సాక్షి మూడవ సంపుటం/ఒక కథ

వికీసోర్స్ నుండి

30. ఒక కథ

జంఘాలశాస్త్రి ఈరోజు ఉపన్యాసం ఏమీలేదని చెప్పి-ఒక కవి వ్రాసిపంపిన కథ చదివి వినిపించాడు.

ఆ కథ, నిరతాన్నదాత, అఖండ రామభక్తుడు కొర్నిపాటి సుబ్బరాజు, గారిది. 1922 నాటికి నూరేళ్ల క్రితం జరిగిన కథ. ఆ సుబ్బరాజుగారు జొన్నల అన్నం, నక్కదోసకాయ ఊరగాయ, గోగుపచ్చడి, బర్రె పెరు గుతో నిరతాన్నదానం ముప్పై సంవత్సరాలు చేశాడు. ఇది చేస్తున్న కాలంలో అనేక ఆంధ్ర కావ్యాల్ని గునపమంత గంటంతో తాటాకుల మీద వ్రాసి దాచిపెట్టేవాడు. అలాగే పోతన్నగారి భాగవతం కూడా వ్రాసుకుని తన అభిమాన గ్రంథంగా పెట్టుకున్నాడు. కవులందరి పోలికలను తన ఊహలో దర్శించినట్టు అందరికీ చెప్పేవాడు.

కాలక్రమాన ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఈ సంగతి తెలిసి, ఊరిలో ఒక సంపన్నుడు ఆదుకోబోతే, వద్దని తిరస్కరించి-భాగవత ప్రతిని తలమీద కట్టుకొని-భార్యనీ, అయిదేళ్ల ఆడపిల్లనీ తీసుకుని -ఒంటమిట్ట కోదండరాముణ్ణి నమ్ముకొని–ఊరు విడిచి వెళ్లిపోయాడు.

అది ముహమ్మదీయ రాజ్యం. ఒకనాడు నవాబుగారు వెళ్లేబండికి అడ్డు నిలచి తన చేత కావ్యాల ప్రతులు వ్రాయించుకొని, తనకు జరుగుబాటు చేయించమని కోరాడు. అతని తీరు నచ్చకో ఏమో నవాబు భటుల చేత కొట్టించాడు. ఒక భటుడు, సుబ్బరాజుగారి జంధ్యం తెంపబోతే, రొంట నున్న గంటంతో వాడి తలమీద కొట్టాడాయన. వాడు పడిపోయాడు. సుబ్బరాజు గారికి కారాగారం ప్రాప్తించింది. ఆయన కారాగారంలో వుండగానే, ముందు కూతురు, తరువాత భార్యమరణించారు. ఆయన గంటంతో కొట్టిన మనిషి ఇరవై రోజుల తరవాత మరణించడంతో, నవాబుగారు సుబ్బరాజుగారికి మరణశిక్ష విధించారు. తలారి, ఆయన తల నరకలేకపోయాడు. సుబ్బరాజుగారు, తను తలమీద కట్టుకున్న భాగవత ప్రతిని విప్పి పక్కన పెట్టి, కోదండ రామప్రభో అని గట్టిగా అరిచి, క్రిందపడి మరణించాడు. ఈ సన్నివేశానికి ఆ తరవాత నవాబుగారు, ఆయన ప్రజలు ఏడిచారు. నవాబు రామభక్తుడయ్యాడు.

సుబ్బరాజుగారి కథను, ఈదేశంలో రామభక్తి పారవశ్యానికి గుర్తుగా ఆ కవి వ్రాసి పెట్టాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

నాయనలారా! నేఁ డుపన్యాసము లేదు. ఎవరో యొక కవి సాక్షిసంఘములోఁ జదువుటకొఱ కొకకథను వ్రాసిపంపెను. దానిని చదివెదను. సావధానముగ వినఁగోరుచు న్నాను.

నక్కదోసకాయ యూరుగాయ, గోంగుకూర పచ్చడి, బఱ్ఱె పెరుఁగు అంతే. అంతకంటె నక్కడ నేమి దొరకును? అవే పంచభక్య పరమాన్నములు. ఇట్టునుదినము వేళపాళయని లేక కొర్నిపాటి సుబ్బరాజుగా రన్నప్రదాన మాచరించుచుండిరి. అన్నము జొన్న యన్నము. విస్తరి బొడ్డుమేడియాకు విస్తరి. ఉప్ప ఱాతియుప్పు. నీరు దిగుడుబావి నీరు. ఇప్పటి మాటయా? దాదాపుగా నూజెండ్లక్రిందటిమాట, ముప్పది సంవత్సరము లీబ్రాణుడన్నప్రదాన మొనర్చినాఁడు. మహానుభావుడు. నిర్గర్వుడు. నల్వురు మోయఁదగిన చొప్పమోపును తానే పొలమునుండి తలపై బెట్టుకొని తెచ్చి బల్లెలకు వేయును. వానిపాలు పాలికాపులచేఁ బిలికింపక తానే పితుకును. ఇంట నందఱి కాతని భార్యయే వంట చేయును. వంటలక్కలు కాని, నీళ్ల బ్రాహ్మణులు కాని వారి కెవ్వరును లేరు. ఉంచుకొనవలసిన యావశ్యకతయు వారికి లేదు. తమయింటిపని నొకరిచేఁ జేయిం చుట వారు తప్పుగ భావించు చుండెడివారు, పచనాదికృత్యములను బైవారిచేఁ గూలిపెట్టి చేయించిన యెడల నతిథిపూజాఫలము పరిపూర్ణముగ దమకు సిద్దింపదేమో యని వారికి భయము. పాలుమాలికలేక, యొడలు దాఁచుకొనక భూతసంతుష్టిచేయుటయే పుణ్యకార్య మని నమ్మి వా రట్లు చేసిరి.

