సాక్షి మూడవ సంపుటం/ప్రకృతిశక్తులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

8. ప్రకృతిశక్తులు

జంఘాలశాస్త్రికి, పిచ్చివాళ్లని పలకరించి వారిచేత మాట్లాడించడంలో ఆసక్తివుంది కదా! క్రితంసారి విశాఖపట్నం పిచ్చిఆసుపత్రికి వెళ్లి ఒక మనిషిని పలకరించి, అతను సృష్టిలో నీతి, శాసనం లేవనే పద్ధతిలో మాట్లాడగా- ఆ సంగతి మనకు శాస్త్రి చెప్పాడు కదా! ఈసారి కూడా అదే మనిషిని పలకరించగా, ఆయన విజృంభించి ప్రకృతిశక్తుల గురించి మాట్లాడాడు.

సృష్టిలో 'క్రమం' అనేది సున్న. శాసనం అనేది ఎండమావి. (పేమ అనేమాట పచ్చి అబద్దం. చెప్పక తప్పదంటే, స్వార్దప్రేమే తప్ప పదార్థపేమ ఈ ప్రపంచంలో లేదు. (ప్రేమ' అనే మాటకి-చంపి తినడం’ అని అర్థమైతే, సృష్టిలో కావలసినంత ప్రేమ వుంది. ఎంతసేపు మనిషికి తన తిండి, తన సుఖం, తన డబ్బు, తన కీర్తి-తనకి ఎంతవరకు ఉపయోగ పడుతుందో అంతవరకే ఆలోచన. అంతకుమించి పోడు. ఇందులో కొంచం హెచ్చు తగ్గులుండవచ్చుగాని మూలసూత్రం మాత్రం స్వార్థమే. "పరోపకారం" అనేది ఎక్కడైనా పొరపాటున వుంటే, అది కూడా ‘మారువేషం వేసుకున్న' స్వార్ధమే.

ఆపిచ్చివాడి లెక్కప్రకారం-మూలకారణమైన అనిర్వచనీయమైన మహాశక్తినుంచి అనేక అంధప్రాయాలైన శక్తులు పుట్టాయి. మనుషుల్ని పునాదుల్లోకంటూ కదిలించి ఆకారణంగా జాతులకు జాతుల్నే కూల్చేసే ప్రకృతిశక్తులివి. ఆటలమ్మ, మశూచి వంటవి జబ్బులుకావు. ఇలాంటి అకారణ, ఉన్మత్తశక్తులే. ఈసృష్టిలో క్రమం అనేది లేదు. అక్రమమే సమాజం. ఇన్ని అస్తవ్యస్తాలున్నామనదేశం ఆచారాలలో ఇంకా అనేక ఇతర విషయాలలో విలక్షణమైంది. భయంకర శక్తుల్ని సైతం దేవతల పేర్లతో పూజిస్తాం -అయినా మనుషులకి మతిలేదు అని తేల్చాడు. జంఘాలశాస్త్రి ఈఉపన్యా సంతో ఏకీభవించలేదు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

పిచ్చి యాసుపత్రిలోనిపిచ్చి లేనివానిని జూడవలయునను పిచ్చిచే దిరుగ నాతనియొద్దకుఁ బోయి నిలువబడి, "అయ్యా క్రిందటిసారి నిన్నుఁ జూచినప్పడు సృష్టిలో నీతి లేదని శాసనము లేదని ప్రేమ లేదని యీ పనికిమాలిన సృష్టి నాశన మొనర్చుటయే మంచిదని యేమేమో చెప్పితివే' యని నేనింక నేమేమో యనుచు నుండగనే తీవ్రముగ నాతc డిట్లనియెను.

“క్రమమా? క్రమమే!! అబ్బ క్రమము లేకపోవుటయే క్రమము. శాసనమా? అబ్బ! శాసనహీనతయే శాసనము. ప్రేమలంట! అబ్బ! సృష్టిలో నcట-కథలలో నాటకములలో నుపన్యాసములలోఁ-గలలలో జో అంతేకాని ప్రత్యక్షసృష్టిలోఁ బ్రేమమే! ప్రేమతత్త్వమును బ్రపంచములో నొక్కపగలుమాత్రమే యాచరణములో నుంచుట తటస్టించునెడల సృష్టిలో నున్న సర్వజీవము లొక్కసారి నాశనమగుట కేమైన సందేహమా? ఒక్కజీవము మరియొక్క జీవమునకు జీవనాధారముగా నున్నప్ప డింక బ్రేమ యుండుట కవకాశమేమున్నది? మనుజుఁడు తనతత్త్వమునకు సరిపోయిన యన్నిజంతువుల నన్నిశాకములఁ దిను చున్నాడు. సరిపడక పోయినవానిని మాత్రమే మిగుల్చుచున్నాఁడు. ఒక్కమధ్యాహ్నభోజన ములో నైదారు జంతువుల జీవనములు నన్నములోఁ బదివేల శాకముల జీవనములును ద్రాగునీటిలోఁ బదిలక్షల సూక్ష్మజంతువుల జీవనములును మనుజుఁడు తన పొట్టఁ బెట్టుకొ నుచున్నాడు. వాయుభక్షణమున నెన్నికోట్ల సూక్ష్మజంతువులను నాశన మొనర్చు చున్నాడో చెప్పఁదరమా? ప్రేమమునకు లక్షణము చంపి తినుటయే యగునెడల సృష్టిలోఁ గావలసినంత ప్రేమ మున్నది. దినమునకు నాల్గుకోట్ల జీవనములను గుటుక్కున మ్రింగి గర్రునఁ బొట్టు నింపుకొని, బఱ్ఱునఁ ద్రేంచి, ప్రపంచము ప్రేమమయ మైయున్న దని సభాపీఠముల బోధించు మనుజునే మనవలయును? మోసగాఁ డనినఁ జాలునా? కటికవాc డన్నఁ జాలునా? ఆతని నేమనునెడలఁ దగియుండునో చెప్పము-ఓ! లొడలొడమని యుపన్యసించువాఁడవుకదా? ఏదీ? నీతరమగునా? మనుజుఁడు చేయుచున్న యక్రమచర్య కాతని కనుగుణమైన తిట్టు శబ్దజాలమునఁ జూపం గలవా? "ఏవో కొన్ని జంతువులను గొన్ని శాకములను మాత్రమే మనుజుఁడు బుద్దిపూర్వకముగఁ దప్పనిసరిగc దనలోఁ బడి నశించు ప్రాణుల విషయమున నాతం డేమి చేయవలసిన దని నీ వందువేమో? ఏమి చేయవలసినదా? ఇఁకఁ బ్రేమోపన్యాసములు పలుకక తప్పనియెడల స్వార్దప్రేమమే కాని పరార్దపేమము ప్రపంచమున లేదని స్పష్టముగాఁ జెప్పవలసినదని చెప్పము. ఎంతసేపు తనతిండి, తనసు ఖము, తనధనము, తనకీర్తి-అంతే తన కెంతవఱ కుపయోగించునో యంతవఱకే తలంపు; అంతవఱకే మాట; అంతవఱకే చేష్ట అస్వార్థపరత్వములోనే పెద్దతల యున్న వానికిఁ బెద్దతలఁపు. పెద్దనో రున్నవానికిఁ బెద్దమాట. పెద్దచేయి యున్నవానికిఁ బెద్దచేష్ట్ర పెద్దబుద్ది యున్నవానికిఁ బెద్దయాశ. పెద్దకడుపున్న వానికిఁ బెద్దతిండి. పెద్దబల మున్నవానిది పెద్దపెట్టు. చిన్నప్రకృతి వాని కన్నియు జిన్న-ఇదియే భేదము. ఇంతకంటె భేదమేమియు లేదు. అందరుకూడ స్వార్థపరులు. పెద్దవారి స్వార్థపరత్వముచేఁ జిన్నవాఁడు బాధపడుచుఁ దనకంటెఁ జిన్నవారిని దాను బాధించును. రాజుగారు మంత్రిని జీవాట్లు పెట్టఁగ మంత్రి తనయింటకిఁ బోయి యిల్లాలి నడ్డమైనతిట్టు తిట్టును. ఆమె తనపిల్లను గోపమున దౌడపై నొక్కటి వ్రేయును. ఆపిల్లయుడుకుఁబోతుదనమునఁ దనబొమ్మను నేలవైచి పగులగొ ట్టును. ఎంతసేపు నొకనిచేయికంటెఁ దనచేయి పైనున్నదను సంతోషము తనకు మిగులవల యును. ఒకని బాధించుటకుఁ దగినశక్తి తన కున్నదనుసంతోషము తనకు మిగులవల యును. ఎట్టిపనిలోనైనఁ దనయాధిక్యము తననంతోషమే కావలయును. అందుకొఱకే, యంత వఱకే యితరులతో సంబంధము యాజ్ఞవల్క్యమహర్షి యెంత సత్యములైన మాటలా డెనో యెఱుంగవా? నీసుఖముకొఱకే నీభార్యను నీవు ప్రేమించుచున్నావు. నీసుఖముకొఱకే నీవు నీపుత్రునిఁ బ్రేమించుచున్నావు. నీకు యథార్థమైన ప్రేమము నీయందే తక్క నితరు లెవ్వరి యందును లేదు. ఇవి యెంత వింతగఁ గనబడుమాటలో యెంత సత్యము లైనమాటలు! వీనిసత్య మెట్టిదో రవంత పరిశీలింతము.

రెండేండ్లపిల్లవాని తత్త్వమును బరీక్షింతము. అంతపిల్లవాని నేల పరీక్షింపవలయు ననంగా, నాతనిలోఁ బ్రపంచసంబంధమైన మోసము, దాంభికము, మాయ, యిచ్చకము మొదలగు నేదోషము లింక సంక్రమింపలేదు. సాంకర్యరహితమై స్వచ్చమై సహజమై యతనితత్త్వము పుట్టినది పుట్టినట్టున్నది. ఇదియే పరీక్షింపదcగిన సమయము. ఆదర్శ స్వచ్చతను దెలిసికొనవలయు నెడల దానిపై మాలిన్య మేమియుఁ జేరనప్పుడే పరీక్షింపవల యును గాదా! గాలిలోనిచెమ్మ దానిపైఁ జేరకుండునప్పుడే పరీక్షింపవలయును గాదా! ఎదుటను బ్రక్కనున్న వస్తువుల చాయలు దానిపై బడకుండునప్పడే పరీక్షింపవలయును గాదా! పుట్టుకతోఁ బుట్టినగుణము లేవో తెలిసికొనcదలచినయెడల నట్టిబిడ్డనే పరీక్షింపవల యును. బిడ్డచేతి కద్దమిచ్చిన సరే, బొమ్మనిచ్చినసరే, మఱియేది యిచ్చినసరే, దాని నేల నడcచికొట్టును. నాశన మొనర్చుటయే దానిప్రకృతి యని తెలిసికొనవలసినది. ఎవఁడైన మఱియొక పిల్లవాఁడు తనయొద్దకు వచ్చునెడల వానిని గొట్టి పీఁకినదాఁకఁ దహతహలాడి పోవును. సహజజాతితో సంతత వైరమే మనుజప్రధానగుణమని తెలిసికొనవలసినది. తనతల్లి క్రొత్తగ వచ్చినపిల్లవాని నెత్తుకొనువఱ కక్కఱలేదు. దరిఁజేర్చుకొన్న యెడలఁ దల

గొట్టుకొని యేడ్చును. తనస్థితి నెవరైన నాక్రమింతురేమో యను నసూయయే ప్రధానగుణ మని తెలియcదగినది. తండ్రి పెద్దమిఠాయి పొట్ల మింటికిఁ దీసికొనిరాcగ, నన్నకొక్క యుండ పెట్ట వలనుపడునా? అక్క కొక్కయుండ పెట్టవలను పడునా? పొట్ల  మంతయు దనచేతి కీయవలయును. ఇచ్చినదాఁక నింటిపెంకు లెగుర గొట్టుచునే యుండును. కేవలము స్వార్థలోలతాగుణ మిందు జాజ్వల్యమానముగాఁ బ్రకటన మగుచుండుటలేదా? కేవలము పిల్లవాఁడు కావునఁ గ్రమ్ముకొనుటకు మోస మెఱుఁగనివాఁడు కావున నతని స్వార్థసలోలత బట్టబయ లొనర్చుకొనినాడు. వాఁడే పెద్దవాఁడగుపిమ్మట నట్టు పలుకునా? అట్లాచరించునా? మోసకాఁడై కపట ప్రేమcగల చూపుల జిలుకుచు నళికవైరాగ్యప్రతిపాదక ములగు పలుకులఁ బలుకుచు మాయానమస్కృతులతో, మాయాపరీరంభములతో, మహా మాయామందహాసములతో నాపాదశిరఃపర్యంత మాక్రమించిన స్వార్థల్లతను మాటు జేసికొని యంతయు మీదే యంతయు మీదే యని వట్టిచేయి వారివంకద్రిప్పి సర్వముc దానే కబళించును. మాటలు బైరాగిమాటలు. తిండి దయ్యపుతిండి. ధరించినది శాటి. వరించినది బోడి. చదివినది వేదము. చేసినది ద్రోహము. స్వార్థపరత్వమే నరుని ప్రధానగుణ మనుట స్పష్టము. పరోపకార మెటనైన నెప్పడైన గనబడినట్లున్న యెడల నదికూడ మారువేసమందిన స్వార్థపరత్వమే కాని మరియొకటి కాదని నిశ్చయముగ నమ్మవలయును. పైని పాదరసము రాచిన రాగిడబ్బు. కరకరంగుపూసిన ముసలిమీసము. సృష్టిలోఁ బ్రేమను గూర్చి యిది చాలును.

ఇంక సృష్టిలోని క్రమమునుగూర్చి చెప్పెదను. మూలకారణమగు ననిర్వచనీయమైన మహాశక్తినుండి యనేకములైన యంధప్రాయములగు శక్తులుద్బవించినవి. పంచభూతముల యొక్క మహోన్మత్తచర్యలు జగద్విదితములేకదా? కారణము లేకుండ నవి చెలరేగినవా యని యందువేమో? కారణములా? అబ్బ మొదట సృష్టికిఁ గారణమున్నదా? సృష్టించె నని మన మనుకొనుచున్న మహాశక్తికే కారణము కనబడనప్పడు నీవు గంగవెఱ్ఱులకు గారణము చెప్పఁబూనెద వెందులకు? ఇంక గార్యకారణసంబంధము నాయెదుటc జెప్ప కేమి. నీ మనస్సునకు సంతుష్టి కలిగినట్టు నీమొగము చెప్పచుండుటలేదు. బందరు గాలివానకు బరామీటర్లోని పాదరసశలాక యని atmosphere అని, density యని, Nature abhors vacuum అని చప్పని సారహీనమైన చచ్చుScience మాటలు నాతో జెప్ప బూనెదవా? నా మనస్సు పరబ్రహ్మ మని చెప్పఁబడు మహాశక్తివంక కెగురc జూచుచుండం బనికిమాలిన ప్రకృతిమాటలు పలికి దానిని దిగలాగెద వేమి? పూర్వోత్తర సందర్భశూన్య ముగ బుడబుడక్కుల ధోరణిని సత్యపురసాక్షిసంఘమునందుపన్యాసము లిచ్చుటకాదు. ఆలోచించి మరి మాటలాడుము.

కూలిముండకొడు కొక్కడు కునికిపాట్లు పడుచు నెర్రజెండా చూపుటకు బదులు పచ్చజెండా చూపినంతమాత్రమున ధూమశకటము పట్టాలనుండి జారి తిరుగcబడుటా? వందలకొలది జనులు మహాఫెూర మరణము లొందుటూ? అద్బుతమైన, యనిర్వాచ్యమైన, యద్వితీయమైన మహాశక్తివలనఁ గలగినసృష్టి నొక్క రెప్పపాటుకాలములో ధ్వస్తమొనర్చుట కొక్కమనుజ కీటకాధమము సమర్ధమైనదా? అట్టనుటకంటెఁ బరిహాసాస్పదమైనపలుకు వేరొక్కటియున్నదా? చావవలసినవారు మహాకాలునిచేఁ జావనే చచ్చినారు. 'నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్" అని శ్రీకృష్ణుండు చెప్పలేదా?

భూకంపములచే నెన్ని వేలపట్టణములు దించుకొని పోలేదు! ఎన్నికోట్ల జీవములు సజీవసమాధుల నొందలేదు! వీరందఱ కైకకాలిక లోకాంతర ప్రాప్తియగుటకు వీరందఱ జన్మపత్రములలో మారకాధిపతి దశలే యానిముసమున సంభవించినవా? ధరామండలగ ర్బాంతరవాయు సంచలనమే దానికిఁ గారణ మని యంటినేని తత్సంచలనమునకుఁ గారణమేమి? సంచలనముమాట కేమి, మొదలు తత్తునకుc గారణమేమి? సన్యాసిమఠము దించుకొనిపోయినది. సానికొంప దించుకొని పోయినది. కల్లుదుకాణము దించుకొనిపోయి నది. కాళికేశ్వరియాలయము దించుకొనిపోయినది. గోమారకవిపణిశాలయుఁ గూలినది. గోరకకసంఘనిలయము కూలినది. ఇంతటితో నయినదా? పదివందల ధూమశకటముల గొట్టములలోనుండి వచ్చుపొగకంటె హెచ్చుగ బర్వతవదనగహ్వరమునుండి పొగ యుబ్బెత్తుగ బ్రబలవేగముతో నెగయుచున్నది. రోదసీ కుహర మంతయుc గ్రమ్ముచు న్నది. అకాలగాఢాంధకారభయంకర పరిస్థితిచేఁ బట్టపగలు కీచుకీచు మనుచు గీరుగారు మనుచుఁ బక్షులు రొద సేయుచున్నవి. ఆవు లంభా యని యార్పుచున్నవి. పందులు నెలుకలు గాడిదలు మొదలగునవి ఘర్షురించుచుఁ గిచకిచలాడుచు నోండ్రపెట్టుచు నటు నుండి యిటు నిటునుండి యటు నొడలు తెలియని యవస్థతోఁ బరుగు లిడుచున్నవి. బంధుడు లేదు మిత్రుఁడు లేదు తల్లి లేదు తండ్రి లేదు తమ్ముఁడు లేదు కొడుకు లేదు. ఎవరిమట్టునకువారు మహాభయోద్రిక్తహృదయములతో స్వప్రాణము లెట్టులయినఁ గాపాడు కొను నాత్రముతో నాచీఁకటిలోనే కనబడనియాదుర్దశలోనే యొక్కడికో యెఱుంగకుండc బాఱిపోవఁ జూచుచున్నారు. గానుగయొద్దుల లాగున నందరు తిరిగినదారులలోనే యల్గాడు చున్నారు. ముందునకుఁ బోయినవారేరి? తెన్నా? కన్నా? ఏమున్నది? ఇంతలోఁ బటల ములు పటలములుగ బైకెగయుచున్న ధూమరాశిలో నుండి చిన్నచిన్న విస్పులింగములు చిటచిటాయమాధ్వనులతో మించిన కత్రములవలె రాత్రితమాలవృక్షమునఁజేరిన మిడుఁగు ఱులకోటులవలెc గానబడుచున్నవి. 'భయంకరగాఢాంధకారము రవంత పలుచcబడినది. రవంత పాయయిచ్చినది. కన్ను కన్ను రవంత కనబడుచున్నది. అంతలో జండప్రచండ మగు జ్వాలాజాలములు కోట్లకొలఁది జిహ్వలతోఁ గొన్ని యెఱ్ఱగఁ గొన్ని పచ్చగఁ గొన్ని తెల్లగఁ గొన్ని నీలిగ బయలుదేరి యాకసమంత గ్రమ్ముకొనుచున్నవి. సాయంకాలమున సంధ్యారాగ కాంతిచేఁ బశ్చిమ పార్శ్వమున నాకాశ మెట్టుండునో యావదాకాశముగూడ నట్టే యున్నది. జను లాకాఁకాకు నిలువలేక, చర్మములు బొబ్బలెక్క, దాహముచే జిహ్వ లీడ్చుకొనిపోవ, నతికాంతిచేఁ గన్నులు చీఁకటులు గ్రమ్మ, దయ్యములు పట్టినవారివలెం బిచ్చివారివలె జట్టు పీcకికొనుచు గుండెలు కొట్టుకొనుచు నట్టిట్లు పోవుచు నాకసము పగులునట్టాక్రోశ మొనర్చుచున్నారు. ఈయేడ్పులు విన్నవారెవరు? దయ యెవరికి? దాక్షిణ్య మెవరికి? ఆంధ్రప్రకృతిలోని యంధతరశక్తులకు జాలియే? కడవలంత బానలంత ద్రోణములంత చుట్టుగుడిసెలంత యెఱ్ఱగ గ్రాగినటాలు, సలసల తెల్లగ మరిఁగిన గంధక ధారలతో ధారాపాతముగ శతకోటిశతకోటిధ్వనులతో వర్షించుచున్నవే! చెదలున్నపుట్టలో దాటియాకు మంట పెట్టినయెడల నేమగునో యదియే యంతకంటె భయంకరముగ బీభత్సముగ నైనది. తెల్లవారుసరి కెటు చూచినఁ బదిమైళ్లవఱకు యున్నది. దానిక్రింద మహాశ్మశానమున్నది.

వాంతులతో భేదులతో మూత్రబంధములతో, నెక్కుపట్టిన నరములతోఁ, గంటిగుం టలతో, నొడలిచలువతో, నాసన్న మరణలాంఛనమగు నాభీలశిరోవేదనతో, భరింపరాని బాధలుపడుచున్న జనులనూడ్చిపెట్టుటకుఁ దోఁకచుక్క యంతబీపురు చేతబట్టుకొని మురికికాలు వలప్రక్కలను గోడిరెట్టలగుట్టలనడుమను గొట్టాలమ్మ తాండవించుచున్నదే! షడుప్తరశతపర్యంత మెగ బ్రాంకిన జూర్తిమహార్తితో నిముసనిముసమునకు నోరెండిపోవ జేయుచున్నదగవగతో బాహుసందుల బగిలిన, పగులుచున్న, పగులనున్న బొబ్బలవలని బొబ్బలతోఁ గన్న కొడుకైన నొద్దలేక, యెటులున్న దని యడుగువా రైన లేక, గుండెలు పగుల నేడ్చుచున్న నిర్బాగ్యులను గఱకఱ నమలి గుటుక్కున మ్రింగుదు నని యార్చుచు నోరుతెఱచి హాహాకారమొనర్చుచు మారికామహాదేవత మృతమూషకగిరిసింహాసనమునఁ గొ లుపుచేయుచున్నదే వీరి తోఁబుట్టువు లగు చుఱుకులమ్మ స్పోటకదేవత మొదలగువారు వారివారి పరివారములతోఁ బ్రజ పై దాడివెడలి భూమినంతయు నేడ్పులతో రక్తముతో శవములతో దుర్గంధముతో ధ్వస్త మొనర్చుచున్నారే ఇవి రోగము లని యిప్పటివఱకుఁ బాశ్చాత్యులు భ్రమించు చున్నారు కాని యివి ప్రకృతిశక్తులని, వీనికి మందీయ నక్కర లేదని, బ్రదికినవారు మందుచే బ్రదికినవారు కారని, చచ్చినవారు మందులేక చచ్చినవారు కారనియు, నేను క్రీస్తు పుట్టముందే మనవారు చెప్పినారు. ఎందుల కీశక్తులుండి యిట్లు చెలరేగవలయునో వానికే కారణములు తెలియనప్పడు మన కెట్లు తెలియును? అధర్మశిక్షకుఁ బాపనాశనమునకు నిట్టివి బయలుదేరి యుండునేమో యనుకొందమన్నఁ బాపాత్ములతోఁ బుణ్యాత్ములుగూడఁ బుంఖానుపుంఖములుగఁ బూర్వపక్షము లగుచు న్నారే ధర్మహీనులతో ధర్మసహితులుగూడ దండోపతండములుగ మండిపోవుచున్నారే కుటుంబములు కుటుంబములు నామహీనముగ నశించిపోవుచున్నవి కదా! అన్ని కుటుంబ ములోనొక్క పాపదూరుడైన లేకపోయెనా! పెద్దవాండ్రు, పాపాత్ములు తఱచుగా నగుచుందురు. కావున వారు శక్తిచే శిక్షితులై యుండవచ్చును గాని మూఁడుదినముల గ్రుడ్డుకూడ మృతినొందనేల?

అది యసత్యము. ఆశక్తుల కొకరిని శిక్షించు నుద్దేశము లేదు. వాని కేవిధమైన క్రమములేదు. ఎందులకో చెలరేగుచున్నవి. గ్రుడ్డి త్రోపుగ నొక్కపెట్టున నన్నిటినిఁ దుడిచివైచుచున్నవి. దానిదారిలో నున్న వన్నియు నశింపవలసినదే! దయలేదు. పగలేదు. ధర్మములేదు. అధర్మము లేదు. చిన్నలేదు. పెద్ద లేదు. పుణ్యము లేదు. పాపములేదు. క్రమములేదు; ఆక్రము లేదు. సృష్టిశక్తులస్వభావ మిట్టున్నది.

“క్రమములేదు క్రమములేదని యింత గింజుకొందువేల? సూర్యచంద్రగ్రహాదుల యుదయాస్తమయము రొక్కని మేషమైనవ్యతిరేకము లేకుండ జరుగుచున్నవికాదా? ఋతు క్రమము ననుసరించి పుష్చఫలాదులు కలుగుచున్నవి కాదా? పైకెగురవైచిన బరుగువస్తువు భూమి మీఁదనే యెల్లప్పడు పడునుగాని పై కెగిరిపోవుచుండుట లేదుకదా?" యని నీ వందువుకాబోలు. ఇదియా నీకున్నపట్టు? మహోన్నత్తుని ప్రలాపములలోనైనఁ గొన్నిటి యందు గ్రమముండునే! ఆంత్రజ్వరితుని యసాధ్యసన్నిపాతపుఁ గేకలలోనైనఁ గొన్ని కారణబద్దములై యుండునే అత్యసత్యాలాపియుగూడ “నీమెయేనా నిన్నుఁగన్నతల్లి' యని యడుగ, సత్యమాడక తప్పదే! అంధుడు వైచిన పదిరాతి విసరులలో నొక్క ఱాతివిసరుచేనైన మామిడి కాయయొక్కటి రాలవచ్చునే సిరాలో మునిఁగిన సాలెపురుగు కాగితముమీఁదఁ బ్రాకినప్ప డన్ని చికిబికులలోను బ్రమాదమున నొకయక్షరముండవ చ్చునే! ఇంతయేల? అగిపోయిన గడియారమైనను దినమునకు రెండువేళల సరియైన కాలము చూపునే అక్రమములో నక్కడక్కడ క్రమముండక తప్పనే తప్పదు. అక్రమము, క్రమము ననునవి యన్యోన్యాశ్రయస్థితులుగాని స్వతంత్రమును కావే! మనము చూడవలసిన దేదనంగా సృష్టికిఁ గ్రమము సహజమా, యక్రమము సహజమా యనునది. అక్రమమే సహజమనుట సిద్దాంతము.

సృష్టికర్తనుగూర్చి చెప్పవయ్యా యని యెందఱు సన్యాసులో బతిమాలఁగ బుద్దదేవు డేమనియెనో విందువా? ‘ఈమూలతత్త్వమున్నప్పటికి మీ కది లేనట్టిదే. ఆతత్త్వమునకు మీముక్కు మూఁతల సమాధు లక్కఱకు లేదు. మీనిలువుకాళ్ల తెలివితక్కువ ప్రార్డనము అక్కఱలేదు. మీపసిఁడికుండల దేవాలయము లక్కఱలేదు. మీకర్పూరపుహారతు లక్కఱ లేదు. మీసాతాళించిన సెనగ లక్కఱలేదు. మీ పుణ్యములఁ గాంచి మీమ్మాతcడు తొడపైc గూరుచుండఁ బెట్టుకొనువాఁడు కాడు. మీ రాతత్త్వమును దలపెట్టనక్కఱలే"దని చెప్పలేదా? చెప్పినఁగాని వలనుపడ దని యామహానుభావుని నిరోధింపఁగ నాతc డేమని యెనో విందువా? "ప్రపథమమున సత్తున్నది. ఇది కేవలము జ్ఞానశూన్యమైనది. ఈయవిద్యా మహాసముద్రమునఁ గొన్ని యంధశక్తు లుద్బవించిన” వని యాతండు పలికినాఁడు. సత్తులేదు, ఆసత్తులేదని మనవారు చెప్పినారు. సత్తున్నది కాని యది యసత్తుకంటె భిన్నముకాదని యాతం డనినాఁడు. శక్తు లజ్ఞము లని వారు వీరుకూడ నంగీకరించినారు. వేదప్రమాణము నంగీకరింపని బుద్దదేవుండు కూడ వేదరులు పలికినట్టే పలికినాఁడు. అదియే సత్యమని తోఁచుచున్నది. ఆశక్తులకుఁ బుణ్యపాపవిచక్షణమే యుండు నెడలఁ బ్రపంచస్థితి యిట్టుండనేల? ఎట్టు?

గీ. మొద్దువటుc డొకసతి లేక మొత్తుకొనఁగ,
వృద్దునకు నల్వు రిల్లాండ్రు, వేశ్య కొసరు,
నీతిమంతుcడు గతిలేక నింద నొంద
బానిసీనికి ద్రోహికి బ్రహ్మరథము
ఇచ్చువానినె తిట్టుదు రెల్లవారు
పిసినివానికె పెద్దపెద్ద బిరుదచయము
పాంసులాత్మకు ఫలముపైఁ బ్రబలఫలము
ఏకపుత్ర మరణము సుశ్లోకునకును
సత్యవాగ్దీ క్షునకుఁ జెరసాల త్రోపు
అనృతవాదికిఁ దూగుటుయ్యాలకైపు
మెత్తనగువానికంటికిఁ జిత్తవాన
మఱి కసాయిమీసాలకు మల్లెనూనె
సృష్టిలో నిట్టిమార్మెలి యిట్టివెలితి
గలుగ నేలొకొ చెప్పఁగాఁ గలఁ డెవండు?

సీ. చక్రవర్తులు సర్వసంపదలబాసి
పరితపించుచు ఘోరవనములందొ?
తత్పాదుకలనైనఁ దలమోపc దగనట్టి
యధము లీశులయి రాజ్యంబులందొ?
మగనాండ్రహ్పదయముల్ మండిపోనేడ్చుచు
నసురుల కారాగృహంబులందొ?
సుతులం గాటికిఁ బంపి పతులగొంతులcగోయ
ధూర్తలు బంగారుతొట్టె లందొ?

గీ. శమదమాఢ్యులౌమునులు రాక్షసులనోళు
లంది? పరమచండాలురౌ నసురహతకు
లామునులమగువలప్రక్క లందొ? యకట!
దైవమా! మంచిచెడ్డలు లేవె నీకు?

సీ. సత్యసంధులు కష్టచయముల మునుఁగుటో?
దొంగ లుప్పొంగుచుc ద్రుల్టిపడుటో?
తలగొరిగించుకో దాతకు లేకుంటా?
కృపణుడు లక్ష్మీసమృద్ది గనుబొ?
విద్వాంను లుదరముల్ వెన్నంటి యేడ్చుటో?
మూడులపొట్టలు పాణక లగుటో?
కాసు గల్గినవానిబాస వేదం బౌటా?
బువ్వలేనతనివి బూతు లగుటో?

గీ. త్వత్పదారాధకులు ముష్టిదాసరయ్య
లగుటో? నాస్తికుల్ వారల మొగములందు
నుమియుటయొ! యేమి యిది కన్ను లున్నవె? మతి
యున్నదే? యుంటివే? చేయుచున్న దిదియె?

సృష్టిలో నిట్టివ్యత్యస్తత యున్నదనుమాట సత్యమే కదా! ఒక్కొక్క వ్యక్తికిఁ గొన్నివ్య త్యస్తపరిస్థితులు సిద్దింపవచ్చును. మనము జాతిమీద జూచుకొన్నగాని సత్యమును నిర్ణయిం పలే మని నీ వందువేమో? మనజాతిస్థితియే యోజింతము. మనజాతి యెంత ఘనమైనదో ప్రపంచమంతయు నెఱిఁగిన సంగతియేకదా! విశ్వవంద్యములగు వేదములు మనజాతిమూల పురుషులవలననేకాదా యుద్బుద్దము లయినవి? ప్రపంచమున నొక్క చదరపుటడుగులో నూఱంగుళములు వ్యాపించిన మతమును బోధించిన బుద్దభగవానుడు మనలోనివాఁడే కాదా? ప్రపంచమం దేదేశమందయిన నేకాలమందైన ధనము తీసికొనకుండ విద్యాప్రదాన మొనర్చుట జరిగియుండెనా? మనభరతఖండమున జరిగినది ఇప్పటికి జరుగుచునే యున్నది. బిచ్చగాండ్రకు నన్నమిచ్చుట, బియ్య మిచ్చుట, డబ్బిచ్చుట యొచ్చటనయిన జరిగియుండెనా? ఇచ్చట జరిగినది. ఇప్పటికిని జరుగుచున్నది. ఇతరదేశములందు భిక్షకులు వీథిలోఁగనcబడునెడల రక్షకభటులు వారినిఁ గారాగృహములం దుంతురు. మనము భుజించుచుండంగా మాధుకర మొనర్చుకొను నాతండు సీతారామాభ్యాం మనః యని జోలితో రాంగ మనము నోటి కెత్తుకొనుచున్న కబళమును దిరుగ విస్తరిలోనుంచి, యాయతిథి కన్నమిడిన తరువాతనే యాకబళమును నోటఁ బెట్టుకొన వలయునన్న నిబంధన మొక్క భరతఖండమునం దక్క మఱెయొచ్చటనయిన నుండుట కవకాశము న్నదా? అతిథికి ముందు పీట, ముందు విస్తరి, ఆతం డాపోశన మొనర్చి ప్రాణాహుతు లయినc దీసికొన్న తరువాతcగాని యేగృహస్టుడైనఁ బరిషేచన మొనర్చునా? ముందుగ గాకబలి, శ్వానబలి లేకుండ నెవఁడయిన మెదుకు నోటఁ బెట్టునా? ఆతిథ్యములో నత్యంత సూక్మము లయిన యేర్పాటు లిచ్చటc గాక మఱి యొచ్చట నున్నవి? ఇందువలన నాతిథ్యగుణము మనదేశమున నెంత పరిపూర్ణముగ బరిపోషింపఁబడినదో తెలియవశమా? చీమలకుం బిండి బెల్లము ప్రతిదినము వైచువా రెంద ఱున్నారో యెఱుఁగుదువా? తుదకుఁ బాములకుఁ జిమ్మిలి, పాలుపోయుచున్న కాంతలెంద ఱున్నారో యెఱుఁగుదువా? శత్రువులకుగూడ నాతిథ్య మిచ్చినవారు మనజాతివారే కాదా? నూతేసి యంతరువుల మేడలున్న యమెరికాదేశ మొకదేశమా? దోమకుట్టుబాధ నివారించుటకుఁ బశువులకయి. రాపిడి స్తంభములున్న మనదేశమే దేశ మగునుగాక! జాతి కుండవలసినది భోగవాంఛయా? భూతదయయా? మనజాతి కీసుగుణసంపత్తియుంతయు నున్నది కదా! ఇది నీమతానుసా రముగఁ బుణ్యమే కదా! సరే.

సాలగ్రామములపై నిర్మాల్య భారమును దీసివేయనివాఁడు ధరాభారముగ నెన్నఁబ డుచున్నాడు కాదా? మైలుమైలున కొక్కదేవాలయ మున్నదే. ఫర్గాంగు ఫర్గాంగున కొక్క భజనమందిర మున్నదే! ప్రతిదినము నేదో యొకవేళ నయిన దైవధ్యాన మొనర్చని భారతీ యుడెవఁడయిన నున్నాడా?

అబుద్దిపూర్వకముగనైన దైవనామస్మరణ మొనర్పనివా డీపుణ్యభూమిలోనివాఁడు కాడే? పాశ్చాత్యులలో దైవచింత యెంత యరుదుగా నున్నదో యంద ఱెఱిగినదే కాదా? వారికి దైవచింతకుఁ దీఱిక యొక్కడిదో? దైవనామస్మరణ మొనర్చుటకు నైనఁ దెఱిపి యొక్కడిది? పొగయంత్రములలో, నీటియంత్రములలో, వాయు యంత్రములలో, విద్యు ద్యంత్రములలో, సముద్రగర్భములో, సంతలలో, నక్కడ యిక్కడ యని లేక, సర్వతోము ఖముగc దిరుగుచు కణము పోయిన ధనము పోవు ననునాందోళనముతో నత్యాతురతతో దేవులాటయుc దిరుగులాటయుc బరుగులాటయు నెగురులాటయు బ్రాకులాటయు బొరలాటయు దక్కనంతకంటె మతేమియులేదె ధనిచింతా ప్రాబల్యమే కానిదైవచింతాలేశ మయిన నెప్పడైన నున్నదా?

మనకట్లా? దైవనామస్మరణ మొనర్చుచు నుదయమునఁ గనుదెఱచినది మొదలు, దైవనామస్మరణ మొనర్చుచు రాత్రికనుమూయు పర్యంతము మనము దైవము పేరు పెట్టు కొని చేయుచున్నపనులిన్నిన్నియా? కొడుకులకుఁ, గూతులకు, మనుమలకు మనుమరాండ్రకు దేవుని పేరు పెట్టుకొని నోరాజఁ బిలుచుకొనుచున్నాము కాదా? ఏదో యొక దైవముతో సంబంధింపని పేరు మనలో నెవరికైన నున్నదా? మత్స్యనాథరావు కూర్మానాథ రావు వరాహరావను పేళ్లగూడ మనలో వెందఱకో యున్నవికాదా? ఎటు వచ్చినను గడ్డయ్య-పెంటయ్య-పుల్లయ్య యను పేళ్లు కారణాంతరములచేఁ గొందరు శిశువుల కున్నను బాల్యగండములు దాఁటిన పిమ్మట వారినిఁ బవిత్రనామధారులుగా చేయుచుం డుట లేదా? ఏనుక్రీస్తుపై మహాభక్తిపాశ్చాత్యులలో నున్నదికదా-ఆతని పేరు కొడుకులకుఁ గూఁతులకుఁ బెట్టినవా రెందఱున్నారో యెఱుఁగమా? మొగములందు భుజములందు మనము దేవుఁడని నమ్మినవారి లాంఛనములను ధరించుచుండుట లేదా? మెడలో శంకర మూర్తులను ధరించు వారెందఱు లేరు. ఇంటిగోడలకు విష్ణుపాదము లంటించినవారెందఱు లేరు? ఎటుపోయినను దేవునిరూపమో, యెటువిన్నను దేవుని పేరో, యెటు చూచినను దేవునిగుఱుతో యెటఁ జదివినను దేవుని కథయో మనకు లేనిపరిస్థితి యీజాతి పుట్టినప్పటి నుండి యిప్పటివఱకున్నదా? ఇఁక ముందుండునా! ప్రహ్లాదునివంటి భక్తుఁ డితరప్రపంచ మున నుండెనా? హరిశ్చంద్రునివంటి సత్యవాదికథ పాశ్చాత్యుల గ్రంథజాలములో నొక్కటి యైన నున్నదా? భగవద్దాసు లని, బైరాగు లని, యతు లని, సన్యాసు లని, పరమహంస లని, యోగు లని, సాధువు లని, యింక వేమేమో యని దేశసేవచేయుచు నీదేశమున నెన్నిలక్షల జనమున్నదో చెప్పఁగలమా? ఈజనసంఖ్యలో సహస్రాంశమైన నితరదేశములం దున్నదా?

మరియొక్క విశేషము: ఏగ్రుడ్డివో యేనవో యేక్రూరమైనవో యేగొంతుకోఁతవో యగు భయంకర ప్రకృతిశక్తులనుగూడ శ్యామలాంబయని మరిడమ్మ యని పేళ్లతో మనము పూజిఁచుచుండుట లేదా? దైవముకొఱకే తను వంతయు మనస్సంతయు నాత్మ యంతయు నర్పణ మొనర్చుకొన్నజాతిమఱియొకటి ప్రపంచముననున్నదా? ఈభూతద యయు, నీదైవభక్తియు మహాపుణ్యమని యాచరించుచున్న యీ జాతి యెంత యున్నతస్టి తిలో నుండవలసినది? సృష్టిమహామూలశక్తికి దయాదాక్షిణ్యములే యుండునెడలఁ బుణ్యపా పవిచక్షణతయే యుండునెడల, ధర్మాధర్మవిభేదమే యుండునెడల, మనహ్పదయములోవి తన యందలి ప్రేమమును దెలిసికొనుటకు జ్ఞానమే యుండునెడల, మనయవస్థను జూచుటకుంగన్నే యున్నయెడల మనదేశమునకీ మహాదుర్గతియేల? ఇతర రాష్ట్రములలోని వారు వారి రాష్ట్రములను వా రేలుకొనుచుండ, మనమేమి చేయుచున్నాము. మనమేడ్పులను మన మేడ్చుచున్నాము. బొంబాయి రేవులో నుండి పాగయోడలోనికిఁ జేరినయెలుక ప్యాసుపోర్టు అక్కఱలేకుండ ఏ అమెరికాదేశమునకో యింగ్లాండునకో పోవుచున్నదే ఎలుకకున్న జన్మస్వాతంత్రమైన హిందువునకు లేదే.

సాక్ష్యపన్యాసములు తిరుగ నారంభింపcబడిన వని వినఁగనే యీపిచ్చి యాసుపత్రిలో నివారందఱేమిచేసినారో యెఱుఁగుదువా? వారందరు ‘ది ఫిలాసఫర్సుకాన్పరెన్సు అను పేర నొకసభచేసి సాక్ష్యుపన్యాసములు పడుచున్నంతకాల మాంధ్రపత్రికను మనము తెప్పించు కొంద మని తీర్మానించుకొని యట్టు తెప్పించుకొనుచున్నారు. మతియున్న వారికంటె మతిలేని వారికే నీయుపన్యాసము లెక్కువ రుచించునట్లు కనcబడుచున్నదే! నీవుకూడ వారిజట్టులోని......"

"కోన్ రే వహాఁ దివానాసే గుప్తగో కర్తా హై జారే యని యొకమహమ్మదీయు డఱచెను. నేను వెడలివచ్చితిని.

నాయనలారా! సృష్టిశక్తులనుగూర్చి యీతడు చెప్పినమాట లన్నియు మీతో జెప్పితిని. ఈమాటలు మీ కెట్టున్నవో కాని నాకు సమంజసముగఁ గనబడలేదు. ఈయపన్యాసమును గఠినముగ విమర్శింప వలసియున్నది. ఈత డింక మతిలేనివాఁడు కాలేదు. కాని మనుజ దూషకుడైనాఁడు. నిష్కారణముగఁ దనకు గారాబంధమును గలుగ జేసి, యవమానించిన మనుజులను శిక్షింపలేదని దేవదూషణమునకు గూడఁ బూను కొనినాడు. ఈతలతిక్క తత్త్వజ్ఞాన మిందుమూలమునఁ గలిగినది. ఇతనికిఁ గారాబంధమో క్షము వేగముగ నగుcగాక!

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.