సాక్షి మూడవ సంపుటం/ఆంధ్రసాహిత్యపరిషదేకాదశ వార్షికోత్సవ అధ్యక్షోపన్యాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

35. ఆంధ్రసాహిత్యపరిషదేకాదశ వార్షికోత్సవ అధ్యక్షోపన్యాసము

ఆంధ్రదేశ సాహిత్య చరిత్రలో, గ్రాంథిక భాషా పరిరక్షణ కోసం 1911లో ఆంధ్రసాహిత్య పరిషత్తు అవతరించింది. ఈ పరిషత్తు స్థాపక, వ్యాపకులలో పిఠాపురం మహారాజా సుర్యారాయ మహీపతి, జయంతి రామయ్య పంతులు ప్రముఖులు.

ఈ పరిషత్తు 11వ వార్షికోత్సవం దుందుభినామ సంవత్సర భాద్రపద శుద్ద ఏకాదశి రోజున పిఠాపురంలో జరిగింది. ఈ సభకు పానుగంట లక్ష్మీనరసింహారావు గారు అధ్యక్షత వహించి చేసిన ఉపన్యాస పాఠం ఇది.

ఆయన ముందుగా పిఠాపురం విశిష్టతను, ఆ సభ జరుగుతున్న మహారాజు మందిరం విశిష్టతను ప్రశంసించారు. అప్పటికి వున్న ఆంధ్ర భాషా స్థితిని-నాటకీయంగా-ఎదుట దృశ్యం కనిపిస్తునట్టు వర్ణించారు. ఎన్నెన్ని రకాల సాహిత్యం, ఎన్నెన్ని రకాల కవుల సందడి, దేశాన్ని క్రమ్ముకొనివుందో విశదం చేశారు. ఆంధ్రదేశ ప్రజలలో నూటకి ఇరవై మందికి మించి ఆంధ్రభాషా జ్ఞానం లేక పోవచ్చుగాని-అదే చాలునన్నారు.

ఆంధ్రులైన వారు ప్రతి వ్యక్తీ, ఆంధ్ర గ్రంథాల్ని కొనాలని విన్నవిం చారు. ప్రజాపోషణ గ్రంథకర్తలకు అవసరమన్నారు. పుస్తకాలలో మంచివాటిని గౌరవించాలనీ, చెడ్డవాటిని బహిష్కరించాలనీ, సూచించారు. తెలుగులో ఉత్తమ సాహిత్య విమర్శ' అభివృద్ది కావడానికి పరిషత్తు కృషి చెయ్యాలన్నారు. ఒక్క సాహిత్య సంబంధ గ్రంథాలేకాక, అనేక ఇతర శాస్త్ర గ్రంథాలు కూడా తెలుగులోకి అనువాదం కావాలనీ, ఛందస్సులో కవిత్వ రచనే కాక, వచనసాహిత్యం విరివిగా పుట్టి భాషను అభివృద్ది చేయాలనీ, కవుల చరిత్రల్నీ, చిత్రపటాల్నీ పరిషత్తు సేకరించాలనీ, ముఖ్యంగా వివిధ వచనశైలీ నిర్మాణం రచయితల వల్ల జరగాలనీ కోరారు. ఇందుకు ప్రజలు, పరిషత్తుకి ఆర్థికంగా చేయూత ఇవ్వాలన్నారు. అర్హులైన పండితులకు, పరిషత్తు బిరుదులివ్వాలని సూచించారు. కొంత సొమ్ము కేటాయించి పేదకవులను ఆదుకొనే యత్నం చేయాలన్నారు. ఏటా వార్షికోత్సవ నివేదికల కంటె ముఖ్యంగా పరిషత్తు, నిర్మాణాత్మకమైన కృషి గ్రంథ రచన రూపంలో చూపించాలన్నారు.


ఆంధ్రసాహిత్యపరిషదేకాదశ వార్షికోత్సవసభకు న న్నగ్రాసనాధిపతిగా నియమించి నందులకు మీ కెంతయుఁ గృతజ్ఞఁడను. క్రిందటిసారి యేలూరులో నిట్టిసభ జరిగినప్పడు నన్నగ్రాసనాధిపతిగాం కోరిరి. అప్పటి యనారోగ్యస్థితివలన నేనంగీకరింపక పోయినప్పటికి నన్నుఁ దిరుగ నెన్నుకొని గౌరవించినందుకు మఱింత కృతజ్ఞఁడను.

నేను బండితుఁడను గానని యీయూరివా రెఱుఁగుదురు; పై గ్రామములవా రెఱుఁగుదురు. నన్నెఱిగినంతవఱ కాంధ్రదేశమంతయు నెఱుఁగును. సాహిత్యహీనతలో జనమెఱిఁగినవాఁడను గాని సాధారణుఁడను గాను. ఇట్టి నన్నుఁ బరిషత్తు వారేల యెన్నుకొన వలయునో నాకు దెలియదు. తెలిసినవిషయ మేమియో యంతకంటెఁ దెలియదు 'వెనుక జరిగినది పది పరిషత్సభలకుఁ బండితుల నెన్నుకొంటిమి కదా! ఈసారి యపండితు నెన్నుకొందము. ఇంతలోఁ జెడిపోవున దేమున్న దని యూహించి మార్పుకొఱకైన న్నెన్నుకొని యుందురేమో! ఎటులైన నేమి? అవిలంఘ్య మైన మహాజనులయాజ్ఞ దులసీ దళమువలె శిరమున ధరించి యిటు నిలువఁ బడితిని. నాకు సందేహమెందుకు? న స్టిటనిలువఁ బడుటకు నియమించినవారే నాచేఁ దమకార్యమును నిర్వహింపించు కొసుభారమును వహించి యున్నపుడు పనికి మాలి సందేహము లొందుటకంటెఁ బామరత్వముండునా? కవి కుండం దగిన యోచన, తొట్రుపాటు, సందేహము, నలజడి కవిచేతిలోని కలమున కెందుకు? ఈస్వల్పసాధనమును మీ యిస్టానుసార ముపయోగపఱచు కొని మిమ్ము మీరు కృతార్డులుగఁ జేసికొనుడు. కలముగూడం గాసంత మంచిదే యనునట్టు నన్ను రవ్వంత కృతార్థుడునిఁ జేయుఁడు. చేయుట కవకావము లేక పోయిన బోనిండు. ఇంక గార్యక్రమము ననుసరించి సభాచర్య జరిగింతము. -

సమ్మాన సంఘాధ్యక్షులగు శ్రీశ్రీపిఠాపురమహారాజావారి మనోహరమైన యుపన్యా సమును వింటిమి. దానినిగూర్చి నే నేమైనఁ జెప్పవలసియుండు నెడల నా యుపసంహారోప న్యాసము ముందుఁ జెప్పెదను. ఇంక నా యుపన్యాసమును జదివెదను.

పీఠికాపురము:- ఈసభ పీఠికాపురమునకే తదాస్థానమహారాజువారిచే నాహ్వానింపబ డినది. ఆహ్వానించినవా రెట్టినారు? ఆంధ్రభాషాపోషకులు, నాంధ్రభాషాకోనిదులు, నాంధ్ర భోజబిరుదార్థులు, నత్యంతసుగుణసంపన్నులగు నీ మహారాజుగారు, ఆహ్వానింపఁబడిన దేది? అన్ని దేశ భాషలలో సమృతాధిక మాధురీధురిణీయని యేభాషయాచంద్రార్కభ్యాతిఁ గాంచినదో, యేభాషామతల్లిని సేవించుటచే రాజరాజనరేంద్రుఁడు మన యందఱ యిండ్లలో దేవతార్చన వేదికలపై దివ్యమూర్తులతో పాటు పూజ నందుచున్నాడో యేభాషాయోష నభ్యర్చింటచేఁ గృష్ణదేవరాయల యశస్సింహాసన మష్టదిగ్గజములు వహించుచున్నవో యట్టి యాంధ్రభాషాదేవిని సేవించులు కేర్పాటుకాబడిన సాహిత్యపరిషత్తు. ఆహ్వానించిన దెచ్చ టికి? రామలింగకవి కాలమునకుఁ బూర్వమునుండియే కాక యిప్పటికి గూడ గళింగదేశా భరణమగు పీఠికాపురమునకు, మల్లన్న-ప్రొఢకవి మల్గన్న కాఁడు. పావులూరి మలయమారు తముతో వచ్చిన రసికజన మనోభిరామ పరిమళము లిటకు రెండుబారలలోనివే. లక్షణాపరి ణయ శబ్దాలంకారపు టంగుటంగు లిక్కడికి మూఁడుబారలలోనివే. అయిన నిది కేవలము సారస్వత ప్రాముఖ్యమునందిన పట్టణము మాత్రమే కాదు. శివకేశవసన్నిధానమునఁ బరమపవి త్రమైనది కూడను; పాదగయాక్షేత్రమగుటచే నిది మహాక్షేత్రము. అష్టాదశపీఠములలో నిది యొకటి. మహాకవినిలయ మగుటచే రక్తికి, మహారాజాస్థాన మగుటచే భుక్తికి, మాధవమహా క్షేత్ర మగుటచే ముక్తికి నిదానమైన యీపుర మాంధ్రదేశ మహిళా మతల్లికంఠ మాలానాయకమ ణియై ప్రకాశించుచున్నది.

ఇదిగాక చీనాదేశపువారి రాయబారి హియా త్సాంగ్ అనునాతండు మన యార్యావర్త దేశమునకు వచ్చి యిచ్చటి విశేషములు వ్రాయుటలో దక్షిణమునఁ బిష్టసుర మనునొక ప్రసిద్దమైనపట్టణ మున్నదని వ్రాసినాఁ డనియు, నంతకు బూర్వుఁడెమడో గ్రీస్తుదేశస్తుఁడు కాఁబోలుఁ బిష్టపురఖ్యాతిని వెల్లడిచేసి యుండె ననియు మ-రా-రాస్త్రీది హానరెబిల్ న్యాయ మూర్తి వేపా రామేశము పంతులుగారు నాతోఁ బలికిరి. ప్రాచీనచరిత్రాంశ విమర్శనాసక్తులగు వారిమాటలను బట్టి యీ పట్టణము దాదాపుగాఁ గ్రీస్తుశకమునకుఁ బూర్వమునుండియుఁ బ్రసిద్ది వహించియున్నదేమో యని యెంచఁదగియున్నది.

మహారాజమందిరము:- అట్టి యీపట్టణమున మహారాజమందిరమున మనసాహిత్యప రిషత్తు సమావేశమైనది. సంగీతసాహిత్య ప్రసిద్దుం డగు కవివర్యుని యనేక చిత్రవిచిత్రార్ధప్రతి పాదనయుక్తమైన వసుచరిత్ర సంగీతపురాణ పఠనము జరిగిన దీ సభయందే. సర్వకామదకుఁ బరిణయ మెందుకోయి యని రామభక్తుఁడైన లక్మణుఁడు కృష్ణమూర్తిని బరిహసించిన దీ సభయందే. బులుసు వారింటఁ బుట్టిన విద్యారణ్యుఁడు. ముప్పది రెండుపుట్ట రత్నగర్బను రామార్పణముగ గ్రహించిన దీ సభయందే. భరతాధ్యుదయాధిపతి శతఘంటక కవిత్వకాల మున శారదా దేవితోకూడ గజైలు కట్టుకొని తాండవించిన దీ సభయందే. రావువంశ ముక్తావ ళిని రామరాజేంద్రుని కంఠసీమ నలంకరించిన యాస్థాన సోదరకవు లర్టసింహాసన మధిష్టించిన దీ సభయందే. కవులకుఁ గనకవర్ష మన్ని ఋతువులందుఁకూడఁ గురియుచున్న దీ సభయందే. నవీన గౌతములు, నర్వాచీన పాణినులు, నూతన బాదరాయణులు విజయదశమినాఁడు మా మహారాజేంద్రునిపై వారి పుత్రపుత్రికాసంతతిపై నాశీఃప్రసవవృష్టి: గురియించుచున్న దీ సభయందే. ఆస్థానవైణికాగ్రగణ్య వీణారవామృతా స్వాదనానశములైన చిలుకలుఁగూడ స్తంభోపరివిటంకముల నుండి సహవైఖరిని ‘రామా" యని యనఁబోయి సంగీతవైఖరిని ‘రీమా" యని యనుచున్నదీ సభయందే. అట్టి యీసభయందుఁ దెనుగు రాయడు మొదలు తెనుగుభాసలో బండితుడు తెలుగుబాసకు బరిపోషకుడు నగు నీ మహారాజువఱకు విద్యా పోషణమునకు విశేషవిశ్రుతి కెక్కి దినదిన ప్రవర్దమానముగ నెక్కుచున్న యితోధికవృద్దిగా నెక్కఁ గల యీసభయందు, రమాశారదా కేళీ మందిరమగు నీ సభయందు మనము నేఁటికి సమావేశమైతిమి. ఎందుకు? ఆంధ్రశారదా దేవీసమారాధన మునకు. ఆహా! ఎంత మహాకార్యమునకై-యెంత మహారాజుచే నాహ్వానింపఁబడి యెంత మహాక్షేత్రమున నెంత మహోన్నతయశస్వంత మైనసభయం దెందఱు మహాకవిపండితులు సమకూడిరో ఆంధ్రభాషా పండితులను, నాంధ్రభాషాభివృద్దికైయత్యంతము శ్రమమొనర్చు చున్న వారును నగు గౌరవ్యులకు శ్రీరాజా పానుగంటి రామారాయణంగారు నిరంతర రాజకార్యనిర్వహణ దీక్షాబద్ధులై యుండుటచే నిటకు దయచేయుట తటస్థింపదేమో యని సందేహించితిమి. కాని యాదృచ్చికమునఁ గార్యాంతరములచే గంజాము మండలమునకు వారు వచ్చి తిరుగ మదరాసునకుఁ బోవునప్పడు తమ మిత్రులగు మా మహారాజుగారిని జూడనిట దిగి పరిషత్సభ నిట్టలంకరించుట భాషాభిమానుల కందఱకుఁ బరమానందముగా నున్నది. మదరాసులో రాజప్రతినిధిగారు ప్రథమమంత్రి వీరగుటచే రాజప్రతినిధిగారే పరిషత్సభ నిట్టు బహూకరించి రని యెంచవలసి యున్నది. ఆహాహా! ఇది యెంత మహాసుది నము! సెప్టెంబరు రెండవతేది. పోనిండు. అని మన కెందుకు? దుందుభినామ సంవత్సర భాద్రపదశుద్పైకాదశి భాషాచరిత్రయందు బంగారు వర్ణములతో ముద్రింపవలసిన భద్రతిథి కాదా? ఆంధ్రశారదాజయంతి జరుపఁదగిన యమూల్య దిన మిదియేకదా! ఆంధ్రభాషకు జయమగుఁ గాక! ఆంధ్రభాషా పోషకులకు జయమగుఁ గాక? ఆంధ్రసాహిత్యపరిషత్తునకు జయమగుఁ గాక!

ప్రస్తుతాంధ్రభాషాస్థితి:- ఆంధ్రభాష ప్రస్తుత మెట్టి స్థితిలో నున్నదో రవంత చెప్పె దను. నేను జెప్పట యెందుకు? ఆంధ్రభాషాదేవి యెట్టున్నదో మీరే చూడుడు. అదెట్టు? సహజభావనా బలసంపన్నుల మైన మనము మనస్పూర్తిగా జూడదలఁచుకొన్నయెడల శార దాదేవి మనకుఁ బ్రత్యక్షము కాకపోవుటయే. మనశ్శక్తికి బద్దులుకాని దేవత లెవరు? నాయనలారా! బాహ్యనేత్రములను రవంత ముకుళింపఁ జేయుడు. ఆంతరనేత్రజ్యోతి నెగస బొడిచి దానికిరణము లటు లిటులు చెదరనీయక సంఘీభవింపఁజేసి మనకుఁగావలసిన విషయములపై సుస్థిరముగ సూటిగఁ గేంద్రీకృత మొనర్పుఁడు. ఆహవనౌకలందలి యన్వేష ణజ్యోతికంటె ననేకగుణతేజస్సమ్బద్దమగునట్టు, వెలుఁగఁజేయుడు? ఇంకనేమి? అదిగో అదిగో ఒడలు జలదరించునట్టు, కనులు కృతార్ధములగునట్టు, మనస్సు పుష్పించునట్టు, జన్మము తరించునట్టు-ఆంధ్రశారదాదేవి దర్శన మిచ్చుచున్నదే! అనేక సహస్రచంద్రమండల సన్నిభమైన యాస్యమండలము వీణాదండము వంక రవంత యొుఱగి యున్నది. అందుచేఁ గిరీటమునుండి వ్రేలాడుచున్న ముత్తెముల గుత్తి మేరువునొద్దనున్న వీణబిరడపై వ్రేలాడుచున్నది. బాగుగాఁ బరిశీలింపుఁడు. ఎడమ మోకాలిపై మడచినకుడిమోఁకాలివం పుప్రక్కను రవంత వెనుకగ దేవతాచందన నిర్మితమైన వీణకుండ ప్రకాశించుచున్నదే. దివ్యసర్వ సుధాసేచనమున వీణాదండము తీగచెట్టు చిగిర్చిన ట్గామె యెడమ చేయి వ్రేళ్లు తంత్రులపై నెట్టు కదలుచున్నవో. ఆహా! అదిగో గుడివైపున రాజరాజనరేంద్రుఁడు, నెడమవైపునఁ గృష్ణదేవరాయలు వింజామరములు చేతఁ బుచ్చుకొని యెట్టు వీచోపు లిడుచున్నారో అదిగో ఆపీఠము మొదట బీతాంబరపు నడకట్టుతో నిలువఁబడి దేవికిఁ బారిజాతపష్పములతోఁ బూజ లొనర్చుచున్న యాపౌరోహిత్య బ్రాహ్మణుఁడెవరో యెఱుఁగుదురా? అదిగో ఒక్కచింతాకంతవాసి-క్రిందుగ నిలువఁబడిన యాకుండలాల సోమయాజి కప్పరపుటారతిపబ్లైరము చేతఁ బుచ్చుకొని-వహవ్వా నీరజాసన నీరజపత్రాక్షికీ నివ్వాళు లిచ్చు చున్నాడే మరియొక బెత్తెఁడు క్రింద-పురోహితుని యంత పొట్టియు గాక, సోమయాజియంత సోగయు గాక మట్టసపు మాదిరిగనున్న మంత్రి శిఖామణి మహాలక్ష్మీదేవి కోడలిని మందాకినీసలిలపుగిండి దోసిట బట్టుకొని సేవించుచున్నాఁడే ఆర్యులారా! చూచుచున్నారా?

ఉ. క్షోణితలంబు నెన్నుదురుసోఁకగ మొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందర వేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నకదామశుక వారిజపుస్తకరమ్య పాణికిన్,

అని పఠించి చాపచుట్టుగ సాష్ట్రాంగదండప్రణామ మిడుచున్న యాజాంబూనదవిగ్రహ మును గాంచి మీకన్ను లానందబాష్పములను విడుచుచున్నవా? ఆహా! అది యేమి? ఆకవిత వినియేనా శారదాదేవి శిరఃకంపన మొనర్చినది! కాక యుభయమహారాజేంద్రుల వింజామరసే వవలననా యామెచెవినున్న చెంగల్వ గదలినది! అట్టు కదలిన చెంగల్వనుండి జరిన యమృత బిందువు లెట్టు వీణాతంత్రులపై బడుచున్నవో నాయనలారా! ఈచర్యయంతయు నామెపీఠమునకు దిగువనున్న రెండుమూడు మెట్టమీదిది! కాని యిదియంతయు మనకేల? దిగుడు; ఏడెనిమిదిమెట్టు దిగుడు; మృచ్చకటికా పరివర్తనమును జూలియస్ సీజరుపరివర్తనమును జేతఁ బట్టుకొని నిలువఁబడిన యాస్టవిష్ణుని గాంచితిరా! బిల్వేశ్వరీయ శంకరవిజయధ్వజాది గ్రంథములను జేతఁ బుచ్చుకొని 'పలుకుదయ్యమా! ఇది పాయస మమ్మా! బమ్మదయ్యపుటల్లాలా! ఇది పానకమమ్మా! త్రాగుమమ్మా' యని తల కంపింప స్పష్టముగ సంబోధించు చున్న యాహ్రస్వరూపుని గాంచితిరా? అదిగో మహేంద్రవిజయ నయనోల్లాస కర్తలగు సోదరకవులు శ్రవణానందముగ శారదాగాన మొనర్చుచున్నారు. విను చున్నారా! వారి గాన మధురిమచే నాకర్షింపబడి కాంబోలు నొక్క శాంతస్వరూపుఁ డైన వృద్దు డటకువచ్చి యారంభించిన భారతము పూర్తికాలేదు; ఇది యమ్మగారి కర్పింపవచ్చునా లేదా యని పీచు కాగితముల పెద్దకట్టను వారికిఁ జూపి యడుగు చున్నాడు. ఆలకించుచున్నారా? ఏవో బరువైన గ్రంథములు పదిసంపుటములు కాంబోలుఁ జేతఁ బుచ్చుకొని యెర్ర మధుర పాగజట్టుకొని దగ్గుచు గష్టమున మెట్టెక్కుచున్న యాముసలి యాయన యెవరో యెరుఁగుదురా? ఈయనను జూచి బిలేశ్వరీయకర్త గుఱ్ఱుమనుచున్నాఁ డేల? తన ప్రసన్న రాఘవ విమర్శనముమాట పరాకు పడినాఁడు కాంబోలు! ఆహా! శతఘంటకపు లిద్దరు —ఒకరు ముసలివారు; నొకరు పడుచువారు. ఒక రెఱ్ఱ నివారు; నొకరు నల్లనివారు. ఒకరు పొట్టివారు; నొకరు రవంత పొడుగువారు. నొండొరులఁ గౌంగిలించుకొని మనగ్రంథములు శారదాదేవి కర్పింతమని యొకరితో నొకరు చెప్పకొనుచుఁ బూర్వవైర ములు వదలి చెట్టపట్టముల వైచుకొని మెట్టు లెక్కుచున్నారు వారిని గాంచితిరా? కాని వీరి కొకటి రెండుమెట్లు ముందు బుద్దచరిత్రమును సరస్వతీసంచికలను జేతఁ బట్టుకొని కంటిజొటితో ముందునకుఁ బోవుచున్న యా భాషాపోషకతేజ మేబ్రాహ్మణ ప్రభునిదో పరిశీలించితిరా?

మహాజనులారా! ఇదివఆకు మనము కాంచినవారందరు గతించినవారు. ఇప్పడు బ్రదికి బట్టకట్టుచున్న వారిని గ్రంథము కలముఁ బట్టినవారి నిఁకముందు చూడదలచియు న్నాము. ఇంకఁ గొన్ని మెట్టు దిగుడు. అదిగో శారదా దేవీ చరణారాధనమునకై యింద్రధ నుస్సు రంగులుగల యెన్ని యోపూవులను దట్టలోఁ బెట్టుకొని యొక్క ముసలియాయన యా మెట్టుమీఁదఁ గూరుచుండి నాడు, కనబడుచున్నాఁడా? అవి భక్తచింతామణిపుష్చ ములు కాబోలు! అచ్చట నొక పెద్దదుకాణమున్నది. చూచితిరా! అదేదో వంగభాషనుండి పరివర్తనమునొందిన బహుళములైన నవలలుగల గ్రంథనిలయము కాబోలు! ఆప్రక్కను ఫర్గాంగు చదరపుస్థలములో దాదాపుగఁ బండ్రెండు గజముల యెత్తు వఱకుఁ బేర్పబడిన యా పుస్తకములసమూహమేదో యెఱుఁగుదురా? అవియే పాటల నాటకములు. ఓ! యెగురుచున్నవి. గిరగిర దిరుగుచున్నవి! నేలపైబడుచు నెంతగందరగోళమైనఁ జేయుచున్నవి. ఈసందడిలోఁ బర్గాకిమిడి వాస్తవ్యుఁడైన బ్రాహ్మణుఁ డొక్కడు నవ్యసంగీతపురాణ ధోరణితోఁ దాళపు జిప్పలు చేత బుచ్చుకొని తాండవించుచున్నాఁడు. అదిగో ఒక్క భాషాపండితుడు "ఇటుచూడుఁడు" అని తర్జనితోఁజూపించుచున్న పెద్ద యక్షరములేవో చదువఁగలరా? “విజ్ఞానసర్వస్వాది గ్రంథము లిక్కడ”నని వ్రాయ బడియున్నది. సెబాస్! ఇవి గీతపద్యనాటకము లని యెవ్వఁడో యొకడు కిత్తనారసంచిమూటను విప్పచున్నాఁడు. ఇవి స్వతంత్రముగ రచియించిన నవలలని గుమికూడి కొందరేవోపేళ్లను జదువుచున్నారు. సౌందర్యతిలక మని మరియేమో యని వినఁబడుచున్నది. ఇదిగో నూతనాంధ్ర వాజ్మయచ రిత్ర మని యొకపుస్తకమును బైకెత్తి యెవరో చూపుచున్నారు. ఆమూలను రాశిపోసిన వన్నియు గ్రామ్యభాషా గ్రంథములు. అచ్చట వృద్దుఁ డయ్యును బలిష్టుడైన యొక బ్రాహ్మణవర్యుడు గ్రామ్యభాషోత్కృష్ణత నుపన్యసించుచు దమ పుస్తకములలోఁ బ్ర మాదమునఁబడిన విమర్శాదర్శవిమర్శాదర్శమను గ్రంథమును బైకిఁదీసి గీత నాటకముల దొంతరపైకి థూయని విసరి వైచుచున్నాఁడు. అచ్చట జేరిన గ్రంథకర్త లయిదారువందలకుఁబైగ నున్నట్లు కనుపట్టుచున్నారు. వీ రందఱిచేతులలో నొక నాట కమో, నవలయో, ప్రహసనమో, చిన్నకథయేూ యున్నది కాని రిక్తహస్తుఁ డొకడును లేఁడు. ఇక్కడం జుట్టకాని సిగరెట్టుకాని కాల్చఁగూడదని పెద్దయక్షరములు గోడలపై వ్రాయబడి యున్న యాకొవో యెఱుఁగుదురా? అవియే తాళపత్రగ్రంథనిలయములు. ఆసమీపము ననే కొందరు చేతులలో నేమియోకాని గలగలలాడించుకొనుచుఁ దిరుగుచున్నారు కనుచు న్నారా? రాగికడియములలోఁ దగిల్చిన రాగిరేకులున్నవే యవియే పూర్వశాసనములు; వారే భావ్యాంధ్రసారస్వత చరిత్రకారులు. వహవ్వా ఎక్కడఁ జూచినఁ గవియే. ఎక్కడఁ జూచిన నాటకకర్తయే. ఎక్కడఁ జూచినఁ దూర్పువారి పొట్టియేచ, పడమటివారి బారెఁడేసి దీర్ఘ ములు, మధ్యమండలపువారి మట్టసపు మాటలు. ఒకరీతి యేమి యొక వైఖరి యేమి? అచ్చట నన్నియుఁ గలసియున్నవి. కవులు గవులను దిట్టుచున్నారు. కవులు విమర్శకులను దిట్టుచున్నారు. విమర్శకులు కవులను దిట్టుచున్నారు. విమర్శకులు విమర్శకులను దిట్టుచు న్నారు. కవులు విమర్శకులైన వారు విమర్శకులు గవులైనవారిని దిట్టుచున్నారు. వీరిపక్షపు వారు వారి పక్షపువారిని దిట్టుచున్నారు. వారిపక్షపువారు వీరిపక్షపువారిని దిట్టుచున్నారు. ఏపక్షమున లేనివారు రెండు పక్షములవారిని దిట్టుచున్నారు. మహాజనులారా! ఈ మహాకోలా హలములోఁ గొందరు మగువలుకూడ గనబడుచున్నారు చూచితిరా! అబలాసచ్చరిత్రర త్నమాల యని, పావిత్రీనాటకమని, మరియేమో యని సన్ననైన గొంతులతో సంగీతము వంటి ధ్వనులు విన బడుచున్నవి. తెల్లగ సుద్దకొండలవలెనగపడునవి యేవో తిలకించితిరా! ఆంధ్రపత్రికలు, కృష్ణాపత్రికలు, హితకారిణీపత్రికలు, న్యాయదీపికలు, గోదావరీపత్రికలు, జన్మభూమిపత్రికలు. ఇవికాక యెన్నియో గ్రంథరూపమున వెలువడిన సంచికలు. ఇక నావైపున నున్నవారెవరు? వారే నవ్యకవులు. తెనుఁగుతోటలో యుద్దగీతములు, మోహగీత ములు, భావగీతములు, ప్రేమపాటలు రుంయిమని రొదచేయుచున్నవి. వినుచున్నారా? ఈమహాసంకులములో రాట్నపుతములు, ప్రత్తిగీతములు, ఖద్దరు పాటలు, నూలోడుకుపా టలు, ఏకుచేయుపాటలు, స్వరాజ్యదర్పణములు, స్వరాజ్యతాంబూలములు! వాక్కునకు వ్రాఁతకు నింత విజృంభణము ముందెన్నఁడైన నుండెనా? ఓ! ఏమి సంక్షోభము! ఎంతశక్తి ఎంత జీవము! ఎంతధాటి శారదాదేవి కింత మహోత్కృష్టదినములే లేనట్లు కనఁబడుచు న్నదే! కాని మొదటి రెండుమూడు మెట్టమీఁది వారెవరో కేకలిడుచున్నారు వినుడు. "ఎందుకాగోల! ఎందు కాపనికి మాలిన వ్రాఁత! ఎందు కాతుక్కు ఆపెంట' యని కేకలిడుచున్నారే సరస్వతీదేవి యామాటలు విని సన్నగ సన్నగ నవ్వుచున్న దెందుకో! ఎవ్వరైన నెఱుఁగుదురా? ఎఱిగియుండునెడల నాకుఁ జెప్పరా? మీరు, మీరు. ఇంతలో నా మూలనుండి యేదియో ధ్వని వచ్చుచున్నది. వినుడు ఎవడో మాటలాడుచున్నాఁడు. “పనికిమాలిన వ్రాఁతయా! అబ్బ! మమ్మధిక్షేపించుచున్న మీరు చెప్పిన కవిత పనికి మాలిన వ్రాఁతకాదు కాంబోలునేమి! మీపై వారికవిత ముందు మీరుచెప్పినదియు దుక్కే క్రింది వారివ్రాఁత పైవారి వ్రాంతముందు దుక్కు. అది వారి పైవారి వ్రాంతముందు బెంట. అన్ని కవిత్వములు గాళిదాసుని కవిత్వముముందు దుక్కు. కాళిదాసుని కవిత్వమును పుట్టతేనె కవిత్వము ముందుఁ బెంట. అదియైనను బ్రహ్మాను సంధానమున వేదరుల నుండి నిప్రయత్నముగ నుద్బుద్దమునఁ దపోమాహాత్మ్యమునఁ బ్రకృతికాంతముం గురులలో నొక్క వెండ్రుకలోని వంకరటింకరలైనను సరిగఁ జెప్పలేకపోయిరే, అట్టిచో నెవనికవిత్వము దుక్కు, ఎవని కవిత్వము ముక్కు, ఎవనికవిత్వము పెంట, ఎవనికవిత్వము పంట. అందరు బ్రయోజకులే! అంద ఆప్రయోజకులే! మాకాలమందు మమ్మెట్లు పైవారు తిట్టుచున్నారో, మీకాలమందు పైవారు మిమ్మట్లు తిట్టినవారే. లోకచరిత్ర మన్నియుగములందు గూడ నాడిన యాటయే యాడుచున్నది. కాని యొకచోటఁ గ్రోఁతులభాగవతమాడి యొకచోట గోవిందనామ స్మరణ చేయుట లేదు. బుద్దిలేక పోవుటచేత నెప్పటి కప్పటికే పరాకు. పైమెట్టువారు వారిపై మెట్టువారి మొట్టనుదినుచుఁ దమక్రిందిమెట్టున నున్నవారిని మొట్టు చున్నారు. ప్రపంచమునకు సిగ్లెక్కడిది?" అని ఇంక నేమేమో జంఘాలశాస్త్రియాకాశమంత నోరు పెట్టుకొని మొండి మోటత్రోపుగా బడిత బాజాపద్దతినిఁ బలుకుచున్నాఁడు. సాక్షిసం ఘోపన్యానము లింక గట్టిపెట్ట రాదటయ్యా యని పైమెట్టునుండి వెంకట రత్నముగారు కాబోలు పలికినారు! ఈ వెంకటరత్నము గారికి సాక్షి యనఁగ నింతద్వేష మెందుకో! మహాజనులారా! మరియొక ప్రక్కను జూడుడు. అరువది సమీపించుచున్న వృద్దపండితుల యెదుట నిద్దరు పడుచుపండితులు కూరుచుండియప్పడే యక్షరస్వీకరణ మొనర్చుచున్న యర్బకులవలె “అఆ ఉఊ" అనుచున్నా రేల? వారే సూర్యరాయనిఘంటు కార్యాలయమందలి పండితులు. గ్రామ్యభాషాగ్రంథోపద్రవము నుండి భాషను రక్షించి యుద్దరించిన భాషాకోవిదుఁడైన యాంధ్ర భోజమహారాజు మీ యెదుటనే కానబడు చున్నాఁడు. "భాషోద్గారకా! పుత్రపౌత్రాది సంపత్తితో నిండుగా నూరేండ్డు వర్డిలు మయ్యా మహారాజా!' యని మహాజనులంద రొక్క మా రాశీర్వదింపరా? మహాజనులారా! తెఱ పడుచున్నది. దేవతా దర్శన మిఁకఁ జాలును.

మహాజమలారా! శక్తివంచన లేకుండ శారదాదేవీపూజకై యెందరు గ్రంథకర్తలెంతగాఁ బాటుపడుచున్నారో చూచితిరా? ఇన్ని పాటులుపడి యేమి ప్రతిఫల మొందు చున్నారో యెఱుఁగుదురా? వస్తులు, పరిభవములు. ఈపుస్తకము లన్నియు మంచివికాకపోవుటచేతనే ప్రజలు వాని నిరాకరించుచున్నారా? మంచివో చెడ్డవో చూచినతరువాతఁగదా తెలియవలసి నది. అట్టు చూచినవా రెవరు? చూచుట కోపిక యెవరికి? చూచుటకుఁ దీరిక యెవరికి? చూచుట కంత భాషాభిమాన మెవరికి? చూచుట కక్షరజ్ఞానమైన నెందఱకు? ఆంధ్రదేశ ప్రజలలో విరివిగా లెక్కచూచుకొనిన యెడల నూటికిరువది మంది కాంధ్రభాషాజ్ఞాన మున్న దేమో! చాలు. అంతే చాలును. లేకపోయినప్పడు చాలదని దేవులాడిన లాభ మేమున్నది? చదువుటకర్హులగు నీ యిరువదుగురిలో వారెవ్వరో చెప్పనా? న్యాయవాదులు, సర్కారుద్యోగులు, వర్తకులు, పాఠశాలోపాధ్యాయులు, గ్రంథాగార సంపాదకులు, మార్గస్టులు, వేశ్యాప్రియులు మొదలగువారున్నారు. న్యాయవాదులు, సర్కారు ద్యోగులు, వర్తకులు, పాఠశాలోపాధ్యాయులు నాంధ్రభాష చదువరు. ఆంధ్రభాషలోఁ దఱచుగ మాటలాడరు. ఆంధ్రగ్రంథ ములు ముట్టరు. తత్రాపి యాధునికుల గ్రంథముల పేరే వినరు.

వీరివలన భాషకుఁగాని భాషాజ్ఞానసంపన్నులగు గ్రంథకర్తలకుఁ గాని యేవిధమైన లాభములేదు. ఇంక గ్రంథాగార సంపాదకులు బీరువాలలోఁబెట్టి బీగము పెట్టుటకు వారి గ్రంథములు సగము వెలకుఁ గొందురు. ఇంక నటకులు రూపాయకు మూడుపావులాలు తగ్గించుకొని యాగ్రంథములనుగొని వారికి నోటికందని జ్ఞప్తిలోనుండని పనికిమాలినవని తోఁచిన భాగములను ఖండించి నాటకములలో నుంచిన పాత్రములలోఁ గొన్నింటిని దీసి వైచి మఱికొన్ని సొంతపాత్రములఁ జేర్చి చావవలసినవారిని బ్రదికించి, బ్రదికియుండ వలసిన వారిని జంపి గదిలోని భార్యా పరీరంభ క్రియమొదలు కాటిలోని కడపటికర్మమువఱ కన్నిపనులుగూడ పార్శీమట్ట పాటలచేత జరిపించి గ్రంథమంతయు భంగమొనర్చి భ్రష్టమొు నర్చి పరశురామప్రీతి చేయుదురు. ఇంక మార్కిస్టులు రైలులోఁ బ్రయాణమొర్చువారు రెండణాల కొక్క నాటకమో యారుడబ్బుల కొక్కనవలయో కొని కునికిపాట్టు వచ్చునప్పడు రవంతచూచుచు జట్టుగాల్చి దానిపై బ్రమాదవశమున ధూకరించుచుఁ దప్పసరియైనప్పడు మాత్రము పాదరక్షలతోఁ ద్రౌక్కుచు నేసందడిలోనో కాఫీపాత్రయో నీటిచెంబో తిరుగబడుటచే నది తడిసిపోవంగ దాని నావలనో మూత్రపు గదిలోనో పాఱవేయుదురు. ఇంక వేశ్యాప్రియులు తమవేశ్యల యొద్ద దాము మిగుల రసజ్జల మనిపించుకొనుట కేదో నవలయో నాటకమో కొని వారియొద్ద వారి ప్రీతికొఱకై నాటకపద్దతిగాఁ జదివి మంచము క్రింద బాజవేయంగా దానిని వేశ్యమాత యడ్డుపొగకో, ప్రధాన నాయిక పాలా స్త్రిపట్టులకో వినియోగింతురు. గ్రంథము లెట్లు భ్రష్టమయినను గ్రంథకర్తలొక్క పూటయైన దినుటకు వీరివలననే సదుపాయమగు చున్నది. ముష్టికారువాఁడు గ్రంథము కావలసినదే కాని పావుల డబ్బులు పెట్టి భాగ్యవంతుఁ డొక్క పుస్తక మైనఁ గొనండే. నలువది రూపాయలు జీతము తెచ్చుకొనుజనుడు మొదలు నాల్గువేల రూపాయలు జీతము తెచ్చుకొను జిస్టిసు వఱకుఁ జదువుకొనుట కొక్క యాంధ్ర గ్రంథమైనఁ గొనినవాఁడు కనఁబడఁడే, సిగ్గుసిగ్గు. జాతికి సిగ్గు. దేశమునకు సిగ్గు. ఆంధ్రగ్రంథము కొనినయెడల నప్రయోజకత, అభాగ్యత. అప్రతిష్ట, అజ్ఞత, ఈభాగ్యవంతులలో నట్టియపోహ మంతరించినఁగాని యట్టి గర్వము కడతేరినఁగాని, యట్టియజ్ఞానము ధ్వంసమైనఁగాని భాష బాగుపడనేరదు. కడుపుకట్టుకొని కవులెన్నిగ్రంథ ములను వ్రాయఁగలరు? ఎంతకాలము వ్రాయఁగలరు. భాషా సేవకై వినియోగపడని వీరి భాగ్యమెందుకు? వీరు గ్రంథములు వ్రాయనక్కఆలేదు. చదువనక్కఱలేదు. వీరు మైన్సు పినాల్ కోడ్ (Maynes Penal Code) కంఠపాఠము తలక్రిందుగాఁ జేయవచ్చును. కళాపూర్ణోదయగాధనైన విననక్కఆలేదు. జస్టిసు బెన్సను (Benson) గారి తీర్పులన్నియు వీరి జిహ్వాగ్రమున నుండనేవచ్చును. జనకచక్రవర్తి యెవరో వీరికిఁ దెలియన్లక్కఆలేదు. వీరు భాగ్యవంతులయొద్ద బదుళ్లు తీసికొని దివాలాలు తీయనేవచ్చును. సుమతిశతక మైనఁ జదువనక్కజలేదు. ఆంధ్రదేశమునఁబుట్టి ఆంధ్రులై ఆంధ్రజాతిరక్తమును దేహమునఁగలిగి యున్న వీ రాంధ్రకవులగ్రంథముల నాంధ్రదేశముకొఱకైనను, నాంధ్రభాషకొఱకైనను, నాంధ్రజాతికొఱకైనను, దమ యాంధ్రత్వమును నిలువఁ బెట్టుకొనుటకైనను గొనక తప్పదు. కొన్ని గ్రంథములు చదువనైన నక్కఱలేదు, చదివినయెడల మరింత మంచిదె. భాషాజ్ఞానమును సంపాదించుకొని కవులను పోషించినయెడల మరింత మంచిదే. పోషించుట యేమున్నది? పుస్తకమును గొన్నయెడల నంతే చాలును. భారత భాగవతము లెరుంగ మివాడు బారిష్టరైన నేమి? భండారాధిపతియైన నేమి? ప్రభుడైననేమి? బ్రహ్మాండనాయకుఁ డైననేమి? ఆత డాంధ్రుడుమాత్రము కాడు. ప్రజాపోషణము గ్రంథకర్తలకత్యావశ్యకము, మనదేశమునందే లేదు గాని నిగిలినయన్ని దేశములందుఁ గూడఁ గవులకుఁ బ్రజాపోషణ మున్నది. ఈ నిర్భాగ్యత, యీ దురవస్థాగ్రగణ్యము మనదేశమందే. ప్రభువు లెందరుకవు లను బోషింపఁగలరు? ఎంతకాలము పోషింపఁగలరు? ప్రజ లాభాషాపోషణభారమును గొంతవహించుట విధి. దేశభక్తియని, భాషాపోషణ మని, స్వార్థపరిత్యాగ మని, స్వరాజ్య మని, మరియేమో యని యార్యావర్తదేశమంతయు నట్టుడికినట్టు డుకుచున్నప్పడే యార్యా వర్తదేశభమునుగూర్చి యవతలిప్రపంచమంతయు నాందోళనపడుచున్నప్పడే యాఱణాల డబ్బు లిచ్చి యొక్క యాంధ్రగ్రంథమును ననేకసహస్రసమార్జనసాహితీ చక్రవర్తులలో నొక్కడైనఁ గొనలేకుండ నున్నాఁడే ఆహా! ఏమి యాంధ్రదేశ భాగ్యము! ఇంకఁ జాలును, దానికిఁ జాలును; మనకుఁ జాలును,

నిజమే. గ్రంథము లెల్లెడలఁ బయలువెడలుచున్నవి. గోరంటలు పట్టుచున్నవి. గుల్ షబులు పుట్టుచున్నవి. గులాబులు పుట్టుచున్నవి. కుక్కగొడుగులు పుట్టుచున్నవి. అన్నయు మంచివే పుట్టవలెనని ప్రకృతిలో శాసనమున్నదా? ఎచ్చటనైన నటులు పుట్టినవా? ఏకాలమందైన నట్టు పుట్టినవా? ఏజాతిలోనైన నట్టు పుట్టినవా? ఉహుహు. అన్ని యెడల నుహుహన్న ప్రకృతి మనయెడల మాత్రము “ఊ' యని యేల యనవలయును? కలువతీగె ప్రక్కనే మొండిచేయి; ఘనాఘనగర్డ వెంటనే కప్పకూఁత; దేశకాలపాత్రముల బట్టి ప్రకృతి తన మనోభావమును బహిర్గత మొనర్పకతప్పదు.

మామిడిపూఁత యెట్టిదో మసూచిపోఁత యట్టిది. గోరంటపూవు వాసన యెట్టిదో కోరింతదగ్గట్టిది. గుబ్బలాఁడి కంటితళు కెట్టిదో మబ్బులోని పిడు గట్టిది. పద్మములోని మధు వెట్టిదో పాములోని విస మట్టిది. గ్రంథకర్తరణ గీతమెట్టిదో యతిమూత్రరోగి రాచపుం డట్టిది. అన్నియుఁ బ్రకృతిసంబంధములే. అన్నియు బహిర్గతాంతస్తత్త్వములే. అయిన నేమి? చూలింతరాలివేవిళ్లకు సూడిద లిచ్చుచున్నాము. కలరావాంతులకు కర్పూరారిష్ట మిచ్చుచున్నాము. మొగలిపూవును గులకొంత కొప్పలో నుంచుచున్నాము. మూలవ్యాధిని ఛేదించుచున్నాము. అటులే గ్రంథము లన్నిటిలో మంచివానిని బహుమానింపవలయును. చెడ్డవానిని బహిష్కరింపవలయును.

వైద్యశాస్త్ర మెందుకుఁగలిగెనో, ధర్మశాస్త్రమెందుకుఁగలిగెనో విమర్శనశాస్త్రము కూడ నందుకె గల్గినది. వైద్యశాస్త్రమునకున్న వ్యాప్తి విమర్శనశాస్త్రమునకు లేదు. నిజమే. అటులేల యుండును? మాటవచ్చినది కావునఁ జెప్పచున్నాను. మీ రెంత ప్రశస్తమైన భావగీతమును బాడినను బాముకా టంతశీఘ్రముగఁ బ్రాణము తీయఁగలరా? గోడయున్న యెడలఁ జిత్రకర్మమునకు లోపమేమని ముందు మనవారు తనువులు భద్రపఱచుకొనుటకుఁ దంటాలువడి వైద్యశాస్త్రమును ధర్మశాస్త్రమును సృష్టించినారు. కావున విమర్శనశా స్త్రము ప్రధాన కృత్యముకాక వేడుకపనియైనది. కాగితములు చవుక యగుచున్నవి. అచ్చుశాలలు వృద్దియగుచున్నవి. నాటకసంఘములు హెచ్చగుచున్నవి. గ్రంథమాలలు ఘనము లగుచున్నవి. కవులు మితిమీరి పోవుచున్నారు. గ్రంథము లసంఖ్యాకము లగుచు న్నవి. వీనిలో మంచి వేవో నిర్ణయించి చెడ్డవి త్రోచివైచుట ప్రకృతి పద్దతినిబట్టి యావశ్యకమై యున్నది. ఇవి యన్నియు భూమికి భారమగునని యెవ్వఁడును జెప్పటలేదు. వీనివలన వచ్చిన బాధయేదో చెప్పెదను. మాయముత్తెమున కున్నతళుకు మంచి ముత్తెమునకు లేదు. ముచ్చె బంగారమున కున్న మెరుఁగు మేలిమి కున్నదా? అసత్యమున కున్న చాకచక్యము, జమత్కృతి సత్యమునకు కెక్కడిది? అది మున్నాళ్ల ముచ్చట. ఇది ముప్పదితరముల కైన పోనిది. అల్పగ్రంథమునకు హర్షించినవారే యనేకులు మంచిగ్రంథమును దెలిసికొని యనుభ వించినదాఁక నెవనికి? మహాజనులారా! నూటి కెనుబదుగురు రస గ్రహణమునఁ గేవలము మూడులు. వారు పామరుల తయితక్కలకు బళీయందురు కాని ప్రకృతిలోని తలవెండ్రుకల చిక్కువిప్పిన గ్రంథములకు సంతసించెదరా? ఉహు. చెంచునాటకమున కున్న జనానురాగము శాకుంతలమున కేది? పంచదారకుఁ బట్టిన యెర్రచీమలకంటెఁ గుంకుడుకాయలకుఁ బట్టిన యెర్రపురుగు లెక్కువకదా! ఇంక గ్రంథకర్తలమాట చెప్పెదను. గ్రంథకర్తలలో నుపజ్ఞాసహితుఁడు వేయి కొక్కఁడైన నుండునో లేదో అనేకు లేదైన నొకగ్రంథమామోదించి యాకవిని బహుమానించుట సిద్దించునెడల "ఆహా! వ్రాయవలసిన పద్దతియదియే కాఁబోలు! మనముకూడ నష్టే వ్రాయ వలెను గాంబోలు!’ నని యనేకకవులు భ్రమపడుదురు. పైకి వారిని దిట్టుచునే యుందురు. కాని లోపల, నీయపోహములకు లోనైయుందురు. వారంత క్రమముగా దిగి యంతకంటె జారి యధఃపతితులై నీచగ్రంథ సృష్టినిర్నిద్రులై ప్రకాశింతురు. మరికొంద రింకొకవిధముగా మారుచున్నారు. అయ్యవారులుగారి పాటలనాటకమునకుఁ బండ్రెండువందల రూపాయలొక్కరాతిరి వచ్చిన వనంగ నిఁకఁ బ్రకృతి లేదు. పాత్రాచిత్యము లేదు. ఏమియు లేదు. పదిదినములలోఁ బాటలనాటక మొక్కటి కవి ప్రజలపై బాఱవైవవల సినదే. పాటలనాటకములు ప్రకృతివిరుద్దము లని యాతం డెఱిఁగియుండియు బైసకొరకుఁ బ్రఖ్యాతికొఱకు బహుళముగా ధన మిచ్చి వ్రాయించుకొను నాటకసంఘముల కొఱకాతడు వ్రాయును. కడుపు కక్కురితిచే మనస్సాక్షికి బోధన కాతఁడు వ్యతిరేకముగఁ బ్రవర్తించును. సామాన్యబుద్ది యుక్తుఁడైన యాతండట్టు ప్రవర్తించుట విశేషము గాదు. మహాధీశాలియై శారదా దేవిచే త్వమేవాహమ్మని యనిపించుకొనె నని చెప్పఁబడిన కాళిదాసుఁడు సైతము సామాన్య జనాభిరుచి ననుసరించి రఘువంశములోని కడపటి సర్గలలో నవలానవ లాలితేత్యాది శబ్దమ త్కారములను గవిత్వములో సింగారించి కవిత్వము భ్రష్టపఱచుకొనె నని పూర్వవిమర్శకులే వెల్లడిచేయలేదా! మన యీదేశమందే యిట్టిసన్నివేశముకాదే. అలెగ్జాండరు పోపు (Alexander Pope) కవిత్వము వాని ననుసరించిన వారికవిత్వము వట్టి గజము బద్దకవిత్వ మని, తక్కెడ తవ్వకవిత్వమని యెరిఁగియున్న బైరన్ (Byron) వంటి స్వతంత్రబుద్దిసహితుఁడు సైతము యశఃకనకము లపేక్షించి తనకవిత్వముకూడ కంపను కవిత్వములోనికి దింపినాఁడు కాదా! అంకవాటకములకు డబ్బు రానియెడల రంగనాటకములనుఁ వ్రాయుదము. అంతే. దేని వాలమట్టుల నాటకములకు డబ్బు రానియెడల పార్సీమట్టులనాటకముల వ్రాయుదము. దీని కింతయోజన యెందుకు. పార్సీమట్టుల నాటకములకు డబ్బు రానియెడల బ్యాండు ట్యూన్సు (Band tunes) నాటకములఁ జేయుదము. దానితెగు లంతటితో డక్కునఁ గుదురునొ. ప్రకృతిపరీక్ష యక్కఱలేదు. పాత్రతత్త్వబేద మక్కఱలేదు. ప్రసంగ చమత్కృతి యక్కఱలేదు. పాత్రాచిత్యమక్కఱలేదు. ఏమియు నక్కఱలేదు. పాఠాంతరమునకుఁ బాట దొరికినఁ జాలును. ప్రకృతి ప్రతిబింబములుగ గ్రంథముల వ్రాయవలసిన కవులీ కారణములచే భ్రష్టులై పోకుండ విమర్శగ్రంథములు పుట్టవలసియున్నది. ఒక కవి వేరొక కవిని విమర్శింపఁద గదు. అది ప్రబల వైరమునకుఁ గారణమగును. ఆభయంకర వైరకీలాజాలము పుష్కలావర్తమే ఘమునఁ గాని శాంతింపదు. నిష్పక్షపాతబుద్దితో సాహిత్యపరిషత్తువా రీవిమర్శన కృత్యమును మీద వైచుకొనక తప్పదు. కవిత్వము చెప్పటకు శక్తిలేని వానికవితా రసమును గ్రహింపఁగల లోకోపకారబుద్ది గల నిర్దాక్షిణ్య స్వభావము గలపండితుల నిందుకై పరిషత్తువారు జాగ్రత్త పెట్టవలసి యున్నది. వారి విమర్శనములను బరిషన్మహాసభ్యుల యామోదము నొందినపి మ్మట లోకమున విడువవలయును. పరిషన్ముద్ర వారిపై బడుటచే నవియెచ్చటికిఁ బోయిన సరే నాణెములవలె మారును. అవి తుపాకి పిక్కకుఁ జెదరవు. బల్లెపు బోటునకు జంకవు. వీటివడి కెదురెక్క గలవు. కాని కవుల యనుమతి లేకుండ వారి గ్రంథములను విమర్శింపఁ దగదు. నీగ్రంథముల విమర్శింతుము. నీ వేమందు వని పరిషత్తువారు కవి నడుగునెడల వలదని యాతండన గలఁడా? వలదన్న యెడల నందున నేమి క్రుళ్లున్నదో యని యితరు లనుకొందురేమో యను నందేహ మాతని కుండదా? విమర్శన బహుజాగరూకతతోఁ జేయుట యత్యావశ్యకము. ఎట్టు చేయవలయునో నేను జెప్పను. ఎట్టు చేయగూడదో మాత్రము రవంత చెప్పెదను. స్వల్పదోషమైన నుపేక్షింపఁ దగదు. దోషములను నిర్ణేతుక ముగ నిర్ణయింపఁ గూడదు. చిన్నయ్య కాలమున నట్టు వ్రాసిరి. పెద్దన్న కాలమున నట్లు వ్రాసిరి. నన్నయ్య కాలమున నట్టు వ్రాసిరి. కావున మీరుగూడ నష్లే వ్రాయవలయు నని శాసింపఁదగదు. సర్వ కవులకేకాక సర్వకళాభిజ్ఞలకుఁగూడ నవిలంఘ్యము లగుబహిరంతః ప్రకృతి శాసనములకంటె భిన్నములైన శాసనములు గుణదోషనిర్ణయమున క్కఱకు రాగూడదు. దోషములు నిర్ణయింపవలసినదే కాని యిట్టు దిద్దుపాటు లొందిన యెడల నాదోషములు గుణము లగు నని యెన్నఁడును బలుకవలదు. గ్రంథరచనయం దొకపద్దతిని గాని, మార్గమునుగాని, క్రమమునుగాని చూపదగదు. మీవిమర్శనమువలనఁ గవితకు దళుకుమాత్రమే హెచ్చించి దార్ద్యము తగ్గింపగూడదు. ఆకార సౌందర్యము మాత్రమే వృద్దిపరిచి రసమును దగ్గింప గూడదు. అలంకారములు వృద్ధిపరిచి యవయవసౌందర్య మును నాచ్చాదింపఁ జేయగూడదు. మదగజ యామినీత్వమును మాత్రమే హెచ్చుచేసి మగతనమును దగ్గింపఁదగదు. అనుకరణము మాత్రమే యధికపరిచి యుపజ్ఞ కడ్డు రాగూడదు. చిత్రవిచిత్రము లగురుచులు మాత్రమే వృద్దిపరిచి జీర్ణక్తిని దగ్గింపఁగూడదు. కల్పనకు స్వచ్చందత్వమును తగ్గించి బండిజాడనుబట్టి పోవునట్లు మాత్ర మెన్నఁడును జేయఁదగదు. అట్టే మీ రొనర్చినయెడల మధ్యకాల ప్రబంధశకము దిరుగ నుదయింపఁ జేసినవా రగుదురు. ఇంక మేనమామపోలికలు, కవలపిల్లల పోలికలు, ఇంక ననుకరణములు, ననుకరణమున కనుకరణములు, ఛాయూపటములు, నచ్చుబొమ్మలు మొుదలయినవి బయలుదేరును. విమర్శనములోని కట్టుదిట్టములకు మీ రేన్ని శాసనములు కల్పించినను సామాన్యకవితాశక్తికలవాని కవి ప్రతిబంధము లగునుగాని యుపజ్ఞాసహితుఁడగు నుత్తమకవి ముందెప్పడయిన నుదయించునెడల నాతని నేశాసనములు కూడఁ బ్రతిబంధింపఁజాలవు. నిఘంటువాతని ననుసరించి పోవును. వ్యాకరణ మాతని వెంబడించును. పద్యలక్షణ మాతని కనుసన్నల మెలఁగును. భాష యాతనిఁ గాంచి గడగడ లాడును.

వచన రచన:-వచన ప్రబంధములు మనలో మొదటినుండియు దక్కువగనేయు న్నవి. వానియందు మనవారికాదరము తక్కువ. చదువవలసిన వారికా, వ్రాయవలసినవారికి? చదువవలసినవారికిఁ జదువునందే యాదరణము లేనప్పడు వచన ప్రబంధములందనాదరణ మనివాపోవుట యెందుకు? వ్రాయ వలసిన వారికే వానియందు వైరాగ్యబుద్ది; వచనమును వ్రాయువాఁడు వట్టి తెలివి తక్కువవాఁడని సాధారణ జనాభిప్రాయమై యున్నది. కవితామణి కోటీరమును ధరించుటకర్హుండు కానివాఁడే యీకట్టెలమోపు మోయ దగినవాఁడని జనుల నమ్మకము. సాధారణజనులకే యటులుండ నిఁకఁ బద్యప్రబంధకర్త వచన ప్రబంధకర్త నెంతచులుకనగాఁ జూచునో చెప్పవలయునా? తాను దేనెపట్టనియు నాతండు చొప్పదంటనియుఁ, దనది పూలయంగడి యనియు నాతనిది పుల్లలదుకాణ మనియుఁ, దననెత్తిపై మకుట మనియు నాతని నెత్తిపై మట్టితట్ట యనియు బద్యలేఖరి వచనలేఖరిని గూర్చి భావించును. ఎంతబుద్దిహీనతయో! ఈబుద్దిహీనత యీనాటిది కాదు. చిరకాలము నుండి వచ్చుచున్నది. నిజముగా నా సేతుహిమాచలపర్యంతము మన యార్యజాతి యంతయుఁ గవిజాతి. భరతదేశమందలి ప్రకృతి సౌభాగ్యమువలన మనము జన్మకవులము. రత్నగర్బ యని సార్ధకనామము ధరించుటకు సర్వదేశములందు మన యార్యావర్తదేశమే సమర్ఘమైనది కాదా? బంగారము పండ దగిన బార్డివతత్త్వము ప్రపంచమున మeజీయొకటి యేది? ఈవైపునఁ బంచోపనదులతోఁ గైలాసముపై నుండి కచ్చివఱకు సింధునది, యదిదాంటి రవంతకుడిప్రక్కకు రాగానే యభవ జటాజూటోద్భవయై యనేకోపనదులతో నమృతాధిక మాధుర్యధురీణాంబు ప్రవాహములతో ననేక శతయోజన పర్యంతావనీస్థలఫలీక రణ పాటవ ప్రాబల్యముతో ననేక జన్మార్జితాఘవినాశన మాహాత్మ్యముతో నార్యావర్తమున కామూలనుండి యీమూలవఆకు జగజ్జనజేగీయమాన ప్రకాశముతోఁ బ్రవహించు నార్యావర్త భాగ్య దేవత యైనగంగాదేవి-మeజీరవంత దాఁటఁగనే ధవళగిరిపైని-నెవరెస్టుపైని-నా సైమన్న శిఖరములపైని నేమూలనో యుద్బవించి వాయువేగముతోఁ బ్రాగ్లిశగాఁ బ్రవహించి అస్పామునొద్ద మోచేతివాటముగా మరలి దక్షిణముగఁ బ్రవహించు బ్రహ్మపుత్ర యిదికాక వీనిక్రింద నర్మద, మహానది, గోదావరి, కృష్ణ తుంగభద్ర, కావేరి మొదలగు మహానదులు తమ శీతలత్వముచేతఁ దమరసరళత్వముచేఁ దమ మాధుర్యముచేఁ దమప్రవాహశక్తిచేఁ దమపవిత్రతచే నార్యావర్తజనసంఘబుద్దితత్త్వమున శీతలత్వము, సారళ్యము, మాధుర్యము, పవిత్రత, ధాటియొసంగుటకుఁ జాలియున్నవని చెప్పటయతిశయోక్తికాదే. ప్రపంచపర్వత ములలోఁ బ్రథమ గణనీయమగు ప్రాలేయాచలము భరతదేశ మాతృదేవతకు హీరకిరీటమై ప్రకాశించుచుండ, వింధ్యాద్రి వజ్రాలమొలనూలై యుండ, సింహళద్వీపము పాదపీఠ మైయుండ, సమస్త ప్రకృతివైచిత్రీ సన్నివేశ ప్రథమనిదానమైన యాభరతఖండమునందు సన్ని హితసూర్యకాంతి జనుల రక్తమునకుఁ దేజోధికత, ధాటి, దీప్తి గలిగింప భావనాప్రపంచమున శంపాలతా కోటులఁ బ్రాంకింపఁ బవనునకు బంగారుపూఁతవోయఁగ సర్వవిధములఁ బ్రకా శించు నార్యావర్తదేశమందుఁ గవులకు, గాయకులకుఁ, జిత్రలేఖకులకు, భక్తులకు, జ్ఞానులకు వేమాత్రమైన లోప మున్నదా! కావున మనది యాజన్మకవిజాతి; మనగ్రంథము లన్నియు వైద్యగ్రంథములే కావు, చరిత్రగ్రంథములే కావు, నిఘంటువులే కా వన్నియుఁ గూడఁ బద్యముననే పూర్వము వ్రాయబడినవి. ఇప్పడు మన కట్టభావనాశక్ తియున్నదా? ఉహు. ఇప్పడు మనకట్టి కవితాసంపత్తి యున్నదా? ఉహు. మనచిత్తముల కట్టియుత్సాహమైన నున్నదా? ఉహు. విదేశీయ పరిపాలనమున, విదేశీయ గ్రంథపఠనమున, విదేశీయాచారావలం బనమున, విదేశౌషధ గ్రహణమున మనపూర్వవ్యక్తి పూర్తిగ నశించినది. గంగాదేవి నురుగులోఁ గైలాసేశ్వరుని జటాజూట మావరించిన జనని మందహాసమును మనము గాంచలే నప్పడు మనకుఁ గవిత్వ మెక్కడిది? గరుడుడు కృష్ణా యనునప్పడు • విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః, యని చేతులు జోడించుకొనలేని మనకుఁ గవిత్వ మెక్కడిది? అట్టు చేసిన వానిని బుద్దిహీనుఁడని మనము పిలుచుండినపుడు మన కింకఁ గవిత్వ మెక్కడిది? ఇదికాక మతమును వృద్దిచేయకుండ, దైవభక్తిని హెచ్చింపకుండ, నాధ్యాత్మికజ్ఞానమును బలపరుపకుండం, దైవభక్తిని హెచ్చింపకుండ, నాధ్యాత్మికజ్ఞానమును బలపరుపకుండ బ్రకృతిశాస్త్ర మసందర్భముగ, ననర్హముగ, ననుచితముగఁ బవిత్రప్రదేశ ములందలి పైకప్పలను దొలగించినప్పడు మన కింకఁ బ్రకృతిపై రోఁతయే కాని ప్రీతి యే మున్నది? విసుగే కాని వింత యేమున్నది? అగ్నిజ్వాలలోని యసాధారణ లావణ్య మును జూచి యానందింపలేక యిది చూచి కెమికల్ కాంబినేషన్ (Chemical combination) యొక్క ఫల మని నిర్లక్ష్యముగఁ జేయి నూఁపుచున్నాము. కలకంఠము గానకాలక్షేప మొనర్చ నొడలు జల్లు మనవలసి యుండంగా వోకల్ కార్డ్సు (Vocal chords) యొక్క అరేంజిమెంట్సు (arrangements) ఆతీరున నున్న వని మన పెదవి విఱుచుచున్నాము. తుట్టతుదకు: గన్నీటిబిందువు చూచినను మనమనస్సు కరగకున్నదే లాక్రిమల్ (Lachrimal) రసము కొంత, సున్నము కొంత, యుప్పు కొంత, ఆక్వా (Aqua) కొంత యని యనేక లక్షల యాణిముత్తెముల విలువ చేయగల యశ్రుబిందువుల ననేకధా భ్రష్టపరిచి భంగపరిచి దానివంక బృష్టము త్రిప్పచున్నాము. ఇంకనుగవిత్వ మని పద్యము లని యేల దేవులాడవలయును. మనపూర్వపరిస్థితులన్నియుఁ బూర్వమున నునృష్లే యున్నవి. కాని మన మనస్సులలో లేనప్పడు, మన గోదావరీనదిలో రసమే కాని మన మనస్సులలో లేనప్పడు, మన కరకకాయయందు భావనయే కాని మన మనస్సులలో లేనప్ప డింకఁ గవిత్వ మెందుకు? మన సూర్య భగవానుఁడు మన కత్యంత సమీపముననే యున్నాఁడు. కాని మన మనస్సులలోఁ గరఁగని మంచుకొండ యున్నపుడు మనకుఁ గవిత్వ మెక్కడిది? కవిత్వము చెప్పనివాని నింక నధిక్షేపించు టెందుకు? ఎట్టిపిచ్చిలో నేవిధమైన వెగటును లేదో, ఎట్టియున్మాదము ప్రపంచోద్దరణ పటిష్టమో, యెట్టిమతిమాలిన తనములో జ్ఞానవిజ్ఞాన ములు దుర్నిరీక్యమైన తేజస్సుచే వెల్గునో, యెట్టి వెర్రికి వేయివిధములు కాక కోటివిధము లయ్యును బరమార్ద గ్రహణవిధాన మనునొక్కటే విధానమున్నదో, యెట్టి వెణ్ణి వెఱ్ఱు లన్నిటికంటె వెఱ్దో యట్టి వెఱ్ఱని, యట్టి లోకాతీతమైన వెఱ్ఱిని, నట్టి వెఱ్లేని వెర్రిని గలిగి తాను ధన్యతఁ జెంది మనల ధన్యులఁ జేయు నాతండు కవి. ఇప్పడైన నట్టిపిచ్చి లక్షకుఁ గోటి కెవ్వనికైన నుండినయెడల వాఁడు కవితాగానము చేయవచ్చును. అంతే గాని కవిత్వమున నేదో ఘనత యున్నదని యాసించి యందుకై ప్రయత్నించి జను లనందర్బగ్రంథముల సృజించి యకాలపు వెర్రులై ప్రకృతి కాపత్తుఁ దెచ్చిపెట్టుట న్యాయమా? అంతేకాక వచనమును వ్రాయువానిని దీసివ్రేఁతసరకుగఁ గుక్కమూతిపిందెగఁ దృణీకరింప న్యాయమా? పద్యమునఁ గవిత్వ ముండి వచనమున లేకుండునా? ఎచ్చట రసముండునో యచ్చటనే కవిత్వమున్నది. కవిత్వము గుణములో నున్నది కాని గణములో నున్నదా? అభిప్రాయ ప్రకటనమే కావలసినది. అన్ని నాగరకదేశము లందు గూడవచన ప్రబం ధములు లక్షోపలకలుగా వృద్దిపొందుచున్నప్పడు మనదేశమం దట్టు జరుగకపోవుట కడు శోచనీయముకాదా? వచన గ్రంథరచనాబాహుళ్యమునఁ గాని భాషయభివృద్ది నొందనేరదు. మనపరిపాలకులగు నాంగ్లేయులభాషలో వివిధ విషయములపై నెన్నివేల వచనగ్రంథము లున్నవో మీ రెఱుఁగనివిషయమా? మీరు వానిలో నెన్నింటినో చదివియే యుందురు. చదివి యూరకుండుట తగునా? ఆజ్ఞానము నంతను సంపాదించిన మీరు మనమాతృభాష నభివృద్దిపఱచుటకుఁ దోడుపడనక్కఱలేదా? మన కెంతసేపు నాటకమో, నవలయో, ప్రహసనమో, చిన్నకథయో, మోహగీతమో యంతకంటె మరేమియు లేదే విజయనగర రాజ్యమునుగూర్చి సూయల్ వ్రాసిన గ్రంథమైన మనవా రాంద్రీకరింపకుండి రే! చాణక్యుని యార్దికశాస్త్ర, మెవ్వరైన మనకుఁ దెనుఁగుబాసను నేర్పిరా? ఒక్క గులాబిపువ్వునుగూర్చి యెన్నియాంగ్లగ్రంథములో యున్నవి. మన కొక్క గ్రంథమైన నున్నదా? శారీరశాస్త్ర మొక్కటి సంపూర్తిగాఁ బరివర్తన మొనర్పఁదగి యున్నది కాదా? ఫోటోగ్రాఫీ (Photography) bcó 3beoeệ (Metallurgy) hxš s:Serỹsso (Evolution) hxó xoô దేనిమీఁదనో మరి యింక దేనిమీఁదనో యున్నగ్రంథములలో నుత్తమమైనదానిని మచ్చున కొక్కటియైన మనభాషలోఁ జేర్పంగలవారు మనలోని యాంగ్లేయ విద్యాధికులే కాని మఱి యెవ్వరున్నారు. వారు మన కేమని యూరకుండునపుడు భాషకు: దుర్గతి యెట్టు వదలును. ఆంగ్లేయు లెన్నిపరభాషాగ్రంథములను దమభాష లోనికిఁ దెచ్చుకొనుట లేదు? మన మట్టేల సేయరాదు? అదికాక స్వతంత్ రగ్రంథముల కేమంత ప్రోత్సాహ మున్నది? శృంగారరసమున వ్రాసిన గ్రంథము లసభ్యమసభ్య మని మదరాసులోఁ బఠన గ్రంథనిర్ధాయక సంఘము బరిలో నొక్క-క్రైస్తవుడో మహమ్మదీయుడో వైచినకేక ఛత్రపురపుఁ జవుటపల్దలకుఁ దాఁకి బళ్లారి బోడికొండలమీఁదఁ బ్రతిధ్వనించు నప్పడింకఁ జేయవలసినదేది? కరుణరసమున గ్రంథము వ్రాసినయెడల గజనీమామూదు సోమనాథలింగభంగ మొనరించినది. మొదలు త్రికాలములయందు మనకలవాటున్న రసము కరుణరసమే యగుటచేత నెవ్వరాగ్రంథ మును లక్ష్యపెట్టుదురు? హాస్యరసమున గ్రంథము వ్రాసినయెడల నితరజాతుల కెట్లున్నను మన కది మిగులఁ దప్ప. మనకు లైఫ్ (Life) చాల సీరియన్ (Serious) అని యేదో పుట్టి మునిఁగిపోయినట్టు జీలుగు బెండుకంటె దానిని లఘువుగ జూతురే? వీరరసముపై వ్రాయుటకుఁ జేతులు కదలకుండ నరదండములే యయ్యెను. అందుచేఁ గల్పనకుఁ గవితకు సృష్టికి నవకాశమేది? ఏమున్నదో నే జెప్పవేల? మీరెరుంగనిదియా? అందుచే బ్రతుకుందెరువు పుస్తకములు, ప్రతిదేశ వీరచరిత్రములు, ప్రాణరక్షణ గ్రంథములు, ప్రకృతిశాస్త్రగ్రంథ ములు, రాజనీతిపుస్తకములు, పరిశ్రమగ్రంతములు నింక నిట్టివే భాషలోనికి దింపవలసి యున్నది. గ్రంథజాలము యథార్థమైన సారస్వత మగునాయని సందేహము వలదు. “సమిష్టిస్స ర్వశాస్తాణాం సాహిత్య మితికథ్యతే' యని యున్నదికాదా? సాహిత్యపరిషత్తువారికే యిఁక సందేహమేల? కాలానుసరణమైన సారస్వతమిదియే. ఈపనియాంగ్లేయభాషావిద్వాంసులగు నాంధ్రులవలననే కాని కాదు. వారిలో మాతృభాషయం దాదరమున్నవారు కొందరున్నారు. వారెట్లు న్నారనఁగ ననేకవిషయజ్ఞానసామగ్రి యంతయు సిద్దపరిచి కొనియున్నారు. విషయ విభాగములఁ గూడఁ జేసికొనియున్నారు. తెనుఁగుభాషలో వ్రాయుటకు జంకుచున్నారు. చేతఁగాక కొంత. సిగ్గుచేఁ గొంత. మాకన్నియుఁ దెలియు నని వెల్లడించుచునే యున్నారు. ఎప్పడో వ్రాసెదమని వాగ్దాన మొనర్చుచునే యున్నారు. తీర నెవ్వఁడైన నొక్క తెలుఁగు గ్రంథము వ్రాసి దీని కుపోద్ఘాతము వ్రాయుడని వారిలో నెవరికైనఁ జూప నుపోద్ఘాతము నాంగ్లేయభాషలో వ్రాయుచున్నారు. పీఠిక లాంగ్లేయమున నున్న తెలుఁగుగ్రంథములు మనకుఁ గొన్ని లేవా? ఇదేమి కర్మము! ఆంధ్రసారస్వతచరిత్ర మాంగ్లేయభాషలో వ్రాయుచు న్నానని చెప్పినవారిని నే నెఱుఁగుదును. సంధ్యావందన మింగ్లీషుతోఁ జేయుదుమన్న వారితో మనకేమి వినియోగము. కాని వారిసాహాయ్యము లేనిదే మన మేమిచేయ గలము. వారు సాహసించి తెనుంగున వ్రాసినపైన భాషకుపకృతి జరుగుట నిశ్చయము. వారందరు మెకాలే (Macaulay),లాక్ (Ruskin),హెబ్బర్టుస్పెన్ సర్ (Hearbert Spenser) మొదలగు మహావచన ప్రబంధకర్తల శైలీభేదములు పూర్తిగ నెఱుఁగుదురు. వారికభిరుచియైన యేశైలినో యనుసరించి వారు గ్రంథములను వ్రాయుదురు. ఓ! ఇంక నేమికొదువ? ఖదమునడకవంటి శైలి యొకటి, చాదర్ ఖావంటి శైలి యొకటి, బాజీవంటి శైలి యొకటి, పందెపుడౌడువంటి శైలి యొకటి మనభాషలో నవతరింప జేయఁగలరు. చిత్రములైన శైలీభేదములు మనభాషలో మిగుల నరుదుగా నున్న వని వేఱె చెప్పనేల? రైమని పేకచువ్వ పైకెగిరినట్లున్న శైలిభేద మేది

కాకి పైకెగిరియెగిరి రెక్కలు కదలకుండ జందెపుఁ బెట్టుగసాపుగ వాలుగ దిగునప్పటి లఘుపతన చమత్కృతికన బరుచు శైలి పద్దతి యేది? తాళము వాయించునప్పటి తళుకుబెళు కులు, టంగుటంగులు, గలగలలు, జలజలలు గలశైలి యేది? మహాజనులారా! ఇట్లు నే నెన్ని చెప్పవచ్చును? భయంకర మయ్యును మనోహరమై, మహాశక్తి సక్తమయ్యు మార్డవయు క్తమై, ధారాళమయ్యు విశాలమై, స్వభావ సమృద్దమయ్యు సరసాలంకారభూయిష్టమై, సముద్ర ఘోషముగల దయ్యు సంగీతప్రాయమై, స్పష్టీకృత సకలవిషయతత్త్వమయ్యు నస్పష్టస్వకీయ తత్త్వమై చదువరులకుఁ గనుకట్టై, వాకట్బై, మదిగట్టై తల పులిమినట్టు శ్వాసమైన సలుపకుండఁ జేసినట్లు ముష్టినాని చిప్పనుండి మూర్ధాభిషిక్తుని కిరీటమువఱకు భూమిక్రింది యరలనుండి సముద్రములోని గుహలవఱకు నెవరెస్టు కొండనుండి యింద్రధనుస్సురంగుల వఱకు మందాకినీతరంగ రంగద్దంసాంగనాక్రేంకారముల నుండి మహాదేవ సంధ్యాసమయ నాట్యరంగము వఱకు మనోవేగముతో నెగురుశక్తిగల చిత్రవిచిత్రశైలీభేదము లింక నెన్నియో భాషలలో బుట్టవలసి యున్నవి. అట్టు సృష్టికి సమర్ధులగువా రెందరో యిట నున్నారు. బహుధన మున్నది. పరికరనికరమున్నది. పాత్రసామగ్రియున్నది. పాచకులున్నారు. ప్రబలుఁడైన శని నోటనుండుటచే భాషావచనశైలి బలహీనమై పౌరుషరహితమై యున్నది. నకన కలాడుచు నన్నమోరామచంద్రా యనుచున్నట్లున్నది. ఈలోప మెట్లు తీరగలదో సాహిత్య పరిషత్తువారు సత్వరము సమగ్రముగ యోచించుట కర్తవ్యము.

సాహిత్యపరిషత్తు:-సాహిత్యపరిషత్తువారే యీబాధ్యత బహుళముగా వహింపవలయు నని నా వినయపూర్వక విజ్ఞాపనము. వారు పైవారెవరిచేతనో యీ గ్రంథముల వ్రాయింప నక్కజలేదు. ఆంధ్రదేశ పండితులాంధ్రదేశవచన గ్రంథకర్తలు నాంధ్రదేశకవులు సాహిత్యపరి షత్తులోనివారే కాక పైవా రెవ్వరున్నారు? అట్టివా రెవరైన నున్నయెడల వారిని బ్రార్డించి పరిషత్తులోఁ జేర్చుకొందము. సైనిజెప్పిన గ్రంథములు వ్రాయవలసిన వారు మనలోనివారే. ఎటువొచ్చెనను వారిని బ్రత్యేకముగ సమావేశ మొనర్చవలసియున్నది. పరిషత్ను బ్రతిసంవత్సర మెవ్వరో యొక రేదో యూరి కాహ్వానించుచున్నారు. మన మెవ్వరినో యధ్యక్షు నేర్పరుచు కొనుచున్నాము. ఏదో కార్యక్రమము ననుసరించి యెట్టులో జరుపుకొనుచు న్నాము. పై సంవత్సరమునకు మరేదో యూరు పోవుచున్నాము. అంతే జరుగుచున్న దంతే. ఇన్నిసంవత్సరములనుండి భాషాభివృద్దికై ప్రయత్నించు చుంటిమి కదా! అది యేతీ రున నైనది? ఎంతవఱ కైనది? వేనివలన నైనది? అని మనము మనలను గఠినముగాఁ బరీక్షించు కొనఁదగదా? ఇతరులు మనల బరీక్షింపకుండ మనమె యల్లొనర్చుకొనట మంచిదికాదా? పదునైదు పదునారు పూర్వప్రబంధము లచ్చువేయించితిమి, పారిభాషికపద ముల పట్టికలు గొన్ని రచియించితిమి, ప్రశస్తములైన యుపన్యాసము లనేకములు పరిషత్పత్రికలోనచ్చు వేయించితిమి. A Defecne of Literary Telugu అను గ్రంథము ప్రకటించితిమి. కాని మనము చేసిన యీ సేవ చాలకపోవుటచేఁ గాఁబోలుఁ బరిషత్క న్యక యుండవలసినట్లు లేదు. పండ్రెండవయేడు జరుగుచున్న పడు చెట్లుండవలసినది? ఓనన్నుఁ జూడు నన్నుఁజూడు మన్నట్లుండ వలసినదే-అట్లున్నదా-అయ్యయ్యో! సంవత్సర ములున్న నావలెనే చప్పిదౌడలతో శల్యావశిష్టమైయున్నట్టున్నదే బంగారము వంటి ప్రాయ మంకురించిన పడుచు పట్ట బగ్గములు లేకుండ నుండవలసినదే. అయ్యో కాలానుసారగ్రంథ పోషణమునఁ గాని కావ్యకన్యక యొడలు చేయదు. రేకెత్తదు. జబ్బపై జబ్బ వేయదు. జగన్మోహకముగఁ గనంబేడదు. ఇదివఱ కెన్నో నాటకములు నవల లున్నవి కదా వానివలన భాషాభివృద్ది కాలేదా యని యందురేమో ఏదో స్వల్పముగ నయియుండును గాని వానివలన భాషలో నూతనాభిప్రాయములు గలిగినవా? నూతనవిషయము లేమైన బోధింపఁ బడినవా? నూతనశబ్దజాల మేమైన భాషలోఁబ్రవేశించినదా? అవియన్నియు మెరుంగులు, జమత్కారములు, విలాసములు, వన్నెలు, వగలు, నొయ్యారములు, తళుకులు, బెళుకులు, అంతేకాని వానివలన భాషయభివృద్ధి నొందిన ఫ్లెట్టు చెప్పఁగలము. ఒకభూగోళశాస్త్రము మనలోనికిఁ దెచ్చుకొన్నయెడల మనవారికిదివఱకుఁ దెలియని విషయము లెన్ని తెలియును? ఇదివఱకు భాషలో లేనియభిప్రాయములిపుడు క్రొత్తగా నెన్ని చేరును? ఇదివఱకు భాషలో లేని యెన్ని శబ్దము లిప్పడు క్రొత్తగాఁ జేరును? లీలావతినాటి గణితముతరువాత మనకట్టి దేదైన నున్నదా? ప్రపంచమున నున్నయన్ని శాస్త్రములలో నన్నికళలలో నన్నితంత్రములలో నేమేమి మెరుఁగు లున్నవో తెలియఁ జేయఁగల గ్రంథములు మనకుఁ గావలయును. ఇతరజాతుల వారందఱట్టు సంపాదించు కొనుచున్నారు. కావున నింతగా దేవులాడవలసివచ్చి నది. ఒక్కొక్కజాతిగ్రంథము భాషాదేవి కొక్కొక్కముందడుగుగా నుండవలెను. అట్టిగ్రంథ ములను సృష్టించుటకు మన మిపు డేమిచేయఁ దగియున్నది? అధ్యక్షకోపన్యాసమైన తరువాత గార్యదర్శిని వేదనమేదో యున్నదికదా! దానితరువాతఁ బండితులయపన్యా సము లున్నవి కదా! ఉపన్యాస బాహుళ్యము కొంత తగ్గించి మొదటి దినమునందు గావి రెండవదినమందు గార్యనిర్వాహకసంఘసభకుఁ బూర్వమో పరమో కాని గ్రంథకర్తలందరుఁ గలియవలయును. కేవలము తెనుగు తెలిసినవారేకాక, సంస్కృతాంగ్లేయ భాషలయందుఁ బ్రవేశ ముండి యాంధ్రమున వ్రాయఁగల గ్రంథకర్తలు కలియవలెను. ఈనంవత్సరమున కేదో జరిగిపోయినది. పైసంవత్సరము నుండి యట్లు చేయుట మంచిదేమో యోజింపుఁడు. అట్లు కలసి యిప్ప డాంగ్లేయమున నుండి సంస్కృతమునుండి యాంధ్రభాషలోనికిఁ దీసికొనిరావలసిన గ్రంథములేవో మొదట నిర్ణయించుకొన వలయును. వానిలో ముఖ్యములైన గ్రంథము లేవో నిశ్చయించి, మనలోని గ్రంథకర్తల శక్తులన్నియు మనకుఁ దెలియునుగాన, “అయ్యా! యీగ్రంథమును మీరీ గ్రంథమును మీ రని మనలో మనము పంచుకొనవల యును. ఆగ్రంథములు పైపరిషత్సభకుఁ బూర్తిచేసి తీసికొనివచ్చు నేర్పాటు చేసికోవల యును. మహాజనులారా! ఈయేర్పాటుమాత్ర మధ్యక్షోపన్యాసముకంటెఁ గార్యదర్శి సాంవ త్సరికచర్యా నివేదనముకంటెఁ గార్యనిర్వాహకసంఘపుఁ దీర్మానములకంటె నత్యంతము ముఖ్యమైనది. ఏపరిషత్సభలో భాషాపండితులు సంవత్సరము కష్టపడి పూర్తిచేసి తీసికొనివ చ్చిన గ్రంథములు ప్రదర్శింపబడునో యాపరిషత్సభయే జయప్రదముగా జరిగినదని చెప్పవలసినది. మిగిలినసభ లన్నియు మిత్రదర్శనములు బంధు సమాగమములు లీలా ప్రయా ణములు గాలిమార్పులు అట్ హోములు (At home) టీపార్టీలు-ఇన్ని మాటలు చెప్పితివి గదా! నీ వేగ్రంథము నేల రచియింప లేదని మీరు న న్నడుగఁదగినదే. ఇదిగో చెప్పచు న్నాను. నాగుణలోపముకూడఁ జెప్పెదను. ఆంధ్రభాషలో నాయభిప్రాయమును వెల్లడిం చుటకుఁ దగినశక్తి నాకుఁ గలదు కాని సంస్కృతభాషలో నాకుఁ బ్రవేశము తక్కువ. సామాన్యపు దక్కువ కాదు. లేదని చెప్పఁ దగినంత తక్కువ. ఆంగ్లేయభాషాజ్ఞానము మొదటి నుండియుఁ గలత కొట్టయినది. సంవత్సరముల క్రిందటఁ జదివిన యాంగ్లేయగ్రం థమే కాని తరువాతఁ జదివిన దొక్క టైన లేదు. జీవనోపాధిలో నాంగ్లేయ భాషాజ్ఞాన మేమైన నక్కఱవచ్చిన దేమో యనంగ శ్రీరామరక్ష, శ్రీరామరక్ష, మహారాజశ్రీయే కాని మై డియర్ సర్ (My dear Sir) అని యెవరికి వ్రాయవలసిన యావశ్యకత నాయదృష్టమున లేకపోయినది. అందుచే న న్నాంగ్లేయభాష రానివాఁడుగనే మీరు గణింపవలయును. మీ రిట్టు సంవత్సరక్రమముగాఁ జేయవలసిన గ్రంథజాలము వలన భాషయభివృద్ది నొందుటయే కాక గ్రంథకర్తలలో సఖ్యముకూడ నభివృద్ది నొందఁగలదు. "కవికిఁ గవి కున్న కాకోదర మండూకము వైఖరి, కవికి విమర్శకున కున్నమూషకమార్థాలవైఖరి, విమర్శకునకు విమర్శకున కున్న సామజపంచానన పద్దతి, సత్వరముగ నంతరించి వారిలో సాహచర్యము సౌమనస్యము సౌభ్రాతృత్వము సంభవింపఁగలవు. గ్రంథకర్తలలో నిట్టి మనస్థితి భాషకు దేశమునకుఁ బరమ శుభోదర్కము. సాహిత్యపరిషత్పక్షమున నిప్పడు రచియింప బడుచన్న యాంధ్రభాషాశిరో భూషణ మైనగ్రంథము సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఇది పరిషత్పకముననే రచియింపఁబ డుచున్నను బరిషత్సభ్యులకు ధనవిషయ మైనశ్రమము లేకుండ నిఘంటుసంబంధము లగుసమస్త వ్యయప్రయాసములను మామహారాజుగారే మహోదారమనస్కులై వహించుచు న్నారు. భాషాపండితులును నుత్తమ విమర్శకులును నగు మ-రా-రా-శ్రీ, జయంతి రామ య్యపంతులుగారు కేవల భాషాప్రేమ పూర్వకశ్రమమునకులోనై భాషా సేవయే ప్రతిఫలముగా నెంచి నిఘంటు సంపాదకత్వమున నిర్నిద్రదీకులైయున్నారు. ఈనిఘంటువు మహోత్తమ గ్రంథము కాఁగల దని నమ్మియున్నాము. మరియు ననేకాంధ్రప్రబంధ వ్యాఖ్యాన రచయిత లును ననేక గ్రంథద్రష్టలును నపారసాహిత్య సంపన్నులును నాస్థాన విద్వాంసులు నగు శ్రీపురాణపండ మల్లయ్యశాస్రులుగారిచే బ్రహ్మసూత్ర భాష్యమును మహారాజుగారే యాంద్రీ కరింపఁజేసిరి. భాషాపుష్టికర మైనదియు విషయగౌరవప్రాశస్త్యాదులం బట్టి యాచంద్రార్క ముగ నాంధ్రభాషలో నుండ దగినదియు నైయున్నది. ఇది కాక యనేక పాఠాంతరములతో నర్హమైన వ్యాఖ్యతో నాంధ్రభారతమందుఁ గొన్నిపర్వము లీపండితవర్యునిచేతనే బడియున్నవి. భాషకీమహోపకారము కూడ మామహారాజుగారే యాచరించు చున్నారు. ఇది కాక కవిచక్రవర్తియైన కృష్ణదేవరాయలచే రచింయుంపఁబడిన యాముక్తమాల్య దకు మామహారాజుగారు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయే త్యాదిబిరుదాంకితు లయిన వేదము వేంకట రాయశాస్రులవారిచే వ్యాఖ్యానము వ్రాయించిరి. దాని నచ్చువేయించుట కెన్ని సంవత్సరముల క్రిందటనో యేర్పాటు చేసియుండిరి. వ్యాఖ్యారచన పూర్తియైనదట! అచ్చింక గాలేదు. కారణము తెలియదు. ఇదిగాక యాస్థానతర్కవిద్వాంసు లగు శ్రీమాన్ గుదిమళ్లవేంకట రంగాచార్యుల వారిచే శ్రీవచనభూషణ మనుసంస్కృతగ్రంథము నాంద్రీ కరింపఁజేసిరి. ఇట్లు భాషాపోషకులు భాషాపండితులు నగు శ్రీమహారాజుగారికి దీర్ఘాయురా రోగ్యాది సకలైశ్వర్యములు సర్వేశ్వరుఁడు ప్రసాదింపవలయు నని పరిషత్పక్షమున నేను బ్రార్థించుచున్నాఁడను.

వ్యాకరణము:- ప్రస్తుతవ్యాకరణము లసమగ్రముగ నుండుటచేత భాషాపరిశుద్ది రక్షణ మునకై విపుల మగునొక వ్యాకరణమును రచియించుట మంచిదని పూర్వసభలలో నుపన్య సించిన యధ్యకులు కొందరు సెలవిచ్చిరి. వారియిష్టము ననుసరించి వ్రాసినను వ్రాయవచ్చును. మీయుపేక్షననుసరించి మానినను మానవచ్చును. ప్రపంచమున నున్న ప్రతిసారస్వ తపరిషత్తునకు రెండే ప్రధానోద్దేశములు. భాషాపోషణము, భాషాపరిశుద్దరక్షణము. మొదటిది గ్రంథములవలన నగును. రెండవది వ్యాకరణశాస్త్రమువలన నగును. ఇదివఱకు మన మనుకొనిన ట్టింక, గొన్నివత్సరములు గ్రంథములు వృద్దినొందినతరువాత వ్యాకరణరచనా నుచరణనుగూర్చి యోజింపవచ్చును. ఇప్ప డంత తొందరలేదు. ఇప్పడే రచియింపవ లయునని యోజించు వారు వారి యిష్టానుసార మాచరింపవచ్చును. ఎప్పడు రచియించినను బరిషత్పకముననే యది రచియింపఁబడుట మంచిది. పరిషన్ముద్ర దానిపైఁగూడ నుండవల యును.

మహాజనులారా! ప్రభువుల యాదరణ మున్నను లేకున్నను బ్రదుకుఁదెరు వున్నను లేకున్నను బ్రపంచయాత్రలోఁ బరిపరివిధములఁ గష్ట్రములొందినను భాషాచరిత్రమునఁ దమ పేరు స్థిరముగా నిలిచియుండునను ప్రజలశ్వాసముచేత నూరుసంవత్సరములలోపల నెందఱోగ్రంథములు రచియించి మరణించి యున్నారు. తమహృదయరక్తముతో వ్రాసివారు మనకొఱ కిక్కడ విడిచిపెట్టిన గ్రంథములను మనము భద్రపరిచి గౌరవించుచున్నామో లేదో యని వారి నిశ్శరీరాత్మ లాందోళనము నొందుచున్నవి. తమ్ముఁ గూర్చి తమతరువా తివా రేమనుకొనుచున్నారో యనియుఁ దమ్ముఁ బ్రశంసించుచున్నారో దూషించుచు న్నారో మలచియే పోయినారో యనియు వారు తహతహలాడుచున్నారు. నిజము చెప్పవలసి నయెడల మనము కొందరి నప్పడే మఱచియే పోవుచున్నాము. మండపాక పార్వతీశ్వరశా స్రులవారు రచియించిన గ్రంథనామము లన్నియు మనకుఁ దెలియునా? ఆయన జననతిథి మృతతిథి యేవో మనకుఁ దెలియునా? పోనిం డెంతకాలము జీవించిరో యెఱుఁగుదుమా? శతాధిక గ్రంథకర్తచరిత్రమే మనకు సందేహాస్పద మైనదే. వావిలాల వాసుదేవశాస్రులవారు, బెల్లపుకొండ రామారావుగారు, కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు, ధర్మవరము కృష్ణమాచార్యులుగారు, డి. కృష్ణశాస్రులుగారు, దేవులపల్లి సుబ్బరాయ తమ్మన్నశాస్రుల వారు, దేవగుప్త సన్న్యాసిరాజుగారు. తిరుపతిశాస్రులవారు మొదలగువారెందరో గ్రంథముం వ్రాసి కాలగతిం జెందినారు. వారిచరిత్రములు తెలిసినంతవఱకు సంపాదింప వలసియున్నది. ఈభారముకూడ బరిషత్తు వారే భరించుట కర్డులు. కందుకూరి వీరేశలింగము పంతులు గారి కవి జీవితగ్రంథముల తరువాత వ్రాయదగిన గ్రంథముల కుపయోగపడు సామగ్రి పరిషత్తువారికిఁ గావలదా? అదిగాక మృతకవులయందఱ ఛాయాపటములఁ గూడఁ బరిష త్కార్యాలయమున నుంచుట మంచిది. వారి నావిధముగ మనము గౌరవింపవలయును.

ధనార్జనము:-కాని ప్రాబలుకులకుఁ బ్రణవ మెట్లు ప్రారంభమో, వివాహాదిశుభకార్య ములకు విఘ్నేశ్వరపూజ యెట్టు ప్రారంభమో, నాటకములకు నాందీపూజ యెట్లారంభమో, పరిషత్కార్య నిర్వహణమునకు “సొమ్ములేదు సొమ్ములే! దను పంచాక్షరి ప్రారంభమై యున్నది. ఇది యొక్క మనపరిషత్తునకుఁ గలిగినబాధయే కాదు, పార్లమెంటుసభ యందు మొదలు పంచాయతీకోర్టులోవఱకుఁ బాడబడుచున్న పాటలన్నిటికిఁ బల్లవి యిదియే. సొమ్ములేదు. సరియే కాని, యుత్సాహము లేకున్నఁ జిక్కు కాని సొమ్ము లేకున్న నంత చిక్కు లేదు. సొమ్ముపై నుండి రావలసినది, యుత్సాహము లోనినుండి రావలసినది. ఉత్సాహమె మనకు బూర్తిగ నున్నయెడల సొమ్ము వచ్చియే తీరును. ఉపకారవేతనమును దీసికొనక పూర్వము మ.రా.శ్రీ, జ. రామయ్య పంతులుగారు పరిషత్తునకు ధనలోప మెక్కువగా నుండుటను జింతించి తా మాంధ్రదేశమున నున్న ప్రతిగ్రామమునకే గాక ప్రత్యాంధ్రుని గృహమునకుఁ గూడఁ దిరుగుదు ననియు నింటికొక్క రూపాయచొప్పన సేకరించి పరిషత్తున కీకొఱత దీర్తు ననియు నీగ్రామమందే సెలవిచ్చియుండిరి. ఆయన యుత్సాహమే పరిషత్తునకున్న ప్రధానాధారములలో నొక్కటి. ఆయన పెద్దలగుచున్నారు. యువకులగు భాషాభక్తులాయనకుఁ దోడుపడినయెడల సొమ్ము లేదన్న పంచాక్షరీమంత్రము సొమ్ము లేకపోలేదను నష్టాక్షరీమంత్రము క్రింద మార్పఁగలరు. మహారాజులు రాజులు జమీం దారులు మొదలగునంపన్ను లిదివఱకే విశేషధన మిచ్చియున్నారు. అందులో మామహారాజు గారు పైగ ప్రధానమైన నిఘంటు నిర్మాణమునకు వలయుధనము నంతయు నీయసంకల్పిం చుకొనియే యున్నారు. ప్రజలే తమ బాహుబలమున నింకఁ బరిషత్తునకు ధనము సమకూర్ప వలసియున్నది. ఊరనున్న ప్రతి గృహముపై యూనియను పంచాయితీ పన్నిచ్చుచు న్నామా? లేదా? ఒక్కరూపాయ మొదలు పది యిరువది రూపాయలకు పైగ నిచ్చుచు న్నామా? లేదా? పరిషత్తు పన్నుక్రింద నింటింటి కొక్కరూపాయ యింతటి నుండి వసూలు కావలయును. అది యెంతబీదవారి యింటికైనను భారమని యనిపింపదు. ఇదివఱకు మన మెన్నిపన్ను లిచ్చుచుండలేదు. ఇంక నెన్ని యిచ్చుటకు సంసిద్దులమై యుండలేదు. అవియన్నియు మనకు మోక్షప్రదములా? ఇది కాకపోవునా? నిజ మాలోచింపఁగాఁ బరిషత్తుప న్నుకంటె మ్యునిసిపల్ పన్ను మనకు ముఖ్యమైనది కాదు. ఇంటిముందు పెంట యుండుట మంచిదా? మనసునందుఁ బెంటయుండుట మంచిదా? కావునం బంచాయితీపన్ను కంటెఁ బదిరెట్లు సంతోషముతోఁ బరిషత్తుపన్నును మన మీయవలయును. ఇప్పడు మనదేశమం దున్న గ్రంథకర్తలతాతలో తాతలతండ్రులో ప్రత్యాంధ్రునియింటిలో జరిగిన వివాహములలోఁ గవిత్వపు బఖైరమును గ్రహించినవారైయుందురు. నేనుగూడంగవిత్వపువరహా గ్రహించు నాచారము గల వారివంశములోని వాఁడను.

కవులారా! మనహక్కులను మనము విడుచుకొంటిమి. అది తప్ప. Lispendens Resudicata జ్ఞానమువలన మనము సంపాదించుచున్న సంచులకంటె కాన్ తీటా సైన్తీటా జ్ఞానము సంపాదించుచున్న ముల్లెలకంటె D.C.B.Income-tax జ్ఞానమువలన సంపాదించు చున్న మూటలకంటె Cash Credit జ్ఞానమున సంపాదించుచున్న గోతములకంటె కవితాదేవతారాధన పూర్వకముగ మనముత్తాతలు కళ్యాణకాలమందు సంపాదించిన పరమపవిత్రమైన కరకు వరహాయున్నదే యది మాత్రము సోదరగ్రంథకర్తలారా! అధికమైనది. అమూ ల్యమైనది. అనుపమానమైనది. మదరాసు బ్యాంకి (Bank) లోని ధనమంతయు మీదేయైనను మాటవరుసకు జడీ తప్పలేదుకద! దానికంటె మీ కవిత్వపువరహా ఘనమైన దని యెంచవలయును. అట్టి యత్యుత్తమ ధనము మన మేల వదులుకొనవలయును? ఆంధ్రసోద రులారా! ఇంతటి నుండి మీయింట జరుగు కళ్యాణమునందు మాకు రావలసిన కవిత్వపు గట్నము మీరీయక తప్పదు. మీపూర్వులు మాపూర్వుల కిచ్చిరి కావున మీరు మా కీయవలసియున్నది. గ్రంథరచయితలమగు మే మాంధ్ర సాహిత్యపరిషత్తునఁ జేరియుంటిమి కావున మాకు రావలసిన దేదో మీరు పరిషత్తునకే యర్పింపవలయును. మాయిండ్లలో జరుగు పెండ్లిండ్లకుఁ గూడ మేము గవిత్వపుఁగట్నమును పరిషత్తునకే సమర్పించు కొందుము. మహాజనులారా! పరిషత్పోషణము మీచేతులలోనే యున్నది. మీ వలన వచ్చుధనము పరిషత్కార్యముల కింకను జాలకుండునెడల మరల దేశీయ ప్రభువులనే ప్రార్డింతము. పదేపదే వారినడుగుటలో మనకు వెనుక యడుగు లేదు. మరల మరల వెందు కీయవలయునని వారికి వెనుకచేయి లేదు. ఇట్లు రాఁ దగినధనములో నెనిమిదవభాగ మైనను బండ్రెండవ భాగమైన నే నింకఁ జెప్పఁబోవుపనికై వినియోగింపవలయు నని నా ప్రార్థన. నాయనలారా! మీరు శాసననిర్మాణసభలలో సభ్యులైనను మంత్రిపదవుల కర్ణులైనను గాలాంబరకవచధారులై కర్కశతర్క వాగ్వాహినితో న్యాయసభలందుఁ జేరి కాకిని గ్రద్దను, గ్రద్దను కాకిని జేయ గల యింద్రజాల మహేంద్రజాల విద్యామహామ హోపాధ్యాయు లైనను దర్క వ్యాకరణ వేదాంతాది శాస్త్రపంచాననులైనను భాషాభివృద్ది మాత్రము కలము చేతఁ బుచ్చుకొని కడుపు చేతఁ బుచ్చుకొని గ్రంథముల వ్రాయు కవులవలనఁ గాని మీవలనఁ గాదు. కాదు. గ్రంథరచనా బాహుళ్యమునఁగాని భాషాభివృద్ది కాదు. కాదు. వెనుకటియధ్యక్షులు చెప్పిన దదియే; ఎన్నిసారులైన నేను జెప్పిన దదియే; రాంబోవువారు కూడఁ జెప్పఁదగినదదియే. అధ్యకు లలో భేదమే కాని పాటలో భేదము లేదు. మునుపటి సుతియే. మునపటి రాగమే. మునుపటి తాళమే. మునుపటి పల్లవియే. మునుపటి యెత్తుబడియే. చివఆకు మునుపటి యాశాభం గమే. అది మాత్రము రానీయకుండు. నిజముగాఁ గవులు మిగుల దురవస్థలో నున్నారు. గాదులలో గరిసెలకొలఁదిఁ గల్లా యున్నవారు, సర్కారివారియొద్ద బత్రము లున్నవారు, మిద్దెలమీఁదఁ గొబ్బెర కురిడీలను నిలువఁజేసినవారు, నింక వేమోచేసినవారు, ఇంక మరి యేమో చేయుచున్నవారు నట్టిమీకుఁ గవులు పడుక్షోభ మెట్లు తెలియఁగలదు. కవిజన్మ మంత యసందర్భజన్మము మఱియొకటి లేదు. స్వభావజ్ఞాన విక్షేపమైన కవికి సంసారమును బొదుపుగా జరుపుకొను బుద్దిలేదు. భావనాభండార ప్రభూత్తముఁడైనకవి కాఫీనీటికై మూఁడుకాసులకొఱ కల్లల్లాడిపోవును. తనయభిప్రాయములను వారణీసీ పీతాంబరములతో డాకామసిలినులతో జలతారు బుళేుదారీపనులతో సింగారించిన కవి కమీజు మెడక్రింది చినుగులనుంగ్రమ్ము కొనుటకు గంఠముచుట్టు బట్టచుట్టుకొనును.

ఇట్టిదుస్థితిలో నున్నను మవన్సులో నతినికి దీనత లేదు. వైద్యము లేదు. అడఁకువ యన్నమాట లేదు. శాశ్వతముగా నుండువాఁడు దానొక్కడే కాని మిగిలినవా రందరు నశించువారే యని నమ్మికతోఁ దా నుండును. అట్టివాఁ డొకని నాశ్రయింపఁగలడా? అతనికున్న గర్వము నహంభావము రణశూరుల కున్నదా? రాజాధిరాజులకున్నదా? తలతిక్కలో నంతవాఁడు మఱియొక్క డేఁడి? తనరుచియే తనది; తన మతమే తనది; తన ధోరణియే తనది. ఫాదుషాను మెచ్చువాఁడు కాఁడు. భగవంతునే మెచ్చువాఁడు కాఁడు. కాని యిట్టికొస వెర్రివారివలననే భాషాభివృద్దియయినది; యగుచున్నది. కావలసియున్నది. వారిండ్లలోబడి యష్టకష్టములఁ బడుచు భాషా సేవ చేయుచున్నారు. వారంత దురవస్థలో నున్నారని చెప్పటయే సత్యము. వీథుల వెంటదల లెత్తుకొని తిరుగుచునే యున్నారని మీరు నన్నధిక్షేపింపకుఁడు. వా రంటుజవాను లే వైపుననుండి వచ్చుచున్నారో యని యటునిటు తలలెత్తి చూచుచున్నారు. కాని మరియొకటి కాదు. నామాట యథార్డమని విశ్వసింపుఁడు. అట్టివారు కొన్ని యమూల్య గ్రంథములను వ్రాసి యంతరించినారు. ఇంక నంతరింప నున్నారు. వారి గ్రంథము లచ్చుపడుట కాధారము లేదు. అవి భాషలోఁ జేరు ననునాస లేదు. ప్రతిమండలమందుఁ బుస్తకముల యేజంటులు నున్నారుకదా! వా రాగ్రంథ ముల నుద్దరించి కవులకష్టములఁ గడతేర్పం ఎ? ఆ కడతేర్చుచునే యున్నారు. కవులను గ్రంథములనుగూడ నూటి కెనుబదియైదు కమీష ననువాఁడొకఁడు మూఁడువేలప్రతు లచ్చువేయించుకొని మూడుపాతికల ప్రతులు కవికిచ్చెద ననువాఁడొకఁడు. ఇట్టివారే యున్న వారిలో ననేకులు. ఇతర దేశములలోఁ బూర్వశతాబ్దములందలి గ్రంథవిక్రేతలు కవులనైన మిగిల్చిరి. ఇప్పడు పరదేశములలో గ్రంథకర్తలు గ్రంథవిక్రేతలుగూడ బాగుపడు చున్నారు. మనదేశమందు గ్రంథవిక్రేతలు కలియుగవృకోదరులై మన గ్రంథకర్తలనుగూడ గబళించుచున్నారు. గ్రంథకర్తలలో బొత్తిగారిక్తులగువారిని మీరు కాపాడ వలసియున్నది. ధనశక్తి తక్కువైన కొలఁదిఁ గవితాశక్తి యొక్కువగ నున్నవా రెందరో యున్నారు. ఆ సంగతి మీరు బాగుగఁ దెలిసికొని యట్టివారి గ్రంథముల నచ్చువేయించి వారికి గ్రంథప్రతుల నిచ్చునెడల వారు బాగుపడుదురు. వానిని గ్రంథనిర్ధాయకసంఘమువారు పఠన గ్రంథములుగ నియమించునెడల వారు రవంత నిలువఁబడి యింకను గ్రంథముల వ్రాయుదురు. పరిషద్ద నములోఁ బండ్రెండవవంతో యెనిమిదవవంతో యొకందులకు వినియోగింపవలసి యున్న దని నే నింతకుముందుఁ జెప్పితినే, యీ యుత్తమకార్యమునకైయది వినియోగపడవలసియు న్నది. ప్రపంచమందలి యితరదేశములలోని పరిషత్తులు దాదాపుగా నన్నియు నిట్టు నిరుపేదకవులకు సాయమొనర్చినవి. అదికాక యట్టివారు మరణించినపిమ్మటఁ గూడ వారిపిల్లలకుఁ గొంతయుపకార వేతనము లిచ్చినవి. అంతపని మనము చేయ జాలము. ప్రధానకృత్యములకే పరిషత్తుధనము లేకుండ బాధపడుచుండఁగాఁ బారమార్షికకృత్యము లెట్లు చేయఁగలదు? అదిగాక రెండు మూఁడు వందలసంవత్సరములక్రిందటఁ బాశ్చాత్యదే శములందలి కవుల దరిద్రతవంటిది ప్రపంచమున లేదు. మనకవులలోఁ గూడ లేనివారనేకు లున్నారు. కాని వారియంత లేనివారు కారు. అయిదుదినము లాంకలిచే మాండిమాండి యాకస్మికముగ దొరికిన రొఫై నాత్రముతో మ్రింగఁబోవ నది యంగిటి కడ్డుపడుటచే నంతలో ననువులను బాసిన ఓట్వే (Otway) వంటి కవి మనలో నేఁడీ తనయస్థిపంజరము నమ్ముకొని రొఫైవాని కీయవలసిన ఋణమును దీర్పు మని మరణశావసము వ్రాసిన వాజిలాల్ వంటికవి మనలో నేఁడీ? కావున మనకవులకు గ్రాసవాసముల కంతసాహాయ్య మావశ్యకము లేదు. మంచి గ్రంథములు వారు రచించునెడల వాని నప్పడప్పడు పరిషత్తువా రచ్చువేయింప వలయును.

బిరుదములు:-ఆర్యులారా! మరియొక చిన్న విన్నప మున్నది. ఆంధ్రదేశపండితులలోఁ గొందరు సర్కారువారు బిరుదములు నొసంగుచున్నారు. సర్వసం గపరిత్యాగు లైన సన్యాసులు సైతము వదలని వదలగూడని భాషాభిమానముచే భాషావిద్వాం సులలోఁ గొందఱకు బిరుదము లిచ్చినారు. శంకరాచార్య పీఠస్థులొకరు బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నముపంతులవారి కొక బిదుద మిచ్చినారు. వానమామల జియ్యరు గారు శ్రీమాన్ కాండూరి భాష్యకారాచార్యుల వారికిఁ గవి సార్వభౌముఁడను బిరుదమును గాబోలుం గటాక్షించిరి. కామకోటి శంకరాచార్యపీఠస్థులు మన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారి కనేకబిదుదము లీనడుమనే యిచ్చినట్టు వినుచున్నాము. తుదకుఁ గాళీ ఘట్టమున నున్నసంఘమువా రెవరో మనయాంధ్ర దేశీయపండితులకు బిరుదము లిచ్చి బహుమానించుచున్నారు. కాని మనసాహిత్య పరిషత్తు వా రిచ్చుచున్న దేమున్నది? మనవారిచ్చుచున్నవి రెండే బిరుదము; సామాన్యసభ్యుఁడు, కార్యనిర్వాహకసభ్యుడు. ఇంతే. ఈ బిరుదమునైన నేదో కొంత దక్షిణ తీసికొని యిచ్చుచున్నారు. కాని పాండిత్యబ హూకృతిగా నిచ్చుటలేదు. మీ కాంధ్రదేశమున బిరుదార్డులైన పండితులు కనఁబడనేలేదా యేమి? అటులైన మీకుఁ గనబడనివారు పైవారి కెట్టు కనబడుచున్నారు? ఒకరి కిచ్చినయెడల మిగిలినవారు మాకేల యీయకపోవలయునని వివాదపడుదురేమో యనుసం దేహమున మానివైచితిరా! అటులైన సర్కారువారిపైనున్న, శంకరాచార్యులవారి పైనను నిందుల కిప్పడు వ్యాజ్యములు తెచ్చినవా రెవ్వరు? బిరుదముల కర్ణులైన పండితు లందరు మనసాహిత్య పరిషత్తులోనే యున్నారు. కాని బిరుదములను గూర్చి యేపండితుఁడుగూడ నిదివఱకు ముచ్చటించి యుండలేదు. ఎందుకో మీరెఱుఁగరా? ఏపండితుఁడైన ముచ్చటిం చినయెడలఁ దనకు బిరు దిమ్మని యడుగుచున్నాఁడని పైవా రనుకొని పోవుదు రనుభయముచేఁ బండితు లెవ్వరుఁ గిక్కురుమనకుండమన్నారు. నే నాపాండిత్యబాధ లేనివాఁడను గావున నిర్భయముగాఁ బలికితిని. ఆపండితుని సభాధ్యక్షునిగా నెన్నుకొనుట వలనఁ గలిగిన లాభ మిది. ఇంతకంటె నే నిష్పడు చెప్పఁదగినది లేదు. సాహిత్యపరిషత్తు నిచ్చటి కాహ్వానించిన భాషాపోషకులగు శ్రీపీఠికాపుర మహారాజుగారి యెడలఁ గృతజ్ఞలమై యుండి వారి క్షేమాయురారోగ్యైశ్వ ర్యాభివృద్దులకు భగవంతునిఁ బ్రార్ధింపవలయును.