సాక్షి మూడవ సంపుటం/పురుష ప్రయత్నము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

13. పురుష ప్రయత్నము

పూర్వం ఒకసారి దశావతారాల గురించి ఉపన్యాసం ఇచ్చిన పిచ్చి మనిషిని చూడడానికి, మళ్లీ ఏమైనా చెపితే వినడానికి జంఘాలశాస్త్రి వెళ్లాడు. ఆయన పేరు ముష్టిచిట్టి వీరయ్యశాస్త్రి. అద్వైత విద్వాంసుడు.

పురుషకారం గురించి చెప్పమని జంఘాలశాస్త్రి ఆయన్ని అడిగాడు. అంటే ఈ ప్రపంచంలో స్వతంత్రంగా మనిషి చేసే ప్రయత్న మన్నమాట. దేనిగురించైనా ప్రయత్నాలు చేస్తాడు కదా! ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు.

దీని మీద వీరయ్యశాస్త్రిగారు చెలరేగి మాట్లాడాడు.

ఫలానికి పురుష ప్రయత్నం కావాలంటున్నావు. మళ్లి, అదే పూర్తిగా చాలదు, దైవ ప్రయత్నం తోడుపడాలంటున్నావు. అంటే దైవప్రయత్నానికి క్రింద చోటుగా పద్నాలుగు పాళ్లు పురుష ప్రయత్నం ఉండాలంటూవు! పూర్తిగా పురుషకారాన్నేగా గౌరవించాలి. పూర్తిగా దైవ ప్రయత్నాన్నేగా గౌరవించాలి. రెండింటిని తగల బెడుతున్నావు. పురుష ప్రయత్నం ఏమీ లేకుండా కేవలం దైవప్రయత్నాలేవీ లేవంటావా! పిడుగుపాటు, తుఫాను, భూకంపం వంటి వాటకి కారణం ఎవరి ప్రయత్నం!

ప్రపంచంలో ఒకేఒక్క అద్భుతశక్తి వుంది. అదే సర్వత్రా వ్యాపించి వుంది. మిగతా శక్లే ఇన్నివిధాల బహిర్గతమవుతోంది. అంతా అంధకారం. అంతా ఇంద్రజాలం. అంతా కల. అందులో బుద్ది వున్న వాళ్లమనుకొని స్వభావం కాని ప్రయత్నంతో మనం తిరిగే తిరుగుడు 'నిద్రలో తిరుగా డడం” దీని మీదే మనవాళ్లు సగుణ తంత్రాన్నంతా నిర్మించారు అని -ముగించాడు. మొత్తం మీద “మానవ ప్రయత్నం' అనేది ఒక మిధ్య అని తేల్చాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

నాయనలారా! దశావతారములఁగూర్చి యుపన్యసించిన పిచ్చివానిని జూడ మొన్నను వైద్యశాల కేంగితిని. ఆపిచ్చివాఁడు తనగది వెలుపలఁ గూరుచుండినాడు. నన్నుఁజూడఁగనే నమస్కరించినాఁడు. ఆశీర్వదించి నెమ్మదిగా నున్నదా యని యడిగితిని. రవంత పొడుమి మ్మని సంజ్ఞచేసి చేయి చాంపినాఁడు. నాయొద్ద నస్యము లేదయ్యా యని యంటెని. ఆవలికిం బొమ్మను నట్టాతండు సంజ్ఞచేసినాఁడు. ఏదైన నుపన్యాస మిమ్మని యడిగితిని. పొడుము తీసికొనివచ్చి మరిమాట లాడవోయి పూల్ ఆమాత్రపు పరేంగితజ్ఞాన మక్కఱలేదా? నోరార్చుకొనిపోయినప్ప డక్కలకఱ్ఱ, ముక్కులార్చుకొనిపోయినప్పడు పొడుము, ఇంతకంటెఁ బరమహంసక్రియలు మరెక్కడివి? Well get up Right about turn March, left right left right అని యాతండు లేచినాడు గదిలోపలికిఁ బోవునేమో! పోయెనయెడలం దిరుగరాఁడేమో యని భయపడి " అయ్యా! ఇక్కడనే కూర్చుండుడు. ఒక్కనిముసములో నస్యము తెచ్చి యిచ్చెదను. అని పరుగెత్తి నస్యము తెచ్చి యాతని కిచ్చితిని. రా! ఆలాగున దారిలోనికి రా. అంతే! మన మనంగాఁ బ్రజకు గడగడ. ఆమాత్రపుఁ బటుత్వము లేకుండ నన్నికోట్ల జనమును బరిపాలించుట లేదయ్యా. ఇప్పటి ప్రజలు తమంతం దామే పరిపాలించు కొందురట! వెఱ్ఱిముండకొడుకులు! తమంతం దాము తినవచ్చును. తమంతం దాము భార్యయొద్ద బండుకొనవచ్చును. అంతే కాని తమంతం దాము పరిపాలించుకొనుట యేమోయి? మతిలేనిమాట! పరిపాలకుఁడు వేరు. పరిపాలితుడు వేరు. ద్వైతవిష్టాద్వైతము లంగీకరించిన యంశమే కాదా? వారిద్దఱకు భిన్నత్వమే. ఇద్దఱకు తేజస్తిమిర న్యాయమే. తాను తానునై మరియొకడు గూడ నగుట యెట్టు సాధ్యము? ఇందులో నున్న తిరకాసు కనిపెట్టితివా? తన్ను తా నెందులకుఁ బరిపాలన చేసికొనంగూడదు. అది నీవు నాతో వాదింతువా? మాటలాడ వేమి? ఓ! వాదభిక్ష నిచ్చుటకు సిద్దముగా నున్నాము. పెట్టు, నీమాధుకరపు జోలియక్కడం బెట్టు. అదిగో పెట్టుమనంగాను! తన్నుఁ దాను పరిపాలించు కొన్నవాడెంతవాఁడయ్యా? అట్టివాఁడు పాప భూయిష్టమైన భారతదేశమున కర్హుడా? పరమపదమున కర్హుండా? ‘అహందేహో నచాన్యోస్మి, బ్రహ్మైవాహం నశోకభాక్, సచ్చిదా నంద రూపోహం, నిత్యముక్త స్వభావవాన్."

"అయ్యా! అయ్యా! ఈపనికిమాలిన గొడవ నాకెందులకు? ఏదైన విజ్ఞానబోధ మొనర్పఁదగు నంశమునుగూర్చి యుసన్యసింపుము. ఎంతయో ప్రయత్నముచేసి నిన్నుఁ జూడవచ్చితిని" అని నే నంటిని.

తప్ప తప్ప, నన్నుఁ జూచుటకు నీవు ప్రయత్న మొనర్చితివా? నీవు ప్రయత్నము చేయుట! ఓ! ఎంత యహంకారివి! నీకేదైనఁ జేయుటకు స్వాతంత్ర్యమున్నదనుకొనుచు న్నావా? కన్ను లెంతమీఁదికి వచ్చినవి! నీవు నన్నుఁ జూచుటకు గొప్ప ప్రయత్న మొనర్చి తివా? సరే, మాట వరుస కొప్పకొందము. నేను నీకొఱ కేమి ప్రయత్నము చేసితి నని నీవు నాయెదుటికి వచ్చితివయ్యా? నీవైపునఁ బ్రయత్నము కావలసినపని నావైపున నప్రయ త్నముగ నేల యయ్యెను. పరమార్థ మేమనఁగ నిద్దఱవైపునఁగూడ బ్రయత్నమే లేదు. ప్రయత్నము చేసితినని నీయందుఁ గర్తృత్వమును బుద్దిహీనుఁడవై యారోపించుకొనుచు న్నావు. దైవశక్తి మహిమను నమ్మి నేను కిమ్మనకుండ నూరకుంటిని.

"అదేమి? అదేమి? ప్రయత్నము లేకుండ కార్య మెట్టగును? పురుషకార మని వినియుండలేదా' అని నే నంటిని.

పురుషకారమా? స్త్రీకారముకాదేమి? అర్ధములేని మాట లావలికిఁ ద్రోచివేయవోయి! వైష్ణవసంప్రదాయపుఁ జచ్చుమాటల ద్వైతసిద్దినొందినవానియొద్ద నఁటోయి! చిత్రాన్నము ' చిట్టిగారెలు రాగభోగాదులు పవళింపుఁగైంకర్యములు శ్రీపుష్చయోగములు సేవాకాలములు వైష్ణవ మతమున కక్కఱకువచ్చును గాని పరమార్ద నిశ్చయమున కక్కఱకు వచ్చునటోయి.

పదము
దాసురాల రా రమ్మడియేన్ దాసీ నను మనిరే,
భాసురాంగితిరుమంత్రము చెప్పెద పఠన సేయుమనిరే || గోవిందా ||
ముద్రధారణముచేసెద మని పెద్దముసుఁగువైచినారే
ముసుఁగులోననా. హే హే హే!

ఏలాగు? ఆమాత్రపు రక్తి లేకపోయిన తరువాత మత మెందులకోయి? ఏడువను, మొత్తుకొనను! మా శిష్యురాండ్రలోఁ బుణ్యస్త్రీ వితంతు భేదము లేదు.

