సాక్షి మూడవ సంపుటం/వైష్ణవుని యుపన్యాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5. వైష్ణవుని యుపన్యాసము

జంఘాలశాస్త్రి ఒకసారి ఒక వైష్ణవభక్తుని ఉపన్యాసాన్ని సాక్షి సంఘసభలో ఏర్పాటు చేశాడు. ఆయన పేరు తిరువేంగడాచార్యులు.

ఆయన భక్తి అంటే ఏమిటో, శాస్తోక్తంగా ముందు నిర్వచిస్తూ -తైలధారలాగ, ఎక్కడ తెంపు, వంపు లేకుండా, తరుగు విరుగు లేకుండా వుండే-భగవంతుడిపట్ల–ఏకాగ్ర చిత్తం అని సూచించాడు. భక్తి పేరిట రకరకాల మనుషులు చేసే వింత ప్రవర్తనల్నిబట్ట బయలుచేశాడు. కొందరికి కష్టాలు ఎదురైనప్పడు తాత్కాలికంగా భక్తి ప్రబలుతూ వుంటుంది. కష్టం వెనకబట్టగానే, భక్తి పలాయనం చిత్తగిస్తుంది. ఇటువంటి భక్తికంటె నాస్తి కత్వం మేలు. నాస్తికతలో నీతి వుంది. శాసన విధేయత వుంది.

కొందరు మనుషులు సుఖంగా అంతా జరిగిపోతున్నప్పడు భక్తులు. పూజలు, హారతులు, నైవేద్యాలు, దానాలు, పురాణ పఠనాలు-అబ్బో.! అదంతా గొప్ప ప్రదర్శనమే. వీళ్లకి కాస్త ఒళ్లు వెచ్చబడితే చాలు ఒకటొకట మూల పడతాయి. సొంత సేవలు, బ్రతుకు భయాలు వరించేస్తాయి. ఈ ప్రదర్శనాలకీ, భక్తికీ కూడా ఏమీ సంబంధం లేదు. వీరిది పూజా మందిరం కాదు. బొమ్మల దుకాణం.

ఆచార్యులుగారు భగవద్గీతనుంచి ముఖ్యశ్లోకాలు తీసుకుని -భక్తితత్త్వం ఎంత గహనమైనదో, ఎంత ఆర్తిలోంచి, తపనలోంచి, త్యాగం లోంచి, అర్పణ భావంలోంచి పుడుతుందో వివరించారు. ఇందుకు గజేంద్ర మోక్షం కథనీ, ద్రౌపదీ మానసంరక్షణం కథనీ ఉదాహరించి-ప్రపత్తికి పరాకాష్ట్రను సూచించారు. సారాంశంగా-భక్తిమార్గర ప్రకృతి మార్గానికి భిన్న మైంది కాదనీ, భగవంతుని మీద దృష్టి లేకుండా ఒక్క ఆలోచనకూడా చెయ్యవద్దని మనవి చేశాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

నాయనలారా! ఒక శ్రీవైష్ణవుడు మనసభలో భక్తినిగూర్చినేఁ డుపన్యసించును. (‘’ఇదివఱకు భక్తినిగూర్చి యుపన్యసించితిరి కాదా? తిరుగ నావిషయమును గూర్చియే యుపన్యాస మెందుల’ కని సభలో గేక.) నాయనా! అట్లన గూడదు. మంచిమాట లెవరు చెప్పినను వినవలసినదే. అందులో జన్మతారకమైన భక్తినిగూర్చిన మాట లనుదినమున ననుకణమునcగూడ వినవలయును. వినగా వినఁగాఁ గొన్నిమాటలైన మనస్సున స్థిరముగఁ బ్రవేశించునేమో, యవి యెన్నంటికైన నాచరణములోనికి వచ్చునేమో యని నేను దేవులాడుచున్నాను. ఒకసారి వచ్చినది తిరుగ రాంగూడదనుట కిది యేమి స్పోటకమా? అదిగో యావైష్ణవులు మాటలోనే వచ్చుచున్నారు. నాయనలారా! ఉపన్యాసము వల దనకుడు.

అయ్యా తిరువేంగడాచార్యులుగారూ! దయచేయుడు. నాయనలారా! నే నిప్పడు మీతో మనవిచేసిన యాచార్యులవారు వీరే శ్రద్దతో వారిభక్తివిషయకోపన్యాసమును వినవలయును.

వైష్ణవుని యుపన్యాసము

శ్రీమతేరామానుజాయ నమః సోదరులారా-అడియేనికి రవ్వంత సంస్కృతసాహిత్య మున్నది. వైష్ణవమతగ్రంథములను గొలఁదిగా నడియేను సేవించినాండు. ఈసభలో ననేకులు తఱచుగ వచ్చి యుపన్యసించుచుండంగా నడియేను కాభాగ్య మేల లేకపోవలయును నని యిచ్చట కిందులకు సిద్దపడినాఁడు. ఐహికవిషయములపై నేమి చెప్పిన నేమి వినియోగమని యెంచి, భక్తినిగూర్చి చెప్పఁ దలంచితిని-అచ్చటచ్చట గొన్ని ప్రపత్తిమాటలుగూడ రావచ్చును.

భక్తి యనంగా నేమి? తైలధారావదవిచ్చిన్న స్మృతిసంతాన రూపాపన్నజ్ఞానము భక్తి యని పెద్దలు సాయించినారు. తైలధారవలె సంతతము నిరంతరముగ భక్తియుండవలయును. ఎక్కడను దెంపుగాని, వంపుగాని, తరుcగుగాని, విరుcగుగాని యుండcగూడదు. ఎందఱిం దఱకెన్ని యెన్నిరోగములు వచ్చినసరే, యెన్నియెన్ని వ్యవహారము లెట్టు ధ్వస్తమైన సరే, యెన్నెన్ని పరాభవములు, ప్రజానిందలు సిద్దించిన సరే, భక్తిసాంతత్యమునకు భక్తినైరంతర్య మునకు, భక్తిప్రవాహవేగమునకు భంగము లేశమైన రాcగూడదు. తీయనీటికిఁ జేcప యొక్కినట్టు, భక్తి మనస్సునం దట్టె యస్లై ప్రవేశించి, మనస్సులోని యైహిక సంకల్పము లన్నియు నావల ద్రోచి, తాను మాత్రమే భగవత్ర్పేమరూపముగా నిల్చియుండవలయును.

కొందఱకుఁ గష్టములు సంభవించినప్పడు తాత్కాలికము భక్తి కలిగిన ట్లుండును. కాలికి ముల్లు గ్రుచ్చుకొన్నప్పడు మనుజుఁ డమ్మాయని యబుద్దిపూర్వకముగ నను చున్నాఁడు. అమ్మను నిశ్చయముగా మనస్సునందుc దలంచి యమ్మపైనుండు ప్రీతిచే, భక్తిచే నాతడట్లామ్మాయని యఱచినాcడా? అమ్మ వచ్చి రక్షించు ననువిశ్వాసముతో నామెను బిలిచెనా? అట్టి యాక్రోశములకు మనస్సుతో సంబంధము లేదు. అవి కొంచెము హెచ్చుత గ్గుగ దైహికవికారములు కాని మఱియొకటి కావు. "నారాయణా! వారాయణా! భగవన్నారాయణా! నారాయణా" యని పాడుచు ముష్టిదాసరయ్య వచ్చును. ఆతని నారాయణన్మర ణము మనఃపరిపాకముచేc గలిగినదా? కడుపుమంటచేం గలిగినది. ఆcకలిచే నది కలిగినది కాని యంతశ్శుద్దిచేఁ గలిగినదా? అలవాటుచే నది కలిగినది కాని యాముష్మికార్తిచేఁ గలిగినదా? జోలి నిండఁగనే నారాయణస్మరణము రవంతయుఁ గట్టుపడును. అటుపైని దా నెవడో నారాయణుఁ డెవండో దాక నిండుకైవచ్చిన నారాయణస్మరణమునఁ దత్త్వము పండునా? జోలి యావల బాఱవైచినాఁడు. కల్లుకొట్టులోఁ బ్రవేశించినాఁడు. త్రాగి యొడలు తెలియక యడ్డమైన బూతులు కనబడినవారి నెల్ల తిట్టినాఁడు. ఇట్టిభక్తికంటె నాస్తికత మంచిది కాదా? నాస్తికతలో నీతియున్నది. శాసనవిధేయత యున్నది. దీనిలో నవియైన లేవే.

కొందరు నరులు సుఖకాలమునందు దైవస్మరణ మొనర్చుచుందురు గడియగడి యకు రామరామా యని యజచుచుందురు. కన్నబిడ్డలు గారుగీరు మనుచు గంతులువై చుచు నాడుకొనుచున్నంతవఱకు, గల్గా కొట్టులోఁ గృష్ణకాటుకలు సమృద్దిగ నున్నంతవఱకుఁ జేతిపెట్టెలో జార్డిసార్వభౌముని మొగములు చాలఁ గనcబడుచున్నంత వఱకుఁ, గడుపుచల్లగ నున్నంతవఱకుc, బ్రక్కలో భార్య వెచ్చవెచ్చగ బండుకొన్నంత వఱకు, వీరి రామస్మరణ మింత యంత యుని చెప్పఁదగదు. దేవతార్చన లందు జయఘం టలు కావు-శుభనాదములు కావు-సాంబ్రాణి ధూపములు కావు-కప్పరపుటారతులు కావు -గోఘృతదీపములు కావు-చిత్రాన్నదధ్యోదనాదిభోగములు కావు-శ్రీపుష్చయోగములు కావు-ఓ చేతులబోడింపులు కావు; లెంపల వాయింపులు కావు-పైగడబడలు, దడబడలు, నెన్నియైన జరుపుదురు. ప్రతిరాత్రి పురాణకాలక్షేపము; పక్షమునకు సాలగ్రామదానము; మాసమునకు సత్యనారాయణవ్రతము-సంవత్సరమునకుఁ బెరుమాళ్లకు బిరాట్టికిఁ బున స్సంధానము. వీరు సుఖదినములలో దైవము పేరుపెట్టుకొని యెంత కోలాహలమైన నెంత హంగామా యైనఁ జేయుచున్నారు. సాయం కాలమగుసరికి యొడలు రవంత వెచ్చ బడినది. ఆరాత్రియే పురాణకాలక్షేపము మూల బడినది. తెల్లవాఱుసరి కమ్మగారికిఁ దొంబదియెనిమి దివఱ కుండవలసినదానికి నూటమూఁ డున్నది. ఆయుదయమే పెరుమాళ్ల కష్టోత్తరశతనా మార్చన సున్నయైనది. అయ్యగారి కుష్టకాలస్నానము లేదు సరేకదా, తొమ్మిదిగంట లైనను దంతధావనమైన లేదు. మొగము కడుగని యయ్యవారు సాలగ్రామములు కడుగునా? పిరాట్టిశిరమునకుఁ దిరుమంజనము మాని పెండ్గాము తల కమృతాంజనము రాయు చున్నాఁడు. మూల్గుచున్న భార్య వంకc జూడవలసిన యయ్యవారు నోరుమూసికొన్న పెరుమాళ్లవంకఁ జూచునా? పూజాకాలమందు సేవాకాలము చెప్పటకు రావలసిన భాగవతో త్తములు దిగులువడ్డ మొగములతో, శ్వాసకోశపరీక్షాయంత్రములతో, ముక్కద్దములతోఁ జేతిదుడ్డతో, జర్మపాదరక్షలతో మహమ్మదీయవైద్యుఁ డొకఁడు, మంగలివైద్యుఁ డొకఁడు, మాలవైద్యుఁ డొకఁడు లోనికిఁ బ్రవేశించి, యమ్మగారిని బరీక్షించుచున్నారు. శ్వాసకోశములలో రవంత గురుకున్న దని యొకఁ డనినాఁడు. ప్రేగులోఁ గాసంత గళు కున్నదని మఱియొకఁ డనినాఁడు. హృదయకోశములో రవంత 'మర్మ రున్న దని యింకొకc డన్నాఁడు. శ్లేష్మవాతజ్వర మని (Pneumonia) యొకఁ డనినాఁడు. ఆంత్రజ్వర మని (Typhoid fever) మఱియొకడన్నాడు. మన్నెపుజ్వర మని (Malaria) ఇంకొక డన్నాఁడు. ఏది సిద్దాంతమని యయ్యవా రడిగినాcడు. విశిష్టాద్వైతమే సిద్ధాంతమన్నవా డీ మాలమంగలి వైద్యులను జ్వరసిద్దాంత మడిగినాఁడు. భార్య బ్రదుకదని యేడ్చు చున్నాడు. అపాయకర మని ముగ్గురుకూడఁ జెప్పినప్పడేమిచేయును? శ్లో. న ధర్మని ప్టోస్మి న చాత్మవేదీ, న భక్తిమాన్ త్వచ్చరణారవిందే ! అకించనో నన్యగతిశ్శరణ్య, స్త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. యని బట్ట మెడ జట్టుకొని పెరుమాళ్లకు సాష్ట్రాంగ పడవలసిన యయ్యవారు నాభార్యను రక్షింపరా యనిమాలవైద్యుని కాళ్లపైఁ బడుచున్నాడు. ప్రమాదమున నైనను రామనామ ముచ్చరించుట లేదు. అంతటితో నాగినఁ గొంతమంచిదే "పనికిమాలిన ప్రపంచము, ఎంతసేపు పుణ్యాత్ములకే చిక్కులు. భక్తులకే బాధలు. ఏమిలో కము? ఏమి దేవుండు? ఉన్నాండో లేఁడో కూడను ఉండిచేయుచున్న సౌభాగ్య మిదియే కాదా? కరుణాళుc డట! ఆపద్రక్షకుడట. చెప్పిననానిని, వినినవానిని గూడఁ జెప్పదీసి కొని తన్నవలయును. ఏదో సుఖముగా జీవనము జరుగుటకేకదా యిన్నిపూజ లొనర్చితిని. నేఁ జేసిన పూజలన్నియు బుగ్గియై పోయినవా? ఎన్ని దివ్యదేశములు సేవించితిని! ఎంతడబ్బు తగులఁ బెట్టితిని! ఇచ్చిన యావులు, చేసిన సత్కారములు, పెట్టిన నైవేద్యము లన్నియు దిగమ్రింగి, తీర పని వచ్చినప్పడు మొండిచేయి చూపుటా? కనబడినాడుకాఁడు కాని యీడ్చి సాగదీసి....... ' యని యయ్యవారు పలుకుచున్నాఁడు. నాస్తికతయింత కంటె సహస్రగుణములు మంచిది కాదా? పశుత్వమే యింతకంటెఁ బ్రశస్తతరము కాదా? శ్రీరామ కృష్ణపరమహంసగా రిట్టి వారిని జిలుకతోఁ బోల్చినారు. దోరజామిపండు కడుపునిండం దిని, కొబ్బెరచిప్పలో నీరు ద్రావి, పంజరమున నడ్డుగనున్న యినుపశలాక పైఁ గూరుచుండి 'అఖిలజగన్నాయకా! అపన్ని వారకా! జగచ్చక్రవర్తీ జగన్నాథమూర్తీ' యని ముద్దులొలుకc బలుకును. పంజరమునొద్దకుఁ బిల్లి వచ్చి దానితోఁక గ్రహింపఁ బోవఁగ జగచ్చక్రవర్తి లేఁడు, జగన్నాథమూర్తి లేఁడు. కేరుకేరున నొక్కపెట్టునఁ గూయుచు విలవిల కొట్టుకొనును. నోటితుంపరకు మనస్సున కెంత సంబంధ మున్నదో, యిట్టి వారి హరినామస్మరణమునకు నాత్మకు నంత సంబంధ మున్నది. వీరిల్గొనర్చు హరినామస్మరణము, దేవతార్చనము మొదలగునవి భక్తితో సంబంధించిన వేమాత్రము గావు. ఆడుపిల్లలు కాగితాల యిండ్డు కట్టుకొని యాడుకొన్న మగండు పెండ్లామాటలకు శృంగారరసముతో నెంత సంబంధ మున్నదో, వీరి బొమ్మలదుకాణమునకు భక్తిరసముతో నంత సంబంధ మున్నది. ఇవి కర్మముతో సంబంధించినవి మాత్రమే యగును. సుఖము సిద్దించినయెడల నొడలు తెలియక తెయితక్కలాడుట, కష్టములు సంభవించినయెడల నెత్తి నోరు కొట్టుకొని యేడ్చుట భక్తుని లకణమా? భక్తుcడు సుఖదుఃఖముcడు కాcడా?

శ్లో. అద్వేష్ట్వా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ,
నిర్మమో నిరహంకారస్సమదుఃఖసుఖః కమీ.
సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః,
మయ్యర్పితమనోబుద్ది యో మేభక్తస్సమే ప్రియః.
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంకతి,
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్సమే ప్రియః.
సమశ్శత్రా చమిత్రే చతథా మానావమానయోః,
శీతోష్ణసుఖదుఃఖేషు సమన్సంగవివర్జితః.
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్,
అనికేతః స్థిరమితిర్భక్తిమాన్ మే ప్రియో నరః.

ఈశ్లోకములందు భక్తునిలక్షణములు కొన్ని శ్రీకృష్ణభగవానులు సెలవిచ్చియు న్నారు. సుఖదుఃఖసమత్వము, శత్రుమిత్రభేదశూన్యత, స్తుతినిందాతుల్యత్వము, శుభాశుభ పరిత్యాగము, సంతతసంతుష్టచిత్తత మొదలగునవి భక్తుని లక్షణములని సెలవిచ్చినారు. కాని, యట్టభక్తి యెట్టు కలుగును?

శ్లో. జన్మాంతరసహ ప్రేషు తపోజ్ఞానసమాధిభిః,
నరాణాం క్షీణపాపానాం కృష్లే భక్తి ప్రజాయతే.

అనేక సహస్రజన్మములు తపోజ్ఞాన సమాధులవలన పాపక్షయమైన పిమ్మట నరులకు శ్రీకృష్ణభగవానునియందు భక్తిపుట్టును. అంతకాలమైన పిమ్మట, నంతశ్రమ మొందినపి మ్మట, కృష్ణభక్తి యుదయించునని చెప్పఁబడినది. అది సందుకొట్టి చావకుండ బ్రదికి, బాల్యగండము లన్నియు దాఁటి బ్రదికి, పరిపుష్టినొంది పుష్చించి ఫలించుటకు మలజీయెంత కాలము పట్టునో? ఒక జన్మములో వైయాకరణులము కావచ్చును. తార్కికులము కావచ్చును, వేదాంతులము కావచ్చును; ఇవియన్నియు గూడఁ గావచ్చునుగాని యనేక సహస్రజన్మసంసారమునఁ గాని భక్తి కలుగదు.

భగవంతుఁడు మనల రక్షించి యుద్దరించు ననమాట నిశ్చయమేనా? ఇంకను సందేహ మేమి? ఆయన రక్షించి యుద్దరింపకుండు నెడల నింక రక్షించువాఁ డెవcడు? మృత్యుసంసార సాగరమునుండి యుద్దరించువాఁ డెవcడు?

శ్లో. యేతు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే,
తేషామహం సముద్దర్లా మృత్యుసంసారసాగరాత్
భవామి నచిరాత్పార్ధ మయ్యావేశితచేతసామ్.

అని కృష్ణభగవానులు సెలవిచ్చియున్నారు.

మహాశక్తియున్న యీశ్వరుcడు కాని మనుజుల రక్షింపఁగలఁడా? అందులో నొకరా యిద్దటా? అదిగాక యనేక సహస్రజీవకోటులను రక్షించి యుద్దరింపవలయునే?

శ్లో. శక్లే స్పూపనదత్వాత్ కృపాయోగాచ్చ శాశ్వతాత్
ఈశేశితవ్య సంబంధాత్ అనిదం ప్రథమాదపి
దక్షిష్యత్యనుకూలాన్నః-------

అని పెద్దలు సాయించినారు.

సర్వేశ్వరుఁడు సర్వశక్తిసంపన్నుఁ డగుటచేతనే మనల రక్షింపఁ గలఁడు. భూమిలో . నున్న రాజులు, రాజాధిరాజులు, చక్రవర్తులు మనల రక్షింపఁగలరా? వట్టిమాట. వారే మనలను రక్షించునెడల వారిని రక్షించువాఁడెవcడు? వారికున్న కాంచనరాసు లన్నియు వారికష్టములకే కారణము లగుచున్నవికావా? వారి కున్న సుఖసాధనము లన్నియు వారికి దుఃఖదాయకములే యగుచున్నవి కావా? వారికున్న భోగపరికరము లన్నియు రోగపీడాకర ములే యగుచున్నవి కావా? అందుచే వారికున్న కష్టములు మనకష్టములకంటె శతసహస్రగు ణాధికములై యున్నవి. వా రీకష్టములనుండి విముక్తి నొంద లేక గిజగిజ కొట్టుకొను చుండంగా, వారు మనకేమి చేయగలరు? మనకంటె వారి కనేకములైన విలువగల పదార్దము లున్నవి. మణులరాసు లున్నవి. ఏడంతరువుల మేడ లున్నవి. దాసదాసీజనశతము లున్నారు. అశ్వగజాందోళికాది సంపద లనేకము లున్నవి. కాని మానవ శక్తిలో వారు మనకంటె నెట్టెక్కువ ఘనులు? భగవంతుఁ డట్టివాఁడా? ఆయన దివ్యశక్తిసంపన్నుఁడు. అద్వితీయశక్తి సంపూర్ణుఁడు.

కాని యెంత మహాశక్తినంపన్నుఁ డైనను నాతండు మనల రక్షించు నని యెట్టు నమ్మవచ్చును? ధనవంతుc డైనవాఁ డెల్ల త్యాగి యగుచున్నాడా? విద్యావంతుఁడైనవాఁ డెల్ల గురుం డగుచున్నాడా? ప్రపంచజ్ఞాన మున్నవాడెల్ల కవి యగుచున్నాడా? అప్డే శక్తియున్నవాఁడెల్లరక్షించు నని యేమి నమ్మకము? శక్తిని రక్షణకార్యమునకై ప్రోత్సహించు గుణ మొక్కటి దానివెనుక నుండవలయును. ప్రపంచజ్ఞాన మున్నవాc డెల్ల కవి యగుట లేదు. అజ్ఞానమును చిత్రవిచిత్రముగ లోకసమ్మోహనకరముగ నుపయోగపఱచుటకు సమర్డయైన నవనవోన్మేషశాలిని యగు ప్రతిభ దానివెనుక నుండవలయును. అట్టే భగవం తుడు తనశక్తి జూపుటకుఁ బ్రేరణ సేయఁగల యేగుణము దానివెనుక నున్నది? లేదా ఇదిగో " కృపాయోగాచ్చ శాశ్వతాత్" అని శ్లోకమున లేదా? ఓ! కృపగలశక్తిమంతుఁడు రక్షించుట కడ్డేమి? అందులో శాశ్వతమైన కృపయే. ఈదినమున నిల్చి రేపు మాయ మగునది కాదే? ఎందఱ నెంతకాలము రక్షించినను దరుగునది కాదే? అందుచే నాతండు మనల రక్షించుట నిశ్చయము.

కాని ఆతఁ డెవరు? మన మెవ్వరము? మనల నాతండేల రక్షింపవలయును? ప్రపంచమున శక్తిమంతులు, కరుణాళురు నందఱను రక్షించుచున్నారా? ' రష్యాచక్రవర్తి యిక్కడివారిని రక్షించుటకుఁ బూనుకొనునా" అని యన నక్కఱలేదు. అట్టిసందేహ మనావశ్యకము, రక్షించుట కట్టిసంబంధముగూడ నున్నది. అది యొప్ప డారంభమైనదో యెరుఁగనంతపురాతనమైయున్నది. ఆసంబంధమేది? ఈశేశితవ్య సంబంధ మని శ్లోకమున చెప్పఁబడినదికాదా? ఇంక నేమి?

కాని మఱియొకటి యున్నది. “రక్షిష్యత్యనుకూలాన్న" అని శ్లోకమున చెప్పఁబడి నది. అనుకూలురమైన మనలను రక్షింపcగలడట. ఈయనుకూలత్వము మనగుణము. మన మెట్టుండిన నాతని కనుకూలురమై యుందుమో రవంత తెలిసికొనవలసియున్నది.

భగవంతుcడు మనల రక్షాపేక్షను ప్రతీక్షించును. “పరమేశ్వరుడా! రక్షింపు" మని మన మెప్ప డైన నాతనిఁ గోరుదుమా, అట్టి కోరిక తనచెవి నెప్పడైనఁ బడునా యని యాపన్న రక్షణార్ధమై దయా సముద్రుఁడగు భగవంతుcడు వేచియుండునcట. ఆమాత్రపు మాటయైన మననోటినుండి వెడలదే! అమాటలు నోట వెడలుచున్న కొందరి కామాటలు నాల్క చివరనుండి వచ్చినవి కాని మనస్సునుండి వచ్చినవికావు. అట్టి శుష్కవాక్యము లక్క ఆకు రావు. ఆధ్రమైన మనస్సుతో, విశ్వాసపూర్ణమైన మనస్సుతో, దృఢనిశ్చితమగు మనస్సుతో, ననన్యగతికమైన మనస్సుతో, స్వరక్షణతత్పరతాశూన్యమైన మనస్సుతో, నియతేంద్రియులమై, కేవలభగవద్విషయక ప్రవృత్తి కల మనస్సుతో, 'బరమేశ్వరుcడా! నన్నుద్దరింపవా" యని యొక్క త్రుటి కాలము ధ్యానించిన నైన నాశక్తిమంతుఁడు, ఆదయాసముద్రుcడు మనల రక్షించి తీరును. మన మట్టిచిత్తశుద్ది, చిత్తదార్డ్యముఁ గలిగి యున్నామా? అట్టే రవంతసేపు స్వప్రయోజకత్వ విశ్వాసము, ఇట్టే రవంతసేపు సర్వేశ్వర చింత ఇందులో నొక్కయడుగు, అందులో నొక్కయడుగు. ఇట్టి సంకరపుబ్రదుకు బ్రదుకుచున్నాము. ఇట్టి యుభయభ్రష్టత్వపుబ్రదుకు బ్రదుకుచున్నాము. క్రొత్తకుండ, ప్రాతతెడ్డు. జగద్రక్షకా! జానకీపతీ యని జ్వరపీడిత యగుసహధర్మ చారిణిరక్షకైయాక్రో శించుచునే యున్నాము. Genaspirin పొట్లములు వేయుచునే యున్నాము. ఉత్తమర్లుఁడు మనయాస్తి నొందుటకై జపు హకుముఁ దీసికొని రాఁగాఁ దహతహచే, శ్రీనివాసా, శ్రియఃపతీ, రక్షింపు మని మొఱపెట్టుకునే యున్నాము. చెంబుతప్పెలయు దొడ్డి దారిని బొరుగింటికిఁ బంపించుచునే యున్నాము. ఈచర్యకర్దమేమైన నున్నదా? ప్రయోజన మేమైన నుండునా? మనకంటెఁ బైవారెవ్వరు నిక్కడ లేకపోవుట చేతను, గొంచెము హెచ్చుతగ్గుగ నందల మొక్కు తరగతిలోనివార మగుటచేతను సరిపోవుచున్నది గాని, దేవతలు మన యీ యసందర్బచర్యలను జూచునెడల వారు పైనుండి మనమొగములపై నుమియుదు రేమో!

మనబుద్దు లెంత, మనశక్తు లెంత, మన ప్రయోజకత లెంత, మన పాండిత్యము లెంత, మనదూరదృష్టు లెంత, మన ప్రయత్నము లెంత? తెలియcదగిన యంశ మేదియు మనకుc దెలియనే తెలియదే. నిజమాలోచింపఁగ మట్టిలోఁ బొరలెడుకీటకములకంటె మనమె ఫ్లెక్కువయో నాకు బోధపడలేదు. ఆహారనిద్రాదులతో నవియు మనముఁ గూడ సమానప్రతి పత్తితోఁ గాలక్షేపము చేయుచున్నాముగాదా? మనుష్యులమై పుట్టినందులకు, సృష్టికిఁ బ్రభుల మని సిగ్గులేక చెప్పకొనుచుండునందులకు, మనకు రవంత యదనముగ నేమైన సుగుణసం పత్తి యుండవలదా? భగవద్భక్తియే మనకు లేకుండునెడల నవియు మనము నొక్కమట్టము లోనివారమే కాదా? (కీటకములకు భక్తియున్నదేమో. మనమెట్టు చెప్పఁగలము' అని సభలోC గేక.) అటులైన మనము, కీటకములకంటె నధమప్రాణుల మనుటకు సందేహమేమి? చేసిన ప్రయత్నము లెన్నెన్నియో భగ్నములై పోవుచున్నవే. ఎంతెంత ప్రయత్నములో చేయుచున్నామే. ఎన్నెన్ని యాసలోఁ బెట్టుకొనుచున్నామే. ఫలము నందఁగలుగుచు న్నామా? రామపట్టాభిషేకమునకు దశరథుc డెంతగాఁ బ్రయత్నించినాఁడు! వసిష్ణుఁ డంతవాఁడు సుముహుర్త ముంచినాఁడే. శ్రీరామచంద్రునిహస్తమున కామహర్షి పట్టాభిషేక కంకణముc గట్టినాఁడే అన్నియు సిద్దము చేయcబడినవే. సీతారాము లుపవాసముచేసి రాత్రి జాగరముఁగూడ జేసిరే. మందుకొట్టంటుకొన్నట్లంతయు టప్పన నొక్కసారి యెగిరిపో యెనే. పట్టాభిషేకము లేదు సరికదా, పైఁగఁ బదునాలుగేండ్డు వనవాసమా? అప్పడు శ్రీరామచంద్రుఁడు జనుల కేమి బోధించెనో విందురా!

గీ. జనులయత్నంబు లేపాటి శక్తిగలవొ
బుద్దు లేపాటి ఘనములో బొమ్మలైన
నరుల నాడించు నది యేదొ నావిచిత్ర
పట్టమును గాంచి తెలిసికో వలయు జనులు
ఐహికము లశాశ్వతములె నందు మనుజు
లంద తెరిఁeకినయంశమే యంద తెపుడు
మలచుసంగతి యది యుండె మఱవకుండ
నాచరించెడివాఁడె జ్ఞా నాధికుండు
ఘనతరంగాహతాంగంబు కల్గి కరము
నెత్తి నది దాcటుకరివోలె నెన్నియాప
దలు సుఖమును గదల్చిన విరనదూర్ద్వ
దృజ్మనస్కుcడౌ నరుఁ డు త్తరించు భవము.

నాయనలారా! ఇవి మనకు బుద్దిరాదగిన మాటలేకావా? ఎంత సేపు నధోదృష్టియే మైన, యపకారమైన బంధము లేని యితర దేశీయులు స్వతంత్రులై, జ్ఞానసంపన్నులై, సౌఖ్యవంతులై సర్వజనసములైకాలక్షేపము చేయుచున్నారనియు, నిది మనచేతి కరదండ ములుగ, గాళ్ళకు సంకెలగ, గంటికి గంతలుగ, మనస్సునకు దిగపీఁకుడుగ నుండుటచే మన మొదుగు బొదుగులేక, శరీరమున నల్పులమై, జ్ఞానమున నంధులమై, కార్యమునఁ గాతరులమై, చిత్తమున బానిసలమై యున్నామనియు, నీపిశాచమునుండి యెంతత్వరగ విముక్తినొందుదుమో యంతత్వరలో మనకు సమస్తజనసోదరత్వమే కాక, సర్వజీవసోదరత్వ మును గ్రహింపఁ గల్గుదు మనియు, నట్లాచరించుటకుఁ దగిన వీర్యము, వెన్నెముక, విదర్హత కలవారమగుదుమనియు, మనదేశమునకు, మనజాతికీ యథార్థముగ మనుజ జన్మమునకుఁ గూడ లాఘవకరమైన, లజ్ఞాకరమైన యీ “నన్ను ముట్టుకొనకుదనపు", బుద్ధిహీనపుపశు ప్రాయపు పేర్పాటెప్పడు పరశురామప్రీతి యగునో యప్పడే మనకు జాత్యైక్యము సంభవిం చుననియు, జాత్యైక్యముతో శరీరపాటవము; శరీరపాటవముతో సౌఖ్యసంపదయు; సౌఖ్యసం పదతోఁ జిత్తవికాసము; చిత్తవికాసముతో బుద్ది స్తైర్యము; బుద్ది స్తైర్యముతో నాత్మస్వాతం త్ర్యము సిద్దించు ననియు మన ముపన్యాసపీఠములపై సింహగర్జనము లొనరించుచుండుట లేదా? ఇట్లు జాత్యైక్యసమారిజనసంరంభ మొకవంక జరుగుచునే యున్నది. వేరొకవంక, తూర్పు మంగళ్లకొక్క కాన్పరెన్సు, పడమట మంగళ్ల కొక్క కాన్పరెన్సు, వ్యాసరాయమఠ స్థుల కొక్కటి, కాసలనాటివారికొక్కటి, వేంగినాటివారి కొక్కటి, మెరవీథి తెలగాల కొకటి, పల్లపువీథి తెలగాల కొకటి, సపాదవైష్ణవుల కొక్కటి, నిష్పాదవైష్ణవుల కొక్కటి, పెదమాలపల్లి యాదిద్రావిడుల కొకటి, చినమాలపల్లి యాదిద్రావిడుల కొక్కటి జరుగుచునే యున్నవి. ఒక తెగవారి కట్టుపాటులు వేరొక్క తెగవారి కనిష్టములు పరిపూర్తిగ ననిష్టములు.

గీ. తెల్లరసుద్దకు మరి విభూతికి బడదు
సుద్దముక్కల రెంటికిఁ జక్కయెదురు
పగిలిన విభూతిపండులోఁ బ్రబలతమము
లైనతెగల రెంటికిని షష్ణాష్టకంబు
బొగ్గుదారి బొగ్గుది సుద్దబూడిదలకు
దాని కెప్పడు నైధనతారవరుస
అరవలకు నాంధ్రులకు గ్రుద్దులాటుధాటి
పైcగ బ్రాహ్మణాల్రాహ్మణభండనంబు.

సభావేదికలపై సామరస్యము, గృహాంతరముల గ్రుద్దులాట, పలుకులలో మిత్రత, పనిలో శత్రుత, బోధనములో భూతదయ, ఆచరణలోc గత్తికోఁత.

(ఆతcడొక్క త్రుటికాల మాంగి గొంతు నవరించుకొని నావంక జూచెను. ఈతడు పిచ్చివాఁడువలె మాటలాడుట లేదే యని నేను మనస్సున ననుకొంటని. ఆంతలో నాతండు తిరుగ నారంభించినాcడు.)

ఇంతటితో సరిపోయినదా: ఊహు మరియొకచోటనె ట్టుపన్యసించుచున్నారు? 'బెడ్డవ్రేట్లను సహించి రేగుచెట్లు మనకుc దీయని ఫలము లిచ్చుచున్నవి. పట్టులేక గాలిలో సర్వశ్రమములఁ బొంది యల్గాడుచు మేఘములు మనకు సుధాసన్నిభములైననీరము లిచ్చుచున్నవి. కత్తికోఁతను సహించుచు మేకలు మన కాహార మిచ్చుచున్నది. తమగడ్డి మెఱసినంతలో వచ్చి యెగిరి గజేంద్రునిఁ బండ్లతోఁ బీకినది. ఆతడు దానిని దంతములతో ధట్టించినాఁడు. ఇది ముందు లాగ, నతఁడు వెనుక కీడ్వ, నది మీది కెగుర, నతఁడు తప్పించుకొన, నది కఱవ, నిత్తండు కొమ్ములతోఁ గొట్ట నిట్లు సహస్రదివ్యవర్షములు గజేంద్రమకరేంద్రులు హోరాహోరిగcబోరాడ గజేంద్రునకు బలము క్షీణించెను. మొసలి డస్సియు స్థానబలముచేఁ బటిష్టమై యుండెను. మొసలి ముందునకు లాగుచున్నది. నీరసించిన గజేంద్రుఁడు వెనుకకుఁ బోవ గింజుకొనుచున్న వా డైనను మొసలిలాగిన ముందునకుఁ బోవుచున్నాఁడు. గజేంద్రునకుఁ గాళ్లు పూర్తిగ మునిఁగిపోయెను. మొనలి యింకను ముందున కాకర్షించుచున్నది. గజేంద్రుడు బలహీనుఁడయ్యును నింక మొరా యించి వెనుకకుc దగ్గుచునే యున్నాcడు. గజేంద్రునిశరీర మంతయు నీట మునిఁగినది. ఈదంగలిగినను నాతనికిఁ గాళ్లు తేలిపోవుచున్నవి. ఇంతలోఁ దలకూడ మునిఁగినదీ. తుండమునకుc జివరనున్న ముక్కఱములు మాత్రము నీటిమట్టమున కొక్కడుగు పైను న్నవి. ఇంక నొక్క యీడ్పుతో సరి యన్నట్టున్నది, అప్పడు.

శో. పరమాపదమాపన్నో మనసా చింతయద్దరిం
సతు నాగవర శ్రీమాన్ నారాయణపరాయణః.

సర్వకణప్రయత్నమును బూర్తిగ విడుచుకొని నారాయణపరాయణుఁడై శ్రీమంతుఁడైన గజేంద్రుండు పరమాపన్నత నొంది శ్రీహరి మనసారధ్యానించెను. సర్వేంద్రి యములు మనస్సు బుద్ది యాత్మయుc బరమేశ్వరునియందు లీనమొనర్చి యొక్క కణకాలము ధ్యానింపఁగఁ దనపుట్ట మునిగిపోయినట్టు, తనకొంప గూలి నట్టు లొక్కయె గురున

మ. సిరికిం జెప్పఁడు శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపఁ డే
పరివారంబును జీరc డభ్రగడతిం బన్నింపఁ డాకర్ణికాం
తరధమ్మిల్లము చక్క నొత్తండు వివాదప్రోద్దతశ్రీకుచో
పరిచేలాంచలమైన మీడcడు గజ ప్రాణవనోత్సాహియై.

అట్టి మహావిష్ణువు ప్రత్యకమై గజేంద్రుని రక్షించెను.

మరియొక యుదాహరణము చెప్పెదను. ఏకవస్త్రయైన ద్రౌపదిని దుశ్శాసనుడు కబరీవికర్షణ మొనర్చి సభలోని కీడ్చి తెచ్చి యా మహాపతివ్రత వస్త్రము నొలుచున్నాడు. అతcడు పైట లాగుచున్నప్పడు కత్తెరమాదిరిగ నీమెచేతు లడ్డుపెట్టుకొనుచున్నది. ఆత డీమెచేతు లూడిపోవునట్టు చెఱఁగు గట్టిగ లాగుచున్నాఁడు. ఈమె వంగుచున్నది. ఇంకను లాగcబోవఁగ ముడుcచుకొని కూరుచుండుచున్నది. కొప్పపట్టుకొని యామె నాతండు పైకి లేవదీయంగ, నొకచేతితో శిరోజములు పట్టుకొని, యెుకచేతిని జందెముమాదిరి వక్షమునం దుంచుకొని, యొకతోడపై రెండవతొడ హత్తించి, రవంత వంగియున్నది. మానరక్షణమున కెన్నిపాటులైనఁ బడుచున్నది. ప్రక్కకొత్తిగిల్లుచున్నది. గరిగిర తిరుగుచు న్నది. ఏమిచేసినను మహాపాపాత్ముఁ డగు నాతండు తనదు ప్ర్పయత్నమును మానలేదు. మానప్రాణము నొక్కసారి యిఁక నొక్కపావుగడియలోఁ బోవునని నిశ్చయించుకొని, స్వరక్షణ ప్రయత్నమున లాభములేదని పూర్తిగ గ్రహించి, దానిని బరిత్యజించి, రెండు చేతులు ప్రక్కను వ్రేలాడుచుండునెడలఁ బ్రమాదవశమున మానరక్షణ ప్రయత్నముచేసికొనcబ్రయత్నించుట సిద్దించునేమో యని భయపడినదియై, రెండుచేతులు పైకెత్తి మానభంగచింత లేశము లేనిదియై, “శంఖచక్రపాణీ!" యని మహార్తితో నాక్రోశించిన ప్పడు కదా శ్రీకృష్ణభగవానుఁ డామె నుద్దరించుట సిద్దించినది! ఆపన్న రక్షకై శంఖచక్ర ములు చేతుల ధరించిన నీవు నన్నిప్పడు రక్షింపకయే పోవునెడల నీచేతులనున్న శంఖచక్ర ములు నాచేతుల గాజులవంటివేయని తెల్పుటకుఁ జేతులు పై కామె యెత్తినదని బుద్దిమంతు లగు వ్యాఖ్యాతలు చమత్కరించిరి.

నాయనలారా! దృఢచిత్తము మాత్రము మన కుండవలయును. దృఢచిత్తుడు కానివాడిహమునకుc బనికిరాడు; పరమున కంతకంటె బనికిరాడు. భగవత్కరుణ యందు, భగవద్రక్షణశక్తియందు బరిపూర్ణమగు విశ్వాస ముంపవలయును, నిశ్చలవిశ్వాస మున్నవా డెన్నఁడు చెడియుండలేదు. అవిశ్వాసి యెన్నఁడు బాగుపడలేదు. “సంశయా త్మావినశ్యతి' యనుమాట నిశ్చయము. శ్రీకృష్ణభగవానుcడు పరమదయాళుcడై ప్రాణిలో కమున దరింపఁ జేయుటకై ప్రపంచమున కంతకుఁ గటాక్షించిన భగవద్గీతయందు దేజోమయములగు నక్షరములతో నిట్టున్నది.

శ్లో. మయ్యేవ మన ఆధత్స్వమయి బుద్దిం నివేశయ,
నివసిష్యసి మయ్యేవ-అత ఊర్ద్వం న సంశయః

సెబాన్! ఇంతకంటెఁ గావలసినదేమి? “నీబుద్దిని, నీమనస్సును నాయందే నిరంతర ముగ నుంపుము. నీవు నిస్సంశయముగా నాయందు నివసింపఁగలవు" అని భగవంతుc డానతిచ్చినాఁడే, సమస్త కష్టభూయిష్టమైన ప్రపంచనివాసమును వదలి సచ్చిదానందమయ తత్త్వమున శాశ్వతముగా నివసించుటకంటె జన్మమునకుఁ గావలసిన దేమి?

ఒకవేళ మనస్సును, బుద్దిని నాతనియందే నిరంతరముగ మనము నిలుపలేకపోవునె డల నేమి చేయవలసినదను సందేహము మనకుఁ గలుగునేమో యని తా నెంచి,

శో. అథ చిత్తం సమాధాతుం నక్నోషిమయి స్థిరం,
అభ్యాసయోగేన తతో మామిచ్చాపుం ధనంజయ.

అని సెలవిచ్చినారు. అట్టభ్యసించుటగూడ మనకుఁ గష్టమగునేమో యని,

శ్లో, అభ్యాసే ప్యసమర్గోసి మత్కర్మపరమో భవ,
మదర్ణ మపి కర్మాణి కుర్వన్ సిద్దిమవాప్స్యసి.

అట్లు తననిమిత్తమై కర్మములుగూడ మనము చేయలేకుండు నెడల.

శ్లో, అదైవ మప్యశక్తోసి కర్తం మద్యోగమాత్రిత,
సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్.

అని సెలవిచ్చిరి. మనము చేయు సర్వకర్మముల ఫలములుకూడఁ గృష్ణార్పణ మొనర్పవలయును. కర్మఫలత్యాగముకూడ మనకు మహాకష్టమనుట నిశ్చయమే. దమ్మిడి నిచ్చి క్రొత్తడబ్బు లాగఁజూచుచున్న మనము, గోచి నిచ్చి గొంగళిని గ్రహింపఁ జూచుచున్న మనము, చేసిన కర్మములఫలము త్యాగ మొనర్పఁగలమా? అందు అకంతస్వార్థపరిత్యాగ ముండవలయును? ఎంతవాఁ డంత పని చేయవలయును? అది గాక సర్వకర్మములఫలము త్యాగ మొనర్పవలయు నని మనము నిశ్చయించు కొనునెడల నొకవిషయముమాత్ర మున్నది; మనకు దుష్కర్మము లన్నియు నొక్కసారి కట్టుపడును. వ్యభిచరించి కృష్ణార్పణ మనంగలమా? అసత్యమాడి కృష్ణార్పణ మనంగలమా? తుట్టతుదకుఁ జుట్టఁగాల్చి కృష్ణార్పణ మనcగలమా? నిష్కామ్యకర్మమును గూర్చి మీ జంఘాలశాస్త్రిగా రిదివర కుపన్యసించియే యున్నారు. అందుచే నింకఁ జెప్పనక్కఱలేదు.

భక్తిమార్గము ప్రకృతి కెంతమాత్రము భిన్నమైన మార్గము కాదు. సహజములైన హృదయరసముల నేమియు శోషింపఁ జేయనక్కఱలేదు. నీభార్యాపుత్రులందు నీకున్న నిశ్చలానురాగ మున్నదే, దానినే భగవంతునిపై బఱపుము. నీ ప్రేమయొక్క గతిమాత్రమే, గమ్యస్థానముమాత్రమే భేదముకాని యంతకంటె భేద మేమియు లేదు. ఒక్కభగవంతుఁడు తక్క నీ వస్తువేదియు లేదని నీవు నిశ్చయముగా నమ్మవలయును. నీయాస్తి భగవంతునిది. నీయాలుబిడ్డలు భగవంతుని వారు. వారు నీయొద్ద భగవంతునిచే నుంపబడినవారు కాని నీవారు కారని నిశ్చయముగా నమ్మవలయును. భగవంతునిపై దృష్టిలేకుండ నొక్క తలఁపైనఁ దలంపకుము; ఒక్కమాటుయైన నాడకుము; ఒక్కపనియైనఁ జేయకుము. అట్టు నిరంతరాభ్యాస మొనర్చునెడల నెప్పటికైన సుగతి నిశ్చయము.

నాయనలారా! చాలసేపు చెప్పితిని. క్షమింపవలయును. శ్లోకములు చదువుచు వాని కర్దములు చెప్పచు బడిపంతులు పిల్లలకుఁ జెప్పినట్టు చెప్పినమాటనే చెప్పితినేమో యని యనుకొనుచున్నాను. నేను మీకు బోధించుటకు రాలేదు. మీకుఁ దెలియని యంశములు కావు. దయ యుంచి వినినందులకు సంతసించుచున్నాను.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.