Jump to content

సాక్షి మూడవ సంపుటం/సుఖము, దుఃఖము

వికీసోర్స్ నుండి

27. సుఖము, దుఃఖము

ప్రపంచంలో సుఖదుఃఖాల తీరు ఎటువంటివో విచారణ చేయడంకోసం వివరంగా చేసిన ప్రసంగం ఇది.

ప్రపంచంలో వేదాంతులంటూ ఎంతమంది వుంటారు? ఒక్క చేతి మీద లెక్కపెట్టినా అయిదువేళ్లూ పూర్తికావు. మిగిలిన వాళ్లంతా మొండితనంతో బతకవలసిందేనా?

హరిశ్చంద్రుడు, రామచంద్రుడు, పడిన కష్టాలకు లెక్కవుందా?అయితే పట్టాభిషిక్తు లయ్యారుకదా! అంటే, వారుపడిన మనోవేదన ముందు ఈసుఖం ఏపాటుది? బతికినన్నాళ్లూ పధ్నాలుగు బతుకులకు సరిపోయే ఏడుపుఏడిచి ప్రాణంపోయేవేళకి భగవత్కటాక్షం కలిగి బాగుపడ్డామని చెప్పిన మహాపురుషులంతా పెరిగిన వెలుగుమాత్రం ఏమంత దొడ్డది?

సుఖపడాలంటే, మొండివాడైనా కావాలి. వేదాంతి అయినాకావాలి. ప్రపంచంలో సుఖం సంపాదించే ధనం, సంసారం, వస్తుసామగ్రి లేకపోతే ఎంతకష్టమో మరీ ఎక్కువుంటే కూడా కష్టమే. సదానందయోగి చెప్పిన ఒకతత్త్వాన్ని బట్టి చూస్తే ప్రకృతిస్థితి, మధ్యమార్గంలో నడుస్తున్నంతసేపే మనిషికి సుఖం. బాహ్యప్రకృతికంటె ఆశ్చర్యకరమైన ఆంతరప్రకృతిలో సైతం-కష్టసుఖాలకు సంబంధించినంత వరకూ-బాహ్యప్రకృతి సూత్రాలేవర్తిస్తాయి. సుఖం, బాధ అనేవి ప్రకృతిస్థితులుగాని, స్వతంత్ర తత్త్వాలుకావు. ఒక ప్రకృతి సన్నివేశానికి ఈచివరకష్టం. ఆచివరకష్టం. నడుమ సుఖం. ఈ తత్త్వాన్ని వివరించడానికి ఒక పేద బ్రాహ్మడికథ చెప్పాడు. హఠాత్తుగా 'లాటరీలో డబ్బురావడంతోపాటు, పెరిగిన దుఃఖతత్త్వం ఇందులోసారం.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

అంతకుఁబూర్వ మేమిచెప్పెనో కాని నేను వెళ్లిన పిమ్మట నిట్టు చెప్పెను.

జాలిగుండెవాఁడు జను లేమియందురొ
యనుచు భీతిఁజెందు నట్టివాఁడు
బిడియమునకు గొంకి వెనుకాడువాడును
ధరణిలోన నెపుడు దక్కలేరు

పరుగులిడుచుండం గ్రిందనుబడియుం గెరలి
మొండిత్రోపుగ ముందుకుఁ బోవువాఁడు
తన్నొకడు గొట్టం బదుగురు దాను మంచి
చెట్టఁగాంచ కెవ్వరినైనఁ గొట్టువాఁడు
నేడ్చుచునె పెండ్లివిం దారగించువాఁడు
స్వార్థమే పరమార్ధమై యలరువాఁడు
బ్రదుకఁదగినవాఁ డీప్రపంచమందు
సౌఖ్యవజ్జీవు లిద్దతే జగతియందు
మొండియొకఁడు వేదాంతియొకండుసుమ్ము
నడిమివారల బ్రదుకు వినాశకరము
గడియగడియకు మృతికంటె ఘనతరంబు.

కవి చెప్పినయినామాటలు బాగున్నవా? సుఖాపేక్షకు లందఱు Rowides కమ్మని యుపదేశించినడే. ప్రపంచమున వేదాంతులెంద ఱుందురు? ఒక్కచేతివ్రేళ్లయిన నన్నియు వంగవే మిగిలినవారందఱు మొండితన మవలంబింప వలసినదేనా? ఏమో! ప్రపంచతత్త్వమదియే యేమో, యెవరు చెప్పఁగలరు? సరియైన ప్రవర్తనకు న్యాయమైన ఫలమెవ్వరికైనఁ గలిగినదా? కలుగుచున్నదా? బిన్ మిల్లా యని కట్టబుచ్చుకొని లేవలేనిబక్కపాదూషాకు నల్గురు భార్యలు, పణ్యకాంత కొసరునా? నీతిసత్యసంరక్షణకై శపథముచేసికొన్న యేకప త్నీవ్రతుండైన ప్రభుశిఖామణికిఁ బడుచుదనములో భార్యవియోగమా! ఏమియిది!

సీ. సత్యసంధులు కష్టచయముల మున్లుటో
దొంగ లుప్పొంగుచుఁ ద్రుళ్ళిపడుటొ
తలగొఱగించు కోదాతకు లేకుంటో
కృపణుఁడు లక్ష్మీసమృద్ది గనుబొ
విద్వాంసు లుదరముల్ వెన్నంటి యేడ్చుటో
మూడులపొట్టలు పొణక లగుటొ

గీ. త్వత్పదారాధకులు ముష్టిదాసరయ్య
లగుట్! నాస్తికుల్ వారల మొగములందు
నుమియుటయొ! యేమి యిది! కన్నులున్నవె! మతి
యున్నదే యుంటివే చేయుచున్న దిదియె!

న్యాయవర్తనమునకు న్యాయఫలము గలుగపోవు నిట్టి మార్మెలి, యిట్టి వెలితి, యిట్టి తోరట సృష్టిలోనే యున్నదేమో. సత్యపాలకుఁడౌ హరిశ్చంద్రుఁడు భ్రష్టరాజ్యం డగుటా, శ్మశానవాసి యగుటా, భార్యావిక్రయసాహసి యగుటా, మృతపుత్రు డగుటా. ఆహా! ఏమి ప్రపంచధర్మము! పితృవాక్యపరిపాలకుఁడగు రామచంద్రుఁడు నాలచీరధారియగుటా, కందమూలాశి యగుటా, భ్రష్టరా ఫ్రుండగుటా హరిహరీ! అపహృతదారుఁ డగుటా, చీ! ఇంతకంటె నేమి వ్యత్యస్తఫలముండును? చిట్టచివఱకు వారు మహాసౌఖ్యాన్వితులు కాలేదా? పట్టాభిషిక్తులై భగవత్తుల్యులై ప్రభాభాసురులై వెలిఁగిపొలేదా? యనియందురా? వారు సంవత్సరములకొలఁది పడరానిపాటులు పడి చివఱకు వెలిఁగిన వెలుగిదియేనా? నాతోఁ జిన్నతనమున నొకబాలుఁడు చదువుకొనెను. మాకుగ్రుడ్డి గోపాలశాస్త్రి యన్న యాతండు గురువు. ఆయన కొక్కగది, ఒక్కభార్య, ఒక్కకొడుకు, ఒక్కచొక్కా, ఒక్కకన్ను నెలతప్పడయనంగా నేమి యని మా గరువు నా సహపాఠిని బ్రశ్నించెను. నెలతప్పట యనంగా క్షౌరమని యాతండు ప్రత్యుత్తరమిచ్చెను. మాగురువుగారు కోపా విష్ణుండై యాతని కొక్క లెంపకాయ సంకల్పించి చేయియెత్తెను. గురువుగారొంటకన్ను వారగుటచేత నామిత్రునికిఁ దగులవలసినదెబ్బ నాకుఁ దగిలెను. పంతులుగారూ! నన్ను గొట్టనారేమయ్యా యనినే నేడ్వంగ, నిట్టి బుద్దిహీనునితోఁగూడఁ జదువుకొను దోషము నీది కావునఁ గొట్టితి నని గ్రుడ్డితనమును సమర్ధించుకొనెను. ఇట్టి బుద్దిహీనునికిఁ బాఠముఁ జెప్పిన మీమాట యేమని నే నంటిని, తరువాత నామిత్రుని బుజ్జగించి నెలతప్పట యనంగా క్షౌరమని యేలచెప్పితి వని నేను, గురువుగారుగూడ నడుగ, మా మామ్మ నెల కొక్కమాఱు కౌరము చేయించుకొనుటచే నే నట్టు చెప్పితినని యాతండు నిఘంటుకారునివలె శబ్దమునకు వ్యుత్పత్యర్ధముచెప్పెను. తరువాత నామిత్రుడు బి.ఎల్. పరీక్షలోఁ గృతార్డుఁడై జిల్లాకో ర్ధులో వకీలుగాఁ జేరినాఁడు. శ్రీరామరక్ష, శ్రీరామరక్ష, పైస బోణిలేదు. పట్టాసొమ్ము కట్టువేళ పాత్రసమాను తాకట్టు. మరియొకవృత్తి చేసేకొనవయ్యా యని నే నెన్నివిధముల జెప్పినను నీ కెందులకు, చూడవోయి నేనొక్కవెల్గు వెల్గక తప్పనోయియని నన్ను నిరాకరించుచు వచ్చినాడు. చిట్టచివరకు మూఁడు పుట్టకఱ్ఱతో అబ్బాసల్లిగడ్డమీద “ఆఖరు' వెల్లువెలిఁగినాడు. బ్రతికియున్నన్నాళ్లు పదునాల్గు బ్రతుకులకు సరిపోయినయే డుపు లేడ్చి ప్రాణావసాన సమయమునకు భగవత్కాటాక్షము గలిగి బాగుపడితిమని చెప్పిన సత్పురుషులందఱు వెలిగిన వెలుగుకూడ రవంతకంటె నెక్కువది కాదు.

ఇంతకుఁ జెప్పనదేమనఁగా సుఖపడుటకు మొండివాఁడైనఁ గావలయును, వేదాం తియైనఁ గావలయును. అటులైన, నీతి తీసివేసి యావలఁబెట్టుము. ఇంక న్యాయమంతయు గోదావరిలోఁ గలుపుము. సిగ్గుమాలిన తనమా! రా! అన్యాయమా! రా! అసత్యమా! రా! స్వార్దమా! రా! మొండితనమా! రా! పాపమా! రా! నా సౌఖ్యమునకే మిమ్మాహ్వానించుచు న్నాను.

ఏమిది? ఇట్లు జరుగఁదగినదేనా? దారుణముగ నున్నదికాదా? ఇది పరమార్ధమని నమ్మకుఁడు. ఇట్టి తుచ్చప్రవర్తనమునకు రాజశాసనమే యంగీకరింపదు గదా. భగవచ్చాసన మెట్టుంగీకరించును?

అది యిప్పటి కాలాగున నుండనిండు. సోదరులారా! మీరీతత్త్యమును వింటిరా.

పాట
వినరా సదానందయోగీ! నీవు విననేర్తువని విన్నవింతు బైరాగీl వినరాll
ధనము లేకున్న దుఃఖమురా-చాలధనము కల్గినదాని దాఁపదుఃఖమురాll వినరాll
ఆలు లేకున్న దుఃఖమురా-చాల నాండ్రు గల్గినవారి నడప దుఃఖమురాil వినరాll
బిడ్డ లేకున్న దుఃఖమురా-చాల బిడ్డలు గల్గిన పెంచ దుఃఖమురాll వినరాll

ఈజ్ఞాని పాడినతత్త్వమెట్టున్నదో వింటిరా? ప్రపంచసుఖసాధనములగు ధనసంతానాదిక వస్తుసామగ్రి బొత్తిగ లేకపోవుట యెట్టికష్టమో యని విశేషముగ నుండుట యట్టికష్టమే. మధ్యస్థితిలో నున్నవారిబ్రతుకు సుఖవంతమని చెప్పవచ్చునని దీనివలనఁ దేలుచున్నది కాదా? మొదట కవి చెప్పినదానికిని నేవేదాంతి చెప్పినదానికిని నెంత యేతము పెట్టుగా నున్నదో చూచితిరా! ఈరెండు బోధనములకు తేజస్తిమిర న్యాయ మున్నట్టగపడుటలేదా? వీనిలో నేది సత్యమో రవంత పరిశీలింతమా? సదానందయోగి పాడిన తత్త్వమును గూర్చి యిప్పడు చెప్పదును.

వర్షములు లేకపోయినయెడల పంటలు లేవు. అతివర్షములైనందిరుగ పంటలు లేవు. జీర్ణక్తి తగ్గిపోయినయెడల మనుజునకుఁ గష్టము. అతి జీర్ణశక్తి గలుగుటకూడ నట్టికష్టమే. అనఁగ మందాగ్ని యెట్టికష్టమో అత్యగ్ని యట్టికష్టమే. రక్తపుపోటు మనుజునకుఁ గొంతసహ జముగ నుండవలయును. అది మిక్కిలి తగ్గిన శరీరము నిలువదు. మిక్కిలి హెచ్చినను శరీరము నిలువదు. జనునితనువుగాక 98.4 బదులు 98 ఉండినను జావే; 107 ఉండినను జావే. గాలి హెచ్చనుగూడదు, తగ్గనుకూడదు. రక్తములో నీరు హెచ్చనుగూడదు. తగ్గనుగూడదు. ప్రకృతిస్థితి మధ్యమార్గమున నడచుచున్నంతసేపే మనుజునకు సుఖము.

ఇదివఱకు మనము బాహ్యప్రకృతినే పరిశీలించినాము. బాహ్యప్రకృతికంటె బహువిచి త్రమైన యత్యద్బుతమైన యువర్ధ్యమైన యాంతరప్రకృతి మనుజునకు లేదా? ఇంతవఱకు మనము విచారించినది శరీరసుఖమేకాదా? మనస్సుఖము మాత్రము సుఖముకాదా? అందువ లన మనస్తత్త్వముగూడ బరిశీలింప వలసియున్నది. ఈతత్త్వమునుగూర్చి జంఘాలశాస్త్రీ తన యుపన్యాసములలో మిగుల విపులముగఁ జెప్పినాఁడు. నేనుచెప్పట హాస్యాస్పదముగ నుండును. కాని బాహ్యప్రకృతి కెట్టి సూత్రములున్నవో ఆంతర ప్రకృతికిగూడ నవియే సూత్రములు. బొత్తిగ లేకపోవుట, అత్యంత మెక్కువయగుట, బాహ్యప్రకృతిలో గష్టములై నట్టే యాంతరప్రకృతిలోగూడ నవియే కష్టములు. బాహ్యప్రకృతిలో మధ్యావస్థ యెట్టిసు ఖమో, ఆంతర ప్రకృతిలో గూడ నదియే సుఖము. ప్రేమతత్త్వ మేమనస్సున లేదో యామ నస్సు పశుమనస్సుకంటె నధమ మైనది. అత్యంత కష్టనిష్ణురమైనది. అమిత మగు ప్రేమ (ఐహికము) యెవనికుండునో వాఁడు పామరుఁడై బానిసయై తుచ్చుఁడై సంతత దుఃఖమప రంపరచేతఁ జచ్చుట యంతకంటె మేలన్నట్లుండును. ఒకనియందు లేశము నమ్మకములేనివాఁడు పొందుబాధ యాకాశమువోలె హద్దులేనిది. అత్యంతము నమ్మకము గల్గినవాఁ డందఱకాళులధూళి తలయందుంచు కొనుచు నష్టకష్టముల బడచు నేడ్చినయే డుపు అనంతమై యుండును. విద్య బొత్తిగలేనివాఁడు, తినున దన్నమని చెప్పవచ్చునా? అమితమైన విద్య గలవాఁడుగూడ దినునది గడ్డియే. ఎందువలన? చదువు కొననియప్పడు మనస్సులో నున్న జ్ఞానము మిక్కిలి చదువుకొనిన తరువాత ముక్కలై కాలి బూడిదయై యెగిరిపోయినది. బ్రహ్మరంధ్రము మొదలు పాదాంగుష్టమువఆకు నిప్పడున్న వన్నియు సందేహములే. అన్నియు నన్యోన్యవ్యత్యస్తములైనవే. ఏఏదియు మనస్సునకెంత మాత్రము పట్టనిదే. బొత్తిగా సత్యములేనివాని నూరివారు రాతివిసరులతో కఱ్ఱదెబ్బలతో వెఱ్ఱికుక్కను గొట్టినట్లు గొట్టుదురు. అత్యంత సత్యనియమమున్నవాఁ డాముష్మికసుఖమును దరువాత బొందుఁగాక! ఇచ్చట మాత్రము బంధువిరోధియై, ప్రజాశత్రువై పడవలసినబాధ లన్నియుఁ బడును. ఉభయమధ్యావస్థయందే మనుజజాతికి సర్వ ప్రపంచమునకు సౌఖ్యమున్నది. అందు చేత సుఖము, బాధ యనునవి ప్రకృతిస్థితులుగాని స్వతంత్రత్త్వములు గావు. ఒక్క ప్రకృతినన్ని భోవోమువంకబోయి కష్టమైనది. అమితత్వమువంకఁ బోయి కష్టమైనది. అందుచేత సుఖము, బాధ యనునవి వస్తుతత్త్వమున నొక్కటే యని స్పష్టపడుటలేదా? బుద్ధభగవానుఁ డేమి సెలవిచ్చినాఁడు?

గీ. ఉభయదిశల గష్ట ముండు సౌఖ్యమునకు
నదియె నడుమ జేరి యగును సుఖము
బాధ సుఖము నొకటి వస్తతత్త్వమునను
గతినిబట్టి భేదకలన కలిగె.

ఉభయమధ్య సుఖావస్థనే The golden mean అని పాశ్చాత్యులభినందించినారు. ప్రకృతి సత్యము సృష్టిసంబధమైన Economy తో సంబంధించి యుండవచ్చును. తక్కువవ స్తుసామగ్రితో నెక్కువజన మెక్కువసౌఖ్య మొందుటకంటె కావలసినదేమి?

నాయనలారా! నేనిదివఱకుఁ జెప్పినయంశములను మీ మనస్సులకుఁ బట్టఁజేయఁగల యొకచిన్నకథను జెప్పెదను. కథయనుటచే అది యసత్యమని యెంచకుఁడు. అది సత్యగాథయే.

ఒకమూర నొక బీదకుటుంబము. దానిలో భార్య, భర్త, ఇద్దఱు కొడుకులు, నిద్దఱుకూఁతులు. భార్యాభర్తలు నడికాలమున నున్నవారె కాని వృద్దులు కారు. వారి పెద్దకొడుకునకు 18 సంll ములు వయస్సుండును కాని తరువాతీపుత్రునకు 16, మొదటికూఁతునకు 14, రెండవ కూఁతురునకుఁ బండ్రెండుండును. మగపిల్ల లిద్దఱకు మెడలలో జందెములున్నవి. కాని యవి పొరుగూర వేయఁబడిన దొంగజందెములు. 14 సంవత్సరముల పిల్లవివాహము కాకుండ రజస్వల యగుటచే వారికుటుంబ మొక్కసంవత్సర మునుండి బహిష్కరింపబడియున్నది. ఎవ్వరును వారి యింటికి రారు. వా రెవ్వరింటికిని బోరు. తిండిలేక మలమలమాడి పోవుచుండిరి. బహిష్కృతునకు ముష్టిమాత్రము పెట్టువారె వ్వరు? పైయూరికిఁ బోవుదమనన నడచిపోవుటకు శక్తిలేదు. బండియెక్కుటకు పైసలేదు. దినమున నొక్కపూఁట తిన్నను నార్గుఱకు భోజ్యము కావలయును గదా! అరసోలెడు నూక లింటియొద్దలేవు కదా! ఎట్టు కుటుంబము జీవింపవలసినది? దంపతులు శ్రీరామనామస్మ రణ చేసికొనుచు గూరుచుండుటతక్క నంతకంటె నేమి చేయలేరు. మగపిల్ల లిద్దఱు పైయూళ్లకుబోయి కూలినాలి చేసికొనివచ్చి తల్లిదండ్రులను బోషింపరాదా? వారిల్లు కదలువారుకారు. పౌరుషవంతులు. ఇంక బ్రదుకు టెట్టు? మగపిల్లలకు జదువులేదు వారు పరమమూర్ఖులు. అందుచేత వారి తల్లిదండ్రులొక్క పని జేసిరి. రాత్రి యెనిమిదిగంటలకుఁ దండ్రి పదునాలుగేండ్ల కూఁతును, దల్లి పండ్రెండేడ్ల కూఁతును దీసికొని చెఱికి యొక కుండ చేంతబుచ్చుకొని ముసుగులువైచికొని రూపములు దాచివైచికొని సందెబిచ్చ మెత్తు కొని రాత్రి పదిగంటల కింటికి వచ్చి యాయన్నమును కొడుకులకుఁ బెట్టి తాము దినుచుండెడివారు. ఈసంగతి యెవ్వరికిని దెలియదు. ఇట్లు జరుగుచుండ నొకరాత్రి వేఱువేఱు కుండలలోనున్న యన్నము నొక్కచోట నుంచుచుండఁగాఁ దనకుండలో నొక బంగారు గాజుపిల్లల తల్లికిఁ గనఁబడెను పాపము! ఏసంసారిణియో తనకుండలో నన్నమువేసి నప్ప డాగాజు జాఱిపడెనని యామె యూహించు కొనెను. కాని యెవరిదని యెవరి కీయంగలరు? ఎందఱు సంసారిణు లామెకుండలో నన్నమువైచిరో ఎవరి గాజో కాని నాయొద్ద నున్నదని వెల్లడిచేయునెడలఁ దనసందెబిచ్చపుగొడవ వెల్లడికాక తప్పదే! అందువలన మఱునాఁడు కూడు దొరకదే ఏమి చేయుటకును దోపక యొక్కభర్తతో మాత్ర మీసంగతి చెప్పెను. ఇది భగవత్కటాకచిహ్నమని యాతఁ డనుకొని “నిన్ననే నీతల్లి యిటుకు వచ్చినది కదా! ఆమెచేతి కీ గా జిచ్చి తనయూరుపోయి దానిని విక్రయించి యాసొమ్మిక్కడకుఁ దెమ్మని చెప్ప'మని భార్యతోఁ బలుక నామె యిట్టు చేసెను. ఆసొమ్ము రాఁగనే యాతని కేమిబుద్దిపుట్టైనో గాని దానిని లాటరీలో వేసెను. అయిదాఱు మాసములు కాకుండనే యాతనికి మొదటి బహుమాము 15 లక్షలరూయలు వచ్చెను. కాని పైపన్నని, అదనంపుబన్నని, జాస్తిపన్నని, లాటరీపన్నని యింకేమో యని యింకేమో యని రూపాయ కొక్కయర్దరూపాయి మట్టుకు ప్రభుత్వమువారు లాగివేసిరి. శేషించిన దింటికిరాఁగనే యాగృహస్థునికి గుండెలు గరిసలఁబడఁగఁ దలదిరుగఁ బడిపోయెను. పడిపోయిన తండ్రి యొద్దకుఁ గొడుకులు రాలేదు. వారి తల్లియు రాలేదు. ఈసామ్మ జాగ్రత్తపెట్టుటకు మార్గము లాలోచించు చుండిరి. నాన్న చచ్చిపోయినాడమ్మా యని 12 సంllరముల వయస్సుగల కూఁతురేడ్వ మజేమియు దొందరలేదని కొడుకులనిరి. భార్యయునట్టేయనెను. అతడు మాటలాడలేనిస్థితిలో నున్నాఁడే కానిస్మృతిగలి యున్నవాడగుటచేత నీమాట లాతనికి వినఁబడెను. కొంతసేపటికిఁ దనయంత తానులేచెను. అనుభవింపవలసిన నెత్తివ్రాఁత యింక నుండగ నప్పడే చచ్చునా? పదునైదులక్షలకు నెనిమిదిలక్షలే యుండె నేమి యని తండ్రియడుగఁగఁ బన్నులక్రింద మినహాయింపఁబడిన దని వారు చెప్పిరి. అందులకైయాతఁ డూరెగిరిపోవునట్టు గుండెలు కొట్టుకొని యేడ్చెను. 'పోనీ! నాన్నా మనకు వచ్చినవే యెనిమిదిలక్ష లనుకొనరాదా" యని చిన్నపిల్ల తండ్రిని మందలీంపగా, నాతండు మొగము దిగవైచుకొని లోలోన నగ్నిపర్వతమువలె గుమిలిపోవుచుండెను.

ఈబ్రాహ్మణుని కింతధనము రాగానే యాజిల్లావా రందఱికీతని దర్శనము చేసి యభినందనములు ప్రకటించిరి. ఇతని కుటుంబము నితనినిఁ బెద్దమోటారులోఁ గూరుచుండఁబెట్టి పుష్పవర్షము గురియుచు నూరివెంట నూరేఁగించి మహాజన సభలోనికిఁ దెచ్చి ప్రత్యక్షముగఁ బూజించిరి. కవులు పద్యములు చదివిరి. గాయకులు భార్యాభర్తలపై మంగళపు టారతులు బాడిరి.

అతనిపిల్లలను జేసికొందుమనియు, మగపిల్లలకుఁ బిల్లల నిచ్చెదమనియు లక్షాధికారుల యొద్దనుం బడేబడే వార్తలు వచ్చుచుండెను. కులభ్రష్టత యేమైనదో బహిష్కార మేమైనదో పైసముందన్నియు బటాపంచలైపోయినవి. ధనమా! నీవెంత మహిమగలదానవు. అందఱును దాసులుగఁ జేసికొంటివే! నీకు, భగవంతునకు భేద మెక్కడనున్నదో చెప్పెదవా? భగవంతునిఁ గూడ నొకప్పడు తిట్టిన ప్రజ నీపాదుధూళి శిరమున నిరంతరము ధరియిం చునే భగవంతుని మాటయే మఱచిపోయి కోటీశ్వరుఁడు నిన్నే కొల్చుచున్నాండే ఆహా నీ మహిమకు హద్దున్నదా? బుద్దిహీనుని బృహస్పతిగఁ జేయుచున్నావే. నంగినంగిమాటల శుంఠను మహావక్తగఁ జేయుచున్నావే. చెవులపిల్లిని సింహముగఁజేయు ప్రజ్ఞ నీది కాక మణెవ్వరిది? పాపమందు బుణ్యమును, విషమందు మాధుర్యమును, దొంగతనమందు దొరతనమును, మిథ్యయందు సత్యమును, సవ్యాపసవ్యధోరణిని గనఁబఱచుచు మహేంద్ర జాలము నాడించు ప్రజ్ఞనీది కాక మఱివ్వరిది. ధనమా! పరబ్రహ్మముకూడ నీవేనా నమస్తే. తనకున్న ధనముచేతనే ప్రజ లిట్టు తన్ను గౌరవించు చున్నారనియు, తన్నిదివఱ కనేక విధముల బాధలు పెట్టిన జనసంఘము నీతిజాతి మాలినదనియు, నీ బ్రాహ్మణుఁడు గ్రహింపలేదా! కష్టవిద్యాశాలలో గడితేఱినయాతం డామాత్రమైన గ్రహింపలేదా? తాను జావునకు సిద్దమైనప్పడు తనభార్యకుఁ గొడుకులకు దయ లేకపోయిన దని ప్రత్యకముగ వెఱంగినవాఁడు సభాధ్యకుల కర్పూరమాలలకుఁ, గవుల చంపకమాలలకుఁ గట్టువడునా?

ధనవిషయమై మనుజుని కున్న ససి యింత యంతయునా? అందులో దానిని గూర్చి న్యాయవాదికున్న పసి చెప్పదరమా? ముగ్గురు న్యాయవాదులు వారిలో వారు సంప్రతించు కొని ధనసందర్భములం దీకుటుంబమున కింకఁ గలుగదగిన కలహములను నివారణచేసి వారిని బాగుచేయుటకై వచ్చితి మని వీరి యింటికి వచ్చిరి. కిట్టినివా రింకొకరీతిగా ననుకొనిరి. అది గణింపఁదగినది కాదు. ఒక్క న్యాయవాదియే యనేకాస్థానములను దిబ్బలు చేసియుండ ముగ్గురు న్యాయవాదు లీబ్రాహ్మణుని సొత్తునేమి చేయలేకుందురు? ఒక న్యాయవాది తండ్రినీ జీలదీసినాఁడు-ఒక డొకసోదరుని పక్ష మైనాడు-మఱియొకఁడు మఱియొక సోదరున జేబులో నిముడ్చు కొన్నాడు. మీకుఁ గల్గిన యాస్తి న్యాయవాదుల యాస్తివలె కేవలము స్వార్జితమనియు, నది పంపకమునకు రారాదనియుఁ జల్లనిమాట బ్రాహ్మణునితో న్యాయవాది చెప్పఁగ నాతం డదివఱకే కొడుకలుపైఁ గోపమున్నవాఁడు కావునఁ జేటంత మొగము చేసికొని నాయనా! నాపంతము గెలిపింపుమని న్యాయవాదిని బతిమాలెను. 'అద్దే అవలీలగ గెలిపింతును. ఒక్క చిల్లిగవ్వ కొడుకులకీయ వలదు. ఏమి చేయఁగలరో చూతము. మీరాపట్టు మీఁదనే నిలువబడుడు. నాతమాషా చూపింతు"నని న్యాయవాది మీసములు దువ్వుచు జెప్పెను. మిగిలిన యిద్దఱు న్యాయవాదులు సోదరులతో నేమి మాట్లాడిరో తెలియదు. కాని వారు తండ్రియొద్దకు వచ్చి మనకున్న సాత్తును బంచుకొందమని తండ్రికి బోధించిరి. ఆతడు కఠినముగ నిరాకరించెను. ఈసంగతి యెఱుంగక 'నీవు నీ కొడుకులు పంచుకొన్నయెడల నడుమ నేను నాకూఁతులు చెడిపోవలసి నదా? వారి శుభకార్యములకు నా బ్రతుకు తెరువునకుఁ గావలసినంత సామ్ము ముందుగా వేఱుచేసి మిగిలియున్నదే పంచు కొన వలయును." అని భార్య భర్తతోఁ జెప్పెను. “నీకూతుల కేమి యిచ్చినను వారు తమ భర్తలకు గలుపుదురు. నీకేమి యిచ్చినను నీవు పుట్టినింటివారికిఁ జేర్తువు. కొడుకుల కేమి యిచ్చినను వారీకాసుల గోతములన్నియు గోడండ్రనెత్తి కెత్తెదరు. ఇదియంతయు నాకష్టార్జితమే. నే నొకరి కీయను. పొ"మ్మని భర్త బదులుచెప్పెను. ఈ సంగతి యేమియుఁ దెలియక లాటరీసామ్మంతయు దాను దనకూతులు హరింపఁ బ్రయత్నించుచున్నారని తల్లిపై గొడుకులు చెలరేగి కొట్టుటకు సిద్దమైరి. ఇంతలోఁ గర్మముచాలక యత్తగారు వచ్చినది. తనకు విషము పెట్టుటకుఁ బుట్టినింటనుండి భార్య తనతల్లిని బిలిపించిన దని బ్రాహ్మణుఁడు నిశ్చయ పఱచుకొనెను. ఆమె కీసంగతియేమియు దెలియక చనవుచే నల్లుని యొద్దకుఁ బోయి, “నాయనా! నీభాగ్యమునకు మూలాధారమును నేను. నేనా సొమ్ముతీసికొని వచ్చి నీచేత లాటరీవేయించుటచేత మనపుణ్య మాయని యింత మాహలక్ష్మి మనయిల్లు చేరినది. అందుచేత నీవు నాకెంత యిచ్చినను ఋణము తీర్చుకొనలేవు" అని పరిహాసముగ బలికెను. అత్త నల్గడుమాదిగ మంచము క్రిందఁ గొట్టఁగ భార్య యడ్డుకొనెను. భార్యను మెడఁబట్టిగెంటఁగ నామె గోడమీదబడి మూర్చపడియెను. అత్తగారు పెద్ద గోలచేయగఁ బెద్దకొడుకువచ్చి ముసలిదాని గొంతు గట్టిగ నొక్కగ నామె క్రిందబడి చచ్చెను. తండ్రికి మతిపోయి యున్నదని వంక కల్పించుకొని తండ్రినిఁ గ్రిందబడద్రోచి గొంతుకపై ద్రౌక్కి తలగడ క్రిందనున్న నోట్టకట్టను దీసికొనుచుండెను. ఇంతలో నాడుపిల్లల యేడుపువిని దొడ్డిలోనున్న రెండవకొడుకు వచ్చి నాకు లేకుండ నీవే యంతసామ్మును దీసికొందు వాయని చేతిలోఁ జెంబు దీసికొని యన్నగారి నెత్తిపై గొట్టఁగ నాతండు చచ్చెను. అంతలోఁ గ్రిందనున్న తండ్రి లేచి నాసామ్మ నీవు పట్టుకొని పోవుదువా యని రెండవ కొడుకు గొంతు గట్టిగాఁ బట్టుకొనెను. తనప్రాణము రక్షించు కొనుటకు దిరుగ నాకొడుకు తండ్రిగొంత పిసికెను. ఇద్ద ఆక్కడనే చచ్చిపడిరి. తల్లి యిదివఱకే చచ్చెను. ఆడుపిల్లలిద్దఱు మాత్రము నిల్చిరి. చేతగవ్వలేనప్పడున్న కష్ట మీకుటుంబ మనుభవించినది. లక్షలున్నప్పటికి కష్టము ననుభవించినది. సుఖసాధనములు లేకున్నను గష్టమే, మిగుల హెచ్చైనను గష్టమే.

అమిత మనుచు నభావంబు ననుచు రెండు
కష్టదశ లెప్డ సుఖము ప్రక్కలనె యుండు
నడుమను సుఖార్జి యూగక నడవవలయుఁ
దాటిబద్దపై నేటిని దాటినట్లు.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః