సాక్షి మూడవ సంపుటం/సభావ్యాపారములు2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

19. సభావ్యాపారములు

ప్రత్యేకించి ఉపన్యాసం ఈ రోజు లేకపోయినా, జంఘాలశాస్త్రి ఒక చిత్రమైన ఉత్తరం చదివి వినిపిస్తున్నాడు.

ఒక అమ్మాయి గురించిన ఉత్తరమది. ఆమెకు పదో ఏట పెళ్ళి, పధ్నాలుగో యేడు దాటింది లగాయతు కాపరానికి యోగ్యంగా తయారైంది. తండ్రి ఇచ్చిపోయిన డబ్బు వుంది. భర్తకి ఈమె మీద వల్లమాలిన మమకారం. ఆమెకి మాత్రం భర్తంటే అంత వెర్రి లేదు.

ఇలా వుండగా ఒకసారి ఆమె తండ్రికి మేనమామికి మనవడు ఈమెను చూడడానికి వచ్చాడు. కొన్నాళ్ళున్నాడు. ఆమెకి క్రమంగా అతనితో చనువు పెరిగింది. భర్త మీద విముఖత కూడా పెరిగింది.

ఇలా వుండగా భర్త, పెద తండ్రికి ప్రాణం మీదికి వచ్చిందంటే, అతను చూడడానికి వెళ్లాడు. ఆ వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాలేదు.

చిత్రం-భర్త అడ్డు తొలగగానే తన ప్రణయ వ్యవహారంలో విజృంభించ వలసిన ఆమె, తన తండ్రి మేనమామ మనవణ్ణి అదే వూళ్లో వేరే యింట్లో వుండమంది.

మరి కొంతకాలానికి ఈమెకు పక్షవాతం వచ్చింది. ఆమె ప్రియుడు తరచు వచ్చి చూసేవాడు. చేతనైన సేవలు చేశాడు. పక్షవాతం పూర్తిగా తగ్గింది. కాని, భర్త బ్రతికి వుండగా, ఈ ప్రియుణ్ణి దరిజేర నివ్వని ఆమె, భర్త మరణించాడని తెలిశాక పెళ్లి చేసుకుంది. కాని పెళ్లినాట రాత్రి, గర్బాధాన సమయంలో-ఆమె, తన పూర్వ భర్త తన గొంతు పిసుకుతున్నాడని భయపడింది. చిత్రం-మరికొంత సేపటికి ఈనూతన భర్త, చచ్చిపడివున్నాడు,–ఇదే ఉత్తరం సారాంశం.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:

ఈదినమున నుపన్యాస మేమియు లేదు. సభలోఁ జదువఁబడుటకై వచ్చిన యుత్తర మొక్కటి మాత్రమే యున్నది, దీనిని జదివెదను. ఇది కొంత చిత్రముగానే యున్నది. దీనిని వ్రాసినయతనిపే రేదో తెలియదు. ఏయూరనుండి యిదివచ్చినదో యంతకంటెఁ దెలియదు. ఉత్తరముపై నున్న ముద్రం జూడఁగ నస్పష్టముగ నున్నది. ఏయూరనుండి వచ్చిన నేమి? ఏవరు వ్రాసిననేమి? దానిలోని యంశములే మనకుఁ గావలసినవి కాదా? ఉత్తరమును జదివెదను.

సాక్షికి:- ఈయూర నొక బ్రాహ్మణి యున్నది. ఆమె కిప్పటికిఁ బదునాల్గు సంవత్సరములు. ఆమెతండ్రి మరణించి యొక సంవత్సరమైనది. ఆతడు శవవవహనాది క్రియలచేఁ గొంతసొమ్ము సంపాదించినాఁడు. బిడ్డను మేనల్లుని కిచ్చి వివాహము చేసి యాతనిని తనయింటనే పెట్టుకొనినాడు. ఆపిల్లకుఁ బదవయేట వివాహమైనది. పదునొక టవ యేఁట నామె యీడేరినది. రజస్వలాస్నానదినముననే గర్భాదానము గూడ జరిగినది. ఇట్లు తన బిడ్డయు నల్లుఁడును రెండు సంవత్సరములు కాంపుర యొనర్చినతరువాత నా బ్రాహ్మణుడు మరణించినాఁడు. ఉన్న సొమ్మంతయుఁ గూతు నధీనమైనది. తాను మగండుమాత్రమే యింటిలోనుండ లేక భటు నొక్కని సాయము కొఱకింటిలోఁ బెట్టుకొని నారు.

ఈబ్రాహ్మణికి భర్తయందు వెజ్జీమమకారము లేదు. భర్తకు భార్యయం దెంతయను రాగ మైన నున్నది. ఆమెకనుసన్నలను మెల గుచు నామెకు సమస్తోపచారములను జేయిచుండెను. తన్నాశ్రయించి సేవించిన కొలఁదియు నాతనిపై నామె మనస్సునం దనిష్టత హెచ్చుచుండెను. భర్త మిగుల దేహదార్ద్య సంపన్నుఁడే రూపవంతుడే. పరస్త్రీ పరా జ్మఖుఁడే. అయిననేమి? అతని యోగ్యతలన్నియు దోసములుగా నామెకు గనబడుచుం డెను. భర్త తలయెత్తియామెను చూడఁగనామె కనులు మూసికొని తలవంచు కొనుచుండెను. భర్త దగ్గఱకు రాఁగా నామె దూరముగఁ బోవుచుండెను. భర్త తనతో మాటలాడఁగ నామె విననట్టు భటునిఁ బిల్చి యేదియో చెప్పచుండెను. ఇట్టిభర్త కేమిసుఖమున్నది? వీరి దాంపత్యములోని చిత్రములను వాణీదాసుని వంటి కవి వర్ణింపఁదగినది. కాని నేను జెప్పఁజా లను. మీ జంఘాలశాస్త్రి వంటివాఁ డీదాంపత్య సౌఖ్యమును గూర్చి యుపన్యసింపవలయును గాని నావలన గాదు. చప్పనిమాటలతోఁ జచ్చుచచ్చుగా మాత్రమే వ్రాయంగలవాఁడను.

ఇది యిట్లుండఁగా నీమెతండ్రికి మేనమాయ మనుమ డొకఁడు వచ్చెను. ఆతని నీసంసారిణి గౌరవించి యాదరించుచుండెను. ఆతఁ డఫ్లై రూపవంతుఁడు కాడు. శరీరదారుఢ్యముకూడ బాగుగా నున్నవాఁడు కాడు. ఈమెభర్త కాకపోవుటయే యాతని సుగుణమని యెన్నందగి యున్నది. ఆమెకు నతనికిఁ గొంతకాలము కనుసన్నలు నడచెను. తరువాత గొన్ని దినములు ముసిముసినవ్వుల లావాదేవీలు' జరిగెను. కొన్ని దినములు చిన్నచిన్నమాటలు జరిగెను. తరువాత సావకాశముగా బుక్కిటి పురాణములలోను, లోకాభి రామాయణములోను, లొట్టాబట్టీయములోను కొన్నిదినములు నడచెను. అందుపైన ప్రమాదవశమునఁ జేతులు చేతులు కలియుటలు, నసైనొచ్చుకొనుటలు, నిట్టెక్షమాపణలు జరిగెను. అందుమీఁద తొందరతొందరగ వదలువదులు హస్తస్పర్శములు, పిమ్మట కొంతబి గింపులు, రవంత గిలిగింతలు, కాసంత యిగిలింతలు చెలరేఁగెను. అటుపైన బెదరుబెదరు నాలింగ్టనములు, అట్టెవిడిపోవుటలు కలిగెను. అందుపైన మూతి మూతి కలియుటలు, శిరకంపనములు మొదలైనవి జరిగెను. అంతటితోఁ గొన్ని దినములాగెను. స్వభావసిద్దముగ నద్భుతమైన యీశృంగార గ్రంథము యొక్క ప్రతిపదార్దమంతయు దనకు బాగుగఁ దెలియకపోయినను రవంతభావమైనను భర్తకు తెలిసియుండక మానదు.

భర్తయెంత చేతగానివాఁడైనను భార్య యెంత స్వతంత్రురాలైనను భర్త యింటలో నున్నంతకాలము భార్యకు విశేష స్వేచ్చయుండుట కవకాశము లేకపోయిన కారణముచేతఁ గాబోలు బాహ్యవిలాసముల తోడనే కాలక్షేపము జరిగినది. భర్త యిల్లు విడిచి లేచిపోయిన బాగుగ నుండునని భార్య యనుకొనినది. ఇంతలో దైవవశమున భర్త పెద తండ్రికి ప్రాణముమీదికి వచ్చినదని యాతనికి తంతివార్త వచ్చినది. అంతట నాతండు పోయినాఁడు.

భర్తయింట నుండినంతసేపు పైయవేక్ష కలిగియుండిన భార్యకు భర్త వెళ్ళినది మొద లావృత్తి సన్నగిల్లెను. ఇంటిలో నున్నవాడెన్ని విధముల బతిమాలినను నీమె యంగీకరింప లేదు. అది గాక నింటిలో భర్త యున్నప్ప డెందఱు పరపురుషు లున్నను బరిసిపాఱిపోవును గాని భర్తయింటిలో లేనప్పడు మాత్ర మొక్క పురుషునినైన నింట నుండనిచ్చుట సానివృత్తి కంటె భిన్నము కాదని యొఱింగియుండి కాఁబోలు నాతని నాయూరనే మఱియొక్కయింట నుండుమని చెప్పెను. ఈమె మిక్కిలి నాగరికతగల స్త్రీ యగుటచేత ననేకులగు నుద్యోగు లీమెతోఁ గరచాలన మొనర్చి మాటలాడుటకు వచ్చుట గలదు.

తరువాత గొలదిదినములలోనే ఈమెకు పక్షవాతము వచ్చెను. అట్లామె యొక్క సంవత్సరము మంచము మీఁదనే యుండెను. ఆమె మిత్రుడు తఱచుగ వచ్చిచూచుచుఁ జేతనైన యుపచారములను జేయుచుండెడివాడు. భర్త యొక్కడ నున్నాఁడని యామె తఱ చుగా నీతని నడుగుచుండెను. అతని పెదతండ్రి గ్రామములోనే యున్నాఁడనియు, నక్కడ నాతండు చిన్నపొలమును సంపాదించుకొని వ్యవసాయముచే జీవించుచున్నాడనియు, నిక్కడ కింక రాడనియు దన కాయూరనున్న మిత్రు డొకఁడు వ్రాసినాఁడని యామెతో నాతండు చెప్పెను. ఇట్లుండ నామెకుఁ బక్షవాతము పూర్తిగ నిమ్మళించేను. నామాట యేమని యామెను మిత్రుఁ డడిగెను. "నీవు నన్ను బెండ్లిచేసికొన వీలులేదు. నేను పడుచుకొనుట నాకిష్టము కాదు. నన్నేమి చేయుమంటివి' యని యామె పలికెను. “నిన్నే నేను వలచితిని. నిన్ను వదలువాఁడనుగాను” అని యాతడు పట్టుపట్టి కూరుచుండెను. ఇట్లుండ నొక్కనాఁడు భర్త పెద్దతండ్రి యొద్దనుండి యామెకు దంతి వచ్చెను. తనభర్త మరణించి నట్టు దానిలో నుండెను. ఇక్కడకుఁ బీడ వదలినదని యిద్దఱు కూడ సంతోషించిరి.

భర్తమృతికై యనేకు లీమెను బరామర్శించిరి. నెలదినములు కాకుండానే తాను దనమిత్రుని వివాహముచేసి కొందునని యామె ప్రకటించెను. సహజమైన ప్రేమ, దేశకాలాబాధితమని యందఱు సంతోషించిరి. వివాహదినమున నీమెను జూచుటకు వచ్చిన యుద్యోగు లకు లెక్క లేదు. ఒక హైకోర్టుజడ్డి కాబోలు నిందకొఱకు సెలవు పుచ్చుకొని Orr & Sons నుండి యొక హారముతో నామెను జూచుటకు వచ్చి యామెనాగరకతకు, యోగ్యతకు మిక్కిలి సంతోషించుచు నొక్క చక్కని యుపన్యాన మిచ్చెను. సిద్ధాన్నము కావున నారాత్రియే గర్బాధానము. రాత్రి గర్బాధానశయ్య యొద్దకుగూడ నెందఱో యుద్యోగులు వచ్చి యాయదృష్టవతిపై నభివందనములు వర్షించిరి. డిష్ట్రిక్టుబోర్డు ప్రెసిడెం టొక్క డామెతో గరచాలన మొనర్చి కెంపుపొడి గలయొక బంగారపు సూది యామెపైటపై గ్రుచ్చెను. ఉన్నతన్యాయస్థానాధికారి యొకడు వచ్చి యామె మస్తకమందు హస్తముంచి రెండవ హస్తముతో నామెబుగ్గలు పైకెత్తి పవిత్ర ప్రేమ పూర్ణమైన, దేవతా సంబంధమైన యొకముద్దును నుదుటిపై బెట్టుకొనెను. అందఱు కరతాళము లిచ్చిరి. వధూవరు లన్యోన్యప్రేమ గలిగి సుఖింతురుగాక యని యాశీర్వదించి గది తలుపులు వేసిరి.

ఇంతటినుండి విచిత్రమైనగాథ యారంభమైనది. చిరకాలమునుండి గాఢా శ్లేషమునకై యువ్విళ్లూరుచున్న దంపతులు కలిసి యొకరిపై నొకరు చేయి వైచుకొని, తాంబూలమును వైచుకొని, పండుకొని యురితీసినంత బింకముగా గౌగిలించుకొనిరి. అంతట పుస్తకముల బీరువా ప్రక్కనొక్క నీడ యామెకుఁ గనబడెను. ఏమోయని కొంత సంశయించి బీరువానీడయై యుండునని యూరకుండెను. ఈసారి మిగులగాటముగా ముద్దిడుకొనుచుఁ బ్రమాద మున వెనుకఁజూడఁగా నీడకదలుచున్నట్టుకన బడుచున్నది. కదలుట యేలనని జడిసి యానీడను భర్తకుఁ గనఁబఱచెను. ఆతఁడు చూచి మరేమియులేదు. పండుకొనుమని యామెకన్నులమూసి లేవఁబోవగా వద్దు, వద్దు, నాకక్కఱలేదు. నాపూర్వభర్త స్వరూపమదిగో గొంతు పిసికెద నన్నట్లు సంజ్ఞయొనర్చుచున్నాడని బలవంతముగా నామె లేచికూరు చుండెను. ద్వితీయభర్త కూడ లేచిచూడఁగా నీడయు లేదు. జాడయునుగూడ లేదు. అంత నిద్దఱుగూడ నవ్వుకొనుచుదిరుగ బండుకొని యిట్టు మాటలాడుకొనిరి. నాభర్త దయ్యమైనాఁడు కాఁబోలునని యామె యనంగా దయ్యములు లేవు, భూతములు లేవు. నీహృదయమం దున్న యాతనివిగ్రహము నీయెదుట గాంచుచున్నావు. ఇది మనస్సంబంధ మగు నింద్రజాలము గాని మఱోకటి కాదు. నీవు నాయొద్దం బండుకొనుటతోడనే పూర్వసంస్కారవిశేషమువలన నీభర్తను గాటముగా తలఁచుకొంటివి. అంత నాతనిస్వరూప మును పైనఁ గాంచితివని నూతనభర్త యామెను సమాధానపఱచెను.

గీ. కాతరుఁడు మదిఁ గలపాము గాంచు నెదుట
విరహి యెదుటఁ జూచును లోన వెలయు చెలిని
మెదటిలోని స్వర్గమును కవియెదుటఁ గాంచు
మనసు చూడు మన్నట్టులే కనులు చూచు.

ఈసారి తప్పకుండఁ బండుకొనవలయునని మహోత్సాహమునఁ బ్రయత్నము సల్పగ దిరుగ నానీడయే యిద్దఱకుఁ బ్రత్యక్షమైనది. ఇది యేమియును బాగుగ నున్నది కాదు. దీపమార్పి పండుకొందమని భర్త భార్యతోఁ జెప్పఁగ, నామె యెంతమాత్ర మంగీకరిం పలేదు. నాకు భయము వైచుచున్నది. అక్కడ నేమున్నదో చూచిరమ్మని భార్యభర్తను గోరెను. ఏమియు లేదు పండుకొను మని భర్త బలాత్కార ప్రయత్నమునకు సిద్దము కాఁగా నింతలో నేమయ్యెనో యెవ్వరికిఁ దెలియదు. కాని ఱెప్పపాటు కాలములో గర్బాధానపు బెండ్లికొడుకు చచ్చిపడి యుండెను. ఎట్టు చచ్చినాడో యెవ్వరికిఁ దెలియదు. కెవ్వుమని యింటిక ప్పెగిరి పోవునంత కేకవైచి యాతని భార్య క్రిందఁ బడిపోయెను. గదివెలుపలి వారు భయపడి తలుపుల యుతక లెత్తి లోనఁ బ్రవేశించిరి. ఆమెకుఁ గొంతసేపటికిఁ స్మృతిరాంగ నీసంగతులన్నియు నామెవలనఁ దెలిసినవి. ఈ సంగతి రక్షకభటులకుఁ దెలుపగ, వా రేమో ప్రయత్నించుచున్నారు.

ఇది జరిగిన కథ. దీనిని మీరు ప్రచురించవలయును. చిత్తగించవలయును.

ప్రచురింపవలయునా లేదా యని జంఘాలశాస్త్రి నభవారినడిగెను. పోలీసు విచారణలో నున్న వ్యవహారమును గూర్చి మనయభిప్రాయ మేమో తెలుపఁగూడదని యొక్కఁ డనెను. వితంతుమివాహములు చేసికొన దలఁచిన మన సోదరీమణుల కిది కొంత నిరుత్సాహముగా నుండును గౌవునఁ బ్రచురింపవలదని మఱియొక్క డనెను. చచ్చిన భర్తలందఱు దయ్య ములై తమ వితంతువుల ప్రక్కలలోనికి రాత్రి భాగమునందు వచ్చుచుండునెడల నింక మివాహము లెందుకు? క్రొత్తవారి విశేషముమాత్ర మేమున్నది? అందుచేత నిరుత్సాహముగా నుండదు. ప్రచురింపుమని యొక్కడనెను. ఇది ప్రధానసాక్షిలోఁ బ్రచురింపక సభావ్యాపార సాక్షిలో బడవేయువలయు నని యింకొక్క డనెను. అందఱుగూడ నీ కడపటి యభిప్రా యమును మన్నించిరి.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః