సాక్షి మూడవ సంపుటం/సాక్షిసంఘ పునరుద్ధారణ
12. సాక్షిసంఘ పునరుద్ధారణ
సాక్షిసంఘాన్ని పునరుద్ధరించే ప్రయత్నం మరోసారి జరుగుతోందని జంఘాలశాస్త్రి చెపుతున్నాడు. ఆంధ్రపత్రికలో సారస్వతానుబంధానికీ, సాక్షికీ అటువంటి సంబంధం ఏర్పడిందనీ, సారస్వతానుబంధం జరుగుతున్నంతకాలం సాక్షి సభలు జరగవలసిందేననీ సాక్షిసంఘం భావిస్తోంది.
గత పది సంవత్సరాలనుండి సాక్షి వృద్ధుడైనప్పటికి కూడ దేశాటనం చేస్తూనే వున్నాడని, రకరకాల ప్రదేశాలు, అక్కడ రకరకాల మనస్తత్త్వాలు పరిశీలిస్తేనే వున్నాడనీ జంఘాలశాస్త్రి చెప్పాడు. ఈమధ్యనే తటస్థించింది. కనక-అక్కడ రకరకాల విభిన్న అంతస్థుల మనుషుల్ని గురించి కూడా మంచిచెడ్డల్ని ముచ్చటించుకునే అవకాశం కొత్తగా ఏర్పడింది.
ఇంకో విశేషం కూడా వుంది. ఇక ఈఉపన్యాసాలు సత్యపురంలో కాక, మద్రాసులో సముద్రతీరంలో జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంకాలం ఉపన్యాసం జరిగి ప్రతి శనివారం సారస్వతానుబంధంలో ప్రచురణ జరుగుతుంది. సముద్రతీరానికి విహారం కోసం వచ్చేవారి సొంత ప్రవృత్తులకీ, వారి కాలక్షేపాలకీ, ప్రలోభాలకీ, ఏ బంధం కాకుండానే ఆరుగంటల లోపలే ముగిసిపోతాయని జంఘాలశాస్తి "హామీ ఇచ్చాడు. ఏ సమయంలో, ఏవి షయం ప్రస్తావనకు వస్తుందోననే నిశ్చల దయతో సారస్వతానుబంధం చూడవలసిందిగా ఆంధ్ర మహాజనానికి శాస్త్రి విజ్ఞప్తి చేస్తున్నాడు.
'సాక్షి’ తమను నడిపే చైతన్యమూర్తి నాయకుడు అనీ, అతని సూచనలను బట్టి తన ఉపన్యాసాలుంటాయనీ జంఘాలశాస్త్రి విన్నవించాడు.
జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.
ఆంధ్రపత్రికలోఁ దిరుగ సారస్వతానుబంధము శ్రీపత్రికాధిపతి ప్రచురించుచున్నం దులకు మహానంద మొందితిని. సారస్వతాను బంధమునకు సాక్షికిఁ గల సంబంధము సర్వాంధ్రలోకమునకు విదతమే. సారస్వతానుబంధ మున్నచోట సాక్షి యున్నాఁ డన్నమా టయే. సారస్వతానుబంధము జరుగుచున్నంతకాలము సాక్షి సభలు జరుగవలసినదే. పై వారమునుండి సాక్షిసభలు మదరాసులో జరుపవలయు నని తలంచు చున్నాము.
కడచిన పదిసంవత్సరములనుండియు, సాక్షి వృద్దు డయ్యును దేశాటన మొనర్చు చునే యున్నాడు. చిత్రవిచిత్ర ప్రదేశము లనేకములు చూచినాఁడు. పురుషులైన స్త్రీలను, స్త్రీలైన పురుషులను, పిల్లలైన పెద్దలను, పెద్దలైన పిల్లలను, ప్రభువులైన దాసులను, దాసులైన ప్రభువులను, భక్తులైన దొంగలను, దొంగలైన భక్తులను, బుద్దిమంతులైన బుద్దిహీనులను, బుద్దిహీనులైన బుద్దిమంతులను మఱియింక నెన్నియో మహావిచిత్ర ప్రకృతులను జూచినాఁడు. ఆతఁడు పాశ్చాత్యదేశములగూడ నీనడుమనే చూచినవా డగుటచేత నచ్చటి ప్రభువుల గూర్చి ప్రజల గూర్చి కవుల గూర్చి గాయకులఁగూర్చి చిత్రలేఖకుల గూర్చి నుపన్యాసము లీయదలచినాడు.
ఈసారి సాక్యుపన్యాసములు మా కారాధనమూర్తి యగు సూర్యభగవానుని సంతతా నుగ్రహవిశేషమున వినోదకరములై విచిత్రతరములై విలక్షణములై యుండునట్టు సోదరులగు మీరాశీర్వదింతురు గాక! ప్రతి శుక్రవార సాయంకాలమున సముద్రతీరమున నీయబడు నుపన్యాసము మఱునాడే ప్రచురణార్హమై యాంధ్రపత్రికకుఁ బంపఁబడును.
కృతి పాడదగినది. కథ యూ కొట్టదగినది. నాటకమాడఁ దగినది. ఉపన్యాసము వినఁదగినది. ఓమదరాసుసోదరులరా! మీ పట్టణమున సుమారైదులకల జన మున్నది. మీలో నేబదివే లైన సముద్రతీరమునకు వచ్చి సాక్ష్యుపన్యాసములు వినుచుండవలయును. మీరు సాధారణముగా సాయంకాలమునందు సముద్రతీరమున కెందులకుఁ బోవుచున్నారో యెవ రెలుగరు? ప్రకృతిసౌందర్య సౌభాగ్యవలోకమునకా? ఊహు-పవనప్రాశనమునకా?-ఊహు -దేహవ్యాయామమునకా? ఊహు -విశ్రాంత్యనుభవ మునకా? ఊహు -గ్రామ్యకవితవలె గడలు త్రోక్కుటకుఁ బోవుచున్నా రని మీరంద ఱెఱుఁగరా? లోక మెఱుగదా-లోకనాథుఁ డెరుగఁడా? నూల్గురలో బనికిమాలిన నిర్బాగ్యులగు నేపదిమందియో తప్ప మిగిలినవారందరు పైతిరుగుడులోని భావకవిత్వమును బ్రత్యక్షము చేసికొనుటకే పోవుచున్నారు కదా? నేనసత్యమాడు చున్నా నని యనుచు న్నారా? ఆడుదాని నైదుదినములు సముద్రతీరమునకు సర్కారువారు రాకుండఁ జేసినయె డల సముద్రతీర మంతయును సహారా యెడారి యైపోవదా? మీ ప్రయోజకత్వమేమున్నది? మిమ్మాకర్షించు యంత్రము లచ్చట నున్నవి. మీ ప్రక్కబారుటగలింపులసొంపులు, మీవంకర చూపుల మెలికలు, మీతస్కరకర సంచాలనముల గగుర్పాటులు, మీ ముద్దుల ముద్రల విద్యుల్ల తలు, మీ దొంగ యాలింగనముల యద్వైతబ్రహ్మానందములు మాయుపన్యాసమైన తరువాతనే ద్విగుణీకృతోత్సాహముతో గానిచ్చుకొననచ్చును. పాపభూయిష్టములైన మీ బ్రదుకు లెంతటివో సాక్షియెఱుంగడా? మీరెంత ధనికులైనను, నెంత యుద్యోగులైనను, నెంత విద్యావంతులైనను, నెంత వర్తకులైనను, నెంత వక్తలైనను మీ కింటియొద్ద సుఖలేశమైన నున్నదా? చూచిన మొగమునే చూచి, ముద్దిడుకొనిన మూతినే ముద్దిడుకొని, పట్టినచేతినే పట్టి, పండుకొనిన ప్రక్కనే పండుకొని రుచిరచి లేని చొప్పదంటు జీలుగు బెండువట్టి గడ్డి సంసారపురోఁతను బడియున్న మీకుఁ బైయింటి తరవాడితోఁ బ్రాణము లేచిరాదా? ఎదుటింటి యయ్యంగారి యమ్మచేతి ప్రసాదము శ్రీమూర్తితీర్ధప్రసాదముకంటెను స్థిరతరానంద ప్రదముకాదా? మీ బ్రదుకుల కంతకును సాయంకాలమున సముద్రతీరమునఁ గప్పగంతులలో నాకర్షణపు టీలలలో గుఱ్ఱపు సకిలింపులలోఁ బొంచి కాచుటలలో నట్టె గ్రహించుటలలో నలికిడి ననుసరించి యిట్టె పరిహరించుటలలో మీకు నిత్య మగుచున్న కాలక్షేపపు గడియలు నాలుగే యథార్థముగఁ గృతార్ధములైనవి. మీజన్మ రాహిత్యమున కెన్నఁటికైన నవియే తోడ్పడును. పురుషులైన మీకు మీసొంత స్త్రీలపై నింతవైరాగ్యము, నవ్యవ్యక్తిపై నింత యనురాగము వంటివె మీ స్త్రీలకు మీయందేల యుండంగూడ దనుజ్ఞానము మీ కున్నయెడల నింత యవకతవ కచర్య కవకాశముండునా? ఉభయపక్షముల వారు రాజీపడి యుందురా యని యనుకొనఁ దగినంత మితి మీఱి యున్నదే. అటులైనఁ జేపలశాల వెనుక నొక పక్షమువారు, మేరీపాఠశాల కెదుట నొకపక్షమువారు, విశాలరంగమునఁ జెఱి యొక వైపున నేకాంక నాటకము లాడుచున్నారా? అట్టి మీమహానంద మున కడ్డురాకుండ మాయుపన్యాసము నాఱు గంటలకు లోపలనే ముగించుకొందుము. మనుష్యత్వము పశుత్వమునకు దిగిపోవునంతవఱకు మీ రానందము ననుభవింపవచ్చును.
ఇట్టి నియమశూన్యత, యిట్టి నిరంకుశత, యిట్టిపనితనము, నిట్టి దిగదీంత, యిట్టికమము, నొక్క మీనీతియందే సిద్దించినవా? దేహశక్తి యందో మనశ్శక్తియందో హృదయశక్తియందో యాత్మశక్తియందో కల్పమునందో గానమునందో చిత్రలేఖనమునం దో-యిప్ప డవియన్నియు నేల? సోదరులారా! ఒక్కటే ప్రార్థన-ఏవిషయమును గూర్చి యొప్ప డేవిసరువచ్చునో చూతమను తలంపుతో మాయందు నిశ్చలదయ గలవా రయి సారస్వతానుబంధమునకై యుత్సాహముతోఁ గనిపెట్టుకొని యుండవలయును. సారస్వతా నుబంధ విజయము మీయాదరణములలో నున్నది. కాని మావంటివారిలో లేదు. సారస్వతా నుబంధ మంత మహాదీప్తితోఁ బ్రకాశించును. మాకధికారి యగు సాక్షియొక్క తత్త్వమును నేను గొంత యెఱిఁన వాంను గావున నిట్టిమాట లనుచున్నాను. నేను గేవలము శక్తిహీనుఁ డను. సాక్షి నాయందలి యనురాగముచేత సూచించు సూచనలనుబట్టి యాకాశమంత నోటితో నే నుపన్యసింతును. అదియే నాలోని విశేషము. అది లోపమందురా? మీయిష్టము. సోదరులారా! మొదటిసాక్షి యట్టే దీర్ఘముగ నుండఁగూడదు కావున సెలవు.
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.