సాక్షి మూడవ సంపుటం/ఉత్తరరామచరితము - పటము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

21. ఉత్తరరామచరితము - పటము

వభూతి గురించి తమ సభలో ప్రసంగించిన శాస్త్రిగారు ఆ కవి వ్రాసిన ఉత్తర రామచరిత నాటకం గురించిన మరొక విమర్శను చదువుతానంటే, జంఘాలశాస్త్రి మళ్లీ అవకాశమిచ్చాడు.

ఈ నాటకంలో 'చిత్రపటదర్శనాంకం" అని ఒక అంకం వుంది. ఉత్తరరామచరితను చెప్పడానికి ముందు స్థాలీపులాక న్యాయంగా పూర్వరామ చరిత్ర చెప్పడానికి ఉద్దేశించినదీ కల్పన.

తమ చరిత్రమే చిత్రపటాన వ్రాయించి తామే చూపించుకుని, జనులు సంతోషించడమో, ఏడవడమో జరిగింది ఈ నాటకంలో మాత్రమే.

ఉత్తరకాండం వాల్మీకిదేనని కొందరు, కాదని కొందరు వాదించడం వున్నా, భవభూతి మాత్రం అది రామాయణంలోని భాగమేనని నమ్మినట్టు తోస్తోంది.

వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మాత్రమే సీతారామలక్ష్మణుల హృదయ ప్రకృతుల్ని ఎరిగినవాడు. భవభూతి, ఈ చిత్రపట దర్శనాంకంలో ప్రకృతి విజ్ఞానాన్ని సంపూర్ణంగా, జాగ్రత్తగా పాటించలేదని పండితుడి విమర్శ. కొన్ని కొన్ని సందర్భాలలో సరిగా కనిపెట్టినా, ఏ ఏ సన్నివేశాల్లో 'చిత్రపట దర్శనం’ అనేది విచారాన్ని హెచ్చిస్తుందో, తగ్గిస్తుందో, భవభూతి పొరపడ్డాడని, ఈ విమర్శకుడు భావించాడు. ఈ అంకంలో అంశాన్ని ఒక క్రమంలో ఈయన విమర్శించినా - "దే హి నో ద్విసాంగతాః’ అనే శ్లోకంలో ఆయన చూపిన కవిత్వ శక్తిని ప్రశంసించాడు. ఈ కవికి రసపుష్టి కలిగించడం మీద ఎక్కువ అభిమానమనీ, ఆయన ఆవేశ శీలుడనే 'కిమపి కిమపి” అనే ఒక్క శ్లోకమే ఆయన మహాకవి అనడానికి చాలుననీ తీర్మానించాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను:-

భవభూతి యుత్తరరామచరితమునుఁ గూర్చి కొలఁదినముల క్రింద నుపన్యసించిన యాతండు తిరుగ నొక విమర్శనము చదువును. శ్రద్దతో వినవేడుచున్నాను. శాస్రులుగా రిట్టు చదివిరి: ఉత్తరరామచరితములోని చిత్రము సారస్వత ప్రపంచమందు జిత్రమై యున్నది. నాటకములలో నంతర్నాటకములున్నవి. ఇంద్రజాల ప్రదర్శనము లున్నవి. కాని తమచరి తమే చిత్రపటమున వ్రాయించి తామే చూచుకొని జనులు సంతోషించుటయో, ఏడ్చుటయో జరుగట మాత్ర మీనాటకమందు మాత్రమే యున్నది. ఉత్తరరామచరిత ముత్తరకాండలోని గాథతో సంబంధించినది. ఈకాండ వాల్మీకిరామాణమునఁ జేరలేదనియుం బ్రక్షిప్తమనియుఁ గొంతప్రతీతి యున్నది. కాని యుత్తరకాండకూడ వాల్మీకికృతమే యనియు నుత్తరకాండ కూడ రామాయణములో నొక్కభాగమేయనియు భవభూతి యభిప్రాయమైనట్టుత్తరరామ చరితమువలననే తెలియుచున్నది. అందుచే నుత్తరకాండలోని గాథను ప్రత్యేకముగ నాటక మును వ్రాయఁదలఁచిన భవభూతి, కథైక్యము కొఱకు పూర్వకాండలలోని కథ నతిసంగ్ర హముగాఁ బలికింపవలసివచ్చినది. కౌశికుఁడు రామునకు జృంభకాస్త్రము లిచ్చుట, శివధనుర్భంగము, సీతావినాహము, పరశురామ గర్వభంగము, మంధరావృత్తాంతము, వనవాసము, విరాధాదివధ, మాల్యవత్పర్వతనివాసము, వాయుపుత్రసందర్శనము, సుగ్రీవస ఖ్యము మొదలుగా గల రామకథ లంకలో జరిగిన యార్యాహుతాశనశుద్దివఱకుఁ బటములో లిఖింపఁబడెను. తరువాతఁ బట్టాభిషేకమునకు వచ్చిన బంధువులు వెళ్లగనే యుత్తరరామచ రిత్ర ప్రథమాంకకథ యారంభమైనది. ఇట్టీ క్రొత్తగాథను బ్రాంతగాథతో నాతం డదికినాఁడు. గ్రంథైక్యసిద్దియే భవభూతి యభిసంధి యైనను బటు మందుకొఱకు నిర్మింపఁబడినదని యనగూడదు. కావునఁ దండ్రి మిథిలాపురమునకు వెడలుటవలన బెంగగొన్న జానకీదేవి వేడుకకై యది చిత్రింపఁబడిదనది రామలక్మణులచే ననిపించినాఁడు.

లక్ష్మ- (ప్రవేశించి) ఆర్యులకు జమయగుఁగాక. మనము చెప్పిన ప్రకార మర్డునుఁడు మీ చరితము నీ పటముందుఁ జిత్రించి తెచ్చి నాడు. చూడఁదగును.

రామ:- వత్సా! వ్యాకులచిత్తమైయున్న దేనికి వినోదము కల్పించుమార్గము నీ వెఱుఁగుదువు.

భవభూతి యిట్టు చిత్రపట కారణమును సర్దుబాటుగ జెప్పినాఁడు. కాని యీ పటపరీక్షలో నేమి జరిగినదో యిఁకఁ జెప్పదును.

లక్మణుడు పటమును జూపుచున్నాఁడు.

లక్మ:- ఆర్యా! ఇది చూడఁదగిన పట్టు. ఇతఁడు భగవంతుఁడగు భార్గవుఁడు.

సీత:- (సంభ్రమముతో) నాకు వడకు పుట్టుచున్నది.

కల్యాణమైన పిదప జానకీరాము లయోధ్యకు సబంధుపరివారులైయేగుచుండ దారిలో నడ్డుకొనిన పరశురాముని వృత్తాంతమాతని విగ్రహదర్శనము జ్ఞప్తికి రాగసీతకు వడకుపుట్టిన దని యనుకొన వలయును. అంతేనా? అంతకంటెు గారణమేమైన నుండునా? ఉండదనుట నిస్సందేహము. చిత్రకారుఁ డొక్క పరశురాముని మాత్రమే చిత్రించి యూరకుండడు కదా? రాముఁడతని చేతిలో నున్న ధనస్సుతో పాటతనితేజముఁగూడ లాగుకొనిన సన్నివేశ మక్కడనే చిత్రింపబడియుండక తప్పదుకదా? శివధనున్బంగమే కాక పరశురామ గర్వభంగముఁ గూడ నొనర్చిన జగదేకవీరుడైన భర్త తన ప్రక్కనే యుండ నవిగ్రహ మును జూచి యుత్సాహపడునా? అప్పడే యనంగ 24 సంవత్సరముల క్రింద సంతరించిపో యిన భార్గవుని బొమ్మఁ జూచి భయపడునా? అపాయమేదో దాటిపోయినది. ఆ ప్రయత్నము చేసినవాఁడు శాశ్వతముగా శక్తివిహీనుడై పోయినాఁడు. అపకారమునుండి రక్షించిన జగద్రక్షకుఁడు తనప్రక్కనే యున్నాఁడు. ఇఁక భయమెందులకు?

అదేమి మాట? స్త్రీలు సహజముగ భీరువులు. సహజముగా భయమునకు హేతుకల్ప నశక్తితాత్కాలికముగ నశించును. అందుచేత భయమిచ్చుట సహజమే యని యందురా? సహజమో కాదో తరువాత విమర్శింతము. ఇప్పటి వఱకు సహజమనియే మాటవజున కొప్పకొందము. మాసపూర్తి యగుటచేఁ గొలదిదినములలో సుఖప్రసవము కావలసిన సీతామహాదేవి కా సమయమున భయమను చిత్తావస్థ కలుగనీయవచ్చునా? పటదర్శనము సీతాదేవివేడుకకయి కదా చేయబడుచున్నది. భయము కలిగించుట వేడుకా? భయమువ లన నరములపట్టు లూడిపోవునని యందఱెఱిగినదే కాదా? అట్టి దురవస్థ పూర్ణ గర్భవతికిఁ గలుగనీయఁ దగునా? అది కలిగినతరువాత నయినను బటములో నావలి చిత్రములను జూపించుట లక్మణుడు మానినాడా? లక్మణుడు చిన్నవాఁడు కావున నాతనికిఁ దెలియక పోవచ్చును. గాని పట మింక మానుమని రాముఁడైనను లక్మణుని మందలింపలేదే! ఇది విరుద్దముగఁ గనబడుట లేదా? ఇప్పటి కంత విరుద్దముగా లేదనుకొందము. కాని రాముడింకమీద లక్ష్మణున కట్ జ్ఞాపించి పటము పాఱవేయించునేమో చూతము.

లక్ష్మణు డింక బటమును బఠించుచున్నాడు.

లక్మ:- ఇది శూర్పణఖావృత్తాంతము.

సీత:- హా ఆర్యపుత్రా! ఇంతవజకే నీ దర్శనము.

రాము:- వియోగ త్రస్తురాలా! ఇది చిత్రపటము సుమీ.

సీతాదేవి భయాకులచిత్తయై యుండెను. ఇప్పడు కూడ బటమాపవలసిన దని రాముఁడు లక్ష్మణునితోఁ జెప్పక “వియోగమును వచ్చునని జడిసెదవేల? ఇది చిత్రపటము సుమా" యని సీతాదేవికి ధైర్యము గెప్పినాఁడు. బొమ్మను జూచి భయముగాని దుఃఖముగాని పడనక్కఱ లేదు. లేదని రాముని యభిప్రాయ మైనట్లు స్పష్టము. కాని ఈ పంక్తికిఁ బైపంక్తియందే యనంగా నొక తెప్పపాటు కంటెఁ దక్కువకాలములోనే రాము డిట్టు పలికెను.

రాము:- అక్కటా! జన్మస్థానవృత్తాంతమిప్పడు జరుగుచున్న పొడకట్టుచున్నది నాకు.

లక్ష్మ:

చ. అలహరిణంబు రూపమున నట్టు మిషం బచరించి క్రూరులై
కులిశము ప్రక్కలౌ పగిదిఁ గొండలు సైతము నేడ్చునట్టు మి
మ్మలమజచేసినట్టి కుటిలానురవృత్తము నెల్ల బాపికోఁ
గలిగితి మైన నద్ది పొడగట్టినచో నెద ప్రక్కలయ్యెడున్.

ఈ దుఃఖకరసన్నివేశము చూడ గుండెలు పగిలిపోవుచున్న వని లోన లక్మణుడగ్ని పర్వతమువలెదపించుచున్నాఁడు. కాని జానకీదేవి యేమిచేయుచున్నది.

సీత:-(సబాష్పయై) తనలోను) అక్కటా! దినకరకులనందనుఁడు కూడ నాకారణ మున నట్టు క్షేశపడెను గదా!

భర్త తన కొఱకు వెనుక నేడ్చినాడని యామె యిప్పడు లోన నెంతైన నేడ్చుచు న్నది. బాష్పములు కన్నులవెంట ప్రవహించుచున్నవి. కాని పెదవులు విప్పకుండ లోలోననే యామె యేడ్చుచున్నది. ఈ యేడ్పు మఱింత యపాయకరము కాదా! తొమ్మిది నెలలు నిండిన చూలాలిట్టి మహాదుఃఖము నడచిపెట్టుటకై చేసిన యస్వభావప్రయత్నము వలన నేమిపుట్టిమునుంగునో యని భర్తగాని మఱదిగాని యాలోచించినారా? లేదు కాని రాముఁ డేమి చేయుచున్నాడో ఏమిచేయు చున్నాండో లక్ష్మణుడే చెప్పచున్నాఁడు విందుము.

లక్ష్మ:-(రాముని బరికించి సాభిప్రాయముగ) ఆర్యా! ఇదియేమిటి?

ఆ. సరము పెరుగ రాలు వరమూక్తికములు నా
దొరలు నశ్రు లివ్వె ధరణిమీఁదఁ
గదలుచున్న నాసికాపుటాధరములు
బిగియఁ బట్టి నట్టి వగపుఁ దెలుపు,

“వియోగగ్రస్తులారా! ఇది చిత్రము సుమా!' యని సీతాదేవికి ధైర్యము బోధించిన రామచంద్రమూర్తి యుత్తరరక్షణముననే కన్నీరు భూమిమీఁదఁ బడి నిల్చి గుర్తులైయుండు నంత విరివిగ విస్తారముగ నేడ్చినాఁడు. ఎటువచ్చినను ధీరోదాత్తుఁడు గావునఁ బెదవులు బిగఁబట్టినాఁడు. పోనీ యీబిగఁబట్టుట మాత్ర మెంతవఱకు నిల్చినదో చూతము. ఉత్తరపం క్తియే చదువుచున్నాను వినుఁడు.

రాము:- వత్సా!

తే. ప్రియను బాసిన దుఃఖంబు పెద్దయైన
శత్రు సాధించువాంఛచే సై చినాడ
మరల దుఃఖాగ్ని యధికమై మండుచుండి
మెండు బాధించు నెదలోని పుండువోలె.

ఇట్టు రాముఁడు పండ్లపట్టు విడిచి బారుమనెను. జనార్ద నవృత్తాంతమును బటమునఁ జూచినప్పడే 'దినకరకులనందనుఁడు నాకారణమున నెంతయేడ్చినాడో" యని జానకీదేవి యేడ్చియుండఁగఁ నిలువున నెగిరి పోవలసినదే కాదా? అప్పడు సీత యేమన్నది.

సీ:- అతిమాత్ర భయావేగముచేత నే నిప్ప డార్యపుత్రునిఁ బాసినట్లు తోఁచుచున్నది.

అక్కటక్కటా! చూచితిరా! దుఃఖము భయము నతిమాత్రములైనవి సహించుకొనఁ దరమా? ఎదుటనున్న భర్త యామెకన్నుల కగపడుటలేదు. తనకు రామునితో విరహము కలిగినదని భ్రమమునఁ బడియున్నది. దృఢశరీరులు దృఢమనస్కులే సహింపలేరు కదా? అందుపై స్త్రీ-అందుపై రాజకాంత-అందుపై మహాసుకుమారి-అందుపై బూర్ణగర్భవతి. భగవత్కటాక్షమున నామెచూలు నిలిచెను గాని నిలువఁదగినదా? అట్టు తటస్టించునెడల సీత బ్రతుకునా? రామలక్ష్మణులు కూడ నామెగతియే పొందకుందురా?

రాముఁడప్ప డేడ్చిన యేడు పెందులకో “జానకీదేవి విరహమెంత దుస్సహమైనను శత్రుని సాధింతమను తీవ్రవాంఛచేత దానిని వెనుక నడఁచుకొంటిని. ఇప్ప డడఁచుకొనుట యేలాగు? అని యేడ్చెను. ఈ కారణముచేతమాత్ర మింతగా నేడ్వ దగదని నామనవి 'పూర్వమున నాకుఁ కలిగిన దుఃఖ మొకకారణముచేఁ గలిగినది. దుఃఖమున కేదో కారణమున్నది కదా యని వెనుక దానిని సహించుకొంటిని. ఇప్పడేడ్చుటఁకు దగిన కారణము లేకుండనే కలిగినయేడుపు నెట్లు సహించు కొనగలనని యేడ్చుచున్నా" నని యొకడు మనతోఁ జెప్పిన నెట్టుండునో రాముఁడనిన మాటకూడనప్డేయున్నదనియనవల సివచ్చినందుకలకు విచారించుచున్నాను. 'ఏడ్చుటకు గారణము లేనిదే. యేడు పేలకలుగ వలయు" నని మన మాతని నడిగిన ఫ్టే “శ్రీరామచంద్రమూర్తీ పూర్వము మహాశత్రు వుండుటచేతనే సీతావిరహము కలిగినది. ఆ శత్రువును జంపు వాంఛచేతనే విరహమును సైచికొంటమి. నిజమేనా? ఇప్పడో శత్రువునే కాక సర్వశత్రువులను జంపితివే. శత్రువే లేనప్పడు విరహమని యేడ్చుట యెందుల"కని యడుగవలసినది కాదా? పోనిండు. ఈ గొడవ యేల?

ఇంతపుట్టి మునిఁగినను బట మావల బాఱవేయుమని రాముడనలేదే, ఏమో.

గర్బవతుల వేడుకలకై జరిగించుట కెన్ని వినోదము లున్నవి. వీణాగాన మొనరించవ చ్చునే. ప్రహసనము లాడింపవచ్చునే భక్తిభోధకములగు గ్రంథములు వినిపించపవచ్చునే. భయము కలుగునని యింద్రజాలము లాడింపవచ్చునే. పగటిభాగవతుల కాలక్షేపములు జరిగింపవచ్చునే. లక్షలకొలఁది గ్రామములుండఁగా వెనుక లేనిదియు, ముందెవ్వఁడు ననుక రింపనిదియు నగు చిత్రపటమును రచియింపించి గర్బవతి యెదుట బెట్టి బొమ్మలవివరము చెప్పదురా? సంతోషముకొఱకు చేసినయినాపని సీతారామలక్ష్మణుల మహాదుఃఖమునకుఁ గారణమైనదే. పటమిప్పడైనా విసర్జింపఁ దగదా?

వాల్మీకి యొకఁడు, వశిష్ణుఁ డొకఁడు, విశ్వామిత్రుఁడొకడు వీరు మువ్వురు మాత్రమే సీతారామలక్ష్మణుల హృదయప్రకృతుల నెఱింగినవారు. మిగిలిన రామకథాకర్తలందఱు తమతమ ప్రకృతులనే యామహావ్యక్తల కారోపించి మాటలాడించినవారే. అందుచేత భవ భూతి మాట లాడించినట్టు సీతారామలక్ష్మణులు మాటలాడినారు. వారి కిందుతో నేమీయు సంబంధము లేదు. పటమర్డునుడు వ్రాసినాఁడు. ఆతడు శ్రీరామ కాలములనో నుండిన చిత్రలేఖకుఁడు కాంబోలు. పటములో దోషమేమియు లేదు. ఇంక భవభూతి ప్రకృతి జ్ఞానమున గుణమెచ్చట నున్నదో లోపమెచ్చట నున్నదో మనవి చేయుదును.

వ్యాకులచిత్తయై యున్న సీతాదేవి కుత్సాహమును గలుగఁ జేయుటకుఁ జిత్రపటము సమర్ధమని గొప్ప ప్రకృతిజ్ఞానముచేత భవభూతి కనిపెట్టినాఁడు. అంతేకాక చిత్రపటము కొన్ని కొన్ని సన్నివేశములందు విచారము హెచ్చుచేయునన్న సంగతిగూడ దనప్రకృతిజ్ఞాన ముచేతనే కనిపెట్టినాఁడు. కాని యే సన్నివేశములందు విచారమును దగ్గించునో వేనియందు హెచ్చించునో గ్రహించుటయందుఁ గొంత పొరపాటు పడియుండెనని నాకు దోఁచినది.

నాయనలారా! కొంచెము శ్రద్దతో వినుడు. ఈ సందర్భము నందలి నామాటలు మీ మనస్సుల కెక్కవేమో యని యనంగా నెక్కునంత స్పష్టముగ నేను జెప్పలేనేమో యని భయపడుచున్నాను.

మనమందఱము సుఖములు పడుచున్నాము. కష్టములు పడుచున్నాము. సుఖములు శాశ్వతములు కావు. కష్టములు శాశ్వతములు కావు. కష్టసుఖములు రెండునుగూడ మనమన స్సులందు స్థిరములైన సంస్కారములను గలుగఁజేయు చున్నవి, మనము స్వభావసిద్దముగా వెనుకబడిన సుఖములను గష్టములను గూడ స్మరించెదము. మన మనః పటములంధుఁ గష్టసుఖములను భగవంతుడు చిత్రించినాఁడు. ఆపటము యొక్క యనుకరణమే భవభూతి పటము....సుఖసంస్మరణములు.

పశ్చాత్తాప సహితములు కాకున్నయెడల సుఖమునే యొసంగును. కష్టసంస్మరణ ములు మాత్ర మొకప్పడు సుఖము నిచ్చును, ఒకప్పడు కష్టము నిచ్చును. అది యెప్పడు? ఇది యెప్పడు? మనమెన్ని కష్టముల బడిన సరియేకాని యొక్క ప్రాణమైన పోకుండ నందఱము బాగుగానుండి కష్టములు దరించుట సిద్దించినయెడల నీకష్టములస్మృతి యందు విచారమెంతమాత్రము కూడ గలుగదు. అంతేకాక యుత్సాహము కూడా గలుగును. కష్టము గడచిపోయిన కొలఁది కాలమునకైన మన మందఆము కలిసి యాకష్టములగూర్చి ముచ్చ టంచుకొనుట మిగుల నానందదాయకమగును. ఎక్కట కష్టములు పడితిమో యాస్టలము చూచునప్పడు పూర్వకష్టములలో మనము కనఁబఆచిన ధైర్యము భక్తి సాహసము నుగ్గడిం చుకొని యుత్సాహ మందుదుము. వెనుకటి కష్టము లలో మనము బేలగుండెతో నేడ్చినను వానిని స్మరించు కొనునప్పడు మాత్రము కష్టములు మన ప్రయోజకత్వము చేతనే కడతేeజీన వని రవంత వెల్లడించుటకై కొన్ని రజ్జలు కొట్టుటకూడ సామాన్యమనుజ స్వభావమైయు న్నది. పూర్వాను భూతము లగు నెంతభయంకర దుఃఖకరసన్నివేశములు స్మరించుకొనిన ప్పడైనను గాసంతయదటు తెప్పపాటు కాలములో దళుక్కుమని కొన్ని యత్యంతభీరు ప్రకృతులందుఁ గలుగునుగాని వెంటనే యాభయము దుఃఖము నడఁగిపోవును. అంతేగాని వడఁకుటవలకుఁ గాని యేడ్చుటవఱకుఁగాని యెన్నడు రాదు. మన మందఱము బాగుగా నుండి కష్టముల దరించినప్పడే స్మృతి కాలమున నీనిర్విచారస్థితి.

అందుచేత సీత భార్గవునిఁ జూచి వడఁకిన దని చెప్పట స్వభావ దూరము. అప్డే పటదర్శనమున సీతా శోకము, రాముని దుఃఖము, లక్మణుని మనఃపరితాపము సహజములు కావని నామనవి.

కాని పటము దుఃఖమును గలుగఁజేయు సన్నివేశమేదనంగా: మనకత్యంత ప్రేమాస్ప దులగువా రెవ్వరైనా మృతులైయుండ వారి విగ్రహదర్శనము మనకు సంతాపము కలిగిం చుము. ఇది కూడ కాలక్రమమునఁ దగ్గును. సీతాకళ్యాణమైన తరువాత నయోధ్యప్రవేశించు సందర్భమున లక్మణుడు పటమునఁ బఠించుచున్నాడు.

లక్మ:- ఇదిగో మన మయోధ్య ప్రశేశించితిమి.

రాము:- (కన్నీరు విడుచుచు) తలఁపునకు వచ్చినది. అక్కటా! తలంపునకు వచ్చినది.

గీ. నాన్నగారు సజీవులైయున్నయప్ప
డమ్మ లిమ్ముగ సేమమ్ము నరయుచుండ
గ్రోత్తగా సాగివచ్చిన కూర్మి సతులఁ
గలసి మనమున్న యాదినములు చనెను నకటు.

సంస్కృత శ్లోకము:
జీవత్సు తాతపాదేషు, నూతనే దారసంగ్రహే
మాతృభిఃపాల్యమానానాం, తే హి నో దివసాగతాః.

భవభూతి ఈసన్నివేశమున నీ చిన్న శ్లోకముచే రాము నేడ్పించి యాతని పితృప్రే మను మిగులఁ జాకచక్యముతో లోకమునకింకొకసారి వెల్లడించి కృతార్డుఁడైనాడు. ఇంతేకాక కుటుంబాధికారియైన తండ్రి కుటుంబ సంరక్షణ చేయుచుండ గరుణాలవాలయైన తల్లి సమస్తోపచారములు చేయుచుఁ గన్నబిడ్డలను గన్నులలోఁ బెట్టుకొని పెంచుకొనుచుండ గ్రోత్తగాఁ గాపురమునకు వచ్చిన భార్యలతో నిర్విచారమగు నిత్యమహానందము నొందు పడుచువారి సౌఖ్యాధిక్యమును, సర్వకాలములందలి, సర్వదేశములందలి, సర్వజాతులందలి సంసారముల కన్నింటికి సరిపోవునట్టు వర్ణించి దేవతలు తనపై బుష్పవృష్టి గురియ దనంత కవితా ప్రాగల్బ్య మీ కవి యనుష్టుపునం దగపరచినాడు. సెబాన్.

కాని మృతుఁడైన తండ్రిపటమును జూచిన విచారమైననుఁ గాలక్రమమునఁ దగ్గునని మనవిచేసియున్నాను. కొంతకాలమునకు మృతుల పటములు గూడ సంతోషదాయకముల గును. ఈ విగ్రహము మా తండ్రిగారిదని, యిది మా తల్లిగారిదని యితరులకుఁ బ్రత్యాసక్తిగా మనము చూపింతుము. అపసవ్యపుఁ జావులు మాత్ర మధికకాలము తీసికొనక తప్పదు.

పటసందర్భమున భవభూతి చేసెనని నాకుఁదోఁచినలోపము లేవో కనఁబఱచినాను. అవి యసహజములని యాతం డెఱుగఁడా యని మనము కఠినముగ మనలఁ బ్రశ్నించుకొం దము. 'ఎఱుఁగడని యెట్టు స్పష్చముగఁ జెప్పఁగలము." ఎఱిగియుండియు నేల యట్టు వ్రాసినాఁడు.

నాటకమునకు భావికథా సూచనము మహాభూషణము. ఈకవికి భావికథా సూచన యందున్న వాంఛ యింత యంతకాదు. ప్రతిస్వల్పవిషయ మందులకే ఉపయోగించినట్టు ప్రయత్నించును. ఈ కవికి రసపుష్టి కలుగఁజేయుటయం దభిమాన మసాధారణము. ఈకవి యావేశపూరితమైన హృదయము కలవాఁడనుట స్పష్టము. అట్టియావేశసందర్భములందు బ్రకృతిసూత్రములను గొంత యలక్యము చేసినను జేయఁగల స్వతంత్రుఁడు నిరంకుశుఁడు.

ఉత్తరరామచరిత్రము ప్రదర్శింపఁబడఁగ రెండుసారులు చూచితిని. రెండుసారులు కూడ మొదటి యంకమేమో చూచువారికి విసుగు గలిగించినది. తరువాతి యంకము లఖండరసప్రవర్షణ సమర్ధములైయున్నవి.

"కిమపి కిమపి మందం మందమాసత్తియోగా
దవిరలితకపోలం జల్పతోరక్రమేణ

అశిథలపరిరంభవ్యాప్పతైకైకదోష్ణో
రవిదితగతయామా రాత్రి రేవ వ్యరంసీత్."

అన్న శ్లోకము మాత్రమే నిల్చి మిగిల్చిన యాతని శ్లోకములన్నియు నేమాయచేనైన శాశ్వతముగ నంతరించిపోవుట సిద్దించినను నీ కవిని శాశ్వతజీవునిఁ జేయుట కీశ్లోక మొక్కలకియే చాలును. కరుణ రసమందీతం డద్వితీయుడు. ఈతని భావనాశక్తి యసాధారణము.

మల్లెపువ్వు దూరి-మధుపంబుతోబాడి
గంధవాహుతోడ గలసి వీచి
యబ్దిలోన మునిఁగి యార్వవహ్నిని డాగి
నీటిబుగ్గయగుచు నింగి బ్రాంకి
తోఁక చుక్కతోడ ఢీకొని శ్రమజెంది
సాంధ్య రాగనదిని-స్నానమాడి
తనువునిండ నింద్ర-ధనుసురంగులు పూసి
కైరవాప్నసుధను-గైపుజెంది
గోఛగానరుతికి-మేళవింపుగ బాడి
పాడి యూడియూడి-పాడి సోలి
భావనామహత్వ-పటిమను బ్రహ్మమై
పోవుకవికి గోటిమైుక్కు లిడుదు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః