కాశీమజిలీకథలు/మొదటి భాగము/పదియవ మజిలీ

వికీసోర్స్ నుండి

పదియవ మజిలీ

సోమశర్మ కథ

పదియవ మజిలీ, యొక రాజధానిగానున్నది. వారిరువురు నతి విశాలంబగు నా పట్టణపువీథిం బడి బోవుచుండ నొకచోట నడివీథిలో నినుపకంబమున నొక బ్రాహ్మణుఁడు నిలబడియున్నట్టు కనబడినది. వానింజూచి యాగోపాలుఁడు మణిసిద్ధునిఁ బైకి నడువనీయక యడ్డము వచ్చి స్వామీ! దీని మీరు చూచితిరా! మిక్కిలి పొడవుగానున్న యా యుక్కుకంబముపై నిలఁబడిన బ్రాహ్మణుఁ డెవ్వఁడు! కదలక యీ పట్టణపు వింతలఁ జూచుచున్నాడా యేమి? ఈతని వృత్తాంత మెఱింగింపుఁడనిన నమ్మణిసిద్ధుఁడును పైకిఁ దలయెత్తి నిరూపించి చూచి యోరీ! దీనిపై నున్నవాఁడు నిజమయిన బ్రాహ్మణుఁడు గాడుసుమీ! అదియొక పోతవిగ్రహము. దాని కథ భోజనంబైనవెనుక జెప్పెదనులే యని పలికి నడువఁబోయిన వాఁడు మణిసిద్ధుని పాదంబులంబడి అయ్యా! గమనాయాసము వాయువఱకు మీ చరణంబు లొత్తెదను. ఇచ్చటఁ గూర్చుండి నాకు దీని వృత్తాంతము జెప్పుఁడు. విన మిగుల వేడుకగా నున్నది. అని నిర్బంధించిన నయ్యతిపతి వాని యాసక్తికి మెచ్చుకొని యచ్చటనే యొకచోట గూర్చుండి తనయొద్ద నున్న మణిప్రభావమున దాని వృత్తాంతమంతయుఁ దెలిసికొని వానికిట్లని చెప్పదొడంగెను.

కొండపల్లి యను నగ్రహారంబున సోమశర్మయను బ్రాహ్మణుఁడు గలడు. అతడు మిగుల దరిద్రుఁడు. ఎన్ని వ్యాపారములు చేసినను నొకకాసై నను లభించినది కాదు. అతం డొక్కనాఁడు భార్యతో నిట్లనియె బోటీ ! మన యిరుగుపొరుగుననున్న భాగ్యవంతులఁ జూడ జూడ నాకెంతయు విచారముగానున్నది. వారు భార్యలతోఁ గూడి హంసతూలికాతల్పంబుల గాజుదీపపుకాంతులు ధవళకుడ్యకాంతులతో మేలమాడఁ గ్రీడింపుచుందురు.

నీవు చూడ నెప్పుడును మాసినగుడ్డలే కట్టుకొనుచుఁ దలదువ్వుకొనక యసహ్యముగా నుందువు. మన యిల్లుజూడ పేడతో దుక్కుతో నిండియుండును. ప్రొద్దు గ్రుంకినంత కొంచెము సేపైన దీపముంచవు. చీకటిలోఁ గన్నులుగానక నల్లులు గుట్టుచుండ నులకమంచముం బరుందుము. మనకును వారికిని మిగుల దారతమ్యము గలదు. వారు భగవంతునికి బంధువులును మనము విరోధులమా? మనకు మాత్ర మట్టి యైశ్వర్యము లుండరాదా? ఇట్టి దరిద్రపుబ్రతుకు బ్రతుకుటకంటె జచ్చుటయే మేలు. ఇంతకును కారణురాలవు నీవు. ఏమనిన బురుషునికి భార్యమూలముగా నైశ్వర్యము పట్టును. దరిద్రముగూడ దానిమూలముననే వచ్చును. దీనికి దృష్టాంతరముగా నొక కథ చెప్పెద వినుము.

పూర్వము విక్రమార్కుండును భట్టియు దేశసంచారము చేయుచుండ నొక యడవిలో నిసుకమీఁద సాముద్రికశాస్త్రలక్షితములైన రేఖలతో నొప్పుచున్న పాదచిహ్నములు గనంబడినవి. వానింజూచి విక్రమార్కుఁడు భట్టితో నీపాదచిహ్నములం చూచితివా! వీనిఁచూడ నీమార్గంబున మనకన్న నధికుడగు మహారాజు నడచినట్లు తోచుచున్నది. వేగనడువుము. మనకు దాపుననే యుండవచ్చును. అతండెవ్వడో చూతమని పలికిన భట్టి యిట్లనియె.

రాజా! యీ యడుగులప్రక్కను పడతి యడుగులుగూడ గనంబడుచున్నవి. చూచితివా? వీరి చిహ్నములు చూడ నైశ్వర్యము గలవారి పాదచిహ్నమువలెఁ గనఁబడవు. శ్రమపడి నడచునట్లు తోచుచున్నది. అయినను పోయిచూతము పదుఁడని పలికిన యిద్దరును వేగముగా నడచిరి. ఆ యడుగుజూడంబట్టి పోవఁబోవ నొక పల్లెటూరు గనంబడినది. ఆ యూరిలో నొక యరుగుమీద నాయడుగులవారు పండుకొనియుండిరి. వా రొకబ్రాహ్మణదంపతులు. మిగుల దరిద్రులు. వారిం జూచి విక్రమార్కుండును భట్టియు మిగుల వెరగుపడుచు నా బ్రాహ్మణుని లేపి అయ్యా! తమ కాపుర మేయూరు? ఇచ్చట కేమిటికి వచ్చితిరి? మీ స్థితిగతు లెట్టివని యడిగిరి.

ఆ బ్రాహ్మణుఁడు లేచి వారితో మిట్లనియే ఆయ్యా! మాది రాయవరము. నేను బ్రాహ్మణుఁడను. ఈ చిన్నది నా భార్య. బాల్యంబుననే దీని నాకుఁ బెండ్లి జేసిరి. నాకు జ్ఞానము వచ్చినది మొదలు దరిద్రమే బాధింపుచున్నది. ఎన్ని యుపాయములచేత నైనను నింటియొద్ద జీవనోపాధి కుదిరినదికాదు. ఎందైన నుదరపోషణమగునేమోయని భార్యతో నిల్లువిడిచి యిట్లువచ్చితిని. మీరు మిగుల మంచివారిగ గనిపించుచున్నారు. మాకు మిగుల నాకలిగానున్నది. ఈపూటకింత భోజనసదుపాయము చేయుదురా? యని యడిగెను. అప్పుడు భట్టియు విక్రమార్కుండును నతని దరిద్రమునకు భార్యయేగదా! హేతువని యూహించి యామె యవలక్షణము లన్నియు బరీక్షించి యందలి యథార్థము దెలియఁగోరి యతని కిట్లనియె.

బ్రాహ్మణుఁడా! యెంత దరిద్రము వచ్చినను నాడుదాని నిల్లు గదుపుదురా? పాపము ఈ చిన్నది మీతో మార్గక్లేశ మనుభవింపుచుఁ దిరుగుచుండెనే! కటకటా! ఆమె మొగమెట్లు వాడిపోయినదో చూడుడు ఇప్పుడైనను మేము చెప్పునట్టు చేయుము. ఆమె భోజనము నిమిత్తము కొంత సొమ్మిత్తుము. దానితో నీబిడ నింటికి బంపుము. నీవు మాతో రమ్ము. నీకు యెద్దియేని వ్యాపారమున ధనము కొరకు నుపాయము చూపింతుమనుటయు నతం డందులకు సంతసించుచు వారికిట్లనియె. అయ్యలారా! మీరు పుణ్యాత్ములు, ఇంటివద్ద నెట్లును గడవమి దీని వెంటబెట్టుకొని త్రిప్పుచుంటిని.ఇంటియొద్ద దిక్కెవ్వరును లేరు. దీని కెద్దియేని యాధారము చూపించినచో నింటికనిపెదను. నేను మీతో వచ్చి మీరు చెప్పిన పనిని జేయుదు. అట్లనుగ్రహింపుఁడని వేడుకొనుటయు వారు అందులకు మీభార్య కిష్టమున్నదియో లేదో యడుగుమనిన నతండా మాట చెప్పిన నాబిడ సంతోషముతోనే యెప్పుకొనెను. విక్రమార్కుండు భట్టియు నా బ్రాహ్మణుని భార్యకుఁ గోరినంత ధనమిచ్చి యిచ్చవచ్చినచోటునకుఁ బొమ్మని చెప్పి యతనిఁ దనవెంటఁ దీసికొని యుజ్జయినీపురమున కరిగిరి.

అందు వారా బ్రాహ్మణునికి వేరొక్క చక్కని కన్యకం బెండ్లిచేసి యాచిన్నది కాపురమునకు వచ్చినతోడనే మున్ను తాముంచిన నగలన్నియు మరల బుచ్చుకొని కట్టుగుడ్డలతో నా దంపతుల నెక్కడికేని బొండని విడిచివేసిరి. ఆ దంపతులు ఉజ్జయనీపురము విడిచి మధ్యాహ్నమున కొక యగ్రహారము జేరిరి. విక్రమార్కుండు భట్టియు నతని యదృష్టమును బరీక్షింపఁ బ్రచ్ఛన్నముగా వారివెంట నరుగుచండిరి.

అట్లామిథున మా యగ్రహారమున నెవ్వని యింటికిఁబోక యొక గృహస్థుని వీథి యరుగుమీఁద నిలువంబడెను. వారుచేరిన యొక నిముషమునకే నాలుగు దినముల నుండి ప్రసవము కానేరక నొప్పులు పడుచున్న యా గృహస్థుని భార్య సులభముగ నీళ్ళాడెను. అదిచూచి యజమానుఁడు మిగుల సంతసించుచు నాదంపతులు వచ్చుట చేతనే తనకా శుభము గలిగినదని నిశ్చయించి వారికి మిగుల మర్యాదజేసి పిండివంటలతో భోజనముపెట్టి చీనాంబరములు గట్ట నిచ్చుటయేగాక వారి రాక శుభప్రదమని యూరంతయుఁ జాటించెను

ఆ వార్తవిని యా యూరనే వేరొక గృహస్థుని భార్యయు నట్టి చిక్కునే పొందియుండ నాయజమానుఁడు నాదంపతులను పల్లకీమీద నూరేగింపుచుఁ దన యింటికిఁ దీసికొనిపోయెను, వారి పాదమెట్టిదో కాని వా రిల్లుచేరిన వెంటనే ఆ యిల్లాలును సుపుత్రునిం గనినది, అప్పుడా యజమానుఁడు పట్టరాని వేడుకతో నాదంపతులను బార్వతీపరమేశ్వరులని భావించి విచిత్ర భూషాంబరములతో నలంకరించి పూజింపుచుఁ గొన్నిదినములు తనయింట నుంచుకొనెను.

క్రమంబున వారిఖ్యాతి జగద్విదితమైనది. ఎవరి కేచిక్కులు తటస్థించినను వారిం తీసికొనిపోయిన తక్షణమే నివారణమగుచుండెను. వారి నొక్క పూటకన్న నెక్కడను నిలువనీయక పల్లకీలఁబంపి యుత్సవములు చేయుఁచుదీసికొని పోవు చుందురు వారికిచ్చు ధనమునకు నగలకును బట్టలకును మితిచెప్పుటకు వీలులేదు. వారిస్థితి నిత్యకళ్యాణము పచ్చతోరణముగా నున్నది. వారి దర్శనమునకై యనేకగ్రామములనుండి జనులు వచ్చి వేచియుందురు. ఈరీతి గొన్నిదినములు దేవతావైభవములు జరిగినంత నొక్కనాఁడు పల్లకి యెక్కి యూరేగుచు నొకయూరినుండి యొకపట్టణమునకుఁ బోవుచుండ నొకయేనుఁగు వచ్చి యావిప్రుని మెడయందుఁ బూవులదండవైచి బంగారుకలశముతో నుదక మభిషేకము చేసినది.

పుత్రశూన్యుఁడగు రాజు చనిపోయినప్పుడు ఏనుఁగచే వరింపఁబడినవానినే రాజుగాఁ జేసిగొనుట యాదేశసాంప్రదాయకము గాన నచ్చటి ప్రజలెల్ల నాబ్రాహ్మణునే రాజుగాఁ భావించి శుభముహూర్తమున బట్టాభిషేకము జేసిరి. అదియంతయుఁ బ్రచ్ఛన్నముగానుండి చూచుచున్న భట్టివిక్రమార్కులు పురుషుని భాగ్యము స్త్రీమూలముగనే కలుగునని నిశ్చయించిరి. అతండు తమకన్న గొప్పరాజు గావున వినయముతో నతనియొద్దకుఁబోయి చేసిన విధానమంతయఁ దెలియఁజేయుటయు నాబ్రాహ్మణుఁడు మిగుల సంతసించుచు గృతజ్ఞత సూపుచు వారిఁ బెక్కుగతులఁ బూజించెను.

భట్టివిక్రమార్కులును తమచేసిన కృత్యము ఫలించెనని సంతసించి తమ దేశమున కరిగిరి. కావున నాతీ! నీతోఁ గొన్నిదినములు విడిపోయి నేను దేశాంతర మరిగి ధనము సంపాదించుకొనివచ్చెదను. నాకు దారిభత్యమేమైన నిమ్మని సోమశర్మ భార్య నడిగెను.

అప్పు డామె యేమియు లేక తెల్లబోయి చూచుచు నామాట మెల్లన జెప్పినది. సోమశర్మ భార్య నాక్షేపించుచు నీ మెడనున్న మంగళసూత్ర మమ్మి యఱిసెలు వండి యిమ్ము. నేను ధనము సంపాదించుకొనివచ్చి నీ మేనంతయు బంగారము జేసెదనని చెప్పెను. ఆ పతివ్రత మగనిమాట దాటక యప్పుడే తన మెడనున్న మంగళసూత్ర మమ్మి బెల్లము పిండియు నూనెయుఁ దెచ్చి యాలకులు, జాజికాయ, జాపత్రి మొదలగు వస్తువులు కొన్ని తెచ్చుట మరచి వాని దెచ్చుటకు గ్రమ్మర నంగడి కరిగి యా వస్తువు లిమ్మని యడిగెను. అప్పుడు కొంచెము చీకటి సమయము గాన నాకోమటి సందడిలో నందు జాజికాయకుఁ బదులుగా వసనాభిదుంప నిచ్చెను.

ఆ యిల్లాలు తెలియక దానిం గొనిపోయి నూరి పిండితోఁ గలిపి పెద్దవిగా నిరువదినాలుగఱిసెలను వండినది. వానిలో నొకటియైనను దానుదినక మూటఁగట్టి తెల్లవారుజామున నరుగునప్పుడు మగని కందించెను. ఆతం డామూట దీసికొని యూరువెడలి యడవిమార్గంబునం బడి జాముప్రొదెక్కువరకు నడిచెను. అందొక చెరువు గనంబడినంత నందు స్నానముచేసి యాయఱిసెలం దినఁదలంచి యామూట చెట్టుకొమ్మకుఁ దగిల్చి గుంటలో స్నానము చేయుచుండెను. ఇంతలో నిరువదినలుగురుదొంగలు విచ్చుకత్తులతో పారాలిచ్చుచు గాడిదెలమీఁదఁ బెక్కుధనమును తీసికొని వచ్చి యాచెఱువుగట్టుననున్న మఱ్ఱిచెట్టుక్రింద ధనమంతయు రాశిగాఁబోసి మిగుల నాకలిగా నుండుటచే నీరైనంద్రాగి యాకలి నడగించుకొనఁదలంచి గుంటలోనికిఁ బోయిరి.

సోమశర్మ యంతకుమున్నే వారిఁజూచి దొంగలని నిశ్చయించియు ధైర్యము విడువక వారి సంఖ్యదెలసికొని ముక్కు బట్టుకొని కన్నులుమూసికొని జపము చేయు చుండెను. ఆ దొంగ లతనిం జూచి యరచుచుఁ గత్తులందెచ్చి నరకబోయిరి. అందుల కతండు కొంచెమైనను జడియక యోబాబులారా! యూరక నన్నేల చంపెదరు ? నేను జ్యోతిష్కుఁడను. మీరిచ్చటికి వత్తురనియు నాకలి గలిగియుందు రనియుఁ దెలిసికొని లెక్కబెట్టి మీరుఁ దిన సరిపడిన యరిసెలం దెచ్చితిని. మీరాక కెదురుచూచుచుంటిని అదిగో అఱిసెలమూట నా చెట్టుకొమ్మం దగిలించితి జూచుకొనుఁడని పలికిన నందొకఁడు ఆమూటనువిప్పి చూచిన నం దిరువదినాలుగే అఱిసెలున్నవి. వానింజూచి యతని దైవజ్ఞత్వమున కాదొంగలు ఆశ్చర్యపడుచు నతని జంపక బహుమానము జేయఁదలఁచి యతని దమ గురువుగా నుండుమని చెప్పిరి. పిమ్మట నాదొంగలందరు నాచెఱువులో స్నానము చేసి కత్తులన్నియుఁ బ్రోగుగాఁ బెట్టి యాబ్రాహ్మణుఁడు తెచ్చిన యఱిసెల నిరువద నలుగురు వంత ప్రకారం దిని నీరు త్రాగి యాబ్రాహ్మణుఁడనే కాపుంచి యాచెట్టుక్రిందఁ పండుకొని నిద్రపోయిరి. అంత నాయఱిసెలలోనున్న విషము తలకెక్కి యాదొంగలందరు నిద్రలోనే ప్రాణములు విడిచిరి. వారి చావు సోమశర్మ కొంత సేపటికిఁ దెలిసికొని మితిలేని సంతోషముతో మనంబున నిట్లు తలపోసెను.

ఆహా! వీరందరు నేను బెట్టిన యఱిసెల మూలముగానే మృతిబొందిరి. ఈ యఱిసెలలో రాత్రి నాభార్య ప్రమాదమున నాభికూడ గలిపినది కాఁబోలు. దైవము నాకీతీరున ద్రవ్యము గూర్చెను. లోకంబంతయు దైవము చేతిలోనున్నది. పురుషకారం బేమియుం బనికిరాదు. ఒక్కప్పుడెంత ప్రయత్నము చేసినను గాసైన లభింపదు వేరొకప్పు డూరకయే పెక్కు ద్రవ్యలాభము కలుగును. నాకు దై వాయత్తముగా నిప్పుడు గొప్పద్రవ్యము దొరకినది. దీనినెట్లు మోసికొనిపోవుదును? పోని, మోసినంత దీసికొని పోదమనిన నిందున్నదానికై చింతగానుండును. ఎవ్వరినైనను సహాయము దీసికొని వత్తమన్న భాగమును గోరుదురు. ఏమి చేయుటకును దోచకున్నది. ఇదియునుం గాక యీ ధనమంతయుం జూడ నొక మహారాజుగారిదిగా నున్నది. ఇందుఁ బెక్కురత్న మండనములు గలిగియున్నవి. వారికిఁ దెలిసినచో నాపనిపట్టక మానరు అని పెక్కు తెరంగులఁ జింతించుచు నొకకత్తిచే నాదొంగల యంగంబులన్నియు ముక్కలుగా నరికి రాశిగాఁజేసి యాధనరాశి చుట్టును దిరుగుచు నేమిచేయుటకుఁ దోచక చింతించుచుండెను.

ఇంతలోఁ గొందఱు రాజభటు లాదొంగల వెదకుచు నాచెఱువునొద్దకువచ్చిరి. వారిఁ జూచి సోమశర్మ కొంచెము భయముజెంది యంతలో దనకు భగవంతుఁడిచ్చిన బుద్ధిబలముచేత ధైర్యము తెచ్చుకొని కత్తిచేతిఁ బూని పహరా యిచ్చువానివలె నాధనరాశి చుట్టును దిరుగుచుండెను. రాజకింకరులు రాజుగారి ధనమును చెట్టుక్రింద జూచి యానవాలుపట్టి సంతోషము జెందుచు సోమశర్మను సమీపముగాఁబోయి నీవెవ్వఁడవు? ఈ ధనంబేటికి దెచ్చితివని యడిగిన సోమశర్మయు మరల మీరెవ్వరు? మీరిచ్చటి కేల వచ్చితిరి అని యడిగెను.

ఆ మాటలువిని రాజభటుల సోమశర్మతో మేము భూరిశ్రవుఁడను రాజ కింకరులము. ఈ ధనము మా రాజుగారిది. మొన్నఁ గోటలో దొంగలుపడి దోచుకొని వచ్చిరి. వారిం బట్టుకొనుటకై వచ్చితిమి. దొంగలేమైరి. నీవీ ధనము నేటికిఁ గాచుచుంటివి. నిజము చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

నేను సోమశర్మయను బ్రాహ్మంణుడను. నాకు దైవబలము గలిగియున్నది. భూతభవిష్యద్వర్తమానముల యందు జరుగుజర్యల జెప్పఁగలను. భూరిశ్రవునికోట దొంగలు దోచుకొనియెదరని తెలిసియే నిచ్చటికి వచ్చితిని నేను వచ్చువఱకు నీ ధనము దొంగలు పంచుకొనుచున్నారు. వారితో యుద్ధముచేసి కత్తులచే వాండ్రమేనులు తుత్తునుములు గావించి చంపితిని. అదిగో వారి శరీరఖండములు చూడుడు. మీ రందరు నశ్రద్ధగా నుండఁబట్టిగదా, దొంగలు కోటలోబడిరి? నేను రక్షింపనిచో నీపాటికి దొంగ లీధనమును బంచుకొనిపోవుదురు. దీనిని మిమ్ములను దీసికొనిపోనియ్యను. పోపొండు ఈ సంగతి మీ రాజుగారితోఁ జెప్పియిచ్చటికిఁ దీసికొనిరండు అని గద్దిరించి పలికిన దూతలు భీతిజెంది యతని తిరస్కరింపనేరక యతివేగముగాఁ బోయి యాచర్య యంతయు భూరిశ్రువున కెఱింగించిరి.

అతండు మిగుల సంతసించుచు బెక్కుసైన్యముతో నప్పుడే యయ్యరణ్యములోని కరిగి యాధనరాశి చుట్టును పహరా యిచ్చుచున్న సోమశర్మను చూచి నమస్కరించి యిట్లనియె. అయ్యా, తమరెవరు ! యిచ్చటి కెట్లు వచ్చితిరి? యిరువదినలుగుర దొంగలనెట్లు జంపితిరి? నాయందు మీకీ యనుగ్రహ మెట్లుగలిగినది? చెప్పుడని యడిగిన నతండు ధైర్యముతో నిట్లనియె.

దేవా! నా మహిమ నేనే చెప్పుకొనుటనేటికి? క్రియచేఁ దెలియదా? అదిగో నరకబడిన దొంగల యవయవముల జూడుఁడు. ఇదిగో వారి కత్తులు. యిరువదు నలుగురను వధించితిని. మీకు వర్తమానము చేయుదమని యూహించినంతలో మీ భటు లిచ్చటికే వచ్చిరి. ఇంత పనికిమాలిన పరిచారకులఁ గూర్చుకొంటి వేటికి ? క్షణము దాటినచో నంత ద్రవ్యము వృథాగాఁ బోవుఁనుగదా? యిప్పు డొకనల్లపూస యేని పోయినదేమో చూచుకొమ్మని పలికిన నాభూరిశ్రవుఁడు సంతోషము జెంది యా బ్రాహ్మణునిఁ గౌఁగలించుకొని మిత్రుఁడా? నీ కతంబున నా పరువు నిలిచినది. నీవు చేసిన మేలెన్నటికిని మరువను, నీవు నాయొద్దనుండుము. నీ కెద్దియేని వరమిచ్చెదఁ గోరికొమ్మని పలికిన నా సోమశర్మయు రాజా! నీయొద్దనున్న సేన ఆరులక్షలని తెలిసినది. ఇంతమంది యుండినను నీ కోట దోపుడు మానినదికాదు. వాండ్రకు వృధాగా జీతములియ్యనేటికి? వారిలో రెండులక్షల జనమును దగ్గించి వారి జీతములు నా కిమ్ము ఇదే నా కోరిక యని చెప్పిన నతం డప్పుడే యట్టి సైన్యమును తగ్గించి యావేతనము సోమశర్మకు నిచ్చునట్లాజ్ఞ చేసెను.

పిమ్మట నారాజు నాధనమంతయు బండ్లమీద నెక్కించికొని సోమశర్మతోఁ గోటలోని కరిగెను. సోమశర్మయుఁ బురికరిగిన వెనుక రాజుగారిచే నియ్యబడిన సౌధంబున బసజేసి యచ్చటికి భార్యను రప్పించి తాను మొదట చెప్పిన ప్రకారము ఆమె మేనంతయు బంగారుమయము గావించెను.

రాజుగారి దివాణములోనున్న యుద్యోగస్తుల కందరికి సోమశర్మయం దసూయ గలిగియున్నను నేమియుఁ జేయలేకపోయిరి. రాజుచేఁ దగ్గించబడిన రెండులక్షల సైన్యము అతనికి శత్రువుగానున్న వేరొక్కరాజు నాశ్రయించిరి. ఇట్లుండ నంత నొక్కనాఁడు ఆ గ్రామమునకు రాత్రులయం దొక సింహము వచ్చుచు మనుష్యులను పక్షులను మృగములను భక్షింపఁ దొడంగెను. దానికి భయపడి గ్రామస్థులెల్లరు వచ్చి రాజుతో మొరబెట్టుకొనిరి.

అప్పుడు రాజు మంత్రితో నాసింహమును వధించు యోధుల నియమింపుమని చెప్పెను. మంత్రియు సోమశర్మయందుఁగల క్రౌర్యమును దీర్చుకొన సమయము వచ్చినదిగదా! యని యూహించి యతనితో నిట్లనియె. మనయొద్ద సేన తక్కువగా నున్నది. బలము గలిగిన యోధులను తగ్గించిరి. సాధారణుండుండినను నేమి ప్రయోజనము. ఇంతకు మన వైదికబ్రాహ్మణుఁడే సమర్థుడు బలశాలి. అతనినే నియోగింపుడని చెప్పిన నామాటలు విని రాజు అప్పుడే సోమశర్మను బిలిపించి పంచాననమును వధింపుమని యాజ్ఞాపించెను.

సోమశర్మయు నతనియాజ్ఞ శిరంబునంబూని వీరాలాపములు పలుకుచు గొంచ మైనను జంకులేక తన్ను దైవమే రక్షించునను ధైర్యముతో నింటికరిగి పెందలకడ భోజనముచేసి పూర్వము దొంగల కత్తులు తనయింటనే దాచియుంచెను. కావున నా కత్తు దిరువదినాలుగును కట్టకట్టి యురిబైటికిఁ దీసికొనిపోయి క్రమంబున నవియన్నియు నాప్రాంతమందున్న యొక్క పెద్దతాళవృక్షముపైకి జేర్చెను. అతఁడు ఆ త్రాటిచెట్టు చిట్టచివరఁ గూర్చుండి సింహము రాక కెదురు చూచుచున్నంత రాత్రి నాహర్యక్ష మక్షీణజవంబులో వచ్చి బొబ్బలిడుచు నోరు తెరచుచుఁ దోకయాడించుచుఁ గనఁబడిన జీవమునెల్ల భక్షింపుచు గంతులు వైచుచుండ జెట్టుమీఁదనుండి సోమశర్మ దాసిముండా యిటురమ్మని పెద్ద కేకలువైచెను.

ఆధ్వని జాడఁబట్టివచ్చి యాకేసరి తాటిచెట్టునిట్టట్టు కదలరాయుచు నోరు దెరచుకొని యహంకారముతో బై కెగర జొచ్చెను. అప్పుడు సోమశర్మ యది నోరు దెరచి యెగిరినప్పుడెల్ల నొక్కకత్తి దాని నోటిలోనికి జారవిడుచుచుండెను. అదియుఁ గోపముతో నాతడు విడిచిన కత్తులన్నియు గ్రమంబున మ్రింగివైచెను. దానంజేసి కడుపులోనున్న ప్రేగులన్నియు దెగి నెలవుల రక్తంబుగార యూపిరివిడువ దెరిపి లేక కొంచెముసేపులోనే తన్నుకొనుచు నేలంబడి చచ్చెను. దానిచావు చాలసేపు నిదానించిచూచి బాగుగ నమ్మకము దోచిన వెనుక సోమశర్మ చెట్టుదిగి యొకకత్తి చేత దాని యవయవములన్నియు ముక్కలుక్రింద నరికి రాసిగాజేసి దాని రక్తమంతయు మొగమునకు శరీరమునకుఁ బూసికొని భయంకరాకారముతో నారాశిచుట్టును గత్తిబూని దిరుగుచుండెను.

ఇంతలో దెల్లవారుటచే జనులందరువచ్చి చచ్చిన సింగము నంగములుజూచి సోమశర్మ పరాక్రమమునుఁ వేతెఱంగుల వినుతించుచుఁ గొందరుపోయి రాజుగారితోఁ జెప్పగా నారేఁడు సకలసామంతమంత్రిపౌరపరివార సహితముగా సోమశర్మ యున్న తావునకు వచ్చి చచ్చియున్న సింహమునుజాచి మిగుల నాశ్చర్యమందుచు సంభ్రమముజెంది యతనిం గౌఁగలించుకొని యత్యాదరముతో నిట్లనియె.

ఆర్యా! నీభుజపరాక్రమ మమానుషమై యున్నది. అసహాయశూరుండవనిన నిన్నే యనవలయును. నీవు చేసినపని నాకెంతయు సంతసము గూర్చుచున్నది. నీ యభీష్టమెద్దియో తెలుపుము. ఇప్పుడే యిచ్చెదనని పలికిన సంతసించి సోమశర్మ యిట్లనియె. రాజా నీకు నష్టమైన కోరికలు నేనేమియు గోరను. ఇప్పుడు మన సంస్థానములో నూరక జీతములు తినుచుఁ బనిబాటలులేక తెగబలిసి నాలుగు లక్షల సైన్యమున్నది. వానిలో రెండు లక్షలపౌజులు తగ్గించి యాజీతములు నాకే యియ్యవలయును. ఇదియే నాకోరిక అని యడిగిన నారాజు మంత్రి యెన్ని విధముల వలదని చెప్పినను వినక యప్పుడే యాసేనను తగ్గించి యాజీతములు సోమశర్మకు నిచ్చు నట్లు నియమించెను.

సోమశర్మయు, నాసింహపుచర్మమును కత్తులను నొకపెట్టెలోఁ బెట్టి రహస్యముగాఁ దనయింటఁ దాచియుంచెను. సోమశర్మపై మునుపటికంటె రాజుగారికెక్కువ ప్రీతిగలిగియుండెను. సర్వకార్యములతని మీఁదుగనే నడపుచుండెను. మంత్రి మొదలగు నుద్యోగస్థులకు నతనియందు మఱియు నీర్ష్యప్రబలియు చుండెను.

భూరిశ్రవునిచేఁ దగ్గింపఁబడిన రెండులక్షల సేనయు నీరాజునం దసూయజెంది యతనికిఁ శత్రుఁడైన రాజునాశ్రయించెను. దానంజేసి యారాజు తనకు మునుపున్న యారులక్షల సైన్యము నిప్పుడు రెండుసారులు చేరి నాలుగు లక్షల సైన్యముగలసి పదిలక్షల సేనగలవాఁడై యుండెను. అప్పుడు భూరిశ్రవునొద్దనుండి వచ్చిన నాలుగు లక్షల సేనలోనున్న సేనానాయకు లారాజుంజేరి యిట్లనిరి.

అయ్యా ! యిప్పుడు భూరిశ్రవుఁడు మిగుల బలహీనుఁడై యున్నవాఁడు. ఒక వైదికబ్రాహ్మణుని యాలొచనమువిని సేననంతయుఁ తగ్గించినాఁడు. ఇప్పుడు తమయొద్ద పదిలక్షల సేన యున్నది. అతనికి రెండు లక్షల సైన్యము మాత్రమే యున్నది. మన మిప్పుడతనితో యుద్ధముజేసి సులభముగా జయింపవచ్చును. అని యతనిగుట్టంతయుం జెప్పి యతనిమీదఁ యుద్ధమునకుఁ బోవుటకై యారాజును ప్రోత్సాహపరచిరి.

ఆరాజు వారియుపదేశము యుక్తముగా నున్నదని తలంచి మంత్రులతో విమర్శించి యప్పుడే యుద్ధయాత్రకు నాజ్ఞచేసెను. సకలసైన్యములకు నుత్సాహము కలుగునట్లు రణభేరి మ్రోగించిరి. తర్వాత గుర్రములు, నేనుఁగులు, రథములు, కాల్బలము, సారధులు మొదలగు చతురంగబలములు వారివారి యాయుధముల నలంకారములతో సిద్ధమై కోటముంగిటకువచ్చి నిలిచినవి. సేనానాయకుఁడు సైన్యముల చిత్రముగా నడిపింపఁదొడంగెను. ఆహారపదార్థములు మందుగుండుసామానులను బండ్లమీఁదను లొట్టెలమీఁద నెక్కించి నడిపింపసాగిరి. అంత శుభముహూర్తమున నారాజు భద్రగజముపై నెక్కి యుద్ధయాత్రకు వెడలెను.

అట్లు మంగళధ్వనులు జయ జయ ధ్వనులు భేరీమృదంగాది ద్వనులు భూనభోంతరాళంబునిండ భండనమునకు వెడలిన యారాజున కనేకాపశకునములైనవిగాని బలాధిక్యముగల యతని కని లెక్కకు వచ్చినవికావు. నడుమనడుమ మజిలీలు చేసి కొనుచుఁ బదిదినములకు భూరిశ్రవుని పురబాహ్యప్రదేశము జేరి యందు బలముల విడియించి చక్రవ్యూహ్యమును పన్నిరి. నడుమ ప్రభువులుండు శిబిరములును వాని చుట్టును కాల్బలము వారిపైన రథికులు వారిచుట్టును గుఱ్ఱములు వారిపైన నేనుఁగులను విధియుక్తముగా నిలఁబెట్టరి అట్టి వ్యూహాంతర మందుండి యారాజు భూరిశ్రవునికి యుద్ధాహ్వానపత్రికల వ్రాయించి దాదులచే నంపెను.

అంతకుమున్నే రణభేరీధ్వనులవిని సంశయాకులమతియైయున్న యాభూపతి యట్టిపత్రికం జూచికొని నిశ్చేష్టితుఁడై కొండొకవడికిఁ దెప్పిరిల్లి యందుల కొకదినము మితి కోరి మరల నుత్తరమును నంపెను. పిమ్మట భూరిశ్రవుఁడు మంత్రిని బిలిచి యాయుత్తరము జూపి కర్తవ్య మెద్దియో చింతింపుమని పలికెను.

_________

మంగలమంత్రి కథ

అప్పు డయ్యమాత్యుఁడు పండ్లు పటపట గొరుకుచు రాజుతో నిట్లనియె. రాజా! యుక్తాయుక్తములు నరయక నుద్యోగము లిచ్చు రాజు ఆపదలఁ బొందకుండునా? పూర్వము నీవంటిరాజే యొకఁడు బాగుగా క్షౌరము జేయు మంగలివాని మెచ్చుకొని, యేమి కావలయునని యడిగిన వాఁడు తనకుఁ దగినదానిని గోరక మంత్రిత్వ మిమ్మని వేడుకొనెను. అతం డంతమాత్రమునకు సత్యలోపము గలుగునని తలంచి బుద్ధిమంతుఁడగు పూర్వపుమంత్రిని తగ్గించి వానిని బ్రధానిగా జేసికొనియెను.

ఆ వార్త శత్రురాజునకుఁ దెలిసినది. పెక్కుదినములనుండి యతనిఁ గెలువఁ దలంచియు మంత్రి బుద్ధిబలముచేతనే చేరలేకపోయిరి. అప్పుడదియే సమయముగదా యని యూహించి పెక్కండ్రు ఏకముగాఁ గూడివచ్చి యారాజుకోట ముట్టడించిరి.

అప్పుడారాజు మంగలమంత్రిని బిలచి శత్రురాజులు మనకోట ముట్టడించిరి. ఇప్పుడేమిచేయవలయునో చెప్పుమనిన వాడిట్లనియె.

అయ్యా! బాబు! నాతల్లికి నేనొక్కడినే యుంటిని. మీరును అట్టివారేకదా ! బ్రతికియుండిన బలుసుకూరైనం దినవచ్చును. ఈశత్రురాజుల నెవ్వడు గెలువం గలఁడు. నాయొద్ద మాతాత సంపాదించినవి రెండుపొదు లున్నవి. ఒకటి మీ కిచ్చెదను. రెండవది నేను దాల్చెదను. అట్టివేషములతోఁ బారిపోయినచో మనలను శత్రురాజులు చంపక విడిచిపెట్టెదరు, పిమ్మట నేయూరికైనను బోయి దినమున కిద్దరికి క్షౌరము చేసినచో పొట్టగడవకపోదు దీనికై యింత విచారింపవలయునా? యని యుపాయము చెప్పెను. ఆ మాటలు విని రాజు చీ! నిర్భాగ్యుడా! నీకు మంత్రిత్వ మిచ్చినందులకు నాకు మంచిబుద్ధి చెప్పితివి. నీ సాంగత్యము చాలు పొమ్మని వాని దిట్టుచు బూర్వపుమంత్రి యాగ్రామమందే యున్నవారు గావున నతనియొద్దకు బోయి తన కాపద దాటింపుమని పాదంబులం బడి ప్రార్ధించెను.

కృతజ్ఞుడైన యామంత్రి యాపత్కాలమందు వచ్చిన రాజును దిరస్కరింపక భయపడవద్దని పలుకుచు నంతకు పూర్వమే తాను రాజునకు వ్యతిరేకుఁడనిని కొని తెలిసికొని కోట బట్టుకొనుటకై సహాయము చేయుమని కోరిన శత్రురాజుల కిట్లు జాబు వ్రాసెను.

ఇప్పుడు మీయిష్టప్రకారం గోటబట్టి యిచ్చెదను. కోట స్వాధీనమైనపిమ్మట మీలో రాజెవ్వఁడు కాబోవునో తెలియఁజేయుడని వ్రాసెను. అట్టి చీటిం జదువుకొని యారాజులందరును తమకే కావలయునని గోరి కలహము పెంచికొని దారుణమైన యుద్ధము చేసి తుద కొకరిచేత నొకరు హతులైరి.

అలాగుననే నీవును వైదికునికి భోజనముగాని బట్టగాని అగ్రహారములుగాని యివ్వక సేనను దగ్గించి సేనాదిపత్య మిచ్చితివి. నేను జెప్పినను వినకకపోతిని. ఇప్పు డనుభవింపుఁడు. రెండులక్షల ఫౌజుతో మనమేమి యుద్ధము జేయఁగలము. వారికి పది లక్షల సేనయున్నది. దీనికంతకును గారకుఁడైన సోమశర్మనే యుపాయమడుగుడు. నాకు దెలియదు. అతఁడు యుద్ధములో మృతిజెందినవెనుక నేను యుద్ధము చేయుదును. అని మొగమాటములేక యుత్తరమిచ్చిన మంత్రి నేమియు ననలేక భూరిశ్రవుఁడు సోమశర్మను బిలిచి యావృత్తాంతమంతయు నెఱింగించెను. వాని మొండిధైర్య మెట్టిదో చూడుము. అప్పుడుకూడ నించుకేని భయమందక దైవబలము తనకు బాగుగానున్నదను నమ్మకముతో రాజుతో నిట్లనియె.

దేవా! నావంటిబంటు మీకు గలిగియుండ మీరు చింతింపవలయునా? మీరు వినోదముగా నింటఁ గ్రీడింపుచుండుఁడు. నేనొక దినమున నా శత్రువులమదం బడగించి వచ్చెదననిన నద్బుతమంది సోమశర్మా! నీకు గావలసిన సహాయమును దీసికొని పొమ్మని చెప్పెను. ఆమాటలు విని యతం డయ్యా! నాకు దొంగలఁ జంపునప్పుడును, సింహమును బరిమార్చినప్పుడును, ఏవారు సహాయముచేసిరో యిప్పుడు మాత్రము సహాయము చేయరా! నాకు సహాయము చేయువాఁడు గూడనేయుండును. యీసైన్యముతో నిమిత్తము లేదనిచెప్పి యారాజున కుత్సాహము గలుగజేసెను.

అంత సోమశర్మ యారాత్రియే యా చక్రవ్యూహంబునకుఁ బ్రాంతమందొక గోయి త్రవ్వించి సింహచర్మము కత్తులు మాత్రము తీసికొని రహస్యముగా నాగోతిలో బ్రవేశించెను. అంత నర్ధరాత్రంబున చతురంగబలములు నిద్రాణములై మేనులు తెలియక సోలియున్న యవసరంబున నాసోమశర్మ గోతినుండి పైకివచ్చి పొడు పొడు, పొడు మని పెద్దకేకలు వైచుచు నాసింహము చర్మము నేనుఁగులమీదకు నెగరవైచెను. ఆచర్మము పచ్చి వదలలేదుగాన దానివాసన గొట్టినంత నేనుఁగులన్నియు చెదరి గొలుసులు త్రెంచుకొని సేనమీదఁబడి కలియ త్రొక్కినవి.

అప్పుడు చతురంగబలము వారును మేల్కని యేమియుఁ దెలియక శత్రుసేనవచ్చి తమమీదఁ బడిననుకొని వీరాలాపములు పలుకుచు కొట్టుమనియుఁ బొదువుమనియు, నరుకుమనియుఁ, బట్టుమనియు జీఁకటిలోఁ దెలియక యొకరినొకరు చంపుకొనఁ దొడఁగిరి. ఈరీతి నల్లకల్లోలమై యాసేనయంతయు బోరాడి యొకజాములోఁ బేరుమాసెను. ఆహా! సోమశర్మ దైవబల మెంత బలవంతమైనదో చూడుము. పిమ్మట సోమశర్మ యా మొండెములనడుమనుండి శిబిరమున కరిగి నిశ్చేష్టితుఁడై చూచుచున్న యాశత్రురాజుపై బడి కత్తిచే శిరము నరికెను. మరియు నతఁడు తెల్లవారువరకు నచ్చట చచ్చియున్న శవముల యవయవములన్నియు నరికి నరికి రాసులక్రింద బెట్టెను. మేనంతయు రక్తము బూసికొని యుద్ధభూమిలో రుద్రునివలె శవముల నడుమ దిరుగజొచ్చెను. అంత నుదయమున భూరిశ్రవుఁ వానిజయంబు బ్రజలవలన విని యత్యంతసంతోషముతో నచ్చటికరుదెంచి భైరవునివలె గ్రుమ్మరుచున్న సోమశర్మంగని కౌఁగలించుకొని యిట్లనియె. మహాత్మా! నీవు మనుష్యమాత్రుఁడవుకావు. ఒక మానవునికింత పనిచేయిశక్యమా ! నాయాపదల బాపుటకై వచ్చిన భగవంతుడని నమ్మెదను. నీవు చేసిన మేలున కెద్దియును ప్రతికృతిచేయలేను. ఇదిగో! నమస్కరించుచుంటినని పాదంబులంబడిన సోమశర్మ సగౌరవముగా నతని లేవనెత్తి యోహో రాజా! నీహస్తప్రాయుండనగు నన్నింతస్తుతి చేయవలయునా! ఇదియంతయు నీకటాక్షమే ఈరాజు బలమననెంత? మూడు లోకంబులు వచ్చినను గోడు చెడసేయఁగల నని దర్పముగాఁ బలికెను.

అంత నారాజు సోమశర్మను బల్లకీపై నెక్కించి మేళములతోఁ దాళములతో నూరేగింపుచు నింటికిఁ దీసికొనిపోయి విందుల చేయించి యెద్దియేని యభీష్టమున్న గోరుమని యడిగెను. అప్పుడు సోమశర్మ యేమియు గోరక మంత్రితోగూడ మిగిలి యున్న రెండులక్షల సైన్యమునుగూడ నుద్యోగములనుండి తప్పించి యాజీతములును దనకే యిప్పింపుమని వేడుకొనెను.

ఆరాజు సోమశర్మ కోరిన ప్రకారము అప్పుడే యాజ్ఞచేసి యంతటితోఁ దృప్తి బొందక యతినిరూపము లోహములో బోతపోయించి యీనడివీథిలో జిరకాలముండు నట్లు నినుపకంబముపై నమర్చెను.

గోపాలా! ఆకనుపించు విగ్రహము ఆ సోమశర్మయొక్క యాకారము అది శిల్పవైచిత్రమునుబట్టి నిజముగా బ్రాహ్మణుఁడు నిలువఁబడినట్లు గనంబడుచున్నది. కాని వేరుకాదు.

ఈ పట్టణ మాభూరిశ్రవునిదే. పెద్దకాలమైనది. కాన నాసంతతి వారందరు నశించిరి. గాని యీలోహస్తంభము మాత్రము రూపుచెడక యట్లేయున్నది. దానికేగాదా మన పెద్దలు తనపేరు భూమిలో స్థిరముగా నుండుటకై సప్తసంతానముల నిలుపుదురు. ఇదియే దీని వృత్తాంతము. ఇక లెమ్ము. వేళ యతిక్రమించినది. బసలోనికి బోయి వంటఁ జేసికొని భుజింతము అని చెప్పి వానితోఁగూడ సత్రములోనికిబోయి వంటజేసికొని భుజించి కొంతసేపు విశ్రమించి మరల బయనముచేసి క్రమంబున పదునొకండవ మజిలీ చేరిరి.