Jump to content

సాక్షి మూడవ సంపుటం/సభాస్వకీయ వ్యాపారములు

వికీసోర్స్ నుండి

16. సభాస్వకీయ వ్యాపారములు

నెలకొకసారి ఉపన్యాసానికి బదులు సాక్షిసంఘపు సొంత వ్యవహారాలు చూసుకోవాలనే నియమం చొప్పున ఈసారి, సంఘానికి వచ్చిన ఉత్తరాలు చూడడానికి నిశ్చయించాడు జంఘాలశాస్త్రి.

ఒక ఉత్తరం శవచింతామణీ గ్రంధాలయ కార్యదర్శి వ్రాశాడు. వారి గ్రంథాలయంలో, సాక్షి ఉపన్యాస సంపుటాలు ఒకటు, మూడు మాత్రమే వున్నాయట. రెండు, నాలుగు సంపుటాలు "ఉచితం'గా పంపమని అభ్యర్ధన. అలాగ కవులు తమగ్రంథాలు పంపిస్తూంటారట.

ఈ లేఖ వ్రాసినాయన ఒక సూచన కూడా చేశాడు. కాలాచార్యులు, వాణీదాసు కూడా తరుచు ఉపన్యాసాలిస్తే బాగుంటుందని.

దానిమీద వ్యాఖ్య అనవసరమని తీర్మానించారు. రెండో ఉత్తరం, కృష్ణాగోదావరీ మండలాలలోని యావదాంధ్ర క్షౌరశాలల సామాన్యకార్యదర్శి నుంచి వచ్చింది. ఏలూరులో ఈ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయంలో, పద్దెనిమిదవ వార్షికోత్సవం జరగబోతోందనీ, దానికి అగ్రసనాధిపతిగా రావలసిందనీ, జంఘాలశాస్త్రికి ఆహ్వానం.

దీనికి అంగీకరించడమా? మానడమా? అని చర్చకు పెట్టగా-వాణీదాసు, వెళ్లాలని చెప్పాడు. కాలాచార్యులు వ్యతిరేకించాడు. కాని -ఉపన్యాసం ఉంటుందని వినడానికి అక్కడకు జేరిన ఇతరశ్రోతలు ఊరుకో లేదు. వారిలోంచి ఒకడు లేచి, జంఘాలశాస్త్రి ఆ సభకు వెళ్లకపోతే వచ్చే నష్టాల గురించి చెప్పి, వెళ్లి తీరాలని ప్రతిపాదించాడు. మిగిలినవారు కరతాళ ద్వనులలో ఆమోదించారు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

ఈదినమున నుపన్యాస మేదియును లేదు. పూర్వనియమానుసారముగా మాసమున కొకతూరి సభాసంబంధము లగుసంగతులను గూర్చి సల్గాపించు కొందుము. ఉపన్యాన ముండు నని పెద్ద లందఱు వచ్చినారు. కావున నాయనలారా! ఉపన్యాసము లేనందులకు క్షమించి మావ్యవహారములలో మీకుఁ దోచిన యభిప్రాయముల నొసంగి తోడుపడఁ గోరుచున్నాను. సాక్షికార్యాలయమునకు వచ్చిన లేఖల జదివెదను.

మొు దటిది.

శవచింతామణీ గ్రంథాలయ కార్యదర్శియగు గొంగళి భుక్తసాకీన్ గొలాంత్రగారి యొుద్దనుండి

శ్రీశ్రీ రాజమాన్యరాజపూజితులగు సాక్షికి

అయ్యా! మీ సంఘము తిరుగ స్థాపింపబడినదని విని మిగుల నానందించు చున్నాము. మాపుస్తకాగారమున మీ సంపుటములలో మొదటిది మూడవది మాత్రమే యున్నవి. రెండు నాల్గు సంపుటములు మాకుచితముగాఁ బంపవేఁడు చున్నాము. మానిలయము మిగుల దరిద్రస్థితిలో నున్నది. దైనికమగు నాంధ్ర పత్రిక నా విశ్వదాత పంపుచున్నాఁడు. ఆయన కనేక నమస్కారములు. మాగ్రంథ నిలయమునకుఁ గొందఱుకవులు వారి వారి గ్రంథములను ధర్మముగాఁ బంపుచున్నారు. ఆకవులకు నమస్కరించుచున్నాము. మీ జంఘాలశాస్త్రి యుపన్యాసములు వినుభాగ్యము తిరుగ మాకు లభించినందులకు సంతస మగుచున్నది. కాని యుకందులకు గొంచెము వగచుచున్నాము.

1. జంఘాలశాస్త్రి నడుచు నడుమ నాంగ్లేయపదముల నుపయోగించుచున్నాఁడు. వాని కర్దము తెలియక చిక్కుపడు చున్నాము.

2. ఈయంశమునుగూర్చి తరువాతఁ జెప్పెద నని వాగ్దాన మొనర్చిన విషయము లెన్నియో గలవు. అవి యన్నియు నిప్పడు చెప్పఁగోరుచున్నాము.

3. మీలో కాలాచార్యులు, వాణీదాసకవియు నున్నారుకాదా? వారుగూడ తఱచుగా నుపన్యాసము లిచ్చిన బాగుగా నుండునని నామనవి.

4. మాయూర నొకవైద్యు డున్నాడు. ఆతడు మీయుపన్యాసము లన్నియు నప్పజెప్పఁగలడు. మీసంఘమునం దాతని సభ్యునిగాఁ జేర్చుకొనవలయును.

చిత్తగింపవలెను గొంగళిభుక్త కార్యదర్శి.

జంఘాలశాస్తి యిట్టు లేఖను బూర్తిచేసి దీనికిఁ బ్రత్యుత్తర మక్కఱలేదు కాదా యని నభవారి నడిగెను. అందఱున లేదనిరి.

జంఘాలశాస్త్రి రెండవ యుత్తరమును దీసి యిట్టు పలికెను.

సోదరులారా! ఇది రెండవయుత్తరము దీనిని జదివెదను.

కృష్ణాగోదావరీ మండలాంతర్గత సర్వాంధ్రకురకశాల సామాన్యకార్యదర్శి యొద్దనుండి -జంఘాలశాస్త్రిగారికి-

రామ్ రామ్,

ఏలోరులో స్థాపింపఁబడిన యీ సర్వక్షురక శాలాప్రధానకార్యాలయమునం దీసంఘసం బంధమైన పదునెనిమిదివార్షికోత్సవ మీనెల 27వ తేదిన జరుపుటకుఁ బెద్దలు నిశ్చయించి నారు. ఆంధ్రదేశము నందుండు క్షురక విద్యాపారీణుల కందఱ కాహ్వానములు పంపించుచు న్నాము. చిత్ర విచిత్రోపన్యాసము లీయంగల మంగలి మహావక్తలెందఱో రాఁగలరు. క్షురకవి ద్యారహస్యము లెన్నియో వెల్లడింపఁ గలరు. అట్టి మహాసభకు మతాభిమాన న్యాయముచేత మంగలియే యధ్యక్షుండుగా నుండఁ దగినది. కాని మొన్న జరిగిన కార్యనిర్వాహకసభలో మిమ్మధ్యక్షుడుగా నాహ్వానించుట కేకగ్రీవముగ దీరుమానించు కొంటిమి. మంగలికి రాదగిన మహాగౌరవమును మతాంతరున కిచ్చి స్వార్థపరిత్యాగమును మాసభవా రగపఱచి నారు. మీ రగ్రాసనాధిపతిగా దయచేసి మమ్మానందింపఁ గోరుచున్నాము- ఇట్లు విన్నవించు కార్యదర్శి.

ఉత్తరమైనది. దీనికిఁ బ్రత్యుత్తర మేమని సభలో జంఘాలశాస్త్రి యడిగెను.

అంత వాణీదాసుఁడు లేచి యిట్టనియెను. క్షురకసోదర శిఖామణులు మీ కిచ్చిన గౌరవమునకు మీరు సర్వవిధముల నర్హులు కావున నంగీకరించితినని లేఖ వ్రాయవలయును.

అంత కాలాచార్యులు లేచి యిట్టనియెను.

ఇది మతవిద్యతోఁ జేరినయంశము. మతవిషయక మగు నాసభకు మతేతరు డధ్యక్షుడుగా నుండుట తగదు. అందుచే జంఘాలశాస్త్రి పోఁగూడదని నా యభిప్రాయము.

అంత సభనుండి యొక్కడు లేచి యిట్టనియెను.

సోదరులారా! కాలాచార్యులు చెప్పినమాట కేవల మనుచితముగ నున్నది. ఇందఱు మంగళ్ల యభిప్రాయమును నిరాకరించుట తగదు. అందులో మతవిభేదమే కారణముగ నెన్నఁడును నిరాకరింపఁదగదు. మతసంబంధమగు పట్టుదలచేతనే జంఘాలశాస్త్రి నిరాకరించినాఁడని మంగళ్ల కేమాత్రము తెలిసినను వారు బ్రాహ్మణులపై సత్యాగ్రహమును జరిపి తీరెదరు. అప్పడు బ్రాహ్మణులు గిజగిజలాడవలసి వచ్చును కురకర్మ మెట్లో స్వయముగా దీర్చుకొందుమని పురుషులు లక్ష్యపెట్టక పోయినను స్త్రీలమాటయేమి? వితంతువులలోనే కాకుండ నీకాలములో సువాసినులకు గూడదల కత్తిరించు కొనుటకై మంగలి యపేక్షగలదు. ఇదివఱకే యనేక భేదములుచే దేశ ముల్లోలకల్లోమై తపించుచుండ శక్తివంచన లేకుండ నుపశాంతి చేయుటకు బదులుగ వృద్ది పఱచుటకై ప్రయత్నించుట బుద్దిహీనతకంటె భిన్నమా? కావున జంఘాలశాస్త్రి యంగీకరింప వలసియున్నది.

ఈయుపపాదనమును సభవారందఱు కరతాళధ్వనులతో నంగీకరించిరి.

ఇంతకంటఁ జదువఁదగిన లేఖలు లేవు. చూడఁదగిన వ్యవహారము లంతకన్న లేవు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః