సాక్షి మూడవ సంపుటం/కురుక్షేత్రము

వికీసోర్స్ నుండి

15. కురుక్షేత్రము

జంఘాలశాస్త్రి ఒకసారి ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి కురుక్షేత్రం యాత్ర చేశాడు.

రైలుదిగి, సూర్యకాంతికి ముచ్చటపడి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అనుకున్నాడు. ఆశ్చర్యపడే శక్తి మనిషికున్న శక్తుల్లో ముఖ్యమైంది. ఆశక్తి నించే ఎంతటిజ్ఞానమైనా పుట్టింది-అనుకున్నాడు.

జంఘాలశాస్త్రి ఒక బ్రాహ్మణుడింటుకి వెళ్లి స్నానం, భోజనం ముగించుకుని, కురుక్షేత్రంలో యుద్ధభూమిని చూడటానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా బోధ చేసిన స్థలమేది?-అని అడిగి తెలుసుకొని-అక్కడ నిలబడ్డాడు. ఆ స్థలం కొంచం ఎత్తుగావుంది. అక్కడొక మండపం వుంది. దాని వెనక చిన్నచెరువుంది. భూమ్యాకాశాలు కలిసేవరకు అక్కడ కనుచూపుమేర ఒక్కటే బయలు భయంకరంగా కనిపించింది. రక్కసికంపలు, జిల్లేడు మొక్కలు, వంటవి తప్ప ఇంకే మొక్కలూ లేవు.

ఇదేనా కురుక్షేత్రం! అని-భారత ఘట్టాలు తలుచుకుని-భగవద్గీతను తలుచుకుని—పరవశించాడు జంఘాలశాస్త్రి. అంతలోనే-ఢిల్లీలో తాను చూసిన పాదుషా దివాన్ ఖానా గుర్తొచ్చింది. దాని సౌందర్య ప్రశంస గుర్తొచ్చింది. కాని-జంఘాలశాస్త్రి-మనకు కురుక్షేత్రమే స్వర్గం' అన్నాడు. ధర్మరాజు ద్వైధీభావ మనస్సునీ, అర్జునుడి అజ్ఞానతత్త్వాన్ని తలుచుకుని —కునుకు తీసిన శాస్త్రి ఒకకల వచ్చింది. అందులో వ్యాసమహర్షి కనిపించాడు. భగవద్గీతకు భిన్నభిన్న అర్ధాలలో వ్యాఖ్యానాలు పుట్టాయెందుకని ప్రశ్నించాడు. ఆ వ్యాఖ్యలు సరియైనవి కావు అన్నట్టుగా ఆ మహర్షి చిరునవ్వు నవ్వాడు.-బస్సు మనిషికేకతో జంఘాలుడు మేలుకొన్నాడు.

జంఘాలశాస్త్రి యిట్లు పలికెను.

నేను సభకు బోవుసరికి జంఘాలు డేదియో యుపన్యసించుచున్నాఁడు. అంతకుముం దేమి చెప్పెనో గాని నేను వెళ్లినపిమ్మట నిట్లు చెప్పెను.

కురుక్షేత్రపు స్టేషనులో నేను దిగుటయేమి, సూర్యుడుదయాద్రిపైనెక్కుడ యేమి. ఆతఁడు కరకర లేచుచున్నాఁడు; నేను జర జర నడచుచున్నాను. సూర్యోదయము కాకమునుపే స్నానముచేసి, యర్ఘ్యప్రదాన మొనర్చి, సూర్యనమస్కారము లాచరింపవలసిన నేను దంతాధవన మైన లేకుండ సూర్యునివైపుదిరిగి చెంపలు గొట్టుకొనకుండ, మూట చేతఁ బట్టుకొని, మునిఁగిపోయిన ట్లూరిలోనికిఁ బోవుచున్నాను. సవితృమండలదర్శన మొనర్చి మనవేదర్షు లాతేజోవైభవమునకు, నాతమశ్చటా విచ్చేదన సామర్ధ్యమునకు, నా సర్వమాలిన్య నివారణమహనీతయకు, నా యారోగ్యప్రదాన ప్రవీణతకు, నన్నింటిని మించిన యాహృదయ తాపాపహరణశక్తికి, నాత్మవికాసశక్తికి వింతపడి, యొుడ లంత చూపుగ జేసికొని, యాచూ పంతయు మనసుగఁ జేసికొని, యామన సంతయు నాత్మగఁ జేసికొని, యా యాత్మ నంతయు బరమార్ధ జ్ఞానసంపన్న మొనర్చుకొని కవులై, భక్తులై, గాయకులై, విరాగులై, వేదాంతులై యెన్నివేల సంవత్సరముల క్రిందటనో పాడినపాటలు, చేసిన నృత్యములు, వెదచల్లిన తత్త్వములు, భారతదేశమున కిచ్చిన వెలుఁగే కాదా? ప్రపంచమునం దంతయు నిప్పటివఱకుఁ నిలిచి, సృష్టి పోయినను నిల్చునది యాతేజ మొక్కటియే యైనట్టు చెప్పక చెప్పచున్నదే. ప్రకృతిలోని తేజస్సుముద్రమును, సౌందర్యరాశిని, శక్తిసంపన్నతను, మహామహిమ విశేషమును గాంచి, యద్బుతపడని వాఁడు పనికిమాలిన పందలలోఁ బ్రప్రథముఁడు. చూడఁదగిన వస్తువును జూచి శిరఃకంపనము చేయనివాఁడు పశువుకంటె నధముడు. ఆశ్చర్యపడుట యనుశక్తి మనుజశక్తిలలో ముఖ్యమైనది. ఆశక్తినుండియే యెంతఙ్ఞాన విజ్ఞానములైన నుదయించినవి. సర్వదేశసర్వ కాలసర్వవిధ సారస్వతములకం తయు నాశక్తియే మూలము. హృదయమునందుఁ దఱుగు మిఱుగులేని రసోద్రేక మున్నవానికిఁగాని యాశక్తి యుండదు. అట్టిశక్తి యున్నవాని మెప్పే మెప్ప. నవ్వే నవ్వు. ఏడుపే యేడ్పు. బ్రదుకే బ్రదుకు. గగనమందుఁ గన్నులవైకుంఠముగఁ గ్రాలు బంగరుచట్టు జలతారు నీలిచీర సింగారించిన ప్రకృతి యువతిచేతిలోని సప్తమణి వినిర్మిత చాపమును గాంచి చేతు లెత్తి గంతులువైచి యొడలు తెలియని యానందమున మత్తిల్లువాఁడే మనుజుఁడు. కాలిక్రిందం బ్రమాదవశమునం బడిన చీమ దేహాత్మావిచ్చేదనసమయమున నిచ్చినమూల్గు సింహగర్జనమువలె నాకర్ణించి కడుపుపగిలి కండలు కంపించునట్లు గాఢముగ నేడ్చువాఁడే మనుజుఁడు. అంతేకాని పట్టుమని తినలేక, యెంగిలిలంఘనములు చేయుచు, నొడలు తెలియనినిద్ర పోలేక యులికి యులికి యేడ్చుచు నేదైన వింతవస్తువును గాంచి వింతపడి 'హాయి హాయి’ అని మఱవలేక తల కదలించి కదలుపనట్లు నోరు మెదలిచి మెదల్పనట్టు లేదో కొండనాలుకకు వెనకు గొణఁగుకొనుచు, నత్యంత ప్రియమైన వస్తువు జాలకిపోయినను గాలిసయితము విని గడగడలాడున ఫ్రేడువలేక కుక్కపిల్లవలె కుంయు కుంయు మని వినఁబడి వినఁబడకుండునట్టు లేడ్చుచు, భోజనమునొద్ద షండులై పొలతియొద్ద షండులై పుస్తకము నొద్ద షండులై యానందానుభవమున షండులై దుఃఖానుభవమున షండులై చావకుండ జచ్చియున్నవ్యర్డులు బానిస లీప్రపంచమున దాస్యమును, నీచతయు, నజ్ఞతయు, రోగ మును, చచ్చుటకుఁ దప్ప వేఱుకార్యమున కక్క ఆకురాని జనాభాను వృద్ది పఱచుటకును, దక్క మఱియెందులకు?

