సాక్షి మూడవ సంపుటం/ఉన్మత్తుని ప్రలాపము

వికీసోర్స్ నుండి

9. ఉన్మత్తుని ప్రలాపము

ద్రాసులో తిరువల్లిక్కేణి సముద్రతీరానికి షికారు వెళ్లాడు జంఘాలశాస్త్రి. అక్కడ రకరకాల మనుషుల్ని చూశాడు. అద్భుతమైన సముద్ర సౌందర్యాన్ని సాయం సంధ్యా సౌందర్యాన్ని చూసి పరవశించకుండా, నానా సంసార విషయాలతో సతమతమయ్యేవాళ్ల ధోరణిని ఏవగించు కున్నాడు. కంటికి తనివి తీరనంతగా చూడదగింది ఆకాశం. అలాగే చూడదగిన రెండోది సముద్రం.

సముద్రపు హోరునే శ్రుతిగా చేసుకుని పాడుకుంటూ ఉత్తరం దిక్కుగా నడిచాడు శాస్త్రి. అక్కడ బాడిదె కర్ర తెప్ప మీద ఒక్కడూ కూర్చున్నాడొక పిచ్చివాడు. దేశభక్తుడో దైవభక్తుడో అనుకుని దగ్గరకు వెళ్లాడు.

ఆ పిచ్చివాడు ఉద్యమాల్ని, ఉపన్యాసాలిచ్చేవాళ్లనీ తెగ తిడుతూ జంఘాలశాస్త్రితో మాట్లాడాడు. దేశభక్తి జాతీయ ఐక్యం గురించి ఉపన్యాసాలు ఎవరూ ఇవ్వరాదని నిషేధిస్తున్నాడు. ఇప్పటి జాతి భేదాలకు, కులభేదాలకు, మనుషుల మధ్య పరస్పరం కుమ్మలాటలకు కారణం ఈదిక్కుమాలిన ఉపన్యాసాలే అన్నాడు. ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్లంతా స్వలాభం కోసం పాకులాడే శుంఠలే నన్నాడు. ఈ ఉపన్యాసాల వ్యాధి ప్రబలడానికి ముందు దేశంలో జాతులు, కులాలు నిజంగా సఖ్యంగానే వున్నాయన్నాడు. అప్రయత్నంగానే బాగావున్న స్థితిని ప్రయత్న పూర్వకంగా తగలబెట్టారన్నాడు. మీ ఉపన్యాసాలే సందేహాలకీ, అవిశ్వాసాలకీ కారణమన్నాడు. రాట్నపు ధ్వని తప్ప, నోటితో మాటలాడరాదని నిషేధించాడు. ఆచరించని మనుషులున్నంత కాలం జాతి కర్మ మింతే అన్నాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

మదరాసులో సముద్రతీరమున నీనడుమ నొక సాయంకాలమునం దిరుగుచుంటిని, పవనభక్షిణమునకై కొందఱు, పడుచు విలాసినులఁ జూచుటకై కొందఱు, పనిలేక కొందఱు నటుకువచ్చి క్రిందిచూపులతో నిట్టులట్టు లల్లోడుచు, నిట్టె కలియుచు, నుట్టే వేఱగుచు, వంక దండములతో, మాయాకరచాలనములతో, దొంగనవ్వులతో, వింత యిగిలింపులతో సంధ్యాసమయమును సంపూర్ణముగఁ జంపుచున్నారు. మనుజహృదయము నఫై యట్టెజె వ్యాపింపఁజేసి, యట్టె యట్లై విశాలమగునట్లు చేసి ప్రకృతి పరీవాహమున లీనమగునట్టు చేయఁగల సన్నివేశములు సృష్టిలోఁ బ్రధానముగ రెండున్నవి: మొదటి దాకాశము; రెండవది సముద్రము. కన్ను తనివి లేకుండ జూడఁ దగినది మొదటిది మిన్ను; రెండవది మున్నీరు. సంధ్యాకాలమున నీరెండును మదరాసులోని తిరువళ్లిక్కేణి ప్రక్క నెంత మహాసౌందర్యసమ న్వితములై యుండునో యనుభవింప వలసినదే కాని వచింపఁ దరమా? అట్టి పరమోత్కృష్ణ మైన స్థలమునఁ జేరినజను లేమిచేయుచున్నారో విందురా? అత్తగా రాండు బిడ్డవీరలకై యింటిలో బియ్య మమ్ముచున్న దని భర్తతో భార్య చెప్పచున్నది. సంసారచౌర్య కథనము సముద్రతీరముననే కాని సముచితముకాదా? ప్రకృతి సౌభాగ్యరంగమునం బనికిమాలిన పడమటింటి గొడవ యెందులకు? ప్రకృతి సౌందర్యగ్రహణశీలుం డగుభర్త భార్య మాటలు వినుచుఁ బల్లెవానితో రొయ్యపప్పు బేరమాడుచున్నాఁడు. పాఠశాలలలోఁ జదువుకొనుచున్న బాలురు నారీకలాశాలలలోని వితంతువుల వింతలు చెప్పకొనుచు వెకవెకలాడు చున్నారు. నాలుక యల్లాడు చున్నంతకాలము నారీమణి నధిక్షేపింపజాలని మూఢుఁ డెవఁడు? ఆమా టలు రవంతవిన్న యొకయాంద్రోపాధ్యాయు డచ్చటి యబలాసంఘము లందలి యద్బుత సన్నివేశములవంటివి మఱెక్కడ నుండవని తా నుంచుకొన్న పూటకూటింటి వూవుబోడికి బోధించెను. ప్రభువులపై, బడతులపై బనికిమాలిన ప్రసంగము లొన ర్చుట కేమంత ప్రయోజకత్వము కావలయును? నోటిలోఁ జేయిపెట్టినం గఱవ జాలని శక్తిహీనుఁడైన నందులకు సమర్ధుఁడే కాదా? మఱియొక చోటఁ గొందఱు సై మనువ్యవహార సందర్భమునం దురకలనోటనుండి వెడలిన బూతులఁ గూర్చి, చేతినుండి వెడలిన చెడావులంగూర్చి చెప్పకొనుచున్నారు. ఇటులె పనికిమాలినవార్తలతో, దిక్కుమాలిన సోదె లతో, నవకతవక గాథలతో, ననర్హము లయిన యెత్తిపొడుపులతో నచ్చటివారు కాలక్షేపమొన ర్చుచున్నారు. పెద్దపీఁత కాలిపై బ్రాఁకఁగఁ గంపమంది గగ్లోలయి యెగురబోయి నెత్తిపై ముసుగు జాఱి గ్రిందఁబడిన వితంతు నారీమణిని గాంచి హేహే హే యనువారె కాని రాజధానీకళాశాల వెనుక నారికేళవృక్షముల తోఁపులో సహస్రకోటిజపాకుసుమతేజో రాశియై యధఃపతన మందుచున్న నభోమణిని గాంచి హాహాహా యను వాఁడైవండైన నున్నాడా?

ఈగొడవ నా కెందుల కని యిట్టి మహావిచిత్ర ప్రకృతి కధీశుండగు పరమేశ్వరుని నముద్రపుహోరు సుతిగఁ జేసికొని గాన మొనర్చుకొనుచు నుత్తరదిశాభిముఖుడనై కొంత దూరము పోయితిని. అక్కడ బాడిదెకఱ్ఱ తెప్పపై నొక్కడు కూరుచుండి యున్నాడు. అతడు ఖాదీవస్త్రములను ధరించి యున్నాఁడు. ఎవడో దేశభక్తుఁడు, దేవభక్తుఁడని నిశ్చయించుకొని యాతనియొద్దకేంగి నిలువబడితిని. నన్నుఁ జూచియాతడిట్టనియెను:

“బైఠో బైఠో భే!.....కూతుకొండు రాయరే కూతుకొండు. ఆడడా! ముత్థాన్-ఉకార్ —ఉకార్-బన్ కూరుచుంటివా బన్-కం. ఊరక రారు మహాత్ములు, మీరలు మాయింట కిపుడు మేలొనఁ గూడెన్, గూరిమి మీఱిన పలుకుల, ధోరణితో విం దొనర్చి తుష్టం జేతున్. ఆశుకవిత్వము చెప్పఁగలవయ్యా? 'సీ. బిరుదైన కవిగండ పెండేరమున కీవ తగుదని నాదుపాదమునఁ దొడిగెనని యన్నవాఁడు పెద్దన్నయే కాదా? తాళ్లపాక చిన్నన్న యుండుటచేతనే యాతండు పెద్దన్నయైనాడు. Relativity of knowledge అనంగ నిదియే సుమా! నీవెప్పు డుంటివో నే నప్పుడున్నా నన్నమాటయే. నీవు నా కాధారము, నేను నీకాధారము. అన్యోన్యాధారము మన కెక్కడకుఁ బోయినను దప్పనేతప్పదు తెలిసినదా? అంత తప్పనియాధారమున్నను గేవలము మందభాగ్యముచే దార్కికులకుపాదానకారణము కలిగినది. భవతి భిక్షాం దేహి యని భగవంతునైనను మోక్షమును గూర్చి యాచించుట తప్పయినపుడు మారాజ్యము మా కిమ్మని సర్కారువారిని యాచింతుమా. థూ; అదినామర్దా I am the monarch of all I survey; నిన్నడ్డుకొన్నవా డెవడు? నీయిష్టము వచ్చినంత రాజ్యము పరిపాలింపవయ్యా. ఈప్రపంచములో నీదికాని దేమున్నదయ్యా! మూడుడవై బానిసవై తుచ్చుఁడవై భికుకుడవై దేహి యని చేయిచాచెదవా? చాచినచేతితో బ్రహ్మరంధ్రము మీఁదఁ గొట్టుకొని ప్రాణములను విడువుము. అది నీకు గౌరవము, అది నీకు మనుష్య ధర్మము. అంతే కాని తెలివిమాలిన యుద్యమము లెందులకు? హరతాళము లెందులకుఁ జేయుచున్నారు? ఏమి యూహము? ఏమి ప్రయోజనము? అంతకంటెఁ దెలివిమాలిన యూపన్యాసము లెందులకు! ఇంక నుపన్యాసము లిచ్చినయెడల నీగొంతుకోసెదను. హె హె హె ఖబర్ దార్. దారులలోకెల్ల జమీందారీయని పిచ్చిరామశాస్త్రి చెప్పిన మాట జ్ఞప్తియున్నదా? ఒక్కజమీందారియాస్థానములో నొకదాసి గుఱ్ఱది పెంపఁబడు చున్నది. పదుమూఁడేండ్లది, బనారనుకాజా! గులాబ్జామిన్! బురాఖ్ బొమ్మ-వహవ్వ సుజపండిత సాంబయ్య చెప్పినట్టు తులముతులము మోతాదు చొప్పన గుటుకు గుటు కున మింగిఁ దగినది. దానికిఁ గన్నె చెఱ బావుటకై యెవఁడైన మహారాజపుత్రుని దెచ్చితివేని మాజమీందారీ నీకు దానవిక్రయాది సర్వస్వాతంత్ర్యములతో ధారాదత్త మొనర్పనియెడలఁ జెవి కదపా."

“అయ్యా, అంతటితో నాగుము. తప్పధోరణిలోఁ బడిపోవుచున్నావు. దేశభక్తిని గూర్చి, జాత్యైకమత్యమునుగూర్చి యుపన్యాసము లీయవలదని యెందులకు చెప్పినావు? రవంత మనస్సు శాంతపఱచుకొని చెప్పడు' అని నే నడ్డు తగిలితిని.

“ఉపన్యాసముల సంగతియేనా? చెప్పకుందునా? తొందరపడకోయి పూల్. ఉపన్యా సము, ఉపన్యాసము, సన్న్యాసము, సన్యాసము. సన్న్యాసి యగువాఁడు అధవా విధవాశ్రేష మను నాపకన్యాయముచేత విటుడైనప్పడు వితంతువు యోగినియైనట్టా? సన్యాసి సంసారి యైనట్లా? ధర్మసూక్ష్మ మాలోచించి మరిచెప్పము. శూద్రుఁడు యజ్ఞోపవీతధారణ మొనర్చినాఁడు; గాయత్రికి శూద్రత్వము వచ్చినట్టా? శూద్రునికి బ్రాహ్మణత్వము వచ్చి నట్లా? బ్రాహ్మణుడు మహమ్మదీయమతానుసారముగ నుపనయనము చేసికొన్నప్పడు బ్రాహ్మణునకు మహమ్మదీయత్వ మెంత వచ్చి యేడ్చినదో శూద్రునకు ద్విజత్వ మంత వచ్చి యేడ్చినది.

“విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః.

అను భగవద్గీతాళికమున కిక్కడ బప్పడుక దయ్యా, తెలిసినదా. కం. “పప్పేపస బ్రాహ్మణులకు, నుప్పే పస రుచులకెల్ల నువిదలకెల్లన్, గొప్పేపస' యన్నాడుగదా. ఇక్కడఁగవియువిదతనమునకుఁ గొప్పనకు నవినాభావ సంబంధము చెప్పినాడుకదా! వితం తుత్వము వచ్చినప్పడు కొప్పెగిరి పోయినది. పోలేదా? కాని స్త్రీత్వమున కేమిలోపము వచ్చినదయ్యా? నేను బ్రతిపాదించిన పూర్వపక్షము నీకు బోధమైనదా? తెలివిమాలిన మొగముతో నట్టు నిరర్ధకమైనజూపు చూచెదవేమి? బ్లాక్ హెడ్ ! అదికాక వితంతువు మైనవస్తువును మన మంటగూడదు. కావున నాచారకాండ ననుసరించి దానిని విసర్జింతము. వదలితివికదా! ఇంక నావైపున నాశపెట్టుకొనవుకదా! సరే పుణ్యస్త్రీనే తీసికో, ఉభయతారక మైన పద్దతిని మన మవలంబించుటకు సందేహమేల? ఇప్పటి పుణ్యస్త్రీలకుమాత్ర మందఱకుఁ గొప్పన్నదా? ఉంగరాల గిరజాలుంచుకొన్నంత మాత్రముచేత నువిదతన ముడాయించినదా? క్రాపువెండ్రుక లుంచుకొన్నంతమాత్రము చేత ప్రధానమైన సుదతీ త్వము సున్నయైనదా?

పదము 'మెడను గుత్తికకంటు లేదోయి నాస్వామి
మొగముమీదను బొట్టు లేదు
కప్పకొప్పబదులు క్రాపోయి నాస్వామి
మగడు మిగిలిన కురిడిసఱకు"

“ఇంకఁ జాలింపవయ్యా ఒక్కశేు పనికిమాలిన ధోరణియా? ఉపన్యాసము లిచ్చువారి గొంతు కోసెదనంటివే. దానికిఁ గారణ మేమని నే నడిగితిని."

"జ్ఞప్తిలేక మానివేయలేదయ్యా! స్టుపిడ్ ! జ్ఞప్తియుండియే మఱచిపోయినాము. చూచి తివా, విరోధాభాసాలంకారమునకు మన వాణియే ప్రాతిపదిక.

ఆగజానన పద్మార్కం గజానన మహర్నిశం,
అనేకదంతం భక్తానా మేకదంత ముపాస్మహే.

గజదంత మని గ్రంథములలోఁ బ్రయోగమున్నది. "తత్రహేతు రదంతతా" యను టచే మనుష్యదంత మని ప్రయోగమున్నది. మేకదంత మను ప్రయోగ మేమిరా? నీమొగ మని సాగదీసి యొక్క లెంపకాయ నిన్నుఁ గొట్టునెడలఁ గవికి బుద్దివచ్చును. చెప్పవచ్చినవా నిని జెంపకాయ కొట్టినప్పడు పైయూరివా రా పాముకాటు నిమ్మదించినదా లేదే? మే మసంబద్దముగా మాటలాడువారము కాము. మాకు మతి లే దనుకొనుచున్నావు కాఁబోలు. మతి లేకపోవుట నీకా, నాకా? నామతిలేని మాటవలన దేశమున కేమినష్టి వచ్చినదో నీవు చెప్ప, మీమతిలేని మాటలవలన దేశమునకెంత దుర్గతి వచ్చినదో నేను జెప్పదును. కాచికో, చూడు. ఆ. ఇప్పడు తెర రవంత తొలగిన ట్లున్నది. మన స్సిప్పడు రవంత నిర్మలముగా నున్నది. ఈసమయములోనే చెప్పవలసిన దేదో యొక్కవాయలో నలగఁ గొప్టెదను.

పదిపదునాల్గు సంవత్సరముల క్రిందట దేశములో నింత యశాంతి యున్నదా? ఇన్ని మతక్ష లున్నవా? ఇన్ని శాఖావైషమ్యము లున్నవా? ఇన్ని తిట్టులాట లున్నవా? ఇన్ని కొట్లాటలున్నవా? ఇంత రక్తపాతమున్నదా? ఇంతమహారోదన మున్నదా? మీతెలివిమాలిన యుపన్యాసములే దేశము నింత భ్రష్టపఱచినవి. ఇంతకుముందు బ్రాహ్మణులు నబ్రాహ్మ ణులు నెంత కలసి మెలసి యుండెడి వారు. అన్నా, మామా, బావా, యను వరుసలతో వొకరి నొకరు పిలుచుకొనుచు నొక్క కుటుంబములోని వారివలె నుండెడివారు కారా! వీరి వారి స్త్రీ లత్తా, వదినా, అక్కా యనువరుసలతో నొకరినొకరు పిలుచుకొనుచు నీరక్షీరన్యా యముగా నుండెడివారు కారా? ఇప్పడు గజకచ్చపన్యాయము గానున్నారా లేదా? పంచము లతోనెన్నఁడైన మన కరమఱిక యుండెనా? వారు మనముంగిళ్లలోనికి, పెరళ్లలోని కెంత స్వేచ్చగా వచ్చుచు; బోవుచుండెడివారు? వారు మనయెడల నెంతదయతో, నెంతవిశ్వా సముతోఁ బ్రవర్తించుచుండెడివారు? దొంగలవలన మనయాస్తి కపాయము, వస్తువుల కపా యము సంభవించునప్పడు మనలఁ గంటికి తెప్పలవలెఁ గాపాడిన వారు వారే కారా? ఏవో జాతిసంబంధములైన పూర్వపు కట్టుపాటుల ననుసరించి తనువులు వేరుగ నుండెనుగాని వారికి మనకు మనస్సులయందెంత మైక్యముండెడిదో మీ రెఱుంగరా? వా రెఱుఁగరా? భారతదేశ రక్షక దేవత లెఱుఁగరా? వారికి మనకు నిప్పడు మూషకమార్థాలవైషమ్య మెందులకుఁ గలిగెను? మీ బుద్దిహీనోపన్యాసముల మూలమునఁ గలిగినది. వారియస్పృశ్యత తత్ కణము మానుపవలయుననియు, వారిని దేవాలయములోనికి వెంటనే రానీయవలయు ననియు, వారితో బం క్తిభోజనము లుత్తరకణముననే కానీయవలసిన దనియు మీరు లొడ లొడ యుపన్యాసము లిచ్చినంత మాత్రమున మీరు ద్వంద్వాతీతులైన మహావేదాంతు లొక్కసారి యైపోయినా రని వారనుకొనినారా? మీయుపన్యాసములోఁ జేవ యున్నదో, చెత్తయున్నదో వారెఱుఁగుదురా? ఆకస్మికముగ మీ కవతరించిన ప్రేమలలో గుల్ల యున్నదో, గట్టియున్నదో వారు కనిపట్టలేరనియే యనుకొనుచున్నారా? మీరు సమయా నుసారవ చోవిభవాభిరాములైన నటకశిఖామణు లని వారు గుర్తెఱుఁగ లేనంత మూఢులా? మీ నవ్వులు దొంగ నవ్వు లని, మీ యేడ్పులు మొసలి యేడ్పులని, మీరు స్వలాభోద్దేశము చేతనే యీమహామాయానాటక మాడుచున్నారని తెలిసికొన లేనంత బుద్దిహీనులా? వా రట్టిబుద్ది హీనులని మీరు నిశ్చయపజచుకొన్నట్టు వారు తెలిసికొని మీయందు మరింత యాగ్రహగ్రస్తులయి యున్నా రన్న సంగతి యెఱుఁగరా? స్వరాజ్య వాంఛాసమన్వితు లైన మీరు జాత్యైక్యము కొఱకు వారి నిప్పడు కూడఁగట్టుకొనుచున్నారు. స్వరాజ్యమువచ్చుట యెన్నఁటికైన సిద్దించునెడల గేదెకు గేదెయే, దూడకు దూడమే. అప్పడు తల్లి పిల్ల సంబంధము తెగవలసినదే యని వారికిఁ దోఁపక పోవునా? వారి మాట యెందులకు? మీతలపై రామాయణముఁ బెట్టి మిమ్మడుగు చున్నాను. మీకుఁబంచములపై స్వలాభచింతా శూన్యమైన యవ్యాజ ప్రేమ మున్నదా? వెల్ద మొగము వైచికొని, యూరకుందు రెందు వలన? మీలో నందeకి కట్టిప్రేమ ముండనక్కఱలేదు. ఒక్కనికైన నున్నదా? వట్టిమాట, లేదు. దేశభక్తులని బిరుదును నెత్తికిఁ గట్టుకొనఁ గలవు గాని బుద్దున కున్న ప్రేమము హృదయమునఁ బెట్టుకొనఁ గలవా? నీవు రామానుజఁడవైనప్పడు నీ కట్టినిర్వ్యాజప్రేమము కలుగును. ఇంక మాటలాడక, ఒక్కనిమిషమైన నాలస్య మొనర్చక, కలుపులాగివేసిట్టు, బిరుదు లూడదీసికొనుఁడు.

హిందూమహమ్మదీయ సఖ్యమును మీయుపన్యాసములే ప్రధానముగ బాడుచేసినవి. మహమ్మదీయులకు మనకు మతవిషయములైన భేదాభిప్రాయము లున్నను సామాన్య ప్రాపంచిక వ్యవహారములందైల్ల గావలసినంత సఖ్యము చిరకాలమునుండి యుండి యుండెను. మహమ్మదీయ చక్రవర్తి యిచ్చిన యీనాములను, రాజ్యములను ననుభవించువా రిప్పటివఱ కెందరున్నారో యెఱుంగరా? వారి రాజకీయవ్యవహారములందు మనవా రెంత తోడుపడి యుండిరో యెఱుఁగరా? వారికి మనకు నిచ్చిపుచ్చుకొను బాంధవ్యముకూడఁ బూర్వమున మండలేదా? ఏది యెటులున్నను బ్రత్యకమైషమ్య లేశమైన లేకుండం బదునాలుగు సంవత్సర ముల క్రిందటివఱకు సరళముగ, సౌమ్యముగ, సలక్షణముగ జరిగియుండలేదా? అప్రయత్న ముగ బాగుగ నున్నస్థితిని బ్రయత్నమునఁ బాడుచేసితిరే? మీరుపన్యాసము లీయకుండునె డల నిట్టియిక్కట్టు తటస్టించియుండునా? ఏకీభావమున నుండినప్ప డుపన్యాసము లెందులకు? మీ యుపన్యాసములే సందేహమునకు, విశ్వాసరాహిత్యమునకు, మనస్సులోని మాయకు నిదర్శనములై యుండలేదా? కిక్కురు మనకుండ నూరకుండినయెడల యథాపూ ర్వకముగ దినములు దొరలిపోయి యుండునే? జాతికి మరింత యైక్యమును సంకల్పించు కొని మీయుపన్యాసముల మూలమునం బ్రయత్నించిన తరువాతనే జాతి కింతవిభిన్నత కలిగినది; జాతిలో నిన్నివైషమ్యము లేర్పడినవి; ఇన్నికల్లోలములు కలిగినవి. జాతిలో నైక్య మభిమానముచేత, నాదరణముచేత, నన్యోన్యసానుభూతి చేత, నునురాగపూర్వకములైన యాచరణములచేతఁ గలుగునుగాని గొంతుచింపుకొని నందువలన, బల్ల గ్రుద్దినందువలన, గంతులు వైచినందువలనఁ గలుగునా? దేశభక్తులారా! జాతిసర్వాంగకముగఁ జచ్చునంతటి యాపదకు దానిని దెచ్చినారు. ఇప్పడైన మీయుపన్యాసములకు శాంతిఁ జెప్పెదరా? ఇంక మాటలాడ మని శపథ మొనర్చుకొనరా? మీ రిఁకఁ బెదవులు గదల్పకుండునెడల మనస్సులలోఁ గలిగిన నఱుకులు, తమంత తా మదుకు కొనును. చిత్తమునం గలిగిన పుండ్లు తమంత తాము మానును. సన్నిపాతరోగికి నిద్రపట్టినతరువాత దేహము స్వస్టమైనట్లు దేశము సొమ్మసిల్లి రవంత శాంతిపడి, తనంత తానే సుఖస్థితికి రాగలదు. మనము చేయవలసినపనియేమి? మనము చేయుచున్నపని యేమి? “సర్వేజనాస్సుఖినోభవంతు, లోకాస్సమస్తా స్సుఖినో భవం తని సర్వదా సర్వేశ్వరుని బ్రార్ధింపవలసినవారము కామా? ఇంతవిశాల హృదయమైన ప్రార్ధన ప్రపంచమున నెచ్చటనైన నున్నదా? మీరట్టు దైవధ్యాన మొనర్చుకొనుచు మాటలాడకుండ నుందురా? ఒక్కటే మాట-రాట్నపు ధ్వనితప్ప నోటి మాట భారతదేశమున నీదినమున నుండి వినఁబడఁగూడదు. అట్టు మీరాచరింపఁగలరా? అయ్యయ్యో, ఆచరింపరా? ఆచరింపరా? దేశకర్మ మిఁక నింతే? జాతికర్మ మిఁక నింతే? ఇంతే?”

అని యాయున్మత్తు డేడ్చుచు లేచినాడు. “అయ్యా కూరుచుండు'మని నే నంటిని. "నాకు నీబలాత్కారమా Rascal, డొక్క చీల్చెదను. జాగ్రత్త యని యాతండు నాచేయి విదల్చుకొని పాఱిపోయినాఁడు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.