మగనికిఁ దనకుఁ దవ్వెడుబియ్యము కుతకుతలాడించుటకే యీ కాలపు గుల కాంతల కోపికలేదు. దొడ్డిలో దాసి. వీథిగుమ్మములో సేవకుడు. ఇంటిలో వంటలక్క ఇంత పై బలగమున్నఁగానియాలు మగనికంటె నెక్కువలేని యిద్దఱకాపుర మీ దినములలోఁ గడతేదఱకుండ నున్నది. పంచపాళిలో నాదఱవైచినబట్టు భటునిపాలు. పెరటిలోఁ బాదఱ వైచిన తప్పెల దాసిపాలు. పడమటింటిలోని పప్ప నేయి సామాను బాపనక్కపాలు. అమ్మగారు పడకటింటిలో నౌరంగజేబు నవలను జదువుచు నావులింతల పాలు. అయ్యగా రణాబిల్లపై సంతకములతో నప్పులపాలు. ఇంతేకదా యిప్పటి సంసారముల సౌభాగ్యము! అతిథిపూజ లేదు. సరేకదా పతివిస్తరిలోఁ బచ్చడి మెదుకులయినఁ జేసి పెట్టినదేది? వంటప్రొయ్యి యొుద్దం గూరుచుండు నెడల మొగము మెరుగు కరగిపోవునప్పడు మగనిమెుగాననింక మొద్దులేగాని మఱియేమున్నది! ప్రాసయతి మంజరీద్విపదలో నుండవచ్చునో లేదో తెలియును గాని, పప్పుడికిన తరువాత నుప్పవేయవలయునో-యుడుకకముందు వేయవలయునో తెలియదు. ఉండలు జిల్లెడు కాయలు కాకుండ నత్తెసరు వేయగల యమ్మగా రన్నపూర్ణాదేవి గారు. వంటయింటిలోని ప్రాణాహతులతోను, బజారులోని కారపుబూసతోను గాపురము లెట్లో జరుగుచున్నవి. జరుగక మానునా? కాలచక్రము వెవరడ్దగలరు? ఆయువుండగా నెవరేమి చేయఁగలరు? మగల బ్రతుకులే యిట్లు దిగ నాలునప్పడు మఱదుల, బావల, యత్తల బ్రదుకు లడుగవలయునా? కాని యాహా! ఏమిదుర్గమ్మ! దూపాటి సీమనుండి వచ్చినవాఁ డొకఁడు. నల్లమల నుండి వచ్చినవాడొకఁడు. కోనసీమనుండ వచ్చినవాఁ డొకడు. పలనాటిసీమనుండి వచ్చినవాఁ డొకఁడు. ఇందలలో యతిథులై రాగా, వారి కందఱకు బహు పరిశుభ్రముగా వండి భర్తకుపెట్టి సిద్దపఱచి యుంచిన యాకులలో వడ్డించి, వారు సంతుష్టిగ భుజించిన తరువాతఁ దాను భుజించును. ఇట్లొక్కదినమా? ఒక్కమాసమా? ఒక్క సంవత్సరమా? ఆడుదాని పరిపూర్ణ సహాయ్యము లేకుండ బ్రహ్మదేవుడైన నన్నప్రదాన మాచరింపలేఁడు. అన్నప్రదాన పుణ్యమంతయు నంగనదే!

ఇంక నీ యతిథులకు సాయంకాలమున మూడుగంట లగుటతోడనే-అనపుగాయదినములలో తంపటవైచిన యనుప గుగ్గిళ్లు, లేజోన్న కంకులదినములలో నూచబియ్యము. మొక్కజొన్న పొత్తుల కాలములో మొక్కజొన్నపొత్తులు. ఇట్లు ఏయే కాలములలో నేది వచ్చునో యది యల్పాహారముగా వారియెదుటఁ బెట్టి తాను చేగునపమంత గంటము చేతఁ బుచ్చుకొని, తాటియాకులపై భాగవతమో, హరివంశమో, మతే దియో యా సుబ్బరాజుగారు వ్రాసికొనుచుండును. ఇట్టాతం డెన్ని గ్రంథములో వ్రాసినాఁడు. కవీశ్వరు లాతనికిఁ గన్నుల గట్టినట్టుందురు. తిక్కన సోమయాజియాఱడు గుల పొడవగువాఁడని గ్రద్దముక్కుకల వాడని నడుము కట్టులో జురకత్తి కలవాఁడని, కాలిన మొక్కజీడిపప్ప రంగువాఁడని యాతండా యతిథులతోఁ జెప్పచుండును. చేతిలోనున్న యనుపపప్పుముందుం గథలోనున్న కాలిన మొక్క జీడిపప్పెక్కువ రుచింపకుండుటచేఁ గాఁబోలు వారామాటలను గణింపకుండెడివారు. తిక్కన సోమయాజిగా రిట్టుండెనని మీకెట్లు తెలిసినదని యాయన నెవ్వరు నడుగలేదు. అడిగిన యెడలఁ గారణ మాయనకు మాత్ర మేమి తెలియును? అట్టాయనకుఁ దోచుటయే కారణము, పింగళి సూరన్నగారికి ముందుదంతములలో నొకటి పొడుగని, యొకటి పొట్టియని చెప్పను. ఆయనకు ఆలాగునఁ గనబడుచుండంగ నెవరు కాదనఁగలరు? ఒకనాడు తాను తనభార్యయు బండుకొని యుండఁగాఁ దాను 'దుర్గా పోతరాజుగా రెట్లుందురని నీయభిప్రాయ"మని యామె నడిగెను. ఈప్రశ్నయామె కెందులకో బోధపడదు. 'పొడుగుగాను, సన్నముగాను నుందు రని నే ననుకొందు" నని యామె బదులుచెప్పెను. భర్త యడిగిన నడుగును కాక భార్య కీప్రత్యుత్తర మెందులకో యంతకంటె బోధపడదు. “అలాగునం గాదుసుమీ, పొట్టిగా నుండును. తగుమాత్రమైన బొజ్ఞ కలిగి యుండును,’" అని భర్త బదులు చెప్పెను. ఔనని, కాదని, భార్యా భర్తలిట్టోక్కనిముసము సంభాషించుకొన్నమీదట భర్త-'నేనన్న మాటయే నిజమగునెడల-నదిగో-గోడబల్ల మీదఁ బెట్టిన మద్దెల యున్నదే అది గణగణ మ్రోఁగును' అనుసరి కేదైన యెలుక దానిని గదల్చెనో మఱేమైన జరిగెనో తెలియదు. కాని, మద్దెల గణగణ మ్రోగెను. అంత నాఁతడు మహానందమున లేచి మద్దెలను గ్రిందిగి దింపి దానికిఁ బూజ లొనర్చి, పోతరాజుగారి మద్దెల యని దానికిఁ బేరిడి, పోతరాజుగారి గజేంద్రమోక్షాది గాథలలోని పద్యములన్నియుఁ గీర్తనముగాఁ బాడుకొనుచు మద్దెల వాయించుకొనుచుం డెను. ఇది జరిగి యిరువదేండ్డు దాఁటినది. అల్పాహారకాలమునందీకథ యతిథులకుఁ బ్రతిదినమును చెప్పను. అట్టు కొంతసేపు చెప్పి

క. “పలికెడిది భాగవతమట, పలికించెడివాఁడు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగునట, పలికెద వేఱొండుగాథ పలుకగ నేలా?

యను పద్యమును చదివి 'ఆహా! మహానుభావుడు! ఎంత మృదులముగా, నెంత లలితముగా, నెంత మనోహరముగాఁ జెప్పినాడో మాతండ్రి- పోతరాజుగా రిప్ప డెక్కడ నుండునో యని కన్నులనీరు జలజల రాల్చుచుండును. ఊచబియ్యపు బదనుచేఁ జొంగలు గార్చుచున్న భుక్తిప్రియులకుఁ బోతరాజుగారి కవిత్వ మప్పడు కావలయునా?

ఇట్లు కొంతకాల మత్యువ్ర్చయముగా నాసంసారమునకు దినములు జరిగినవి. కాలమొక్కరీతిగా గడచునా? వర్షమునలు వెనుక బట్టినవి. పంటలు తగ్గిపోయినవి. క్షాము తలసూపినది. అందువలన నతిథులు మఱింత వచ్చుచున్నారు. అందఱకు సంతుష్టిగా బెట్టుచునే యున్నాఁడు. అప్పలు చేసినాఁడు, పాట పెరట్లమ్మినాఁడు. ఇల్లమ్మినాఁడు. ఇంటిలో బాత్రసామగ్రి నమ్మినాడు. కోటప్పకొండ మ్రొక్కుతో సంబంధించిన తన యెడమకాలి వెండికడియ మమ్మినాఁడు. అమ్మగా మిగిలిన రెండుగేదెలు కూడజచ్చిపోయి నవి. ఇంటిలో నేమియు లేదు. మట్టమధ్యాహ్నమగుసరికిద్ద ఆతిథులు వచ్చినారు. ఇంటిలో నరసోలెడు గింజలు లేవు. అప్పడు భార్యయొద్ద కాతండు పోయి యిప్పడువచ్చిన యతిథులను బూజించు టెట్టు?-అని యడిగెను. పసుపురాచిన దారమును మెడను గట్టుకొని మంగళసూత్ర మిచ్చి “ఇది యమ్మి వారికిఁ గావలయు సామగ్రిని తెండు. అమ్మాయి చల్ది యన్నము తినినది. మన మీ దినమున భుజింపవలదు. వారికి సాయంకాలము కాకుండ భోజనము పెట్టి పిల్లను దీసికొని రాత్రి యెటకైనఁ బోవుద'మని భార్య పలికెను. మంగళ సూత్రమునకు రెండువరాలు కాబోలు వచ్చినది. కొంత వ్యయపఱచి యాయతిధు లకు సంతుష్టిగా భోజనము పెట్టి శిష్టాన్నము కొంత సాయంకాలమునఁ గూతునకుఁ బెట్టి, తాము తినక వా రారాత్రి యెవ్వరి తోడను జెప్పకుండ వెడలిపోవ బ్రయత్నించిరి. కాని, యీ యూరకున్న యొకసంపన్నుఁ డీయంశమును గర్ణాకర్షిగా విని యాయనయొద్ద కారాత్రి వచ్చి 'సుబ్బరాజుగారూ! మీకు దుర్దినములు వచ్చినవి. దరిద్రతకంటె దుస్థితిలేదు. మిమ్ము నేను గనిపట్టుదును. మీ రెక్కడికిని భోవల’దని చెప్పెను. " ఓయబ్బ! దుష్టదిన ములు మాత్రము మమ్మేమి చేయఁగలవయ్యా దరిద్రము పోతరాజుగారు పడలేదా? ఆయనకంటె మే మెక్కువ వారమా? ధర్మబుద్దిచే నొకరు నా కింత పెట్టగ నేను దినువాఁడను గాను. పోతరాజుగారిని రక్షించిన యొంటిమెట్ట కోదండ రామమూర్తి మమ్మేల రక్షింపకుం డును? అడవులఁ బట్టి పోవుదుము. నాయనా! పోతరాజుగారు “అడవి రక్షలేని యబలుండు వర్డిల్లు, రక్షితుండు మందిరమునఁ జచ్చు"నని చెప్పినారు. మ మ్మడ్డు పెట్టకుము. కాని నా దొక్క కోరికయున్నది. ఎవ్వరైన నతిథులు వచ్చునెడల బోతరాజుగారు సంతసింతురు అని చెప్పి యాతని నంపివైచి, ఇదివఱకుఁ దాను వ్రాసిన తాటాకు గ్రంథములన్నియు నటుకమీదఁ బదిలముగా దాఁచి, తాను వ్రాసిన పోతరాజుగారి భాగవతమును దేవతార్చనపుఁ బెప్టెతోఁగూడ నంగవస్త్రమునఁ జుట్టి తలపైఁ బెట్టుకొని, పోతరాజుగారి మద్దెల వీపునఁ గట్టుకొని, గంటము మొలలోఁ బెట్టుకొని, గూఁతు నెత్తుకొని, భార్యచేయి పట్టుకొని-

క. 'శ్రీకంఠచాఖండన, పాకారి ప్రముఖవినుతభండన విలస
త్కాకుత్స్థంవంశ మండన, రాకేందు యశోవిశాల రామనృపాలా!"

- యని పఠించుకొనుచు వెడలిపోయెను. అది మహమ్మదీయుల రాజ్యము. ఆయూరిపేరేదో తెలియదు. జోడుగుల్జాల బండిమీద నవాబుగారు బయలుదేఱి -కాసు" తొటు జూచి తిరుగ నింటికిఁ బోవుచు న్నారు. ఆదారిలో నొక బ్రాహ్మణుడు నిలువబడియున్నాఁడు. గుఱ్ఱపుబండి వచ్చుచు న్నది. " ఓయబ్బా ఆపవయ్యా బండి! ఒక్క పేపరుగా?" యని బండివాని కాతఁడు కేక వైచెను. బండియాపక యాతడు తోలుకొనిపోవుచుండంగా నా బ్రాహ్మణుఁడు గుఱ్ఱపుంగళ్లెములు బట్టుకొని బండి నాపెను. గుఱ్ఱములు బెదరుచున్నవి. కాని వానినిగదలనీ కుండ నాతండు పట్టుకొనియున్నాఁడు. ముందుఁ గొంతదూరము పోయిన తురుపుసవారులు వెనుకకుఁ దిరిగిరి. మలకి కొందరు జనులు మూగిరి. నబాబుగారు బండి దిగినారు. ఆయన యొద్ద కాతండు వెళ్లి' మాయబ్బ! నీవేనటయ్యా! ఈచుట్టుపట్టు పొలాల కంతకును రాజవు? సరేకాని, నా కేమైన భత్యమేర్పాటు చేసి తాటాకుగ్రంథములు వ్రాయింపరాదఁ టయ్యా! నాకు జరుగుబాటుగను నుండును. నీకు ఖ్యాతిగాను నుండును. సుఖముగాగూరుచుండి వ్రాయుదును. నీ కచ్చేరిలోనికి నన్ను రానీయరని నిన్నుఁజూచుట కీడకు వచ్చినాను. ఎవరేమి చెప్పకొందురో వినవచ్చును. బండి నిమ్మళముగాఁ దోలించుకొనరా దయ్యా' యని నబాబుగారి ననియెను. బ్రదుకు దెరువు కొఱకుఁ బ్రభుని ప్రథమమున సందర్శించునప్పటి సంభాషణమిట్టున్నది. పాపము! భటత్వమెఱుఁగునా? ప్రభుత్వ మెఱుఁగునా? మన్ననయెఱుఁగునా? మార్దవ మెఱుఁగునా? మర్యాదయెఱుఁగునా? మాటతీ రెఱుఁగునా? అయ్యో! వట్టిజానపదుడు. రూపమున మోట. వస్త్రమున మోట. పలుకున మోట. వట్టి నిష్కల్మషుడు. అమాయకుఁడు. మనసున నొకటి నోట నొకటి యున్నదా? శుద్ద సత్యకాలపువాఁడు. ఋషి విగ్రహుడు. హరిహరీ! ఇప్పటి యింద్రజాల మహేంద్రజాల మహామహోపాధ్యాయులలోనివాఁడా? ఇప్పటివారిలోఁ గొందఱు సత్యసంధులకుఁ దక్క దఱచుగా నెవ్వరినిఁ జూచినను నొసలు వెక్కిరింపు. నో రిగిలింపు. మొగమెదుట నమస్కార ములు. వెనుక దిరస్కారములు. పలుకు తేనెపట్టు. పిడికిలి కోఁతిపట్టు. పెదవిని మందహా సము. హృదయమునఁ జంద్రహాసము. ఆత డిట్టివారిలోవాఁడా? తన కుపకారపు మాట యేదో యెఱుగడు. ఎదుటివాని కపకారపు మాట యేదో యెఱుఁగఁడు. మనసులో నేది సత్యమని తోఁచునో యది పైకి రావలసినదే. ఆ వచ్చుటలో నొక సాపులేదు. సంతన లేదు. నీటు లేదు. మాట లేదు. వట్టి కఱ్ఱపడి కంకరరాతిపాకముతో రావలసినదే ఆత డనిన మాటలు విని నబాబుగారు కొంత నిశ్చేష్టితులై యూరకుండిరి. నబాబు గారివంటి వానిని సుబ్బరాజుగా రెట్టు చూడలేదో, సుబ్బరాజు గారి వంటి వానిని నబాబుగా రట్టు చూడలేదు. 'మాయబ్బ, అదేమి చూపయ్యా!

"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం జెందరే?
వా రేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై
బేరైనం గలదే శిబిప్రముఖులున్ ప్రీతి న్యశస్కాములై
యీరే కోర్కుల వారలన్ మజచిరే యిక్కాలమున్ భార్గవా!"

యని పోతరాజుగారు సెలవిచ్చిరయ్యా! అడుగక యడుగక య`రువదియేండ్ల కడిగినానయ్యా! నీపాలా లన్నియు నా కూరకే యిచ్చినను నా కక్కఱలేదు. ఏదో కొలువు చేయించుకోవయ్యా! ఎందుల కింతయోజన! నీ విచ్చు భత్యము నా కేమియు నక్కదఱలేదు. వింటివా? పూఁట కొక్కయతిథి కన్నము పెట్టి మిగిలిన గంజితో నా కూతును రక్షించుకొందును. నేను నా భార్యయుఁ బస్తుండెదము. కాదేని కాయయమో కసరో తినుచుందుము. మామాట కేమి?" అని బ్రాహ్మణుడు పలికెను. ఇంకను నబాబుగారు నిల్వుగ్రుడ్లవైచుకొని చూచుచుడంగా, 'నీతో నాకేమి పోవయ్యా రా జన్న ప్పడు పోతరాజుగారే రాజుగాని నీ వెక్కడి రాజువయ్యా' యని యాతండు పోబోవుసరికి నబాబుగారు భటులకుఁ గనుసన్న చేసిరో యేమో కాని నల్వురుభటులు సుబ్బరాజుగారిని సున్నములోని కెముకలేకుండ గొట్టిరి. సుబ్బరాజు గారు రామరామ యనుచు నా దెబ్బలన్నియు నే మాత్రము తిరుగుబాటయిన లేకుండ కన్నయిన జిట్లించుకొనకుండ సహించెను. మఱి యొక భటు డింతలో వచ్చి యాయన జన్నిదమును దైంపబోవఁగ నాతని నెత్తిపై తన గంటము మొదటితోఁ గొప్టెను. వాఁడు గిలగిలలాడుచుఁ గ్రిందబడిపో యెను. అంత సుబ్బరాజుగారు కారాగృహమందుపబడిరి. నబాబుగారు తమ మహలునకు బోయిరి.

III

స్పోటకపువ్యాధులచే, విషూచివ్యాధులచే నా మహమ్మదీయ గ్రామమంతయు నిండి యున్నది. జనులు కుప్పతిప్పలుగాఁ జచ్చుచున్నారు. బండ్లమీఁద వైచి శవములను దీసికొని పోవుచున్నారు. సుబ్బరాజు గారి కారాగృహమున కొక్క నలువది బారల దూరములో నొక కానుగు చెట్టున్నది. అది వీధి ప్రక్క నున్నది. దాని క్రిందనే దుర్గమ్మ యామెకూతుతో నివసించుచున్నది. తనకు, దనభర్తకు నన్నము లేక పోయినను ఏజిరుగడమో కఱ్ఱపెండలమో తిని కాలక్షేపము చేయగలరు. కాని, అయిదేండ్లపిల్ల అట్లు బ్రదుకగలదా? ఆపిల్లను సంరక్షించుట కామె యొచ్చటినైన దాస్యమున కొప్పకొని చేయవలయును గదా! ఎక్కడెక్కడ దిరిగినను సదుపాయమగు నౌకరి దొరకలేదు. తుదకొక్కయింటు నెల కొక్క వరాజీతమున కొప్పకొని యాయింటను స్పోటకపు వ్యాధిచే బాధపడుచున్న యొక కాంత కుదయమునుండి సాయంకాలమువల కుపచారము చేయుట కంగీకరించెను. మాసవేతనములో దీర్చుకొవనుపద్దతి మీద నొక్క మాడ ముందుగా దీసికొని పిల్లదానికిఁ గావలయు సామగ్రి కొని కుండతోఁ దెల్లవారకముందే రవంత వండి, కూతునకుఁ బెట్టి, దానిని దండ్రిగారాగృహముగుమ్మము వెలుపల విడిచి, తాను సేవకుఁ బోవుచుండును. ఇట్టు పదునైదు దినములు గడవకుండ నామెపిల్లకు జ్వరము వచ్చెను. పుచ్చుకొన్న మాడ కింకను రెండు దినముల సేవ బాకియున్నది. ఋణము తీర్చుకొన కుండరాదనియు, నుచితముగ నెవ్వరి సొమ్మును దీసికొనఁగూడదనియు నాజ్వరము తోడనే పిల్లను గారాగృహాంగణమున విడిచి సేవకుఁ బోయి యాబాకి తీర్చుకొని, యంతట నుండి సేవకు రాజాలనని చెప్పెను. పిల్లకు స్పోటకము వచ్చినది. రెండీతాకు లడ్డుకట్టుకొని యాచెట్టుక్రిందనే వాని చాటునఁ బిల్లను బెట్టుకొని కంటికిమంటి కొక్కధారగా నేడ్చుచుండును. తండ్రి కారాగృహమందు భీష్మస్తవరాజమును జదువు కొనుచుండును. ఇట్లుండఁగాఁ బైటచాటున గుడ్డలలో బిల్లను బెట్టుకొని యొక్కనా డుదయమున దుర్గమ్మ కారాగృహమునొద్దకు వచ్చి పిల్లను తండ్రికి జూపి యేడ్చెను. ఉదయ మయిదుగంటలకే యాపిల్ల మరణించెను. మృతినొందిన తనకూ తను, రోదనము చేయుచున్న భార్యను గాంచి, కన్నులనుండి జాఱిన యిందుపగింజలం తటి రెండు బాష్పముల ను త్రోచివైచి-'ఓయబ్బ! ప్రపంచ మిట్టిదని యొవ రెఱుఁగరు? తొందరపడకు. ఒంటిమెట్టు కోదండరాము డిచ్చినాడు. ఆయనయే తీసికొన్నాడు. ఓయబ్బ తనసొమ్ము తాను తీసికొనఁడేమి? పోతరాజుగారి మాటయందు నాకున్నట్టే నీకు బ్రమాణబుద్ది యున్నది కావునఁ జెప్పెదను.

"మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము! దేహి పుట్టుచుం
జచ్చుచునుండఁ జూచెదరు చావకమానెడువారిభంగి నీ
చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లక దాఁగవచ్చునే?
యెచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణకోటికిన్."

అందువలన నిప్పడు మనయమ్మ వైకుంఠముననున్నది. నే నెఱుఁగుదును. నాకు రాత్రియే తెలిసినది" అనెను. ఇంతలో స్పోటకపుశవము నచటికిఁ దీసికొని రాగూడదు పోపో యని భటు లామెను బెదరించిరి. ఆమె యేడ్చుచు "నాయనలారా! పోవుదును. క్షమింపు'డని భర్తవంక తిరిగి “ఎవ్వరికైన నొకటంక మిచ్చినఁగాని యీపిల్లకుఁ దరువాతి కర్మము జరుగదు. నావద్దనేమియు లేదు. నేనే తీసికొనిపోయి నా చేతులతోనే యీపని చేయవలయునా? యని గోలున నేడ్చుచు దటాలునఁ బోయెను. ఆమె యేడ్చువాని భర్తగుండెలేకావు బ్రహ్మాండగోళమంతయు గడగడవడకిన ట్లయ్యెను. నిజమైన యాపద వచ్చినప్పడు- అందులో మహాపతివ్రత కాపదలవచ్చినప్పడు-ఆ యాపద కన్నకడుపుతో జేరినప్పడు-పునాదులతోఁ బెల్లగిల్లునట్టు-ప్రకృతి కంపించుననగా నాశ్చర్యమేమి? అంత సుబ్బరాజుగారు

“లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్లప్పెను మూర్చవచ్చె తనువ్ డస్సెన్ శ్రమంబయ్యెడి
నీవేతప్ప నితః పరం బెఱుఁగ మన్నింపందగుం దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!"

యను పద్యమును జదువుకొని కొంత శాంతిపడి రామనామస్మరణ మొనర్చుకొను చుండెను.

IV

సుబ్బరాజుగారి గంటపు దెబ్బతిని భటు డిఱువదిదినములు బాధపడి మరణించెను. ఖూనీ నేరము చేసినందులకు సుబ్బరాజుగారిని నబాబుగా రింక శిక్షింపవలసియున్నది. విచారణ కొక్కదినమున నాయనను నబాబుగారి కచ్చేరికిఁదీసికొనిపోవుట కేర్పాటయినది. వకీళ్లు కావలయునా? దస్తావేజులు కావలయునా? సాక్యము కావలయునా? నబాబుగాని యెదుటనే కాదా నేరము జరిగినది? భీష్మైకాదశీదినమున విచారణ జరుగనైయున్నది. ఆ యుదయముననే దేఁకుకొనుచు నాతని భార్య కారాగృహము నొద్దకు వచ్చి భర్తను గాంచి 'నాకీయుదయమున నుండి వాంతులు భేదులగుచున్నవి. నా తమ వీసాయంకాలమువలకు నిల్చునని తోపదు. నడువలేక యిట్టు దేఁకుకొనుచు వచ్చితిని. సర్వధాయనుగ్రహ ముంపవలయును." అనిలో యేటబడిన గొంతుతోఁ బలికెను. భార్యనుగాంచి భర్త కొయ్యవాఱెను. ఒక్క నిముసమునకుఁ బ్రజ్ఞగాంచి చూచుసరికిఁ దనపాదముల నాయన శలాకనుండి యావలకు లాగి వానిని గన్నులందుఁ జేర్చుకొని-శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః–యని భార్య యనుచున్నది. భర్తకుం గంటివెంట నీటిచుక్క లేదు. భార్యనంతకంటె లేదు. అతిశుష్కమైన వస్తువున కయిన రసమున్నది. అతినీచమైన కార్యమునకై రసమున్నది. అగ్నిజాలలకైన రసమున్నది. కాని యతిదుఃఖమున రసము లేదు. 'మీపాదసన్నిధిని నాకు మరణింపవలయునని యున్నది. కాని యీవ్యాధి గల నన్నిక్కడ గొంతసేపైన నుండనీయరు. భటులు పొమ్మనకుండనే స్వామీ వెడలిపోదును. నమస్కారము" అవి యూమె దేఁకుకొనుచుబోయెను. ఆమె యేమనుకొనుచు బోయెనో యేమను కొనుచు గొట్టులో నుండెనో వారికే తెలియదగినది. అంత

క. కలడందురు దీనులయెడఁ
గలడందురు పరమయోగి గణములపాలన్
గలడందు రన్నిదిశలను
గలడుకలం డనెడివాడు కలఁడో లేడో

యని చదువుకొనుచు నిట్టు గలిగిన సందేహమును వెంటనే పరిహరించుకొని-

క. నీపాదకమల సేవయు, నీపాదార్చకులతోడి నెమ్మి నితాంత
శ్రీపాదకమలసేవయు దాసమందార నాకు దయసేయఁగదే.

యని ధ్యానించుకొనుచుండెను. ఇంతలో విచారణకొఱ కాయనను గచ్చేరికిఁ దీసికొ నిపోవుభటులు వచ్చిరి. వా రాయనను తీసికొని పోవుచుండఁగ ' ఆకానుఁగు చెట్టుక్రింద నన్నొక్కసారి నిలుపవయ్యా! నా భార్యను చూచి వత్తు"నని వారిలో నొక్కని నాతండు కోరెను. వా రంగీకరింపక చెట్టుప్రక్కనుండియే యాతనిఁదీసికొనిపోవుచుండ, దుర్గా దుర్గా! దుర్గా యని సింసగర్జనమునఁ బిలిచెను. పలుకలేదు. ఆమె మరణించెనని నిశ్చయపఱచు కొని కోదండరామప్రభూ! యని యొక్క కేకవైచి " ఓ కానుగుచెట్టా! నాదుర్గను, నా బిడ్డను, నేను బోషించుకొనదైన నా భార్య కళేబరము ప్రక్కనుండియే దానిని జూడకుండ నేను బోవుచున్నాను. నీవు దానవుకావు. నీవింక నామెయెుద్దనే కనిపెట్టుకొని యున్నావు. నీవే నాకంటె ధన్యతకలదానవు. నీ కుత్తరజన్మమున మహోత్కృష్ణమగు జన్మము సిద్దించును గాక!" యని నడుచుచునే చెట్టును దీవించి కచ్చేరికిఁ బోయెను. కచ్చేరిలో విచారణ యేమున్నది. 'నీవు మాభటుని గంటముతోఁ గొట్టి చంపితివి నీకు మరణశిక్ష యేల విధింపఁగూడదో చెప్పకొందువా' యని నబాబుగా రాయన నడిగిరి. 'ఓయబ్బ గంటపు దెబ్బకే చచ్చిపోయినాడయ్యా గట్టిగాఁ గొట్టనే లేదయ్యా! మాయబ్బ ఎన్ని గ్రంథములు వ్రాసిన గంటమయ్యా! ముందుజన్మమున వాఁడు మంచికవియై పుట్టును. ఈడను మంచి మేలు పొందుటకే యాడకుఁ బోయినాఁడని నమ్మవయ్యా! మఱి నన్నేదో చెప్పమంటి వెందుకు? న న్నడుగు టెందుకు? నీయిష్టము వచ్చినట్టు చేసికోవయ్యా అడిగి యడిగి నీ వేమాత్రము చేయఁగలవయ్యా? పోపో యని కచ్చేరీ నుండి పోవుటకుఁ బ్రయత్నింప భటు లాయనను బట్టుకొనిరి. ఇంతగర్వి, ఇంత పొగరుబోతు, నింతదుర్మార్గుండు లేడని యచ్చటివారంద ఆనుకొనిరి. ప్రజల యభిప్రాయములు సౌష్టవము సౌభాగ్యము నిది. ఈ యంశమునందే కాదు. అన్ని యంశములందు గూడనిట్టిదే. ఆతనితల నఱుకవలయుననిన బాబుగారు భటుల కాజ్ఞాపించెను. " ఓయబ్బ! ఇంతేనా? ఈమాత్రానికి న న్నీడకు బిలిపించు పెందుకయ్యా' యని యాబ్రాహ్మణుడు పలికెను. భటు లాతనిని వధ్యస్థాన మునకుఁ గొనిపోయిరి. తలారి కత్తి చేతఁ బట్టుకొని యాతని మొగము గాచి గడగడ వడంగి నే నీపనిని జేయజాలనని కత్తి నావల బాఱవైచెను. ఏల నఱుకలేవని నబాబుగా రాతని నడుగ ' ఆతనిరూపము నా కేమో భయంకరముగా నున్నది. నాచేతు లాడకున్న వని యాతండు నబాబు గారి పాదముల పైఁబడెను. 'నీవాతనిని నఱుకకుండునెడల నిన్ను ముందు నదఱకింతు’ నని నబాబుగా రాతని బెదరించిరి. అంత నాతడేమిచేయగలడు? గడగడ వడచుకు సుబ్బరాజుగారి కంఠమున బిస్మిల్గాయని కత్తి విసరెను. కంఠము తెగలేదు. మరియొక్కసారి చొరవ తెచ్చుకొని వైచెను. తెగలేదు. " ఓయబ్బ! నీవలనఁగాదయ్యా! భాగవతము తలమీఁదనుండఁగాఁ దలతెగుననియే యనుకొంటివఁటయ్యా! నీబొంద పడ! ఎక్కడనో యడవిమృగమువలె నున్నావు. విను. నీ వేమియుఁ గష్టపడకు. వెనుకకు విఱిచికట్టిన నాచేతులు విప్పవయ్యా? భాగవతము తలమీఁదినుండి దింపుదును. తరువాత సుళువుగా సుఖముగా నఱకుదువుగాని ఎందుకింత యోజన’ అని సుబ్బరాజుగారు పలికిరి. చేతులు విప్పమని నబాబుగారు భటునకు సంజ్ఞచేసిరి. అంత సుబ్బరాజుగారు, కొర్నిపాటి ప్రయాణమునుండి యానిముసమువఱకుఁ దలమీఁదనే కట్టుకొనియుంచిన భాగవతమును దీసి, కన్నులద్దుకొని దూరముగనుంచి దానికిఁ బ్రదక్షిణ మొనర్చి సాష్ట్రాంగ మాచరించి లేచి కోదండరామప్రభో యని బ్రహ్మాండకటాహ మదఱున బ్రొక్క కేక వైచి చాపచుట్టగఁ గ్రిందబడి ప్రాణములు విడిచెను. కత్తితో భటుడింక నఱుకుట యెందుకు? ఆతడెట్టు మరణించెనో? యనియందఱకాశ్చర్యముగా నున్నది. పరీక్షించి చూడగ నాతనినోటినుండి రక్తమొలికినది. పిడుగుపడినట్టు కోదండరామప్రభూ యని యాతండు వైచిన కేకతో గొంతులోని రక్తనాళము తెగి యారక్తపుజుక్కలు వాయుద్వారమునఁ బోవుటచే సూపిరి యాడక నిముసములో మరణ మీతనికి సిద్దించినదని యటనున్న వైద్యుఁడు శాస్త్రీయసమూధానమును (Scientific Explanation) చెప్పి, తనపాండిత్య మందఱకుఁ దెలిసినదో లేదో యని యటునిటు చూచెను. పరమాత్ముని యాజ్ఞ యయినది కావున బ్రాణములు దేహమును వదలిపోయిన వని చెప్పఁగ నందఱకును దెలిసినమాట.

సుబ్బరాజుగారు మరణించిరనుమాట చెవినిఁబడఁగనే కన్నుల కేదైనఁ గనబడునో, కడపులో నేమైన గుబులు పుట్టెనో కాని గడగడ వడకి నబాబుగా రేడ్చిరి. వారికంటె ముందుగానే కాంబోలు వారిభటు లేడ్చిరి. అచ్చటి ప్రజలందఱికంటె ముందుగాఁ గాబోలు నేడ్చిరి. అంద జేడ్చుచున్నారు. ఎందుల కేడ్చుచున్నారో యెవ్వరు నెఱుఁగరు? ఏది? ఆ సమయమున నెవ్వరికైన మతులున్నవా? చైతన్యము లున్నవా? గోలుమన్న రోదనము తప్ప నంతకంటె నేమియులేదు. అంతయు దీఱిన తరువాత నేడ్చిన లాభమేమి? సుబ్బరాజుగారి కథ విన్నవారికే కన్నులు చెమ్మగిల్గవలసి యుండఁగ నాయనకథను జూచిన వారికిఁ గడువు చెఱువయ్యె ననఁగ నాశ్చర్యమేమి? నబాబుగారేమో రామభక్తుఁడైనాడట! అగుగాక. రామభక్తులెందఱో లేరు. వారిలో నాతఁ డొకడు. సదా కోటి జంగాలలో నొక బోడిలింగము. లెక్కయేమి? ఆర్యావర్తదేశమున నారామచంద్రమూర్తి మహాత్మ్య మెఱుఁగని నరుఁడెవ్వఁడు? నరునివదఱ కెందులకు? కోఁతినడుగు, కొండముచ్చునడుగు, కాకినడుగు, గ్రద్దనడుగు అందఱకుఁ గూడ నెందులకు? చెట్టునడుగు, పుట్టనడుగు, ఱాతినడుగు, అప్పనడుగు దేశమంతటను రామనామము శతకోటిజిహ్వలతో మాఱుమ్రోంగుచున్నది. రాముఁడు లేనిచోటేది? రామునిగూర్చి యొకానొక డిట్టు పలికినాఁడు.

సీ. వీధి పురాణంపు వేదికపై నీవు,
పారాయణపు బీటపైని నీవు,
దృశ్యప్రబంధంపుఁ దెరలసందున నీవు,
మృతివార్త శ్రుతిఁ బడ్డ యెడను నీవు,
గొల్లసుద్దుల లేకు డొల్లలలందున నీవు,
యకగానపు జిందులందు నీవు,
చండాలుబుజముపై మొండితంబుర నీవు,
తొలుబొమ్మలసంత గోల నీవు,

పడుకగదుల గోడల నీవు, భక్తహృదయ
రసనలను నీవు, యాయావరతను నీవు,
సృష్టినీమయయేూ? నీవు సృష్టిమయమొ?
యెట్టయిననేమి? రామ! రక్షింపుమయ్య!

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః