సాక్షి మూడవ సంపుటం/వీరశైవులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

6. వీరశైవులు

సాక్షి సంఘంలో మతవిషయక ఉపన్యాసాలు దాదాపుగా అన్నీ విష్ణుప్రశంసా ప్రధానాలుగా వుండడం గమనించదగినది. ఈసారి ఒక వీరశైవుడు వచ్చి సాక్షి సంఘసభలో ప్రసంగించాడు. అద్వైతి అయిన జంఘాలశాస్త్రి శివ సంబంధమైన వీరశైవగాధను ఏదీ చెప్పకపోవడానికి తనకు కారణం తెలియదంటూ-అది క్షమింపదగని ఉపేక్ష అన్నాడు. కనక-ఒక శివభక్తుని కథ చెప్పడానికి ఉపక్రమించి-పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణం నుండి కిన్నెర బ్రహ్మయ్య కథ ప్రారంభించాడు.

బ్రహ్మయ్య మహాశివభక్తుడు. ఒకసారి అతను శివనామం గానం చేసుకుంటూ, బసవేశ్వరుడి దర్శనం కోరి బయలుదేరాడు. అతను సంగమేశ్వరం చేరడానికి ముందే బసవేశ్వరుడెదురువచ్చి మన్నించి తన యింటికి తీసుకువెళ్లాడు.

అదే వూళ్లో వున్న త్రిపురాంతక దేవాలయానికి దర్శనం కోసం బ్రహ్మయ్య వెళ్లాడు. అక్కడ బాటవెంట ఒక ’గొర్రె’ మెడకు తాడువేసి లాగుతూ ఒక విటుడు తన ఉంపుడుగత్తె ఆరోగ్యం కోసం బలి ఇవ్వడానికి తీసుకు పోతున్నాడు. అది మెడతాడు తెంపుకుని బ్రహ్మయ్య దగ్గరకు వచ్చి నిలబడింది. కరుణాశీలి అయిన బ్రహ్మయ్య ఆ విటుడికి వెయ్యిమాడ లిచ్చి ఆగొర్రెను కొన్నాడు. దానికి విభూతి రక్ష పెట్టి పంచాక్షరి దాని చెవిలో ఊదాడు.

విటుడు మరో గొర్రెను తీసుకొని వేశ్య ఇంటికివెళ్లి, గొర్రెను మార్చినందుకు తాపులు, తిట్లుతిని, బ్రహ్మయ్య దగ్గరకు వచ్చి తన గొర్రెను తిరిగి ఇమ్మన్నాడు. ఘర్షణ జరిగింది. విటుడు స్పృహ కోల్పోయి మరణించాడు. ఈవార్త చిలవలు పలవలు అల్లుకొని రాజు దగ్గరకు వెళ్లింది. విచారణకు వచ్చిన రాజుకు, త్రిపురాంతకదేవుడి సాక్ష్యంతో కళ్లు విడ్డాయి. మాయ నుంచి బయటపడి బతికిన విటుడు మహాశివభక్తుడయ్యాడు. బసవేశ్వరుడు బ్రహ్మయ్యను ఎంతోమన్నించాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

నాయనలారా! ఒక శివభక్తుఁడు మనసభలో నేఁడుపన్యసించును. అతఁడు లింగధారి. కేవలశైవుఁడు. మిగుల వయస్సు గడచిన వాఁడు. బుద్దిశాలి. ఆతడు మాటలోనే వచ్చుచున్నాఁడు. లేచి నిలువంబడి యా మహాభక్తుని గౌరవింపుఁడు. (అంద ఱట్లొనర్తురు) అయ్యా శంకరభక్తాగ్రణీ! దయచేసి పీఠ మెక్కి యుపన్యసింపుఁడు.

శైవవర్యుని యుపన్యాసము.

శివభక్తులారా! సాక్షిసంఫెూపన్యాసములగూర్చి వినుచునే యున్నాను. ఇదివఱకు జంఘాలశాస్త్రి యనేకోపన్యాసము లిచ్చినాఁడు. జంఘాలశాస్త్రి మాధ్వుడు కాడు. శ్రీవైష్ణవుండు కాడు. అద్వైతియయ్యును హరభక్తినిగూర్చి యుపన్యసించి యుండలేదు. పత్తిక్కొల్లె నాచ్చియారువిశేష ముపన్యసించినాఁడు కాని బసవేశ్వర మహిమమును గూర్చి యుపన్యసించినాఁడా? ధనుర్దాసునికథ చెప్పినాఁడు కాని తేడర దాస్యయ్యకథ చెప్పినాఁడా? భక్తినిగూర్చి చెప్పిన యుపన్యాసములందైనను విష్ణుభక్తినిగూర్చియే చెప్పినాఁడు కాని వీరశైవభక్తినిగూర్చి చెప్పినాడా? శివుఁడు దేవుడు కాడనియా, శివభక్తులు భక్తులు కార నియా? ఆతని యుపేక్షకుఁ గారణమేమో తెలియ జాలకున్నాను. ఏకారణమైననేమి జరుగగూడని యుపేక్ష జరిగినది. క్షమింపఁదగని యుపేక్ష జరిగినది. శివభక్తులారా! ఈసంగతి మీతో మనవిచేసి మీకొక శివభక్తుని కథ నుపన్యసింప వచ్చితిని. సావధానచిత్తులరై వినఁగోరుచున్నాను.

అనంగ ననఁగ నొక వీరశైవుఁడు. ఆతనితల్లి యొవతెయో తెలియదు. తండ్రి యెవఁడో తెలియదు. ఇంటిపే రేదో తెలియదు. అతఁ డేగ్రామనివాసియో యదికూడఁ జెప్ప వీలు లేదు. బొండూరని కొందరు బోడూ రని కొంద ఱందురు. ఆతని పేరుమాత్రము బ్రహ్మయ్య, ఆతడు,

ద్వి.

వీరవ్రతై కనిష్ణారమణుండు-
సారశివాచారపారాయణుండు
లోకైకపూజ్యఁ డలో కానుసారి-
ఏకాంతభక్తి మహిష్టమండనుఁడు
నఘటితనాద విద్యాపండితుండు
నఘవినాశనకారణావతారుండు
విదితకారుణ్యసముదితానురాగ
హృదయుఁడు సర్వజీవదయాపరుండు

నని కవి యాతనిమహామహిమమును గానమొనర్చెను. ఆతఁ డనేకవిద్యల నభ్యసించినవాఁడగుటచే సహస్రవిధముల ధన మార్జించి యంతయును మహేశ్వరమూర్తులకర్పించి వారిని సేవించుచుఁ గాలక్షేపమొనర్చుచుండెను. ధనమంతయు నీరీతి వెచ్చ మొనర్చి క్షయించిన యాతండు శుద్ధినొందిన రసఘటికవలె దేజస్స్వరూపుఁడై వెలింగి పోవుచుఁ గిన్నరను జేతఁబుచ్చుకొని వీథివీథిని గాన మొనర్చుచుండెను.

“ఈశ్వరా! జగదీశ్వరా! పరమేశ్వరా కరుణాకరా' యని యీచ్చైస్స్వరమున మ్రోళ్లు చిగుర్చునట్లు గాలి స్తంభించి వినునట్టు కైలాసాధిపతిని గానమొనర్చునతఁ డాతఁడే మనస్సు నకున్న చెవిచే వినుచున్నారా? మనము వినుట లెక్కయేమి? శంకరభగవానుడంతరిక్షమునఁ బ్రత్యక్షమైయానంద నమున నుప్పొంగుచుఁ గిన్నరబ్రహ్మముఖోర్గత మధుర గీతానుసార తాళానుగుణముగఁ దాండవించుట కుత్సహించి డమరుకమును వాయించుట కుద్యమించుచున్నాఁడే! గజచర్మ పుముడుతలలోఁ దలల నిమిడ్చి, కునుకుచున్న సర్పములు శిరముల నట్లె యదల్చి పడగలువిప్పి, జిహ్వలు ముందునకు ద్రోచి కన్నులు మాత్రమేకాక యొడలంతయు జెవులు చేసికొని వీరశైవుఁడగు బ్రహ్మయ్య గౌరీశ్వరగానమును విని పరవశము లగుచున్నవే! మహేశ్వర జటాజూటస్థ యగు చంద్రరేఖ మహా గాయకగీతామాధురికిఁ జొక్కి చొక్కి అమృతమను పేర నానంద బాష్పములను విడుచుచున్నదే. ఈమహాసన్నివేశమున కనాహూ తులై వీణాధరులైన తుంబురునారదులు విచ్చేసి మహాగానామృతము నందలమున్కలగుటచే నుక్కిరిబిక్కిరియగుచు గ్రుడ్డుస్తంభింప నిశ్చేతనులగుచు నిలువబడినారే! వీరశైవశిఖామణీ! భక్తియనఁగనీ దేయగునుగాక! గాన మనిన నీదే యగునుగాక! జన్మమనఁగ నీదేయగును గాక! మహా దేవుఁడు నీకు బిరుద మిచ్చినాడా! అందుచేతనే కిన్నరబ్రహ్మయ్య వైతివా?

ఆహా! భక్తికి గానమున కెంత చేరువ? భక్తి హృదయమున నంకురింపఁగనే గొంతుక లోని తంత్రులు తమంతతాము, మేళవించుకొని సిద్దముగ నుండునే భక్తి హృదయకోశ మును రవంత సంచలింపఁ జేయ నా యూపుతో రైరై మని భైరవియో, శంకరాభరణమో యాలాపింప నారంభించునే. భక్తి హృదయమునఁ దాండవింప నప్రాపంచికగాన మమృతరంగ ములతో నాకస మంతయు వెల్లివిరియనే! చెట్టు చిగుర్చునే! శిలలు కరగునే! నదులు పొంగునే! అగ్నిజ్వాల లంతరించునే! వాయువు చల్లబడునే భవరోగములన్నియుబటా పంచలైపోవునే! సృష్టియంతము ప్రేమదృష్టిచే నార్ద్ర మగునే?

