Jump to content

సాక్షి మూడవ సంపుటం/క్షురకసభ

వికీసోర్స్ నుండి

17. క్షురకసభ

లూరులో జరిగిన క్షురకసభకు జంఘాలశాస్త్రి అధ్యక్షుడిగా వెళ్లాడు. సభకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. జంఘాలశాస్త్రికి సభామందిరం దగ్గరకు సోడాబండి మీద కూర్చోపెట్టి లాక్కొని వెళ్లారు- గౌరవసూచకంగా-

రకరకాల పతాకాలు క్షురకసభకు గుర్తుగా అక్కడ సభాభవనం దగ్గర కట్టారు. దాదాపు వెయ్యిమంది దాకా ఆసభకు హాజరయ్యారు.

ఒక మంగలి సోదరుడు వేదికమీది కెక్కి, సాక్షి సంఘానికి చెందిన జంఘాలశాస్తిని ఎందుకు అధ్యక్షుడిగా ఉండమని కోరినమీద వివరించాడు. సాక్షిసంఘానికీ క్షురకమండలికీ ఉన్న పోలికలను వివరించాడు.

జంఘాలశాస్తి అధ్యక్షస్థానంనుంచి మట్లాడుతూ, ఈదినం శారదాచరిత్రలో అద్వితీయం కాగలదని నొక్కి చెప్పాడు. తను ఇక్కడ ఇలా వుండడం పూర్వజన్మ అనుబంధం అయి వుంటుందని సవినయంగా చెప్పాడు.

అనంతరం ఒక మంగలి సోదరవక్త పరిశోధకుడు, వేదికఎక్కి, క్షురక జాతికి బౌద్దమతంతో వున్న సంబంధం, దేశ చరిత్రలో క్షురకజాతివారు, పాలక ప్రభువుల సన్నిధిలోవుండి చేయించిన మంచిపనులు, వివరించాడు. అయితే ఈ పరిశోధన ఉత్సాహంలో క్షురక, క్షత్రియ జాతుల్ని ఏకం చెయ్యడంవల్లనూ, మంగళ్లలో ఏలూరు మంగళ్లు ఎక్కువ పరిశుద్దులనడం వల్లనూ, గొడవజరిగి, ఉపన్యాసం ముగించవలసి వచ్చింది.

మరొకవక్త వచ్చి-సున్నితమైన క్షురకర్మకీ, సారస్వత సృష్టికీ వున్న పోలికలు వివరించాడు. క్షురకర్మలో ఉన్న వేదాంతార్ధాన్నికూడా విశదంచేశాడు. ఇంతలో సభారంగం బయట రణరంగంగా మారడంవల్ల అధ్యక్షుడి ముగింపు వాక్యాలు లేకుండానే సభ ముగిసింది.

జంఘాలశాస్త్రి నేను వెడలినతరువాతి నిట్లు చెప్పెను:

ఎన్నడుఁజాడలేదు. ఎన్నఁడు వినలేదు. అట్టివైభవము హేలాపురమున 27 వ తేదీని కాననయ్యెను. క్షురకసభాశాలపై వేలకొలఁది పతాకములు వివిధవర్ణనిరాజమానములై ప్రకాశించెను. ఒక జెండాపై మంగలికత్తి చిత్రంప బడియున్నది. మఱియొక్క జెండాపై దావివి రాతిమీద విలాసముగ నూఱుచున్న యొక క్షురకుడు చిత్రంపబడినాఁడు. ఇంక నొక్కజెండాపై తోలుపొది నొడిలోఁ బెట్టుకొన్న మహాలక్ష్మీదేవి చిత్రింప బడియున్నది. ఇంకొక్కజెండాపై శారాదాదేవి, చేతిలో నొక్క తక్కెడతో నవ్వుచు నిలువంబడియున్నది. ఆత్రాసులో కొక చిప్పయందు గంటము, ఒంటె వెంట్రుక కుచ్చుతాపి ఉలియు, రెండవ చిప్పయందు గత్తెరయు నున్నవి. కత్తెరవైపున బరువెక్కువగా నున్నట్టు కనఁబడుచున్నది. బహిరంగత కొఱకు నన్నొక సోడాబుడ్ల బండి మీఁదఁ గూర్చుండబెట్టి యెనమండ్రు క్షురక విద్యాపారంగతు లనేక శతమంగళ వాద్యములు ఘోషించుచుండ సభకు లాగుకొని పోయిరి. అప్పటి కింక నుదయ మేడుగంటలకంటె నెక్కువ యైయుండపోవుటచేత సభయైనతరువాత నక్కఱకు వచ్చు ననికూడ దెచ్చుకొన్నపొదులను కొందఱు కరతాళధ్వనుల సౌకర్యముకొఱకు నాయొడిలోఁ బెట్టిరి. సోడా బండిదడదడలో నవి యూడిక్రింద బడునేమో యని కొన్నిటిని జేత గట్టిగఁ బట్టుకొనియుఁ గొన్నిటిఁ దొడల క్రిందఁ బెట్టి నొక్కియు వాయువేగముతోఁ బట్టుకొనియుం గొన్నిటిఁ దొడల క్రిందఁ బెట్టి నొక్కియు వాయువేగముతోఁ బోవుచు న్నాను. ఒక్కమంగలియొద్ద నొక్కపొదికంటె నెక్కువగా నుండవలసిన యగత్యము లేనప్పటికి మంగలి సభాధ్యకుఁడనైన నాయొద్ద నేడుపాదు లేకకాలమందుండు నదృష్టము సిద్దించి నది. ఎట్టో సభలోనికిఁ బోయితిని. సభ కన్నుల వైకుంఠముగ నున్నది. కదళీవృక్షచ్చటలు, వట్టివేళ్లతడకలు, చలువ చప్పరములు, కొబ్బెరాకుల వీవనలు మండువేసవిని మఱవఁజేయు చున్నవి. సభలో వేయిమంది క్షురకు లున్నారని తెలియవచ్చినది. ఇతర శాఖలవా రింక నెందలతో యున్నారు.

అంత నొక్కమంగలి చెంగు చెంగున నుపన్యాసరంగ మలంకరించి దైవప్రార్డన మిట్టొనర్చెను.

ఉ. ఎప్పడు భూమిఁ బుట్టితిజా యెప్పడు జానకిచెట్టఁ బట్టితో
ఎప్పడు కానమెట్టితిఱా యెప్పడు రావణు గిట్టఁగొట్టితో
అప్పటి గాథలెల్ల నిల నార్యుల చిత్తములందు గట్టిగా
ముప్పిరి పేట నల్లుకొని పోయె రఘాద్వహ! మమ్ముఁ బ్రోవుమా.

సోదరులారా! ఈసభకు మనమెవ్వరినైన నధ్యకుని నియమించు కొనవలసి యున్నది. సాక్షిసంఘమునకు శౌరశాలకు భేద మేమియులేదు. మనమొక చిన్నకొట్టులో మనదుకాణ మొకరిద్దఱసాహాయ్యముచేఁ బెట్టుకొనినట్టే వారుకూడ నొకకొట్టులో నొకరిద్దఱకితోడుతంజిన్న సంఘము స్థాపించుకొనినారు. మనలఁ జూచుటకు నిత్య మెందఱో వత్తురు. వారిని జూచుట కనుదిన మెందఱో వత్తురు. మనయొద్దకు వచ్చినవారిమనస్సున కాహ్లాదముగ మనము వర్తిల్లునట్టే వారియొద్దకు వచ్చినవారిమనస్సు కానందమగునట్టు వారు ప్రవర్తింతురు. వారమున కొక్కదినమున ననగా నాదివారమున మనకు లెక్కలేనంత జనము వచ్చినట్టేడే, శుక్రవారమునాడు వారిసంఘమునకు నట్లే వత్తురు. ప్రధాన శౌరకుడు మనలో నొక్కఁడే యున్నట్లు వారిలోఁ బ్రధానవక్త యొక్కడే. మనసంఘమును స్థాపించిన పూర్వా చార్యుల పేరిట సంఘమెట్టు నడచుచున్నదో వారి సంఘముకూడ సాక్షిపేర నట్లే జరుగుచున్నది. సాక్షి యుపన్యసించుటగాని, వ్రాయుటకాని యేమియు లేదు. మన సంఘస్థాపకు డట్టలంకారముగా గోడపై నుండుటయేకాని యొక్క కత్తి నూఱినాడా? ఒక్కగడ్డము తడిపినాండా? ఏమియు లేదు. దినములు దొరలిపోవుటకు మనసంఘమె ట్లేర్పాటయినదో వారి సంఘముకూడ నందులకే యేర్పాటయినది. దేశసేవ యని లోకోపకార మని, బుద్దిహీనులు బోధించెడి బోధకాలిమాటలు బూటకములు. కోట్లకొలఁదిధనముతో వ్యవహరించు సంఘమైనఁ గూటికొఱకే- ఆరోగ్యప్రదానమునకై పాశ్చాత్యదేశీయు లిట స్థాపించిన యాసుపత్రులు, ధర్మసంస్థలు మొదలైన వన్నియు దనసంపాదనకే. జ్ఞానబోధముకొఱకు మతగురువులను దేశదేశములకు బంపుసంఘములన్నియు సందేహరహితముగ సంపాదనకే - వారివలన లోకమున కేదియో యుపకారము జరుగుచున్నది కాదా యని యందురా? వారివలననే యన్నమాట యేమి? ఎన్నియో యీగలను దనపొట్టును బెట్టుకొని బల్లి యంటు రోగములను బ్రాంకకుండ నాపుచున్నది కాదా? బల్లి లోకోపకారమునకే యట్టు చేయుచున్నదా? పిల్లి యెలుకల నెన్నింటినో చంపి మారికావ్యాధి నరికట్టుచున్నదికాదా? పిల్లి లోకోపకారమునకే యట్టు చేయుచున్నదా? మాటలచే మనము మనల మోసపుచ్చుకొనుట తగదు. లోకమునఁ బ్రతిజీవము వలననే కాదు, ప్రతినిర్జీవ వస్తువులనగూడ లోకోపకా రము జరుగుచున్నది. వేపాకువలన మసూరిరోగము స్తంభించుచున్నది. తెల్లజిల్లేడు వలనం గాసరోగము తగ్గుచున్నది. ఉమ్మెత్త వలన నుబ్బసమునకు వడిమఱలు చున్నది. బల్ రక్కసి వలన దేలు బాధ పోవుచున్నది. నాభివలన జ్వరము హరించుచున్నది. తుదకు మనకాలి క్రింద మట్ టివలన జరుగుచున్న లోకోపకార మింతంతకాదు. ఇట్టి నిర్జీవ పదార్దములవలన బ్రపంచమునకు మేలు జరుగుచున్నట్టే జీవపదార్థముల వలనఁ గూడ జరుగుచున్నది. స్వభావసిద్దముగ మాత్రమే జరుగుచున్నది. ఉద్దేశపూర్వకముగ జరుగుట లేదు. లేదు. కావున సాక్షిశాల మనశాల కంటె భిన్నముకాదు. ఆశాలా నిర్మాణమునకు, మన Saloon మార్గదర్శిని యని చెప్పక తప్పదు. సాకి మనకు జన్మసోదరుడే కాక వ్యాపార సోదరుడు కూడను. ఆసంఘ ప్రధానవక్తయగు జంఘాలశాస్త్రిని మనసభ కధ్యక్షునిగా నియమించు కొనుట మిక్కిలి ప్రశస్తము. సభవారి పక్షమున నే నీయుపపాదన మొనర్చుచున్నాను. అంత సభలోఁ గరతాళధ్వనులు.

తరువాత నొక్కడు లేచి యుపపాదనమును బలపఱచెను. నేను గరతాళధ్వనులన డుమ నధ్యక్షపీఠ మెక్కితిని. ఒక్కడు వచ్చి నా మెడలోఁ బుష్చమాలిక వైచెను. మఱి యొకఁడు వచ్చి నాచేత నొక కార్యక్రమపత్ర ముంచెను. నేను వినమ్రుడ నైలేచి యిట్లంటిని.

సోదరులారా! పాలలో మీగడయెట్లో చిన్నవూదేనిలోఁబలుకులెట్లో యాంధ్రక్షురక మహామండలిలో మీరట్టి యుత్కృష్ణులైనవారు. ఇది వసంతర్తవగుటచే నొక్క మంగలిదర్శ నమగుటయే మహాదుర్లభమై యుండ, నిందఱ దర్శన మయాచితముగ నగుట యనర్హుడ నగు నాపుణ్యమే కాక యఖిలాంధ్ర దేశపుణ్యమని చెప్పిన నతిశయోక్తి కాదు. ఆంధ్రసారస్వత చరిత్రలో నీదినచర్య సువర్ణాక్షరములతో లిఖింపఁబడఁదగినది. ఈసభలో నెందఱో క్షురకవిద్వాంసు లుండ నెందఱో క్షురకోద్యోగులుండ, నెందఱో క్షురక కవు లుండ నెందఱో క్ క్షురవక్తలుండ, క్షురకుఁడనుగాని, నాకీగౌరవము లభించుబ యాంధ్రశారదా చరిత్రలో నద్వితీయమగు నంశముగనుండఁగలదు. అంబష్టజాతికంతకు నాయందుఁ గల యవ్యాజాభి మానమును బట్టి చూడగా నేను పూర్వజన్మమున మంగలినై యుందు నేమో యని యనుకొన వలసి వచ్చుచున్నది. (సభలో కరతాళధ్వనులు) లోకమున నకారణాభిమాన ములు సహేతుక ద్వేషముల పూర్వజన్మములందలి సంబంధమైషమ్య ములవలనఁ గలుగుచున్నవి. ఒకనిని జూడ నహేతుకమైన కూరిమి. ఇంకొకనిఁ జూడ నహేతుకమైన కోపము. పూర్వభవానుభవ జన్యములు గాని మఱియొకటి కాదు. ఇందునుగూర్చి పూర్వోపన్యాసములలో విపులముగాఁ జెప్పితిని. చర్విత చర్వణము తగదు. మీవృత్తిమర్యాదలఁ గూర్చియు మీవృత్తిలోని విశేషములఁ గూర్చియు గార్యక్రమ పత్రములోఁ బేర్కొనఁబడిన వక్తలు చెప్పదురు. అంతకు బూర్వ మాహ్వాన సంఘాధ్యక్షుని యుపన్యాసము జరుగవలసియున్నది. స్వామిరావుగారూ! మీరు దయచేసి యుపన్యాసపీఠ మలంకరింప వలయును. అంత నొక బుగ్గమీసాల పురుషుడు నలువదేండ్లవాఁడు రంగమెక్కి యిట్టుపలికెను.

అధ్యక్షశార్దూలమా! మంగలిసింగములారా! ఆతఁడు కొంతసేపు గొంతుక సవరించు కొనుటతోడను, గొంతసేపు దగ్గుతోడను గాలక్షేపము చేసి యాత్మగౌరవ ప్రకటనార్ధముగా నటునిటు చూచుచుండెను. అధ్యక్షశార్దూలమా! మంగలిసింగములారా! యని విచిత్ర సంబోధనచేసిన వ్యక్తి మిక్కిలి రోమకుఁడై యుండుటచేత వావదూకభల్లూకమా! యని పిలిపించుకొనఁదగి నట్టున్నాఁడు. తరువాత నాతం డిట్లు మాటలాడెను.

మనజాతి మూలపురుషులలో నొక్కడైన మహామహుడు బ్రాహ్మణోత్తములగు మహాపండితులచే, వేదాంతులచే సాష్ట్రాంగనమస్కారము లందినవాఁడు. ఆమహానుభావుఁడు మతబోధన మొనర్చుచు జేసిన పర్యటనమువలన భారతదేశమంతయుఁ బవిత్రమైనది. ప్రాగ్దేశములందే కాక, పాశ్చాత్యదేశములందుఁ గూడ నాతనిపేరు మ్రోంగుచున్నది. అట్టిభగవానుఁ డెవరో యెఱుఁగుదురా, ఎఱుఁగరు. ఎఱుఁగరు మనకర్మ మట్టున్నది. మన యజ్ఞత యట్టున్నది. మన మతాభిమాన మట్టున్నది. బుద్దభగవానుని ప్రక్కన గూరుచుండుటకు జ్ఞానతేజముచే నధికారమున్నవాఁడు మన మూలపురుషులలో నొక్కడు, వింటిరా. అట్టు తెల్లబోయి చూచెదరేల, నే నసత్యమాడుచున్నానా? నే నసత్యమాడినను జరిత్ర లసత్యమాడునా? శాసనము లసత్యములాడునా? ఈశాసనములు, ఈచరిత్రములు తరువాతి వగుటచేత సత్యదూరములు కావచ్చునేమో? పోనీ-బుద్ధభగవాను నడుగుడు. జయాబుద్ద దేవా! అని నమస్కరించి యడుగుడు. ఏమనుచున్నాడు? వినుడు! కర్దములు పవిత్రముల గునట్లు వినుడు. అదిగో! అదిగో! దివ్యధ్వని వినబడుచున్నది. అవతారపురుషు డగుట తక్క ఉపలివర్మగారు నాతో సమానులని యనుచున్నారే. ఆమహాత్ముని పేరేది? (ఉపలి ఉపలి అని సభలోఁ గేకలు.) మహాపండితు లగు, మహాకస్యప మక్కళాచార్యాది మహనీయుల కంటె ముందుగా బుద్దదేవప్రసాదితమగు శాటిని బరిగ్రహించిన వాడెవడు? (సభలో ఉపలి అని కేకలు.) సర్వతోముఖ పండితులగు బ్రాహ్మణులకు సైతము నిరాకరింపఁబడిన సన్మాన మీమహానుభావున కయాచితముగ లభించినది. కళింగదేశమునం దంతను బుద్దబోధసుధను వర్షించి జ్ఞానాంకురములు గలిగించిన గురుసార్వభౌముఁడెవడు? (ఉపలి యని సభలోఁ గేకలు.) అట్టి యాదిపురుషుని పేరు మనపిల్లలకుఁ గాని, మన పిల్లల పిల్లలకుగాని పెట్టుకొం టిమా? లేదులేదు. (సిగ్గుసిగ్గు అని సభలో గేకలు) పోనీ ఇన్ని క్షురకశాల లున్నవికదా. ఉపలిమంగళాయతన మనికాని, ఉపలిదేవాలయ మనికాని దేనికైనం బేరుంచితిమా? (సిగ్గు సిగ్గు అని సభలో గేకలు) నాతనువును బుద్ద మతసంబంధమైన పరిశోధనకార్యమందు బవిత్రమొనర్చు కొనుచున్నాను. నేను మీకు బుద్దమతమును నాల్గుముక్కలలో బోధింతును. మీరు మీశాలలకు వచ్చువారికందఱకు క్షురకర్మ కాలమందు బుద్దమతమును బోధించుచుం డవలయును. అందువలన మీరు తరింతురు. మీపాదముల యొద్దకు వచ్చి మీ సమయమును కనిపట్టి మీవలనఁ గృతార్థులగుచున్న మీయాశ్రితు లందఱు తరింతురు.

ఇది కాక పూర్వమహాప్రభువులయాస్థానములలో బ్రభుశిఖామణికి మంగలి యొక్కడు కొంచెము హెచ్చుతగ్గుగా వేడుక చెలికాని వంటివాఁ డుండెడువాఁడు. ఆతనికి నియమితమైన కొలు వేదియు లేదు. ఆతడు రాత్రియెనిమిది గంటలకు మహాప్రభువునొద్దకుఁ బోయి యాతని మంచమునొద్ద విలాసముగాఁ గూరుచుండి వేడుకకై యొక్కసారి యాయన కాళులపై జేయివైచి యూరిలోనివింత లన్నియుఁ జెప్పచుండె డివాఁడు. ఇట్టి మంగలి మహానుభావులెందరితో మహాప్రభువులచేతఁ బ్రజలకు నీనాములిప్పిం చినారు. ఉద్యోగము లిప్పించినారు. బహుమానము లిప్పించినారు. మహాస్థానములలోనున్న యినాములన్నియు నిట్టు పుట్టినవే. మన ముత్తాతల ముత్తాత లిట్టు లెన్నివేల కుటుంబములకో యుపకృతు లొనర్చినారు. అట్టిగౌరవము మన కిప్ప డున్నదా? లేదు. అట్టి మహాప్రభువు లిప్పడున్నారా? లేరు.

మనజాతి పుట్టుకను గూర్చి యనేకములగు పాఠభేదము లున్నవి. ఈపాఠభేదము లన్నియుఁ బరిశీలించి నా విమర్శనశక్తి నంతయు ధారపోయగా తుదకు నాకేమి తోఁచిన దనగా మంగళ్లు కత్తిచే జీవించువారగుట చేతను, క్షత్రియులు కత్తితో జీవించువా రగుటచేతను, వీరు వారుకూడ బౌరుషవంతు లగుటచేతను బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులన్న వర్ణవిభాగము సరియైనది కా దనియు, బ్రహ్మాక్షురకవైద్యశూద్రులుననది సరియయిన దనియు మంగలిమహాజాతిలో క్షత్రియజాతి యంతర్లాపి యనియు నేను స్థిరపఱచినాను.

తన్ను తన్ను మని సభలో గొందఱు రాజులు లేచిరి. రాజులీసభ కేల వచ్చియుండ రనంగా నాదినమునఁ బశువుల సంతలోఁ బశువులఁ గొనుటకై వచ్చి జెండాల బండారము జూచి యిది యేమోయని యిక్కడకు వేడుకకై వచ్చియుండిరి. అంత సభలోఁగొంత యల్లరియైనది. నేను లేచి కత్రియులను బతిమాలుకొని శాంతిపఱచితిని. కత్రియులు కొందఱు, బ్రాహ్మణులు కొందఱు సభనుండి లేచిపోయిరి. ఇట్లు పోయిన బ్రాహ్మణులకుఁ గాని, వారి బంధువులకుఁ గాని క్షౌరము చేయకుండుటకు మంగళ్లు రహస్యముగ నేర్పాటుచే సికొన్నట్టు వారి గుసగుసలవలన నాకుఁ దోఁచినది. వక్త తిరుగ నిట్లు చెప్పసాగెను.

కవులకుఁ దిట్లు తప్పవు. పరిశోధకుల కంతకంటె తప్పవు. భూమి తిరుగుట లేదన్నవాఁడు భూమిపై నున్నాఁడు. అది తిరుగ నని చెప్పినవాఁ డంతక్షపురియం దున్నాఁడు. నాపరిశోధన సత్యమును గ్రహించుటకుఁ బ్రజ లింకఁ దగిన జ్ఞానముతో లేరు అయినను నీపట్టణసంబంధమగు నొక్క పరిశోధనము చెప్పి విరమింతును.

అంతట నేను లేచి యిట్లంటిని. 'అయ్యా! నీపరిశోధనమున నీ కొక్కనికే ప్రాణము మీఁదికి వచ్చునెడల నెట్టయిన సహింపవచ్చును. అందువలన నాకు, నీపరిషత్తునకుఁ గూడ ప్రాణము మీఁదికి వచ్చునప్పడు సహింపదగదు. చావునకు నీవలె నందఱు తెగించి యున్నారని యనుకొనఁదగ" దని బలుకఁగ నాతం డిట్టనియెను.

తొందర లేదు. ఈవిమర్శన యంతయపాయకరము కాదు. ఏలయ్యయను పేరుగల యొకమంగలి తల్లిదండ్రులతో రామేశ్వరమునకు పోవుచుండఁగాఁ బురుహూతికా పీఠసమీప మున నాతని తలిదండ్రులిద్దఱు మరణించిరి. వారిపై నొక్క నదిని భగీరథునివలె (భగీ రథుడు మంగలి కాదుగదా యని సభలో గేక) ఆసంగతి వలదు-ప్రవహింపఁజేయ నెంచి పీఠమునొద్దు గూరుచుండి తపస్సుచేసి గంగను దెప్పించెను. ఏలయ్య తపస్సువలన వచ్చిన గంగ కావున నేలేరని దానికిఁ బేరు కలిగెను. అంతట నాతం డేలేశ్వర మను నొకగ్రామమును స్థాపించి రామేశ్వరము నకుఁ బోవుదారిలోఁ గృష్ణానదీసమీపమునఁ దపస్సు చేసికొను చుండఁగా “నీ విచ్చట నుండవలయు నని" స్వప్నమున నొకదేవత చెప్పిన ట్లయ్యెను. అప్పడాతం డేలూరు స్థాపించి యిక్కడనే పరమపదించెను. ఏలూరిలోఁ బుట్టిన మంగళ్లుమాతమే యేలయ్య సంబంధమువలనఁ బరిశుద్దులైన మంగళ్లు. నిజమైన మంగ భేలూరివారే. బెజవాడ మంగళ్లని, రాజమండ్రి మంగళ్లని పెద్దపేరేకాని వారి జన్మములలోఁ గొంతకలితి కక్కుఱితి కల వని నేను దృఢముగా.

'నీ సిగగొఱుగ! నీగొంతుగోయ! మేము సంకరజాతివారమా! చూచెదరేమి' యని రౌద్రాకారులై పదిమంది మంగళ్లుపన్యాస రంగమునొద్దకు వచ్చిరి. నేను వారిని శాంతిపఱచి 'నీవు కూరుచుండుము. ఇంక మాటలాడవల"దని యావక్తను శాసించితిని.

తరువాత నొక్కడు పీఠ మెక్కి యిట్టనియెను. సోదరులారా! మనవృత్తి విశేషములు నేను గొన్ని చెప్పదును. వక్తను గాని హేతువుచే నుపన్యాసమును వ్రాసికొని వచ్చితిని. శిశువు గలిగినప్పడు బొడ్డుకోయుటకు మనకత్తి యవసరము. ఉపనయన సమయమున మనకత్తి యవసరము. మంగళసూత్ర ధారణ సమయమున మనకత్తి యవసరము. నిత్యకృత్యములందు మనకత్తి యవసరము. మగవాడు చచ్చినప్పడాతని భార్యశిరోజములను దీయువేళ మనకత్తి యవసరము. అట్టియాచారము లేనిచోటనైనను మంగళసూత్రము ద్రౌంపువేళ మనకత్తి యవసరము. పుట్టినది మొదలు చచ్చినపర్యంతము మంగలితోఁ బనియున్నది. పరిపాటిగల దలగొరిగించుకొను వితంతువులనొద్ద మంగలి యెంతదగ్గఱగాఁ గూర్చుండునో యెఱు గమా? సర్వస్త్రీలయందు మాతృభావము మన పవిత్రమైన వృత్తియే మనకు నేర్పుచున్నది. ఇంత పుణ్యవంతమైన వృత్తి మాత్రము ప్రపంచమున నింకొకటి లేదు. వీరాధివీరులగు రాజాధిరాజులను గూడ మంగలి తనముందు గదలకుండ మెదలకుండ గూరుచుండఁ బెట్టు కొనునే, జట్టు చేతఁ బట్టి కొనినను వారు నోరెత్తుటకు వీలులేదే! ఓహో ఎంత మతగౌరవ ప్రపత్తులుగల వృత్తియో చెప్పవలయునా? ఈవృత్తి ఘనత పూజ్యత చెప్పటుకు నాల్కకు శక్తి చాలదు. తలఁచుటకు మనస్సునకు శక్తిచాలదు.

మనకు వృత్తి క్షౌరవముకాని గానముకాదు. సన్నాయిపాటు బలిజీలు దూదేకులసాహే బులు మొదలగువారు నేర్చుకొనుచున్నారు. గానము క్రౌరమునకు రవంత సహాయకార్య ముగ మనలోగొంద ఆంగీకరించినారు. “మనపూర్వపుఁగొయ్యపిడి చేంతకత్తులకాల మునాఁటి శౌరపుసాగ సీనాఁడు లేదు. ఈనాడు కత్తిగుల్లయె పనికూడ నట్లే గుల్లసొగసు నునుపు, డాబేకాని పనివానితనపు పనందు లేదు. గుల్లకత్తితోఁ గూటివచ్చునా? చేఁతకత్తి కది చెప్పిన నుగుణము. ఈచేత కత్తితోఁ జేసిన గడ్డము ప్రబంధకవిత్వమువలెఁ బ్రశస్తగాన మువలెఁ బ్రజ్ఞాప్రకటకమై ప్రకాశించును. చిత్ర లేఖనమువలె, గానమువలె క్షురకర్మ యొక కళయే గాని శాస్త్రము కాదు. కవి యెట్టు పుట్టవలయునో, క్షురకు డట్లే పుట్టవలయును.

ఆ. చేత కత్తి మహిమ జింతించి చెప్పంగ
బమ్మతరమె వాని బాబుతరమె?

