Jump to content

సాక్షి మూడవ సంపుటం/ఆయుర్వేదవైద్యుని యుపన్యాసము

వికీసోర్స్ నుండి

10. ఆయుర్వేదవైద్యుని యుపన్యాసము

సాక్షి సంఘసభలో రకరకాల విషయాల గురించి-జంఘాలశాస్త్రి అప్పుడప్పుడు కాలాచార్యులు, ఎప్పుడో ఒకసారి వాణీదాసు, బుద్ధిపుట్టినప్పుడు సాక్షి మాత్రమే ఉపన్యాసాలివ్వడం కాకుండా ఇతర విషయాల మీద కూడా, ఆయా రంగాలకు చెందినవారిచేత మాట్లాడించడం కూడా వుంది.

ఒక ఆయుర్వేద వైద్యుడు ఈసభలో మాట్లాడుతూ-అయినదానికీ, కానిదానికీ శస్త్రచికిత్సలకు ఎగబడే మన దేశీయుల మూర్ఖత్వాన్ని గట్టిగా విమర్శించాడు.

మల విసర్జన విషయంలో బాధ వున్న వారికి-ఆబాధ తీర్చడానికి ఆముదం వుండగా ఎనీమా అనవసరం. పుప్పి పన్నుకు మూలికావైద్యం వుండగా పన్ను పీకించే పద్దతి అనవసరం. అలాగే వ్రణాలలోని క్రిముల్ని బయటకులాగే ఓషధులున్నాయి. ముల్లుగుచ్చుకున్న మనిషి కంటిలో రెండు పసరు చుక్కలు వేస్తే, ఎక్కడి ముల్లు అక్కడ బయటపడే వీలుండగా, ముల్లు పీకడానికి కత్తులు, కఠారులూ ఎందుకు? కాలి బెణుకు ఠక్కున సర్దుకోవడానికి ఆముద వైద్యం వుండగా, ఆకాలు తొలగించవలసిన స్థితి ఎందులకు తెచ్చుకోవాలి? రాచకురుపు హరించడానికి ఒక మూలిక పస రుంది. ఇంజెక్షనులు, టీకాలు ఎంత అసహజాలు? శస్త్రవైద్యం పనికిరాని వ్రణాలెన్నో వున్నాయి. వాటికి ఆయుర్వేదం మందులున్నాయి. స్త్రీలకున్న మలబద్దత హరించడానికి మందులున్నాయి. కడుపులో గడ్డలకీ, గుల్మాలకీ, లోపలికి మందు వాడాలి గాని శస్త్రచికిత్స కాదు. శస్త్రచికిత్సవల్ల కార్యనాశ నమే కాని, కారణ నాశనం కాదు. అందువల్ల దేశీయతను నమ్ముకోవాలి. దేశీయతలో పుట్టి, పెరిగి, మరణించడం ఒక్కటే సరైన దారి అని ముగించాడు వైద్యుడు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.

నేను సభకుఁ బోవుసరికే యొక యాయుర్వేద వైద్యుఁ డుపన్యసించుచుండెను. అంతకుముం దేమి చెప్పియుండెనో కాని నేనునభలోఁ బ్రవేశించినపిమ్మట నాతం డిట్లు పలికెను: “ఆముదముండగా నెనీమా (Enema) యెందులకు? కడుపులో నున్నకల్మషములు ద్రోచివైచుట కది మంచిదా, యిది మంచిదా? అధోమార్గమున నెక్కించిన నీ రేమాత్రము లోని కెక్కఁగలదు? ప్రేగుల చుట్టలోని చిట్టచివర భాగములోఁ గొంతవఱకేయొక్కగలదు కాని యంతకుఁ బై కెక్కగలదా? అందువలన నచ్చటి కల్మషమే తొలగి పోవును గాని పైనున్న ప్రేఁగులలోని కల్మషముమాట? నోరు స్వాధీనము కాకుండ నున్నప్పడు, పండ్లు గట్టిగ దగ్గఱబడినప్పడు రెండవ మార్గ ముండనే యున్నది కాని, గిన్నెలకొలఁది కాఫీ త్రాగుటకు, బుడ్డ కొలది సోడా త్రాగుటకు, పుంజీలకొలఁది నారింజపండ్డు మ్రింగుటకు దినములకొలఁదినుండి యుపచారములను జేయువారిని జెడమడ తిట్టుటకు నోరు విచ్చలవి డిగ విశృంఖలముగఁ బనిచేయుచుండఁగ గోచిలోపల గొట్టమెందులకు? పోనీ! ఎక్కించితివ య్యా-పసరు పోయినదా-క్రిమిపోయినదా? ఆమము పోయినదా? ముంగిలి తుడిచినంతమా త్రమున నిల్లంతయు శుభ్రపడినదా? అదిగాక జ్వరభేదమువలననేమి, ప్రేగులలోని వేడిమి గల నీరే రోగుల కందఱ కుపయోగపరుచుచున్నారే. అందుచేఁ గొందరగ్రేసేవు లుష్ణాధిక్యముచేఁ గుమిలిపోవుచున్నవి-కొందఱప్రేవులు హీనోష్టతచేఁ బచ్చిచేసి పట్టుపట్టుచు న్నవి. ఉష్ణాధిక్యము చేసిన ప్రేవులనుండి రక్తము పడుచున్నది. పచ్చిచేసిన ప్రేవులలో శూల యారంభమగుచున్నది. కొందఱ కేబాధయు లేక సరిపోవుచున్నది. పోనీ! కొందరైన సుఖముగా నున్నారని సంతోషింతమన్న, వారి బ్రదుకు లెట్టున్నవో చెప్పదునా? ప్రాతఃకాల మున యథాపూర్వముగ మలమోచనము జరుగదు. ఎప్పడు జరుగును? చిలుకకొయ్య కెక్కిన సీమ యినుపరేకుడొక్క గొట్టముతోఁ గ్రిందికి దిగవలయును. పంచపాళిలోఁ గ్రాంగుచున్న నీరు దానిలోఁ బడవలయును. నపుంసకుఁడు పెండ్గాముగదిలోనికిఁ బోయి తొంగిచూచి గిరుక్కున మరలినట్లు గొట్టపుఁగొస యాసనములోనికిఁ బోయి మరలవల యును. అప్పటికిఁ గృతార్థత-అప్పటికి మహేంద్ర పదవి-అప్పటికి సప్తపురుషాంతరములం దలి పెద్దలు తరించుట! ఆహా! ఎంతపనికిమాలిన బ్రదుకు బ్రదుకుచుంటి వయ్యా! ఆరు పైసల యాముదము నీకు, నీయిల్గాలికి, నీకొడుకునకుఁ గూడ నర్ధసంవత్సరమువఱకు వచ్చునే స్వదేశీయమై, సర్వవిధముల నీకు సరిపోవు నాముదమును మాని, మాసననాళధ మని నంటగట్టుకొని బ్రదు కడవి యధ్వాన్నము చేసికొంటివే. మూర్ఖా! నిన్నేమి చేయవలయును? పొరుగూరికిఁ బోవలసివచ్చునప్పడు చెంబుకంటె, గుడ్డలమూట కంటె, బ్రక్కచుట్టకంటె, భోజనపాత్రల దొంతరకంటె, దేవతార్చనపు బెట్టెటకంటె నీవిరేచ నపుడొక్కు ముందా?

రామరామా! కొందఱాడువారుగూడ నీప్రయోగమున నద్వితీయ లనిపించుకొను చున్నారే పెండ్లికిఁ బోవునప్పడు పన్నీటిబుడ్డికంటె నీపాయిఖానాపాత్ర ముఖ్యమైనదే అయ్యయ్యో! ఆరోగ్యముమాట యటుంపుడు. బ్రదుకుమాట యటుంపుడు. అన్నిటి కంటె ముఖ్యములైన సిగ్గుబిడియములు బుగ్గియగుచున్నవే! అంతటనుండి పెండ్లిండ్లలో వియ్యపురాలి యలంకారములలో, నాఁడుబిడ్డ కట్నములలో, నీయ మాంగళ్యపు గొట్టము చేర్తురు కాఁబోలు! అల్లుని కెక్కుటకు గుఱ్ఱములతోబాటు, బండ్లతోఁ బాటెక్కించుకొను టకు నీబహిర్దేశపుఁ దిత్తిని జేర్తురుకాబోలు! మనబుద్దు లింత పాడగునప్పడు దేశసౌభాగ్యము తొలఁగిపోయె ననఁగ నాశ్చర్య మేమి? తాను తనది యనునభిమానము పోయినపిమ్మట మోక్షమైన రావలయును, బైక్ష్యమైన రావలయును. మన స్వార్థపరిత్యాగము పదార్థస్వీ కరణముకొఱ కైనది కావున మన కీరెండవది దాపురించినది. కావున మొదట బాగుచేసికొనవ లసినది దేశము కాదు, బుద్ది వదల్చుకొనవలసిన బానిసతనము దేశసంబంధమైనది కాదు, మనస్సంబంధమైనది. దేశములో నీవు లేవు-నీలో దేశమున్నది.

మఱియొక సంగతి. పుప్పిపటించే బాధపడునపు డేమిచేయుచున్నావు? దంతోద్ఘా టన ప్రవీణుఁడగు దామోదరన్ దగ్గఱకుఁ బోయి పంటినూడ దీయించుకొనుచున్నావా? -పంటిలోఁ బురు గూడం దీయుంపవలయునా? ప న్నూడఁదీయింపవలయునా? రేపు ముక్కునకు బాధకలిగినయెడల ముక్కూడం దీయింతువా? కంటిలోఁ బూవువేసిన యెడలఁ బూవును హరించుట వైద్య మగును గాని కంటిని బెఱుకుట వైద్యమగునా? ఏకోశ మున నైన దోషమేదైనఁ జేరునప్పడు దోషసంహరణ మొనర్చుట తగునుగాని కోశసంహ రణ మొనర్చుట తగునా? గోరుచుట్టు వేసినయెడల వ్రేలూడదీయవలసినదే! ఇది చికిత్సాక్రమమేనా? ఇది మనుష్యపద్దతియేనా? మనుష్యపద్దతి మాటయటుంపుఁడు. తోఁకపై నీఁగవ్రాలినయెడల దానిని వదల్చుకొనుటకై కుక్క తోకను జెటకాయించును గాని కొఱికివైచుకొనునా? అధమ ప్రాణిపద్దతికిఁగూడ వ్యతిరేకమైన యీ పద్దతి మనకెందులకు? పురుగు చేరినదంతమును బెఱికివేయుటే-పూచిననాల్కనుగూడ లాగించుకొనలేకపోయి నావా? దంతములో బురుగు నూఁడదీయుట కెన్ని చికిత్సలు లేవు? అవి యన్నియు నిరుపయోగము లనియే యెంచితివా? అట్టి చికిత్స లేర్పాటు చేసిన యవతారపురుషులు వెఱ్ఱిముండకొడుకు లనియే యెంచితివా? ఒక్క యోషధిలోని కాకర్షింపఁబడునే! ఎంతమహి మగల యోషధియో యొకసారి పరీక్షించుటకైనను నీకు బుద్ది పుట్టనప్పడు నీకు మొదలే బుద్దిపుట్ట లే దనుకొనవలయును గాని బుద్ది కొంతకాలముండి తరువాతఁ బోయిన దనుకొనుచున్నావా? వ్రణములలోని క్రిమిజాల మంతయుఁ బైని కట్టినమూలికలవలన వెలుపలికి వచ్చునే? మఱియొక చిత్రము: ఒకని కొడలినిండఁ గుఱుపులు వేసినవి. ఒకవైద్యుఁడు వచ్చి యొకమూలికను దెచ్చి దాని నాతని యొడలికిఁ దగిల్చి బురదనీటిలోఁ బ్రాతిపెప్టెను. రెండుదినముల కామూలిక చచ్చెను. వెంటనే రోగి శరీరమందలి కుఱుపుల న్నియు నంతరించెను. శరీరమందలి రక్తములో నున్న యాటవిక జ్వరసంబంధమైన క్రిమిన మూహమునుగూడ వనమూలికలు చంపగలవు. దినమునకు రెండుసారులు, దినము విడిచి దినము, మూడుదినముల కొకసారి వచ్చు చలిజ్వరము లవలీల నుచ్చాటన మొనర్పఁగల మూలికలు మన కుండ, రక్తములోనికి విషమును సూదితో నెక్కించుకొని తపించి తపించి యేలచావునకు సిద్దమగుదువు? నాడీస్థానమునఁ గట్టిన యోషధివలన నాళమందలి రక్తము లోని పురుగు చచ్చుచుండంగా దంతములోని పురుగుకొఱకు దంతమును గారుచే లాగించు కొంటవా? దంత మూడిపోయిన దనియు, దెఱపీని బడితిమనియు సంతోషించు చున్నావేమో కాని యందువరన నీనరములలో నెన్నిరోగములకు బీజము వేయ బడినదో గ్రహించుకొంటివా? మెదటికిఁ దగిలిన యదట్లువలన నీకుఁ దలతిరుగుడు రావచ్చును. ఉన్మాదముకూడ రావచ్చును. దృష్టి సున్న కావచ్చును. ముక్కునుండి రక్తస్రావము కలుగవచ్చును. ముఖమునకుఁ బక్షవాతము రావచ్చును. మూర్చ రావచ్చును. పన్నూడదీ సిన యుత్తరక్షణముననే పక్షవాతము వచ్చినవారిని, మూర్చవచ్చినవారిని నేను జూచితిని. ఒక్కమూలికతో నిర్మూలన మొందవలసిన పంటిరోగము కొఱకుఁ బ్రాణమున కింత ముప్పు తెచ్చుకొనుట తగునా? పాశ్చాత్య దేశచక్రవర్తులలో నొక్కనికిఁ గాలిలో ముల్లు గ్రుచ్చుకొనినది. వైద్యులు సూదితో గుట్టినారు; శ్రావణముతో లాగినారు; కత్తితోఁ గోసినారు. ముల్గూడిరాలేదు. క్రమముగా నాభాగమంతయు వాచినది. జ్వరము వచ్చినది. పరాకు పుట్టినది. అస్వస్థత హెచ్చినది. శస్త్రవైద్యులు పరీక్షించి మోకాలిచిప్పపై నైదంగుళముల వఱకుఁ గాలు ఖండింప వలయు నని సిద్ధాంతీకరించినారు. ఖండించినారు. తక్షణమే ధనుర్వాతముతో రోగి చచ్చినాండు. ఈసందర్భమునం దెఱుఁగవలసినయంశ మే మనంగా, ఒక్కయాకుపసరు తెచ్చి రెండు కన్నులలో రెండు చుక్కలు వైచినయెడల శరీరమున నెక్కడ గ్రుచ్చుకొన్న ముల్లయినసరే, యొక్కదినములో నూడిపోవును. అన్నిటికి శస్త్రచికిత్సయేనా? కత్తి, కారు, సూది, తంటసము, ఆంపమే రోగ నివారకసాధనము లైనప్ప డింక వైద్యశాస్త్ర మంతయు నరేబియా సముద్రమునఁ బాఱవేయవలసినదేకదా? సమగ్రమైన శాస్త్రములేనివారేమిజేసిన, నెట్టుచేసినఁ జేయుదురుకాక. కలిగియు మనకర్మ మిట్టు కాలిపోవ నేల?

కొంతకాలము క్రిందట నొక్క చక్రవర్తిపుత్రుఁడు మనదేశమును జూడవచ్చినాఁడు. గుఱ్ఱమెక్కుటలోనో, దిగుటలోనో, నడకలోనో, నిద్రలోనో, బంతియాటలోనో, జంటనా ట్యములోనో యాతనికి మోంకాలు బెణికినది. కాలు వాచినది. సలుపు, పోటు హెచ్చినది. రోగి కూరుచుండలేఁడు, పండుకొనలేఁడు; ప్రక్క కొత్తగిల్డ లేఁడు. రేయుంబవళ్లు కురరివలెం గూయుచున్నాఁడు. నిద్రపట్టుకు మందు లిచ్చినారు. సూదు లెక్కించినారు. పై బాధ హరించుటకుఁ బట్టు వేసినారు. కాపులు కాచినారు. జెలగ లంటించినారు. మంచునీటి తుంపరలు తగిల్చినారు. ఊహు. గాఢముగ యోజించుచున్నారు. కాలు ఖండింపవలసిన దని కట్టకడకు కాంగ్రెసులో సిద్దాంతీకరించినారు. రోగి యేమి గతిలేని వాఁడా? సామాన్యుడా? అయ్యయ్యో! మహాచక్రవర్తి జ్యేష్టపుత్రుడే చక్రవర్తి మూడువేలమైళ్ల దూరములో నున్నాఁడే ఆతఁ డంగీకరింపకుండ నీతని కాలు కొట్టివేయుట సాధ్యమగునా? ఆయనకుఁ దంత్రీ మూలమునఁ దెలియబలకిచినారు. ఇరువదినాల్గు గంటలు పేకించినయడల కాలు ఖండించినను రోగి బ్రదుకడని Concensus of medical opinion (వైద్యుల ఏకాగ్రీవాభి ప్రాయము) కలిగినది. రోగి రోగి యని వారందు రెందులకు? రోగమెవరికి? కాలు బెణుకుట రోగమా? ఇదేమి జ్వరమా? జలోదరమా? అతిమూత్రమా? అండవాతమా? నాపిండ కూడు? రోగ మెవరికి? అందఱు శస్త్రచికిత్సకులు చేరి రోగము శాసించినప్పడు కా దనఁగలవారెవ్వరు? అన్ని పరీక్షలలో నారితేఱికినవారా మాత్రమైనఁ దెలిసికొనలే రని చెప్పట విద్యాద్రోహము కాదా? అందులో నొకరా, ఇద్దటా-ప్రాణమున కొక్కడుచొప్పన నైదుగురు కలసి రాద్దాంత మొనర్చినపుడు బుద్దిమంతులు మొద్దులాగున నుండవలసినదే కాని పెదవులు కదల్పఁదగునా? చరణ ఖండనమునకై చక్రవర్తిగారి యంగీకారముకొఱకు శస్త్రవైద్బులు క్షణ మొక్క యుగముగా నిరీక్షించుచున్నారు. ఇంతలో నొకదేశీయమహారాజునొద్ద నుండి యొవైద్యుఁడు వచ్చెను. ఆతఁడు కుమ్మరి. వయస్సుమీరిన వాడు. మహారాజలేఖతో శస్త్రవైద్యుల నాతండు దర్శించెను. ఇతడు Quack అని యొక వైద్యుఁ డనెను. ఇతఁడు “పూలు' అని మరియొకఁ డనియెను. నీయోగ్యతాపత్రములు (Certificates) చూపుమని మఱియొకఁ డనియెను. మహారాజులేఖను మన్నింపవలదా యని మఱియొకడ్రు సందేహించుచుఁ బలికెను. మహారా జైన సరే, మహారాజాధిరాజైన సరే, నల్లని భారతీయుని నమ్మగూడ దను నర్థమిచ్చునట్లు మరియొకవైద్యుఁడు తల యడ్డముగ నూఁపెను. “వైద్యులారా! మీరింత గుబ్బెటలు పడనక్కఱలేదు. నేను లోపలి కేమియు మందీయను. మీ చక్రవర్తిపుత్రు నొక్కసారి చూచెదను. అనుజ్ఞ నీయవలయు"నని కుమ్మరివైద్యుఁడు పలికెను. ఈవైద్యునికి రోగిని చూపుటా మానుటా యనుసంగతినిగూర్చి యైదుగురుగూడ గొంతసేపు పూర్వపక్షరాద్దాంతము లొనర్చుకొనిరి. "హృదయము చాల దుర్బలముగా నున్నది. ఇట్టిసమయములోఁ గ్రొత్తవానిని చూచుట వలన నందులో నల్లని ‘బ్లాక్ హెడ్ ను జూచుటవలన, రోగికిఁ గొంత (Shock) యదటు కలుగవచ్చును. అందువలన హృదయ మాకస్మికముగ నాగిపోవచ్చును' అని యొకఁడు పలికెను. "రోగి మొగమును జూడవలసినపని యేమున్నది? మొగమున కెదుట నొకదిట్టమైన తెరయడ్డు కట్టుదము. బాధ కాలిమీఁదఁ గావునఁ దెర కట్టవలదు. అది గాక హృదయము మిక్కిలి దుర్బలముగా లేదు. రోగితోఁ జెప్పియే యాతని నందుకు "ప్రిపేర్" (సిద్దము) చేసియె యీతనికి దర్శన మిప్పింపవచ్చునని మఱియొకఁడు తన యభిప్రాయమును వెలిపుచ్చెను.ఎందుకైన మంచిది “Strophanthus“ strong dose పెద్ద మోతాదు ఇచ్చియే దర్శనము చేయింపవచ్చు"నని యింకొక డనియెను. 'ఆమాత్రపు టదటున కాగలే నివాఁడు పెద్ద ఆపరేషను కెట్టాగునా యని నాకుఁ జాలభయముగా నున్నది. I have my own serious doubts అని మరియొకడు గుర్రపు మొగమంత కోలనైన మొగము కలవాఁడు బిఱ్ఱబిగియుచు దుమదుమలాడుచుఁ బలికెను. ఏలాగైన నేమి, తుట్టతుదకుఁ గుమ్మరిని లోనికిఁ దీసికొనిపోయిరి. కుమ్మరి కొంతసేపు చూచి చక్రవర్తిపుత్రుని మోంకాలిపైఁ జేయివైచుట కనుజ్ఞ నిమ్మనెను.No No (నొ నొ) యని తలకు రెండేసి 'నోల' చొప్పనఁ బది నోలొక్కసారి రావణాసురు నుండివలె బయలువెడలినవి. మోకాలిపై నీఁగ వ్రాలిననైన సహింపలేఁడు కావున వీలు కాదని యందరు చెప్పిరి. మరేమియు దొందరలేదు -బాధ తగ్గింతు నని కుమ్మరియావైద్యులతోఁ జెప్పెను. చేతులు పరీక్షించి 'పర్ మాంగనేట్ ఆఫ్ పొటాషు’' తో నాతనిచేతులు గడిగించి, తుడిచి, నిప్ప సెగను గాపించి, తుదకు మోకాలిని స్పృశించుట కనుజ్ఞ నిడిరి. చక్రవర్తి పుత్రుని మోంకాలిపై గుమ్మరి చేయి వైచి యంటసియంటనట్టు కొంతసేపు రాచెను. చక్రవర్తిపుత్రుఁ డూ యనలేదు. ఆ యనలేదు. ఉహు అనలేదు. ఆహా! పిల్ల యేడ్పునకుఁ దల్లి జోకొట్టెట్టిదో బెణుకునొప్పికిఁ గుమ్మరిపట్ట ట్టిది. అట్లాతండు రెండునిముసములు రాచి జేబులో దాఁచిన యొక తెల్లనిసీసా పైకిఁదీసెను. నాన్ సెన్సు వాణీజ్ దట్ (బుద్దిహీనుఁడా! అదియేమి) అని వైద్యులు కుమ్మరిని గద్దించిరి. “ఇది యాముదము. దీనితో రవంతసేపు తోమెద’ నని కుమ్మరి బదులు చెప్పెను. 'అది Perchloride of mercury:వంటి Poisonsకావచ్చును. కెమికల్ యెగ్జామినేషను చేసినంగాని వీలులే"దని ఘంటాపదముగ వైద్యులు సెలవిచ్చి యట్టు చేసిరి. అంత నాతం డాముదమును మోకాలికి రాచి, నిమ్మళముగ రాచి రాచి, యద నెఱిఁగి కీలెఱిఁగి, మార్దవముతో బింకముగ నొక్కనొక్కు నొక్కెను. దానితో టక్కుమని ధ్వనియైనది. అంత వైద్యులు భయభ్రాంతులై మతులుచెడి కుమ్మరిని జేతులు పట్టికొని యావలికి లాగిరి. పదునైదు దినములనుండి నిద్ర నెఱుఁగని యాతఁడు గురుకపట్టి గాఢముగ నిద్రించుచున్నాఁడు. ఆతనినాడి నొకరు చూచుచున్నారు. హృదయపరీక్ష నొకరు చేయుచున్నారు. గుఱ్ఱుచూచి న్యూమోనియా యేమో యని యొకఁడు సందేహపడినాఁడు. ఎందులకైన మంచిది రోగిలేచు వఱకీకుమ్మరిని గారాగృహ మందుంచుట మంచిదని వైద్యులు తీర్మానించినారు. మఱునాటికే చక్రవర్తి లేచి తిరుగాండ మొదలిడినాఁడు. మహారాజు ప్రాణముపై మహారాజు వైద్యుల కందల కంతయభి మానము, నంతయాదర ముండవలసినదే. కాని చికిత్సా పద్దతియం దంతకంటె తెలివిమాత్ర ముండవలయును.

చిట్టచివరకు దేమనగా, చీటికి మాటకి శస్త్రచికిత్స చేయఁదగదు. శస్త్రచికిత్సాసా ధనము లాయుర్వేదమునం దక్కువగానున్న వని దాని నధిక్షేపించుట పరులయాచారమై యున్నది. అది దానికలంకము కాదు-అలంకారము. అది దానితప్ప కాదు-ఒప్పు. అది దానియధిక్షేపణము కాదు-అభినందనము. శస్త్రవైద్య మంతయావశ్యకము కాదనియే యాయుర్వేదాభిప్రాయము. ఏవో కొన్ని జాతి వ్రణములకు మాత్రమే యది యావశ్యకము. మిగిలిన వ్రణములన్నియు నోషధీమాహాత్యముననే మాన్పందగును. అంగసంఘాతములో నొక్కయంగము చెడిపోయి మిగిలిన యంగముల బాడుచేయు ననుభయము కలిగినప్పడు శస్త్రవైద్య మావశ్యకము. రాచపుంటికిఁ గూడ శస్త్రవైద్య మక్క ఆలేదు. శస్త్రవైద్యమునఁ గాని యది లొంగదను నభిప్రాయము సమంజసము కాదు. దాని కొక్కచిత్రమైనచికిత్సా పద్దతి కలదు. ఆకుఱుపు సంబంధమైన కదు మెంతవఱకు వ్యాపించునో యంతవఱకుఁ జట్టు నొకమూలిక పసరు రాయుదురు. కొన్నిగంటలైన పిమ్మట గోడమీదనుండి పిడుక యూడిన ట్లాభాగ మంతయు నొక్కదిమ్మలాగున నుండి పడిపోవును. పిమ్మట నామూలి కయే నూనెలోఁ గాచి యావ్రణమునకుఁ బూయుచుండ వలయును. కొలఁదిదినములలో మాను పట్టి మచ్చపడును. ఇది విచిత్రమైన చికిత్సాక్రమము. ఇట్టు చేయునాతండు జోలార్ పేటలో నున్నాడు.

శాస్త్రవైద్యము కోటి కొక్కమాఱు విధిలేకుండునప్పడు మాత్రమే జరిగింపవల సియుండఁగా నిప్పడు దాదాపుగా నన్నిరోగముల కదియే యవలంబించు చున్నారు. ఇంజెక్షను శస్త్రవైద్యము కాదా? నెత్తుటిలోనికిఁ బోయినది సూది యైన నేమి, కత్తి యైన నేమి? మందేమి, విందేమి-నోటిగుండం బోవవలసినదే. నోటి ద్రవములతోఁ గలసి పదనై పరిపక్వమై యుదరకోశములోనికిఁ బోవలసినదే. అచ్చట వివిధము లగుజాఠ రరసములతో మేళన మొంది రక్తములోఁ జేరి యన్ని కోశములందు సహజమై సంచలన మొంది సౌఖ్య మీయవలసినదే—ఈక్రమమా వస్థలలో మందున కేలోపము కలిగినను నది సహజమైన గుణ మీయదు. భగవంతుఁ డేర్పాటుచేసిన క్రమ మది. దానికి వ్యతిరేక మగుపద్దతి యసహజము కావున ననర్హము, అనుచితము. తాత్కాలికముగ ఇంజెక్షనువలనఁ గొంత గుణ మగపడినను నది ప్రబలాపాయమునకు ముందు ముందు కారణము కాకమానదు. ఇంజెక్షనువలని యపాయము లిప్పటి పాశ్చాత్యశాస్త్రజ్ఞలు కొందరుకనిపెట్టి యాచికిత్పాపద్దతికి నిరు త్సాహ మిచ్చుచున్నారు. మసూరిటీకాలుమాత్రము? వానియందు జనుల కెంతగౌరవ ముండెను? ఎంతనమ్మక ముండెను? పాశ్చాత్యులలోనే టీకాలు ప్రాణాపాయకరము లని వాదించు నొకతెగవారు బయలుదేరినారా, లేదా? అసహజములైన పద్దతు లన్నియు నప్పడో, యటుపిమ్మటనో యపాయకరములే; అనువినాశకము-అందుచే ననవలంబనీయ ములే, నిద్రకింజెక్షనా? నిద్ర కింజెక్షను తీసికొన్నవారికి రక్తమందసహజమైన వేడిమి బయలుదేఱికి పిత్తాధిక్య మొనరించి, కార్డెమును బాడుచేసి యెంత శాశ్వతమైన యపకృతి నాచరించినదో యెరుఁగుదువా? ప్రజల కన్నివిషయములందుఁగూడ శాంతి, యోపిక, యోజనము, దూరదృష్టి పూర్వవస్త్వభిమానము తొలగిపోవుటచేతనే వారు తాత్కాలిక సుఖముకై దేవులాడి దేహమనస్తత్త్వములు శాశ్వతముగాఁ బాడుచేసి కొనుచున్నారు.

సూదిపోటే తత్త్వవిరోధ మని, తప్పని, తగదని చెప్పినప్పడు కత్తికోఁత యెట్టిదో వేఱ చెప్పవలయునా? కొన్ని కొన్ని వ్రణములకుఁ దప్పనిసరి యైనప్పడు శస్త్రచికిత్స యుండనే యున్నది. అన్ని వ్రణములకు మాత్రము శస్త్రచికిత్స సాధ్యమగునా? గొంతుక లోని వ్రణముమాట యేమి? అది కంటికి దొరకునా? కత్తి కందునా? వ్రేలికందునా? పట్టికి లొంగునా? ఇట్టివ్రణములను శస్త్రసంపర్కము లేకుండ బాగుచేసినవా రెందఱులేరు? రోగికంటికిఁ గ్రంతలు గట్టిగ గట్టించి పాదరసపుఁ బొడి నాతనిచే లోనికిఁ బీల్పింపఁజేసి ప్రణమును సులువుగా బాగుచేసినవారు వ్రణవైద్యులుకారా? కత్తితోఁ గోసినవాఁడే శస్త్రచికిత్సకుడా? శస్త్రవైద్యమున సంపూర్ణప్రజ్ఞ నొందిన పాశ్చాత్యులు నారకుఱుపున కేమి చేయఁగలరు? కత్తితోఁ, గోయఁగలరా? చిమ్మటతో లాగఁ గలరా? పరిపక్వదశ కైనఁ బట్టువేయ గలరా? అదికూడ నక్కఱలేదు. కురుపుస్థాన మేదో నిర్ణయింపఁగలరా? ఏమి చేయఁగలరు? రోగి మాసములకొలఁదిఁ గోండ్రింప వలసినదే! లోనుండి నిమ్మళముగ వచ్చునారను జిన్నపుల్లకుఁ జట్టుకొని భద్రముగ బాట్లు పడవలసినదే? త్రాడు తెగిన యెడలఁ దనువంతయు నార ప్రాంకవలసినదే? నరలోకానుభవము నరలోకమున నొందవలసి నదే? దీనికిఁ జికిత్స లేనేలేదా? లేకేమి? గురివెంద గింజయెత్తుగల యొకమందు నరటి పండులోఁ బెట్టి యేడుదినము లిచ్చిన యెడల నార యంతయు నొక్కసారి యూడి యీవలం బడిపోవును. ఏండ్ల కేం ధేడ్పించెడునట్టి దేడుపూటలలో సంపూర్ణముగ బాగగును. విచిత్రమైన యోషధికాదా? రసమా, విషమా, గంధకమా, పాషాణమా? ఏమియుఁగాదె! కంబము గిద్దలూరు మారికాపురము నంద్యాల బళ్ళారి హుబ్లి ఆదోని మొదలైన తావులందే కాక యుత్తరదేశ మందీ కుఱుపు బాధ పడువా రనేకు లున్నట్లు వినుచున్నాము.

కావునఁ జెప్పఁబోవున దేమనఁగా?-శస్త్రవైద్యము పనికిరాని వ్రణము లెన్నివిధములై నవో యున్నవి. వ్రణములకే దానిపని యక్కఱకు రానప్ప డితరరోగములకు శస్త్రచికిత్స నాచరించుట హాస్యాస్పదము కాదా? జలోదరమునకు శస్త్రచికిత్సయెందులకు? కాళుల కుబ్బు కలిగినప్పడు, మొగమున కుబ్బు కలిగినప్పడు రంధ్రము పొడిచి నీరు తీయుచు న్నారా? మందిచ్చి యానీటిని హరింపఁజేయు చుండునప్పడు జలోదరమునకు శస్త్రచి కిత్స యెందులకు? నీరొకసారి తీసివేసినప్పడు రోగి కర్మముచాలక జీవచ్చవమువలె బ్రదికియున్నను మూడవసారి చచ్చుట ముమ్మాటికి నిశ్చయము కాదా? ఈరోగమున కనుపమానములైన యాయుర్వేదౌషధము లుండఁగా వానిని సేవింప నొల్లకపోవుట జీవింపనో ల్లకపోవుటకంటె భిన్నమా?

స్త్రీల కందఱకుఁ బ్రధానముగ నున్నవ్యాధి మలబద్దత. గృహిణీ ధర్మమును యథావిధిగ నిర్వర్తించుటకై రేయుంబవళ్లింటిలోనే యుండి మంచిగాలి వెల్తురులేక, తగినవ్యా యామములేక, వేళపట్ల భోజనము లేక పచనాదిక్రిములందు దడిగుడ్డలు కట్టుకొనినఁగాని పనికి జరుగుపాటు లేక, పిల్లలయేడ్పులతో రాత్రి నిద్రలేక పడుచున్న బాధలవలన మొట్టమొదట మలబద్దత యారంభమై యదియే మందాగ్నిగ బరిణమించును. అడ్డబాస యున్నయాడు దిప్ప డెట్టు లేదో యజీర్తి లేని యాడు దట్టు లేదు. మొగమునకు మెరుగు రాచికొనుటయందు వీరి కున్న శ్రద్దలో సగమైన మందాగ్నిని గుదుర్చుకొనుటలో వీరి కున్నయెడల వీరి కొంటిపూటసాపాటు లుండునా? భర్తల కణాబిళ్లలపై సంతకము లుండునా? బిడ్డల కూసరపాట్టలు సుద్దకట్టు లుండునా? అగ్నిమాంద్యమున కాయుర్వేదౌష ధములు సేవింపలేక, యథావిధిగాం బథ్యము సేయలేక, జిహ్వాచాపల్యము నడఁచుకొనలేక, యంతకంతకు రోగవృద్ది చేసికొను చున్నారు. మన మందులు మంచివి కావని మహర్షులను దిట్టుచున్నారు. ఆసుపత్రులకుఁ బోయి యానీ రీనీరు త్రాగుచున్నారు. దొరసానులచేఁ బరీక్ష చేయించుకొనుచున్నారు. వారిచేఁ గడుపు కోయించు కొనుచున్నారు. మరణో న్ముఖలై బిడ్డల పుణ్యమున మరల బ్రదుకుచున్నారు. మందాగ్ని తగ్గినదా? దేహమునకుఁ బాటవము తగ్గినది. నరములలో శక్తితగ్గినది. మొగములోఁ దేజస్సు తగ్గినది. కంటికి దృష్టి తగ్గినది. మనస్సులో నుత్సాహము తగ్గినది. బ్రదుకునం దపేక్ష తగ్గినది. అంతేకాని మందాగ్ని తగ్గుటే! జిలజిల మని జిల్లుమని జాఠర రసములు కడుపులోని కూరుట లోనికిఁ దీసికొన్న రసాయనము వలనను, గల్పముల వలనను గలుగవలయును గాని కత్తికోఁతవలనఁ గలుగునా? భగవంతుని నిర్మాణము ననుసరించి కడు పెట్టున్నదో దాని నష్టే యుండనీయ వలయును గాని దానిని మామిడికాయతరిగినట్టు తరిగితరిగి కుట్టి దానిని గురూపను జేసినతరువాత నది సహజమైనపని చేయఁగలదా? భగవంతుఁ డేర్పఱచిన సంచలనము దాని కిప్పడు చెడినదా లేదా? లోని యాహారమును నొక్కగలశక్తి, నలుపఁగల శక్తి గిరగిర త్రిప్పంగలశక్తి ముందునకుఁ ద్రోయ గలశక్తి కత్తివ్రేటు తిని కుట్టుపడిన కడుపునకు దైవసం కల్పమున నుండిన ట్లుండుట కవకాశ మున్నదా? పంటకుసి (దంతకుసి) కత్తిచేఁ గోయించుకొనుటచే దౌడపై నరయంగుళము లొట్ట యున్నవాఁడు సెనగలు నీయంత విశృంఖలముగ నమల గలఁడా? ఏయవయవమునకుఁ గత్తికోఁత కలిగినదో యాయవయవములో దీఱనిలోపము చేరిన దన్నమాట. మూలశంకరోగమునకు శస్త్రచికిత్స చేయించుకొన్నవాని కాసనరం ధ్రము మునుపటికంటె శాశ్వతముగాఁ దగ్గినదా లేదా? గంటల కొలఁది వీరు పెరళ్లలోఁ గూరుచుండి విరేచనము తెమలక పోవుటచేత, నెంతకు సంతుష్టి లేకపోవుటచేత బ్రదు కెల్ల భ్రష్టమైనదని యేడ్చుచున్నారా లేదా? మూలశంక నిర్మూలన మైనమెడల నీయేడుపులు గణింపవలసిన పని లేదు. పోయినదా? ఆ. సొమ్ము-సుఖమొందుదు మనునాశ–అంతేకాని యది పోవుటే? తిరిగి పిలుక బయలు దేరుచున్నదే. గులాబికొమ్మ మొదలంట గత్తిరించి తిమి. తిరుగ నంకురించినదా లేదా? మొవ్వులోని కనటిని నఱకి వైచితిమి-తిరిగి మొలకెత్తి నదా లేదా? "కాటరైజు’ (కాల్చుట) చేసితిమికాన నింకరాదని వైద్యులు చెప్పినమాట నమ్మవలదు. భూమిని గాల్చివైచినను జికిలింత మొలవలేదా? చీపురుమొక్క తలయెత్త లేదా? కాల్చుటచేత మరింత శీఘ్రముగ, మఱింత యెత్తుగ నంకురించినది. అటులే కడుపు కోయుటచేతనే యజీర్తి మఱింత వృద్దియగుచున్నది.

కడుపులో గుల్మములు, గడ్డలు మొదలగునవి యన్నియు లోనికౌషధమును తీసికొని కరఁగించుకొని నిర్మూలించుకొనఁ దగినవేకాని కత్తిచేఁ గోయించుకొన దగినవి కావు. తాత్కాలికమగు దోషమే కత్తిని వారింపఁగలదు కాని దోషకారణమును నాశమొనర్పఁగలదా? కారణమును గనుఁగొని దానిని భేదించిన యెడలఁ గార్యముఁ నాశనమగును గాని కార్యమును దొలగించినయడల గారణము నశింపఁగలదా? చింతచెట్టును జంపఁ దలంచినవాఁడు తల్లివేరు తెగ వ్రేయవలయును గాని చింతాకు దూయునా? ఈసందర్భమున నొక్క సంగతిమాత్రము చెప్పి విరమింతును. జ్వర మనునది మఱికియొక వ్యాధికి లక్షణము కాని యది ప్రత్యేక వ్యాధి కాదు. అజీర్తిచే, బసరుచే, వామముచే, బడలికచే, నింక ననేక కారణములచే జ్వరము రావచ్చును. ఆహారనిద్రావ్యత్త్యస్త పరిస్థితులచేఁ గలిగిన వాతపిత్తశ్లేష్మ దోషముల వలనను,"వాని సంయోగము లవలనను గలిగిన జ్వరములు మాత్రమే చికిత్సార్హములు జ్వరము ప్రధానవ్యాధి కాదు. కావునఁ బ్రధానవ్యాధి యేదో కనిపట్టి దానికొఱకు మందీయవలసినదే కాని జ్వరము తగ్గించుట కెన్నఁడును మందీయఁదగదు. జ్వరమునకు మనము తఱచుగా శీతాంకుశరసము, ఆనంద భైరవి, స్వచ్చన్నభైరవి, వసంత మాలిని, వైష్ణవీరసము, కాకకూటము, వాతరాక్షసము మొదలగు నౌషధములు వాడుదుము. అన్నియుఁ గూడ నన్నిజాతులజ్వరములకుఁ బూర్వులే శాశ్వతములైన (Prescriptions)గా నేర్పాటుచేసి యుండిరి. శుద్దపిత్తజ్వరమున కొకటి. శుద్దళ్లేష్మజ్వరమున కొక్కటి. శుద్దవాతజ్వరమునకొక్కటి. శీతపిత్తజ్వరమున కొక్కటి. శ్లేష్మపిత్తజ్వరమున కొక్కటి. శ్లేష్మవాతజ్వరమున కొక్కటి. ఈకూడికలలోఁ గలుగునవాంతర భేదములకు మరికొన్ని మహర్షులు నియమించిరి. ఇవి జ్వరౌషధము లన్నమాటయే కాని జ్వరమును దగ్గించున వెంతమాత్రమును గావు. జ్వర కారణములగు దోషములను హరించును. వీనిలో శుద్దిచేసిన నాభి కలసిన మందులు గొన్నియున్నవి. అవి మాత్రము జ్వరితుని దేహమునుండి రవంత చెమటను వెలువడఁ జేయును. ఆస్పిరిన్ ఫినాసిటిస్ మొదలగు మందులు వాడఁదగదు. ఆమందులు తఱచుగ నిచ్చి జ్వరము చప్పన జారిపోవు దుష్టస్వభావమును దత్త్వమునకు మప్పఁగూడదు. అదియెంత ముప్పనకైనఁ గారణము. వానివలన హృదయకోశము బలహీన మగును. రక్తములో వేఁడి తగ్గిపోవును. నరములకు బటుత్వము కయించును. ఆనంద భైరవ్యాది రసములు హృదయ బలమును గాపాడుచు, రక్తోష్టతను రక్షించుచు, నరములకు వాతదోషము రానీయకుండ దోషకారణ మును దొలగించి జ్వరవిముక్తి చేయును.

పర్యవసాన మేమనంగా:- శస్త్రచికిత్సవలనఁ గార్యనాశనమే కాని కారణనాశన మెన్నఁడుఁగాదు. కారణనాశనమున కౌషధ సేవ కంటె వేరుమార్గము లేదు. అవసరానుసార ముగ నన్నిచికిత్స, లాయుర్వేదమున నున్నవి. మీకుఁ జదువు కొనుట కోపిక యుండవల యును; తెలిసికొనుటకు బుద్దియుండ వలయును; ఆచరించుటకు దీక్ష యుండ వలయును. అన్ని యునుండియు నేమియు లేన ట్లేడ్చుదేశము ప్రపంచమందిది యొకటియే. శ్రుతు లున్నవి; స్కృతు లున్నవి; శాస్త్రములున్నవి; పురాణము లున్నవి; సమస్త కళ లున్నవి; కాని మనది యను నభిమానము మాత్ర మింతవరకుఁ బూర్తిగ కలుగలేదు. ఇప్ప డిప్ప డేదో మాఱువడి దేశకాలములందుఁ గలిగినట్టు కానబడు చున్నది; కావునఁ జెప్పచు న్నాను. దేశీయ దేవతల నారాధింపుడు; దీశీయర్షులను బూజింపుఁడు; దేశీయ గ్రంథములను జదువుఁడు; దేశీయకళ లభ్యసింపుఁడు; దేశీయ కర్మముల నాచరింపుడు; దేశీయతలోఁ బుట్టి, దేశీయతలోఁ బెరిఁగి దేశీయతలో మృతినొందుఁడు.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.