గానశక్తి లేనివాఁడు గానమునకుఁ జెవి లేనివాఁడు కిరాతహృదయుఁడు, నరఘా తుకుఁడు, జీవద్రోహి యని యొకయాంగ్లేయకవి చెప్పినాఁడు. ఆమాటలు నా కంత నచ్చలేదు. ప్రపంచమున గానశక్తిలేనివాఁడెవఁడు? గానానుభవశక్తిలేని వాఁడెవఁడు? ఒక్కని గానఁ బరుపఁగలరా? కంటికి నచ్చిన కాంతను జూచి కూనురాగము తీయలేని మొద్దుముండ కొడుకెవఁడయిన నున్నాడా? ఈకూనురాగములో గానమున్నదా? లేదా? తుంబురునార దులు పాడినట్టు పాడినగాని గానము కాదా యేమి? ఆడుకోడి నాకర్షించుటకు మగకోడి యెంతచిత్రముగ గానమొనర్చునో వినలేదా? మగకుక్క యాడుకుక్కపై దాట బోవున ప్పడు కుయికుయికుయిమని గాన మొనర్చుచుండుట లేదా? కాలువయొడ్డునఁ బొద లోని కీచురాయి యెందులకుఁ బైస్థాయిలో గానమొనర్చుచున్నది? ఆడుపురుగు నాశ్లేషము నకే కాదా? ఐహికానందరసము ననుభవించుట కేజీవము పనికిరాదో దానికిమాత్రమే గానము లేదు. సుఖదుఃఖముల కధీనముకాని ప్రాణ మొకటియైనఁ బ్రపంచమున నున్నదేమో చెప్పఁగలరా? నిశ్చేతనములకుఁ గూడ సుఖదుఃఖానుభవమున్నదని యిప్పటి ప్రకృతిశాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించుచుండం, జేతనములమాట సందేహింప నేల? ప్రాపంచికానందమువలన గాన ముద్భవించును. పరమేశ్వరానందమువలన గాన ముద్భవించును. రక్తిచే గానముద్భవించును. భక్తిచే గాన ముద్భవించును. సాంసారికానందమువలనఁ గలిగినగానము నిష్ఫలము. గుడిగుడి త్రాగుటచే గలిగిన మబ్బు తెరవంటి కైపుచేఁ బుట్టిన మోతాదైన యానందమున పాదుషాయిాల వేయుట యెట్టిదో పణ్యవనిత తలదువ్వుకొనుచు విటుని వశపఱచుకొంటి నను నానందమున "చిన్నదానరా" యని జావలి పాడుట యట్టిదే. పాదుషాయిాల యెంత ప్రయోజనమో పణ్యవనిత జావళి యంతప్రయోజనము ఐహికానందమును గాన మొనర్పలే నివా రెవ్వరు? ఇట్టిగానము జీవుని మరింత ప్రకృతిబద్ద మొనర్చుటకే పనికివచ్చును. సంసారసాగరమున జీవుని మరింత ముంచుటకే యక్కఱకువచ్చును. గానము లేనివారు క్రూరులు, ద్రోహు లని చెప్ప వలనుపడునా? గాన మొనర్పగలవారు లోకోపకారులై మిడుకుచున్నారా? సాలెపురుగు నాల్గువందలనంబరును మించిన మహాసూక్ష్మ తంతువులచే నిర్మింపఁబడిన తన పద్మవ్యూహపు మహలులోని చంద్రశాలలోఁ దాను గూరుచుండి మధురగీత మాలాపించు టెందులకు? చుట్టుపట్టులనున్న యీఁగల నాకర్షించి మింగుటకే కాదా? ఇది గొంతుకోత గానము కాదా? పాషాణ హృదయుల మధుర గానమున కాసపడి యెంద ఱమాయిక కాంతలు భ్రష్టలైపతితలై ప్రాణములఁ గోలుపోవలేదు? రోముపట్టనము నాల్గుమూల లంటుకొని మండిపోవునప్పడు చక్రవర్తియగు "నీరో" అయ్యయ్యో యని యైన ననెనా? అంతఃపురములోఁ గూరుచుండి ఫిడేలువాయించు కొనుచు హాయిహాయి యనలేదా? ఎందుల కీ గానశక్తి నాదనామక్రియకు సాధుప్రవర్తన కేమి సంబంధము? జంపె తాళమునకు స్వార్థపరిత్యాగమునకు సంబంధమున్నదా? ఐహికగానములవలన నరున కుద్గతి లేదు. సంసారతరణమునకు లోకకల్యాణమునకుఁ గావలసినది భక్తిగానము. రక్తిగానము గానమే. భక్తిగానము గానమే. ఒకటి వేశ్యాజటామండలిలోని గులాబిపూవు. ఒకటి ఈశ్వరజటామండలిలోని గులాబిపూవు. గానము లేనివాఁడు నరఘాతుకుఁడని చెప్పట సమంజసము కాదేమో? భక్తిలేనివాఁ డట్టివాఁడు. నిజముగా నట్టివాఁడు. భక్తులకథలు విని కరఁగనివాఁడువాఁడు. ప్రధానమైనది భక్తి గానము దానికుపలక్షణము. రక్తికిఁగూడ నదియే యుపలక్షణము. ఉపలక్షణమును బ్రధానముగఁ జేసి చెప్పటచే నాంగ్లేయకవిమాటలు నచ్చలే దని చెప్పవలసివచ్చినది. గరళకంఠభక్త శిఖామణిగాథలో గానమునుగూర్చిన తగవులాట చెప్పినందులకు మన్నింపవలెను. మనభక్తాగ్రేసరుఁడగు బ్రహ్మయ్య బసవేశ్వర స్వామిని దర్శింపఁ బాదచారియై పయనమై పోవుచున్నాఁడు. అడుగడుగునకు, హరహరా! అంధకహర! భక్తపాపనంహర! గంగాధర! శశాంకరేఖధర! యని స్మరించుకొనుచుఁ బాడుకొ నుచు నాడు కొనుచుఁ బోవుచుండెను. కాని మనబ్రహ్మయ్యను సంగమేశ్వరమునకు ముందే యెదుర్కొనవచ్చుచున్న యా యలౌకిక తేజోరాశి యొనరు? ఆహాహా! కన్నులు ధన్యము లగున ట్టవలోకించితిరా? మహారణ్యములో నొకమహాజ్వాల రెండవజ్వాలను దరియుచున్న ట్టున్నదే సముద్రమున నొకహిమసౌధము (Iceberg) రెండవ హిమసౌధమును సమీపించు చున్నట్లున్నదే! బ్రహ్మయ్యగారిరాక యాతఁ డెట్టు గ్రహించెనో, స్వచ్ఛాత్మకు స్వచ్ఛాత్మకు నిస్తంత్రీతంత్రవార్తలు జరుగుచుండును గాఁబోలు. ఒకచుక్క రెండవచుక్కకుఁ గన్నుగీటు, నొకయాత్మ రెండవయాత్మకు నన్న చేయకుండునా? కాని యావచ్చు.జ్యోతీరూప మెవరో? ఎవరో-చెప్పమందురా?

ద్వి

"శాశ్వతసర్వజ్ఞ-శశ్వద్గుణాంక-
విశ్వేశ శ్రీగురవే నమో యనుచు
సద్వఃప్రసన్నానవద్య వేదాంత-
వేద్యాత్మ శ్రీగురవే నమో యనుచు

దత్తకైవల్యయుదాత్త సద్భక్త
విత్తేశ శ్రీగురవే నమో యనుచు
నమితపరంజ్యోతి రాకారదివ్య
విమలాంగ శ్రీగురవే నమో యనుచు
స్థిరతరసృష్టిస్థితిలయప్రపంచ
విరహిత శ్రీగురవే నమో యనుచు
సకలనిష్కళచరాచర రూపవిగత
వికృతాంగ శ్రీగురవే నమో యనుచు
నాద్యంతరహిత నిత్యామలతేజ
విద్యాత్మ శ్రీగురవే నమో యనుచు
నధ్వషట్కాతీత యవిపాతకౌఘ
విధ్వంస శ్రీగురవే నమో యనుచు
మోక్షార్థిరక్షణ దక్షకటాక
వీక్షణ శ్రీగురవే నమో యనుచు
నజ్ఞానతిమిరసంహారార్థదత్త
విజ్ఞాన శ్రీగురవే నమో యనుచు
ధన్యాత్మశిష్యమస్తకకృపాహస్త
విన్యాస శ్రీగురవే నమో యనుచు
నఘహరణార్ధ శిష్యజనోపభుక్త
విఘసన శ్రీగురవే నమో యనుచు
నశ్రాంతభక్తజనాత్మాంబుజాత
విశ్రాంత శ్రీగురవే నమో యనుచు
ననఘగురు ప్రసాదామృతహృదయ
వినివాస శ్రీగురవే నమో యనుచు

చెన్నబసవఁ డేమహామహుని నోరార మనసార స్తుతియించెనో యాబసవేశ్వరుఁడే మన కిన్నర బ్రహ్మయ్యకు సాక్షాత్కరించెను. అట్టు ప్రత్యక్షమైన బసవేశ్వరునిఁ జూచి హరహరహర మహాదేవ శంభూ' యని సాష్ట్రాంగదండప్రణామ మాచరించెను. బసవేశ్వరుఁడు కూడ నాభక్తునకుఁ జాఁగిమ్రొక్కి, యనునయించి యతిథిపూజ నాచరించి "సవిశేషతత్త్వా నుభవ భవ్యగోష్టి సలుపుచుఁ దన నిలయమునకుఁ దీసికొనిపోయి యథార్హముగ గౌరవిం చెను.

ఆపురముననున్న త్రిపురాంతక దేవాలయమునకు మహాదేవదర్శనార్థమై బ్రహ్మయ్య వెడలెను. దేవాలయమునెదుట నొకచిత్రము జరుగుచున్నది. ఒక గొఱ్ఱెమెడకుఁ ద్రాడు కట్టి యాత్రాటిని జేతఁబట్టుకొని యొకఁడు దానిని లాగుకొనిపోవుచుండెను. తానుంచు కొన్న వారాంగనకొఱకు దానిని బలి నిచ్చుటకై కొనిపోవుచుండెను. ఉంచుకొన్నదానికై దానిని వధించునెడల నామె యారోగ్యవతియై, యైశ్వర్యవతియై, తనయం దనురాగవతియై యుండునని యాతండు దాని నుత్సాహమున నీడ్చుకొనిపోవుచున్నాడు. కాని యాగొఱ్ఱె యంతవేడుకతో నాతని వెంబడింపఁగలదా? ఉరికంబములయొద్ద కాతని మఱియొక్కఁ డీడ్చుకొనిపోవునెడల నింతయుత్సాహముతో నాతండు నడచునా? చంపుటకై తన్నుఁ దీసికొనిపోవుచున్నాఁ డని యది గ్రహింపకున్నదా? పెంచుకొనువాఁ డెవండో చంపువాఁ డెవఁడో యది యట్టె గ్రహింపఁ గలదే! దానికున్న తెలివికంటె నాతనితెలివి యేమంత హెచ్చు తన తనువును బాడు సేయుచుఁ దనధనము దోచుకొనుచు, వంశమర్యాదను వల్లకాఁడుచేయుచుఁ గీర్తిని భ్రష్టపఱచుచు సర్వవిధములఁ దనగొంతుకోయ సంకల్పించుకొనిన కులటాధనమను దనప్రాణరక్షకదేవతగఁ జూచుకొనుచు, గౌరవించుచు నారాధించు చున్న యీనిర్బాగ్యుఁడు గొఱ్ఱె కంటె నెట్లెక్కువ తెలివిగలవాఁడు? ఆహా! ప్రక్కనే త్రిపురాంతకుండగు మహేశ్వరుని యాలయ మున్నదే మోక్ష ప్రదాతయైన యాదేవతాసార్వ భౌముని పాదపద్మముల నాశ్రయింపక ముఱికితొత్తు పృష్ఠ మాశ్రయించిన బుద్దిహీను నే మనవలయును?

గొఱ్ఱె గుంజుకొనుచు వెనుకకుఁ దగ్గుచున్నది. విటుఁడు హుంకరించుచు ముందునకు లాగుచున్నాఁడు. "బే ఏ ఏ ఏ" యని గొఱ్ఱె యాతనిహృదయము కరఁగునేమో యని యేడ్చుచున్నది. గుడిసెవ్రేటిదాని బుడిబుడిబొల్లి దుఃఖములకుఁ గరఁగిన బొజఁగుల రాయఁడు-ప్రాణోత్ర్కమణసమయమున నోరులేని ప్రకృతి యొనరించిన యమాయక మైన యార్తిపూర్ణమైన యాక్రోశమునకుఁ గరగుఁటే! పరీక్షించుటకుఁ గన్నున్నయెడలఁ దెలిసికొ నుటకు మనసున్న యెడల నజ్ఞమగు జంతు ప్రపంచముతోడనే కాదు, దూరమని మనమను కొనుచున్న శాఖాప్రపంచముతోఁగూడ మనకున్న సంబంధ మెంతగాఢమో, యెంతనిర్భేద్యమో యెంతయన్యోన్యాభివృద్ధికరమో కొంతయైన గ్రహింపవచ్చును.

త్రాడుతైంపుకొని గొఱ్ఱె దేవాలయములోఁ దూఱినది. అటు బ్రహ్మయ్యగారిచేతిలో మూతిపెట్టి నిలువఁబడినది. సెబాస్! చతుష్పాదమా! నీవు ధన్యజన్మమవు. ప్రాణప్రయాణసమయమున నీకుఁ బరమేశ్వరదర్శన మైనది. గొఱ్ఱెవయ్యును. బ్రహ్మయ్యగారి వ్రేలనున్న నందికేశ్వరునిమూర్కొనుచున్నావు. శంకరభక్తుఁడెవండో సానిమగఁడెవఁడో కనిపెట్టుటకు మీజాతి కెంత తెలివియున్నది! అతని యొద్ద హాయిగ నిలువఁబడితిని. ఇతనిని వదల్చుకొనుదాఁక తహతహ లాడితిని! తుద కితనిత్రాడు త్రెంపితివి. ఓవిటాధమా! నీవెప్పు డీయాలయములోనికిఁ బోవలేదు కదా! గొఱ్ఱెను దెచ్చుకొనుటకై యిప్పడు పోఁదలఁచి తివా? త్రిపురాంతకదర్శనమువలన నీకు లభింపవలసినది గొఱ్ఱె బొచ్చా! ఆగొఱ్ఱెను దెచ్చు కొని నీఱంకులాడిమొగమునకు దిగదుడిచి చంపుదావా? నీపుణ్య మేమనవచ్చును? అదిగో యాతఁడు గుడిలోనికి రాఁబోవుచున్నాఁడు. బ్రహ్మయ్యగా రాఁగు మాఁగు మని గద్దించుచు న్నారు. అదరిపడి నిలువఁబడి యాతం డేమనియెనో విందురా? "ఈగొఱ్ఱెనాది. దీనిని నేను గొంటిని. నాసానియారోగ్యార్థమై దీనిని బలి నిడ దానియింటికిఁ దీసికొని పోవుచు న్నాను. నాగొఱ్ఱె ను నా కిటుతోలిపెట్టుము' ఇట్లాతండు పలుక, నాయనా! నేను దీనిలోని కాహ్వానించితినా? నేనేల పొమ్మని తోలిపెట్టుదును? ఇది ప్రాణభీతిచేఁ బరమేశ్వరాలయము చొచ్చినది. దీనిని జంపఁదగదు. ఇది నన్ను శరణు చొచ్చినది. శంకరదాసుఁడ నగు నేను దీనిని వదలను. నీకు దీనికై యెంత సొమ్ము కావలయునో యంతయు నిచ్చెదను. నీ వీగొఱియపై నాశ వదలుకొని పొ" మ్మని బ్రహ్మయ్య బదులు చెప్పెను. “నీకు మతి యున్నదా లేదా? శంకరదాసుఁడ నని చెప్పితివే! ఊరివారిసర్వస్వము నూరక చూఱగొను వారేనా శంకరదాసులు! గొప్పదాసుఁడవే బయలుదేరినావు. నీవంటిదాసుఁ డింకొకఁ డీయూర నున్నయెడల నిఁక సంసారములకు నీళ్లు వదలు కొనవలసినదే కాదా? చాలు చాలు. నా గొఱ్ఱె ను మారుమాటడక తోలిపెట్టెదవా, లేదా?' యని విటుం డఱచెను. “నేను నీగొఱ్ఱైను, హరింపలేదు. ఇది ప్రాణభయార్తయై యిటఁ జేరినది. దీనికి శంకరభగవానునిదర్శన మైనది. దీనివిలువ యెంతయైన సరే యిచ్చెదను. కఠినోక్తులాడక నీకు రావలసినసొమ్మేదియో తీసికొనిపొమ్మని బ్రహ్మయ్యగారు ప్రత్యుత్తర మిచ్చిరి. “అటులైన వేయి మాడ లిచ్చి గొఱ్ఱెను దీసికొమ్మని విటుఁ డర్థాశచేఁ గొంత, యంత విలువ నిచ్చుట కిష్టపడఁ డను నిశ్చయముతోఁ గొంత, పలికెను. భక్తుఁ డాసామ్ము బసవేశ్వరుని యింటినుండి తెప్పించి విటున కిచ్చెను. విటుఁడు తెగినత్రాటితో వేశ్యయింటికిఁ బోయెను.

ఆగొఱ్ఱె నొసట రవంత విభూతి రాచి మెడలో ననఁటితడపతో మారేడుపత్రి గట్టి త్రిశూలముద్రాంగుళీయకముతో దాని కొమ్ముల నడుమ నొచ్చోత్తి ఓన్నమశ్శివాయ, ఓన్నమశ్శివాయ, ఓన్నమశ్శివాయ యని దాని దక్షిణకర్ణమూలమునఁ బంచాక్షరినుపదేశించి శివధ్యానైక తత్పరుఁడై బ్రహ్మయ్య యటనే కూరుచుండెను.

కలకలలాడుచున్న మొగముతో గలగలలాడుచున్న కొంగుముడితోఁ జేత మరియొక గొఱ్ఱెతో విటుఁడు వేశ్యయింటికి సంతసమున దడదడలాడు హృదయముతో వచ్చి మందహాస మొనర్చును. 'నీవెంత దొంగన వ్వేడ్చుచున్నను నీది పనికిమాలిన పేఁడతట్ట ప్రాఁతమొగమే కాదా? కాని యీగొఱ్ఱెది క్రొత్తమొగమై యుండుటకుఁ గారణమేమి?" యని వీఁపుమీఁది తామరను విసరకఱ్ఱతోఁ గోఁకికొనుచు విటకత్తె పలికెను. “ఉండు, తొందరప డెద వేల? ఈదినమున నీవు నన్నెంత మెచ్చుకొను పనిచేసితి ననుకొనుచున్నా' వని, పలుకుచు వేయిమాడల కొంగుమూఁట నామెపాదములయొద్ద బెట్టి విప్పెను. ఆమె యానందించిన దయ్యును రొసరొసలాడుచు 'నీ వెటనైన నీధన దొంగిలించిన దగునెడల నింత బహిరంగముగా నిల్లు ప్రవేశించి యింత వెల్లడియగునట్టు నాయెదుటఁ బెట్టెదవా? ఓరిపనికిమాలినపందా?" యని తిట్టి యిప్పడైనఁ దలుపు మూయుము. దీనిని బ్రాతిపెట్టుదు మని చెప్పఁగ, నాతండు నవ్వి పూర్వవృత్తాంతము నంతయుఁ బూసగ్రుచ్చినట్టు చెప్పెను. 'వేల్పుల కని ముందే దత్తమైన గొఱ్ఱెను జచ్చు వేయిమాడల కమ్మితివా? నిర్భాగ్యపు ముండకొడుకా! నీకు సొమ్మే ప్రధానమా? ఆగొఱ్ఱెకుఁ బ్రతినిధిగ నింకొకదానినిఁ దెచ్చితివా? నీకు బదులుగా నల్వురు ముండకొడుకులను దెచ్చినీయాలిప్రక్కలోఁ బట్టలేక పోయితివా? సిగ్గు మాలినచెనఁటీ నీవు నాగొఱ్ఱెను దేనియెడల నీగొంతు కోసెద"నని యామిండకత్తె మండిపడెను.

“నీయిష్టమెటులో యటులే' యనిపలికి, యామాడల నాతండు తిరుగ మూటకట్టు చుండెను. 'నీవు నామాడల నంటునేల? దుడుకున దుడుకున ముడివైచుకొనుచున్నావా? నీయబ్బసొమ్ము, నీతాతసామ్మను కొంటివా? పో! ఒక్కమాడయైన నీయను. పోయి గొఱ్ఱెను దెమ్ము, కానియెడల గ్రుడ్లూడఁ దీసెదను. గొంతు పిసికి చంపెదను. నాగొఱ్ఱె నమ్మితివా? నీకూఁతు నమ్ముకొనలేకపోయితివా" యని యతనిగుండెపైఁ దనయైదు వ్రేళ్లంటునట్లొక చఱపు చఱచెను.

ఆహా! విటశేఖరా! ఎన్నితిట్లు తినుచుంటివయ్యా! మీయమ్మచే నొకతిట్టు తింటవా? అబ్బచేఁ దింటివా? అన్నమిచ్చి పోషించు నవనీధవునిచేఁ దింటివా? ఇది యొవతె యని తినుచున్నావయ్యా? డబ్బిచ్చితిట్టించుకొనుచున్నావే. మడిమాన్యము లిచ్చితిట్టించుకొను చున్నావే. వెట్టికొలువు చేసి తిట్టించు కొనుచున్నావే! నీవు మనుష్యుడవేనా? మతియున్న వాడవేనా? అహంకారము చంపుకొంటివే, రోసము. చంపుకొంటివే, మానాభిమానములు చంపుకొంటివే! పోనీ, మంచిపనియే జరిగినది. ఇన్నిటిని జంపుకొనినందులకు నీచూపు దుర్గంధ భూయిష్టమై చెప్పుటట్టవలె నున్న సానిమొగమునఁ బఱపుటకంటె సర్వేశ్వరుని పాదారవిందములందు లగ్న మొనర్చునెడలఁ దరింతువే, ఉత్తమగతికిఁ జేరువనుచున్నావు. నిన్ను రక్షించువాఁడు పరమేశ్వరుఁడు తక్క మరియెవ్వఁడు లేఁడు! రా! ఇదిగో పరమేశ్వరా లయము.

ఆహా! అదిగో విటుఁ డాలయమునొద్దకు వచ్చుచున్నాఁడు. తెల్లబారిన మొగముతోఁ దడఁబడుచున్న కాళులతో నంతరంగోద్రేకమున నదరుచున్న పెదవులతోఁ బట్టుదలను వెల్లడించు కన్నులతో భయంకరముగ ముడివడిన బొమలతోఁ జివరలందిత్తడిపొన్నులున్న చేపాటికర్రతో వచ్చుచున్న యారూపము నవలోకించితిరా? చావో బ్రదుకో దుఃఖమో సుఖమో నరకమో స్వర్గమో యేదో యొక్క త్రుటి కాలములోఁ దేలవలయు నను నాగ్రహముతో వచ్చుచున్నట్లు కాన బడుచున్నదా? "నాగొఱ్ఱెను నాకిచ్చెదవా చచ్చెదవా" యని విటుడు భక్తునిమీఁదికి వచ్చుచున్నాఁడు, "వేయిమాడలను దీసికొంటివి కదా! ఇంక నీగొఱ్ఱెయెట్లు ఇది త్రిపురాంతకుని" దని భక్తుఁడు నిమ్మళముగఁ బలికినాఁడు. "నేను దీని నీ కమ్మితినా? నీవు నాకు మాడలిచ్చితివా! దొంగముండకొడుకా! తల పగులగొట్టెదను. ఇచ్చెదవా లేదా" యని కఱ్ఱనెత్తి భక్తునినెత్తిపై వ్రేయ నాతండు చేతనున్న లాఠాముతో దెబ్బను మరలించుకొనెను. చేతనున్న చేపాటికఱ్ఱ దూరమునఁబడఁగ విటుఁడు డబ్బాటున భక్తునిపై గలియఁబడెను. భక్తునిచేతనున్న లాఠాము విటునికణతపైఁ బ్రమాదమునఁ దగులుటచేఁ గాంబోలు విటుఁడు గిజగిజ కొట్టుకొనుచుఁ గ్రిందఁబడెను. ఓన్నమశ్శివాయ యని భక్తుఁడాతని దక్షిణకర్ణమున నుపదేశ మొనరించుచుండఁగ నతఁడు ప్రాణములు విడిచెను.

ఎవడో భక్తుఁడు గ్రామమునకువచ్చినాఁ డనియు నాతఁ డొక గొఱ్ఱెను దొంగిలించె ననియు నది తన దని చెప్పవచ్చిన వానిని జంపి యాతని మూఁటలోనున్న నాల్గువేల మాడలను దీసికొనియె ననియుఁ జంపఁబడినవాఁ డుంచుకొన్న వాని కీతఁ డాసొమ్మిచ్చి దానిని జేరఁదీసె ననియు మరియింక నేమేమోవార్త లూర బ్రబలెను.

ఆ.

అప్రమాణవార్త యానోట నానోట
నిట్టె యిట్టె ప్రాఁకి యెల్లయెడల
వ్యాప్త మగునుగాదె వరుగైన ప్రాఁతతా
టాకుటింటిమీఁద యగ్గివలెనె.

అందులో భక్తులఁగూర్చి కల్గు నపవాదముల వ్యాప్తికి హద్దున్నదా? నీటిమీఁద వైచిననూనెచుక్క కూడ నంతవేగముగ వ్యాపింపదే, కారుచిచ్చుగూడ నంతశీఘ్రముగ వ్యాపింపదే. గాలి కూడ దానివ్యాప్తివేగమునకు జంకునే, పోయిన కొలఁది పోయిన కొలఁది "రెఫల్" దెబ్బవలె నది వలె నది విశాలమగునే. అడుగడుగునకుఁ గొత్త కల్పనలతో నిముసనిముసమునకు నూతన విజృంభణములతో నవనవాలంకారములతోఁ గొమ్మలపై రెమ్మలతో రెమ్మలపైఁ జిలువలతోఁ జిలువలపైఁ బలువలతోఁ బలువలపైఁ జిగుళ్లతో విరిసి విరిసి విజృంభించి పోవునే!

ఆగ్రామప్రభుని కీవార్త తెలిసినది. అత్యంతరహస్యవార్తలే యాతనికిఁ దెలియునప్ప డింత వ్యాప్తి నొందినవార్త తెలియకుండునా?

గీ.

గాలి చొరనట్టి చోటులు గలవు కాని
యతనిచెవిని జేరనిరహస్యములు లేవు
అత్తకోడండ్ర దెప్పలు నాలుమగల
గుసగుసలు నాఁడుబిడ్డల రొసరొసలును
తోడికోడండ్ర వెడవెడకోడిగములు
మొుదలుగా నన్ని సంచారములను గల్గు
ఛిద్రతతి యిట్టె యాతని చెవిని జేరు.
దాసి గదిలోన గాయకుఁ దన్నె ననుచు
గురువుగారింటిలోఁ గల్లుకుండ యనుచుఁ
జెవికొఱుకువారు తార్పుడు సేయువారు
కొంటెకూఁతలవారును గోడెగాండ్రు
బానిసలు రాజమెప్పకై పలుకుచుండ్రు
మొులకతళుకులు బెళుకులు తులకరించు
కలికిపలుకులకులుకుల కవితకంటె
నధికముదమున వినుచుందు రవనిపతులు.

ఆకపటభక్తునిఁ జూచి యథార్థమును దెలిసికొని రమ్మని రాజు తన యుద్యోగిని బంపెను. భక్తుఁడు జరిగినది జరిగినట్టు చెప్పెను. నీకు సాక్షు లెవ్వరని యుద్యోగి యడుగ నీత్రిపురాంతకదేవుఁడే యని యాతఁడు బదులుచెప్పెను. ఈయంశము లుద్యొగివలన రాజు విని పరివారముతో నాలయమునకు వచ్చెను. భక్తుఁ డఁట! సానినుంచుకొన్నాడఁట! నాల్గువేలమాడలు దానికిచ్చినాఁడట! దానివిటుని జంపినాఁడట! అతఁడు నిర్దోషి యని త్రిపురాంతుకుఁడు సాక్ష్యమిచ్చునఁట. ఇంక నూరనున్నవా రాఁగుదురా? ఆబాలగోపాల మటకు వచ్చిరి. భక్తుఁడు జరిగిన వృత్తాంత మంతయు రాజుతో మనవిచేసెను. నీసాక్షిని బిలువుమని రాజు హేళనముగ ననియెను. అభ్యంతరమేమి? ఇదిగో యని 'ఓమ్ హరహరహ రమహాదేవ శంభూ' యని యుచ్చైస్స్వరమున భక్తుఁడు పలుకుసరికి 'ఓ' యని శంకరదేవుఁడు పలికినాఁడు. అయ ప్రాపంచిక నాదస్పూర్తితో భూమియదరినది. సూర్యుఁడు కంపమొందెను. చుక్కలు రాలినవి. గాలి స్తంభించినది. అచ్చట ప్రాణులన్నియు నిశ్చేతనములై పడిపోయినవి. శివభక్తులా! లేదు. ఇద్దరు మాత్రము సచేతనులై శంకరధ్యాన తత్పరులై నిలువఁబడినారు. ఒకఁడు మనభక్తుఁడు బ్రహ్మయ్య. రెండవవా రెవరు? ఎవరా? ఎవనినామ మును స్మరించుటవలనఁ బ్రాణులు మృత్యుసంసారసాగరమునుండి సముద్దరింపఁ బడుదురో యాబసవేశ్వరస్వామియే. ఆయన బ్రహ్మయ్యకు మ్రొక్కి యిట్లు పలికెను.

ద్వి.

సజ్జనశృంగార సత్యగంభీర
యిజ్జగధార యీశ్వరాకార
మంగళగుణధామ మహిమాభిరామ
లింగాభిరూప యభంగ ప్రతాప
నిర్జితాహంకార నిఖిలోపకార
దుర్జనదూర విధూతసంసార
కారుణ్యపాత్ర యకల్మషగాత్ర
వీరవ్రతాచార్య విపరీతశార్య
యంచితాగణ్య నిరంతరపుణ్య
సంచితసుఖీలీల శరణవిలోల
సన్నుతకీర్తి సాక్షాద్రుద్రమూర్తి
కిన్నర బ్రహ్మయ్య కృప సేయుమయ్య.

బ్రహ్మయ్య బసవేశ్వరునకు మ్రొక్కి శంకరభగవాను స్మరించి "హే" యని యుచ్చై స్స్వరమునఁ బలుక సృష్టి యథాక్రమము నొందెను.

ఒక్కగొర్రె కారణముగ గోళములన్నియు వ్యత్యస్తము లైనవే. ఆహా! ప్రపంచమున కపాయము తేఁజాలనంత యధమమై వస్తువున్నదా! సృష్టిలో జరిగిన-జరుగుచున్న మహాందోళనము లన్నిటికిఁ గారణము లరసి చూడ నత్యల్పములై యత్యధమములై కానఁబడునే. పదునెనిమి దక్షౌహిణుల ప్రాణములు తీసిన భారతయుద్దమునకుఁ బ్రథమకారణము పాంచాలీ పరిహాసమేకాదా! గూనిదానికుట్రచేతనే కాదా కుంభకర్ణుఁడు రావణుఁడు చచ్చినది. అయిదు ఖండములందుగూడ నంటుకొనిన మొన్న మొన్నటి మహాహవము ప్రపంచపటమునఁ బల్గేరు కాయయంత ప్రదేశము కొఱకే కాదా?

ఈసంగతికేమి-దేవాలయమునొద్ద మూర్చ నొందినవా రెల్ల లేచిరి. వారితోపాటు గొర్రెకొఱకు ప్రాణముల బాసిన విటుడు కూడ లేచెను. ఇప్పడాతండు విటుడా? మూర్ఛావసరమున బ్రహ్మముఖమునం బంచాకరీమంత్ర ముపదేశ మందిన యాత డింక విటుఁ డగునా? అతఁడు బ్రహ్మయ్యకు సాష్ట్రాంగపడఁగ, నాతని నతఁడు లేవనెత్తి 'నీకు నాకు సర్వ లోకమునకు గురుఁ డీ బసవేశ్వరస్వామి. ఈయనకు మ్రొక్కు మని యాతనికి మ్రొక్కికొంచెను. చెనఁటియైన కులటచేఁ జేబ్రేటుదిన్న యాతని గుండెపై నిప్పడు శ్రీకంఠమూర్తి ప్రకాశించుచున్నాఁడు. ఆతని హృదయోపరిభాగమున వేశ్యయైదువేళ్లట్లం టెనో యాతని హృదయాంతర్భాగమునం బంచాక్షరియట్టంటెను. పైపైనున్న దశాశ్వతము లోలోనిదే శాశ్వతము కాదా? బసవేశ్వరస్శామిని బ్రహ్మయ్యను జయజయ ధ్వానములతో నూరేఁగించి రాజు వారికి సాష్టాంగపడి సెలవుతీసికొని కోటకుఁ బోయెను.

చిత్రమైన యీ గాథ పాల్కురికి సోమనాథకవి ప్రణీతమైన బసవపురాణములోనిది. దానిలో మహావిచిత్రములైన గాథ లనేకమున్నవి. ఈగ్రంథము నూతనముగ దేశోద్ధారక నాగేశ్వరరావుగారిచే నచ్చొత్తింపఁబడి ప్రకటింపఁబడినది. మహేశ్వరభక్తులైన మహామహుల విచిత్రగాథలన్నియుఁ జదివి యాంధ్రసోదరులు తరింతురుగాక!

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.