యని మంగలి సుబ్బరామ కవి చెప్పిన నావేశపూర్ణములగు వాక్యములు వేదవాక్యముల కంటే వేరుకావు.

క్షురకవృత్తిలోని రహస్యములఁ గొన్ని మనవి చేసెదను. ఒకగడ్డమును క్షౌరముచే యుట కొక్క డొక గంట తీసికొనును. ఒక్కడైదు నిముసములలో మూండు గడ్డములుచే యును. ఆహ్వాన సంఘాధ్యక్షుని మేనమామగారు గానుగయె ద్దోకచుట్టు తిరిగివచ్చులోపల నొకగడ్డమును బూర్తిచేసెడువాఁడు. వేగముగాఁ జేయువాఁడు నిమ్మళముగఁ జేయలేఁడు. నిమ్మళముగఁ జేయువాఁడు వేగముగఁ జేయలేఁడు. సారస్వతమందు మాత్రము? గొలుసుక ట్టుగ వ్రాయువాఁడు విడి యక్షరములు వ్రాయలేఁడు. విడియక్షరములు వ్రాయువాఁడు గొలుసుకట్టుగ వ్రాయలేఁడు. మెత్తని పదనుకత్తితోఁ జేయువాడు గరసుపదను కత్తితో జేయలేఁడు. గరసు పదనుకత్తితో జేయువాడు మెత్తనిపదను కత్తితోఁ జేయలేఁడు. సారస్వత మందు మాత్రము? సన్నకలముతో వ్రాయువాఁడు ముదుక కలముతో వ్రాయలేఁడు. ముదుక కలముతో వ్రాయువాఁడు సన్నకలముతో వ్రాయలేఁడు. ఎడమచేతి వాటము కలవాఁడు క్రౌరము కుడిదౌడ నారంభింపలేడు. కుడిచేతి వాటముగలవాఁ డెడమదౌడను బని యారంభింపలేఁడు. సారస్వతమందు మాత్రము? బాగుగా మాటలాడఁగలవాఁడు బాగుగా వ్రాయలేఁడు. బాగుగా వ్రాయగలవాఁడు బాగుగా మాటలాడలేఁడు. చర్మము చిట్టకుండ కూటితీయగలవాఁడు మిగులజాణ. అట్లుచేసియు 'కూటి కాయలు మొలవ నీయకుండ జేసినంవాడు మఱింతజాణ. సారస్వతమునందు మాత్రము శబ్దాలంకారముల కొఱకు దేవులాఁడువాఁడు రసపుష్టికలుగఁ జేయలేఁడు. రసపుష్టికిఁ జూచువాఁడు పద్యము కుంటగంజెప్పును. ఈలోపములదీర్చు వానికి గ్రంథచౌర్యము తప్పదు. ఇట్టిలోపములు సారస్వతమం దెట్లో క్రౌరమునం దట్టే. ఈలోపములను సాధ్యమైనంత వఱకు రానీయకుండ సవ్యసాచులై సంపూర్ణులై మీరు ప్రకాశింపవలయునని నాప్రార్ధన. అన్ని లోపములగూడ సాధ్యమైనంత వఱకుఁ జేఁతకత్తి తీర్పఁగల దనివాదృఢ విశ్వాసము. ఈచేతకత్తితోనే జగపతులు, గజపతులు కాలక్షేపము చేయించు కొనిపైలోకమునకు వెడలిపోయినారు. నిద్రవచ్చు నట్టు శౌరము చేయఁగలకత్తి చేత కత్తి, నూరాలులు, వేయాఱులు, నగ్రహారములు సంపాదించినదీచేతకత్తియే. ఒకసారి మాకుటుంబములో జరిగిన చిత్రమును జెప్పెదను. మా పూర్వులలో నొకండు పెద్దాపుర పుజగపతులలో నొకరికి క్రౌరము చేయుచుండెను. చేయుచుండగా కత్తికొయ్యపిడి వదలయినది. పిడి బిగించుటకై యాతండు టక్కుటక్కున ప్రభునినెత్తిపైఁ గొప్టెను. అంతట జొటజొట కన్నీళ్లు లాప్రభువునకు వచ్చినవి. కాని గోనేడవారు, పోలవరపువారు కుదుర్పలేక పోవుటచేత చిరకాలమునుండి బాధించుచున్న పోలవరపువారు కుదుర్పలేక పోవుటచేత చిరకాలమునుండి బాధించుచున్న పార్శ్వపునొప్పి మందల పిడిపోటుచే నెగిరిపోయినది. అనతి కందుకై యగ్రహార మొసంగబడినది. అప్పటి నుండియుఁ బార్శ్వపునొప్పియున్నవారు శిరోవాతమున్నవారు నాతనియొద్ద నట్టు నెత్తిపై బిడి బిగింపించుకొను చుండెడివారు. చేతకత్తితో గీఁకిన తలకుఁ గలుగు చలువు యావునేతితో గలుగదు. ఆముదముతోఁ గలుగదు. వేదాంత సంబంధమైన విశేషమొక్కటి కలదు. బ్రహ్మరంధ్రమున నుండి యమృతబిందు వంగిటలోనికి మహాపుణ్యాత్మునికి మోక్షకాల మునందుఁ బడునఁటు. అట్టిబిందువు మలకింత శీఘ్రమగు స్థానమునుండి జార్చి యంగిటఁ బడజేయుటకుఁ జేఁతకత్తి పిడిపోటు యోగశాస్త్రసాధనము లన్నిఁటికంటె సర్వోత్తమ మని యామహా పురుషుడానతి చ్చెడివాఁ డని వాడుక. అందుకొఱకు అనగ మోక్షమును సంపా దించుటకొఱ కొకడు ప్రయత్నించునట్టును మన పూర్వుని పిడిబొకాయింపుచేత నమ్బత బిందువు నోటిలోఁ బడఁగ వెంటనే యతడు మోక్షము పొందినట్టును వింతయైనకథ యున్నది. పామరులగు జనులేదో కొంత యల్లరిచేసినట్టు కూడ జనవాక్య ముండెను. “అందఱు నా చేతఁ జావనే చచ్చినారు. నీవు చంపున దేమిటి నీమొగము. నిమిత్తమాత్రుడుగ నుండవోయి బుద్దిహీనుఁడా" యని నరునకు నారాయణుండు చెప్పిన భగవద్గీతానీతినే మనపూర్వుఁడు జ్ఞానహీను లగునప్పటి ప్రజలకు బోధించినాడఁట. అందుచేతనే నాతని కపరకృష్ణుఁ డని పేరు వచ్చెనట. జ్ఞానబోధమున నాతని యంత వాఁడు లేఁడు. మోక్షసాధనములలోఁ జేఁతకత్తి యంత సుఖమైనది లేదు.

భారతదేశమున బ్రజలుచేయు ప్రత్యాచారమునకును వేదాంతార్థ మున్నది కాని లేకపోలేదు. ఏపనికాని శరీరపోషణాదివృత్తులతో నెన్నఁడును మనము చేయుము. స్నానము దేహ పరిశుద్దికిఁ గాదు. మనఃపరిశుద్దితోఁ గర్మ మొనర్చుటకు భోజనము ప్రాపంచిక కార్యము లొనర్చుట కైన దేహదార్ద్యమునకుఁ గాదు. యోగాది సాధనములు చేసి మోక్ష మందుటకు. అటులే క్షుర కర్మమునకు గూడ వేదాంతార్ధముండక తప్పదు. అది యేదియో యోచిం తము. తలయే శరీరమందలి ముఖ్యభాగము. ఎందుచేత? మనస్సునకు స్థానమగుటచేత. మనస్పులోనే సర్వపాపము లుదయించి బయలు వెడలును. ఆ పాపములే వెండ్రుకల రూపమున తలనుండి వచ్చుచున్నవి. కురకర్మ మనఁగ పాపవిచ్చేద మన్నమాట. అందుచేత మతమే సమస్తమయిన భారతదేశ మునమట్టుకు మతగురుండు మంగలి యని చెప్పనెడల సత్యమునకు దూరమై యుండదు. మోక్ష ప్రదాతలలో మంగలికూడ నొకడు.

మమ్ముఁ బరాభవించుటకే పిల్చినారా, మేము సంకరకులము వారమా? ఏలూరివారు పరిశుద్దులా అని పెద్దకేకలు పాక వెలుపల వినఁబడుచున్నవి. అందుపై దళ్ల వెదురుకట్ట లూడఁదీసి చూచెదరేమి తన్ను, కొట్టుమని యెందఱో కేకలువేసిరి. ఒక్క నిముసములో బాకలోని వారందఱుఁ బైకి పోయినారు. పాకలోనుండి యంతకు ముందెప్పడో కాని చల్లగ జాఱి వావదూకభల్లూకముగారు పాకవెలుపల నుపన్యాస మారంభించినాఁడు “నా పరిశోధ నలు తప్పలా? వేదపురుషులందఱు మంగళ్లని నిదర్శనములు చూపించెదను." అని యాతడు వెఱ్ఱి కేకలు వైచుచున్నాఁడు. ఇంతలో రక్షకభటులు వచ్చిరి. అల్లరికి కారణమైన వారు దొరకక పోవుటచేత నేమియు నెఱుఁగని నలుగురు బడిపిల్లలను, నాదారినప్పడు చెంబుతో ముష్టికిఁ బోవుచున్న బలిజ వితంతువును బట్టుకొని కొట్టులోఁ బెట్టిరి. ఉపసంహా రోపన్యాసమున నంతయుఁ జెప్పవలయునని ప్రారంభోపన్యాసమును నాల్గుముక్కలలోఁ గడతేర్చితిని. అవకాశములేక యుపసంహారోపన్యాసమును మానితిని. సభ తుద కిట్లయ్యె.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః