సాక్షి మూడవ సంపుటం/సభావ్యాపారములు3

వికీసోర్స్ నుండి

29. సభావ్యాపారములు

రోజు ఉపన్యాసమేమీ లేదు. కాలాచార్యులు, వాణీదాసు, జంఘాలశాస్త్రి పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నారు.

సాహిత్య ప్రయత్నం, కృషి అనేవి ముందరి నుంచీ దరిద్రమైనవే. కాఫీ హోటలు, సినిమాలు ఈ రెండే డబ్బు సంపాదించే వ్యాపారాలుగా కనిపిస్తున్నాయని జంఘాలశాస్త్రి అని-కాలాచార్యుల అభిప్రాయం అడిగాడు. దానికి అతడు తర్కధోరణిలో, చావుబతుకుల గురించి చెప్ప విచారించవలసిన అవసరం లేదన్నాడు. వాణీదాసు, కాలాచార్యులు తర్క ధోరణిని ఖండించి, రవంతసేపు పొడుము దొరక్కపోతే నీ బాధ ఆదేవుడికి తెలుస్తుంది అన్నాడు. దాంతో కాలాచార్యులు, తాను పొడుము మానేశానని చెప్పాడు. వీరు ఇలా మాట్లాడుకుంటుండగా, పోస్టులో సాక్షి పేర ఒక ఉత్తరం వచ్చింది. వ్రాసినవాడు 'అనామకుడు'. అందులో విషయం ఏమంటే, హరిజన సేవ చేసిన మహానుభావులు వార్తలలోకి ఎక్కినవారు ఎక్కగా, ఎక్కకుండా అజ్ఞాతంగా వుండిపోయిన వారు అనేకులు వున్నారనీ, వారి వివరాలు సేకరించి ప్రచురించవలసిన అవసరం ఎంతైనా వుందని - ఇందుకు తార్కాణంగా, వేదాధ్యయన పరుడైన ఒక బ్రాహ్మణుడి గురించీ, అతని భార్య గురించీ, వారి నిరతాన్నదాన దీక్ష గురించీ వ్రాశాడు. ఈ అన్నదాన విషయంలో కులభేదాలు ఏమీ లేవని వివరించాడు.

ఒకరోజు రాత్రి ఏటి కవతలనుంచి, అన్నం కోసం ఒక హరిజనుడి కేకవిని–మాంచి వరద బిగిమీద వున్న యేటకి అడ్డం పడి ఆ మనిషికి విస్తరి వేసి అన్నం పెట్టిన వైనం తెలియచేశాడు. అన్నదానం చెయ్యడం తప్ప ఏ కీర్తీ ఆశించని ఆ బ్రాహ్మణుడి పేరు అజ్ఞాడ అన్నయ చైనులు గారని, ఆ అనామకుడు వ్రాశాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

ఈదినమున నుపన్యాస మేదియు లేదు. సభావ్యాపారముల కేర్పాటయినదిన మిది. ధనము లేకపోవుటచేత నన్ని వ్యాపారములు నశించినట్లై మావ్యాపారముకూడ నశించినది. సారస్వత వ్యాపారము సృష్ట్యారంభము నుండియు దరిద్ర వ్యాపారమే. అందులో నిపుడు మఱింత పుట్టిమునుక వచ్చినది. ఇది యెందులకు వచ్చినదో యెవ్వఁడెఱుఁగఁడు. ఎంతకాల ముండునో యెవ్వఁ డెఱుఁగడు. ఏమి ప్రతిక్రియ చేయవలయునో యెవ్వఁ డెఱుఁగఁడు. ఇప్పటికిఁగూడ కాఫీహోట లొకటి, సినీమా యొకటి, యీ రెండు వ్యాపారములు మాత్రమే ధనాకర్షణ సమర్ధములై యున్నవి. కాలాచారీ! నీ యభిప్రాయమేమి?

కాలా:- చచ్చిపోవుదు మనియేనా బెంగ? చావకుండ నున్నంత వఱకు బ్రదికియే యుందుముకదా! బ్రతికి యుండంగా జావువిచారమేల? " చచ్చిన తరువాత విచార మసలే యక్కఱలేదు గదా! ఇగ బెంగగొన వలసిన యవస్థయేదో నా కగపడుట లేదు.

వాణీ:- అంతేకాని మద్యావస్థ లేదా?

కాలా:- మద్యావస్థ యనంగాఁ జావునకుఁ బూర్వావస్థయేనా? కొన్నిదినము లారో గ్యము పూర్తిగాజెడి రోగముచేఁ దీసికొను నవస్థయేనా?

వాణీ:- ఔను.

కాలా:- మధ్యావస్థకు సూత్రము మధ్యావస్థ యనునది రెండు భాగములుగా నున్నది. జ్ఞానవంతమైన యవస్థ, జ్ఞానములేని యవస్థ అనఁగా నొడలు తెలియని యవస్థ ఒడలు తెలిసిన యవస్థ ఒడలు తెలిసిన యవస్థలో బ్రదికియున్నా మన్నసంగతి యెఱిఁగియే యుందుము గనుక బ్రతికియుండఁగా విచార మక్కఱలేదన్న సూత్రము పనికే వచ్చును గదా! ఒడలుతెలియని యవస్థలో విచార ముండుట కవకాశమే లేదు గదా!

వాణీ:- ఏడ్చినట్టే యున్నది.

జంఘా:- వాణీదాసా! అతనికిఁదోఁచిన ట్లతడు చెప్పినాడు. అతని నట్టు నిందిం చుట తప్ప కాదా?

వాణీ:- మనలో మనము స్నేహముచే ననుకొన్న మాటలకు లెక్కయేమి?

కాలా:- మనలో మనమే యన్నమాట యక్కఱలేదయ్యా పైవారు నన్నుదిట్టినను నేను దిట్టువాఁడను సరే కదా! తిట్టినట్లు కూడ నే ననుకొనను.

వాణీ:- ఎందుచేత?

కాలా:- దీనికిఁ గూడ నదియే సూత్రము. ఒకడు నన్ను దిట్టుటకు నే నర్హుఁడను గానంతవఱకు పైవారు తిట్టినది నన్ను గానే కాదు కదా. నాకు బాధ యెందులకు? అర్హుడనే యగుదునా ఆతిట్లను వందనములతో నంగీకరింతును. ఏవిధముచేత బాధ కనబడదే.

వాణీ:- ఆచరణమున కక్కఱకు రాని శుష్కాలాపము లాడుచున్నావు. రవంతసేపు పొడుము దొరకకున్న యెడల నీబాధ దేవుడెఱుఁగును,

కాలా:- నీ వెఱుఁగవు కాఁబోలు. పొడుము మానివేసి 3 సంవత్సరము లైనది. చక్రవర్తిగారు డబ్బు లేకపోవుటచేత కాఫీలో పంచదార తగ్గించుకొనినప్పడు నాముక్కు వారి నోటికంటె నెక్కువయాయని యొక్కసారి నస్యవిసర్జన మొనర్చినాను.

వాణీ:- నీపీడ, దేశపు పీడకూడ వదలినది. అంతలోనే తపాజవాసు సాక్షిపేర వచ్చిన యొక యుత్తరమును నాకిచ్చెను. నేను జూచుకొని నా మిత్రులకు వినిపించితిని. అదియిట్టుండెను.

సాక్షికి:- అనామకుఁ డనేక నమస్కారములు.

మాజిల్లాలో హరిజనులకు సేవఁజేసిన మహానుభావు డొకడుండెడువాఁడు. ఆతఁడు చేసిన సేవయంతయుఁ బ్రచ్చన్నముగ జరిగియుండుటచేత నాతనికి విశేషఖ్యాతి రాలేదు. కాని యాపుణ్యాత్మునిఁ గూర్చి యీ మండలములో మట్టున కెన్నియో చిత్రములై కధ లిప్పటికిఁ జెప్పకొనుచున్నారు. ఇట్టు ప్రతి మండలమునకు నొక్కరిద్దలు హరిజన సేవకు లుండిరి. హరిజన సేవా పవిత్రములైన యీదినములలోనే వారి ప్రచ్చన్న చరిత్రమును పైకిఁదీసి యవి ప్రజల కుపయోగించునట్టు చేయకపోయిన యెడల దోషము కాదా! కృతఘ్నత కాదా? ఆంధ్రులలోఁ బ్రముఖ లేమిచేయవలెననంగా మండలమున కిద్దలు బుద్దిమంతులను నియమించి పూర్వమున నచ్చటచ్చట హరిజనసేవకు లెవ్వరో వయస్సు మీరిన స్త్రీపురుషు లను గనుఁగొని వారిచరిత్రము లన్నియుఁ బ్రోగు చేయింపవలసియున్నది. అవి పరిశీలించి ప్రకటింపవలసియున్నది. వారిలో నెందలతో పవిత్రులు నవతారపురుషు లున్నారు. నేను మాజిల్లాలో బాహాటముగ నందeు చెప్పకొనుచున్న కథ నొక్కదానిని మీకుఁ బంపించితిని. దీనిని మీరు సాక్షిలోఁ బ్రకటింపవలయును.

అనఁగ ననఁగ బ్రాహ్మణుఁడు. ఆతఁడు వేదాధ్యయనసంపన్నుఁడు, పవిత్రచ రిత్రుఁడు. అతని భార్య యత్యుత్తమురాలు. భర్తను పరమదైవముగ గొల్చుచుండెను. వారికిఁ బిల్లలు లేరు. ఉన్న భూవసతి వలని రాఁబడిచేత వారు సర్వజాతుల కన్నప్రదానమొన ర్చుచు భుక్తశ్లేషమును దాముదినుచు సుఖముగ నుండిరి. కాని నిరతాన్నప్రదానము చేత ఋణమెక్కువైనది. దానినిఁ దీర్చుటకై భూముల నమ్మివేసినాఁడు. ఇల్లుమాత్రము మిగిలి నది. ఇంకను విరివిగ నన్నప్రదానముజేయుచున్నాఁడు. ఋణము నెమ్మదిగా దిరుగఁ బెరుగుచున్నది. ఈతని యన్నప్రదానమున కా వేళ యీ వేళయు లేదు. ఆజాతివాఁ డీజాతివాఁ డనుభేద మంతకంటె లేదు. ఎప్ప డెనండు వచ్చి యన్నమడిగిన సరే వానికిఁ బెట్టవలసినదే.

ఇట్లుండ, నొక్కనాఁటిరాత్రి నిదురించుట కింకఁ బ్రయత్నపడుచుంగఁగా నేఁటియా వలినుండి 'చైనులుగారూ! అన్నము! అన్నము" అని కేక వినఁబడెను. ఆకేకతో నదిరిపడి "ఆ" యని యొక్క కేక వైచెను. ఇంతలో "నేను చండాలుడ నని ఈచుట్టుపట్టుల గ్రామములవారు నాకన్నము పెట్టలేదు. మీరు పెట్టుదురని తెలిసి మీయొద్దకు రా బోమఁగ నేరడ్డము వచ్చినది" అని మఱింత గట్టికేక వినబడెను. వచ్చుచున్నానని బ్రాహ్మణుడు గొంతెత్తి యఱచెను. రాత్రిభాగము కావున నడుమ నీరున్న కారణమున నేరు విశాలమైనద య్యను గేకలు సులభముగా వినవచ్చుచుండెను. ఏటికిఁ బూర్తిగా వఱద తగిలినది. నడుము బిడ్డెక్కి నురగలతోఁ బ్రవహించుచున్నది. భయంకరముగ నున్నది. అది చీకటిరాత్రి. అంతలో బ్రాహ్మణుఁ డేటియొద్దకు వచ్చినాడు. మోకాలు దిగని యంగ వస్త్రము కట్టినాఁడు. దానిపై మఱియొక్క యంగవస్త్రము నడుమునకు బిగించినాఁడు. పెరుగునన్నము కలిపియుంచినకుండ నెత్తిపైనున్న చుట్టు కుదిటిపై బెట్టినాడు. కుండపైనున్న మూఁకుటిలో నావకాయ మొదలగువానిని బెట్టినాఁడు. దానిపై రెండడ్డాకు విస్తళ్లు పెట్టినాఁడు. దానిపై నొక్క యంగవస్త్రమువైచి గడ్డము క్రిందికి గావంచయంచులు రానిచ్చి గట్టిగ ముడివైచినాఁడు. ‘జయా! పరమేశ్వరా!' యని యేటికడ్డుపడి “నాయనా పంచమసో దరా! వచ్చుచున్నాను. ఒకపావుగంట శాంతింపుము" అని చుట్టుపట్టులనున్న మెట్టులు ప్రతిధ్వనించున ట్లొక్క కే వైచినాడు.

ఆహా! ఆహాహా! ఈతడు మనుజుడా? దేవతయా? యని గాలి హాహా కార మొనర్చుచున్నది. ఎంత పరోపకారశీలతయో యని చెట్టు మీదిపిట్టలు తత్కిర్తిగానము చేయుచున్నట్లుండెను. ఏటి ప్రవాహమొకప్రక్కకు ద్రోచివైచుచున్నను బింకముగ నిల్వులనేంత నీదుచు సాధ్యమగునంతవఱ కేటి కడ్డముగ బోవుచున్నాడు. అంతరిక్షము నుండి దేవతలు పుష్పవృష్టి గురియుచున్న యట్టు చినుకులు పరకపాటుగ బడుచున్నవి. ఇంతసాహసమేల చేయవలయు నని భార్యయైనఁ జెప్పలేదా? బతిమాలుకొనలేదా? కాళ్లపై బడలేదా? ఏడ్వలేదా? ఏమో! ఎవఁడెఱుంగును! కాని యామె యింటయొద్ద నెంత యేడ్చుచున్నదో ఆమె యింటియొద్దనున్నదా? ఏటియొద్దదైవప్రార్దన మొనర్చుకొనుచు గూరుచుండియున్నదే! పంచమసోదరుని కుద్బాధ శాంతింపఁజేసి భర్త తిరుగ వచ్చుట సిద్దించునెడల నే నాతనితోడనే యింటికిఁ బోవుదును. రాండేని యేగంగతల్లి కడుపున నాభర్త యుండునో యక్కడనే నే నుందునని నిశ్చయపరచుకొని యటఁ గూరుచుండియున్నది. ఆహా! ఏమియిల్గాలు! దైవప్రార్ధన యెట్టు చేసికొనుచున్నదో చెప్పనా? 'పరమేశ్వరా! నీవు నాభర్తను రక్షింపుము. నన్ను నాభర్తయే తరింపఁజేయును. కావున నన్నుఁగూర్చి ప్రార్డించి నీకు శ్రమమీయను. ఒకవేశ నాభర్త కీ రాత్రితో యాకలి శాంతించువఱకైన నా భర్తను సజీవునిగ నుంపుము. ఇంతకంటె నేను మఱేదియుఁ బ్రార్డింపను. నా భర్తతోనేనుందును గావున నాకు విచారము లేదు.'

ఆహాహా! ఇట్టిప్రార్థన మెచ్చటనైన వింటిరా! ఆంధ్రసోదరులారా! ఈదంపతులలో నెవరు యోగ్యతరులో చెప్పఁగలరా? ఇట్టి వారిని గన్న మామండల మెంతకృతార్థమో చెప్పవలయునా?

ఆవలిగట్టుచేరి విస్తరిలో నన్నము వడ్డించి యొడిలో నాహరి జనుని బెట్టుకొని యెడమభుజమునకు దాపుకొని యన్నము తినుటకుకూడ హవాలా తప్పిన యాతనినోటిలో రవంత రవంత యన్నము పెట్టి మంచినీరిచ్చి శోషిల్లుచున్న ప్రాణములకు శక్తినిచ్చి బ్రదికించి, పుణ్యము కట్టుకొన్న యాబ్రాహ్మణోత్తముని పేరేదో చెప్పనా? అజ్ఞాడ అన్నయ చైనులుగారు. అజ్ఞాడ అన్నయ చైనులుగారు! హరిజన ప్రపంచమా! ఆంధ్రదేశమా! ఒక్కసారి ధన్యవాద మిమ్ము! చాలదు. మఱియొక్క సారి! ఆంధ్రదేశమా! ఆతనిభార్యపేరు తెలి యునా? 'పాపాత్ము"డనైన నాకుఁ దెలియదు. ఎవ్వరైన నెఱిఁగియుండునెడల సాక్షిద్వా రమునఁ దెలియబఱచి సంతసింపఁజేయుదురా? అజ్ఞాడ చైనులకు రెండు ధన్యవాదములే యిచ్చిరి. కాని యీనారీశిరోమణి మూఁడుధన్యవాదముల కర్హురాలు. కానిండు. ఒకటి, రెండు, మూడు.

చిత్తగింపుడు,

అనామకుడు.