Jump to content

కాశీమజిలీకథలు/మొదటి భాగము/మూడవ మజిలీ

వికీసోర్స్ నుండి

మూడవ మజిలీ

రాముని కథ

గోపా! విను మట్లు దక్షిణపుదెసకు మఱ్ఱికొమ్మమీదుగా నరిగిన మంత్రిసూను డైన రాముడు నాల్గుదినములు సులభముగా నడచి మరిరెండునాళ్ళు ప్రయాసముగా వంగినడుచునంత నంతము గాన్పించినది. కాని యది యొకపర్వతప్రాంతభూమిగా నున్నందున నందందలి విశేషము లరయదలచి యాశాఖ దిగి నడువ నొక గొప్పపర్వతము గానబడినది దాని యౌన్నత్య మఱసెదంగాక యని యతం డది యెక్క నారంభించెను. సాయంకాలమైనను శిఖరము గాన్పించినదికాదు. ఆ రేయి నట ఫలహారమున నాకలి యడంచుకొని మరల దెల్లవారిన తోడనే యెక్క నారంభించెను. సాయంకాలమయినను దుద యగుపడలేదు. మునువోలె నట వసించెను. మరునాటి రాత్రికిని శిఖరము మిగిలియే యున్నది. ఈరీతి నారుదినములు నడచినను శృంగము గనంబడ నందులకు వెరగందుచు నతం డౌరా! యది చూడ నెంతయో లేనట్లుండు. ఎక్కిన కొలది మిగిలియే యుండెను. ఈ కొండ యౌన్నత్యము మిగుల వింతగా నున్నది. దీని రేపుమాత్రము పరీక్షించి కొన గనంబడనిచో మగిడెదంగాక యని నిశ్చయించి యారేయి గడపి మరునాడు చీకటి పడుదనుక నెక్కి చివర జూడలేక విసిగి మగుడ దలంచునంతలో నం దొకగుహ కాన్పించినది. దానిం జూచి ప్రవేశింపందలంచి రాత్రివేళయగుట కొంచెము భయము జెంది యారాత్రి యాగుహాముఖంబున నివసించి మరునా డుదయంబున దానింబడి ధైర్యసాహసంబులే తనకు దోడురా నరిగెను.

సాధారణమైన వెలుగుగల యా గుహలో బడి పోవంబోవ గ్రమంబున నది యల్పమగుచుండుట నిలిచి నడచుటకు వీలులేక గొంచెము వంగియే నడువదొడంగెను. మఱియు బోయినకొలది గుహ చిన్నదియు జీకటి యెక్కుడగుచుండ నడువశక్యము గాక మగిడిపోవుదమని యాలోచించి వెనుకకు దిరిగిన దారియే కాన్పించినది కాదు. అప్పు డతనికి వచ్చినదారియు బోవలసిన దారియు దెలియక దట్టమగు చీకటిలో జేతుల దడిమికొనుచు గొంతదనుక బ్రాకియే యరిగెను. పైన నెట్లును శరీరము పట్టునంత యవకాశము లేనందున నప్పు డతనికి దైర్యమాగినది కాదు. మరణభీతి జనించి యకటా! దైవము నన్నిచ్చటికి జావదోడ్కొని వచ్చెనే? నా సాహసమే న న్నింత జేసెనుగదా! మఱ్ఱికొమ్మతుద గానంబడినతోడనే మగుడక యీపర్వత మేటి కెక్కితిని? ఎక్కియు బయట నరుగక గుహ జొరనేల? సొచ్చియు చీకటి బలియుచుండ మగుడక యింతదవ్వు రానేల? ఇదియంతయు దైవికమేగదా యని యూహించి దైర్యముతో నిట్లు తలంచెను.

మ॥ఎట నెవ్వానికి రేల్సుఖముగా ◆ నీ దుఃఖమున్‌ గాని వి
      స్ఫుటపూర్వాచరితాత్మ కర్మవశతన్ ◆ భోక్తవ్యమై యుండునో
      ఘటనాచాతురి ద్రాళ్ళగట్టుచు బలా ◆ త్కారంబుగా వాని న
      చ్చటికిం దోడ్కొనివచ్చి దాని గుడిపిం ◆ చున్‌ దైవ మన్నా ళ్లొగిన్.

అని బాల్యంబున నాచార్యుఁడు సెప్పిన పద్యమును జ్ఞప్తికి తెచ్చుకొని నాకు మరణమయ్యెడుగాని మరియేమి కాగలదు. అది యెల్లరకు జన్మముతోడనే వచ్చుం గదా? దానికై చింతయేటికి? అనుచు భగవదాయత్తచిత్తుండై మఱిరెండు బారలు బ్రాకినతోడనే కొంచెము వెల్తురు గనుపించినది. దాని యాధారమున మఱిరెండుగజములు నడచిన నందొకకెలన గవాట మొకటి చేతులకు దగిలినది. అది పట్టిలాగిన మణిప్రభలచే బట్టపగలుగానున్న యొక గదియందు దపంబొనరించుచున్న మహర్షిం గాంచి హర్షంబున మేను పులకింప మరణభీతి విడచి యమ్మహానుభావు పాదంబులమ్రోల సాష్టాంగ మొరగి యట్టె లేవకున్న యొక్కింతవడి కయ్యోగీంద్రుడు గన్నులం దెరచి పాదంబులంబడియున్న వాని గృపగదుర లేవనెత్తి యోరీ! నీ వెవ్వండ వివ్విపినగుహాంతరాళమున కెట్లు ప్రాణములతో వచ్చితివి? చెప్పుమని యడిగిన నతడు నమస్కరించి తన కథయంతయు జెప్పి రక్షింపుమని వేడుకొనియెను.

అయ్యోగియు నతని సాహసమునకు మెచ్చుకొనుచు నోయీ! పండ్రెండేండ్లకు నొకసారి బాహ్యప్రచారము గలిగిన నా కీదినముననే యట్టి మితియగుటచే గనుల దెరచి నీతో మాటాడగలిగితిని లేనిచో నీవు వృథాగా జావవలసివచ్చును. ఈగుహయందు వచ్చుటకేగాని మరల బోవుటకు దారి గనబడదు. నీమనోధైర్యము గొనియాడదగియున్నది. నీ కేమి కావలయునో కోరుమనుటయు నతం డంధకారబంధురమగు గుహాంతరాళమున నుండి తెరపిగల బ్రదేశము చేరుటకంటె వేరొండువర మేమి తోచమింజేసి తన్ను బాహ్యప్రదేశంబున జేర్చుమని వేడిన నమ్మునియు వాని గన్నుల మూసికొమ్మని యెద్దియో జపించినంత రాముండు తక్షణం బక్కొండ యవ్వలిభాగంబు సేరెను.

అట్టి విషయము గన్నులు దెరచి చూచి ముని ప్రభావమునకు వెరగందుచు దన్ను మరల జనించినవానిగా భావించి యావటవృక్షము జూడ నేమూలను గానక యోహో మోసము వచ్చెనే, నా మది భ్రమసినది. అమ్ముని వర మిచ్చినప్పుడ యామఱ్ఱి మొదలు జేర్పుమనక మరియొకలాగున గోరితినే యిపు డది యేదెస నున్నదో తెలియదు. ఎట్లు మొదలు చేరుదునని పశ్చాత్తాపచిత్తుండై నడువసాగెను.

అట్లు సాయంకాలము దనుక నడచినను గ్రామ మేదియు కానంబడలేదు. విశాలమగు నొకచూతవృక్షము గనంబడినది. అదియు నివాసయోగ్యముగా నుండ నారాత్రి దానిమూలమునం బరుండి తనపయనపువిశేషమును గుఱించి చింతించుచుండ నిద్దురపట్టక రెండుయామములదాక మేలుకొనియుండెను. అట్టియెడ నాచెట్టుమీద గూటిలోనికి రెండుగరుడపక్షులు చేరి యిష్టములైన మాటలం జెప్పుకొనదొడంగెను. అం దాడుపక్షి మగపక్షి కిట్లనియె.

నాథా! మీరు అనేకభూములు తిరిగి వచ్చితిరిగదా ఎందేని వింతలు చూచితిరేని నుడువుడని యడిగిన దాని కాపతంగపుంగవం బిట్లనియె.

కాంతా! నే డెందును నేవింతయు జూడలేదు వచ్చుచుండ నిచ్చటికి రెండుయోజనముల దూరములో నొకపట్టణము గలదు. అప్పట్టణపురాజునకు లేకలేక యొకకూతురు గలిగినది. దాని చక్కదన మీమూడులోకంబులంగల యంగనలకు లేదు. పాప మాపూబోడికి గొలదికాలమై నదెద్దియో రోగమున గన్నులు గాన్పించుట లేదట. అట్టి సొగసుల మగువకు గన్నులు పోగొట్టిన నలువం దిట్టుచు దల్లిదండ్రులే గాక పౌరులుగూడ పూర్తిగా భుజించుట మానివేసిరి.

ఆ రాజు లక్షలకొలది రొక్కము కరుచుపెట్టి పెక్కుచికిత్సలు చేయించెనుగాని దానికన్నులు చక్కబడినవికావు.

మ॥ ద్విజవంశోద్భవుడైన భూపుడయిన • న్విడ్వర్యుడైనన్ జఘ
       న్యజుడై న్ఘనుడైన నీచకులుడై • నన్మత్తనుజాత నే
       త్రజరుగ్దోషము వాయ నెవ్వడు చికి • త్సంజేయునో వానికిం
       ద్రిజగంబుల్గన నిత్తు నత్తరుణి ధా • త్రీరాజ్యయుక్తంబుగాన్.

అని చాటింపించుచున్నవాడు.

నే డాపట్టణముమీదుగా వచ్చుచున్న నా కీ వింతమాత్రము గనంబడినది. ఇంతకన్న నెద్దియు జూడలేదనియె. ఆ మాట వినినతోడనే యప్పతంగాంగన జాలిపడి అయ్యయ్యో! పాప మంత సంపదయు సౌందర్యమును గలిగిన చెలువ గుడ్డిదిగానున్న దని వినిన నాకునుంగూడ విచారమగుచున్నది. అట్టియంధత్వంబు వాయజేయ వైద్యుం డొక్కండు నప్పుడమి లేడాయని యడిగిన మరల విహగపతి యిట్లనియె.

బోటి! మన గూటియందున్న యీ పసికాష్ట మరగదీసి యాగంధ మా పద్మగంధి కన్నులం బట్టించిన జక్కంబడునుగాని వేరొక్కయూషది నేవైద్యుండును బాగుసేయలేడని చెప్పి యాపక్షిపతి యాసతితో రాత్రిశేషము గడిపి యదయమున నెందేని జనియెను.

పక్షిభాషను గుర్తెఱింగిన రాముడు చెట్టుక్రింద బరుండి యా పలుకులన్నియు వినియున్నకతంబున నుదయకాలమున నా చెట్టెక్కి యక్కులాయమందున్న పసికాష్టము సంగ్రహించి యత్యంతసంతోషముతో దిగి సాయంకాలమునకే యా పట్టణము జేరెను.

అందొక బ్రాహ్మణ గృహమందు భుజించి వీథివేదికమీద బండుకొనియుండ బౌరు లానారీమణి చక్కదనముం గుఱించియే చింతింపసాగిరి. అట్టి మాటల నాలింపుచు నతం డారాత్రి యొకయుగముగా గడిపి తెల్లవారినంత నెంతేని సంతసముతో నారాజ నిశాంతప్రాంతమున కరిగి "రాజనందన కన్ను లేను జక్కబరతునని" వక్కాణించినంత బదుగురు చుట్టుకొని యతని రాజునగరికి దీసికొనిబోయిరి.

అ ధాత్రీపతి యావార్త విని యశ్రద్ధ జేసి చాలుచాలు! నిట్టి వైద్యు లనేకు లయిరి. ఏటికి శ్రమయని మొదట నీసడించెను. పదంపడి యతని మాటల పాటవమునుబట్టి యెట్టకేల కొడంబడి యక్కన్యం జూపించుటకై తగిన పరిచారికల నియమించెను.

వారితోకూడ గన్యాంతఃపురమున కరిగి రాముం డందర దూరముగా బొమ్మని తానొక్కరుండ యయ్యండజయానదండ కరిగి తదీయతారుణ్యరామణీయమున కచ్చెరువందుచు నల్లన నయ్యోషదీకాష్టం బరుగదీసి యాగంధంబు గన్నులకు బట్టించిన వెంటనే యవి యపూర్వతేజంబునం బ్రకాశిల్లుటయు జూచి యాచకోరాక్షి సంభ్రమాశ్చర్యసంతోషకలితమానసయై యెదుర నాశ్వినేయస్వరూపంబున నిలిచి యున్న యామంత్రినందనుం దిలకించి మేను పులకింప నమస్కరించుచు "నీవు నాభర్తవు నాపుణ్యము ఫలించె "నని యనురాగసూచకములగు చూపు లతనిపై బరగించుటయు నతండును గ్రుచ్చియెత్తి గారవించుచు దన సంతోషము వెల్లడించెను.

అ ట్లొండొరుల మనంబులు కలిసికొనినపిమ్మట నావృత్తాంతమంతయు నాధరాకాంతుండు విని యత్యంతప్రహర్షంబున నతని కులశీలనామంబులం దెలసికొని మఱియుం జెలంగుచు దైవమును వేదెరంగుల గొనియాపాడి శుభముహూర్తంబున నతని కారాజ్యముతో గూతు నిచ్చి వివాహ మాచరించెను.

అట్లు రాజ్యముతో మిగులరూపవతియగు నామగువను స్వీకరించి యతం డయ్యంగనతో గొన్నిదినంబు లీడులేని వేడుక లనుభవించుచు నొక్కనా డాప్తులవృత్తాంత మంతఃకరణగోచరమగుటయు నేకాంతముగా గాంతతో నిట్లనియెను.

ప్రేయసీ! మే మేగురము మిత్రుల మొక్కసారి యిల్లువెడలి దేశాటనము జేయుచు నొకవటవృక్షము మూలగా విడిపోతిమి. వారి జాడయేమైనదో తెలియదు. మే మనుకున్న మితియు గడచినది. కావున నట్టి మిత్రుల వెదకివచ్చెద సెలవిమ్మని యడిగిన నమ్మగువయు విడువలేక యెన్నియో ప్రతికూలవాక్యముల జెప్పి యెట్లకేల కతని యనునయవచనంబులచే నొప్పుకొనినది. అట్లు భార్యతో జెప్పి యొరు లెరుంగకుండ నతం డొకనా డర్ధరాత్రంబున మిక్కిలి జవముగల తురగ మెక్కి యొక్కరు డయ్యూరు వెడలి యడవిమార్గంబునం బడి పోయెను. సౌహార్ద్రచిత్తులు భోగములం గణింతురా? అ ట్లెడతెగని యడవిలో మఱునాడు రెండుయామములప్రొ ద్దెక్కినదాక నేకరీతి ప్రయాణము చేయుటచే మిక్కిలి నలసటజెంది గుఱ్ఱము నడువజాలక యొకచెట్టుకడ నిలుచుటయు నతం డది యెఱంగి దానిం దిగి ప్రాంతమందున్న జలాభరంబున వారువముతోగూడ నీరు ద్రావి ఫలహారమున నాకలి దీర్చుకొని మిగులనెండగా నుండుటచే దరినున్న తరువునీడ గుఱ్ఱమును గట్టివైచి యొక్కింతవడి విశ్రమించెను.

అయ్యవసరంబున దిక్కుడ్యంబులు బీటలువారజేయు నొక్కయద్భుతధ్వని వినంబడెను. నిరాయుధుండగు నతం డాభయంకర స్వరమునకు వెరచి మిక్కిలి పొడవగు నయ్యగమాగ్రంబున కెగబ్రాకునంతలో ననంతవేగమ్మున వాలమ్ము విదల్చుచు సింహంబొక డార్పులడర నయ్యెడ కరుదెంచి చెట్టుమ్రోల గట్టియున్న మేలిగుఱ్ఱమును బిట్టు కొట్టుకొనుచుండ మెడబట్టి యీడ్చుకొని పోయినది. పిమ్మట నా పురుషసింహము సింహము దవ్వుగా నరిగెనని యెఱిగినవెనుక యల్లన నత్తరువు దిగి యుల్లము తల్లడిల్ల మెల్లన నడువజొచ్చెను. ఇంతలో నతని స్వాంతమున నున్న దురంతచింతాఢ్వాంతమునకు దోడుగా రే డపరగిరిశిఖరపరిసరముల కఱుగ దెసల జీకటులు గాటుకబూసినరీతి నావరింపందొడంగెను. భయంకరమృగాక్రాంతమగు నక్కాంతారంబున చీకటిని ద్రోవగానక నడుచునప్పు డతం డాయుధమాత్రసహాయంబైన లేమింజేసి జీవితేచ్ఛ వదలి దైవమునే ధ్యానింపుచు నరుగ నరుగ మఱియు నంబరతలమ్మున మేఘమ్ములు గ్రమ్మి యుఱుముల నాకసంబరుల దళుక్కురని మెఱయు మెఱపు జూపులకు మిరుమిట్లుగొలవ బ్రభూతవాతంబుతో బెనువాన గురియజొచ్చెను. ఆ జడి కతడు గడగడ వడంకుచు నడుచునెడ నొకపెడ మెరుపుల వెల్తురున నమ్మవారిగుడి యొకటి గనంబడిన దాని మంచిచెడ్డల విదారింపక శీతభీతి దలుపుల ద్రోచికొని యందు జొరబడి గుమ్మమున దడిగుడ్డం బిండుకొనుచుండెను. ఇంతలో నొకనెలంత యాక్రందనధ్వనితో గొందఱు పురుషుల తర్జనధ్వనులు వినంబడిన భయపడి యతడు గర్భాలయమున కరిగి యందు మిక్కిలి గొప్పది యగు చండికావిగ్రహము మాటున దాగియుండెను .

అంత నొకకాంతం దోడ్కొని భయంకరాకారులగు తస్కరు లిరువురు విచ్చుకత్తులతో నగ్గుడిలో బ్రవేశించిరి. ప్రవేశించునప్పు డమ్మవారి మాటుననుండి రాముండు మెరుంగు వెలుగున మెరపుతీగయుంబోలు యమ్మానిని బిక్కందనుక వ్రేలాడు నల్లని సోగవెండ్రుకలం బట్టి తిరుగుచు కాటుకకొండలవంటి దొంగల విరువురం జూచి యప్పడంతి యెడ గనికరము వొడమినను నప్పటికేమియు జేయరామి దఱి నరయు చుండెను.

ఆ చోరులు నడిదంబుల నొకమూల నిడి యాప్రోయాలు గోలుమని యేడ్చుచు శోకావేశంబున మూర్ఛ మునింగియుండ వారలొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

చార్వాకుడు — ఓరీ! భుజంగా! మనకిదివర కీయమ్మవారికి దొంబదితొమ్మండ్ర చక్కని రాజకన్యల బలియిచ్చితిమి కదా? దీనితో వ్రతము పూర్తియగును. ఇక మన కీచండిక రేపు వాంచితము నియ్యగలదు.

భుజంగుడు — చార్వాకా! మనము గావున నింత యసాధ్యమైన వ్రతమును బూర్తిజేసితిమి. మఱి యెవ్వరైన నూఱుగురు చక్కని రాజకన్యలం దెచ్చి బలి యియ్యగలరా? ఇంతపని జేసినవారి కమ్మవారు వరమియ్యక యే చెరువునీరు త్రాగగలరు?

చార్వా - మన మదివరకు బలియిచ్చిన మచ్చెకంటులలో నింత చక్కనగు నెలత లేదుసుమీ! భుజం – లేదని సందియముగా బలుకుచున్నావు: దీని కత నెరుగవు కాబోలు. ఆరు మాసముల క్రిందట దీని తండ్రి స్వయంవరమునకై పెక్కండ్ర రాజకుమారుల రప్పించెనుగాని వారిలో నొక్కరిని దన చక్కదనమున కీడు కాదని వరించినదికాదు. నే నప్పుడు చూచియే దీనిగుఱించి చింతించుచు నేటికి పవిపట్టితిని.

చార్వా – ఇట్టి యోగము దీనికుండగా నెట్లు వారిని వరించును?

భుజం – ఔనుగాని, చార్వకా నా కీకామిని సోయగము జూచిన నొక్కసారి భోగించి పిమ్మట నమ్మవారికి బలినియ్య నూహ పుట్టుచున్నది. దీనికి నీ వేమని యెదవు?

చార్వా - ఛీ! ఛీ! అట్లు చేసిన అమ్మవారికి గోపము వచ్చి వరమీయదు సుమీ!

భుజం – అమ్మవారి వరము దీని సంభోగసౌఖ్యముకన్న నెక్కువా?

చార్వా - అయ్యయ్యో! ఎక్కువది కాదా? నిజముగా నామెకు గోపమువచ్చిన మనము భస్మముకామా?

భుజం - అలాగైనచో నీపడతి నమ్మవారికి బలియే యియ్యవలదు నేనే పెండ్లి యాడెదను. బలికై వేరొకరాజకన్యం దెత్తుముగాక.

చార్వా - ఓహో! గడుసువాడవే. నీవేనా మగడవు నాకు మాత్రము చక్కనిభార్య దొరికిన నిష్టము లేదనుకొంటివా యేమి ? అట్లయిన నేనే పెండ్లియాడెదను.

భుజం - చార్వాకా! ముందర నీ సంగతి నీవు తెచ్చితివా, నేను తెచ్చితినా, నిజము సెప్పుము.

చార్వా - ఎవరు తెచ్చిన నేమి? దీని హక్కు యిరువురకు సమానమే.

భుజం – ఇంతమాత్రమునకై హక్కులు స్థిరపరచవలెనా? జగడము సేయకు. పోనీ. అమ్మవారికే బలియుత్తములే.

చార్వా - అట్లయిన నాకు సమ్మతమే.

అని యిట్లొండొరులు మాట్లాడుకొనుచు గొంచెము సేపటికి నిద్దురపోయిరి. ఆ సమయములో మేలుకొని వారి మాటలన్నియు వినిన రాముడు వారి నప్పుడు చంప నుంకించుచు నిద్రితులం జంపగూడదను నీతి పాటించి వారి కత్తులను సంగ్రహించి ధైర్యముతో నిదురబోకయే యారాత్రి వేగించెను.

అంత నా తస్కరులు వేకువజాయిన మేలుకొని కత్తులు వెదకి గానక గుడి బయటికివచ్చి నలుదెసలం బరికించుచు నెవ్వరినిం గానక యిది యమ్మవారి మాయ యేమోయని వితర్కింపుచుండ గుడిలోనుండి రెండుజేతుల నమర్చుకొని యొక్క గంతున రాముడు బైటకురికి తస్కరులు బెడర నోరీ దుర్మార్గులారా! రండు. దుర్గకు మ్రొక్కుడు. మీ శిఖరంబుల ఖండింతు. చండికకు బలినియం దెచ్చిన వనితను జెరుప దలంచిన మీ పాప మూరకపోవునే? శక్తికి భృత్యుండ. నను జూడుడని యడిదముల బెదరించుచుండ వారు కొయ్యలవలె కదలక నిలిచి యేమియుం బలుక నేరక పారిపోవ దలంచునంతలో నతడయ్యడిదముల వారి తలలు నొక్కొక్కవ్రేటున నరికి యమ్మవారికి బలియిచ్చెను

పిమ్మట నతం డాలయములోని కరిగి దేవికి మ్రొక్కి మొగులు మఱుంగున మెరయు మెరపుతీగవలె విడిన సోగవెండ్రుకల నడుమం దళుక్కు మని మఱయు నత్తరుణిమైదీగ కన్నులకు విందొనరింపజేరి నారీమణీ! లెమ్ము లెమ్ము. నీ చింత వాసినది . దొంగలు హతులైరి. తెల్లవారిన దనుటయు నప్పలుకులు రోగార్తున కౌషధమువోలె నన్నాతికి జేతవం బిచ్చిన నల్లనికన్నులం దెఱచి యెదుర కాముడోయన బ్రకాశించు రామునిం గాంచి హర్షపులకితగాత్రియై యక్కాంచనగాత్రి చిన్న యెలుంగున నిట్లనియె.

మహాత్మా! నీ వెవ్వరవు? నిన్ను జూడ నా పదంబుధిమగ్నమైయున్న నన్నుద్ధరింప నేతెంచిన భగవంతుడవని తోచుచున్నది. మీ వృత్తాంత మెఱింగింపుడు. ప్రాణదానం బొనరించిన మీకు బ్రతిచేయనోపనిదే కృతజ్ఞతాసూచకముగా వందనం బొనరించెదనని యతని పాదములంబడిన రాముండును లేవనెత్తి యత్తరుణి నోదార్చుచు దన యుదంత మెఱింగించి మరల నత్తరుణివృత్తాంత మడిగిన నది యిట్లని చెప్పం దొడంగెను.

ఆర్యా! నేను కుంతలదేశాధీశ్వరుడగు శ్రుతకీర్తియను రాజు కూతురును. నాపేరు కనకప్రభ, నాకు బ్రాయము వచ్చినది మొదలు నన్ను వరించుటకు బెక్కండ్రు రాజపుత్రులు వచ్చిరికాని నా సమ్మతిలేక నా తండ్రి నన్నెవరికి నియ్యక స్వయంవరము బాటించిన నందు వచ్చిన నృపనందనుల సుందరము నాకు సరిపడమిని నెవ్వని వరింపక యూరక మరల నంతఃపురమున కేగితిని. ఆ యీర్ష మనమున నిడుకొని యే రాజకుమారుడు ప్రోత్సాహపరచెనో కాని మొన్నటిరాత్రి మాయింట నంతఃపురమున నిద్రాపరవశనై యున్న నన్ను గన్నమువైచి యీ దొంగలు దీసికొనివచ్చిరి. నాకు నడవిలో మెలకువ వచ్చినది . చేయునదిలేక యూరక యేడ్చుచుండ నిన్నటి రాత్రి కాతస్కరు లీగుడిలోనికి దీసికొనివచ్చిరి. పైననేమి జరిగెనో దుఃఖమున నొడలెరుంగమి నాకు దెలిసినది కాదు.

అట్టి దుర్మార్గుల జంపి నాకు ప్రాణదానము జేసితిరి. దైవ మీయాపన్మూలమున మీదర్శనము నాకు గలుగజేసెను. నే నిదివర కింతచక్కనిపూరుషు నెప్పుడును జూడలేదు. ఈ శరీరము మీ యధీనమైనది. నన్ను బెండ్లియాడి కృతార్థురాలినిం గావింపుడు. నా పినతల్లి కూతురు పద్మగంధి యనునది మిక్కిలి చక్కనిది. దానికి నడుమ నెద్దియో రోగమున గన్నులు పోవుటయు దానితండ్రి యవి చక్కబరచినవానికి రాజ్యముతో నక్కన్య నిచ్చెదనని ప్రకటించి తుదకట్లు జేసెను. ప్రాణదానంబు జేసిన నిన్ను నేను పెండ్లియాడుట కేమి యాశ్చర్యమని పలికిన నా మాటలాలించి సంతోషముతో రాముండా రామం గౌగలించుకొని యోహో! మరదలా! నీవా? తెలిసినది. నీ యప్పయగు పద్మగంధికి గన్నులిచ్చి పెండ్లియాడినవాడను నేనే. చక్కదనమును గుఱించి నీ యాస్తత్వమును గుఱించి పెక్కుసారులు పద్మగంధి నాతో జెప్పినది . మేలు మేలు. దైవగతి యెంత చిత్రముగా సంయోగవియోగముల గావించుచుండును. అని యూశ్చర్యపడుచుండ నప్పడుచు నతని బాంధవ్యమును గుర్తెరింగిన మీదట మించిన యనురాగముతో పద్మగంధి యదృష్టమును వేతెరంగుల నభిమతింపుచుండ నతడు దానినప్పుడు గాంధర్వవిధి వివాహంబాడి యక్కత్తుల రెంటిని జేత నమర్చుకొని నిర్భయముగా నయ్యడవిలో నామెతో బ్రయాణము జేయుచు సాయంకాలమున కొకకోయపల్లె జేరెను.

ఆ పల్లెలో నిళ్ళన్నియు జిన్నవిగానే యున్నవి. కోయదొర యిల్లు మాత్రము కొంచెము పెద్దది. వాని యింటికరిగి యోదొరా! యీరాత్రి నివసించుటకు గొంచెము చోటిచ్చెదవా? యని యడిగిన నతం డయ్యంగన యందమునకు వలచి నవ్వుచు నిచ్చెద నీలాగున రండి అని వారికొక గది చూపించి దానిలో బ్రవేశపెట్టెను. అడవి మృగమువంటి కోయదొరను మరులుకొలిపిన నత్తరుణి సోయగము వేరే వర్ణింప వలయునా?

మఱియు వా డారాత్రి యామెయందుగల మోహంబునంజేసి వారికి దినుటకై మంచి గృహస్తునివలెనే పాలును తేనెయు మధురఫలములు లోనగునవి యందిచ్చుచు నభిప్రాయసూచకములగు నాలోకముల నాచకోరాక్షి నీక్షించుచుండెను. వారట్టి పదార్థములచే నాకలి తీర్చుకొని మిగుల నొగిలియున్నవారు గావున బెందలకడ గాఢముగా నిద్రబోయిరి.

తరుచుగా గోయవాండ్రకు మంత్రములు, తంత్రములు దెలియునను విషయము లోకవిదితమే. అక్కోయదొర యట్టి మంత్రముల బెక్కు నేర్చినవాడగుట మంత్రించిన యక్షతలు కొన్ని నిద్రించుచున్న యా రామునిపై జల్లిన నతం డొక కుక్కయై లేచి మొఱుగజొచ్చెను.

అయ్యెలుంగున నయ్యంగన మేలుకొని పక్కలో మగనిం గానక తొట్రుపడుచు నలుదెసలం బరికింపుచుండ నా దండ కా కోయదొర యరుదెంచి సానీ! వెరవకుము. నేను విన్ను వలచితి. నీ కే కొదువయు లేదు. నన్ను బెండ్లి యాడి యీ కోయరాజ్యం లేలుకొమ్ము ఇదిగో నా మంత్రప్రభావంబు జూడు: నీ మగనిం గుక్కం జేసితి. నరచుచున్నాడనిన విని యవ్వనిత గుండెలు ఝల్లుమన మూర్చిల్లి యంతలో దెలిసి అయ్యో! దైవమా దొంగలనుండి చావుదప్పించుట న న్నీనీచున కొప్పగించుటకా! మంచిమగడు దొరికెనని సంతసించు నన్ను బై కెత్తి నేలవైనట్లు జేసితివి. ఇంతకన్న మరణమే మేలుగదా యని పెక్కుతెఱంగుల లోలోపల విలపించుచు; మూర్ఖునికడ నీతివాక్యములు చెల్లవని యూహించి మాయచే వాని వంచింపదలంచి యా చతుర కోయదొర కిట్లనియె.

దొరా! నా పూర్వపుణ్యము మంచిది గనుక నీవు నాకు దొరకితివి. కాని యొక్కటి యాలోచించుచుంటిని. నీకిదివరకున్న పెట్టకును నాకును బడుట కష్టముగదా! మన మిందున్నచో నది చూచి సహించునా? దేశాంతర మరిగినచో నేబాధయు లేక సుఖింపవచ్చును. అక్కడ మంచిముహూర్తమున నిన్ను బెండ్లి యాడెదననిన, వా డందులకు సమ్మతించి కామపరవశుండై యున్నవాడు గావున నా రాత్రి భార్యాపుత్రుల గణింపక యా కనకప్రభ మాట నమ్మి యూరు వెడలిపోయెను.

అక్కలికియు గుక్క మెడత్రాడు నొకచేతం బట్టుకొని రెండవచేత నా కత్తులలో నొకటి దీసికొని వానివెంట నరిగెను. అట్లయ్యిరువురు మరునాడు జాము ప్రొద్దెక్కుదనుక నడవిత్రోవం బడి నడిచిరి. అప్పు డెండవేడిమియు మనోవ్యధయు దన్ను బాధింప నయ్యబల బలముచెడి నడువలేక నేలం జతికిలబడిన వాడామె కుపచారంబు సేయుచు మంచిఫలంబులందెచ్చి యిచ్చి యలసట బోగొట్టెను.

మఱియు నడచునప్పు డక్కోయ యబ్బోటితో మాటిమాటికి "బెండ్లి మాట యేమి సెప్పితి" వని యడుగుచుండ మంచిముహూర్తమునగాని కూడదని యాప్రోడ యుత్తరము చెప్పుచుండెను.

వెండియు రెండుదినములయిన వెనుక నొకనా డాచేడియ వానితో నోరీ దొరా! ఈ మార్గ మెక్కడికి బోవునో యెఱుగుదువా యని యడిగిన వాడిట్లనియె.

[1]పెట్టా! ఈ దారి వంగదేశరాజధానియగు హేలాపురంబున కరుగును, తరచు నే నాదేశమునకు గస్తురి జామరములు పునుగు జవ్వాజి తేనె మొదలగు వస్తువులు పంపుచుందును. దారి నాకు బాగుగా దెలియు ననిన నవ్వనితయు దియ్యనిమాటలతో వాని మానసము లాగుకొని మరికొంత దవ్వరిగిన వెనుక నోరీ నీ మంత్రశక్తి మిగుల గొనియాడదగియున్నది. మనుష్యుని నిమిషములో గుక్కను జేసితివి. మేలు మేలు. బాపురే యని పొగడుచు నీ సామర్థ్యము చూతము ఈ కుక్కను మరల మనుష్యుని జేయగలవా యని యడిగిన వాడు సాని! నే నట్టి మంత్రము జెప్పుకొనలేదు. దాని ప్రక్రియ గుర్తెఱింగినవాడు హేలానగరములో సత్రప్రాంతమందున్న మఠములో నున్న బై రాగి యొక్కడే. నే నొకనాడు వర్తకమునకై యా యూరరిగి నప్పు డతనితో గొంత ముచ్చటించి కొన్ని క్రియలు దెలిసికొంటిని. కాని యీ రహస్య మెఱింగించినవాడు కాడు. ఇప్పు డట్టియవసర మేమి యున్నది. నా పెండ్లి మాట యేమి చెప్పితివని యడిగిన వానికా నాతి యిట్లనియె.

ఈ దినమున బెండ్లి యాడుటకు బాగుగానున్నది. మా కులాచారము చొప్పున ముందు జెట్టునకు మ్రొక్కి పిమ్మట బెండ్లి యాడవలయు గావున గొన్నిపూవులదెమ్మని నుడివినంత వాడెంతేని సంతసముతో నరిగి మోపెడు పూవుల దెచ్చియిచ్చెను.

అ లతాంగియు నొక వృక్షమూలమున కరిగి యా కుక్కనందు గట్టి నొక్కకత్తి యచ్చటనే నిలబెట్టి యా కుసుమములన్నియు నా పాదపమునకు బూజించి దానిమొదట సాష్టాంగ మొరగి కొండొకసేపు భగవంతుని ధ్యానముచేసి లేచి దొరా! నీవుకూడ నిట్లు కన్నులు మూసికొని యీ మ్రానునకు మ్రొక్కుము నీకు బెండ్లి యగు ననియె. వాడును బెండ్లి సంతోషముతో గన్నులు మూసికొని యాపాదపముమ్రోల జేతులు జోడించి నేలం బండుకొనియెను. వెంటనే బంటుతనముతో నా రాచబిడ్డ యక్కత్తి చేత నమర్చుకొని యొక్కవ్రేటున వాని తల నరికి మేనితో వేరుచేసెను.

ఊరక యొకని కపకారము జేసినవాడు పుడమి బెద్దకాలము మన్నునా ? అయ్యంగన వానిని గడ తేర్చి నా రూపమేగదా నన్నిన్ని పాట్లు పెట్టినది. దీనిం గప్పిపుచ్చినచో న న్నెవరును జూడరని నిశ్చయించి యొడల మసిబూసికొని యక్కోయగుడ్డలతో వికారమగు మగవేషము వేసికొని యా కుక్క మెడత్రాడు గత్తియు జేత బూని వంగదేశ రాజమార్గమునంబడి కతిపయప్రయాణంబున నా హేలానగరముం జేరెను అని చెప్పునంతలో బ్రయాణసమయ మగుటయు స్వాములవా రంతటితో గథ జెప్పుట చాలించి గొల్లవాని గావడి యెత్తుమని చెప్పి వానితోడ క్రమంబున నాల్గవ మజిలీ జేరి యందు భోజనమైన తరువాత సుఖాసీనుడై యగ్గోపాలునకు దరువాత కథ నిట్లు చెప్పదొడంగెను.

  1. కోయవాండ్రలో మగవానిని దొరయనియు, ఆడుదానిని పెట్ట యనియు పిలుచుట వాడుకలో గలదు.