ఇట్లు పూర్వస్థితిని స్మరించుకొని సంతసించుచు, నిప్పటిస్థితిని స్మరించుకొని విచారించుచు, ముందునకు నడుచుచుంటిని. అచ్చటనొక్క బ్రాహ్మణునిజూచి యిచ్చటికి యుద్దభూమి యెంతదూరమున్నదని యడిగితిని. యుద్దభూమిసంగతి నాకేమియు దెలి యదయ్యా యని యాతండు ప్రత్యుత్తర మిచ్చెను. అయ్యా! ఈయూరిబయట జరిగిన భారత యుద్దమునుగూర్చి నీ వెఱుఁగనే యెఱుఁగవా యని యడిగితిని. "నిన్నగాక మొన్నజరిగిన వ్యాపారమే మఱచిపోదుముగదా. యెప్పడో జరిగిన యుద్దముమాట యెవనికి జ్ఞప్తిలోనుండునయ్యా యని నాకు సిగ్గువచ్చునట్టాతడు మందలించుచు బదులు చెప్పెను. పోనీ మీయింటలో నాకీదినమున భోజనము పెట్టుదురా యని యడుగ నేను వృత్తిచేత వంటవూడివాండను గానున్నను నొక్కరూపాయినిచ్చినయెడల నాభార్యతోఁజెప్పి యీయు పకారము చేయింపఁగల నని యాతండు పలికెను. ఆతని యింటికిఁబోయి స్నాన మొనర్చి భుజించి మోటారు బస్సును మాటాడుకొని యుద్ధభూమి కేంగి శ్రీకృష్ణభగవానుఁడు పార్థునకు జ్ఞానోపదేశమొనరించిన స్థలమేది యని యడిగి తెలిసికొని యచ్చట నిలువఁబడి తిని.

ఆస్టలము కొంచె మెత్తుగా నున్నది. అచ్చట నొక్క మండపమున్నది. దానికి వెనుకభాగమునందుఁ జిన్నచెఱువున్నది. ఆచెఱువు నీటితోడనే రథాశ్వములను భగ వంతుఁడు కడిగినాఁడని యచ్చటి జలముతెచ్చి యొకముసలిది నాపై గొంత చల్లెను. రెండుడబ్బులిచ్చి యామెను వదల్చుకొంటిని, భూమ్యాకాశములు గలయువఱకు నొక్కటేబయలు భయంకరముగ గనబడుచున్నది. చిన్న కంకరజాలు, చికిలింతదుబ్బులు బల్ర క్కసి కంపలు జిల్లేడుమొక్కలు మొదలగునవి విరళముగ నున్నవి. చూపున కడ్డువచ్చు నొక్కనిలువు పాటిచెట్టయినను లేదు. అది యెండకాలమగుటచే నెండమావుల ప్రవాహములు మిక్కుటముగ నున్నవి. పిట్ట పీచు మనుప లేదు. గాలియైన గట్టిగ వీచుటలేదు. భయంకరమగు నిశ్శబ్దతావస్త్ర ప్రబలియున్నది. శ్రీకృష్ణభగవానుని బ్రార్థిం చి యాపవిత్రస్థలమునకు సాష్టాంగపడితిని.

ఇదియేనా కురక్షేత్రము? ఇదియేనా మహావీరుల మహాస్త్రముల మహాజ్వాలలచే మండి పోయిన భండనరంగము? ఇదియేనా పనునెనిమిదక్షౌహిణుల రక్తముల దడిసిన ప్రదేశము? ఇదియేనా భీష్ముడంపశయ్యపై బండుకొని ధర్మబోధన మొనర్చిన పవిత్రస్థలము? ఇది యేనా పార్థవ్యాజమున భగవంతుఁడు ప్రపంచమున కంతకును ప్రజ్ఞాప్రదాన మొనర్చిన దివ్వక్షేత్రము? బంగరుగని యొకగనియా? వజ్రములగని యొకగనియా? శాసనములగని యొకగనియా? విగ్రహములగని యొకగనియా? రత్నాకరమొక రత్నాకరమా? జ్ఞానధన మెటనుండి యుద్బుద్దమై ప్రపంచమంతయు వ్యాపించినదో యట్టి కురుక్షేత్రఖనియే ఖని.

నేనొక పాదుషా దివాన్ ఖానా జూచితిని. అది పాలఱాతిదూలములతోఁ బలకలతో వాసములతో నిర్మింపఁబడినది. ఎదుట నెన్నియో దివాన్ ఖానాలు నాకుఁ గనబడుచున్నవి. ఈ ప్రక్క నాప్రక్కను వెనుకగూడ నెన్నియో శాలలు గనబడుచున్నవి. ఈశాలల పొడువు నకు వెడల్పునకు హద్దే కనబడుకుండ నున్నది. లెక్కలేనన్ని నాస్వరూపములు నన్నుఁ జూచి వింతపడుచున్నవి. శ్రీరామచంద్రమూర్తి గాంధర్వాస్త్రమును విడిచినప్పడు యుద్ద సీమయంతయు నామయము నైనట్లు కనబడుచున్నది. నేను ముందునకుఁ బోవ నేనే నన్నెదుర్కొనుచున్నాను. మనస్సునకుఁ గలతగనుండి వెనుకకుఁ బోవ నాస్వరూపము నన్నే వెంబడించుచున్నది. మయసభలో నీరు లేనిచోట నీరున్నట్లు నీరున్నచోట నీరులే నట్టు భ్రమ గలుగుచుండెనను మాట జ్ఞప్తికి వచ్చినది. నీరున్నను లేకున్నను నీరున్న స్థలమని నీరులేని స్థలమని రెండుస్థలములు వేర్వేఱుగ నచ్చట నున్నవి కాని యిచ్చట శాలలేని చోటు శాల కనబడుచున్నది. ఒకటా? చెప్పలేనన్ని నేను లేనిచోట నేను గనబడుచు న్నాను. ఒక్క నేనా లెక్కలేనన్ని నేను గృహనిర్మాణకళా (architecture) సంబంధమగు నింద్రజాలమునకు వశుండ నై కలవరపడితిని. అంతలో మనసు రవంత గుదుట బఱచుకొని నన్నునే నిట్టు నిందించుకొంటిని. 'సాక్షి శిష్యుడ వగునీకీ బుద్దిహీనత యేల? ఇది యొక్క భ్రమమా? ఇది యొక్క యింద్రజాలమా? ఇంతకంటె కోటిగుణములు భ్రమాపాదక మైన యింద్రజాలములో నఱువది సంవత్సరములనుండి పడియుంటివి కాదా? ఆ మహా మాయ కలవాటుపడియుంటివి కాదా “ప్రకృతిలోఁ బ్రతిఫలించిన పరమాత్మగాన బఱచిన మహామహేంద్ర జాలమేకాదా. ఇన్ని లక్షలగోళములు, ఇన్నికోట్టజీవరాసులు. అనంతమై యప్రమేయమై యద్వితీయమైన ఈసృష్టియంతయు మహేంద్రజాలమే కాదా? పరబ్రహ్మాపా దకమైన భ్రమకు పరిపాటియైన నీవు పాదుషాభవనమున నిట్లు భ్రమపడెద వేల యని నన్ను నేను నిందించుకొంటిని. అంతలో నిమ్మళముగ ననినట్లు నాకు వినబడి ఉలికిపడి వెనుకకు జూచితిని. మావంక నేలచూచెద వని వెనుకనున్న నేను లన్నియుఁ నన్నుఁబ్రశ్నించెను.

మనస్సులోఁ గలిగిన తొట్రుపాటు నివారించుకొని నిదానముగ నచ్చటి చిత్రములన్నియుఁ బరిశీలించితిని. పైగప్పుపరాలపైఁ జెక్కబడిన పుష్చములు లతలు ఫలములు పక్షులు బొమ్మలు బంగారము మీది పనికంటె నెక్కువ సుకుమారముగ సున్నితముగ సురుచిరముగ నున్నవి. కొన్నిదూలములకుఁ గొన్నిస్తంభములకుఁ గొన్నిగవాక్షములకుఁ గొన్నివిగ్రహములకుబైన నుల్లిపొరవంటి బంగారురేకులు కప్పఁబడియున్నవి. నడుమ నడుమ నవసరానుసారముగ నలంకారార్ధముగ గల్ల కెంపులు వైడూర్యములు స్పటిక ములు పుష్పరాగములు మఱియు ననేకములుగా మణులు చెక్కబడి యున్నవి. జిగజిగలా మిలమిలలా తళతళలా! ఓ! వచించుటకు శక్యముకాని వింతకాంతులు ప్రజ్వరిల్లుచున్నవి. ఆసమయమున నెవఁడో వచ్చి యగ్గిపుల్లను వెలిఁగించెను. ఆహాహా! ఏమి వైభవము? నూఱుఇంద్రధనువు లొక్క త్రుటికాలములో నచ్చట నవతరించి వెలిఁగిపోయిన ట్లయ్యెను. అత్యంత మాధుర్యమునం ద్వరలో మొగము మొత్తును. అత్యంతదీప్తిచేఁ గన్నులు జీకట్లు పడును. అత్యంతోష్ణముచే వేగం జలికలుగును. అత్యంతశీతలతచే జ్వరము కలుగును. అత్యంతసౌందర్యమున-మనసు మొద్దెక్కును. నిర్జీవసౌందర్య మెంతసేపాకర్షింపఁగలదు? జీవత్సాందర్యమునకే దిక్కులేదే- కన్నుముక్కు తీరు నితరావయములసౌరు, నెక్కడ నేయం గుండవలయునో యాయంగుల నన్నింటిని మించిన రంగుమాత్రమే కల యంగన సైతమొకదినము కంటె నెక్కువ యాకర్షింపలేదే. సౌందర్యము సంతతాకర్షణీయముగ నుండుట కెన్ని పరిస్థితులు తోడుపడ వలయును. అవి తోడుపడని యెడల గోనెగుడ్డమీది నూనెబొమ్మయెట్టిదో యదియు నట్టిదే. ఈవిషయమును గూర్చి ప్రత్యేకముగఁ జెప్పెదను గాని యిప్పడు చెప్పఁదగదు.

సౌందర్యానుభవమునఁ జప్పబడిన మనసుతో నింటికై మరలిపోబోవగ నెదుట గోడపై బంగారువర్ణములుగల రెండు పంక్తులు గానంబడెను. అవి హిందుస్థానివర్ణములు. ఆ వ్రాతలోని యభిప్రాయ మేమనంగా:-భూలోకమందు స్వర్గమే యున్నయెడల నది యిదే. అది యిదే. అది యిదే. వెగటుపడిన మనస్సుతో నుంటినేమో, నాకామాటలు మఱింత వెగటయ్యెను. నాయనలారా! కురుక్షేత్రమునకు నాతో దీసికొనిపోయిన మిమ్ముఁ బ్రసంగవశమున హస్తినాపురమునకుఁ దీసికొని పోయితిని. నాయం దనుగ్రహించి తిరుగ గురుక్షేత్రమునకు దయచేయుదురుగాక. ఉర్డుకవి వ్రాసిన వ్రాఁతలోని యర్ధనును దెలిసికొంటిరికాదా? వారికిందెల్లరాతి పలకలు పాలసున్నము బంగరు రేకులు విలువగలమణులు ఫలాహారములు షర్బతులు లవలవ వఱకు ముదురనినవ నవయువతీమణుల మొగములే స్వర్గమైననగు గాక, వైకుంఠమైన నగుగాక, పరమపదమైన నగుగాక! కాని మనకు మాత్ర మీకురుక్షేత్రమే స్వర్గము. ఇచ్చటి కంకరరాలే రత్నరాసులు. ఇచ్చటి బుడ్డమేడిచెట్టులే కల్పవృక్షములు. ఇచ్చటిమట్టియే బంగారము. ఇచ్చటి యొండమావుల వెల్లువలే యాకాశ గంగాప్రవాహములు. ఎందుచేత? లోకములో నున్న అన్నిబంగారు గనులకంటెను నన్ని రత్నాలగనులకంటేును నత్యధికమైన విలువ గల భగవద్గీత యిచ్చట నుద్బుద్ద మగుటచేత. నాయనలారా? ఆగ్రంథముచే మనము తరింతుము. అంతేకాని కాసులగోనె నెత్తిపైబెట్టుకొని వైకుంఠసోపాన మెక్కినవాఁ డెవఁడు? ధర్మరాజుతోఁ బైలోకమునకు వచ్చినది శునకముకాని ద్రౌపది కాదే. పోనిండు. ద్రౌపది యుమ్మడియాస్తి కావున నాతనితోఁ బోకపోవచ్చును గాని యెవరికిఁ దగిన సొంతసరకును వారు జాగ్రత్తపెట్టుకొనియే యున్నారు కాని, యుపేక్షింప లేదే. ధర్మరాజుమాత్రము తత్త్వవాక్యములలో శ్రుతపాండిత్యము సంపాదించినవాఁడుకాని ప్రక్క దాపు లేకుండ బండ్రెండుమాసములు గడపఁగలిగిన యెడలి స్తిమితత గలవాఁడా?

భగవద్గీతను లోకగురునిచే నుపదేశ మందిన నరునకుఁ బైలోకమేల రాలేదో యడుగ రేమి? అర్జునునకు జ్ఞానసంపాదన కధికారము లేదు. ఆతడు గుంటయోనమాల యొద్ద నున్నవాఁడే కాని యంతకుఁబైని బోయినవాఁడు కాఁడు. సోదరులను గురువులను బంధువు లను జంపుట కిష్టపడక యుద్దము మానుకొని యేడ్చుచుఁ గూరుచుండిన పార్డునకు “శత్రువు లందఱు నాచేతనే చచ్చినారు. నీ పూరక ధనువు పట్టుకొని నిమిత్తమాత్రుడనై నిలుచుండి కత్రియధర్మమును నిర్వహించుకొను" మని చెప్పిన కృష్ణునిబోధన యంతమా త్రమే నరునికి బోధమైనది కాని మిగిలినదంతయు నతని యాచరణములోనికి రానిదే యయ్యెను. సర్వకర్మములుకూడ జ్ఞానమందుఁ బరిసమాప్తినొందవలసిన దని పురుషోత్తము లుకూడ చేసిన బోధ మతని యంతరంగమున నెక్కినదా? అట్లాచరించినాడా! సర్వజ్ఞానస ముదయము కూడ యుద్దకర్మమునందుఁ బరిసమాప్తి యైన ట్లయినది.

ఇక ధర్మరాజమాట-అతనికి రాజ్యమందున్న తృష్ణ యెవ్వనికిని లేదు. అతనికి జూదమం దున్నప్రీతి దేనియందును లేదు. ఆతని గడుసుమాటలు, కల్లయేడ్పులు, బొల్లినైచ్యములు, ముఖస్తుతులు; సమయోజిత ప్రవర్తనమలు మఱి యింక నెన్నియో యతని నరకార్హుడునిఁ జేసినవి. కాని యాసపడి యాసపడి యేడ్చియేడ్చి తెచ్చుకొన్న రాజ్యములో సర్వశూన్యత తక్క పెద్దవల్లకాడుతక్క నిత్యశ్రాద్దాలుతక్క మఱికి యేదియు లేకపోవుటవలనను బుద్దిపూర్వకముగ నున్నను జంపించుటచేతఁ గలిగిన ఘోరపశ్చాత్తాపము వలనను నరకార్హత కొంత తప్పినది. అందుపై భీష్మునిధర్మబోధములు సమయోచితముగఁ గలుగుట చేత నాతని మనస్సునకు శాంతి కలుగఁ జేసినవి. అందుచేత నాతనికిఁ గొంతకాలమైన స్వర్గలోకవాసము కలిగినది. ఇట్టుగా ధర్మరాజు జ్ఞానమువలన నుత్తమలోకార్హు డయ్యెను.

అట్టి జ్ఞానబోధ మీ కురుక్షేత్రమున జరిగినది. అందుచేత నీ భూమి మిగుల పవిత్రమైనది. మనస్సులలో సాష్ట్రాంగపడుడు కన్నుల కద్దుకొనుడు -కృష్ణా! ఆపదుద్దారకా! సంసారసాగరతారకా! యని యా నేలపైఁ బడితిని. ఒకవిధమగుకలఁతనిద్ర కలిగెను. దానిలో నొకస్వప్నము వచ్చినది. అది వినుడు.

రెండుకొండ లెదురుగఁ గనబడినవి కాని నడుమనున్న కోనలో నొక చక్కని యాశ్రమమున్నది. అచ్చటికిఁ బోయి పరిశీలించితిని. దానిలో నొక్క రావిచె ట్టున్నది. ఆచెట్టు భూలోకమందలి చెట్టవలె మూలము నొద్దనే మున్నదో పరీక్షింతు మని తలయెత్తగ జెప్పరాని, చూడరాని, తలఁపరాని వెలుఁగుచేఁ గన్నులు మనస్సుకూడ జీకట్లు పడినవి. పైకిఁజాడలేక చలువలు వెదచల్లుచున్న యాకులవంక జూచితిని. ఒక యాకు తేజస్వంతమై యున్నది. ఒకటి నల్లగ నున్నది. ఒకటి తెల్లగ నున్నది. ఒకటి శ్రవణమనోహరస్వరమయమై యున్నది. ఈ యాకుల క్రింద నొక మహావ్యక్తి యాసీనుఁడై యుండెను.

ఈతఁడు కూరుచుండునప్పడే నాలుగడుగులకంటె నెత్తుకలవాఁడై యున్నట్టు కనఁబడినది. నల్లని శరీరకాంతికలిగి పచ్చని జటలుకలిగి యాతండు ప్రకాశించుచుండెను. ప్రక్కనొకకఱ్ఱ భూమిపైనున్నది. అప్పడు 'ప్రాంశుపయోద నీలతనుభాసితు నుజ్జ్వలదండ ధారు' అనుపద్యము జ్ఞప్తికివచ్చినది. అదిగాక యాచెట్టవైఖరి జూడ “ఊర్ధ్వ మూలమధశ్శాఖ మశ్వత్తం ప్రాహురవ్యయమ్' అన్న శ్లోకము జ్ఞప్తికి వచ్చెను. అందుచే నీతఁడు వ్యాసమహ రియై యుండునని యనుకొంటసిని. అదిగాక యా యశ్వత్థవృక్ష వర్ధములైన వేదములనొద్ద నీతడు కూరుచుండి యుండెను. ఈతడు తప్పక వేదవ్యాసుడని నిశ్చయించి యెదుటికిఁ బోయి సాష్ట్రాంగపడి యిట్టంటిని.

మహర్షి శేఖరా? మీరు విభాగించిన వేదముల నెవ్వరు నిప్పడు పఠించుట లేదు. స్పృశించుట లేదు. అంటరానితనము చెప్పరానితనము నీవేదములకు మనవా రంట గట్టివారు అవి యందుచే పై ఖండములవారి యధీనములయ్యెను. మీరు రచియించిన భగవద్గీతకూడ మొన్నమొన్నటి వఱకు బుట్టదాఖలై యుండెను. అది మిక్కిలి యుద్గ్రంథ మని పాశ్చాత్యులు స్తుతించుట చేత వారిమాటల నాధారము చేసికొని యిప్పడిప్పడే గ్రంథఘనత కచ్చెరు వొందుచున్నారు.

మహర్షిచంద్రమా! కమించునెడల నొక్క సంగతి యడిగెదను. భగవద్గీతకు బుద్దిమం తులగు పండితు లందఱు వివిధములగా వ్యాఖ్యానములు చేయుచున్నారేల? శంకరాచార్యుల వలె రామానుజులు చేసినారా? వారివలెమథ్వాచార్యులు చేసినారా? యుద్ధకర్మము చేయుటకే యిప్పటివా రనుచున్నారు. మఱియొకరు భగవద్గీతను మీరు రచియింపనే లేదని తుండు తుపాకి నెగుర గొట్టుచున్నారు. మీరను నొక వ్యక్తియే లేదని కొంద ఆనుచున్నారు. కృష్ణుఁ డన్న యాతఁడు దశావతారములలోనివాఁడు కాఁడని మఱికొందఱనుచున్నారు. ఈచచ్చు వాదములకేమి కాని యిన్నివిధములైన వ్యాఖ్యానములు బుట్టుటకు హేతువేది? కృష్ణభగవానుఁ డిన్ని యర్ధములగునట్టు చెప్పనా? కాక యాయన యభిప్రాయమును మీరు సరిగాష దెలిసికొన లేక యిట్లు వ్రాసితిరా? కాక యన్ని విధములగు నర్ధములకు లోపము మీ వ్రాఁతలోనిదా? నాకుఁ దెలియక యడుగుచున్నాను దేవా! క్షమింపుఁడు.

మీవేదాంతసూత్రములకు మతత్రయవ్యాఖ్య లున్నవి. ద్వైతశ్రుతులు నద్వైతశ్రు తులు వేలువేఱుగా విరివిగా నుండుటచేత జ్ఞానమే మోక్షమసాధనమని తన బుద్దిచే నమ్మిన శంకరాచార్యులు ద్వైతశ్రతులను ముక్కముక్కలక్రింద నఱికి వాని కద్వైతార్ధమును గలిగించి నారు. భక్తియే మోక్షసాధక మని నమ్మిన రామానుజాచార్యు లద్వైత శ్రతులకు జచ్చిచెడి ద్వైతార్ధమును గల్పించినారు. పూర్వాచార్య పురుషులగువా రిట్టే వారి వారిమనస్సులలోఁ దమయభిప్రాయములచేతఁ బూర్వమే సంకల్పించుకొన్న సిద్ధాంతములఁ బట్టి కాలస్థితులవలనఁ గలిగిన సొంత నమ్మకములఁ బట్టి వ్యాఖ్యానములు చేసినారేకాని మీగ్రంథ మందున్న యథార్థసత్యమును గ్రహింపలేదని యిప్పటి యాచార్యపురుషులనుచున్నారు. కాని యిప్పటివారి వ్యాఖ్యానములుకూడ సరిగా నిట్టి యధిక్షేపణకే లోనై యున్నవి. ఈ అత్తగారు తన్ను బాధించినదని యాక్షేపించిన యిల్లాలు తాను కోడలిని బాధపెట్టకుండ జరుపుకొన వలసినది. అట్టు జరుగుట కవకాశము లేకపోయినది.

మహర్షిపురందరా! భగవద్గీతకు నిజమైన యర్దమేదో నాకు బోధింపఁదగదా! యని ప్రార్డించితిని. ఆయన ముసిముసినవ్వులు నవ్వినాడు. దానివలన నా కప్పటి కేమి తెలిసిన దనంగా పూర్వుల వ్యాఖ్యానములు సరియైనవి కావని యాయన యభిప్రాయ పడినట్టు నాకు గోచరమైనది. కాని యీ యంశము నిశ్చయముగాఁ దేలకపోవుటచేత గ్రుచ్చి గ్రుచ్చి మఱియొకసారి యడిగితిని. అంతట నాతండు తన ప్రక్కనున్న కఱ్ఱనెత్తినాడు. కొట్టునేమో యని లేచి యిప్పటివారు చెప్పినట్లు భగవద్గీతకు బడితెబాజాయే యర్ధమా యని యనుచుండఁగా నన్ను లేపినాఁడు. స్వప్నము సరి.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః