదాయము పురుషులలోఁ బదఖండనము, స్త్రీలలో శిరోముండనము. మండన మిశ్రుని భార్యతో వాదించుటకు శంకరాచార్యులకుఁ బరకాయప్రవేశము కావలసివ చ్చినది. కాని ఏది? మన మక్కడ నుండినయెడలఁ దమాషా కనఁబఱచి యుందుము. అడుదనంగా మనకు నల్లేరుమీఁద బండిగాదఁటోయి! ఓ గిరగిరగిరగిర గంపసిడి యాడిన ట్లాడనంటోయి.

ఏడ్చినట్లేయున్నది. ఈదిక్కుమాలిన గొడవయంతయు నెందులకు? మరణశాస నము "చదువుదువా" పోవుదునా యని కఠినముగా నడిగితిని.

అటులైన విను ఖరః ఓం ఖరఃఓం

అదేమి అదేమి ఖరఃఓం అనెదవేమి. అని నేను మొత్తుకొంటిని.

ఉండవోయి తొందరపడకు. 'శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవ దనం థ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే' యను విష్ణు బోధకమైన యీశ్లోకమును గాడిదెపరముగా నన్వయించిన వారెవ్వరో యెఱుఁగుదువా? మాగురువుగారు. గాడిదా! నీవును గవివిగావుగదా యన్నవాఁడు కవియేనా? అందుచేతఁ గవికి గాడిదకు నవినాభావసంబంధము న్నదని తేలుచున్నది. గాడిదె కావైపున విష్ణువుతో సంబంధమున్నది. ఈవైపునఁ గవితో సంబంధమున్నది. అందుచేత సృష్టికి మూలతత్త్వము గాడిదయే యని నిశ్చయింపక తప్పనట్టగపడుచున్నది. కావున హరిః ఓం అని ప్రారంభంచేయకుండ బరమార్ధజ్ఞానము గల నేను 'ఖరః ఓం' షని ప్రారంభించితిని? బుద్దుని కింత ఖ్యాతి యేల కలిగెను? అతని కాలమందున్న వేదాచారములను ఖండించుటచేత. అప్డే చిరకాల ప్రారంభపద్దతిని ఖండించి క్రొత్త త్రోవ సహేతుకముగాఁ ద్రొక్కినందులకుఁ గూడన యందువా లేదా? వితంతువివా హమున కున్న వైభవము, జనాకర్షణము పూర్వానారవివాహమునకు లేదు. బాపనకోమ టులు, మాలమాదిగ, చచ్చట జంగాలు కలసిచేసిన విందులో నున్న తేజస్సు పరిపాటిగ జరుగుచున్న యన్న సంతర్పణలో లేదు. ఎందుచేత పద్దతికి విరోధమగుటచేత, పద్దతి నియోగమనంగా నెఱుఁగుదువా? గోపరాజు రాముఁడు ప్రధానిగారు “చాలులే అంతటితోఁ గట్టిపెట్టుము. నీ వీనడుమ నింత బుద్దిహీనముగ మాటలాడలేదు. ఇంత క్రమశూన్యముగ మాటలాడుచుంటి వేల? ఇంతలో నిట్టు చెడుటకుఁ గారణమేమి?" అని నే నంటిని.

కారణ మెందులకోయి fool! కార్యమునకుఁ గారణ మెంతమాత్రమక్కఱలేదు తెలిసినదా? ప్రపంచసిద్దికంటె నెక్కువ కార్యము లేదు గదా! దీనికిఁ గారణమున్నదా? లేదు అంతవఱ కక్కఱలేదు. కుండయున్నది. దీనికిఁ గారణమున్దా? లేదు. మట్టియే కారణమందువా? మట్టికి కుండకు భేదమేమున్నది? " అదియేమి కుమ్మరివాఁడు ప్రధానకారణము కాదా యని" యడిగితిని. ఓరి fool కుమ్మరివాడు మాత్రము మట్టి కాదంటోయి! Dust thou art to dust returnest” అన్నమాట నెమరనకు దెచ్చుకో. అందుచేత గారణము మట్టియే. కార్యము మట్టియే. కార్యకారణ భేదమింక నెక్కడిది? ఇదే అద్వైతమునకుఁ బ్రాతిపదిక, ఉన్నదొక్కటి. కార్య మదియే కారణము నదియే. 'కాశీతలవాసినీ గంగా” అదే ప్రశ్నము నదేయుత్తరము కాదా? ఈ సందర్భమున మాకవిత్వము చిత్తగించినావా? ‘‘ ఏ యక్షరము మొదలింగ్లీషుభాషకు" అదే ప్రశ్న అదే యుత్తరము కాదా?

"నాకీ దిక్కుమాలిన సోదె యెందులకు? నేను బోయెదను" అని వసారాలోనికి వచ్చుసరికి నన్ను బావాబావా యని యెవ్వరో పిలిచినారు. అదరిపడి ప్రక్కనుజూడగ నాగదిలో నొకపిచ్చిది యున్నది, నీవు మాబావతో నేమిమాటలాడుచున్నావని గట్టిగ నన్ను గద్దించెను. అంతలోఁ బిచ్చివాఁడు నెత్తినోరుకొట్టుకొని నన్ను లోనికి రమ్మని సంజ్ఞచేసెను. ఇది యేమో యని పోయితిని. అప్పడు నన్నాతఁడు ' గట్టిగ మాటలాడకు నన్ను బావా యని పిలిచినదే మృత్యుదేవత. ఇది నన్నను దినము నాహ్వానించుచున్నది. ఇంక దేహము చాలింపక తప్పదని నిశ్చయ పలుచుకొని యీమరణ శాసనము వ్రాసితిని. నేను జదివెదను ఆగుము" అని యాతండు నన్ను బతిమాలెను. సరే చదువుమని నేనంటిని.

ఈశరీర మికఁ బదునైదు సంవత్సరముల కంటె నెక్కువకాలము నిల్చునది కాదని నిశ్చయించి నాలోకానుభవమంతయుఁ బ్రజకు బోధింపవలెనని దీనిని వ్రాసినాను. నే నశాశ్వతుడను. ప్రజలు కూడ నశాశ్వతులే. గురుం డశాశ్వతుడు. శిష్యు డశాశ్వతుఁడైన ప్పడే ప్రయత్న మెందులకని యధిక్షేపము కలదు. బోధిం పదలచిన జ్ఞానము శాశ్వతము కావున నే నట్టు చేయవలసి వచ్చినది.

1. మొదటిసూత్రము:- ఎవ్వడైన నీకుఁ బిచ్చి యని యన్న యెడల నట్టు నిన్నన్న వానికేపిచ్చియని నిశ్చయింపుము. నిన్ను వెఱ్ఱవైద్యశాలయందుంచుటకు వారు యత్నింపఁగ బోవుచుంటినని యెంచవలయును. వారెవ్వరైన నిన్ను జూడవచ్చిన యెడల వారి తెలివితక్కు వమాటలు, బుద్దిహీన చేష్టలు చూచి వినోదించి వారు పొందుచున్న దుర్గతి నీకు లేకుండా నిన్ను భగవంతుడు రక్షించినాఁడని యెంచుము. నీకున్న ప్రపంచజ్ఞానము నప్పడప్ప డుపన్యాసముల మూలమున వారికివెల్లడింపుము. నీవిట్టు జ్ఞానబోధము చేయుచుండినగాని ప్రపంచోద్దరణము దుర్ఘటము.

2. రెండవసూత్రము:- నీవు మహాసంపన్నుఁడవు. మహారాజవు. నీ కోటలోని సేవకులందఱు నీ కుపచారములు చేయుటకు నియమింపఁబడినవారే. నీ గదినూడ్చుటకు వచ్చిన సేవకుఁడు. నిన్ను మోసపుచ్చి యేదియో పట్టుకొని పోవునని యెంచుము. సౌఖశాయనికుఁడైన, యారోగ్యమును గను గొనుట నుదయముననే వచ్చిన వైద్యసేవకుడు నీయందలి యసూయచే నిన్నున్మత్తుని జేయుటకు వచ్చిననాఁడని నమ్ముము, వాడిచ్చిన మందును దీసికొనకము. గొంతుకలోఁ బోసినను దానిని దాచి వాడటునిటు చూచునప్పడు గుడ్డతో మూతు తుడుచుకొన్నట్టు నటించు యాగుడ్డలోఁ జప్పడు కాకుండ నుమి యుము. నీకాహారము దెచ్చిన భృత్యుడు సమయమును జూచి నీకు విషము పెట్టి నీరము దెచ్చిన భృత్యుఁడు సమయమును జూచి నీకు విషము పెట్టి నీ సంపదను హరించుటకు వచ్చినట్టు నిశ్చయింపుము. సందిగ్రవస్తువని నీకుఁ దోఁచిన దానిని వానినోటఁ బెట్టుము. లేకున్నయెడల నాహారమును విసర్జింపుము. ఎవ్వడైన నిన్ను నీభవన పుటావరణములో గాలికై భటుఁడు వినయపూర్వకముగఁ ద్రిప్పినయెడలఁ జమత్కారమునఁ గనుమొఱఁగి పైకిఁ బొమ్మ-నీకొఱ కెంత యాందోళన మందుదురో నీవు లేకుంటచే నీ భవన మెంత గగ్లోలై పోవునో నీవు వినోదముగఁ దెలిసికోవచ్చును. ఒకవేళ సేవకులు నిన్ను గొరడాతీసి కొని కొట్టుట సిద్దించునెడల ప్రజలు ప్రభువును నిరాకరించి తామే పరిపాలించుకొన ప్రయత్నించుట ప్రస్తుత కాలానుగుణమైన పరిస్థితి యని భావించి సాధ్యమైనంతవఆకు నీభటులతోఁ బోరాడుము. మనుజుని కాటునకు మందు లేకపోవుటచే నీవు వారిని కఱచుట కంటె నుపాయం లేదు. ఇక వా రెప్పడు నీజోలికి రారు. కాంతా ప్రశంసలో గరవెంత సుఖదాయకమో కలహ ప్రయత్నములో నది యంతదుఃఖ దాయకము. ఇదిగో రవంతసేపు చదువుమాని పూర్వసంగతి చెప్పదును.

వలదు వలదని నేను మందలించినను నాతడు మానక యిట్టు చెప్పెను. దంతక్షత నఖక్షతసంప్రదాయము మన శాస్త్రములోనిది. నేనొకనాడు చిన్నతనములో బైనరసపు బసందేదో పరిశీలింతమని పడుచు దాసియింటికి బోయితిని. అచ్చట గుమ్మములో వేంచేసియున్న వేశ్యా మాతను జూచి సాష్ట్రాంగ మాచరించి -

పదము.
చేతిలోనిగజ్జ యూతోయి నా దేవి
నడుముచుట్టు గోనెపాత
మాతలందఱలోను మాతోయినారాణి
అడ్డునడకను గారుపీత.

అని ధ్యానించినది. ఆమె ప్రసన్నురాలై సరసానికి వచ్చితివా తండ్రీ! ఏదీ చేతిలో నొకకాసు పడవేయవోయి యని సెలవిచ్చినది. అది నాయొద్ద లేదంటని. పోనీలే. అందఱు నీయఁగలుగువారే యుందురా' అని" ప్రక్కచీకటికొట్టులో మంచముమీద నామనుమరాలు పండుకొన్నది. అది సరిక్రొత్త కుఱ్ఱది. మొన్నను సూర్యగ్రహణము నందు మంచి బింకమైన పట్టులో నది వెళ్లబడినది. అది భయమున నటునిటు పాఱికిపోకుండ గట్టిగఁ గౌఁగలించుకొని సుఖపడు బాబా' యని నన్ను బ్రేమమున హెచ్చరించెను. అంత గదిలోనికిఁ బోయి గట్టిగా గౌగలించుకొంటిని. బొయ్యిమని యఱచి నులకమంచముమీఁది కుక్క నాగొంతుక పట్టుకొనెను. ఏడ్చుచు గిజగిజ కొట్టుకొనుచుండగా చీచీయని యఱచుచు, వేశ్యమాత లోనికి వచ్చి కుక్కను గొట్టదలచి కాబోలు నావీపుపై గఱ్ఱపుచ్చుకొని కొట్టెను, పెద్దగోలయయ్యేను. చుట్టుపట్టులవారు లేచివచ్చి కుక్కను విడపించి నేను దొంగనని నన్ను బట్టుకొని కొట్టిరి. వేశ్యమాత పాతచీరగుడ్డ ఆరణాలు విలువగలదానిని హరించుటకు వచ్చినానని నాపై నేరము మోపిరి. మైత్రిలోను కరువు మంచిదే, వైరములోను కరువు మంచిదే యని చెప్పితినే అది యిది, ఎట్టయిననేమి, అప్పటినుండి యాడు దనంగా గడగడ. భూశయనము.

సరే గొప్ప ప్రయోజకుడవే. కాని యిక సోదె కట్టిపెట్టి మరణ శాసనమను జదువుమని నే నంటిని. ఇదివఱ కెన్నిసూత్రములు చెప్పితినని యాతఁ డడుగఁగా రెండు చెప్పితివి.

3. సరేమూడవ సూత్రము-నీతత్త్వమేదో యెఱుంగక నిన్నులోకులు గేలిసేయు దురు. నీతత్త్వ మేదో నీకుగూడ బాగుగాఁ దెలియదు. కావున నేను జెప్పదను. నీవులోకులవలె బామరుఁడవు కావు. గుడుగుడుగుంచము లాడుచు లొడితెడగు బాహ్యప్ర కృతిలో మిడుకువాఁడవు కావు. నీవు జగత్పూజ్యడవు లోకాతీతుడవు. ఐహికపుదేవులాట నీకేమియులేదు. ఏదిపోయినను నీయానందము నీ జన్మధనమైయున్నది. పంచభూతములు స్వస్వరూపములతో నీకుఁ బ్రత్యక్ష ములగుదురు గదా! ముక్కోటిదేవతలు కింకరులవలె నీ చుట్టుచుట్టు తిరుగుచుందురు గదా! అప్సరస్త్ర్సీల యాటపాటలతో మైమఱచి యుందు వుగదా!

కాలేన పంచత్వమితేషు కృత్స్నతో
లోకేషు పాలేషు చ సర్వజంతుషు
తమస్తదాసీర్గహనం గభీరం
అన్తస్యపారేభి విరాజతే విభుః"

అని వ్యాసుఁ డన్నట్టు,

క. లోకంబులు లోకేశులు
లోకస్టులు దెగినపిదప నలోకంబగు పెం
జీఁకటికవ్వల సతతము
నేకాకృతి వెల్గునతని నే సేవింతున్.

అని పోతరాజుగారు జెప్పినట్లు 'ఏకాకృతి వెల్గునతని" నీవెప్పడు సేవింతువు. నీ కింక మోక్షమున కడ్డేమి? కవికందని, భక్తునికందని, జ్ఞానికందని యాపదవిని నీవు సులభముగా..............

ఎవఁడురా అక్కడ డాక్టరుగారు వచ్చుచున్నారు. పో ఆవలికిబో అని పెద్దకేక లోనుండి వినఁ బడినది. వెంటనే పిచ్చివానిని విడిచి పోయితిని.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః