సాక్షి మూడవ సంపుటం/సుఖప్రారభ్ధము

వికీసోర్స్ నుండి

18. సుఖప్రారభ్ధము

జంఘాలశాస్త్రి ఈ ప్రపంచం తీరు గురించి వివరిస్తూ-ప్రతి జీవికి కష్ట ప్రారబ్ధం ఎలాంటిదో, సుఖ ప్రారబ్ధం కూడా అలాంటిదేనని వివరిస్తున్నాడు. అంటే, కష్టాన్ని తప్పించుకోలేనట్టే. నీవు నిర్ణయించివున్న సుఖాన్ని కూడా తప్పించుకోలేవురా! అని చెప్పడం.

భగవంతుడి తత్త్వాన్ని గురించి ఏమీ చెప్పకుండా మౌనంగా వూరు కున్న బుద్దుడు సైతం మన కర్మాన్ని అనుసరించే ఉత్తర జన్మఫలం వుంటుందని స్పష్టంగా చెప్పాడు.

మన సంపదలకీ మన ఆపదలకీ, మన జన్మలకీ, మన మోక్షానికీ-ఇదీ అదీ అని లేదు. మనతో సంబంధించిన అన్నింటికీ కూడా కర్తలం మనమే. తిట్టుకో దలుచుకుంటే మనల్ని మనమే తిట్టుకోవాలి. కొట్టుకో దలుచు కుంటే మనల్ని మనమే కొట్టుకోవాలి. కోసుకోదల్చుకుంటే మనల్ని మనమే కోసుకోవాలి. ఇతరుల్ని పల్లెత్తు మాటకూడా అనకూడదు. పరిపాలకుల కేమి, ఈశ్వరుడికేమి, మనకర్మతో సబంధం లేదు. మన కర్మల్ని అనుసరించి ఈశ్వరుడు ఆయా కర్మఫలాన్ని పంచిపెడతాడు. కష్టకాలాన్ని కానీ సుఖ కాలాన్నికాని రవ్వంత కూడా పెంచడం సాధ్యం కాదు. మనమే ఒక ప్రపంచం. మనకు మనమే ఈశ్వరులం.

ఇందుకు ఉదాహరణగా, ఒక విరాగి జనక చక్రవర్తిని కలుసుకున్నప్పటి ఉదంతాన్ని జంఘాలశాస్త్రి విపులంగా కథనం చేశాడు. సుఖప్రారబ్దం అనేది, అడవులబట్టి పోయినా వెంటబడి వస్తుందని నిరూపించాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

నాయనలారా! ప్రపంచజీవులలో నాకారములందు భేదమున్నది. ఆయుఃపరిమితు లందు భేదమున్నది. గుణగణములందు భేదమున్నది. బుద్దిజాతులందు భేదమున్నది. భాగ్యవైఖరులందు భేదమున్నది. అభ్యాసరీతులయందు భేదమున్నది. కాని కష్టసుఖానుభవ ములందు భేదము లేదు. ఎవనివంతు వచ్చినప్పడు వాఁడు కష్ట మనుభవింపవలసినదే. సుఖముకూడ నట్లే యనుభవింపవలసినదే. నాకుఁ గష్ట మక్కఱలేదని నిరాకరించిన నదిపోదు. అనువాఁడు లేఁడుకాని నాకు సుఖ మక్కఱలేదని త్రోచివైచిన నదియు బోదు. కష్టప్రారబ్ద మెట్టిదో ప్రతిజీవునకు సుఖప్రారబ్ద మట్టిదే. ఇప్ప డీసుఖప్రారబ్దమును గూర్చియే నాల్గుమాటలు చెప్పెదను.

సాదీయను మహాకవి యొకకథను జెప్పినాఁడు. కథయన యసత్య మనుకొనకుడు సత్యగాథనే చెప్పెను. ఒకయూర నొకదుండగీ డుండువాఁడట. ఆతడు స్వభావదుష్టత చేత, ధనమదాంధత చేతఁ బడుచుదనపు బొగరుచేత, ద్రాగుడు మహిమచేత, ధనమదాంధతచేతం, బడుచుదనపు బొగరుచేత, ద్రాగుడుమహిమచేత, నెన్నితుచ్చపుబనులో చేయు చుండెడివాఁడు. ఆతని దుశ్చేష్ట లసంఖ్యాకములు. ఒకనాఁ డొకసన్యాసి వీథిలోఁ బోవు చుండంగా నీదుండగీడాతని కెదురుగబోయి పెద్దఱాయి తీసికొని తలపై గురిచూచినైచెను. అది యదృచ్చికముగఁ దలపై బడక భుజముపైబడెను. సన్యాసి యేమిచేయ గలఁడు. తలవంచుకొని తన దారిని తాను పోయినాఁడు. మఱికొన్ని మాసములు కీతని దుర్నయములు మఱింత దుర్బరములు దుస్సహములుకాగా మహారాజాతని బట్టించి పెద్దబావిలోఁ బడవేయించెను. ఈ సంగతి యా సన్యాసికిఁ దెలిసి యొక పెద్దఱాయి చేతిలోఁ బట్టుకొని యానూతి యొద్దకుఁ బఱుగెత్తి యాఱాతి నాతనిపై బడవైచెను. 'ఇట్లు చేసితివేమి' యని యచ్చటివారు నన్యాసి నడుగ 'ఈ ఱాతితో నన్నాతఁడు కొన్ని మాసముల క్రిందట కొట్టినాఁడు. దీని నప్పటినుండియు భద్రపఱచి యిప్పడు తిరుగఁగొట్టితి"నని యాతండు ప్రత్యుత్తరమిచ్చెను. “నిన్ను గొట్టినప్పడే యా జూతితో తిరుగఁ గొట్టలేకపోయితివా" యని ప్రజలడుగ “నాతని కింక సుఖ మనుభవింపవలసిన దినము లుండగ నెవడేమి చేసిన వినియోగమేమి? అదిగాక యేమిచేయుటకు శక్తిగలవాఁడెవడు? ఇప్పటి కాతని సుఖప్రారబ్దము తీరినది. అందుకొఱ కాతని జాతితోఁగొట్టుచు "నాయనా! నన్నీఱాతితోఁ గొట్టితివి. తిరిగి నిన్నుగొట్టక తప్పక పోవుటచేతఁ గొట్టుచున్నాను. నీదుర్మా ర్గజీవనమునకుఁ బశ్చాత్తాప మొందఁదగిన యుత్కృష్ణ సమయము సిద్దించినది. పూర్వపాప మునకు వగచి భగవంతుని ప్రార్డించుకొనుము" అని చెప్పియే యాతని గొట్టితిని. నామాటలు మీకు వినబడలేదు కాబోలు నని సన్యాసి చెప్పెను.

ఇందువలన జనుడు తన పూర్వకర్మము ననుసరించి తనవంతునకు వచ్చిన సుఖము లేశమైన మిగులకుండ నింట ననుభవింపక తప్పదు. అట్టి యనుభవమున కడ్డురాఁగలుగవాఁ డెవ్వఁడును లేఁడు.

సుఖముకాని కష్టముకాని యెప్పడేది యేరీతిగా ననుభవించినను మనకర్మము యొక్క ఫలమునే మన మనుభవించు చున్నాము. కాని మన కెవ్వఁడుగూడ నిచ్చుటలేదని స్పష్టముగాఁదెలిసి కొనవలెను. అట్టిచ్చుట కెవ్వఁడును గూడ స్వతంత్రుఁడుగాడు. నీమట్టునకు నీవే స్వతంత్రుఁడవు. నీబుద్దికి నీశరీరమును జోడుపఱచి చేతులార, మనసార స్వతంత్రుఁడవై కర్మమును జేయుచున్నావు. ఫలకాలమందు దానిఫల మనుభవించు చున్నావు. భగవత్తత్త్వమునుగూర్చి మూకీభావమును వహించిన బుద్దుఁడు సయితము మనతోఁ గూడ వచ్చునది మనకర్మ మొక్కటి తక్కవేరు లేదనియు, మనకర్మము నమసరించియే యుత్తరజన్మఫల ముండుననియు విస్పష్టముగాఁ జెప్పినాఁడు.

గీ. ఎంతో నమ్మించి నీలో వసించునట్టు
లున్న ప్రాణమె నినుబాసి యుఱుకునపుడు

నీది యని చెప్పఁదగు వస్తువేది యిచట?
యపుడు నీవెంటవచ్చెడు నద్ది యేది?

ఏవియును గూడ రావన్ని యిచట నిలుచు
సుతలు మనుమలు బందుగుల్ సుతులు సతులు
తోడబుట్టువుల్ హితులు నీతోడరారు
ధనమురా దొక మొలత్రాడయినను రాదు.

వాజ్మనఃకాయముల దేనివలన నైన
నీవుచేసిన కర్మమే నీదిసుమ్ము
ఇదియె వదలక నిన్వెంబడించునద్ది
నీది యనఁదగినది మeజీయేది లేదు.

నీడలాగునఁ గర్మంబు నిన్ను విడువ
దెపుడు దుష్కృతు లుపసంహరింపబడవు
ధర్మ కార్యంబు లెపుడు వ్యర్ధములు కావు
భావిఫలసముచ్చయ దానవైభవము లగును.

మన సంపదలకే కాదు. మన యాపదలకే కాదు; మన జన్మములకే కాదు; మన మోక్షమునకే కాదు; మనతో సంబంధించిన యన్నిటికిఁ గూడ మనమే కర్తలము. కాని సుఖ మనుభవించునప్పడు మన ప్రయోజకత్వమని యహంకరించి కష్టములు వచ్చినప్పడు మాత్రము పైవారి నుత్తరవాదులుగాఁ జేయుచున్నాము. తిట్టించుటకు, నెట్టించుటకుఁ, గట్టించుటకు, బ్రభువులు చాలియున్న కారణముచేత వారు తమ కపకృతిజేసినారని నిష్కారణముగా వారిని జనులు నిందించుచుందురు. ఇది యత్యంతపాప హేతువని నిశ్చయముగా నమ్మవలయును. నీ కర్మముతోఁ బ్రభువుల కేమిసంబంధము? ప్రభువుల కర్మముతో నీ కేమైన సంబంధమున్నదని నీవు చెప్పఁగలవా? వారి విషయమున నీకు సంబంధము లేనట్టే నీ విషయమున వారికిఁగూడ లేదను జ్ఞానము నీ కుండనక్కఱలేదా?

భారతదేశ దాస్యమునుగూర్చి పరిపాలకులను బరిపరివిధములుగా నిరసించుట కలదు. భారతదేశ ప్రారబ్దమునకుఁ బాశ్చాత్యదేశ ప్రారబ్దమునకు నేమి సంబంధము? తండ్రికర్మమునకుఁ గొడుకుకర్మమునకు సంబంధము లేనప్ప డనాత్మతత్త్వమునకు నధ్యాత్మతత్త్వమున నేమిసంబంధము? వారిప్పడు సుఖప్రారబ్దమున నున్నారు. మనము కష్టప్రారబ్దమున నున్నాము అంతే! అంతకాక మరి యేమున్నది. మన వేదములను వదలుకొని, మన వర్ణాశ్రమధర్మములను వదలుకొని, మన మతమును వదలుకొని, మన యాచారములను వదలుకొని, మన విద్యలను వదలుకొని, మన స్వాతంత్ర్యములను వదలుకొని, మనజాతితత్త్వ మును గూడ వదలుకొని, యేకాలమందుఁగూడ నేదేశమందుఁగూడ నేజాతికూడ జేయని చేయలేని మహాఘోరకర్మమును జేసినందులకు ఫలమిప్ప డనుభవించు చున్నాము. కన్నులు దెఆచి బుద్దిపూర్వకముగ, సంతోష పూర్వకముగ జుట్టుచేతి కిచ్చిన మనము స్వతంత్రత కావలయునని యిప్పడు గించుకొన్న వినియోగమేమి? ఒక్క స్వతంత్రతమాత్ర మెన్నడయిన వచ్చునా? మనము బుద్దిహీనతచే వదలుకొన్న వేదాదులన్నియు వచ్చినప్పడే స్వతంత్రత వచ్చును. కావున వేదపఠనము మొదలుగా చేయవలసిన కర్మములన్నియు భారతదేశము తిరుగ ననుష్టించునెడల సర్వసౌభాగ్యములు సిద్దింపఁగలవు. భారతదేశ మిప్పడు చేయవలసినకర్మ మిదియే. రాట్నపు సుతితో వేదగాన మొనర్చుటకంటె వేరుసాధనము లేదు. కాని యది నిశ్చలముగ నిర్మలమనస్కతతోఁ జేయఁదగినది. అంతేకాని స్వాతంత్ర్యము కలిగిన పిమ్మట తిరిగి చల్లచల్లగా వదలు కొనునేర్పాటు మీద వేదాదుల సాహాయ్య మపేక్షింప తగదు. మనకుఁ బరిపాలకులు చేసిన యపకృతి లేదనియు మనము మనదేశమునకు, మతమునకు చేసిన యపకృతి ఫల మనుభవించు చున్నా మనియు నమ్మవల యును. తిట్టుకోఁదలఁచుకొన్న యెడల నిన్ను నీవు తిట్టుకో. కొట్టుకో దలంచినయెడల నిన్ను నీవుకొట్టుకో. కోసికోదలఁచిన యెడల నిన్ను నీవు కోసికో. అంతేకాని పరులగూర్చి పల్లెత్తుపలుకైన పలుకఁదగదు. పరిపాలకుల లెక్కయేమి? మనకర్మముతో నీశ్వరునకే సంబంధము లేదు. ఏమియు సంబంధము లేదాయని యడుగు చున్నారా? లేనట్టున్నది. ఉండుటకంటె లేకుండుటయే మెరుగన్నట్లున్నది. మనకర్మముల ననుసరించి మనకీ శ్వరుడు తత్కర్మఫలమును బంచిపెట్టును. ఇంతకంటె నాతని ప్రయోజకత్వ మేమియు లేదు. ఆతఁ డందువలన మోతకూలి కాని దాతకాడు. ఆ వెట్టిపనికే జను లాతని దిట్టుచు న్నారు. సుఖానుభవకాలము రవంత పెంచుటకుఁగాని కష్టానుభవకాలము కాసంత త్రెంచుటకుఁగాని యీశ్వరునికి శక్తిలేదు. మనమే యొక ప్రపంచము. మనకు మనమే యీశ్వరులము.

దేవతలు హిరణ్యకశిపుబాధ పడలేక, నెత్తినోరు కొట్టుకొనుచు రోదసీకుహర మదర వలవల నేడ్చుచుఁ బ్రతిక్రియ చేయలేక పరుగు పరగున శ్రీమహావిష్ణువు సన్నిధికిఁజేరి యసురసంహార మొనర్పుమని ప్రార్డింపలేదా? ఆమహానుభావుఁ డేమనినాండు? మాఱుమా టాడక యిండ్లకుఁ బొమ్మనినాడు. ఎందుచేత? ఎందుచేతనో వినుడు.

శా, వేధోద త్తవరప్రసాదమహిమన్ వీఁ డింతవాఁడై మిమున్
బాధం బెట్టుచు నున్నవాఁడని మదిం భావింతు భావించి నే
సాధింపం దeటికాదు కావున గడున్ సైరించితిన్ మీఁదటన్
సాధింతున్ సురలార! యింక చనుఁడీ శంకింప మీ కేటకిన్.

అనియే కాదా భగవంతుఁడానతిచ్చినాఁడు. 'సాధింపందరికాదు కావున" నని కారణ మగపఱచినారు. అనంగా నేమి? దేవతల కష్టానుభవ కాలములో రవంతయైన దగ్గించుట కవకాశముకాని, శక్తికాని తనకు లేని కారణమున-నసురుని సుఖానుభవకాల మింకఁ గొంత జరుగవలసి యున్నది కావున దానిని దగ్గించుట కవకాశముకాని, శక్తికాని లేని కారణమునను దేవతలకు సైరణ బోధించి నివాసములకుఁ బొమ్మనినాఁడు. కావునఁ బ్రభువులకు మన కష్టసుఖములపై నధికారములేదు. భగవంతునికిఁగూడ లేదు. పోనిండు. మనకష్టములపై మనకైన నధికారమున్నదా? లేదు. ఏడ్చుచుఁ గష్టము పూర్తిగ ననుభవింపవలసినదే. ఏడ్పువంటినవ్వుతో సుఖముకూడ నట్లేయనుభవింపవలసినదే! కష్టములను మనము తగ్గించు కొనలేము పోనిండు. సుఖములను తగ్గించు కొనలే కేమి? అట్లుకూడఁ జేయలేమా? ఊహు, ఇందునుగూర్చి యొక గాథ యున్నది. దానిని జెప్పదును.

జనకమహారాజసభాశాలలోని కొక విరాగి యాతని దర్శనార్దము వచ్చెను. అప్పడే మహారాజు పూర్వాహ్నకృత్యములన్నియు నెరవేర్చుకొని యగ్నిశాలనుండి సభాశాలకు వచ్చుచున్నాడు. బ్రహ్మవర్చసము క్షాత్రతేజము నాక్రమించు కొనియుండెను. కన్ను లెండ గాయు చున్నవి కాని చెక్కిళులు పండువెన్నెల లీనుచున్నవి. పరమశాంతతఫాల మంతయుఁ గప్పియుండెనుగాని కొలచినట్టున్నట్టి గడ్డము పట్టుదలను సూచించుచున్నది. శరీర మెఱ్ఱినీ టివఱదయందు బూర్ణచంద్రుఁడు ప్రతి ఫలించు చున్నట్టున్నది. కవులు భావించి యేదో వెఱ్ఱమొఱ్ఱగ వర్ణింపఁ దగినయంశము. నాకేల? జయా! జనకచక్రవర్తి యని వందిమాగధాదులు బిరుదావళుల బటించుచుండ, నొకవంక బారులుగట్టి మునులాశీస్సులతోఁ బుష్పాక తలు వర్షించుచుండ, సామంతరాజులు పాదాక్రాంతులగుచుండ, నుద్యోగులు నడుములు చేతులు కట్టుకొని యాజ్ఞలకై వేచియుండం, గవులు చక్రవర్తిపైఁ బ్రబంధములు పఠింపుచుండ, గాయకులు చిత్రవిచిత్రరీతుల గీతామృతములు వెదఁజల్లుచుండ, వారాంగన లుత్సాహమున నృత్యము లొనర్చుచుండం, జేతులు సాచి దోసిళులు పట్టి 'ఇటు దయచేయుఁడు, ఇటు, లనుచుఁ గార్యదర్శులు మార్గదర్శులైవెనుకకు నడచుచుండఁ గను సన్నలతోఁ జేతిజోడింపు లతో, శిరఃకంపనములతో, మందహాసములతో, వ్రేలియూఁపులతో, నభిప్రాయప్రకటనము లగు నాలోకన విలాసములతో, నెవ్వరి నెట్గాదరింప వలయునో యట్లాదరించుచు మొకమాలుమడుగలపై నడుగు లిడుచు, నిమ్మళముగ సింహాసనము నొద్దకు వచ్చి, కూరుచుండుఁ డని యందఱకు సంజ్ఞచేసి తాను గూరుచుండెను. రాజకార్యపు లెక్కలుద్యోగులు వినిపించు చున్నారు. కొందఱ కిచ్చుచున్నాడు. కొందఱకు బిగబట్టుచున్నాడు. కొందఱ కెగఁబె ట్టుచున్నాఁడు. సత్కార్యములందు ద్యాగమెంతయో నిరుపయోగ కృత్యములం దంతపిసిడి తన మగపఱచు చున్నాఁడు. న్యాయమెంతయో నిర్ధాక్షిణ్య మంతకనఁబఱచుచున్నాఁడు. ప్రజలందుఁ బ్రేమ మెంతయో భయంకరత్వ మంతకనఁబఆచున్నాఁడు. ప్రజలందు బ్రేమ మెంతయో భయంకరత్వ మంతకనబఱచు చున్నాడు. రాయబారుల బహుమానములు గొనుచున్నాఁడు. తాత్కాలికపు ద్రోపుడుమాటలచే వారిని బంపుచున్నాఁడు. ఇష్టమయ్యును గొందఱతో మాటలాడకుండనున్నాఁడు. అనిష్టమయ్యను గొందఱతో మాటలాడు చున్నాఁడు. ఉబ్బెత్తుగవచ్చిన నవ్వును బెదవులబిగింపుచే దబాయించు చున్నాఁడు. నడుమన డుమ కొన్నిగుల్లనవ్వులను జలామణీచేయుచున్నాడు. రాజ్యతంత్రమంతయు నెట్టు నిర్వ హింపవలయునో యట్టు నిర్వహించుచున్నాఁడు.

చక్రవర్తిని జూచుటకు వచ్చినాఁడని చెప్పియుంటినే ఆ విరాగితో నింక మాటలాడ లేదు. వేచియుండలేక యాతనిప్రాణము విసుగుచున్నది. రాజసభకుఁ బోయినపిమ్మట మనయిష్టమా? మన తొందర లక్కడం బనికివచ్చునా? సమయ మగువలకు నోరుమూసి కొని పడియుండవలసినదే కాదా? సెలవు తీసికొని పోవువారు పోవుచున్నారు. తుట్టతుద కందఱు పోయిరి. మన విరాగి యొక్కడుమాత్రమే కొందరు రాజభటులతో మిగిలియం డెను. అదిసమయ మని యెంచి యాతండు చక్రవర్తియొద్దకుఁ బోయి యాశీర్వదింప మీరెవ్వ రని యాతండు డడిగెను. నాతోఁ గొంత సేపు రహస్యముగ మీరు మాటలాడవలసియున్నదని విరాగి పలుక, భటుల నందఱ నావలికిఁ బొమ్మని చక్రవర్తియాజ్ఞాపించెను. వారిద్దలకిట్లు మూటలాడుకొనిరి.

విరాగి:-చక్రవర్తీ మంచుకొండలలోయలలోపలఁ గూడ నీకీర్తివిహరించుటచే దర్శ నము చేయవలయునని వచ్చితిని. యాజ్ఞవల్క్య శిష్యుడవై కర్మయోగి వైన నీ వీజన్మముననే మోక మొందగలవని పెద్దలవలన విని మీ పుణ్యదర్శనమున నేనుగూడఁ దరింపవచ్చునని వచ్చితిని. మీదర్శనము నాకగునో కాదో, నేను వచ్చుసరికి నీవు ప్రబలసమాధి నిష్టాగరిష్టత బ్రచ్చన్నచైతన్యుడవై యుందువో, కాక బహిరంగముగఁ బ్రాణాయామము బట్టిపైకెగురు చునుందువో యని యనుకొంటని. నిన్ను జూచి డిల్టపడిపోయితిని. కర్మ యోగివని పేరొందిన నీవు భవభోగివని బిరు దొందుటకుఁ దగియున్నావు. ఏసంసారి కిన్ని భోగములు న్నవి? ఏపామరుని కింతభవలంపటత యున్నది? ఆహాహా! కిలిక్రిందనున్న పాదుకలక్రిందఁ గూడ పట్టుపురుపులు పఱపించితివే. పంచభూతములను బానిసలుగా జేసికొని వానిచేఁ గొలువు చేయించుకొనుచుంటివే. ఈపనికి మాలిన రాజ్యము నీ కెందుకు? శుఖపరవశుడవై నిన్ను నీ వేలుకొనలేక పోయినప్పడు నీవొకరి నేలుటయేల? అయ్యయ్యో! ఈయాత్రితు లేమి, ఈయుద్యోగులేమి, ఈరాయబారులేమి, ఈవిచారణములేమి, ఈశికలేమి, ఈధన కాంక్షలేమి, ఈవేశ్యావృత్తగీతాదులేమి, ఈకవిగాయక మాగధాదిస్తోత్రపాఠములేమి, నిన్ను జూడగ నాకు వెఱ్ఱి యెత్తుచున్నది. ఇట్లేలయుంటివో నాకుఁ జెప్పవలయును.

జన:-మునిచంద్రమా! నీవు బుద్దిమంతుఁడవు. నాయందలి మహాభిమానముచే నిట్టు పలికితివి. ఇది యంతయు లాంపట్యమని నే నెఱుఁగక పోలేదు. ఈ మహా సంసారతంత్రమునఁ జిక్కుకొని తిరుగుచుంటినని యెఱుఁగకపోలేదు. కాని మూడు నకు నాకు నున్నభేద మేమనఁగా నే నది వ్యర్థమని యెఱిఁగియుండియే తిరుగుచున్నాను. వాడిదియే పరమార్ధమని తిరుగుచున్నాఁడు. ఇద్దఆలో నేనే దోషినని తెలిసికొనకపోలేదు. ఎఱిగియుండియు నింక నేల యిందు దిరుగుచుంటి వని యడుగుదువా? తప్పనిసరి యగుటచేత నాసుఖప్రారబ్దముయొక్క శేష మింక నున్నది. అదికూడ ననుభవించువఱకు నేను దీనిని వదలుకొని నను నది నన్ను వదలదు. నాయనా! నే జేసినకర్మముయొక్క ఫలమును నే ననుభవింపక నాకుఁ దప్పనా? • శ్లోl అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశతైరపి' అని మీ వంటి విద్వాంసులే యానతిచ్చిరికాదా? అందుచేతఁ బ్రారబ్దఫలానుభవ పూర్తియగువఱకు నోరుమూసికొని చచ్చిన ట్లనుభవింపవలసినదే.

విరాగి:-చక్రవర్తీ! నీమాటలు నాకు నచ్చలేదు. నీవు వదలి వైచిన సౌఖ్యములు తిరుగ నీవెంట నంటివచ్చునా? రాజ్యమును దృణప్రాయముగ వదలివైచిన నీయల్లుఁడగు రామచం ద్రునితో సాకేతపుర రాజ్యము కూడఁ బోయినట్లు వినియుంటివా? స్వార్థపరత్యాగశక్తి నీ యొద్ద లేదు. అందువలన నిట్టు లాడుచున్నావు.

జన:- నాయనా! చాలసంతోషము. నా కీసౌఖ్యసంఘాతమంతయు వదలిపోయి తిరుగ రాకుండుటకు నన్నేమి చేయుమందువో చెప్పము.

విరాగి:- నీవు సౌఖ్యమును వదలుకొనుటకు సిద్దపడియుంటివా? మందది నాకుఁ జెప్పము.

జన:- ఈ నిముసమందు వదలుకొందును. ఆసౌఖ్యములు నాకు తిరిగి రాంకుడ నీవు చేయఁగలవా? ముందది నాకుఁ జెప్పము. విరాగి:- అందులకు నాది పూచీ, హిమాలయమునకు రమ్ము పోదము.

జనకచక్రవర్తి ప్రధానునితో నిట్టు పలికెను. 'నాకుఁ గొంతపని. యున్నది. నే నీమునితోఁ బోయెను. నే నెక్కడకుఁ బోయెదనో నన్ను గూర్చి యేప్రయత్నము జేయవలదు. నాయిష్టమువచ్చినప్పడు తిరుగవత్తును. నీవు నన్నేమియు నడుగవలదు.”

అట్టు చెప్పి చక్రవర్తి విరాగితోఁ బోయెను.

  • * * * * *

వారు మహారణ్య మధ్య భాగమున నడచుచున్నారు. చక్రవర్తికమితమగు దగవేసెను. చుట్టుపట్టుల మంచినీరము దొరకదయ్యెను. నే నెచ్చటికైనఁ బోయి తెచ్చిపెట్టెదనని విరాగి చెట్టుక్రింద నాతనని బండ పెట్టి పోయెను. రాజునకు విస్తృతి కలిగెను. ఇంతలో జనకచక్రవర్తి యొక్క సామంతరాజోకఁడు తనకొడుకులను జక్రవర్తికిఁ జూపించుతలంపుతోఁ గొంత సైన్యముతో భటులతో నాశ్వికులతో సమస్తసామగ్రీ సమృద్దితో బయలుదేఱి జనకచక్రవర్తి పండుకొన్న చెట్టుక్రింద నుండి పోవుచు నామహాతేజమును చక్రవర్తి యని యెఱఁగియుండు టచే నీమహానుభావుఁ డిక్కడ పడియుండుట కేమి కారణమో యని తెల్లపోయి యాతనియుద్ద గూరుచుండి తన వైద్యులను బిలిపించి చక్రవర్తికి దాహ శాంత్యాదులను జేయించెను. నిద్దుర మెలకువరాకుండ నిమ్మళముగ బట్టుపఱపులపై నాతని నుంచిరి. పైన తన పెద్ద డేరా వేయించి డేరా చుట్టు భటులను గుఱ్ఱపుసవారులను గాఁపుగాయుచుండ నాజ్ఞాపించెను. తాపశాంతి కొఱకుఁ బన్నీరు భూమిపై జల్లించుచుండెను. పూవులసురట లతో దాసీ జనముచే విసరించుచుండెను. నిమ్మళముగ మెలఁకువ కలుగుటకై మిక్కిలి సున్నితముగ వీణావాదనము జేయించుచుండెను. మహాచక్రవర్తి యారోగ్యమునకై ద్విజులచేఁ బ్రార్ధనలఁ జేయుచుండెను. ఒక్క గంటలోపల నిన్ని మార్పులు జరిగెను. అడవి పట్టణమయ్యెను. ఎందుచేత? ఇన్ని సౌఖ్యములు పొందవలసిన వాడరణ్యమున నుండుట చేత.

రాజునకు మెలఁకువ కలిగినది. సామంతరాజుచే సంగతులన్నియుఁ దెలిసికొనెను. ఒకముని యెవరైన నాకొఱకు వెదకుచున్నారేమో కనుఁగొనమని చక్రవర్తి యాజ్ఞయయ్యెను. లోనికి వచ్చెదనని యెంత సేపటి నుండియో యఱచుచున్న సన్యాసియొకఁడు వెలుపల నున్నాడు. సెలవు లేకపోవుటచేత రానీయలే దని యచ్చటివా రెవ్వరో చెప్పిరి. ముని లోనికి వచ్చి బంగారుపీఠముపై గూరుచుండి తనకుఁ బాదాక్రాంతులైన సామంత రాజపు త్రుల నిద్దఱ నాశీర్వదించుచున్న చక్రవర్తిని గాంచి 'కర్మయోకి చక్రవర్తీ నావలన మహాపరా ధము గలిగినది. నాకు బుద్ది వచ్చినది. నన్ను కమింపు'డని బట్ట మెడ జట్టుకొని సాష్ట్రాంగపడెను. ఈసన్నివేశ మచ్చటివారి కెవ్వరికిఁ దెలియలేదు. మునిని లేవనెత్తి నీవు మఱేమియు ననుకొనవల దని చెప్పి యాతనిని వినమ్రుఁడై యనునయించి సామంత రాజపరివారముతో, విరాగితోఁ దనరాజ్యమునకుఁ బోయెను.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః