కాశీమజిలీకథలు/మొదటి భాగము/మొదటి మజిలీ

వికీసోర్స్ నుండి

మొదటి మజిలీ

శూరసేన మహారాజు కథ

కాశ్మీరదేశంబున మధుర యను పట్టణంబున శూరసేనుండను రాజు గలం. డతండు ధార్మికుండును నీతిమంతుడును వినయశీలుండును బుద్ధికుశలండు నగుటచేఁ దన రాజ్యమందలి జనులెల్ల బిడ్డలవలెఁ జూచుకొనుచు వారివారికిఁ దగినరీతిఁగొలఁది కప్పంబులం గట్టుచు బేదలైనవారి కుటుంబమునకుఁ దగినవృత్తు లేర్పరచుచు దేవబ్రాహ్మణభక్తి గలిగి నిర్జలప్రదేశంబుల వాపికూపతటాకాదుల ద్రవ్వించుచు రామరాజ్యంబువోలెఁ బాలించుచుండెను. అతనియెడఁ బ్రజలు నధికతాత్పర్యముతో మెలగుచుండిరి. మఱియు నతనికి వినయవిధి యను మంత్రి గలం. డతండును గంటికి రెప్పరీతి రాజునకు ముప్పురాకుండఁ గాపాడుచు నీతిశాస్త్రపారంగతుడై సంధివిగ్రహయానద్వైదీభావసమాశ్రయములయందును సామదానభేదదండములయందును మిత్రామిత్రులయందును యథాయుక్తముగా మెలంగుచు అరులవలన రాజ్యంబున కేకొఱంతయు లేకుండునట్లు ఇంద్రునిచెంత బృహస్పతియుంబోలె సకలరాజ్యభారవాహుండై యుండెను.

ఆ రాజేంద్రుని పురోహితుడు కళానిధియనువాఁ డఖిలశాస్త్రములఁ బరిపూర్ణముగాఁ జదివినవాఁ డగుట నతనిసహాయమువలన గతాగతకాలముల మంచిచెడ్డలఁ దెలిసికొనుచుఁ గాలవైపరీత్యాదిదోషంబులకుఁ దగినశాంతులఁ గావించుచు నాఱే డతనిమంత్రంబుసైత మాలోచన సభలో ముఖ్యమైనదానిఁగా నెన్నుచుండెను.

మఱియుం బ్రాజ్యవాణిజ్యపూజ్యపతియగు నొకవర్తకుండును సకలయంత్రగదనానిపుణధిషణుండగు నొకకళాదుండును నాప్తులై యుండ నాభనాథుం డామంత్రిపురోహితవర్తకకళాదులు నలువుర నెల్లప్పుడు నెడబాయక వారియాలోచనాను సారముగా రాజ్యం బేలుచుండెను. వా రేగురు రాజ్యదేహంబునకుఁ బ్రాణంబులై యేకొరంతయులేక నడుపుచుండిరి. ఇ ట్లుండునంత నద్ధారాకాంతుఁ డొకవసంతకాలమున సాయంసమయమున నంతఃపురసౌధధోపరిభాగంబున నిష్కుటవిటపికుసుమవాసనలు నాసాపుటపర్వంబు గావింప నలుదెసలఁ గట్టిన వట్టివేళ్ళచాపలఁ జలించు జలశీకరంబుల నెగరజిమ్ము కమ్మని మలయమారుతమ్ములు మేనికి హాయిగా సోక నేకాంతపుకొలువు దీర్చి యక్కొలువుకూటంబునకు నల్వురమంత్రుల రావించి యంతకుమున్ను తనకుఁ గలిగిన విచారంబు వాపుకొనురీతిఁ బ్రసంగింపుచుండ నవ్విధం బెఱింగి వినయనిధి వినయంబున నిట్లనియె.

దేవా! దేవరవారి ముఖవిలాసం బరయ నేఁ డెద్దియో విచారగ్రస్తమానసులై యున్నట్లు తోచుచున్నది. తద్దయుం బ్రొద్దు చింతింపనట్టి కారణం బెద్దియున కానరాదు. ఎద్దియేనిం గలిగెనేని సమదుఃఖసుఖులమైన మాకుఁ జెప్పవలదె? చెప్పితిరేని ప్రాణంబులచే నగుకార్యంబైనను సమర్థింపగల. మవ్విధం బరయ మానసంబు లాత్రపడుచున్నవని యడిగిన నతనిమాట లాలకించి యొక్కింతసే పూరకుండి యుస్సురని దీర్ఘశ్వాసపూర్వకంబుగా నారాజు వారి కిట్లనియె.

మిత్రులారా! నాకు గొరంత యేమియును లేదు. నేఁడు మనయాస్థానమునకు వచ్చిన వార్తాపత్రికం జూడ నామనంబున నొక్కవిచార మంకురించినది. మనరాజ్యంబునఁ గోటీశ్వరుఁ డొకఁ డకాలమృత్యువుచేఁ గబళింపఁబడెనట! అతని కేవిధమైన సంతానమును సమీపజ్ఞాతులును లేకపోవుటయేగాక మరణశాసన మేమియును వ్రాయకుండుటంజేసి వాని యాస్తియంతయు మన యధీనమైనదని తద్గ్రామాధికారులు పంపిన పత్రిక యిందాక మీరు చూచినదే కదా!

సంతానంబు గొరంతయైన వానిగతి యెట్టిదో గంటిరే! మనకు సైత మిట్టిచందం బగునేమో యనుచింత యావిర్భవించినది . మనకు పూర్వప్రాయంబు కడచినది. దేహంబుతోడనే గదా మృత్యు వావిర్భవించుచున్నది. బ్రతుకునిక్క మెవ్వ రెఱుంగుదురు. మనలో నొక్కనికిని నొక్కపుత్రుఁడును లేకపోయెనే! మన యనంతరం బింతరాజ్యం బెవ్వని యధీన మగునో యని చింతించుచుంటి. ఇంతియకాని వేరొండు కాదు. దీనికి మీయుత్తరం బేమని యడిగిన బుద్ధిమంతుడగు నమ్మంత్రి యా రాజుతో వినయపూర్వకముగా నిట్లనియె.

దేవా! దీనికిఁ జింతింపకుఁడు. పుత్రోత్పత్తివిషయమై యనేకసాధనంబులు గలిగియున్నవి. తొల్లి దశరథాదిధరణిపతులు పెక్కండ్రు వృద్ధులయ్యు పుత్రకామేష్టి మొదలైన సత్క్రియల వలన సంతానంబు వడయలేదా? అట్టి విధిం దెలుప మన పురోహితుండు సమర్ధుండని యతని మొగముపైఁ జూడ్కి నిలిపిన నా బ్రాహ్మణుఁడు లేచి యల్లన నమ్మహారాజుతో నిట్లనియె.

రాజా! సంతానము జనించుటకై పెక్కువిధుల గ్రంథంబులఁ జెప్పఁబడియున్నవి. హోమంబులు, దానంబులు, తీర్థసేవలు లోనగు సత్క్రియలవలన బుత్రులు జనింతురు. వానిలో సులభమగు మార్గంబు చింతించి, సంతానంబు గలుగుటకు పూఁటకాఁ పయ్యెదను.

బ్రాహ్మణప్రసాదంబున గాదే! తొల్లి వృద్ధుఁడైన నరసింహదేవమహారాజుగారు కృష్ణదేవరాయలం గని రనిన నృద్ధరాకాంతుఁ డావృత్తాంత మెఱింగింపుఁ డనుటయు బ్రాహ్మణుం డిట్లని చెప్పఁదొడంగె.

కృష్ణదేవరాయల జననకథ

ప్రసిద్ధుండైన నరసింహదేవమహారాజుగా రాంధ్రదేశంబున నధికధర్మిష్ఠుండై పాలించుచుఁ గవీంద్రులవలన ననేకకృతులు వడసి దిగంతవిశ్రాంతయశోమహితుండై యొప్పుచుండెను. ఇట్లుండియు సంతానంబు గొరంతయైనఁ జింతించుచున్న యావృద్ధభూవతి మతికి ధృతి గరపి యతని యమాత్యుం డారాజ్యంబున నూరక యనేకాగ్రహారంబుల ననుభవించుచు సంవత్సరంబున కొకసారియైన దర్శనం బియ్యని సిద్ధాంతులఁ బెక్కండ్ర పట్టాలతోడ రప్పించి సాదరపూర్వకముగా నిట్లనియె.

దైవజ్ఞులారా! మీదైవజ్ఞత్వంబు సార్దకమునొంద నేఁడు మీవలన మనరాజుగారి కొకప్రయోజనంబు దీర్పవలసివచ్చినది. దైవజ్ఞులన దైవమును గుర్తెఱిఁగినవారుగదా! గతాగతకాలముల జరుగు విషయములు మీకు గరతలామలకములై యుండును. మీ గ్రంథములకుఁ గోచరములుకాని సంగతు లుండవు. కావునఁ బురాతనగ్రంథములఁ బరిశీలించి రాజుగారి జాతకఫలమున కనుగుణ్యముగాఁ గాలరీతి గనిపెట్టి సంతానంబు గలుగు మార్గంబొండు వక్కాణింపుఁడు. చెప్పలే మంటిరేని తక్షణమే మీ యగ్రహారములకుఁ గల పట్టాలతోఁ గూడ నాస్తులను విడిచి యన్యదేశముల కఱుగవలసివచ్చును. మీ గ్రంథంబుల నట్టి సాంప్రదాయతమైన యర్థము దొరకక మాన. దిదియ ముమ్మాటికి నాజ్ఞయని బుద్ధిమంతుఁడైన యామంత్రి సెప్పినమాట లాలకించి యా సిద్ధాంతులు చింతాకులస్వాంతులై కొండొకవడికి నుదుట గదుర నప్పని కారుమాసములు మితి గోరిరి. మంత్రియు నట్టి మితి నిచ్చి వారి నిజనివాసంబుల కనిపెను. పిమ్మట నాజ్యోతిష్కు లిండ్ల కఱిగిన వెనుక నందరు నేకముఖముగా నిద్రాహారంబులు మాని తమరితవర కెన్నఁడును విప్పిజూడని పురాతనపుజ్యోతిషగ్రంథంబు లన్నియు నొక్కయక్షరం బేనియు విడువకుండఁ పరిశీలింప దొడంగిరి.

ఇట్లారుమాసములు రాత్రింబగళ్ళు తదేకదృష్టిగాఁ బరిశీలించుచుండ నొక్కనాఁ డొక్కగ్రంథంబున రాజుగారి పూర్వపుణ్యముననో సిద్ధాంతుల యదృష్టంబుననో సంతానజననసూచకమైన విషయమందుఁ జూడనయ్యె. తత్సంవత్సరమాఘబహుళచతుర్దశీభానువారమునాఁటిరాత్రి తులాలగ్నమున రెండుగడియలు భుక్తియైన తరువాత నా గ్రామమున కుత్తరదిశను క్రోశద్వయపరిమాణముగల దూరములో నల్పప్రమాణ మెత్తుగల యంతరిక్షమున నక్షత్ర మొండుపడునని సిద్ధాంతమూలముగాఁ దేలినది. దానిని బుద్ధిమంతులైనసిద్ధాంతులు పుత్రోత్పత్తికిఁ గారణమగునట్లు మార్చిరి. చిరకాలము స్వర్గంబున బుణ్యసుఖం బనుభవించిన జనులు పుణ్యంబు క్షీణమైన వెనుక మర్త్యలోకంబున నక్షత్రరూపంబుగాఁ బడి పుడమి నధికులై జనింతురను శాస్త్రప్రసిద్ధి బట్టి యానక్షత్ర మొకకలశోదకంబునం బట్టి యజ్జలంబులం గ్రోలిరేని పుత్రోత్పత్తి యగునని నిశ్చయించిరి.

గణితాగతమైన యా విషయము బలుమారు శోధించి చూచి స్థిరపరచిన వెనుక వా రత్యంతసంతోషంబుతో రాజునగరి కరిగి మంత్రి కావృత్తాంత మెఱింగించిన నయ్యమాత్యశేఖరుఁడును వారి బుద్ధికుసలతకు మెచ్చుకొని తద్విధానమునఁ దప్పక సంతానము గలుగునని నిశ్చయించి యంతయెత్తున నొకమంచె గట్టించి దాని నెక్కుటకు వీలగురీతిని సోపానంబు లేర్పరచి సిద్ధాంతులు చెప్పిన మహాశివరాత్రినాఁటిరేయి యందఱు నక్కడి కఱిగి యొక్కవృద్ధబ్రాహ్మణు నుపవాసంబుతో దాని నెక్కించి పవిత్రోదకంబులచే నిండింపఁబడిన బంగారుకలశ మొకటి యతనిచేతి కిచ్చి రాజును మంత్రియు సామంతులు బౌరులు మరియు ననేకగ్రామములనుండి యవ్వింత జూడవచ్చిన ప్రజలును నారాత్రి నక్షత్రపతన దర్శనలాలసులై కనురెప్ప వేయక చూచుచుండిరి.

ఇట్లుండునంత సిద్ధాంతులు చెప్పిన మితి యొక్కింతేనియు నతిక్రమింపకయే యమ్ముహూర్తంబునఁ దళక్కురనుకాంతితో దృష్టులకు మిఱిమిట్లు గొలుపుచు నక్షత్ర మొండు చంద్రోదయమైన తెరంగున దెసలనెల్ల తేజఃపుంజంబుల వెదజిమ్ముచు విప్రహస్తకలశోదకంబునం ప్రజ్వలించుటయు నవ్వింత కత్యద్భుతస్వాంతులై లోకు లెల్ల హల్లకల్లోలముగా రొదజేయుచు గొందఱు సిద్ధాంతులను మరిగొందరు తద్గ్రంథంబును నభినుతించిరి. అవ్వరనాథుండు మంత్రి యనుమతి నా క్షితిసురుల కనేకాగ్రహారము లిచ్చుటయేగాక వారి తమయాశ్రితపండితమండలములలో ముఖ్యులుగా నెన్నుకొనుచుండెను. పిమ్మట నక్కలశోదకంబు శుభముహూర్తంబున మంత్రిబోధచే నారాజు గ్రోలి తనకుఁగల యిద్దరిభార్యలలో చిన్నభార్యయందు ప్రీతి పెద్దగావున నాఁటిరాత్రి నాపడతిం బడకకు రమ్మని యజ్ఞాపించెను. అత్తరుణియుఁ బ్రసూతివలన యౌవనంబులకు లోపంబగునని రతిక్రీడాసుఖము బరిపూర్ణముగా ననుభవింపని దగుటచే నా రాత్రి దాను బోక తన కత్యంతాప్తురాలగు దాది నొకదానిఁ దననగలచే నలంకరించి శయ్యాగృహంబున కనిపినది. స్త్రీలకుఁ గామమును మించిన యభిలాషలేదు.

అదియు రాజుభార్యవలె నభినయించుచు మంచముకడ నిలువంబడుటయు నా రాజేంద్రుడు తజ్జలంబులఁ గ్రోలినది మొదలు మేనెఱుంగక కై పెక్కి మదోన్మత్తుండై యున్నకతంబున దానిం దనభార్యయే యనుకొని రతిక్రీడలం దేర్చెను. పిమ్మట గొండొకవడికి నొడలు దెలిసికొని నిదానించి చూచి నీచకాంతగా నెఱింగి కోపంబును శోకంబును సంభ్రమంబును మనంబున నొక్కసారి యంకురింప దానివలన దద్వృత్తాంతం బంతయు నెఱింగి కరవాలంబున దాని శిరంబు నెగవ్రేయబోయి యంతలో విమర్శించి యప్పుడ మంత్రిం దీసికొని రమ్మని నాపునొకని నంపెను. "బుద్ధిఃకర్మానుసారణి" యను వాక్యంబు దప్పుదుగదా !

విను మారీతి దాసీకేశంబు లొకచేతను గత్తి నొకచేతను బట్టికొని యట్లే నిలువంబడియుండ బుద్ధిమంతుడగు నమ్మంత్రియు నట్టివార్త విని యెట్టి యుపద్రవమైనపని జరిగెనో యని వెరపుజెందుచు నతిరయంబున నర్ధరాత్రంబున నొంటిగా రాజు నగరి కరిగి యందేకాంతగృహంబు సొచ్చి రాజును దాదియు నున్నరీతికి భీతిజెందిన డెందంబుతో నిట్లనియె.

ఓహో దేవా! యుడుగు యడుగుము. ఇంత సాహసం బాచరింపఁ బూనితి వేమి ? ఈచుతి నీయతివగాదా? యేమి తప్పు చేసినది యెఱింగింపుమని యతని కరముననున్న కరవాలము లాగికొనుటయు నారాజు మంత్రి కావృత్తాంత మామూలచూడంబుగా వక్కాణించి దీనిం జంపెద నీయభిప్రాయ మేమని యడిగిన నాప్రధాని యిట్లనియె.

అయ్యా! దీనిం జంపిన లాభమేమి? ఈ నేరం బిది యాచరించినది కాదు. తన యేలికసాని చెప్పినట్లు నడుచుకొనుట దాదుల కుచితధర్మము గదా! రాణియ బాల్యచాపల్యంబున నట్లు నడిపించినది. గానిండు గతమునకు వగవం బనిలేదు. మన మధికప్రయత్నమునఁ బడసినప్రయోజనం బూరక చెడఁగొట్టుకొనుట లెస్సగాదు. దైవసంకల్ప మీరీతి నుండ దాని మార్ప నెవ్వరితరంబు. పుత్రులలో నౌరసుఁడును క్షేత్రజ్ఞుఁడును ముఖ్యులు. దీనికి జనించినవాఁడు నీకౌరసుం డనంబరగు. వాఁ డందరకన్న నుత్తముఁ డని శాస్త్రములు ఘోషించుచున్నది. దీనికి తప్పక మంచికుమారుం డుదయించును. ఈరహస్యం బెవ్వరికి నెరిగింపరాదు. దీనిం గళత్రముగా నంగీకరించి యంతఃపురంబున నుండ నియమింపుఁ డని మంత్రి యనేకనీతివాక్యంబులు సెప్పి యెట్టకేలకు నాపట్టపురాజు నొడంబరచెను. పిమ్మట నారాజును దానిం భార్యగా గ్రహించి యంతఃపురంబున గోప్యంబుగా నుండ నియమించెను.

మంత్రియు నట్లు ఱేని సమాధానపరచి మఱల నింటికరుగు నప్పటికిఁ దెల్లవారుచుండెను. వీధుల నక్కడక్కడ గుంపులుగా నిలిచి జనులు మంత్రిం జూచి యెద్దియో గుజగుజలాడికొనిరి. మంత్రియు వ్యాకులచిత్తుడై యున్న కతంబునఁ బరిశీలింపకయే యింటి కఱిగెను.

అ ట్లింటి కేగినంత నమ్మంత్రిభార్యయు నెదురువచ్చి ప్రాణేశా! నగరి విశేషము లేమి? ఇంత యర్ధరాత్రంబున రా జేల మీకు వర్తమానము సేసె నెఱింగింపు డనిన నతం డది యొకరాజకార్యపు తొందరయని మరపించి చెప్పుటయు దాని నామె నవ్వి నాథా! మీరు నాకుఁ జెప్పక దాచినను గొంచెము దెలిసినది లెండి యని పరిహాస మాడుటయు నతండు తొందరపడి నీవు విన్న విషయ మెయ్యది వివరింపు మనుటయు నాకాంత నిట్లనియె.

మహారాజుగారు నక్షత్రయుక్తమగు కలశోదకంబు గ్రోలి మదోన్మత్తులై యున్నకతంబున పడకకు నియమింపబడిన రెండవభార్య ప్రసూతివలన యౌవనమునకు భంగము కలుగునని తనదాది నలంకరించి పంపెననియు నతం డెఱుంగక రమించినపిమ్మట నిజంబు దెలిసి దానిఁ జంపబోయి యంతలో మీయనుమతి బడసి చేయుటకు మీకు వర్తమానము పంపెననియు మీరు దానిం జంపవలదు దానికి జనించిన పుత్రుఁడే రాజ్యంబున కర్హు డగునని రాజును సమాధానపరచి దాని నంతఃపురంబున కనిపిరనియు వీధుల జను లనుకొనగా విని వచ్చి మనదాది నాకు చెప్పినది. ఇదియే నేను వినినవార్త నిజమో యసత్యయో మీమనంబునకే తెలియగలదు. అనుటయు నాప్రగ్గడ తెల్లబోయి యౌరా? లోకం బీపాటిది గాఁబోలు. నాకన్న ముందరనే యీవార్త యూరం బడినది. ఇంకేటి రహస్యంబు. చాలుచాలునని పశ్చాత్తాప చిత్తుండయ్యు నారహస్యము రాజున కెఱింగింపఁడయ్యెను. ఇట్లుండునంత నన్నెలంతయు నంతర్వతియై పదియవమాసంబున మన్మథునిం బోలు చక్కనిముద్దులబాలుం గనినది. గోపా! యతండే యష్టదిగ్గజములను బిరుదులు వడసిన మహాకవులచే ననేకకృతు లందిన కృష్ణదేవరాయభూపాలుండు, అని యెఱింగించిన సంతసించు నాఱేనితో మఱియు నా బ్రాహ్మణుండును దేవా! తమకు నట్లే బ్రాహ్మణప్రసాదంబునఁ బుత్రుం డుదయించునని చెప్పెను.

పిమ్మట నర్యవర్యుండును (షరాబు) బ్రాహ్మణుఁడు చెప్పిన చొప్పున పుత్రో త్పత్తికి హేతువులు వ్రతదానహోమతర్పణాదులే యగునని తత్ప్రయత్న మాచరించుటకు మిగుల నతని తొందర పుట్టెను.

ఇట్లు వారు మువ్వురు తమకుఁ దోచినవిషయంబులు చెప్పి యూరకున్నంత కళాదుఁడు లేచి అయ్యా! రాజేంద్రా! పుత్రోత్పత్తికి వీరు చెప్పినవన్నియు దైవికములు. కలిగినం గలుగవచ్చును. మానినను మానవచ్చును. దీనికి నే నొండుపాయము మానుషంబైన దానిని వక్కాణింతు వినుఁడు. వైద్యగ్రంథంబులు లెన్నియేని బరిశీలించినాఁడ. వానిలో శరీరశాస్త్రమను గ్రంథంబున దీనివివరము వ్రాయఁబడియున్నది. అది చూచినవారు సంతానము దైవికమని యెంతమాత్రము నమ్మజాలరు. అపుత్రత దంపతులరోగమువలన గలుగుచున్నది. దాని నోషదిసేవచే మాన్పవచ్చును. అట్టి గ్రంథంబు పరిశీలించి, తచ్చికిత్సం జేసినచోఁ దప్పక సంతానము గలుగునని పలికిన నతనిమాటలను లౌకికమున కనుకూలముగా నున్నవని పాటించిరి.

అట్లు వారైదుగురు నుప్పరిగెయందు వెన్నెలలో బల్లచుట్టు పీఠములు వైచుకొని వలయాకారముగాఁ గూర్చుండి సంతానవిషయమైన మాటలాడు కొనుచుండ గోపా! వారి పూర్వపుణ్యమెట్టిదో అంతరిక్షము నుండి యొకమామిడిపం డాబల్లమీదఁ బడినది. విభ్రాంతులై వారట్టె లేచి యాగసంబుదెస జూచిరి. అందు ననతిదూరమున నొకగరుడపక్షి వలయముగా దిరుగుచున్నట్లు కాన్పించినది. అప్పుడు చర్మమునం దప్పక్కి ముక్కుకొనగీటులు నాటియుండుట దిలకించి, వారాపక్షి యాపం డెక్కడనుండియో తీసికొనిపోవుచుండ ముక్కుజారిపడినదని నిశ్చయించిరి.

అప్పుడు బుద్ధిమంతుడగు మంత్రి లేచి పురోహితునితో నీఫలవృత్తాంత మెట్టిదో ప్రశ్నరూపముగా వక్కాణింపు మనుటయు నా సిద్ధాంతి యప్పటిలగ్నమునుబట్టి చూడ నది సంతానజననహేతుభూతమగు ఫలమని తెలియఁబడినది. దానికి వారాశ్చర్యపడి దైవానుకూలమునకు మెచ్చుకొనుచు నప్ఫలం బప్పుడ విడదీసి రాజు టెంకను మంత్రి చర్మమును, బ్రాహ్మణుడు వర్తకుడు రంపాలియు రసఖండమిళితములైన ముక్కలను దీసికొనిపోయి భార్యల కిచ్చి యారాత్రి కళత్రములతో రతిక్రీడావిశేషముల నానందించిరి.

పిమ్మట నుదయమున వారి హృదయములకు గొమరు లుదయించు శుభసూచకములు పెక్కులు దోచిన సంతసించుచుండ వారి భార్యలును గర్భచిహ్నంబులుం దాలిచి పదియవమాసంబున నొకశుభలగ్నంబున నైదుగురు పుత్రులం గాంచిరని వచియించిన మణిసిద్ధునితో గోపాలుం డిట్లనియె. అయ్యా! ఆ మామిడిపండు దినినంతనే వారి భార్యలు గర్భవతులై పుత్రులం గాంచుటచే దానియం దెద్దియో విశేష ముండకపోదు. దానివృత్తాంత మరయ నామన మత్యాతురపడుచున్నయది. వివరింపు డని వేడుకొనుటయు సంతసించుచు వాని కాయతిశ్రేష్టుం డిట్లని చెప్పదొడంగె.

మామిడిపండు కథ

కర్ణాటకదేశంబున శుద్ధమతియను బ్రాహ్మణుఁడు గలఁ. డతనికి బాల్యముననే తల్లితండ్రులు పరలోకగతులగుటచే దేశంబున రక్షించువారు లేమింజేసి స్వదేశమువిడిచి కాశీనగరంబున కరిగెను.

అట్లు కాశిని జేరి తనకు విద్యయం దభిలాషలేకున్నను విద్యార్ధులకుమాత్ర మందు భోజనసదుపాయ మెక్కుడుగాఁ జేయబడుచున్నది గావున మొదట నతఁడు భుక్తికొరకు విద్యార్థికోటిలోఁ జేరెను. వాని పూర్వపుణ్య మెట్టిదో క్రమంబున నతని కందరకన్న విద్యయు సులభముగా రాఁదొడఁగినది. సాధారణముగా విద్యార్థులు పెండ్లియైనతోడనే కాశికిఁ బోవుటయు భార్య యెదుగువరకు నేదో యొకశాస్త్రమందు పాండిత్యము కుదర్చుకొని దానినే సంతుష్టివడసి యింటికి వచ్చుచుందురు. శుద్దమతి కింటియొద్ద నట్టి యాప్తులుగాని భార్యగాని లేకపోవుటచే స్వదేశమున కరుగట కవసరము లేమింజేసి నలువదియేండ్లు వచ్చువరకుఁ జదివెను కావున నత డనేకవిద్యలయందుఁ బ్రవీణుఁ డయ్యెను. అతనికి మొదటినుండి ఛాందసము మెండుగానున్నది. విద్యాగ్రహణమందు మాత్ర మట్టిది గాన్పించకున్నది. నలువదియేండ్లు కాశిలో విద్యాబ్యాసము సేసినవాఁ రరుదు గావునఁ గాశిలో నెట్టి పండితునికి విద్యార్థియను నామమే కాని యుపాధ్యాయ నామము వచ్చుట లేదు. శుద్ధమతికి మాత్ర మచ్చటఁగూడ నట్టి ప్రఖ్యాతి వచ్చినది . కాశిలోనున్న పండితులలో ముఖ్యుఁడని పేరువచ్చిన వెనుక నతనికి స్వదేశగమనము నం దభిలాష జనించినది. స్వర్గమం దున్నను జన్మభూమి సౌఖ్యము రాదుగదా! అట్టి యుత్సాహము గలిగినతోడనే యా పండితుండు గొందఱు విద్యార్ధుల వెంటబెట్టుకొని స్వదేశమున కరిగి యందు దాను జనించిన గ్రామమునకు వెళ్ళెను. అందుఁ దన్ను గుర్తెఱిఁగినవారు లేకున్నను తన ఖ్యాతిని వినుచున్నవారు పేరుజెప్పినతోడనే మిక్కిలి గౌరవము జేసి యొక యింటం బ్రవేశపెట్టి కొన్నాళ్ళదనుక భోజనభాజనములకుఁ దగిన సదుపాయము చేయుచుండిరి. మఱియుం గాశినుండి గొప్పపండితుండు వచ్చెనను వార్త విని యనేకగ్రామములనుండి పెక్కండ్రు విద్యార్థులు ఆయనకడకువచ్చి శాస్త్రములఁ జదువఁదొడఁగిరి. అతనికి ఛాందసము చాలఁ గలిగియున్నను బోధనశక్తియు శాంతతయుఁగూడ నధికముగా నుండుటంబట్టి యక్కడకువచ్చిన విద్యార్థి మరియొకచోటి కరుగుటకు సమ్మతింపఁడు. అతనికి గలిగియున్న ఛాందస మంతయు లౌకికవిషయమే కాని విద్యావిషయములోఁ గాన్పించదు.

ఇట్లు శుద్ధమతి యధికవిఖ్యాతి నొప్పుచున్నవార్త విని సమీపగ్రామవాసియగు శ్రోత్రియబ్రాహ్మణుం డొకం డాయనతో బంధుత్వము గలిసినఁ జాలుననుకొని పెద్ద వాఁడని యెంచక పదియేఁడు ప్రాయము గల చక్కని తనకూఁతు నాయన కిచ్చి వివాహము గావించెను. వివాహమైన నాలుగేండ్ల కత్తరుణి కాపురమునకు వచ్చినది. అత్తవారింట విద్యార్ధులే గాని యాఁడుతోడులేమింజేసి యా యింతి కొన్నాళ్ళదనుక లజ్జవతిగ నుండి పిదప బ్రౌఢగా సంచరింపం దొడంగినది. మిక్కిలి గుణవంతురాలగు నా చిన్నది విద్యార్థులనెల్ల పుత్రులుగా భావించుకొనుచు వారితోఁ గడుఁచనువుగా మాట్లాడుచుండును. అట్టి స్థితిని జూచి యావృద్ధబ్రాహ్మణుఁ డామె విషయమై యనుమానము జెంది యొకనాఁ డిట్లని తలంచె. ఓహూ! స్త్రీలు దుష్టమతులని యెరింగియుండియు దీనిని విద్యార్ధులతో నింతచనువుగా మాట్లాడనిచ్చిన నాకంటె మూఢుఁడు గలడే. "బలవానింద్రియ గ్రామో విద్వాంసమపికర్షతి" యను శాస్త్రబోధ నెన్నటికేనియు మరువఁబోలునే. ఎంతదృడమైన స్త్రీలమనస్సులును పురుషులు సమీపించినతోడనే చలింపక మానవు. అట్టి స్త్రీలచరిత్రల పెక్కుజ్ఞాపకము దెచ్చికొని విద్యార్థులకును భార్యకును సంబంధము కలిగియున్నదని ధ్రువపరచి యామె నవ్వినను మాట్లాడినను చూచినను విద్యార్థుల నిమిత్తమేయనియు నదియు నొకవిధమైన సాంకేతికమే యనియుఁ దలంచుచు విద్యార్థులకు బాఠము జెప్పుట మాని సర్వకాలసర్వావస్థలయందు నామెను విడువక తిరుగుచుండును.

వీధుల నెవ్వరేని మాట్లాడుకొనినను నవ్వుకొనినను నేకాంతముఁ జెప్పకొన్నను తన భార్య జారత్వవిషయమే యనియుఁ దనకు మిగుల నపకీర్తి వచ్చినదనియు భావించి యధికచింతాకులస్వాంతుఁడై యొకనాఁ డయ్యో దైవమా! నే ననేకవిద్యలం జదివి మిగులఖ్యాతి జెంది కాశి నుండక యిచ్చటి కేల వచ్చితిని? వచ్చియు విచ్చలవిడి సంచరింపక గుదిబండం దగులుచుకొన్న ట్లేలఁ బెండ్లియాడితిని. పెండ్లియాడినను నిట్టి దుర్మార్గురాలు దొరకవలెనా కటాకటా! నా ఖ్యాతి యంతయు నొకకాంతమూలముగా నశించుచున్నది. నే నేమి చేయుదును. స్త్రీమూలముగా నెంతవానికి నపఖ్యాతి రాక మానదు. బృహస్పతి యంత వానికిఁ గళంకము దెచ్చిపెట్టిన స్త్రీజాతిని నమ్మినఁ జెడకుందురా? ఛీ! ఛీ! ఇట్టియపకీర్తి మోచికొని యుండుటకంటె మరణమే మేలుగదా. అయ్యో! యెన్నినాళ్లో శ్రమపడి చదివిన చదువంతయు గంగపాలుగాఁగ నూరక చావవలసివచ్చెనే యని పలుదెరంగుల విచారించి భార్య జారిణియైన తరిఁ జేయఁదగిన కృత్యములు వ్రాసియున్న నీతిశాస్త్ర మొకండు చెప్పిచూచిన నందిట్లు వ్రాయబడి యున్నది.

శ్లో. "కులటా యది జాయచేన్మానమేవ ప్రజేతుధిః
    దేశాంతరంవా గంతవ్యం మరణం బాసి లోచతే
    ఏతత్త్రభిః ప్రకార్తెస్తు నాపఖ్యాతిభయం భవేత్"

అనఁగా దనభార్య జారిణియైనచో నెరిఁగియు నెరుగనట్లూరకుండుటయే మొదటిపక్ష మనియు, నట్లూరకుండలేనివాఁడు దేశాంతర మరుగవలయు నది రెండవపక్ష మనియు, దానికి సమ్మతింపనివానికి మరణమే మేలనియు నీ మూఁడుప్రకారములచేతను అపఖ్యాతి భయము నొందనేరఁడనియు నర్థము. అట్టి శ్లోకము పలుమారు శోధించి యాద్యంతములకు సమ్మతింపక దేశాంతర మరుగుటయే నీతి యనియు "దేశాంతరం వా గంతవ్యం" అనుచోట భార్యతోడనా యొంటరిగానా యను విషయముఁగొంతచర్చించి భార్యతో నఱిగినచో నచ్చటసైత మీ దుర్మార్గురాండ్ర మూలముగా నపఖ్యాతి వ్యాపింపగలదు. కావున నొంటరిగానే యని నిశ్చయించి యొక్కనాఁ డర్ధరాత్రంబున నొరు లెరుంగఁకుండ దర్భాసనమును గొన్నిపుస్తకములు దేవతార్చనసంచియు మూటగట్టుకొని గుట్టుగా నిల్లువెడలి యడవిమార్గంబున బడిపోవుచుండెను.

మఱియు గురుని మత మదివరకే దెలిసికొనిన విద్యార్థులు నలువురు మాత్ర మాయనతోఁ ప్రయాణమై పోవలయునని యెంచి మూటలు గట్టికొని కాచియుండిరి. నిద్రావశంవదులగుటచే నెఱుఁగక యాయనతోడ నరుగలేకపోయిరి. మాయావధిలో మెలకువ వచ్చుటచే నాయనజాడబట్టి యిల్లువెడలి యాయన పోయినమార్గముననే వీరును నడువసాగిరి. విద్యార్థులును నించుమించుగా చాందసంబున గురునితో సమానులే. శిష్యులు మిగుల బలముగలవారగుట వడివడి నడిచి తెల్లవారునంతలో గురువుగారిం గలిసికొనిరి. ఆయన తనవెంట వచ్చు విద్యార్ధులం గాంచి వారు తన్నింటికిఁ బిలిచికొనిపోవుటకునై వచ్చుచున్నారని యెంచి వారి కగబడనట్లు మిగులవేగముగా నడువసాగెను. కాని యంతలో వారు గలిసికొనుటచే నతని ప్రయత్నము గొనసాగినది కాదు. పిమ్మట శిష్యులనుజూచి యతఁడు మీరేల నావెంట వచ్చుచుండిరని యడిగిన వారు అయ్యా! మాకింకను విద్య పూర్తికాలేదు. తమవంటి యుపాధ్యాయులు దొరకుట దుర్లభము. విద్యాగ్రహణలాలసులమై తమవెంట వచ్చుచుంటి మిదియ మా యభిలాష యని చెప్పిన నితండు ఔనౌను! మీరు నాతో వచ్చెడు కారణము నేనెఱుంగుదు. నాభార్య జారిణియని ప్రకటించి నాయపఖ్యాతి వెల్లడిఁ జేయబూనితి గాబోలు! మీరు నాతో రావలదు. మీయుష్టమువచ్చినచోటున కరుగుడు. నే నిక్కడనుండి కదలనని నేలం జతికిలఁబడియెను. వా రామాట కాశ్చర్యపడి చెవులు మూసికొని శివశివా ! మే మాసంగతియే యెఱుఁగమే! మాకు విద్యాసక్తియేగాని వేరుగొడవలేదు. మీ రేమిటికి దేశాంతర మరుగుచుంటిరో మాకుఁ తెలియదు. మా కామె తల్లిగాదా? యామె విషయమై మే మనఁగలమా? మీపాదము లాన మేము చదువుటకుఁదప్ప మరియొకపనికి మీతో వచ్చుటలేదు. మమ్ముఁ గొనిపొండని యాతని పాదములం బడి లేవకుండుటయు దాని కతఁ డెన్నివిధములనో ప్రతికూలవాక్యములను జెప్పెనుగాని వారి ప్రార్థనచే సమ్మతింపక తీరినదికాదు. గురువుగారు అనుమతించిన పిమ్మట శిష్యులు వారి దర్భాసనమును దేవతార్చనసంచియుఁ దోవతులమూటయుఁ వారు గైకొని యాయనవెనుక నడువసాగిరి. అ ట్లాఛాందసు లేవురు నడిచి నడిచి జాముప్రొద్దెక్కు సరి కొకబట్టణముఁ జేరిరి. ఆ పురిలో నొకబ్రాహ్మణవీథిం బోవుచు గమనాయాసము వాయ విశ్రమింపఁదలంచి యిరుగెలంకుల నరుగులున్నను వానిమీఁద వసింపక వీథిలోనే మూటలు దింపి కూర్చుండి మార్గాయాసము వాయ దోవతిచరఁగుల విసరికొనుచుండిరి.

అట్టి సమయమున నాప్రాంతమందలి యొకగృహస్థుని భార్య మంచినీరు దెచ్చుటకై బావికరుగుచు మార్గమునఁ గూర్చుండియున్న యా చాందసులం గాంచి, అయ్యా! మీరెవ్వరని యడిగినది. ఆ మాట విని వారు అమ్మా మేము పరదేశుల మనిరి. ఆమెయు మీరు పరదేశులు కారని నుడివి కలశము గొని బావి కరిగినది. ఆమె మఱల వచ్చునప్పటికి వారొండొరు లాలోచించుకొని అమ్మా! మేము పరదేశులము కానిచో మార్గస్థులమైనఁ గామా యనిరి. అప్పుడు ఆమె మీరు మార్గస్థులును గారని నుడివి యింటికేగినది. ఆమె క్రమ్మర వచ్చులోపల వీ రాలోచించుకొని తల్లీ! మేము మార్గస్తులమును గానిచో బాటసారులమని చెప్పుచున్నార మనిరి. అప్పుడును కారని చెప్పి యా చిన్నది బావి కరిగినది. వారపు డోహో యిది చిత్రము. ఈ గ్రామంబున నాఁడువాండ్రకు సైతము పాండిత్యము కలదు గాఁబోలు. మన మన్న పదముల కర్థము వేరుకలదా యేమి? అనేకశాస్త్రములు చదివితిమిగాని మనమెవ్వరమో తెలియకున్నదే! ఈసారి యేమని చెప్పుదము. ఎట్టి పేరు నుడివినను నీ కాంత సమ్మతింపదే యని యాందోళితమానసులై చింతించుచుండ నయ్యండజయానయుఁ దన కలశమెత్తుకొని యాదండ నిలువంబడిన వా రేమియుం బలుకనేరక అమ్మా! మేము శుద్థవెఱ్ఱిమూఢుల మనిరి. ఆమాట కామె లోన నవ్వుకొని వెఱ్ఱిమూఢులు గారని పలికి యింటి కరిగెను. పిమ్మట వా రత్యంతవిషాదదోదూయమానమానసులై యోహో మన మన్యదేశ మరుగుచుంటిమి. పెక్కండ్రు పండితులతో సంభాషింపవలసి వచ్చును. మన మెవ్వరమో తెలిసికొని యేగుట మంచిది. అని నిశ్చయించి యామె మరల వచ్చునేమో యని యట్టె కూర్చుండిరి. ఆమెయు నీళ్ళు తెచ్చుట చాలించి చేద దీసికొని వచ్చుటకు మరల వీథికి రాగానే యీ బ్రాహ్మణులు తటాలునలేచి యామెకు వందనము జేయఁబోయి యామెచే వారింపంబడి అమ్మా! నీవు మహావిద్వాంసురాలవుగాఁ దోచుచున్నావు. మే మనేకశాస్త్రములు చదివితిమిగాని మే మెవ్వరమో మాకుం దెలిసినది కాదు.

నాలుగువిధముల పేరులు సెప్పినను కాదంటివి. మాయం దనుగ్రహముంచి మే మెవ్వరమో? యేమనవలయునో? యెఱింగించిన విని సంతసించి యరుగుచున్న వారమని మిగులఁ బ్రతిమాలుకొనుటయు నవ్వనిత తనలో మఱియు మిగుల నవ్వుకొని అయ్యా! ఇప్పుడు చాల ప్రొద్దెక్కినది. మాయింటికి వచ్చి వంటఁ జేసుకొని భుజింపుఁడు. భోజనమైన పిమ్మట నంతయుం జెప్పెదననుటయు నామె మాటకు వారు మిగుల నాకలిగొనియున్నవారు గావున సంతసించి యామెతోగూడ వారి యింటి కరిగి, ఆ సతీమణియు వారి కొకగది చూపి అందు వంటసామగ్రి నంతయు నమర్చి పెరటియందున్న నూతియందు స్నానము జేసి వేగిరముగా వంటఁ జేసికొని భోజనము సేయుఁడు. నా మగఁడు మిగుల ననుమానము గలవాఁడును ధూర్తుండు నగుటచే నాయన వచ్చినచో మిమ్మును నన్నునుగూడ దండించును. ఆయన నిత్యమును రెండుయామములదనుక రాజుగారియొద్ద పురాణముచెప్పి పండ్రెండుగంటలు కొట్టినతోడనే యింటికి వచ్చుచుండును. ఇపుడు పదిగంటల ప్రొద్దెక్కినది. త్వరగా వంటఁ జేసుకొనుఁడని తొందరపెట్టుటయు వారు నామె చెప్పిన చొప్పున నూతియొద్ద స్నానము జేసి యా గదిలో వంటఁ జేసికొనుచు స్తోత్రపాఠములఁ బఠించుచు భగవద్గీతల బారాయణము చేయుచు నతివేగముగా ముగింపవలయునని తలంచిరి. కాని దేవతార్చన చేయుచుండగనే పండ్రెండు గంటలు కొట్టిరి. అంతలో యజమానుడు వచ్చి తన వాడుక ప్రకారము నాలుగుగదులు వెదికిచూడఁగా నొకగదిలో నీబ్రాహ్మణు లుండుటఁ జూచి తల కంపించుచు వేగముగా నాయింటికి దాళము వైచి భార్యయున్న యింటికిని బీగము బిగించి వాకిళ్ళన్నియు మూసి వీథితలుపునకు లక్కశీలుతో ముద్రవైచి యతిజవంబున రాజనగరికిఁ బోయెను.

గోపా! వినుము. ఆ బ్రాహ్మణునికి భార్య విషయమై మిగుల ననుమానము గలిగి యొకప్పుడు రాజుగారితో అయ్యా! తమరు పెక్కు నేరములకు శిక్షలు విధించుచుంటిరి గాని జారత్వదోషమునకుఁ గూడఁ నేల విధింపరని యడిగిన నతం డట్టి దోష మెక్కడనున్నదో వక్కాణించిన దండింతుననియె. దానికా బ్రాహ్మణుడు సిగ్గువిడిచి యెక్కడనో యని చెప్పనేల నీ దుర్మార్గపుకృత్యము మా యింటనే జరుగుచున్నది. నేను తమయొద్దకుఁ బురాణము సెప్పుటకు వచ్చిన పిమ్మట నిత్యమును నా భార్య విటులతో నింటికడ స్వేచ్ఛగా సంచరించుచున్నదని చెప్పెను. అవ్విషయము రాజు పెక్కండ్ర నడిగి యామె మహాపతివ్రతగాఁ దెలిసికొని పురోహితునితో నార్యా! మీరు అసత్యమాడితిరి. మీ భార్య కడునిల్లాలఁట. మీ రిట్లంటి రేమని యడిగిన నతం డయ్యా! తమ రడిగిననవారలు దాని విటులే. ఈ సంగతి తమకుఁ బాగా దెలిసినచో నమ్మకపోదురే! యనుటయు నా నృపతి యటులేని మీ భార్య విటులతోఁ గూడి యున్నప్పుడు వచ్చి నాకుఁ జెప్పుదు . నేను వచ్చి యట్టి కృత్యము జరిగించుచున్నదని తోచినచో వారినెల్లఁ దప్పక దండింతునని ప్రతిజ్ఞ చేసి యుండెను. కావున నట్టి విటులు నేఁటికిఁ జిక్కిరనియు వారినందఱ రాజుగారికిఁ జూపించు తలంపుతో నా పౌరాణికుండు మహావేగముగాఁ జెమ్మటలు గ్రమ్మఁ బరుగెత్తుకొని పోయెను.

ఆ జనపతియుఁ బరిషేచనము చేయఁబోయి యంతలోఁ బౌరాణికుండు వచ్చెనను వార్తవిని వాకిటకు వచ్చి యతని యాయాసము జూచి యచ్చెరువందుచు నార్యవర్యా! భుజింపకయే యింతలో వచ్చితిరేల? తొందరపని యేమి గలదని యడిగిన నతండు నిట్టూర్పులు నిగుడించుచు నిట్లనియె.

దేవా! దేవరవారు వెనుక ప్రతిజ్ఞ చేసిన సంగతి జ్ఞాపకము చేసికొనవలసిన యవసరము వచ్చినది. నే నింటికి వెళ్ళునప్పటికి నాభార్య యేవురు విటులతో నింటికడ స్వేచ్ఛగా విహరించుచున్నది. కన్నులారఁ జూచితిని. వెంటనే వచ్చినచో దేవరవారికే విశదము కాఁగలదు. ఇంతకుమున్ను నామాటలు దబ్బరగా ద్రోసివేసితిరి. తాళమువేసి వచ్చితిని. ఆలస్యమైనచో దానికి సహకారులు పెక్కండ్రు గలరు. వారికిఁ దెలిసెనేని ముద్రలు విడఁగొట్టి యింటనున్నవారి సాగనంపఁగలరు. కావున వేగముగ వచ్చి చూడవలయునని మిగుల దీనత్వమునఁ బ్రార్ధించుటయు నా నరపతికిఁ బురోహితుని యందు మిగుల ననుగ్రహము గలదు. కావున నావిషయము పరీక్షించుటకు భోజనము చేయకయే కొంతమంది పెద్దమనుష్యుల వెంటఁబెట్టుకొని యక్కుతపకాలంబున వారింటి కరిగెను. అంతట పురోహితుఁడు బీగముల విడఁదీసెను. అందఱు లోపలకుఁ బోయిరి. భూపతి యా విటు లెక్కడున్నారని యడిగిన నతం డిది యిటురండి. ఈ మూలగదిలో నున్నవారిని యా గదియొద్దకుఁ దీసికొనిపోయి బీగమును గొళ్ళెముదీసి తలుపులు తెరచినంత నా గదిలో నేవురు శ్రోత్రియులు శంకరావతారములవలెఁ దెల్లనివిభూతియు రుద్రాక్షలు నొడలమెరయ దేవతార్చనలు సేయుచు దలుపు మూసినది మొదలు దిగులుపడి దైవమును ధ్యానించుచున్నవారిం గాంచిరి. అప్పుడా యొడయండు మనంబున నద్భుతపడి పురోహితునితో నార్యా! విటులు వీరే కాదా? యని పరిహాసముగా నడిగిన నతండు దేవా! వీరే నే నింట లేనప్పుడు నా యింటిలోఁ బ్రవేశించి పెద్దమనుష్యులవలె నటించు జారపురుషు లనుటయు రాజు వారినందఱ దరికిఁజేరి అయ్యా ! తమరెవరు? ఎక్కడికరుగుచున్నవాఁ రీ యింటి కేల వచ్చితిరి? నిజముఁ జెప్పుడు? చెప్పకున్న దండింతునని యడిగిన నా బ్రాహ్మణులు గడగడ వడఁకఁ దొడంగిరి. శుద్ధమతి యెట్టకేలకుఁ గొంచెము ధైర్యము దెచ్చికొని రాజుగారితో నయ్యా! మీ రెవ్వరని యడిగినందులకు నుత్తరము జెప్పలేము. మే మెవ్వరమో తెలిసికొనుటకై కాదా మే మీ యింటి కరుగుదెంచితిమి. మా వృత్తాంతము వినుండు యదార్ధముగా వక్కాణింతుము.

నాకుఁ జిన్నతనమందే తల్లి దండ్రులు గతించుటచేఁ గాశికరిగి నలువదియేండ్లు పెక్కువిద్యలం జదివితిని. అందుపాధ్యాయపదము వచ్చినతోడనే యట నిలువలేక దేశమునకు వచ్చితిని. వచ్చినతోడనే నా కొకబ్రాహ్మణుఁడు గన్నెనిచ్చెదనని చెప్పిన పూర్వకర్మదోషము వలన సమ్మతించి యక్కన్యం బెండ్లి యాడితి. పెండ్లియైన నాలుగైదేండ్లకే యది కాపురమునకు వచ్చినది. కాని నాకెంతమాత్రము సౌఖ్యము లేక పోయినది. దేవరవారితో నసత్యముఁ జెప్పరాదుగదా! మిగుల యౌవనముగల విద్యార్ధులు నాయొద్దఁ జదువుచుండిరి. అది తరచు వారితో మాటాడుటయు నవ్వుటయుఁ బరిహాసము చేయుటయు జూచుటయు మొదలగు శృంగారచేష్టలు నా మనంబునకుఁ బరితాపము గలుగఁజేసినవి. లోకులు నన్నుఁ జూచి నవ్వసాగిరి. మొదట నా కెంత ఖ్యాతివచ్చినదో భార్యమూలముగా నంత యపఖ్యాతి వచ్చినది. అప్పుడు సహింపలేక యొకనీతిశాస్త్రమునందుఁ జెప్పినచొప్పున నెవ్వరికిఁ దెలియకుండ నిల్లువెడలి దేశాంతర మరుగుటకై నడుచుచుంటిని. ఇంతలో నీ నలువురు నన్నుఁ గలసికొని నే నెన్నివిధముల వలదని చెప్పినను వినక నాతోఁ గూడవచ్చిరి. మే మేగురము నీ దినమున జాముప్రొద్దెక్కినవేళ కీయూరు జేరి యీవీథిలో విశ్రమించియుంటి మింతలో నీయింటి వాల్గంటి నీటి కరుగుచు మీ రెవ్వరని యడిగిన మేము పరదేశులమంటిమి. కారనియె. మఱల మార్గస్థుల మనినను కారని యుత్తరం బిచ్చిన బాటసారులమని చెప్పితిమి. దాని కామె తల ద్రిప్పిన నేమియుం దోఁచక వెఱ్ఱిమూఢులమంటిమి. అప్పుడుగూడ కారని యామె యింటికరిగినది. ఆ మాటలకు మిగులఁ జింతించి యనేకగ్రంథముల జదివితిమి గాని మే మెట్టివారమని చెప్పవలెనో మాకుఁ దెలిసినదికాదు. మా సంగతి నీవే చెప్పవలయునవి యామెను మిగుల బ్రతిమాలితిమి. ఆమెయు భోజనమైన వెనుక జెప్పెదనని మమ్ము నిక్కడకుఁ దీసికొనివచ్చి మాతో మీరు త్వరగా వంటజేసికొని భోజనముఁజేసి పొండు. నా మగఁడు వచ్చెనేని మిమ్మును నన్నుగూడ దండించునని యామె మొదటనే చెప్పినదిగాని మా ఛాందసము వలన వేగిరము తేలినదికాదు. ఇంతలో నాయనయే కాఁబోలు వచ్చి తలుపుమూసి వెళ్ళినవాఁడిదియె మదీయవృత్తాంత మిందింతయైన నసత్యమున్న యెడల దేవరవారు మమ్ము శిక్షింపుఁడని వేడుకొనియెను.

ఓహో! పురోహితునికిఁ బట్టిన పిచ్చి యీతనికిం బట్టినదే. ఇట్టి ఛాందసుల నందఱ నొక్కచోటికిఁ దెచ్చిన దైవమును మెచ్చుకొనవలెను. మేలు మేలు, వీరి భార్యలయందు లేశమైన దోసమున్నట్లు కాన్పింపదు. "వృద్ధస్య తరుణి విషం" అను రీతి వీరికిఁదోచిన యనుమానమే కాని యొండుగాదు. వీరి బుద్ధుల జక్కఁబరచెదనని తలంచి పురోహితుని మొగముఁజూచెను. అప్పుడు పురోహితుం డిట్లనియె. భూవరా! నా భార్యయొక్క గుణము తెలిసినదా ? ఎన్నఁడును తానెఱుఁగనివారు. వీథిలోఁ గూర్చుండియుండగా వారితోఁ బరిహాసపు మాటలాడి యింటి కేమిటికిఁ దోడ్కొని రావలయును. ఇంతకన్నఁ దప్పేమున్నది? తప్పక దీనిం దండింపుఁడని పలికిన నవ్విప్రు నాక్షేపించుచు ఛాందసుడా! నీ భార్య యెక్కడనున్నదో చెప్పుమని యడుగు టయుఁ బురోహితుం డామె యున్న యింటియొద్దకుఁ దీసికొనిబోయి తాళముతీసి యిందులో నున్నదని చెప్పెను.

అప్పు డాఱేఁ డొక్కరుఁడ లోనికరిగి యధికచింతాకులస్వాంతయైయున్న యక్కాంతపాదంబుల కెరగి యమ్మా! నేను నీకుఁ బుత్రుండ. నన్ను వేరుగా భావింపకుము. నీ సుగుణంబు లిదివరకే వినియుంటిని. ఇప్పుడు బాగుగా వెల్లడియైనది. నీ పెనిమిటి దుర్బుద్ధి పిమ్మట విమర్శింతు. ఇప్పుడు నీవలన నొక్కవిషయముఁ దెలిసికొనగోరియే యిచ్చటికి వచ్చితిని. కరుణించి వచింపుము. ఈ బ్రాహ్మణులు పరదేశుల మనియు, మార్గస్తుల మనియు, బాటసారుల మనియు, వెఱ్ఱిమూఢుల మనియుం జెప్పినను సమ్మతింపక యెద్దియో యొక నామము గలవారిగా భావించినట్లును తమ్మెవ్వరో తెలిసికొను తాత్పర్యముతోనే వారిచ్చటికి వచ్చినట్లును వారే చెప్పియున్నారు. ఆ సంవాదము విని నాకును నుత్సాహ మధికముగా నున్నది. ఈ మాట దెలిసికొనుటకే నేను మీయొద్దకు వచ్చితిని వారెవ్వరో వచింపుమని మిగుల వేడుకొనఁగా నామె కొంతసే పేమియుం బలుకలేదు. పలుమారు తన్నావిషయము చెప్పుమని వినయముతో ప్రార్థించుటచే మాటాడక తీరినదికాదు. ఆ యిల్లాలు తల నించుక వాల్చి దేవరా! నేను దుష్టురాలను గాకున్నను దుష్టురాలనై నట్లు నలుగురిలో వాదు వచ్చినప్పుడు దానికిఁ దగిన దండన యెద్దియో యట్టిది విధించుట మీకు న్యాయమై యున్నది.

మఱియు నే నా బ్రాహ్మణులకు భోజనమునకు వత్తురను తాత్పర్యముతో నట్లంటినిగాని వేరుగాదు. తమరు వచ్చినపని యెద్దియో చూచుకొనుఁ డిట్టి ప్రశ్నలకిది యవసరముగాదని పలికిన నక్కలికి పలుకుల కులికిపడి యప్పుడమియొడయ డఁమ్మా! నా కట్టి తాత్పర్య మేమియు లేదు. నిక్క మరసితిని. నీయం దింతయేని దోసంబు లేకున్కి తెల్లంబయ్యె. నే నిట్లు వచ్చినందులకు క్షమింపుము. నీ పెనిమిటి పలుమారు నాతోఁ జెప్పినను వినిపించుకొనక యట్టి విటులం బట్టియిమ్మని చెప్పిన నతండు వీరి నట్టి విటులనుకొని నన్నుఁ దోడ్కొనివచ్చెను. అట్టి నిజ మరయుటకై వచ్చితినిగాని యొండుగా దీతప్పు సైరించి వారి వర్తమాన మెట్టిదో యెఱింగింపుము మిగులఁ గుతూహలముగా నున్నదని బ్రతిమాలిన నెట్టకేల కయ్యెలనాగ యిట్లనియె.

రాజా! వినుము. నేను నీటికై బావికిఁ బోవుచుండఁ నీ బ్రాహ్మణు లిరుఁగెలంకుల నరుగు లుండగ విడిచి వీథిలో నెండలో దర్భాసనముల దింపి కూర్చునియుండిరి. అట్టివారిం జూచి వీరు చదువుకున్నవారే కాని ఛాందసులనియు గూడ స్ఫురించుటచే నట్టిదాని గ్రహించుటకై సుమీ మీ రెవ్వరని యడిగిన వారు చెప్పిన పేరులన్నియు గాదంటి. పరదేశులనఁగా భాషాభేదము గలవారికిఁ జెల్లునుగాని యేకభాషగా నున్నవారికి చెల్లదు. మార్గస్థులమనగా మనకన్న ముందు మార్గమందుండుటంబట్టి యన్నో దకములకు చెల్లును. బాటసారులనఁగా సంతతము నడచువారు సూర్యచంద్రులకుఁ జెల్లును. ఇంక వెఱ్ఱిమూఢులను పదములు చదువుకొని పెద్దవిద్వాంసులను బిరుదులు బూనినవారికిఁ జెల్లవుగాని యని సగముచెప్పి యూరకున్న యన్నాతితో రాజు భయపడకుము. వారెవ్వరో యెఱిగింపుమని పలికిన నక్కలికి యిట్లనియె.

అయ్యా! వెరపేల వినుఁడు. అందు మొదటివాఁడు నాపెనిమిటియు, రెండవవారు మీరునుఁ గావచ్చును. మధ్యాహ్నకాలమం దైదుగురువిటులతోఁ గ్రీడించుచున్నదని వివేకములేక చెప్పిన నాపెనిమిటియు, నాయన చెప్పినతోడనే జారత్వమున కైదుగు రేల వత్తురను సందియములేక నిజమని నమ్మి పదుగురు పెద్దమనుష్యుల వెంటబెట్టుకొని వచ్చిన మీరును గాక యా బ్రాహ్మణులు గారని నిర్భయముగఁ బలికినది. అన్నాతి నీతివాక్యంబుల కెంతయు సంతసించి యా భూకాంతుండు తన పురోహితుని పెద్దమనుష్యుల యెదుట మిగుల నిందించి కటకటా! యింత యుత్తమురాలగు నీభార్యను నిష్కారణముగ బాధించుచున్న నిన్ను దండించినను దోషములేదు. ఆమెం జూచి నిన్ను మన్నించితి నింకొకసారి యిట్టి సంసారద్రోహపుమాట పలికితివేని క్షమింపక తగిన దండన విధింతునని భయంకరముగాఁ బలికిన నతండేమియుం బలుకక యూరకుండె. పిమ్మట నా శుద్ధమతిం జూచి యతని భార్య సుగుణములు తచ్చిష్యులవలన నెఱింగినవాఁడు గావున నిట్లనియె. ఓహో! యెంత యోగ్యుడవు! త్రిలోకపూజ్యరాలగు భార్యను విడిచి వెఱ్ఱియనుమానముఁ బూని పరదేశ మరుగు చుంటివి. నీవంటి నిర్భాగ్యుం డుండునే? నీ చదువేల? ఇందులకే గదా వృద్దులకు గన్య నియ్యఁగూడదని చెప్పుదురు. వెఱ్ఱిఛాందసుడా ? యిప్పటికైన బుద్ధిలేదా? చెప్పుము, లేకున్న నిన్నును దండింతునని పలికిన నతని కా విషయము చూచినది మొదలు తన భార్యవిషయమై తనకుఁ గలిగిన యనుమానమును కూడ నిట్టిదేయనియు నామె నిర్దోషురాలే యనియు విశ్చయించియున్న కతంబునఁ బశ్చాత్తాపముఁ జెందుచు నృపతి కిట్లనియె.

దేవా! నాకు బుద్ధివచ్చినది. నే నిదివరకు పడిన యనుమాన మంతయుఁ గల్ల యని యిచ్చట జరిగిన ముచ్చటల వలన దెలియవచ్చినది. నేను భార్యతో నిష్టముగాఁ గాపురము సేయుదునని యొడంబడియెను. పదంపడి యప్పుడమియొడయఁడు శుద్ధమతి మిగులఁ బండితుడనియుఁ దన యాస్థానములో నుండఁదగినవాఁ డనియును దలంచి తన యభీష్ట మెఱింగించి యతండు సమ్మతిపడిన మీదట నతనిభార్యను సబహుమానముగా రప్పించి యొకయిల్లు కట్టించియిచ్చి తగినగౌరవముగా వారిం బోషింపుచుండెను. శుద్ధమతియుఁ బురోహితుండును నదిమొదలు తనభార్యలయందు మిగుల ననురాగముగలిగి యేయనుమానములేక వర్తింపుచుండిరి. అయ్యిరువురు ఛాందసులతో నా రాజు వినోదముగా గాలక్షేపముఁ జేయుచుండెను. ఇట్లుండ నంత నొక్కనాఁడు తనకు సంతానములేదని సంతాపించు భార్య నోదార్చుచు శుద్దమతి యతివా! దీనికై నీవు చింతింపకుము. చక్రవర్తివంటి నందనుం బడయు నుపాయ మే నెఱుంగుదు. శ్రీశైలమునందలి వింతలం దెల్పుగల్ప మొండు నాదండనున్నది. తదుక్తప్రకారము తపం బాచరించి యట్టిపట్టిం గాంచెదనని చెప్పి భార్య యనుమతి వడసి యిల్లు వెడలి క్రమంబున శ్రీశైలంబున కరిగెను.

అందుఁ బాతాళగంగాతీరంబున నరసింహబిలంబున వసించి కందమూలాశనుండై కల్పోక్తప్రకారంబు పాశుపతవ్రత మాచరించుచు నారుమాసములు కాళీధవు నారాధించుటయు నవ్వేల్పు స్వప్నాంతరంబున వానికి బొడసూపిఁ పాఱుఁడా! నీవు సగము భక్తి నన్నారాధించితివి. అయినను గల్పోక్తనియమము జరిపితివి కావున నీ కోరిక తీరుపక తప్పదు. నీవు రేపు స్నానముచేసి వచ్చుచుండ దారిలోఁ జూతఫలం బొండు గాన్పించెడిది. దానిం గైకొని నియమముగా నెందును నేలం బెట్టకుండ నింటికిం దీసికొనిపోయి నీ భార్యకిమ్ము. ఉత్తమసంతానము గలుగఁగలదు. అంతరంబున నేయంతరాయము గలిగినను నాఫలము నీకు దక్కదు సుమీ. అని చెప్పి యాదేవత యంతర్ధానము నొందెను.

పిమ్మట శుద్ధమతి తద్దయుఁజెలఁగి పరిశుద్ధచిత్తముతో నాఫలంబు గైకొని క్రిందవిడకుండ నియమముగా నింటికి వచ్చుచుండ నొకనాఁడు జాముప్రొద్దువేళ తెలగరాయని చెఱువులో నడుచుచు ఫల మొకచెట్టుకొమ్మలసందున నిరికించి ప్రాంతమందలి బావిలో స్నానము చేయుచుండెను. ఇంతలో నావృక్షముమీదనున్న గరుడపక్షి, యాఫల మీక్షించి తక్షణంబ ముక్కుతోను గాళ్ళగోళ్ళతోను జిక్కంబట్టి యట్టె యెగిరిపోయినది. ఆబ్రాహ్మణుఁ డది చూచి మిగుల వగవుతో నతిజవంబునఁ బరుగిడి వచ్చెను గాని యది దూరముగా నెగిరిపోవుటచేత నేమియుం బ్రయోజనము లేకపోయినది. దాన నత్యంతచింతాకులస్వాంతుడై యతండు నిశాంతముజేరి తన పాట్లన్నియు నాప్తులతోఁ జెప్పుకొని తన దురదృష్టమును గురించి జీవితాంతము వరకు చింతింపు చుండెను. భవితవ్య మట్లుండ వాని కాఫల మెట్లు దక్కును?

ఆ పక్షి యట్లు గైకొని యెగిరిపోవుచుండ దైవయోగమున ముక్కు జారి కాశ్మీరదేశపురాజు గూర్చునియున్న బల్లమీఁదఁ బడినది. ఆ ఫలమహాత్మ్యముననే కదా యా యేవురకుఁ బుత్రులు జనించిరి. తర్వాతి వృత్తాంతము వినుము. ఇందాక నిలిపిన కథావృత్తాంతము జ్ఞాపకమున్నదియా. రాజుగారికిని మంత్రికిని పురోహితునికిని కోమటికిని కలాదునకును బుత్రులు గలిగినప్పటి యానంద మెప్పుడును గలిగినది కాదు.

వరప్రసాదులకథ

అట్టి సంతోషముతో వారు పుత్రోత్సవము పంచిపెట్టియుఁ బేదలకుఁ బెక్కు దానములు సేసియు మిత్రులకు బంధువులకు మెండువిందులు గావించియు మహోత్స వముల నెన్నియేని నాచరించిరి. పిమ్మట నాపుత్రులకు జాతకర్మాదివిధుల యథావిధి నాచరించి రాచపట్టికి వసంతుఁ డనియుఁ మంత్రిసూనునకు రాముఁ డనియు, బ్రాహ్మణపుత్రునకుఁ బ్రవరుఁ డనియు, వైశ్యనందనునికి సాంబుఁ డనియు, కళాదకుమారునికి దండుఁ డనియు, నామాద్యక్షరంబు లేకముగాఁ జదివిచూడ వరప్రసాదులని వచ్చునట్లు పేరులు పెట్టిరి. వరప్రసాదు లేవురు రూపంబునను దేజంబునను గుణంబుల నొక్క పోలిక గలిగి మన్మథునిక దిరస్కరించు చక్కఁదనముతో నభివృద్ధిజెందుచుండఁ దల్లిదండ్రులకు మిగులననురాగ మభివృద్ధి యగుచుండెను.

పిమ్మట నైదేండ్లు వచ్చినతోడనే యబ్బాలుర నొకయుపాధ్యాయునికడఁ జదువవేసిరి. ఆగురువునకు వచ్చిన చదువంతయు వారి కారుమాసములు చదువుటకుఁ జాలినదికాదు. తరువాత నొకసాహిత్యధురీణుని గురువుగా నేర్పరచిరి. అతనికడ వత్సరములో నాటకాలంకారములయం దసమానపాండిత్యముఁ గుదురుచుకొనిరి. పిమ్మట నొకవైయ్యాకరుణుని నాచార్యులగాఁ జేసిన నతనికడ మూడేం డ్లభ్యసించి పిదప నతనికి సైతము తప్పుల దిద్దఁదొడఁగిరి. అట్లు వ్యాకరణపాండిత్యము కుదిరిన తోడనే తార్కికునికడ నొప్పగించిన నారుమాసములకే యతని శిష్యునిగాఁ జేసికొనిరి. పిదప నొకసిద్ధాంతిని మూఁడుమాసములును, వైణికుని రెండుమాసములును, వైద్యుని నాల్గుమాసములును, వేదాంతిని మాసము, వైదికుని వత్సరము, తాంత్రికుని మాసము, మాంత్రికుని మాసము గురువుగ నేర్పరచుకొని యవ్విద్యలన్నియు సాంగముగా గ్రహించిరి. తక్కినవిద్యలన్నియుఁ బుస్తకములే గురువుగా నుండ సంగ్రహించిరి. మఱియు శస్త్రవిద్యయు ధనుర్విద్యయు నశ్వవిద్యయు మొదలగు రాజార్హము లగు విద్యలుగూడ శీఘ్రకాలములోనే సంగ్రహించిరి. ఇట్లు కొలఁదిప్రాయమందే యరువదినాలుగువిద్యలయం దసమానపాండిత్యము గల యవ్వరప్రసాదుల సుగుణములు నిత్యమును బొగడనివారు లేరు. వారి విద్యలు, గుణములు, శీలములు, రూపములు, ప్రజ్ఞలు, తల్లిదండ్రులకేగాక శత్రువులకు సైతము స్తోత్రపాత్రములై యున్నవి. వరప్రసాదులు ఆహారవిహారశయ్యాననరహస్య వ్యాపారముల యందును విడువక యేకప్రాణముగా వర్తింపుచుండిరి. వారియెడ రాజు మొదలగువారికిఁ బుత్రప్రేమ సమానముగానే యున్నయది.

వారు నిత్యము ప్రాతఃకాలమునందును సాయంకాలమునందును మంచిగుఱ్ఱముల నెక్కి పెక్కుదూరము విహరించి వచ్చుచుందురు. అశ్వారోహణమునందు వారికి మిక్కిలి పాటవము గలదని జగత్ప్రసిద్ధమైనది. వారికి బదియారేఁడుల ప్రాయము వచ్చునంత వారికిఁ బెండ్లిండ్లు జేయతలంపు తల్లిదండ్రుల హృదయంబుల నంకురించినది. అక్కుమారు లైదుగురు నొకవసంతకాలమునఁ దురగారూఢులై యుద్యానవనమునకుఁ బోయి యందు విహరించుచున్న నిట్లు సంభాషించుకొనిరి. రాముడు – మిత్రులారా! మన మనేకవిద్యలం జదివితిమి. ప్రాయమునకు మించిన పాండిత్యము సంపాదించితిమి. దేశాటనంబునంగాని మన విద్యాపాటవంబునకుఁ దేటరాదని నాయభిప్రాయము. అక్కార్యంబున కిదియ సమయము. ఇందులకు మీ రేమందురు?

వసంతుఁడు – నీకు మంచియూహ తోచినది. మన కిప్పుడు వివాహములు చేయవలయునని మన తండ్రులు ప్రయత్నించుచున్నారు. మెడకు లంకెలు దగిలికొనిన తరువాతఁ గదల శక్యమా? దేశము లన్నియుం జూచి రావలయునని నాకు మొదటి నుండియు నుత్సుకమే.

ప్రవరుఁడు - మీ యభిప్రాయములు మేము కాదనువారమా? కూపస్థకూర్మమువలె స్వదేశముననే యెల్లకాలము కాలక్షేపము చేయువారు పండితులైనను మూఢులని నీతిజ్ఞులు చెప్పుదురు. తప్పక యిప్పుడే బయలుదేఱవలసిన సమయము.

సాంబుఁడు - అన్నన్నా! మీ యవ్వనమద మెన్నివికారములఁ బుట్టింపుచున్నది. దేశాటనము మాటలతో నున్నదనుకొంటిరా? వేళకు నాహారము దొరకదు. పండుకొనుటకుఁ దగిన సెజ్జలుండవు. సత్రభోజనము మఠనిద్రయుఁ గావింపవలయును. మిక్కిలి సుకుమారుఁడగు నీరాజనందనుం డాయిడుమలఁ బడయగలడా? పరదేశులం జూచి ప్రజలు కడుఁజుల్కనగా మాటలాడుదురు. నిద్రాహారములు తిన్నగ లేక రోగములు రాకమానవు. ఈవెఱ్ఱియాలోచనలు మాని యింటికడ సుఖముగా నుండనీయుఁడు. యౌవరాజ్యపట్టాభిషిక్తుండై యితండు మహేంద్రవైభవ మనుభవించుచుండ మన మనుచరులమై చూచి యానందింతము. స్వదేశములో స్వగ్రామములో స్వగృహములోఁ బూజ్యత లేని దరిద్రునికిఁ బరదేశ మేగుట గొప్పయని చెప్పఁబడి యున్నది. ప్రాయికముగా విద్వాంసులు దరిద్రులగుట వారికి దేశాటనము కీర్తికరము కావచ్చును. అదియునుంగాక మన తలిదండ్రులు మనల జూడక యొకదినము గడుపనేరరు? అట్టివారు మనపోకకు సమ్మతింతురా, చెప్పకపోతిమేని దుఃఖసముద్రమున మునింగిపోవుదురు. అన్నిగతుల కత్తఱి దేశాటనము సమంజసముగా లేదననాయభిప్రాయము.

దండుఁ – మనసాంబుఁడు కులజమైన పిరికితనము విడువక దేశాటనమునకు జడియుచున్నాఁడు. అతండు నుడివిన కష్టము లన్నియు బరదేశములో ధనహీనులకుఁ గలుగుచుండును. వలసినంత ధనము దీసికొనిపోయిన మనకుఁ బరదేశము స్వదేశము వలెనే యుండును. రాజపుత్రులు యౌవ్వనరాజ్యపట్టభద్రులై దిగ్విజయయాత్ర చేసి వత్తురు. అట్టి యాత్రవలనఁ గొన్ని కొన్ని విశేషములు దెలియఁబడవు; మన మెట్టివారమో తెలియనీక సామాన్యులవలె నరిగినచో నెన్నేని విశేషములు తెలియఁబడక మానవు. ఆహా! భూమండలపటమంతయుఁ నొక్కసారి విమర్శించి చూడుఁడు. ఎన్ని దేశములు, ఎన్ని పట్టణములు, ఎంతలేసి విద్వాంసులు, ఎంతలేసి భాగ్యవంతులు, ఎంతలేసి సౌందర్యవంతు లుందురో కదా? ఒక్కొక్క దేశమునంగల స్త్రీలచాతుర్యంబులు వర్ణింపనలవియా? మహారణ్యంబులు మహానగరంబులు దిరిగిన దివ్యౌషధీవిశేషంబు లెన్ని సంపాదింపవచ్చును. తల్లిదండ్రులు మన గమనమునకు సమ్మతింపరు. వా రెఱుంగకుండఁగనే పోవలయును. సంవత్సరములో నంతయు దిఱిగి రావచ్చును. విద్యాభ్యాసమునకై తల్లిదండ్రుల విడిచి విదేశంబునఁ బెక్కుసంవత్సరములు వసించినవా రెందరో యున్నారు. మనము పోయితిమేని వారి కది సరిపడియుండును. వేగమే వత్తుమని వ్రాసిపెట్టి యేగుదము. మృత్యువువలన భయము లేకుండ మన యాయువులు గుప్తముగా దాచు పాటవము నాకుఁ గలదు గదా! అట్లు చేసిన మనము యమపురి కఱిగినను భయములేదు. అన్ని విధములచే నొకసారి దేశములు తిరిగివచ్చుటయే శ్రేయమని నా యుద్దేశ్యము,

సాంబుడు — నేను బిరికితనమునఁ జెప్పిన మాటగాదు. మీయందఱికన్న ముందడుగు వేయఁగలను. అనంతములైనను దేశములు గ్రుమ్మరుచుండ నొక యబ్దకాలము సరిపోవునా? మన సంకల్పప్రకారము జరుగదు. కానిండు మీ నలువుర యభిమతములకు నేను వ్యతిరేకము చెప్పువాడనా? తప్పక భూమియంతయుఁ జూచి రావలసినదే.

వసంతుడు – మిత్రమా! సాంబ! నీవు చెప్పినదంతయు సమంజసమైనదే. కావలసినంత ధనము దీసికొని పోవుదము. మీరు నలువురు నా వెంటనుండ నా కేకొదువయు రానేరదు. సుఖముగానే తిరిగివత్తము,

రాముడు — వానికి మాత్ర మిష్టములేదా యేమి! మంచిపిల్లను బెండ్లి చేయుటకు వాని తండ్రి నిశ్చయించెనట . అందుల కడ్డుచెప్పుచున్నాడు.

ప్రవరుఁడు — ఆ మాత్రపుకన్య లాదేశములో దొరకకపోరు. స్వయముగా మనము చూచి పెండ్లి చేసికొనుట లెస్స.

దండుఁడు — పదుఁడు పదుఁడు మీ యభిలాషలన్నియుఁ దీరఁగలపు. దేవతాస్త్రీలనే పెండ్లియాడి వత్తము.

వసంతుఁడు – అందఱును సమ్మతించిరి గదా. పోవుటకుఁ గాలనిరూపణము చేయుఁడు.

ప్రవరుఁడు — ఎప్పుడో యననేల రేపురాత్రిఁ పండ్రెండుగంటలు గొట్టినతోడనే గుఱ్ఱములెక్కి యూరిబయలనున్న చూతవనములోనికి రావలయు. నింతయేని జాగు సేయరాదు. అందఱము గలిసికొనిన తరువాతఁ బశ్చిమమార్గంబునఁ బోవుదము.

దండుఁడు - మిక్కిలి వెలగల రత్నములను బంగారమును దగిన యాహారపదార్థములు మూటగట్టుకొని యందఱు రావలయు నిదియే ప్రమాణవచనము. అందఱు — ముమ్మాటికినిఁ బ్రమాణవచనము, ఇప్పుడనుకొనిన సమయమున కాతోటలోనికి రావలయును.

అని యాలోచించుకొని యందఱు గుఱ్ఱము నెక్కి సత్వరముగా నిండ్లకుంజనిరి. ఆ రాత్రియు మఱునాఁడు పగలును బ్రయాణసన్నాహమేకాని యొండు కార్య మేమియు వారెరుగరు. వారట్టి యుత్సాహముతో నుండిరని యొక్కరును గ్రహింపరై రి. ప్రవరుని తల్లి మాత్రము వత్సా! నేఁడిది యేమి? మిత్రులయొద్ద కఱుగక యింటియొద్దనే యుంటివేమి? పుస్తకములన్నియు సవరించుచుంటి వేమిటికి? యెక్కడికైనఁ బ్రయాణము చేయవలసి యున్నదా యేమి? అని యడిగినది. అతం డామె కేదియో సమాధానము జెప్పి మరపించెను.

నాఁటిరేయి నియమించుకొనిన సమయమైనతోడనే యందఱును గుఱ్ఱములెక్కి యెవ్వరికిం దెలియకుండ సాంకేతికమైన యారామమున కరుదెంచిరి.

అందఱును జేరిన వైనము పేరుపేరునం దెలిసికొని కలసికొని మాట్లాడికొని మంగళశ్లోకములం జదువుచుఁ బశ్చిమదిశాభిముఖులై మనుష్యసంచారములేని యొక మహారణ్యమునంబడి నడువసాగిరి. వారి వారువములు ఱెక్కలుగలవియుంబోలె గంచెలం దాటుచు గుట్టల నతిక్రమించుచుఁ బొదల దూరుచు నత్యంతపాటవంబున నేగఁ దొడంగినవి.

మఱియు వసంతుండు ఖడ్గపాణియై యడ్డమైన తరులతాగుల్మాదుల ఖండించుచు ముందుఁ దన ఘోటకమును విన్నాణముగా నడిపించుచుండ రాముఁడును దానియడుగుల నడుగు నిడునట్లు తనకత్తడిని సమవేగంబునఁ బోనిచ్చుచు వసంతుఁడు నఱుకగా మిగిలిన కంటకలతావితానంబుల భజింపుచుండును. అతనిపజ్జ ప్రవరుండును వానివెనుక సాంబుఁడును వానిపిరుందన దండుండు నట్లే తురంగంబులఁ దోలుచుండిరి.

అయ్యరణ్యంబు ముందుఁజూడ దుర్గమంబుగను వారి వెనుకఁ జూడ రాజమార్గంబు గలదిగను గనంబడుటంజేసి యక్కాంతార మక్కుమారశేఖరునకు దారి యిచ్చుచున్నదో యనునట్లు చూడనయ్యెను. అందఱకన్నను వెనుక వచ్చుచున్న దండుఁడు వైద్యశాస్త్రప్రవీణుండును మహాయంత్రనిర్మాణదక్షుండునగుట నయ్యడవి నందందుఁ గాన్పించుచున్న మూలికావిశేషములును యంత్రోపకరణదారుకండంబునను సంగ్రహించుచుండెను.

తమ్ముఁ గానక మరునాఁడు తమవా రేమి చేయుదురో యని తత్కృత్యంబుల గుఱించి సంభాషించుకొనుచు వారట్లు మహావేగంబునఁ బోవుచుండఁ గొంతసేపటికి వారి నిశ్వాసించుటకుంబోలె నంబుజనీకాంతుం డనూరు పురస్సరముగాఁ బూర్వగిరిశిఖర మధిష్టించి యరుణకరప్రసారముల వారిపై వ్యాపింపజేసెను.

అప్పు డొకతటాకవికటంబునఁ దమ హయంబుల నిలిపి యవ్వీరులందుఁ బ్రాతఃకాలకృత్యంబుల నిర్వర్తించుకొని తత్కాలోచితాహారంబును నాకలి యడంచుకొనిరి. వసంతుం డిట్లనియె. మితృలారా! మన మీరాత్రి ననేకయోజనముల దూరము వచ్చితిమి. ఇమ్మహారణ్యమున కంతము గానఁబడకున్నది. మనవీటికి పడమరదెస జలధిదనుక జనసంచారశూన్యమగు మహారణ్యమున్నదని మనము భూగోళశాస్త్రమునఁ జదివియుంటిమి. మనవారు మనలం బట్టుకొని తీసుకొనిపోవుదురని తలంచికదా యీదెస కరుగుదెంచితిమి. ఇంక నందులకు వెరవవలసిన పనిలేదు. ఇంటనుండి దక్షిణముగా నేఁగిన గొన్ని నగరములు గనంబడును. అవియు నిక్కడికిఁ బెక్కుదూరములో నుండవచ్చును. మన గుఱ్ఱములు జాల బడలినవి. కొంత విశ్రమించి యరుగుదముగాక. మఱియొకరేయి నిట్లు శ్రమపడితిమేని జనపదంబులం జేరుదము. ఈపాటియలసట సైరింపఁగోరుచున్నవాఁడనని యోదార్చిన వారెల్లరు సంతసించుచు నతని దయకు స్తుతిజేయఁదొడంగిరి.

వారి వాహంబులు వారివాహంబులువోలె సంసక్తాంబరంబులు సముపగతజీవనంబులునై గంభీరహేషాఘోషంబుల గమనోత్సాహంబు సూచింప నక్కుమారులు వెండియు నభిష్టించి దక్షిణాభిముఖులై పోయిపోయి రాత్రిపడినంత నొకచోట విశ్రమించి మరునాఁడు వేకువజామున గ్రమ్మరం గదలిపోదలంచిన ముదముతో నటవీవిశేషంబులం జూచుచు మిట్టమధ్యాహ్నముదనుక నేకరీతిఁ బయనంబు గావించిరి.

అల్లంతదూరములోఁ గాంచనశిఖరభాసురమైన గోపురమొండు గాంచి సాంబుఁడు అదిగో పురము పురము అని కేకలు వైచెను. రాముఁడు అవును పట్టణమే కావచ్చును. ఇచ్చట భూములు సస్యసంపూర్ణములై యొప్పుచున్నవి. అడవి పలచబడినది. జన మిందుఁ దిరుగుచున్నట్లు చిహ్నములు గనంబడుచున్నవి అని పలుకుటయుఁ బ్రవరుం డిట్లనియె.

పట్టణప్రాంతభూమి జనాకీర్ణమై యుండవలయు నిందొక్కరుండును గనఁబడఁడు. కారణమేమియో యనుటయు వసంతుండు గుఱ్ఱముల నాపుఁడని నియమించి నలుమూలలు పరికించి యిదిగో మనము నగరమునకు దాపుగా వచ్చితిమి ఇం దక్కడక్కడ గృహములు గనంబడుచున్నవి. మనుషుం డొక్కఁడును గనఁబడఁడు ఇది తర్కింపఁదగినదే యని పలికెను.

అప్పుడు ప్రవరుఁడు సౌధప్రకారవిశేషంబులం జూడ నీవీడు రాజధానివలెఁ బొడగట్టుచున్నది. ఇట్టి నగరము వెలుపల జనసంచారశూన్యం బగుట నాలోచించి మఱియుం బోవలయుననిన నవ్వుచు దండుం డిట్లనియె.

మిత్రులారా! అది యేదియైన మనకేమి భయము? మన యాయువులు గుప్తముగా దాచినమాట మరచితిరా? మిట్టమధ్యాహ్నమున నర్ధరాత్రమునఁబోలె నిశ్శబ్ధంబై యున్న యిన్నగరములోఁ బ్రవేశించి యదార్థమరయుదము గాక పదుఁడు పదుఁడు అని యుదుటు గరపుటయు సంతసించుచు వసంతుండు తత్తడిని మడమలతో నడచిన నది చిత్తానుగుణ్యముగాఁ బరుగిడఁ దొడంగినది. దాని ననుసరించి తక్కినవారును వారువంబుల నడిపించిరి. ఇంతలోఁ బట్టణము సమీపించినది .

వారు మిక్కిలిసాహసముతో జనశూన్యమైన యానగరిలో నొకవీథిని గుఱ్ఱముల నడిపించుచుండిరి. గృహకవాటము లన్నియు మూయఁబడియున్నవి. అంగళ్ళన్నియుఁ గట్టివేయఁబడినవి . అక్కడక్కడ వేదికలపై జనులు నిద్రించుచుండిరి. అవ్వింత జూచి వెరగుపడుచు వసంతుఁడు సఖులారా! యీవీడు రేఁద్రిమ్మరీడులది కాదుగద. లేక దీని నెవ్వరైన నిట్టుండ వసింతురా? యిట్టి పట్టపవలున నిశీధంబునం బోలె జనులు నిద్రించుట శంకాస్పదమైయున్నది. వేగమ దీని దాటిబోవుటయే శ్రేయమని పలికిన దండు డిట్లనియె.

రాజపుత్రా! అందందు నిద్రించు వారిం జూచితివా? వారు మనవలెనేయుండిరి. రాక్షసనగరము భూతలపురము నైనచో నిట్టి మనుష్యులేల యుండెదరు? దీని కెద్దియో కారణముండకపోదు. దాటిపోవనేల? దీనిని విమర్శించి మఱియుం బోవలయు నిట్టి వింతలను జూచుటకేకదా మన మిల్లు వెడలితిమని యతండు పలుకుచుండఁగనే యొక మూల ఢం ఢం అను డిండిమధ్వని వినంబడినది.

ఆ చప్పుడు విని వరప్రసాదులు ఓహో! యెద్దియో చాటింపు కాఁబోలు. ఆకర్ణింతుముగాక యని యా ధ్వనిజాడ ఘోటకముల నడిపింపం దొడంగిరి. ఖడ్గహస్తులై యిరువురురక్షకభటు లొకడిండిమహస్తునితోఁగూడ వీథుల సంచరించుచు పౌరులారా! భద్రముగా నిద్రింపుడు. భద్రముగా నిద్రింపుఁడు మీ సొత్తుల మేము గాపాడుచుంటిమని కేకలు వైచుచుండిరి. వరప్రసాదులు వారి దాపునకుఁ బోవుటయు వారికిని వీరికిని నిట్టి సంవాదము జరిగినది.

రాజభటులు – మీరెవ్వరు?

వరప్రసాదులు — మేము కాశ్మీరదేశస్థులము.

రాజ — ఇట్టి యర్ధరాత్రంబున నిర్భయముగా సంచరించుచుంటిరేల?

వర — ఓహో! యిది యర్ధరాత్రమా! పట్టపగలుగాదా! మీ మాట లింతవిపరీతములుగా నుండుటకుఁ గారణమేమియో తెలియకున్నది.

రాజ – ఇది పగలన్నవారిని శిక్షించుట మా రాజుగారి శాసనము మీరెరుంగరు కాబోఁలు. మొదటి తప్పు మన్నించితిమి. మీ రింకొక్కసారి యట్లు మాట్లాడినచో శిక్షాపాత్రు లగుదురు సుమీ?

వర - ఇది యేమి న్యాయము నిజము బల్కినను దండించు రాజులు గలరా? పోనిండు. మేము భుజింపవలయు నట్టి సదుపాయ మెక్కడ జరుగును. ఎందైన సత్రమున్నదియా?

రాజ - (అత్యాగ్రహముతో) మేము పురరక్షకులముగాని పరదేశులకు భోజనసదుపాయము జేయువారమును సత్రముల నెఱింగించువారమును గాము. రాత్రుల వీథుల నితరులు సంచరించుటకు రాజుగారి యాజ్ఞలేదు. ఎక్కడైనను సత్వరముగాఁ బండుకొనుఁడు లేనిచో శిక్షింతుము.

వర - ఊరక యాగ్రహపడెదరేమి? పరదేశస్థులకు బస జూపినంత మాత్రముననే యధికారమునకు లోపమువచ్చునా?

రాజ - లోపము వచ్చును. అది మా పనికాదు. వేగిరము పండుకొనుఁడు.

నిలుఁడు నిలుఁడని గుఱ్ఱంబుల కడ్డునిల్చుటయు వారు గ్రొత్తవారగుట నేమియుం బలుకనేరక గుఱ్ఱంబుల డిగ్గి వారి శాసనమునకు లోనై ప్రాంతముననున్న యొకయరుగుమీదఁ బరుండిరి. ఊరక కన్నులు మూసికొనిరిగాని నిద్రపట్టినదికాదు. ఇంతలో సాయంకాల మగుటయు ననఁగా నా గ్రామస్థులకు నది యుదయమే గనుక ప్రాతఃకాలమున లేచునట్లు సాయంకాలమున లేచి జనులెల్లరు క్రమంబున వారివారివ్యాపారములయందు బ్రవర్తింపఁ దొడంగిరి. వరప్రసాదులు పరుండియున్న యింటి యజమానుఁడుతలుపుతెరచి వారింజూచి గొప్పకుటుంబములోనివారిగాఁ దలంచి మిక్కిలిగౌరవముగా అయ్యలారా మీరెవ్వరు? ఈ గ్రామ మెందులకై వచ్చితిరి? మీవృత్తాంత మెఱింగింపుడని యడిగిన ప్రవరుం డిట్లనియె.

అయ్యా! మేము కాశ్మీరదేశస్థులము. గొప్పవంశమువారు విదేశములయందుఁ గల వింతజూచుటకై దేశాటనము జేయుచుంటిమి. ఈ పురము నేఁటి మధ్యాహ్నము జేరితిమి. అట్టివేళ నిద్రించుచున్న జనులఁజూడ మాకు మిగుల వింతయైనది. కారణ మడుగ నిది మధ్యాహ్న మనువారిని దండింతుమని రాజభటులు మమ్ము నరికట్టిరి. మిగుల నాకలితో వారి యాజ్ఞలకు బద్ధులమై మీయరుగుమీదఁ బండుకొంటిమి. ఇంతలో సాయంకాల మగుటయుఁ దెల్లవారినట్లు జనులు వారివారిపనులందు బ్రవర్తింబఁదొడంగిరి. ఇందలివారలు నిశాచరు లగుటకుఁ గారణము తెలియకున్నది. ఈ విశేష మెట్టిదో యెఱింగింప వేడుచున్నారము అని సానునయముగా నడిగినఁ బుణ్యమతియైన యాగృహపతి వారిని లోనికిఁ గొనిపోయి యుచితప్రదేశమునఁ గూర్చుండబెట్టి తృటిలో రుచిగల పదార్థముతో వంటఁజేయించి భోజనముబెట్టి పిమ్మట రహస్యస్థలంబునకుఁ దీసికొనిపోయి సాదరముగా నానగరవృత్తాంత మిట్లు చెప్పందొడంగెను.

కానీనుని కథ

ఆర్యులారా! ఇదిలాటదేశము. ఈ దేశాధికారి పేరు కానీనుఁడు. వీనికి దుష్టబుద్ధి సుబుద్ధి యను నిద్దరు మంత్రులు గలరు. వారి యాలోచనానుసారము నతం డీరాజ్యం బేలుచుఁ బదివత్సరములు క్రిందట నొకనాఁ డొకసభ జేసి యందు పౌరహితపురోహితసామంతప్రముఖులు పెక్కండ్రు వినుచుండ నాయొడయండు మంత్రులతో నిట్లనియె.

అమాత్యులారా! నా చిత్తమున నిప్పు డొకక్రొత్తసంకల్ప మంకురించినది . దానిని మీ రిరువురు విచారించి గుణదోషంబుల వక్కాణింపుఁడు. భూమి పుట్టినది మొదలు పాలించిన రాజులు చర్యలు జూడ నేకరీతిగానే యున్నవి. "గతానుగతికో లోక" అనునట్లు ముందువాఁ డెట్టిచెడుత్రోవ నడచినను నది పెద్దలు నడిచినమార్గ మనియు దాని నతిక్రమింపరాదనియు, వెనుకవారు నట్లే నడుచుచుందురు. "శతాంధాం కూపం ప్రవశంతి" అనునట్లు వారును వీరునుంగూడ గ్రుడ్డివారలే. మొదటివారు తర్వాతివారికి పెద్దలగుదురు గదా! కావున నారాజ్యము వారందరు నట్లే నడుచుచుందురు. దాని మూలమున నాకు మిగుల ఖ్యాతి రాఁగలదు వినుండు. రాత్రి యనియు, బగ లనియు, నిద్రాహారములం బట్టి మనవారు దినమునకు రెండు నామములు పెట్టిరి గదా! అందు నిద్రించునది రాత్రియనియు, విహరించునది పగలనియుఁ జెప్పుదురు. దానికిఁ బదులుగా నిప్పుడు రాత్రి పగలు, పగలు రాత్రిని జేయువాఁడనై యుంటిని. నడతలం బట్టి గదా వానికట్టి నామములు వచ్చినవి? కావున రాత్రిపనులు పగటియందునూ పగటిపనులు రాత్రియందును ప్రజలు చేయఁదొడంగిరేని యట్టినామములు వానికే రూఢమగుచున్నవి. ఇదీయ మదీయసంకల్పము. దీనికి మీయభిప్రాయ మేమని యడిగిన దుర్బుద్ధియను మంత్రి మిగులయుక్తముగా నున్నదని రాజుగారిని స్తుతించెను. సుబుద్ధియు దాని కొడంబడక రాజుతో నిట్లనియె దేవా! వినుండు

శ్లో॥ "సులభాః పురుషోలోకే సతతం ప్రియవాదినః
      అప్రియస్య చ పఠ్యస్య వక్త్రాతాచ దుర్లభః."

అనునట్లు యిష్టముగా మాట్లాడువారు పెక్కండ్రు గలరు. అప్రియముగా హితమైన దానిం జెప్పువారును వినువారును లేరు. నేఁ జెప్పబోవునది తమకుఁ బ్రతికూలముగానే యుండును. ఐనను హితమైన మార్గము చెప్పకమానను. వినుం డిప్పుడు దేవరవారికిఁ దోచిన యాలోచన లోకమునకు విరుద్ధమైనదియేగాక లోకులకు మిగుల పీడాకరమైయున్నది. నిద్రాహారంబులం బట్టి రాత్రింబగళ్ళకు నామములు పెట్టలేదు. అందుఁగల చీఁకటియు వెల్తురునుం బట్టి యట్టిపేరులు వచ్చినది. తేజస్తమంబులం గూడ మార్పనోపుదురేని యట్టినామంబులు వానికిఁ బెట్టనగు. దాని మూలముగా స్వర్గమునకుఁ బ్రతిస్వర్గము సృష్టించిన విశ్వామిత్రునకుఁబోలె తమకును గొప్పఖ్యాతి రాఁగలదు. కాని వ్యాపారముల మార్చినంత మాత్రముననే యట్టిఖ్యాతి రానేరదు. రాత్రిసంచారము క్రూరమృగములకు రాక్షసులకు గాక మనుష్యుల కెట్లు పొసంగును. వెలుతురులేక యేపని చేయుటకు వీలులేదు గదా? అట్టి చీకటిలో పగటిపను లెట్లు చేయుదురో విచారింపవలదా? అట్టి నియమము భగవంతునిచే జేయఁబడినది. దానిని మనుష్యులు మార్పఁగలరా?

మనుష్యకృత్యములు మార్చినను మార్చవచ్చునుగాని దైవకృత్యముల మార్చ నెవరి తరంబు? మఱియొక రాజు పాదములతో నడుచుట లెస్సగాదని చేతులతో నడువమనును . ఇంకొకఁడు కన్నులతో విని చెవులఁతో జూడమనును. ఇట్లు విపరీతకృత్యములు ప్రజలెట్లు చేయగలరు? చేయశక్యముకాని పనుల విషయము శాసనముల నియమింపరాదు. దైవికముల మార్చుట శక్యముకాదు. అప్పని యపఖ్యాతికి మూలమగును. ప్రజావిరోధము సంభవించునని నిర్భయముగా నాసుబుద్ధి యుపన్యసించినంత నా భూపతి యత్యంతకోపముతోఁ దనయాజ్ఞకు నాటంకము చెప్పినందుల కప్పుడే యా మంత్రి నుద్యోగమునుండి తప్పించి దుర్బుద్ధిఁ బొగడుచు నమ్మరునాఁటినుండియుఁ గ్రొత్తశాసనము పడుపున జనులు నడుచుకొనునట్లు దేశమంతయుఁ బ్రకటింపజేసెను. రాజశాసన మతిక్రమించిన వారిని గఠినముగా శిక్షింతుమని చాటింపించిరి. అట్లు చేయుటకు రాజభటులఁ బెక్కండ్ర నియమించిరి.

అట్టి యుగ్రశిక్షకు వెఱచి యందలి ప్రజలు దీపంబులకుఁ జమురు దెచ్చుకొనలేకను చీఁకటి నడువలేకను నిద్దుర కాగలేకను బెక్కుతెఱంగుల నిడుమలఁ బడుచుండినను విషనాభిలో పురుగులవలె జన్మభూమి విడువలేక నయిదాఱువత్సరము లధికక్లేశము లనుభవించిరి. తుద కదియును నలవాటేయైనది. ఇంత మొండిజను లెందైన గలరా?

మా రాజు చరిత్ర మిట్టిది. మీరు పరదేశస్థు లెరుగమినైన నింక నిది రాత్రి యనబోకుడీ! అట్టి మాటలచేఁ బెక్కండ్రు శిక్షితులైరి. శీఘ్రముగా నీగ్రామము దాటి పోవుఁడని యయ్యజమానుఁ డయ్యూరివర్తమాన మంతయు నెఱింగించిన వరప్రసాదులు నందలిప్రజల యిడుమలకుఁ జాలిపడి యోహో! యిట్టి నీతిమాలిన నృపాలుఁ డుండునే యని యతని నాక్షేపించి యతని దుష్కృత్యము నెద్దియో యొకయుపాయమున మాన్పింపఁదలచి యందుఁ గొన్నిదినము లుండినం గాని యట్టిపని చేయుటకుఁ బొసగదని యొకగొప్పభవన మద్దెకు దీసికొని యందు నివసించి యచ్చటివారివలెనే కొన్నిదినములు రాత్రింబగళ్ళచర్యలు నడుపుచుండిరి.

దేవతావస్త్రముల కథ

బుద్దిశాలులగు వరప్రసాదు లొక్కయుపాయంబున నా నృపతిని వంచింపఁ దలచి యొకనాఁడు పెందలకడ భోజనములు జేసి గౌరవమైన వేషములు వేసుకొని రాజుగారి హజారముకడ నిలువంబడి యొకచీఁటిలోఁ గొన్నివిషయములు వ్రాసి ద్వారపాలురచేతి కిచ్చి రాజున కంపుటయు నాచీఁటి చూచుకొనిన తక్షణము రాజుగారు వారిఁ దోడితెచ్చుట కొకయుద్యోగస్థుని బంపిన నతఁ డత్యంతగౌరవముగా వారి దోడ్తెచ్చి రాజుగారి సింహాసనప్రాంతమందు విడచెను.

రాజును వారి కెదురేగి గౌరవముగా మన్నించి యుచితపీఠికలఁ గూర్చుండఁబెట్టి స్వాగతపూర్వకముగా నిట్లనియె. పురుషవర్యులారా! మీర లెద్దేశము వా రెచ్చటనుండి యెచ్చటి కరుగుచు నిచ్చటి కెప్పుడు వచ్చితిరి? కులగోత్రనామంబు లెట్టివో యెఱింగింపుఁడు. మఱియు మీరు చీఁటిలో వ్రాసిన వింతపను లేమి చేయగలరని యత్యంతాతురముగా నడుగుటయు, వాక్పాటవముగల మంత్రిసూనుండు లేచి సభాసదులకు మ్రొక్కి రాజుదిక్కు మొగంబై యిట్లనియె.

రాజేంద్రా! మాది కాశ్మీరదేశము. పట్టుసాలికులమువారము. విచిత్రములగు బట్టలు నేయఁగలము. అట్టి పనితో మిగుల గౌరవముగా మా దేశపు రాజుగారియొద్ద నుండువార మతని కిప్పు డొకయాపద సంభవించుటచే నటనుండక మమ్ము రక్షించువారెవ్వరని యరయుచుండ యపూర్వచర్యాభిలాషులును నూతనమార్గనిర్మాణదక్షులును నగు మీ కీర్తి దిగంతవిశ్రాంతమై మా కర్ణగోచర మగుటయు వింతకార్యముల నొనరించుటయందు వేడుకగల మీరుగాక మా యపూర్వవిద్య పరీక్ష సేయు దక్షు లన్యులు లేరని నిశ్చయించి యుష్మద్దర్శనార్ధులమై యీదేశ మరుగుదెంచితిమి.

మా పుణ్యవశమున మిమ్ము బొడఁగంటిమి. సెలవైనయెడ చమత్కృతి వక్కాణింతుమనుటయు నట్టి మాటలకు నారాజు మిగుల నానందించి మంత్రిదిక్కు మొగంబై దుర్బుద్దీ! మన నూతనచర్యాస్థాపనవలన నెట్టి ఖ్యాతి కలిగినదో వింటివా? మనకుఁ గడుదూరముగానున్న కాశ్మీరదేశములో సైతము మనపేరు వాడుకపడియున్న దఁట మేలుమేలని సంతసించు రాజుతో మంత్రి యిట్లనియె.

దేవా! కాశ్మీరదేశ మొకటననేల? భూమండలమంతయు మన పేరుప్రతిష్ఠలు వ్యాపకమైయున్నవి. ఆయాదేశములనుండి వచ్చుచున్న వార్తాపత్రికలవలన నవ్విధమెల్లఁ దెల్లమగుచున్నది. తమకుఁగల బుద్ధికుశలత మఱియొకరాజునకుఁ గలదా? ఎప్పుడును గ్రొత్తమార్గములే విమర్శింపుచుందురు గదా? దీని మూలమునఁ దమకు శిబి, కర్ణ, బలి ప్రముఖులకు దాతృత్వము వచ్చినదానికన్న నధికమగు యశంబు రాఁగలదని పెక్కు స్తోత్రపాఠములు పఠించిన మంత్రి మాటలను రాజు విని పరమానందభరితు డయ్యెను. వరప్రసాదులు నవ్వుకొని నామాటల ననువదించిరి. అప్పుడు రాజు వారితోఁ గోవిదులారా! మీ విద్యాపాటవం బెట్టిదో యెఱింగింపుఁడు. అపూర్వ మని తోచినచో మిమ్ము తప్పక భరింతునని పలుకుటయు మంత్రి పుత్రుండగు రాము డిట్లనియె.

అయ్యా! మే మాఱుమాసముల కొకదోవతులచాపు చీరయుఁ దలరుమాలును నేయుదుము. ఆ పుట్టములకు నేఁబదివేల మాడలు వ్యయమగును. అందు ముందుగా సగము సొ మ్మీయవలయును. బట్టలనేత ముగిసినతోడనే మే మెవ్వఱికి నేయుదుమో యా యజమానుఁడు భార్యతోఁ దనకుఁగల వైభవమున నొకసాయంకాలమం దూరేగి మా బసలోనికి వచ్చి మా కియ్యవలసిన సొమ్ముతో నోపినంత బహుమతిం గూడ నియ్యఁదగినది. పిమ్మట నాపుట్టముల మేమే వారికిఁ గట్టుదుము. ఆ పుట్టంబులం గట్టికొని యూరంతయు నూరేఁగి యా రాత్రి భార్యాభర్తలు కామకేళిం దేలినచోఁ దత్ప్రభావంబున వారి కధికతేజస్పమన్వితుండగు నందనుం డుదయించును. మఱియు నొకవిశేష మాకర్ణింపుడు. మేము నేయుబట్టలు గాని నూలు గాని జారత్వదోషమువలన జనించినవారికి మాత్రము గాన్పింపవు. అవి దేవతావస్త్రములు. ఇట్టి చాపుల నేఁటి కొకసారి నేసి మా రాజుగారివలన మిగుల గౌరవ మందుచుందుము. దైవప్రాతికూలమున నతండు చిక్కులంబడియుండుటం బట్టి యింతదూరము రావలసి వచ్చినది. ఆ పుట్టంబులఁ గట్టినప్పుడుగాని యయ్యానందము సెప్పినం దీరదు. ఇందుల కొడంబడుదురేని నిందుండెదము లేనిచో సెలవీయుఁడు. వేఱొక యాస్థానమున కరిగెద మనుటయు నపుత్రకుండును నూతనమార్గస్థాపకుండు నగుటచే దానఁ దనకు గొప్ప ఖ్యాతి రాగలదనియు నట్టి ప్రభావము లేకున్న నొకచాపునకు చీరకు నంతవెల యేల యడుగుదురనియు మనంబునఁ జింతించి వా రట్టి ప్రభావసంసన్ను లగుదురని నిశ్చయించి వారితో నిట్లనియె.

ఓ తంతువాయకులారా! మీ కావిషయమై వితర్క మేమిటికి! మా సంస్థానమునకు వచ్చిన విద్వాంసు లూరక చనుట వలదా? రాత్రింబవళ్ళ మార్చి మిగుల విఖ్యాతిఁ జెందుచున్న నాకుఁ గ్రొత్తపనులకునై యెంత సొమ్మైనను లక్ష్యమా? మీ యిష్టము వచ్చినంత సొమ్ము వ్యయపెట్టి యట్టి యద్భుతవస్త్రంబుల నేసియిండని యానతిచ్చి వారు కోరినంత ద్రవ్యం బిచ్చి సబహుమానముగా నెలవున కనిపెను.

వింతబట్టల నేయఁగల పట్టుసాలీలు వచ్చినారని గ్రామమంతయు వదంతియగుటచే నట్టి వసనంబులు చూచుటకు పౌరులకుఁగూడ మిగుల నాతురముగా నున్నది. వరప్రసాదులును నేతసాధనములగు వేమాదండములు రాట్నములు మగ్గములు కండె గుల్లలు లోనగునవి మాత్రము సంగ్రహించిరి. వాకిట తమ యాజ్ఞలేక యన్యుల రానీయకుండునటుల కావలివానిం బెట్టి లోపల నిష్టమైన వినోదములతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి.

ఇట్లుండునంత రెండుమాసములయిన పిమ్మట కానీన నృపాలుఁ డొక్కనాఁ డాపుట్టముల పని యెంత యైనదో యని తెలిసికొన వేడుకపడుచు నవ్విశేషములఁ జూచి రండని గ్రామాధికారుల వారియొద్ద కనిపెను. అట్టి పుట్టంబులం జూడ వారికిని మిగుల వేడుకగా నుండుటచే సత్వరముగా వరప్రసాదుల నెలవున కఱిగి కావలివానిచేఁ దమరాక వారి కెఱింగించిరి.

వరప్రసాదులును ముహూర్త మాత్రము నిలిపి తీసికొనిరమ్మని కావలివానికాజ్ఞ యిచ్చి యింతలో రాట్టములు దోడుబద్దలు సర్దుకొని వట్టిరాట్టముల నూలొడుకువారివలెఁ ద్రిప్పుచు నూలుచుట్టువారివలెనే తోడుబద్దలకుఁ జుట్టుచుండిరి. అంతలో గ్రామాధికారులు లోనికి వచ్చిరి. అప్పుడు రాముఁ డెదురువోయి సముచితసత్కారముల వారిం గౌరవించి తగుపీఠములఁ గూర్చుండబెట్టి కొండొకవడికి నావట్టిచుట్టుబద్దలు వారికి జూపించుచు నిట్లనియె.

అయ్యా! నూ లెంతసన్నమో చూచితిరా! మృదువు పరీక్షింపుఁడు. ఎంత సొంపుగా నున్నదో చిత్తగించితిరా! చేతం బట్టి చూడుఁడని దాపుగా నాకండెలం గొనిపోయి చూపించుచు రెండుమాసములకు నూలు తయారగుటయే దుర్ఘటమగుచున్నది. ఇట్టి నూలు మీ రెన్నఁడైన జూచితిరేమో నిజము చెప్పుడని యడిగెను. ఆ గ్రామాధికారులు వెఱఁగుపడి తన కేమియుఁ గాన్పింపకున్నతఱిఁ దమతల్లిం దూరుచుఁ దద్దోషంబుననే యవ్వింతనూ లదృశ్యమైనదని నిశ్చయించి దాని మహత్వ మగ్గించుచుఁ గాన్పింపలేదంటిమేని తమమాతృదోషము వెల్లడియగునని తలంచి యది నిజముగాఁ దమకుఁ గనిపించుచున్న ట్లభినయించుచు దాని మార్దవము సాపు సన్నమును విన్నాణమును రామునికన్నఁ బెద్దగాఁ గొనియాడదొడఁగిరి,

గ్రామాధికారు లిరువురిలోఁ గరణమునకుఁ గాన్పించెనని కాపును కాపునకుఁ గాన్పించెనని కరణమును దలఁచి యా గుట్టు తెలియనీయక మాట్లాడుచుండిరి. ఇట్లు కొంతసేపు నూలును గుఱించియు నూలొడుకువారి గుఱించియు స్తోత్రపాఠములు పఠించి యా గ్రామాధికారు లరుగునప్పుడు రాముఁడు వారికి నిట్లనియె.

పురుషశ్రేష్ఠులారా! మీ రాజుగారితో రెండు మూఁడు దినములలో నూలు తీయుట పూర్తియగునని చెప్పుడు. దాని మార్దవాదిగుణంబులు మీరు చూచినదేకదా? అదియుఁగూడఁ దేటపరుపుఁడని మిగుల గౌరవముగా వారిని సాగనంపి వరప్రసాదులు వారి మూఢత్వమునకై యొండొరులు నవ్వుకొనుచు నారాట్టంబులు చుట్టుబద్దలు నొకమూల పారవైచి యథాప్రకారము సంగీతాదివినోదములతోఁ గాలక్షేపముఁ జేయుచుండిరి.

అచ్చట నగరిలో గ్రామాధికారు లరిగినది మొదలు వారిరాక నెదురుచూచుచు వారు గనంబడినంత నుత్సుకతో మీరు పుట్టములఁ జూచితిరా? ఎట్లున్నవి? ఎన్నినాళ్ళకుఁ బూర్తియగుననిరి? తంతువుల తీఱెట్టిది? ఎఱింగింపుడనుటయు వారు రాజునకు నమస్కరించి యిట్లనిరి. ఏలికా! తమ యాజ్ఞానుసార మరిగితిమి. మే మరుగునప్పటికిఁ గొందఱు రాట్టంబుల నూలు తీయుచుండిరి. మఱికొందరు చుట్టుబద్దలకుఁ జుట్టుకొనిరి.

అయ్యారే! ఆనూలువంటి నూలు భూలోకములో నింతకుమున్ను చూచినవారము కాము. దాని మార్దవముఁ జూడ మనుష్యకృతమని యెవ్వరును నమ్మరు. సన్నమును బరీక్షించుమన్నఁ గాన్పించియుఁ గాన్పింపకుండు. సాపు చూడఁ బోత పోసినట్లున్నది.

అట్టి తంతులతో నిర్మితమైన పుట్టంబు లెట్లుండునో గదా? అపూర్వచర్యాభిలాషులగు దేవరవారి కిట్టి వింతపుట్టంబు నేయు నేతగాండ్రం గూర్చినవాడు భగవంతుడని మేము నమ్ముచుంటిమని మఱియు మఱియు నానూలు గుఱించి స్తోత్రములు చేయుచు రాజువలన ననుజ్ఞ వడసి వారు నివాసంబుల కరిగిరి.

అప్పుడు పెక్కురు వారిం జుట్టుకొని యాపుట్టముల వృత్తాంత మడుగజొచ్చిరి. వారు వారి యపూర్వపటనిర్మాణమును గుఱించి స్తుతిపూర్వకముగానే వక్కాణించుచుండిరి.

కానీనుఁ డాగ్రామాధికారుల వలన విచిత్రవస్త్రగుణము వినినది మొదలు మఱియు నాతురతఁ జెంది యాఱుమాసము లెప్పుడు వచ్చును ఎప్పు డావలువలుఁ దాలుతునని మిగుల వేడుకవడుచు మఱిరెండునెల లరిగిన పిదప దండనాథునిం జీరి సేనాని! వింతపుట్టములు నేయువారుండుతావు నీ వెఱుంగుదువు గదా? అచ్చటి కరిగి యావసనంబులచేత యెంతయైనదో తెలిసికొనిరమ్ము. గ్రామాధికారులు చూచి యద్బుతముగా నున్నవని సెప్పిరి. పరీక్షింపుము అని యంటయు మహాప్రసాదమని యా దండనాథుఁడు వానింజూడ దనకును వేడుక కలుగుటచే సంతోషముతో నప్పుడ యప్పట్టుసాలీలున్న నెలవున కరిగి కావలివానిచేఁ దమరాక వారి కెఱింగించెను. వరప్రసాదులు పరిచారకునితో సేనాధిపతిం దీసికొని రమ్మని జెప్పి వట్టిమగ్గంబులసాచి నూలు సవరించువారివలెనే సద్దుచు దండముల దట్టించుచుఁ యవాగూరసమునఁ దడుపుచుఁ బెక్కుతెరంగుల నభినయింపం దొడంగిరి.

ఇంతలో దండనాథుఁడు లోనికిరాగా మంత్రినందనుం డెదురేగి తోడ్తెచ్చి యుచితపీఠికం గూర్చుండంబెట్టి స్వాగతపూర్వకముగా నాగమనకారణములు దెలిసికొని ముం దతనిచేయిం బట్టుకొని యామగ్గములదగ్గరకుఁ దీసికొనిపోయి అయ్యా! మగ్గ మదిగో చూడుడు. రెండు మూడు దినములలో బద్దలం దగిలించి నేత ప్రారంభము చేయుదుము. ఈ వింతనూలు చూచితిరా? యిది కట్టుచాపునకును యిది తల రుమాలునకును యిది చీరకునుగా నేర్పరచితిమి. నిదానించి పరీక్షించుఁడు. మార్దవాదిగుణంబులు గ్రామాధికారులు చూచినప్పటికన్న సొంపుగా నున్నవి. అప్పుడు సిద్ధమగుచుండుటంబట్టి యిట్టి యందము తేలలేదు. నేతఁ బట్టిచూడుఁ డెంత మృదువో యని వట్టిమగ్గముమీదఁ జేయి నంటించిన నాసేనాని తన కేమియుఁ గాన్పించక మనంబున దిగులుపడి అయ్యో! నా తల్లి గ్రామాధికారుల జననివంటి గుణసంపత్తి కాకపోయెనే? కటకటా! యట్టి కులటకు జనించిన నా పరువేపాటియది సాటివారిలో మేటి యనుకొంటి గాని దీనిమూలముగాఁ దేటయైనది.

ఈ గుట్టు బయట పెట్టినచో చుట్టములు సైతము మొట్టమొదట చూచినంత గౌరవముగాఁ జూడరు ఊరక యట్టి యపకీర్తి వెల్లడి చేసికొననేల! చాలునని తలంచి యామగ్గములోఁ గూర్చిన నూలు ముట్టిన ట్లభినయించుచు నోహో! యీనూలు మార్దవము మిగుల విన్నాణముగా నున్నది! గ్రామాధికారులు దీని గుణమంతయు జెప్పలేకపోయిరి. ఈ నూలు మనుజులు చేతితోఁ జేసినదే? ఔరా! యంత్రమునైన నింత వింతగాఁ దీయుట దుర్ఘటము. ఇట్టి నూలునేసిన పుట్టంబులఁ గట్ట మా రాజుగా రెంత పుణ్యముఁ జేసిరో? యిట్టి విద్యాపాటవ మభ్యసించిన మీకు భగవంతుఁడు చిరాయు వొసంగెడుగాక యని యా వలువల శ్లాఘించుచుఁ బ్రయాణోన్ముఖుండై యున్న సేనానితో రాముఁ డిట్లనియె.

అయ్యా! మీ యేలికతోఁ జేలంబులనేత యెల్లుండి ప్రారంభింతుమని చెప్పుఁడు. తక్కిన గుణంబులు మీరు చూచినవేగదా. మీకు దోఁచినట్లు వక్కాణింపుఁడని యతని వీథిద్వారముదనుక సాగనంపి క్రమ్మర లోనికరిగి యా మగ్గంబు లొకమూలఁ బాఱవైచి యథాప్రకారము వినోదములతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి.

లోన రవులుచున్న మాతృదోషవిచారపరితాపము మొగమునం దోపనీయక దండనాథుఁడు సంతసించువానివలెనే రాజునగరి కరిగి తనరాక కెదురుచూచు నృపతికి మ్రొక్కి యావసనంబుల గురించి గ్రామాధికారులకన్న నధికముగా స్తుతిజేయుచుఁ జెప్పి తదనుమతి నింటి కరిగి యాచింత స్వాంతమునఁ దగిలి చివుకుచుండెను.

ఆభూపతి సేనాపతి మాటలు వినినది మొదలు రెట్టించిన వేడుకతో నెట్లో యొకనెల గడిపి యొకనాఁడు మంత్రిం జీరి దుర్బుద్ధీ! యీపాటికి మన పుట్టములనేత పూర్తియగును. నేతరీతి యెటులున్నదో నీవే వెళ్ళి స్వయముగా చూచివచ్చి నాతోఁ జెప్పుము. ఇతరులు చెప్పినచో నాకు నమ్మకముండదు. పూర్తిగా నేత కాకున్నను వస్త్రముల నిగ్గుతేలు. వేగ బోయిరమ్మని చెప్పుటయు రాజునాజ్ఞ శిరంబునం బూని మంత్రియు నుచితపరివారముతో వరప్రసాదులున్న గృహములకడ కరిగెను. ద్వారపాలకునిచే నతనిరాక విని యా కుమారులు నేయుసామగ్రి దూలమునకు వ్రేలాడఁగట్టి గోతిలోఁ గూర్చుండి యిటుదటు వట్టికండెల విసరుచు వ్రేలాడఁగట్టి ధట్టించుచు బట్టలు నేయువారివలె నభినయించుచుండిరి.

ఇంతలోఁ బ్రధాని లోపలకు వచ్చినంత రాముఁ డెదుర్కొని వినయ మభినయించి గద్దియం గూరుచుండఁబెట్టి యాగమనకారణం బడిగి తెలిసికొని నేతగాండ్రున్నతావునకుఁ తీసుకొనిపోయి యార్యా! సగమునేత యైనది. చూడుఁడు! ఇంక నొక్కమాసములోఁ బూర్తియగును. దండనాథుఁడు నూలు చూచినవాఁడు కాని నేత చూడలేదు. తమరు నేత చిత్తగింపుఁడు. తంతువుల మార్దవాదిగుణంబు లిదివరకే వినియుందురుకదా? దాని యథార్థము తమరుగూడఁ బరీక్షింపుఁడు. అందుమేల్కట్టు విమర్శింపుఁడు. అని చుట్టినదండ మూరక విప్పినట్టు విప్పి చూపించుటయు దానఁగాని మగ్గమునగాని తనకేమియు గాన్పింపకున్నతెరంగునకు నంతరంగమున వ్యాకులపడి వాని మాటలేమియుఁ బాటింపక అతం డిట్లు చింతించెను. అక్కటా! గ్రామాధికారులకు సేనానాయకులకుఁ గాన్పించిన నూలు నా కేమిటికిఁ గాన్పించదు. నా తల్లి జారిణియై సతీతిలకమని వాడుక చెందినది. ఎట్లో తెలియదు. ఆడవాండ్ర సుగుణములన్నియు నిట్లే కపటభూయిష్టములై యుండును. స్త్రీలలో పతివ్రతలు లేరని రూఢిగాఁ జెప్పఁగలను. పైకి మహాగుణమణులుగాఁ గాన్పించుచుఁ జాటున ననేకదుష్కృత్యములు చేయుచుందురు. శ్లో॥ "స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం దేవోనజానాతి కుతోమనుష్యః" అనునట్లు స్త్రీల చిత్తము భగవంతుఁడే యెఱుంగడట. మనుష్యున కెట్లు గోచరమగును. మంత్రినని పెద్దపేరు పెట్టుకొని గౌరవముగా సంచరించు నా గుట్టు బయలైనచో నన్నెవరు మన్నింతురు? రాజు సైతము నాపుట్టుక గురించి పరిహాసము సేయక మానునా? ఈ రహస్యము గోప్యముగానేయుంచి కాన్పించిన ట్టభినయించినచో నేకొరంతయుఁ గలుగకుండునని నిశ్చయించి చింతవిడచి యల్లన రామునితో నిట్లనియె.

కువిందాగ్రేసరా! నే ననేకవస్త్రంబులు చూచితినిగాని యింత వింతయైన నూలును మృదువైన పుట్టములును నెచ్చటను జూచియుండలేదు. గ్రామాధికారులు సేనానాయకుఁడు నుడివిన దానికన్న సొగసుగా నున్నవి. మాఱేఁడు చాల వేడుక పడుచున్నాఁడు. వేగఁ బూర్తిచేయుఁడు. మీకు బహుమతి నిప్పింతునని పలికి యతఁడు వెడలుతఱి రాముం డార్యా! అన్నిటికిని తమదేసుఁడి బాధ్యత. మా కేమి పారితోషిక మిప్పింతురో! కటాక్షముంచుఁడని మిగుల వేడుకొనువానివలె నభినయించుచు మంత్రిని సాగనంపి యతని యవివేకమునకు నవ్వుకొనుచు నట్టిపనులు మాని తమ కుత్సాహమైన వ్యాపారముతోఁ గాలక్షేపము చేయఁదొడంగిరి.

పిమ్మట మంత్రియు రాజసముఖమున కరిగి ఱేనికి మ్రొక్కి దేవతావస్త్రంబుల మహిమనంతయు గ్రామాధికారులును దండనాథుఁడును జేసిన వర్ణనకన్న నూరు మడంగు లధికముగా వర్ణించెను. అప్పుడు కానీనుఁ డావస్త్రంబులు ధరించుభాగ్య మెప్పు డబ్బునని గడియలు లెక్క పెట్టుచు నిమిషము యుగమువలె నానెల వెళ్ళించెను.

ఇంతలో వారు చెప్పిన యారుమాసములు బూర్తియైనవి. ఒకనాఁడు రాముడు ఉచితవేషముతో రాజసభకుఁ బోయి సన్మానము లంది రాజునకు మ్రొక్కునట్లు సభాసదులకు నమస్కరించుచు నిట్లనియె.

దేవా! దేవతావస్త్రములు సిద్ధమైనవి. వాని గుణంబు లిదివరకే మీరు విని యుందురు గదా? మరియు వాని ధరించుపద్ధతి మొదటనే మేము వక్కాణించితిమి . నేఁడు మంగళదివసము. ఊరేగి వచ్చి పుట్టంబులు దాల్చుఁడని చెప్పెను.

అప్పు డాఱేఁడు అపరిమితసంతోషము జెందుచు కువిందా! మీ రిట్టి విద్యాపాటవ మెచ్చట నేర్చుకొంటిరి. ప్రధానప్రముఖులు మీరు నేయుచున్న వస్త్రంబులు కడువిస్మయము గొలుపుచున్నవని స్తుతిసేసిరి. అందులకే వీని దేవతావస్త్రములని చెప్పుటకుఁ గారణమైనది. మీ దేశపుఱేఁడు వీనిని ధరించునాఁడు ఏమి చేయువాఁడో యెఱింగింపుడు. మేము నట్లే వచ్చి యవ్వలువల ధరింతుమని యున్మత్తుండువోలె నడిగిన మాటయే యడుగుచుఁ జెప్పిన మాటయే చెప్పుచు హృదయంబునఁగల సంతోషము వెల్లడింపుచుండెను.

అప్పుడు రాముఁడు దేవా! దేవతావస్త్రముల నేత మేము బహువర్షంబులు తపము జేసి నేర్చుకొంటిమి. దివ్యప్రభావసంపన్నములగు నీవస్త్రంబులు ధరించునాఁడు మాఱేఁడు దివ్యోత్సవములతో భద్రగజముపై భార్యతో నెక్కి యూరేఁగి వచ్చి బ్రాహ్మణులకు షోడసమహాదానములు గావింపుచు మా సభకువచ్చి మావలన నా పుట్టము లందుకొని మాకు గానుక లిచ్చి యాపుట్టంబుల దాల్చి వెండియు వేదండ మెక్కి యూరేగి యింటి కరుగుదురు . ఇవి దేవతావస్త్రంబులు గావున స్త్రీలకు నాఁడు పురుషదర్శనము దూష్యముగాదు. మా యేలిక కన్న దేవరవారు నూతనమార్గనిర్ణేతలు గావున నీవిభవ మధికముగాఁ గావింపఁదగునని చెప్పి యతం డాయెకిమీని యనుమతి వడసి యింటికిం బోయెను.

ఆ నరనాథుండును రాముని మాటలకు నుబ్బి యప్పుడు గ్రామమంతయు నలంకరింపుమని చాటింపించి పట్టణప్రజలెల్లరు నూరేగునప్పుడు తనతో నుండునట్లు నియమించి మంత్రిసామంతహితపురోహితాదివర్గము సేవింప శుభముహూర్తమున భద్రగజముపై నెక్కి తూర్యనాదములు భూనభోంతరాళము నిండ మెండువైభవముతో నూరేగి యా కపటకువిందులున్న మందిరద్వారము జేరెను.

అప్పుడు వరప్రసాదులు వచ్చి ప్రధానవర్గముతో రాజదంపతుల లోపలకుఁ దీసికొనిపోయి యుచితాసనములఁ గూర్చుండఁజేసి పెక్కుస్తోత్రములు గావింపుచు నెదురు నిలవంబడిరి. అప్పుడా యొడయఁడు తాను తెచ్చిన మణిభూషణాంబరములతో వారి కీయవలసిన విత్తమంతయు బంగారుపళ్ళెరముతో వారి కందిచ్చి యత్యుత్సాహముతో దేవతావస్త్రము లెందున్నవని యడిగెను.

అప్పు డారాముఁడు సంజ్ఞచేసినంత వసంతుఁ డొకపళ్ళెరము ప్రవరుఁ డొకపళ్ళెరము దండుఁ డొకపళ్ళెరము దెచ్చి రాజుముం దిడి ఇవిగో దేవతావస్త్రములు చూడుఁడని పలికిరి.

ఆ పళ్ళెరముల దన కేమియు గనంబడమి జెందం బాందోళనమంద నేమియు దోచక మేనం జమ్మటలు గ్రమ్మ దుఃఖావేశముతో నిట్లు తలంచెను .

అయ్యో! ఇట్టి వింతపుటంబుల జూచు భాగ్యము నాకు బట్టినదికాదు. మొదటనే నే నిట్టి కౌలటేయుడని తెలిసినచో నిట్టి పనికి బూనికొనకపోవుదునుగదా! మోసపోతిని; పదుగురిలో నవమానితుడ గాకుందునా? ఛీ! ఛీ! నాయట్టి మండలాధిపతిం గనిన యాడుది సైరిణిమయ్యెనా? ఏడంతఃపురములలో దాచిపెట్టినను రాజస్త్రీలు చెడుకార్యము లాచరింతురని వాడుకయున్నది. ఆ మాట యేల తప్పెడిని అన్నన్నా! గ్రామాధికారులు దండనాథుడు ప్రధానియు నీ చిత్రపుట్టంబుల గన్నులార జూచితిమని చెప్పిరి. వారి తల్లులకుగల నియమము నా తల్లికి లేకపోయినది. అక్కటా! యిప్పు డక్కపటాత్మురాలు బ్రతికియుండిన బొట్ట చీల్చి చంపకపోవుదునా? యిప్పు డీయదృశ్యవస్త్రంబుల గట్టుటెట్టొకో యని చింతాకులస్వాంతుడై యున్న యన్నరనాథునకు రాముం డిట్లనియె.

దేవా! యేమియుం బలుక కూరకుంటే రేల? పుట్టంబులు గాన్పింపలేదా? లేక సొంపుగానున్నవి కావా? గుణదోషనిరూపణము జేయుడు. తమరు ధరించు వలువ లివియే. ఎంత మృదువుగా నున్నవియో ముట్టిచూడుడు. అనుటయు రాజు తొందరపడి కాన్పింపలే దనబోయి యంతలో సవరించుకొని యట్టులన్నచో దనగుట్టు బయలగుటయేకాక ఫలమేమియు లేదని నిశ్చయించి నే నూరక యున్నందులకు గారణము మఱేమియు లేదు. బట్టలు గనంబడుచున్నవి. వీనిం జూచినతోడనే నాకొక్క విచారము గలిగినది. వినుండు. ఇట్టి వింతవస్త్రంబులు దాల్చి మా తల్లికి మ్రొక్కు బాగ్యము లేకపోయెగదా యని యామె గుఱించి చింతించుచుంటినని యుత్తరము చెప్పిన రాము డిట్లనియె.

దేవా! దేవర యిట్టి యుత్సాహసమయంబున నమ్మగారి గుఱించి చింతింపం బనిలేదు. ఆమె కడునిల్లాలని తమ కీదేవతావస్త్రములు గనంబడుటంజేసి తెల్లమగుచున్నది. వస్త్రములవిషయ మేమైన సంకోచ మున్నచో వక్కాణింపుడు. మేము చెప్పినంత యొప్పుగా నున్నవియో లేదో పరిశీలింపుడని వట్టిపళ్ళెరములో జేయిపెట్టి యిటు నటు తిరుగవేయుచు మీదున కెత్తి చూపించుటయు నాపుడమిఱేడు వచ్చియు రాని స్వరముతో నోహో నాయదృష్ట మేమి? యిట్టి యపురూపపు పుట్టంబుల గట్టు భాగ్యము గలిగినది. అమాత్యశేఖరా! యీ చిత్రపటంబులయంచు లెంత వింతగా నున్నవియో చూచితివా? ఇట్టి మృదువు భూలోకములో లేదుసుమీ! నడుమ నడుమ జరీపూవులు మెరయుచున్నవి. ఆయ్యారే! దుర్బుద్దీ! ఇవి నీకెట్లు కనబడుచున్నవో చెప్పుము. నీవు మొదట జూచినప్పుడు వీనికి సుందరసాంద్రత్వము లేదని దలంచెదను. ఇప్పటికి నప్పటికి భేద మేమైన నున్నదియా? యని సందియంబు దీర వెండియు నడిగిన నామంత్రియు వచ్చియు రాని స్వరముతో నిట్లనియె.

దేవా! దేనికైనను మెఱుగుపెట్టినప్పుడుగల తళుకు రచించునప్పుడు గలుగునా? నేను మొదట జూచినప్పటికన్న నిప్పు డీవస్త్రంబులు మిక్కిలి మనోహరములుగా నున్నయవి. ఈ సాంద్రత్వము, ఈ భావశ్యము అప్పు డింతవిన్నాణముగా లేదు. దేవర యనిన ట్లీయంచు మిక్కిలి చక్కగా నున్నయది. కాబట్టియే వీనికి దేవతావస్త్రములని పేరు వచ్చినది. వీని నమానుషములనుట కేమియు సందేహము లేదు. అపూర్వక్రియాకరణదక్షులై యున్న దేవరకిని తగియున్నవని యతండు మిక్కిలి స్తోత్రములు గావించెను. తరువాత నానృపతి సభ్యులంజూచి యివి యెట్లున్నవని యడగిన వారును దమ కం దేమియు గనబడకున్నను నది మాతృదోషముగా దలంచి కనంబడినట్లే యభినయించుచు వాని నెక్కుడుగా వినుతించిరి.

పిమ్మట రాజు భార్యతో, బోటీ! నీవు వీనిం జూచితివా? యెట్లు కనంబడుచున్నవో చెప్పుము. వీండ్రు మొదట మనతో చెప్పినంత సొగసుగా నున్నవియా యని యడిగిన నచ్చేడియ పరిశీలించునట్ల భినయించుచు నాత్మగతంబున అయ్యో! నాతల్లి యెంత దుష్టురాలో కదా! వీండ్రందఱికి గనంబడిన వస్త్రములు నా కేమిటికి గనంబడవు? ఆమె కట్టి చెడువాడుక యున్న ట్లెప్పుడు వినియుండలేదే! అయినను నాడువాండ్రు క్రూరులుగదా! అన్నన్నా! యిందరిలో నేనొక్కరితనే జారిణీపుత్రికనైతిని. అందఱు కనంబడుచున్నవనియే చెప్పుచున్నారు. ఇప్పుడు నేనుమాత్రము నిజముచెప్పి నాతల్లిని దిట్టింపనేల? కనంబడుచున్నవనియే బొంకెదను. అని తలంచుచు నా రాజపత్ని ధాత్రీశా! రాత్రిం పగలుగా మార్చిన మీప్రభావమే తాదృశంచే! ఇట్టిపుట్టంబులం గట్ట మీకుకాక యొరులకు శక్యమా? వీనిని దేవితావస్త్రములని చెప్పవచ్చునని పలికి యూరకున్నది.

ఇట్లు కొంతసేపు వాండ్రందఱు వస్త్రప్రభావంబు నగ్గించిన పిమ్మట రాముడు మొదట నియమించిన ప్రకారము వాని గైకొని కుచ్చిళ్ళు పెట్టున ట్లభినయించుచు రాజుగారిని నిలువబెట్టి కట్టుకొనియున్న వసనము విడదీసి యామాయావస్త్రము కట్టువానివలె చుట్టబెట్టుటయు దిగంబరుడై యుండ నెల్లరు చూచుచుండియు మాతృదోషమునం జేసి తన కొకనికే యట్లగుపడుచున్నదని ప్రతిమనుజుడు ననుకొనెనుగాని యారహస్య మొక్కనితోనైనను జెప్పినవాడులేడు.

భూపతియు దన దిగంబరత్వము మాతృదోషమునంబట్టి తన కొక్కనికే కాన్పించుచున్నదనుకొనెను గాని యెల్లరకు వెల్లడియగుచున్నదని తెలిసికొనినచో మిగుల సిగ్గుపడవలసివచ్చును. అట్లు తలచియు గొంతలజ్జ మనంబున బెనగొనుటయు బూర్ణముగా దలయెత్తలేక యిటునటు చూడదొడగెను. పిమ్మట నంతకుమున్ను నిరూపించియున్న యొక కాంతను రాజుభార్యకు జీర గట్ట నియమించుటయు నాబోటియు రాజవధూటిం జాటునకు గొనిపోయి మాయాపాటవంబు దేటపడ మున్ను ధరించియున్న కోక విడలాగి వరప్రసాదులు చేసినదానం గట్టుదానివలె నాలుగైదుసారులు పైకిని గ్రిందికిని ద్రిప్పి దిగంబరిగానే సభకు దోడ్కొని వచ్చినం జూచినవారెల్ల మునుగల్గిన యనుమానముతోనే పరక్తులై యుండిరి.

నృపతియు దనభార్య దిగంబరత్వము తనకొక్కనికే తేటయగుచున్నదని సమాధానపడి యూరికుండెను.

ఆమెయు నట్టే యెంచి తలపించి పలువిధముల జింతించుచుండెను. పిమ్మట నూరెగింపునకై యాదంపతు లలంకరించిన పట్టపుదంతి నెక్కి చుట్టును సకలపరివారములు సేవింప దూర్యనాదంబులు రోధోంతరాళంబు నిండ మెండువైభవంబున నూరేగుచుండ బౌరకాంత లావింత జూచుటకై యత్యాతురముతో సౌధోపరిభాగంబుల గవాక్షంబుల దలుపుదెరల చూచుటయు దిగంబరులై యున్న యాదంపతుల తెరంగున కంతరంగంబుల వేతెరంగుల బరితపించి సిగ్గున గవాటంబులు మూసుకొనిరి.

ఇట్లు విధిలేక యారాజు గొంతసే పూరేగి యంతటితో చాలించి యెల్లవారిని వారివారి నివాసంబుల కనిపి భార్యతో నంతఃపురంబున కరిగి కేళీతల్పంబున గూర్చుండి మెల్లన నిట్లనియె.

కాంతామణీ! నే నింతదనుక గుట్టుబట్టితిని గాని యిక నాపనోప వినుము. నాకన్నులకు నీవు గట్టుకొనిన చీరగాని నే ధరించిన వలువగాని కాన్పింపలేదు. నా యపకీర్తి వెల్లడియగునని యట్లంటిని గాని యది యథార్థము గాదు. నీవును చీర సొగసుగా నున్నదని పొగడితివి గదా! నీకు యథార్థముగా నది గనిపించినదా? మన యిరువురనడుమ మరుగు లేదుగదా యని యడుగుటయు నప్పడతియు గుట్టువిడచి మగనితో నిట్లనియె.

నాథా! మీరును, మంత్రియు మఱియు నున్నవారును నేసినవసనంబులం జూచి మిగుల స్తుతిచేయదొడంగిరి. నా కాపళ్ళెరమం దేమియు గాన్పింపకున్నను మీకు గోచరమైన తెరంగు తిలకించి నా మాతయందు బాతకం బారోపించి యాగుట్టు వెల్లడిచేయక యట్లంటిని గాని మీరును నేనును దిగంబరులమై యున్నట్లె నాకు గాన్పించినది. ఇదియ యథార్థము, అని యామె పలికినతోడనే యాఱేనికి లజ్జాక్రోధమ్ములు మనంబున నొక్కసారి యావిర్భవింప నప్పుడే వేరొక వలువంబు ధరించి యమాత్యుని రప్పించి యతనితో నిట్లనియె.

మంత్రీ! యా పట్టుపాలీలు పన్నినతంత్రంబు జూడ గడుగపటముగా దోచుచున్నయది. నీపు రెండుతేప లావలువల బరీక్షించితివిగదా? నిజముగా నీకవి గాన్పించినవేమో చెప్పుము! భయపడకుము. మా కేమియు నందు గాన్పింపలేదని తమస్థితిని జెప్పినతోడనే మంత్రియు నయ్యా! తమ రిట్లడిగినపుడు నిక్కము దాచరాదు. గ్రామాధికారులు సేనాపతియు దమకు గాన్పించెనని చెప్పినవిషయముల మనంబున దిలకించి యందేమియు నాకు గాన్పించకున్నను దత్ప్రభావంబున నట్లయ్యెనని మాతృదోషము స్థిరపరచి మొదట నట్లంటిని.తరువాత దేవరవారే కనబడినవని బొగడిన నేనును బొగడితిని. నాకంటి కేమియు గానబడలే దిదియ యథార్థము. పరువు లోపమగునని బొంకినతప్పు సైరింపుడని వేడుకొనియెను అప్పు డారాజు తలగంపించుచు నప్పుడు సేనాపతిని గ్రామాధికారులను మరియుం దనతో బట్టుసాలీల లోగిలిలోనికి వచ్చిన పెద్దమనుష్యులను బెక్కండ్ర బిలిపించి యా బట్టల విషయమై మంత్రి నడిగినట్లు వారి నడుగుటయు వారును నట్లె యుత్తరము జెప్పిరి. అప్పు డప్పతి ముప్పిరిగొను కోపంబున నా కపటపుపట్టుసాలీల బట్టితెండని యమదూతలంబోలు కింకరులం బనిచి తానును భార్యయు వస్త్రహీనులై యూరేగిన తెరం గంతరంగంబున దిలకించి యగ్గలమగు సిగ్గున దలవాల్చి పెక్కుగతుల జింతించుచుండెను.

రాజభటు లతిజవంబున నా కపటకువిందులున్న మందిరంబున కరిగి యందు సందడి యేమియు లేమింజేసి సందియమందుచు లోనికిబోయి చూడనెవ్వరును గాన్పించ లేదు. మఱియు నా శూన్యగృహము నలుమూలలు వెదుకగా నొకచో నొకపత్రిక దొరకినది. దానిం గైకొని వాండ్రు వెండియు నన్నరపతి యొద్దకుం జని యతనితో నిట్లనిరి.

దేవా! సంతతము నపూర్వవస్త్రదర్శనోత్సుకులగు పౌరుల కోలాహలముచే నాక్రాంతమైయుండు నాభవన మిప్పుడు శూన్యమై యున్నది. అం దెవ్వరును లేరు. వారి సామానుసైత మేమియు గాన్పింపలేదు. ఆ మాయావు లెచ్చటికో పారిపోయిరని తలంతుము. వెదక వెదక నొకమూల నీపత్రిక గనంబడినది. ఇది వాండ్రు వ్రాసినట్లే యున్నది చూడుండని పలుకుటయు విస్మయమందుచు మంత్రి దానిం గైకొని యెల్లరు విన నిట్లు చదివెను.

"మహారాజశ్రీ యపూర్వదుర్మార్గచర్యాభిలాషులైన
కానీన మహారాజుగారికి
కపటపు పట్టుసాలీలు వ్రాసిన యాజ్ఞ యేమనగా-

నీవు లోకవిరుద్ధమగు మార్పులజేసి ప్రజల బెక్కుతెరంగుల బాధించుచుంటివి గాన నిన్ను వంచించి యది మాన్పించుటకై యింద్రునిచే బంపబడిన దూతలమైన మేము నీ కిట్టి యవమానము గలుగజేసి యదృశ్యులమైతిమి. ఇకమీదనైన బుద్ధిగలిగి యట్టి విపరీతపుశాసనము మార్పుజేసికొని సుబుద్ధికి మరల మంత్రిత్వ మిచ్చి న్యాయంబుగ రాజ్యమేలుము. లేకున్న మాయాజ్ఞ తిరస్కరించినట్లు భావించి నిన్ను బెక్కుచిక్కులం బెట్టి రాజ్యభ్రష్టునిం జేయుదు మిదియ ముమ్మాటికిని యాజ్ఞ."

అని చదివినరాజు మిగుల భయపడి యోహో! మన మార్పు యింద్రునికి సైతము విరోధముగా నున్నదికాబోలు! త్రిలోకాధిపతియగు సురపతితో ద్వేషము బూని యెవ్వడు రాజ్యము చేయగలడు? ఇకజాలు నతనియాజ్ఞ శిరంబునం బూనదగినదే కనుక యిప్పుడ రాత్రి రాత్రిగా బగలు పగలుగా నెంచి వ్యాపారములు జేయ ప్రజల కాజ్ఞాపత్రికలు వ్రాయుడని మంత్రి కాజ్ఞాపించి యప్పుడ సుబుద్ధిని బిలువనంపి యతని యిష్టానుసారముగ మునువోలె రాజ్యం బేలుచు సుఖంబుండెను.

అని యెఱిగించి మణిసిద్ధుడు గోపాలా! యిప్పుడు చల్లబడినది. నడువవలసిన సమయ మయినది కనుక కావడి యెత్తుము. తదనంతర కథావృత్తాంతము పెద్దదిగ నున్నది ఇప్పుడు తేలదు. రాత్రి మజిలీలో బూర్తిగా జెప్పెద ననుటయు నక్కథాశేషము వినుటకు మిగుల దొందరగలవాడై వాడు లేచి కావడి యెత్తుకొని నడువసాగెను. యతీంద్రుండు మౌనం బవలంబించి ప్రణవాక్షరజపము జేసికొనుచు విశ్వేశ్వరాయత్తచిత్తుండై నడవ దొడంగెను. అట్లు వారతిజవంబున నడుచుచు సాయంకాలపుమజిలీ చేరిరి. అందొకసత్రంబున భోజనాదిసాయంకాలకృత్యములు నిర్వర్తించిన పిమ్మట నమ్మణిసిద్ధు డొకపరిశుద్ధప్రదేశంబునం గూర్చుండి శ్రద్ధాళుండై యున్న శిష్యునకు దరువాయికథ చెప్పఁదొడంగెను.