వితంతుత్వసువాసినీత్వములు బహిరాగతములు కాని వస్తుతత్త్వమున నున్నవి కావు. ఒక్క స్త్రీత్వమే అచ్చాణియైన స్త్రీత్వమే—కమ్మి కలితి లేని స్త్రీత్వమే-స్వయంభువైన తత్త్వము. జ్ఞానులమైన మనకుఁ జేతాళములు పనికిరావు. అందుచేత మనము “సర్వం ఖల్విదంబ్రహ్మం' న్యాయముచేత

అంతటితో నాగవయ్యా! దిక్కుమాలినదోరణిలోఁ బడిపోవుచున్నావు. పురుషప్రయ త్నము పూర్తిగ లేదని చెప్పినావు. ఆసంగతి నిర్ధారణచేయగలవా! వెఱ్ఱధోరణిలోఁ దిరుగబడి బోకుండ నిదానముగ–

ఉండు-అయ్యో-ఉండు మనఁగాను—' అద్వైతశాస్త్ర ప్రవీణుఁ డైనట్టి ముష్టి చిట్టివీర య్యశాస్త్రిగారికి వెఱ్ఱధోరణి పూర్తిగా నశించినది. ఇంక బదునైదుదినములలో వైద్యశాల నుండి యాతండు పోవచ్చును' అని డాక్టరుగాడు మనకిచ్చిన యోగ్యతాపత్ర మాగోడమీద నున్నది. చూచుకో. ఈడాక్టరు గాడిదె కిప్పడు తలతిక్క తీఱినది. నాకు మతిపోలేదు. నాకేవిధమైన జబ్బు లేదురా. నన్ను బాధ పెట్టకురా యని పదునాల్గు సంవత్సరముల నుండి చిలుకకుఁ జెప్పినటు చెప్పచుంటినే వీడు నామాట లక్ష్యపెట్టినాడా! ఉహు! పిచ్చియాసు పత్రి యనంగా, సిచ్చివారి రోగమును కుదుర్చు నాసుపత్రియని యర్ధము కాదు. పిచ్చిడాక్టర్లు గలయాసుపత్రి యని యర్ధము. వా డిచ్చిన యోగ్యతాపత్రమును జూచి నే నేమంటనో యెఱుంగుదువా? నాకుం బిచ్చి లేదని నీవు చెప్పటచేత నీకుఁ బిఛ్చిలేదన్నమాట నామూల మున సిద్ధాంతపడినది. కావునం బిచ్చిడాక్టరు లుండవలసిన వైద్యశాలలో నీవుండ నేల? మన మిద్దఱము కలసియే యావలికిఁ పోదము రమ్మని యంటిని.

"నాకీ సోదె ఏమియు నక్కఱలేదు. పురుషప్రయత్నమునుగూర్చి చెప్పదువా లేదా " యని యంటని.

నన్ను బెదరింతువా? Nonsense, డాక్టరు ముండకొడుకు కొరడాదెబ్బలకు లక్ష్యపె ట్టుని వీరాగ్రేసరుడ నని యెఱుంగవా? ఆపనికి మాలినవాని యోగ్యతాపత్రమును నేను ' గౌరవింతునా? నే నిక్కడనే యుందును. నన్ను వా డేమిచేయునో చూతును. ఈనడుమ నొక్కయత్యంత చిత్రమైన యంశము జరిగినది సుమా.

“నీవిచిత్రాంశము నాకక్కఱలేదు. పురుషప్రయత్నమునుగూర్చి చెప్పదువా పోవు దునా " యని యడిగితిని. బాబూ! నామాట విని యుండుము. ఈయొక్కటిమాత్రము వినుము. అటుపైని నీయిష్టమువచ్చిన యంశముపై B.N.R. పొగబండికూతతో నుపన్యసింతుము. రవంతసేపు బాబూ! శాంతింపుము. ఏమైన దనగా, ఈనడుమ నీడాక్టరు వీథివెంటఁ బోవుచుండంగా నొకయింటిలో నొకయాడుది యేడ్చుచున్నట్టు వినవచ్చెను. ఆతఁడు లోనికిఁ బోయి చూడఁగ నొకముసలి వితంతువు మంచమునొద్ద గూరుచుండి యేడ్చుచుండెను.

సీ. ‘‘అంతంత మొగములై యంతంతఱొమ్ములై
యంతంత యుదరంబు లైన వింత
యాకారములతోడ నేకుముక్కలవలెఁ
బలుచపల్చని వెలవెలలతోడ
నిదురమబ్బులతోడ నిట్టూర్పుబుసతోడ
నీరుపట్టినకాళ్ల బూరతోడ
మెల మెల్ల నెదురీఁత యలపుల సొలపుతో
గాజుకాయలబోలెఁ గానబడుచు

గుత్తుకుత్తను'......చున్న యొక్క చక్కని వ్యక్తి నచ్చటి మంచముపై గాంచెను

“What is the matter” అని వైద్యు డాముసలిదాని నడిగెను. ఏమియుఁ దెలియక యామె మరింత యేడ్చెను. అప్పడా వైద్యుఁడు చేయి చూచి నవమాసస్పూర్తి యైనట్లు ప్రత్యకముగఁ గానఁ బడుచున్న కడుపునకుఁ గుడివైపునఁ జెవిలో నొకగొట్టము పెట్టుకొని రెండునిముసములు నిదానించి "వెంటనే midwife ను బిల్పింపుము. మరేమియు భయము లేదు. ఇది మొదటి కానుపే కాదా! " యని యడిగెను. ఔను నాయనా! ఇది మొదటి కానుపే తరువాత నన్నియు గంగలోఁ గలిసినవి కావా యని తన కానుపులసంగతి చెప్పి మాట లేదు, చూపు లేదు, రక్షింపు మని యాముసలి దాతని కాళులపైనఁ బడి యేడ్చెను. ఒక్కజామునకు delivery అగు ననంగా కొందఱ కిట్టి fits వచ్చును. తొందరలేదు నేను బోయెదను. అని చెప్పి యాతండు పోయెను. హె హె హె ఎంత విచిత్రము! ఎంత విచిత్రము!

"అంత నవ్వెదవేల? ఇందుల నేమి విచిత్రమున్నది. నీ మొగము" అని నే నంటిని.

ఉండవోయి dunce చెప్పచుండఁగా నంత తొందరపడెద వెందులకు? ఆమంచము మీఁద నున్నదని చెప్పబడిన వ్యక్తి మగవాడు కాని యాడుది కాదు. వాడా ముసలిదాని కొడుకు. వాండూరిలోఁ బ్రచురించిన 'శ్రీరామజనన' నాటకములోఁ గౌసల్యపాత్రమును ధరించి, సొమ్ము రాకపోవుటచేత నాటకము మానివైచి చెడద్రాగి యుండుటచేత వేసము తీసివేసి కొనవలయునను జ్ఞానములేక యిట్లు చేరుసరికి మైకము హెచ్చగుటచేత నిశ్చే తనుఁడై మంచముపై బడిపోయెను. చూచితివా పాశ్చాత్యవైద్యులపస! ఇంగ్లండులోఁ గృతార్థుడై వచ్చిన వానిగతి యిది. ఈకీడును బాపుకొనుటకు వీడేమి చేసినాఁడో యెఱుఁగుదువా? కలకత్తాకు వ్రాసి 'కలియుగ ధన్వంతరి" యను బిరుదమును పదుమూఁడు రూపాయలకు వి.పి. గా దెప్పించినాఁడు. భగవదవతారమని చెప్పఁబడి ధన్వంతరి నెట్టవానిని జేసినారు! మతియున్న వాడో, మతిలేనివాఁడో యెఱుఁగని మతిలేని వానిని జేసినారు. గొంగళి పురుగునకుఁ గుక్కకుఁ గ్రోఁతికి స్వభావసిద్దముగఁ దెలిసిన ఫ్రీ పురుషభేద మెరుగని మూఢశిరోమణిని సార్వభౌమునిఁ జేసినారు. జ్ఞానశూన్యు లగువారికి బిరుదము లిచ్చి ప్రాచీనమహావ్యక్తులపరువును బరశురామప్రీతి యొనర్తురా యని వంగదేశ పరిషత్తువారికి నేను తెలియఁ బరుపఁగా

ఈపనికిమాలిన గొడవ నా కెందులయ్యా నే నడిగిన పురుష ప్రయత్నమునుగూర్చి చెప్పమని యంటిని.

సరే-కాచికో! నీవు ప్రయత్నించి, నీయూపిరి తిత్తులలోని కన్సుబుస్సుల నాంపగ లవా? హృదయకోశమునందలి తాళప్రసారమును గట్టివేయఁగలవా? నీవు పుట్టితివిగదా -నీపుట్టుకకు నీ వేమి ప్రయత్న మొనర్చితివో యెఱుఁగుదువా? నీమరణమున కెట్టి ప్రయత్నము చేయదలచియున్నావో? ఎవ్వఁడైన గష్టమును కోరుకొనునా? దారిద్ర్య మును కోరుకొనునా? చెప్పంగలవా? చావు కోరుకొనునా? జీవునకు ప్రధానవాంఛ యేది? స్వసౌఖ్యము. అప్రయత్నముగా భూమిపై బడినది మొద లప్రయత్నముగాఁ గాటలో బడువఱకు సర్వస్థల సర్వకాల సర్వావస్థలయందుఁ జేయు ప్రయత్న మంతయు స్వసౌఖ్యము నకే కాదా? చావు దప్పించు కొనవలయునని పుట్టినది మొదలు ప్రయత్నముఁజేయు జీవుఁడు చావుకొఱకే ప్రయత్నించు చున్నాడు కాదా? చావువంకకే పరుగెత్తుచున్నాఁడు కాదా? ఇంకను బ్రయత్నమని, ఫలమని యేల వెఱ్ఱిపడుదువు? ఇంతకాలమునుండి స్వరాజ్యసంపాద నప్రయత్నము జరుగుచున్నది కదా! ఇప్పటి కేమైనది. మన లెక్క యేమి. భగవానుఁ డైన శ్రీకృష్ణుఁడు కౌరవసభకు సంధి కొఱకుఁబోయి యేమి చేయఁగలిగినాఁడు?

"అయ్యా! చదువుకొననివాఁడు వాదించునట్టు వాదించుచున్నావు. నేను జెప్పిన దే మనగా, ఫల మున్నప్పడు ప్రయత్నముండి తీరవలయును. ప్రయత్న మున్నచోట నెల్లప్పడు ఫలము లేకపోవచ్చును. ఎందుచేత ననగా నెంత పురుషప్రయత్న మున్నను దైవసాహాయ్యము లేనియెడల నాప్రయత్నము ఫలింపదు. పురుషప్రయత్నము పదునాల్గు పాళ్లు, దైవప్రయత్నము రెండుపాళ్లు' అని నేనంటిని.

ఈమాత్రపుబుద్ది యీమాత్రపు జదువు, యీమాత్రపు వాదన శక్తి నాకు నున్నవి. సాక్షి సంఘములోని ప్రథానవావదూకుడ నని కన్నులు నెత్తి మీదికి వచ్చినవి. జాగ్రత్త! ఇక్కడ నే ననుదినము నంతరిక్షమున నవతరించిన యాదిత్యులసభలో నధ్యకుడనై యుపన్యసించుచున్నాను. త్రినేత్రి, సహస్రనేత్రాదులు ప్రత్యకములైన పంచభూతములతోఁ గిక్కురుమనకుండ వినుచున్నారు. నీయుపపాదన మేదో నాకుఁ దెలియకపోలేదు. నాపూర్వ పకవైఖరి నెఱుఁగకుండ మాటలాడుచున్నావు. మొదట నీ వేమంటివి? ఫలమునకుఁ బురుషప్రయత్నము కావలయు నని యంటవి. ఇప్పడే మనుచున్నావు? పురుష ప్రయత్న మునకు దైవప్రయత్నము తోడుపడవలయు ననుచున్నావు. ఎంతపురుషప్రయత్నమున్నను దైవ ప్రయత్నము లేకుండ ఫలము లేదనుచున్నావు. అనంగా దైవప్రయత్నమునకుఁ బదునాల్గు పాళ్లుపురుష ప్రయత్నము బోటుగాఁ గ్రింద నున్నఁగాని ఫలము లేదని నీయభిప్రాయము. గౌరవించినయెడలఁ బూర్తిగాఁ బౌరుషము నైన గౌరవింపుము. లేదేని దైవమునైన గౌరవిం పుము. అట్టు చేయక రెంటిని దగులఁబెట్టుచున్నావు. పురుషప్రయత్నమే లేకుండ గేవలము దైవికము లున్నవా, లేవా? వీథివెంటఁ బోవుచున్న యొకమునలిదానిపై బిడుగుపడినది. ఇది కేవలము దైవిక మందువా? పదునాల్గుపాళ్లు పౌరుషముతో మేళవించిన దైవికమందువా? ఇది దైవికము కానియెడలఁ బిడుగు పాటునకై ప్రయత్నించినవాఁ డెవఁడు? మేఘుడైన ప్రయత్నించె నని చెప్పఁగలవా? పోనీ-ఆవీథి నాముసలిది యాసమయమున బుద్దిపూర్వక ముగా నడచుటచేత దాని చావునకు నారీతిగఁ దానే ప్రయత్నించెనని చెప్పఁగలవా? దైవికము లున్నవని యొప్పకొందువా, లేదా? ఇట్టివే కొన్ని తుపాను, భూకంపము, వహ్నిపర్వతసం క్షోభము మొదలగునవి యున్న వని యొప్పకొనవలయు నని గొణుఁగుకొనుచున్నావా? నీబుద్ది కందని విషయములలో నీశక్తికి మించిన సన్నివేశములలో నత్యద్బుతములై, యనిర్వాచ్యములై యగ్రాహ్యము లగువిషయములతో మాత్రము ముక్కుచు, మూల్గుచు దైవిక మని యొప్పకొని నీచచ్పుచచ్చున్నర కుంటి; గ్రుడ్డి, మూఁగ బుద్దికందిన వంట పెంట గుడ్డగుడుసు వ్యాపారములలో-ఓ చెలరేగి, నాప్రయత్నము పదునాల్గు పాళ్లకు రవంత దైవము తోడుపడునెడల నఖిలైహికకార్యములు నేను చేయఁగల నని వీథులవెంట నోండ్రపెట్టుచు పరగడలు ద్రౌక్కుచుంటివా? నీవింత దైవశక్తి ద్రోహి వగునందులకు నీనాలుక గోయింపవలదా? పోనీ-సాంసారికకృత్యములలో నైన నీ వనునట్టు నీ ప్రయత్నమునకుఁ గృతార్థత కలుగుచున్నదా? నీకళ్యాణమునకు నీవే కన్యాన్వేషణ మొనర్చితివే -జ్యాతిషికపండితుడవైన నీవే జాతకపరీక జేసితివే-నీవేకన్యాపూర్వ సంప్రదాయముల నెల్ల దడవితివే-అది మహాపతివ్రతయగు నని దానిఁ బెండ్లాడితివే- అది చపలయై చెలరేగి, జారులవెంట స్వారిపోవుచున్నదికదా. నీవు పురుషప్రయత్నముచే దాని నాంపఁగలిగితివా? పాపము. నీపదునాల్గుపాళ్ల పురుషప్రయత్నమునకు దైవము రెండుపాళ్లతోఁ దోడుపడకపోవు టచేత నిట్టయిన దని లోలోన నేడ్చుచున్నావా? ఆలాగా? నీభార్య సైయాటలాడుట పరపురుషులకే కాక పరదైవమునకుఁ గూడ నిష్టమే యని యభిప్రాయ పడుచున్నావా? దైవమే యూమెను తప్పుతిరుగుడులలో ద్రిప్పచున్నాడనికూడ నమ్ముచుంటివా? అటులైన నింక నాలస్య మేల? పట్టు-మట్టిగిడిసలవంటి పదునల్వురుముండలను సంపాదించు బారుకొ ట్టులు గట్టి వారి నందు విడియింపుము. నల్గురు తార్పుడుకాండ్రను నియమించు. ఈధనమహా క్షామదినములలో నేడు రూపాయల జీతముపై బి.ఎ. గాడు వచ్చును కాని -యూరూర చాటింపించు పత్రికలలోఁ బ్రకటించు సోదరీ మానవిక్రయమ హనీయుఁడవై కోటీశ్వరుఁడవైమానవజాతికంతకు మేటి కిరీటమువలె

చీ! ఆఁగు అంతటితో నాఁగు. నీవాదవైఖరి నాకేమియు బోధ కాలేదు. అంతయు దైవమే యందువా? అటులైనఁ బుణ్య మేమి? పాప మేమి? స్వర్గమేమి? నరక మేమి? బుద్దిస్వాతంత్ర్యమేమి? నడవడి సూటియేమి? జాతీయన్యాయమేమి? మనుష్య విధి యేమి? నాపిండ కూడేమి? నల్లమడు గేమి? బుద్దిహీనుఁడనై నీయొద్దకు వచ్చితిని. నేను బోదును అని నే నంటని.

ఉండవోయి Nonsense ఆగవోయి! Idiot! నీవు బుద్దిహీనుఁడవను మాట సత్యము. నీవే కాదు నీతోడి ప్రజ లందరు బుద్దిహీనులు-బుద్దిహీనుల రగు మీరు బుద్దిమంతు లని బ్రాంతిపడుటచేత మలకింత బుద్దిహీనులు. పశుపక్షి కీటకాదులైన యితర ప్రాణులు మీయంత బుద్దిహీనములు కావు. మీరు చెట్టకంటె బుద్దిహీనులు. చెట్లెదుగుచున్నవా లేదా? ఏ ప్రయత్నముచేసి యెదుగుచున్నవి? ఇంతకు మఱ్ఱిగింజ యెంతో మఱ్ఱిచెట్టు యూరం తయు నూడలతో నాక్రమించుచున్నది కదా! ఏమి ప్రయత్నముచేసి యట్లెదుగుచున్నది. ఏమి ప్రయత్నమొనర్చి చచ్చుచున్నది. తన ప్రయత్న మక్కఱలేదు. ఇతరుల ప్రయత్నలేశ మైన నున్నదా. దానిలోని పురుగులు నీళ్లలోనిపురుగులు ఏమి ప్రయత్నమొనర్చి జీవించుచు న్నవి? ఏప్రయత్నలోపమునఁ జచ్చు చున్నవి. ఇటులే పైజంతువులకుమాత్ర మేల కాదు? ఏజంతువుకూడ స్వప్రయత్నమునఁ బుట్టదు. ఏజంతువుకూడ స్వప్రయత్నమున నెదుగదు. స్వప్రయత్నమున నశింపదు. ప్రయత్నమే లేదు. ప్రయత్నించుట కుద్దేశమైన లేదు. ప్రయత్నించుటకు స్వతంత్రతయే లేదు.

చూచితివా? ప్రపంచమున నెచ్చటనయిన నత్యద్బుత మయిన శక్తి యవాచ్య మయినశక్తి, యవర్ద్య మయినశక్తి లేని యంగుళము అరయంగుళము అంత వఱకుకూడ నెందులకు? ఒకచుక్కయంత స్థలమయిన లేదు. ప్రమాదవశమున నోటనుండి జారినతుంపర రేపు అట్టాంటిక్కు మహాసముద్రమున నుండి బయలుదేరిన యావిరితోఁ జేరి యమెరికాలోని వర్షముల కాధారము లయిన యబ్దమండలముల కాదికారణమగుచున్నది. ఆశక్తియే చంపించుచున్నది. పుట్టించుచున్నది. పెరిఁగించు చున్నది. త్రిప్పించుచున్నది, తనలోఁ గలుపు కొనుచున్నది. తిరుఁగ దనలోనుండి మరియొకరూపమున మరియొక పరిస్థితిని తీయించుచున్నది. సాగించుచున్నది. మరల గుణించుచున్నది. టప్పమనిపించు చున్నది. ఇంతకంటె మనుష్యష్ఠితి యొక్కువకాదు కాదు కాదు. మనుష్యునికి బుద్దియున్నది కాదా? అందుచేతఁ బ్రయత్నము చేయుచున్నాఁ డని చెప్పదువా? బుద్ది యొక్కడ నుండి మనుజునకు వచ్చినది? పురుగునుండి వచ్చినదా? చెట్టునుండి వచ్చినదా? చేపనుండి వచ్చినదా? మృగమునుండి వచ్చినదా? క్రిందివారి కెవ్వరికిలేని యీతత్త్వము మనుజుని కెటనుండి వచ్చినది? మనుజుఁడితర జంతువులవలెనే బుద్దిహీనుఁడు. మనుజుఁ డక్కడకు వెళ్లినా ననుచున్నాఁడు. ఇక్కడకు వచ్చినా ననుచున్నాఁడు. ఇన్ని గంటలకు భుజించెద ననుచున్నాఁడు. ఇన్నిగంటలకు నిద్రించెద ననుచున్నాఁడు. అక్కడ ననఁగా నేమో, యిక్కడ ననంగా నేమో, గంట అనంగా నేమో, కాలము అనంగా నేమో చెప్పఁగలఁడా? స్థల మనంగా నేమి, కాలమనంగా నేమి, స్థలము కాలము బాహ్యస్తములే యని కొందఱనుచు న్నారు. స్థలమనఁగా నన్నిస్థలము లని కొందరు ఆనుచున్నారు. ఇన్నిస్థలము లెక్కడివి? ఉన్నదొక్కటే స్థలము. అది మనకు వెలుపల లేదనుచున్నారు. ఎక్కడ నున్నదని యడుగ నది మనస్సులోని యభిప్రాయ మనుచున్నారు. ఇక్కడకు తేలినది. కందస్వామియాలయ మునకుఁ గపాలేశ్వరుని యాలయమునకును దూరము మదరాసులోనిది కాదు. నీతలకాయ లోని దనుచున్నారు. ఇటులే కాల మనంగా నన్నికాలము లనుచున్నారు. భూతభవిష్యద్వర్త మానముల భేదము చచ్చినది సరేకదా! పగటిరాత్రి భేదముకూడ భగ్నమైనది. తుట్టతుదకుఁ గాలము కూడ మనస్సులోని యూహయనుచున్నారు. అటు లయిన "ఎక్కడ”కు “ఎప్పడు'కు భేద మే మున్న దని యడుగఁగా లేకపోయిన లేకపోవచ్చు నని యనుచు న్నారు. ఈస్వల్పాంశమునుగూర్చియే మనుజుని యజ్ఞాన మింత గాటమైనప్పడు మనస్సు నుగూర్చి యాత్మనుగూర్చి యడుగ నేల?

మనుజుఁడు మహామందుఁడు! బుద్దియున్న దను బ్రాంతిచేత మలకింత బుద్ది హీనుఁడు. సృష్టినంతయు నాక్రమించిన యద్వితీయశక్తికెండిపోయిన యాకెంతయ ధీనమై చచ్చినట్లు దాని విసరునఁ బోవుచున్నదో మనుజుఁడుకూడ నాయపార శక్తికిఁజచ్చినటులే నెక్కువగ నధీనుఁడై దాని విసరుచే నెగురుచు నేను విలాసముగా విహరించు చున్నానని తన ప్రయత్నమును గొనియాడు కొనుచున్నాఁడు. దాని మరియొక విసరుచేనుత్తరక్షణమున సముద్రతరంగమునఁ బడి చచ్చితి నయ్యో దైవశక్తి నాప్రయత్నమునకుఁ దోడుపడలే దని యేడ్చుచున్నాఁడు.

అద్వితీయమైన యాశక్తిలో ననేకశక్తులు లీనమైయున్నవి. ఒక్కటి పుట్టించుశక్తి యొకటి వృద్దిశక్తి యొకటి కయశక్తి యొకటి వికాసశక్తి యొకటి సంకోచశక్తి యొకటి బహుమానశక్తి యొకటి శిక్షణశక్తి ఒకటి యానందశక్తి యొకటి దుఃఖశక్తి ఇట్లే యనేక కోటుల శక్తులున్నవి. ఇవి యన్నియు వేరుకావు. పరాత్పరుని శక్తి యిన్ని విధములుగా నగుచున్నది. ఆశక్తి కధీనుఁడై సముద్రముమీఁది నురుగువలె, గాలిలోఁ బరమాణువువలె బానిసయై కొట్టుకొనిపోవు మనుజుడు Chance చేత ననుకూలశక్తి విసరులోఁ బడినయెడల గనప్రయోజకత్వమని యెగురుచున్నాడు. ఆ Chance చేతనే యననుకూల శక్తివిసరులోఁ బడినయెడలఁ బ్రారబ్దమని యేడ్చుచున్నాడు. ప్రారబ్దము కాదు. ప్రయోజకత్వము కాదు. మనుజుఁ డస్వతంత్రుడు. అప్రయోజకుడు. మహాశక్తి కధీనుఁడై పోవువాఁడే కాని వేఱు కాదు కాదు.

గీ. కుక్కగొడుగులవలె బుట్టి క్రుంగు మనము
ప్రాక్తనప్రకృతిగతి ప్రవాహ మడ్డు
పఱతుమే? బుద్బుదములట్టు? పైన నూఁగి
యెటనొ టప్పన కుండ బ్రేలుటయె కాక.

గీ. వస్తు యాధార్ద్య మెఱుఁగక వస్తువునకు
నేదొ సంజ్ఞను మనముంచి యెరిఁగినట
లల్లాడుదు మిది యంత యైంద్రజాల
మందు దుముకులాడెడుబొమ్మలాట కాదె?

గీ. స్వప్నమునకంటె స్వప్నమై సత్యముగను
మాయకును మాయ యగుచు నమ్మకము గాంగ
శూన్యములకంటె శూన్యమై సుస్థిరముగఁ
గనఁబడెడు దీని నే మని యనఁగవచ్చు?

అంతయు నంధకారము. ఆ యంధకారములో నింద్రజాలము, అందులో నిద్ర, ఆనిద్రలో స్వప్నము. ఆస్వప్నములో బుద్దిమంతులమనుకొనిచేయునస్వభావప్రయత్నము లచేతఁ గలిగిన Somnambulism (నిద్రలో తిరుగాడుట) ఇట్టి మహాదురవస్థలో నుపన్యా సము లిచ్చు చున్నాము. గ్రంథముల వ్రాయుచున్నాము. అందుచేతనే యవి యన్నియు నొక్క వస్తువునుగూర్చి యైన యథార్డజ్ఞానము నీయకుండ నున్నవి. అన్నియుఁ బరశురామ ప్రీతి కర్దములు. వేసవికాల మైననేమి? వేయ వోయి చలిమంట వేయవోయి! ఇదియే పరమార్ధము. దీని మీదనే మనవారు సగుణతంత్ర మంతయుఁ గట్టినారు. అది యంతయు పట్టి మిథ్య. ఇదియే పరమార్ధము. దీనిఁగూర్చియే చిరకాల మాలోచింపఁగ నాకు మతిపోయిన దని యిచ్చటికిఁ దెచ్చినారు. నే నింటికిఁ బోవుదును. నీవు నాకుఁ బ్రతినిధిగ గదిలోఁ గూర్చుండంగలవా యని యడిగెను.

నే నూరకుండు సరికి Faithless fool అని నన్నుఁ దిట్టి తానే గదిలోనికి పోయెను.

ఇతడు తప్పదారిని బడకుండ కొంతసేపటి నుండి యుపన్యసించుచున్నాడు. పిచ్చి చాలభాగము కుదిరినది. అప్పడప్పడు రవంత కనబడుచున్నది.

ఇతని యుపన్యాసమునుగూర్చి నే నిప్ప డేమియుఁ జెప్పను. ఆలస్య మైనది. క్షమింపవలయును.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.