కాశీమజిలీకథలు/మొదటి భాగము/ఏడవ మజిలీ

వికీసోర్స్ నుండి

ఏడవ మజిలీ

విక్రమసింహుని కథ

అది యొకపట్టణము గాన నం దొకసత్రమున బసచేసిరి. ఆసత్రము చిరకాలముక్రిందట నొకమహారాజుచే స్థాపించబడినది. అం దభ్యాగతుల కహోరాత్రంబుల నిరభ్యంతరముగా నన్నదానము చేయఁబడుచుండును. ఆసత్ర మందిరసింహద్వారోపరిభాగంబున వ్రేలఁగట్టఁబడి యున్న చిత్రఫలకములోని స్త్రీరూపమును జూచి తదీయసౌందర్యాతిశయమునకు వెరగుపడుచు నాజవ్వని యెవ్వతె? అం దేల వ్రేలగట్టఁబడినది? తద్వృత్తాంతం బెఱింగింపుఁడని యడిగిన గోపకుమారునకు మణిసిద్ధుండు తదుదంతం బారత్నప్రభావమునం దెలిసికొని యక్కథ జెప్పందొడంగెను.

చోళదేశంబునం బ్రజావతి యను పట్టణంబునఁ జిత్రసేనుండను రాజు గలఁడు. అనపత్యుండగు నారాజు శ్రుతకీర్తి యను మంత్రితో న్యాయమార్గంబునఁ బ్రజాపాలనంబు సేయుచుండఁ బెద్దకాలమున కతనికి నొకపుత్రుం డుదయించెను. జననలగ్నమును బట్టి వానికి విక్రమసింహుఁ డని పేరుపెట్టిరి. ఆవిక్రమసింహుఁ డుదయించిన మూఁడవదినముననే యారాజు మంత్రియగు శ్రుతకీర్తికి నధికతేజస్సమంచితుండగు సూనుం డుదయించెను వానికిని దైవజ్ఞులు బహుశ్రుతుఁడను నామధేయ ముంచిరి.

ఆబాలుర కైదేఁడులు వచ్చినతోడనే సకలవిద్యాపరిపూర్ణుఁడగు నొకయుపాధ్యాయునొద్ద జదువవేసిరి. వా రాయాచార్యునివలన బదియారేఁడులప్రాయములోపలనే సకలవిద్యలు గ్రహించుటయేగాక ధనుర్విద్యయం దసమానప్రజ్ఞ గలవారైరి. మరియు సంగీతమునందును గవిత్వమునందును వారిం జెప్పియే మరియొకరిం జెప్పవలయును.

చిన్నప్రాయములోనే యెక్కుడు పాండిత్యము సంపాదించిన యాకుమారుల బుద్ధి కౌశల్యమునకు మిక్కిలి సంతసించుచు నొక్కనాఁడు చిత్రసేనుఁడు హితపురోహిత బంధుసామంత మంత్రిపౌర సూరివారంబు సేవింపఁ పేరోలగంబుండి యందులకు బహుశ్రుతునితోఁ గూడఁ గుమారుని రప్పించి మిగుల గారవించి యెల్లరు విన నిట్లనియె.

చిరంజీవి ! నీవును బహుశ్రుతుండును సకలవిద్యలయందు మిగులఁ బ్రవీణు లైరని విని నాడెందంబెంతయు నానంద మందుచున్న యది. “పుత్రాదిచ్ఛేత్పరాజయమ్" అను రీతిని దనకంటెఁ గమారు డధికుఁ డగుట తండ్రికే యశము గదా!

మరియు నేను మంత్రియుఁగూడ బెద్దలమైతిమి. మాకీరాజ్య భారంబు వహింప దుస్తరమగుచున్నది. ఇదియునుం గాక నవనవోన్మేషంబుగల మిమ్ము ప్రభువులుగా మేదిని గోరుచున్నది. బహుశ్రుతునితో క్షితిభారంబు వహింపుము. నేనును బూర్వాచార ప్రకారము నిన్నుఁ బట్టభద్రునిం జేసి, తపోవనంబున కరిగెద. నీవును రాజ్య భారంబంతయుఁ బూని దండనీతి ప్రకారము ప్రజలం బాలింపుము. దండనీతి రీతి నెఱుంగని రాజునకు రాజ్యంబు దక్కనేరదు. సస్తవ్యసనముల దారింబోక యాయముంబట్టి వ్యయము చేయుచు సమర్ధులునుఁ విద్వాంసులును దయాసత్యనిరతులగువారి ప్రధానులుగాఁ జేసికొని యల్పుఁ దరికిఁ జేరనీయని రాజు శుభమ్ములందును. మరియు ఱేనుకెట్టి యనుగ్రహమున్నను జాలినంత ధన మియ్యవలయునుగాని యెవ్వరికిని జనువుమాత్ర మియ్యరాదు. సంధి విగ్రహయానద్వైధీభావ సమాశ్రయ సామదాన భేదదండములు మొదలగునవి యాయా వేళకుఁ దగినట్టు నడుపవలయును తఱుచు చారులచే, రాష్ట్రవర్తమానములు నిత్యమును దెలిసికొనుచుండవలయును. దేవతాభక్తియు బ్రాహ్మణభక్తి యుఁ గలిగి యుండవలయును బ్రాహ్మణులం గనినతోడనే యభిమానమానక చేతులెత్తి మ్రొక్కవలయును. బ్రాహ్మణాశీర్వాదంబుల సకలకామంబులు వడయవచ్చును. విప్రులకు నమస్కరించనివాఁడు యమలోకంబున బీడింపబడునని యనేక నీతివాక్యము లుపదేశించి పుత్రునకుఁ బట్టాభిషేకంబు నిశ్చయించి తన యభిప్రాయం బెఱింగించిన విక్రమసింహుఁడును బహుశ్రుతుండును, సామాజికులు నట్టి మాట లాలించి మిగుల నానందించిరి. ఆ రాజు నంతటితో సభ చాలించి వారినెల్ల స్వస్థానముల కనిపెను.

మఱునాఁడు పూర్వమువలె నాకుమారు లిరువురు సాయంకాలమున విహారార్థమై యుద్యానవనమున కరిగి యందుఁ గ్రీడించుచున్న సమయంబున మంత్రినందనునకు రాజనందనుం డిట్లనియె.

వయస్యా! నిన్న మాతండ్రి సభలో నాడిన మాటలు వింటివి గదా! నాఁటనుండియు నామనంబున నొక వింతయగు చింత బొడమినది. నాకు మొదటినుండియు దేశసంచారము చేయవలయునను నభిలాష గలిగియుండుట నీ వెఱింగినదియేకదా! రాజ్యబారము మీఁదబడినచో నట్టిదాని కవకాశ ముండదు. ఇంతదనుక విద్యాగ్రహణమూలముగాఁ గాలము వెళ్ళబుచ్చితిమి.

ఇప్పుడు కాళ్ళకు సంకిలిలు దగులుకొనుచున్నది. ఈభారము మీఁద బడకమున్న రహస్యముగాఁ బోయి యొకసారి దేశసంచారము చేసి వత్తమా యనుటయు నతనికిఁ గూడ నట్టివేడుకయే యుండుటచే నందులకు సమ్మతించెను.

ఆ దినముననే వారిరువురు మిగుల విలువగల రత్నములు బంగారమును సంగ్రహించి యర్ధరాత్రంబున నొరు లెరుంగకుండ వాయువేగంబుగల తురంగము లెక్కి పురంబు వెడలి యడవి మార్గంబునం బడిపోయిరి. ఆహా! వారు రాజ్యము కన్నను విదేశ విశేషము లరయుటయే యెక్కుడుగా నూహించిరి. ఆ రేయంతయు నాగక గుఱ్ఱములఁ దోలుకొనిపోయి తెల్లవారు నప్పటికొక గ్రామము జేరిరి. అ దివసమున నందుఁగల విశేషములరసి యటనుండి వేరొక పట్టణమున కరిగి యందలి వింతల నరయుచుఁ గ్రమంబున ననేక పురంబులు దిరుగుచు నొకనాఁడు మధ్యాహ్నమున కీవీడు చేరిరి. వారు నీ సత్రంబుననే బసజేసి భోజనంబైన వెనుక వీథి యరుగునం గూర్చుండి పుర విశేషము లరయుచు రాజనందనుఁ డేమిటికో సింహద్వారము దెసకుఁ దలద్రిప్పి యిప్పుడు నీవు చూచిన చిత్రఫలక మీక్షించెను.

అట్టిదానిం జూచినతోడనే యారాకుమారుఁ డది నిజమైన వనితయే యనుకొని మూర్చవడి కొండొకవడికి దెలిసి దాని మరల దిలకించి యోహో? యిది నిజమైన మోహనాంగి యనుకుంటిని గాని కాదు కాదు. చిత్తరువా! నామది భ్రమయలేదుగద! లేదు: నిజమే బహుశ్రుతా! యీ ద్వారముపై వ్రేలంగట్టిన చిత్రఫలకంబున నొప్పుచున్న యొప్పులకుప్పను చూడు. చూడు. మొదట ధాళధళ్యముచేత దీనిం జేతనమే యనుకొంటిని గాని తుదకది భ్రమయని తెలిసికొంటి.

ఆహా! కలకల నవ్వుచున్న దీని మొగమెంత వింతగా నున్నదియో పరీక్షింపుము. దీనిం జిత్రకారుడు చేతితో వ్రాయలేదు సుమీ! చేతితో వ్రాసినచో దీవి యంగములు కందక యింత లావణ్యమయములుగా నుండునా? లిపికారుం డెందైన నొక సుందరిం గని దానిమాదిరిగా నిది వ్రాసెనో? లేక స్వమనీషా విశేషకల్పన నిట్టిదాని వ్రాసెనో? యెరుంగరాదు? లోకములో నింత చక్కఁదనము గల కలకంఠు లుందురా? ఉండినచో నట్టిదానిం కౌఁగిట జేర్చుకొనువానిదేగదా భాగ్యము. మిత్రమా? నీబహుశ్రుతత్వము సార్దకము నొంద దీని వృత్తాంత మరయుము. దీనివంటి నాల్గింటిందెచ్చి నాకుఁ బెండ్లిఁ జేయనిచో నిప్పుడ ప్రాణంబులఁ బోగొట్టుకొనియెద నని యత్యంత విరహతాపంబున గొట్టుకొనుచున్న యా రాజుపట్టికి మంత్రిపట్టి యిట్లనియె.

విక్రమసింహా! రంగులతో వ్రాసిన విగ్రహమును జూచియే యింత విరహతాప మందుచున్నా వేమి? అయ్యో! మంచి ధైర్యశాలివే. ఇది నిజముగా రమణియైనచో నెంత విరాళిందూలెదవో గదా? చాలు చాలు. ఊరకుండుము. ఎవ్వరైనం జూచిన నవ్వుదురు. దీని నిజం బరసి నిజముగా నిట్టికాంత యీభూమియెం దెక్కడ నున్నను గన్యకయైనచో నీకుఁ బెండ్లి జేసెద. నీవోరుపు గలిగి యుండవలయు ననుటయుఁ దదీయవచనంబుల కెంతేని సంతసించి ప్రియవయస్యా? వయస్యునికీ యుపకారము వేగముగాఁ జేయఁ బ్రయత్నింపుమని దైన్యముగాఁ బ్రార్థించుటయు నతండు వల్లె యని యప్పుడు క్రమంబున నియ్యూరనున్న వృద్ధులనెల్ల నా చిత్రఫలకవృత్తాంత మడుగుటయు నందొక వృద్ధబ్రాహ్మణుం డిట్లనియె.

అయ్యా! మూడేండ్ల క్రిందట మళయాళదేశ రాజధానియగు ననంతపురము నుండి పుణీకుండను చిత్రకారుఁడు వచ్చి యచ్చట దీనిం గట్టిపోయెను. కట్టుటకు కారణము నాకుఁ తెలియదు. ఇంతియ మే మెఱింగిన వృత్తాంతమనిన విని మంత్రినందనుఁడు కొంత సంతసించి వాని నామంబును, గ్రామంబును వ్రాసికొని విక్రమసింహునితో నప్పుడ యప్పురంబు వెడలి కతిపయప్రయాణంబుల నయ్యనంతపురంబు సేరి తప్పురజనుల వలనం దెలిసికొని వాని యింటికరిగెను .

విపునికుండును వారి నుచితసత్కారంబుల నాదరించి కూర్చున్న పిమ్మటఁ గొంతసేపునకు వినయంబున నాగమనకారణం బడుగుటయు సంతసించి బహుశ్రుతుం డిట్లనియె.

విపుణికా! యీతండు చోళదేశపు రాజకుమారుండు నేను దదీయ మంత్రినందనుండ. మేమిరువురము దేశసంచారమునకై వెడలి తిరుగురు నీచేఁ గ్రౌంచపురంబుననున్న సత్రమందిరపు సింహద్వారమున వ్రేలంగట్టబడిన చిత్రఫలకముఁ జూచితిమి. అందు వ్రాయబడిన పడతుం జూచి మారాజనందనుడు విరాళిం దూలుచున్నవాడు.

అచ్చటి వారిచే నది నీచే వ్రాయఁబడినదని విని మేము నీచెంత కరుదెంచితిమి. అది నీవు బుద్ధిసూక్ష్మతచే వ్రాసితివా? అట్టి సుందరి యెందైనఁ గలదా? దాని యుదంత మెఱింగింపుమని యడిగిన నతండు మొగంబునం జిరునగ వంకురింవ వారి కిట్లనియె.

అయ్యా! నేనొకప్పుడు కాశీపురి కేగితిని. ఎచ్చటనుండియో కాని యప్పుడే యచ్చటికిఁ బురుషద్వేషిణియను రాజపుత్రిక వచ్చినది. సార్ధకనామముగల యాకలకంఠి పురుషులమొగ మెన్నండును చూడకపోవుటయే గాక యాందోళిక మెక్కి వీధి నరుగునప్పు డాపల్లకిని గూడ పురుషులు చూడఁగూడ దఁట. ఆ చిన్నది మణికర్ణికా ఘట్టమునకు స్నానమున కరుగునప్పు డట్లు చాటించుచుండ నేనాలించి యమ్మించుబోణి యెంత చక్కనిదోయని దానిం జూచు వేడుక నా కెడదబొడమిన బెక్కు తెరంగులఁ జింతించి తుదకొక్క యుపాయ మూహించితిని.

నేను జలస్థంభనముఁ జేయగలను. ఆమెకన్న ముందరనే యరిగి మణికర్ణికాఘట్టంబున జలంబుల మునింగియుంటిని. పిమ్మట నావాల్గంటియుఁ బెక్కురు చెలికత్తియెలు బెత్తంబులం బూని చుట్టును ముట్టిరా నాఘట్టంబున కరిగి మాటుగట్టిన పుట్టుంబు టెంకి బల్లకిదిగి గంగలో మోకాలిబంటి జలంబున నిలిచి చెలికత్తెయలు కనకకలశంబు లెత్తి జలంబులు పై నిడ దీర్థమాడెను. జలచరభీతిచే నవగాహస్నాన మాచరించినది కాదు. దానంజేసి జలంబుల మునిగియున్న నాకు నీటితో గుందనపుకమ్ములవలెఁ దళుక్కురని మెరయుచుఁ దదీయ పదాంగుష్ఠంబులు మాత్రము గనంబడినవి. యితరాకార మేమియు గనంబడలేదు.

స్నానముఁజేసి యాసరోజముఖి యేగిన వెనుక నేనును జలంబు వెడలివచ్చి సాముద్రికశాస్త్రమంతయు బూర్ణంబుగాఁ జదివినవాఁడ నగుట నాయంగుష్టంబు పోలికంబట్టి రూపమంతయు వ్రాసితిని ఆ సుందరి యట్లుండుట కేమియు సందియంబు లేదు.

దాని నట్లు వ్రాసి దేశంబునకు వచ్చుచు దారిలో మీరు చూచిన సత్రమున నొకనాఁడు బసచేసి యది పదుగురు వచ్చిపోవు సత్రమని యూహించి అది యందు వ్రేలఁగట్టి యేగితిని. ఇదియ దాని వృత్తాంత మింతకన్న నా చిన్నదాని దేశ, కుల, శీల నామంబులు నాకుఁ తెలియదని యెఱింగించిన నా మంత్రినందనుండు తలకంపించుచు నోహో! యిక్కార్యము సమర్ధింప మిగుల నసాధ్యముగనున్నది. ఆ చిన్నది యున్న నెలవు వీనిమాటలచేఁ దేటపడలేదు. విక్రమసింహుని విరహతాప మగ్గలమగుచున్నది. దైవానుగ్రహ మెట్లున్నదో గదాయని పరిపరిగతులఁ దలపోయుచుండ బహుశ్రుతునకు విక్రమసింహు డిట్లనియె.

అన్నా! యీచిత్రకారుని మాటలు వింటివిగదా? పురుషద్వేషిణి యను పేరం బరగు నా నారీమణి పటములో నున్నట్లుండుట కేమియు సందియములేదు. తనకు సరిపడిన పురుషుల లేమింజేసి సామాన్యులఁ జూడనొల్లకయే యప్పల్లవపాణి పురుషద్వేషిణి యనుపేరు పెట్టుకొనినది. ఎట్లయినను వెదకి యమ్మదవతిని నాకుఁ గూర్తు నంటివేని మేనఁ బ్రాణంబులఁబూనియుందును. లేనిచో నిప్పుడ యొడలు విడుచువాఁడ నాయుల్లంబెల్ల నప్పల్లవాధరి దరిజేరయున్నది. దీనికేమని యెదవని యడిగిన నతండు శీఘ్రకాలములో నీధరిత్రి నెక్కడనున్నను నాచిన్నదానిం దెచ్చి నీకుఁ బెండ్లి చేసెదనని ప్రతిజ్ఞ చేసెను.

పిమ్మట నా చిత్రకారునిచే ననిపించుకొని వారువురు నప్పురంబు వెడలి యప్పడఁతి నరయుచుఁ బెక్కు దేశంబులు దిరిగిరి.

ఒక్కనాడుదయంబున లేచి వారొక యడవి మార్గంబునం బడి నడచుచుండ నెండ తాకుడుకు మేనువాడ విక్రమసింహుడు నడువలేక యొక మ్రాకునీడం జదికిలఁ బడి అన్నా! బహుశ్రుతా! నాకీ యెండలో నడువ మిగుల శ్రమముగానున్నది. నాలుక యెండి మాటరాకయున్నది. దాహమగుచున్నది. గాన నేనిక్కడని పండుకొని యుండెద. ప్రాంతమున జలప్రదేశమున్నదేమో యరసి జలము దెత్తువేని దప్పి తీర్చుకొని నడిచెదం గాని యిప్పుడొక యడుగైన నడువనోప. అయ్యయో యిది మరుప్రదేశములాగున్నది. నీరు దేవ నాలస్యమైనచోఁ బ్రాణంబులు నిలువవు త్వరగా తెమ్మని దీనుండై యడిగిన చెలికాని దైన్యంబునకు వగచి యప్పుడా దిట్టయొక చెట్టు కొననెక్కి నలుదెసలం బరికింప నొకవంక జలవిహంగము లెగురుచుండుటఁ దిలకించి మేనుబులకింప సంతసముతో జెట్టుదిగి వయస్యా! యొకనిముషము తాళుము. ప్రాంతముననే జలమున్నది. వేగమున బోయి కొనివచ్చెదనని యతని నూరడం బలికి వడివడి జలంబులు దేర నాబహుశ్రుతుఁ డరిగెను. ఆ ప్రాంతముననే మానససరోవరంబునుంబోని యొకతటాకం బతనికి నేత్రపర్వము గావించెను.

అదియు రత్నసోపానంబులును కాంచనపద్మంబులును బంగారుకలువల గనకమణిరజితజలచరంబు నింద్రనీలబంభరంబులు గారుత్మతజలపతంగంబులుం కలిగి కుసుమతరులతావితానంబు తీరదారుణి నలంకరింప నమృతప్రాయంబగు తోయంబులచే నిండింపఁబడి యలఁతి యలలచే వెలయు నక్కొలనుఁ గనుంగొని మిగులఁ జెలగుచు నతండు ప్రాంతమ్ము జేరునంతలో నందున్న శిలాఫలకంబున నిట్లు వ్రాయఁబడియున్నది.

ఇది పురుషద్వేషిణియను రాజపుత్రిక క్రీడించు కేళీసరోవరము. దీని పొంతకుఁ బురుషు లెవ్వరును రారాదు. వచ్చినవారిని క్షమింపక నురిదీయుదురు. అని యున్న లిపి ముమ్మారు చదివి సంతోషభయంబులు మనంబునం బెనగొన నతఁ డౌరా! నాకీ నీటినెపంబున నాబోటి కత దేటవడినది. దైవానుగ్రహ మిట్లుండవలయు. వేగబోయి యీవృత్తాంత మెఱింగించి నామిత్రుని డెందమున కానందము పొందుపరచెదనని నాలుగుమూలలు పరికించి వడివడి నత్తటాకంబులోనికిఁ దిగి కడుపునిండ నీరుద్రాగి విశాలపర్ణపుటంబున జలంబులం బట్టి యత్యంతజవంబున మిత్రునికడకు వచ్చుచుండెను.

ఇంతలో నచ్చట చెట్టుక్రిందఁ బండుకొనియున్న విక్రమసింహుఁడు ప్రాంత మందొక భయంకరమగు ధ్వని వినంబడిన నిరాయుధుఁడై యున్న కతంబున వెరచి తటాలున నికటంబున నున్న సాలవృక్ష మెక్కెను.

పిమ్మట నొకసింగ మ్మతిరయంబున బరతెంచి వీకమై తోకఁద్రిప్పుచు సటలు నిక్కబట్టి యాచెట్టుక్రింద గద్దియం బెట్టుకొని కూర్చుండెను. అంతకుమున్ను చెట్టుమీదఁ గ్రౌంచంబనుపక్షి పరుండియున్నది. సింహభీతిచే విక్రమసింహుఁడు నిదానింపక దాని రెక్కలను గూడ చెట్టుశాఖలే యనుకొను దట్టముగానున్న తత్పక్షంబుల మద్య దాగియుండెను.

ద్వీపాంతరమున వసించునదియు మిక్కిలి గొప్పదియు నగు నాపక్షి యప్పుడు కొంచెమలుకుడు తగిలినందున చెట్టుకొమ్మను విరుగ రివ్వున నెగసి గగనమార్గమునఁ గ్రౌంచద్వీపాభిముఖముగాఁ బోవజొచ్చెను.

అప్పుడపక్షి రెక్కలమధ్యను జిక్కు పడిన విక్రమసింహుడు భయపడి దాని రెక్కలపట్టు విడువక అయ్యో! మేమొక్కటి దలంచిన దైవమొక్కటి దలంచెనే? అక్కటా! నన్నీపక్షి యెక్కెడి కెత్తుకొనిపోవునో కదా! నాదినములు మంచివికావు. ఇంటియొద్దనుండి సుఖముగా రాజ్యముసేయక విదేశగమనబుద్ధి యేలపట్టవలయును మిత్రుఁడు ననుగానక యెంత చింతించునో యేమి సేయుదు? వాని కీవార్త యెట్లు తెలియునో యనేకప్రకారంబుల విలపించచు నొకచీటి వ్రాసి యది నేలంబడవైచెను

క్రౌంచద్వీపముకథ

ఆ పక్షియు నక్షీణజవంబున ననేకదేశంబులును ద్వీపంబులు దాటి క్రౌంచద్వీపమున నొకచెట్టుమీద వ్రాలెను. తరచుగ నాపక్షులా ద్వీపమున వసించి యెప్పుడైన జంబూద్వీపమునకుఁ మేతకై వచ్చుచుండును. దానంబట్టియే యాద్వీపమునకుఁ గ్రౌంచద్వీపమని పేరు వచ్చినది.

అట్లు వ్రాలినతోడనే విక్రమసింహుఁడు మెల్లన దానిరెక్కలసందునుండి తప్పించుకొని యామ్రానుకొమ్మ లాధారముగా భూమికి దిగెను. ఆ పక్షి యతఁడు తన రెక్కలలోఁ జిక్కుటయు దిగుటయు గూఁడ నెఱుఁగదు. దాని బలమెట్టిదో చింతింపుము.

అట్లు దిగి దైర్యమే తనకు సహాయమైయుండఁ గొండొకదెసగా నడువఁ జొచ్చెను. నడువనడువఁ గొంతసేపున కొకపట్టణప్రాంతము జేరునంత నొకనెలఁత యెదురైనది.

దానిం జూచినంత నతండు నివ్వెరపడి పలుదెరంగులఁ జింతించుచుండ నయ్యండజయానయు నంతికము కరుదెంచి యత్యంతసుకుమారుండు నారాజ కుమారుఁ జూచి మోహించి తనభాషలో నీ వెవ్వఁడవని యడిగెను. ఆమాట వానికిఁ దెలియక నతఁడు మరల దానితో నీవు చెప్పినది నాకుఁ దెలియలేదు. నీ వెవ్వతెవని యడిగెను.

అతని మాటయు దానికిఁ దెలిసినది కాదు. ఇట్లొండొరుల యభిప్రాయములు మాటలచేఁ దేటవడమి వెరగంది చూచుచుండ నమ్మత్తకాశిని హస్తసంజ్ఞచే నతనిఁ దన యింటికి రమ్మని సూచించినది .

అతండప్పు డేమియుఁ జేయునదిదోచక వెంటవచ్చెదనను భావము మరల సంజ్ఞ మూలముగానే తేటపరచెను. అది క్రౌంచద్వీపమునకు రాజధానియైన యేకశిలానగరము. దానిం గ్రౌంచవతియను రాణి పాలించుచున్నది. అందున్న స్త్రీలకు మిగుల చక్కఁదనము గలదుగాని వారికృత్యములు రాక్షసకృత్యములు. పురుషు లందఱు నల్లని కోతిముఖములవంటి ముఖములు గలవారును బొట్టివారు నగుట వికారముగ నుందురు.

పూర్వము రామరావణయుద్ధంబున మూర్చంబడియున్న లక్ష్మణునిం బ్రతికింప హనుమంతుఁడు ద్రోణగిరిఁదెచ్చి వెండియు నగ్గిరిఁ దీసికొనిపోవుచు నాక్రౌంచద్వీపమున నొక నిమిషము విశ్రమించెను. మిక్కిలి చక్కనివారగు నచ్చటి పురుషు లతనిం గని పరిహసించిరి, దానం గోపించి యప్పవననందనుఁ డందున్న పురుషులను వారికిఁ బొడము పుత్రులును వానరముఖములును వామనులై యుందురనియు స్త్రీలు రాక్షసకృత్యంబులు గలవారై యొప్పుదురనియు శపించి యేగెను. సాధులంగని పరిహసించిన పాతక మూరకపోవునా?

అట్టి దీవియందు మిక్కిలి చక్కనివాఁడగు విక్రమసింహునిఁ జూచి యా చిన్నది సంతసించుట యేమి యాశ్చర్యము ? పట్టరాని యానందముతో నారాచపట్టిని వెంటఁబెట్టుకొనిపోవుచు నా బాలిక దన యేలికసానియైన క్రౌంచవతి కావృత్తాంతము దెలిసినచో వానిఁ దనకు దక్కనీయదను భయమున నతని రహస్యముగాఁ దన యింటికిఁ గొనిపోవఁదలంచెను. తాననుకొనిన యట్లు చేయసాగినదికాదు.

దారిలో మరియొకతె దారసిల్లి పుష్పవతి యను పేరంబరగు మొదటిదానిం జూచి యక్కా! ఇంత చక్కని పురుషుం డెక్కడనుండి వచ్చెనే? పురుషులలోఁ గూడ నింత వింతగలవారుందరు కాఁబోలు. వీనికథ యెట్టిదని యడిగినది. నాతి! యీతఁడెందుండి వచ్చెనో యెవ్వండో నాకుఁ దెలియదు. ఇప్పుడే చూచితిని వీని యందు మనభాష తెలియని లోపమొక్కటియే యగుపడుచున్నది. మనమిరువురము వీని రహస్యముగా నింటికిఁ దీసికొనిపోయి పెండ్లి యాడుదుము. మనరాణికిఁ తెలిసినచోఁ గామాతురురాలగు నామె వీని మనకు దక్కనీయదు సుమీ! యనుటయు నప్పొలఁతియు సంతసముతో నందులకియ్యకొని చయ్యన వారివెంట నడువజొచ్చెను.

ఇంతలో నింకొక నెలంత యంతిరమున కరుదెంచి యాదేశమునకు వింతగా నున్న విక్రమసింహునిఁ జూచి మోహముతో నోహో! ఇంతులారా! యింత సొగసుకాని నెక్కడ సంపాదించితిరి? నాకుఁగూడ భాగమీయవలయును. అనుటయు వారొడంబడనినాఁడు తమగుట్టు బయలగుననియే యట్టిపని కియ్యకొనిరి.

ఆ ముగ్గురు మగువలు వానిందోడ్కొని వేగముగాఁ బోవుచుండుటయు మరి యిరువురు తరుణులు గనంబడి వాని సోయగంబున కచ్చెరువందుచుఁ దమకుకూడ వానిం బతిజేయుఁడని మొదటివారిం బ్రతిమాలిరి.

అప్పనికొప్పుకొని యప్పడతులెల్ల నడచుచుండ నింతలోఁ బురంబంతయు వింతపురుషుఁడు వచ్చెనని ప్రతీతి మ్రోయ నాయూరంగల కలకంఠులెల్ల నుల్లములలర వానింజూచుటకై గుంపుగుంపులుగా రాఁదొడగిరి. అచ్చటి స్త్రీలకేగాని పురుమల కేవిధమగు స్వాతంత్ర్యములేదు. దానజేసియే యాదేశంబున స్త్రీలకు జారత్వము నింద్యము లేదు.

వచ్చినవారెల్ల వానిం జూచి విస్మయమందుచు దమకుఁ బతి జేసుకొనవలయు నని నుద్దేశముతోఁ దమ యిళ్ళకు రమ్మని సూచించిరి. కాని విక్రమసింహుఁడా నెలంతలరాక యంతయుం జూచి స్వాంతమున బెక్కు తెరంగులఁ జింతించుచు నెవ్వరివెంట బోక మొదటఁ దన్ను జూచిన పుష్పవతి యింటికే యరిగెను.

అదియు నతని బహుప్రకారముల సత్కరించెను. దాని సత్కారము లేమియు వాని హృదయమునకు సంతోషము గలుగజేసినవి కావు వారి యాహార విహారములు గూడ వానికి మిగుల విపరీతములుగాఁ గనంబడినవి. పచ్చిమాంసమునే భుజింతురు. కోపము వచ్చినపుడు మగవారిం జంపి తినుచుందురు. విక్రమసింహుఁడందుఁ బాల చేతను ఫలములచేతను నాకలిదీర్చుకొనుచుండె. ఏ విధమైన మాంసమును దినుట లేదు.

పురుషద్వేషిణీవిరహసంతాపమూలకమగు మిత్రవియోగ శోక మతని హృదయమునం దత్పురవాస క్లేశము బలపరచు చుండెను.

బుద్ధిమంతుడగు నతండు పదిదినములలోనే వారి భాషా మర్మమంతయు గ్రహించి వారు చేయు దారుణ కృత్యములకు భయపడుచు మాట్లాడనచోఁ దగుల మెక్కుడగునని భాష రానివానివలెనే యభినయించుచుఁ దరుచు మౌనముగానే యుండెను.

ఇట్లుండునంత నన్నెలంత యొక్కనాఁడు తన్నుఁ గామగ్రీడల దేల్చుమని బ్రతిమాలినతండు పెక్కుగతులనట్టి పనిమాని వేయుటయే యుత్తమమని తలంచెను గాని దాని దైన్యోక్తు లతని తలంపు నిలువ నిచ్చినవి కావు.

అతండు చితసురతంబున నయ్యతివమతుక పరచుచుఁ గొన్ని దినంబులు గడపిన పిమ్మట నొకనాఁ డాపుష్పవతి పయింగల యీసునం జేసి కొందఱు సుందరులు క్రౌంచవతి యను రాణియొద్ద కరిగి వాని వృత్తాంతమంతయుం జెప్పిరి. చపలస్వభావయగు నమ్మగువ యట్టిమాట లాలించినయంత మేనెల్లం బులకరింప నెదుట నున్న యొకచేటి కంజీరి నీవతిరయంబుననరిగి యావన్నెకానితోఁగూడ పుష్పవతిం దొడ్కొనిరమ్మని పంపిన నమ్మించుఁబోఁడియు రాణినానతి నయ్యతివ కెఱింగించిన సంచలించిన డెందముతో నమ్మందయాన యాసుందరుం దోడ్కొని యప్పడయ్యేలికసానియొద్ద కరుదెంచినది.

దాని పజ్జ వచ్చుచున్న యారాచ చిన్నవానిం జూచి యాకాంత యత్యంత కంతు సంతాపవేధిత స్వాంతయై యెదురేగి యమ్మదవతీ మదనుని కంఠంబు భుజమృణాళంబుల బిగియంబట్టి తోడ్కొనివచ్చి యర్ధ సింహాసనమునఁ గూర్చుండఁబెట్టి మిగుల గౌరవించి పుష్పవతి కిట్లనియె.

పుష్పవతీ! యంధకార కూపంబునకు భాస్కరుండువోలె విపరీత జన నివేనం బగు మన దేశంబునకు నీ దివ్యపురుషుం డరుగుదేరనాకా తెరంగెరుఁకపరచక నీ యింటదాచుకొంటివేల. “రత్నహారీతు పార్ధివః" అనునట్లు వింతవస్తువులు దొరికినప్పు డేలికలకుఁ దెచ్చి యిచ్చు న్యాయ మెఱుంగవా? చాలు చాలు పోపొమ్మని దాని మందలించి విక్రమసింహునిం దోడ్కొకి యంతఃపురమున కరిగినది.

విక్రమసింహుఁడా రాణి వైభవమంతయుఁ జూచియు నామెకుఁ దనపై గల మోహమెఱింగియు నించుకయేని సంతసము వహింపఁడయ్యెను. “దుఃఖితేమనసి సర్వమసహ్యం” అనుమాట దప్పునా? పిమ్మట రాణియు వానిఁజూచి యార్యా! మా పూర్వపుణ్యంబున మిమ్ముఁ బొడగంటిమి. మాదురవస్థఁ బాపుటకై వచ్చిన భగవంతుఁడవని తోఁచుచున్నది. సుందరపురుష సంయోగంబు లేమింజేసి యీ దేశ స్త్రీలకుఁ బొడము పురుష సంతానమంతయు వికృతరూపముగా వెలయుచున్నది. నేనును గ్రొత్తగా సింహాసన మెక్కితిని. నాకును వికృతరూపుఁడగు నొకపురుషుఁడు గలఁడు గాని వానిమొగ మిదివరకు నేను జూడలేదు. నన్ను నీవు భార్యగా స్వీకరించి నాకొక పుత్రుం దయచేయుఁడని ప్రార్ధించిన దానిమాట లంగీకరించి యతం డనురాగము దోపఁ దదభీష్టముల నెరవేర్చెను.

అట్లు కొన్నిదినంబు లారాణితో విక్రమసింహుఁడు వేడుకగాఁ గ్రీడలఁ దేలునంత నాకాంత గర్భవతి యయ్యెను.

ఆ దేశమందు గర్భిణీ స్త్రీలు పురుష సాంగత్యము చేయరు. అట్టి చిహ్నములు దేటపడగా నాబోఁటి యతనితో నాథా! నీ కరుణావిశేషంబునఁ బుత్రుండుదయించు లక్షణములు గనఁబడుచున్నవి. కొన్ని నెలలవఱకు నాకు బురుషసాంగత్యముకూడదు. నాకు కుసుమగంధి యను చెల్లెలు గలదు. అది రూపంబునకు శీలంబునను నన్నుమించి యున్నది. అంతదనుక దాని డెందంబున కానందము సంఘటింపుమని యవ్వనితను రప్పించి యతనికిఁ జూపించిన సంతసించి నాటంబోలె యా విక్రమసింహుఁ డాతలిరుబోణితోఁ గ్రీడించుచు దానికిఁ గూడ నెలతప్పినచొప్పు తెల్లమైన తోడనే యావాల్గంటి నంట మానివేసెను.

అప్పుడాయూరఁగల నారీమణు లావిధంబెరింగి యారాణి ననుమతిం బ్రతిదినమును వంతుప్రకారమరిగి యతనివలన నభీష్టకామంబులఁ దీర్చుకొనుచుండిరి.

విక్రమసింహుఁ డాభాష సాంగముగా నెరింగియున్న కతంబున నప్పుడప్పుడు సభలుచేయుచు వారి దురాచారముల గుఱించి యుపన్యాసములు వ్రాసి చదువుచుఁ గ్రమంబున వారి క్రౌర్యముల దగ్గింపఁ దొడఁగెను.

మఱియు నొక శుభలగ్నంబున నారాణికొక పుత్రుం డుదయించెను. ఆ బాలుండును నా దేశపు శిశువులవలెఁ గాక సర్వావయవ సుందరుండై యుండుటం జూచి రాణియు బంధువులు నానందమందుచుఁ గ్రౌంచద్వీప చక్రవర్తి యుదయించెనని ప్రకటింపం దొడంగిరి.

కాలక్రమంబున విక్రమసింహునితోఁ గ్రీడించిన చేడియలందఱు నందముగల నందనులంగనిరి. అప్పుడందఱు నా విక్రమసింహువి క్రౌంచద్వీప పురుషులకుఁ గల దుర్దశలఁ బాపుటకై వచ్చిన పరమేశ్వరుఁడని వినుతించుచు నతఁడు చెప్పిన పనులెల్లఁ జేయ సిద్ధముగ నుండిరి.

అట్టి గౌరవము వచ్చినప్పుడు గూడ విక్రమసింహునకు మిత్ర వియోగ సంతాపంబు ద్వీపాంతరవాస క్లేశంబును సంతోషమును గలుగ నిచ్చినవికావి. అతఁడు పెక్కు తెరంగుల దన దేశమునకుఁ బోవ బ్రయత్నించెను గాని అచ్చటివారికి జంబూద్వీపనామమే తెలియమి నట్టి యుద్యోగము కొనసాగినదికాదు.

ఆ దేశ స్త్రీలకుఁ బూర్వమే పురుషుల యెడ గౌరవమలఁతియై యున్నది. విక్రమసింహుఁడు వచ్చినది మొదలమ్మదవతులు పతుల మరియుం జుల్కనగాఁ జూడఁదొడంగిరి.

ఒకనాఁడా దేశ పురుషులందఱు నొక్కచోటఁజేరి యిట్లు తలపోసిరి. అయ్యో! మనగతి యేమైనదియో చూచితిరా. మనభార్య లందఱు మనలం జూడక యెచ్చట నుండియో వచ్చినవాని యెడ మక్కువ గలిగి వానితోఁ గ్రీడించుచు సంతానమును గనుచుండిరి. కొలఁది కాలములో నీ దీవియంతయు వాని సంతానమే వ్యాపించును. మనమును మన సంతానమును మృగములవలె నిఁక నడవిపాలు గావలసివచ్చును. తన సతి యుపపతితోఁ గ్రీడించుచుండ నెట్టి నీచునకైనను మనంబున నీర్ష్య జనింపకుండునా? వీఁడు మనకు శత్రువు. వీని నెట్లయిననుఁ బరిభవింపఁవలయును. మనలోఁ గొందఱికి రాణి యంతఃపురమున కరుఁగ జనువు గలిగియున్నదిగదా! రాత్రివాఁడు నిద్రించునప్పుడు మంచముతోఁగూడ మోచికొనిపోయి సముద్రంబునం బారవేయుద మని యొండొరు లాలోచించుకొని యారేయివాఁడు నిద్రించుచున్న మంచము మెల్లన నెత్తుకొని యతిరవంబున సముద్రంబునం బారవేయుటకై నడుచుచుండిరి.

ఇంతలో విక్రమసింహుఁడు మేల్కొని కన్నులు దెరచిచూడ నాకాశమును నక్షత్రంబులు గనంబడినవి. వెరచి యతండదిరిపడి లేచి మంచముమీఁద గూర్చుండి యావామనులాడుకొను వాక్యములు కొన్ని విని వారు దన్ను సముద్రంబునం బడవేయఁ గొనిపోవుచున్నవారని నిశ్చయించి తప్పించుకొను నుపాయం బరయుచుండ నొక వృక్షము క్రిందుగా నరుగునప్పు డాతండు తెప్పున శాఖనందుకొని యాచెట్టుపై కెగఁబ్రాకెను.

వారది యెఱుంగక క్రమంబునంబోయి యా మంచమును సముద్రంబునం బారవైచి తమ దాయాదుఁడు హతుఁడయ్యెఁగదా యని సంతోషముతో నింటికరిగిరి. రాణియు నచ్చటి స్త్రీలందఱు మరునాఁడు విక్రమసింహునింగానక పెక్కు తెరంగుల శోకించుచుఁ దుదకుఁ దమ పురుషుల కపటమువలననే హతుఁడయ్యెనని యెఱింగి యట్టివారిని నుగ్రశిక్షకుఁ బాత్రులఁజేసిరి. కాలక్రమంబున యౌవనవంతుడైన విక్రమసింహుని పుత్రుఁడే యాదీవికి రాజయ్యెను. ఇదియునుంగాక బ్రహ్మసంతతికిఁబోలె నాదీవియంతయు విక్రమసింహుని సంతతియే క్రమంబున వ్యాపించెను.

అర్ధరాత్రంబున విక్రసింహుడట్లు చెట్టుపై కెఁగబ్రాకిన తోడనే మున్ను తన్ను జంబూద్వీపమునుండి క్రౌంచద్వీపమునకుఁ గొని తెచ్చిన బక్షియే యందు బరుండియున్నది ఆ సంగతి యతం డెఱుఁగక పూర్వమువలె దానిరెక్కల సందున దాగి యున్నంత నప్పతంగంబు దైవగతి రివ్వున నెగసి మరల జంబూద్వీపాభిముఖముగాఁ నతిజవంబునం బోవఁదొడంగినం జూచి యతండోహో! యిది మునుపటి పక్షిలా గున్నది. నన్ను మరల జంబూద్వీపమునకుం గొనిపోవుచున్నదాయేమీ? నాయందు దైవమున కనుగ్రహమువచ్చి యుండఁబోలు. కష్టములు కోరక సంప్రాప్తించునట్లు కాలక్రమంబున సౌఖ్యంబులు నొనగూడునని పెద్దలు చెప్పుదురు. ఆ మాటలు నేఁటికిఁ దార్కాణమైనవి.

దైవము నన్నుఁ రక్షించుఁగావుతమని యనేకప్రకారంబుల భగవంతుని ధ్యానించుచుండ మార్తాండుం డుదయగిరిశిఖర మలంకరించినంత నా శకుంతంబు పూర్వము విక్రమసింహుఁడు సింహభీతిచే నెక్కినచెట్టుమీదనే వ్రాలెను. దైవానుకూలదినములలో నొరులు తనకుఁ జేయు సహకారములు నుపకారములే యగును. విక్రమసింహుని మరణవిధికై నడిపించిన వామనుల దురాలోచన మతనిని స్వదేశము జేర్చినది.

అప్పుడు విక్రమసింహుఁడు మెల్లన కొమ్మలఁ బట్టుకొని పుడమికి దిగి యది మున్ను దాను బహుశ్రుతునితో వియోగమునొందిన బ్రదేశముగాఁ దెలిసికొని దైవగతి ననేకగతులఁ కొనియాడుచు బహుశ్రుతుని గుఱించి పరిపరిగతులం దలంచుచు నతని జాడ దెలియఁగోరి కొంచెము సాగినంత నతం డెదురుగా వచ్చుచుండెను.

అల్లంత దవ్వున వానింజూచి విక్రమసింహుఁ డంతరంగమున నోహో! యితండు బహుశ్రుతుడేనా? కాఁడు. అంతటి భాగ్యము నాకింతటిలో లభించునా ? వాని విడిచి సంవత్సరమైనది. ఇంతదనుక నిందే యుండునా ! అని వేతెఱంగుల దలపోయుచుండెను. విక్రమసింహునిం జూచినతోడనే యతనికిఁ దోచిన యూహ లన్నియు బహుశ్రుతుని హృదయమందును జనించినవి.

ఇరువురు దారసించినతోడనే యోహో బహుశ్రుతా! కనంబడితివా ! యనియు ఏమి నా ప్రాణమిత్రుఁడు విక్రమసింహుఁడే యనియు నొండొరులఁ బలకరించు కొనుచు గాఢాలింగనములు సేసికొని పెద్దతడవు కంఠంబుల నెలుఁగు రాక యట్టు నిలువంబడి యెట్టకేలకుఁ దెరపి తెచ్చుకొని యొక చెట్టునీడం జేరి యన్యోన్యముభావ లోకనంబులం దనివినొందక యానంద మందుచున్న సమయంబున బహుశ్రుతుం డిట్లనియె. అన్నా! విక్రమసింహా! ఎందుబోయితివి? నీవేమేమి వింతలం జూచితివి? ఇన్ని దినంబులును సుఖంబుండితివి కదా! నేడీ యుదయఁ మిచ్చటి కెట్లు వచ్చితివి. ఎఱింగింపు మనుటయు విక్రమసింహుడు తాను సింహభీతిచేఁ జెట్టెక్కినది మొదలు బహుశ్రుతునం జూచువరకు జరిగిన కథ యంతయుఁ జెప్పెను.

బహుశ్రుతుఁడు వయస్యా! నీ వెండతాకున దాహార్తుండవై పడియుండ జలంబులు దేర నే నరిగితినిగదా! అట్టరిగినంత ప్రాంతముననే వింతయగు నొక కొలను గనంబడినది. దాని విలాసంబు మానస సరోవరంబునకైన లేదని నుడవవచ్చును. దాని కచ్చెరువందుచు నలుదెసలఁ బరికించుచుండ నొకదండ శిలాఫలకంబున ఇది పురుషద్వేషిణీ విహార సరోవరంబు దీని చెంతకుఁ బురుషులు రాఁగూడదు. వచ్చినవారికి మరణదండన విధింపబడు"నని వ్రాయబడియున్నది.

దానింజదివి భీతియు సంభ్రమంబును జనింప నట్టియుత్సాహంబు నీ కెఱింగింపఁగోరి యతిజవంబున జలంబుల నొక పర్ణపుటంబునం బట్టి యిచ్చటికి వచ్చితిని. ఇందు నిన్ను గానక పెద్దయెలుంగున విక్రమసింహా! యని పెక్కుసారులడవి ప్రతి ధ్వనులీయ నఱచితిని. యెప్పటికిని బ్రతివచనంబు వినంబడినదికాదు.

అప్పుడు గుండెపగుల ధైర్యమాపుకొనుచు నీయడుగులజాడ నరయుచుండ నందు సింహపాదచిహ్నంబులు గనంబడినవి. ఆ సింగము నిన్ను మ్రింగెనని నిశ్చయించి నేలం జతికిలఁబడి పెక్కువిధంబుల శోకించితిని. మిత్రమా! అప్పటిరీతిఁ దలంచుకొనిన నిప్పుడును గుండెలు కొట్టుకొనుచున్నవి. చూడుము. అరణ్యరోదనంబుగా నేనట్లెంత శోకించినను నా మొర వినువారు నోదార్చువారు లేకపోయిరి. నాకు నేను యుపశమించుకొని యొంటియై నింటి కరుగ నిచ్చ లేక చచ్చుటయే మేలని నిశ్చయించి యప్పంచాననమే నన్ను గూడఁ బట్టుకొని చంపునని నిశ్చయించి దాని జాడ నరయుచుఁ గొంతతడ వయ్యడవిలోఁ గ్రుమ్మరితిని.

అప్పు డొకచోట నొకకంటకలతాగ్రమునం దగులుకొని వ్రేలాడుచున్న పత్రికయొకటి గనంబడినది. అది యేమియోయని దాని నందుకొని విప్పిచూడ నందు “మిత్రుఁడు బహుశ్రుతునికి నమస్కారములు. నేను సింహభయంబునం జెట్టెక్కి యందొక్కపక్షి రెక్కలలోఁ జిక్కుపడిన నది నన్నెక్కడికో యెత్తుకొని పోవుచున్నది. దైవమీరీతి మనకు వియోగము సంఘటించెను. నన్ను మనంబున నెప్పుడును స్మరించుకొనుచుండుము. నీ మక్కువ మఱపురాదు. మిత్రుఁడు విక్రమసింహుడు" అని వ్రాయబడియున్నది. దానిఁ జదివినంత నీవు బ్రతికియుంటివిగదా యని కొంత దైర్యము తెచ్చుకొని మనుష్యునెత్తుకొని బోవునంత బలముగల పక్షి యెద్దియోయని యూహించుచు భవదీయదర్శనాశం జేసి మరణనిశ్చయంబు విడిచి ప్రాంతంబులఁగల పల్లెలకరిగి యాపక్షి విశేషంబడిగిన నందొక వృద్ధకిరాతుం డిట్లనియె.

అయ్యా! ఆ పక్షి యెద్దియో దానిపేరు మాకుఁ దెలియదు. అది సంవత్సరమున కొకసారి యీయడవికి వచ్చి రెండుమూఁడుదినంబు లిందుగల పాలవృక్షముపై వసించి యేఁగుచుండు. అది బహుకాలమునుండి యట్లె మాసపక్షదివసంబు లతిక్రమింప యేకరీతి వచ్చుచున్న యది. అది క్రూరమైనదికాదు. మనుష్యులఁ జులకనగా మోచుకొనపోవునంత బలముగలిగియున్నదని దాని వృత్తాంత మెరింగించినంతఁ గొంతసంతసించి యదిమరల వచ్చు దివసం బడిగి తెలిసికొని క్రమ్మర నీవా పక్షితో వత్తువేమో యను నాసచే నింత దనుక భగవంతుని నారాధించుచుఁ గందమూలంబుల నాఁకలి యడంచుకొని జడదారివోలె నీ యడవిని సంచరించుచుంటిని. ఈ దినం బుదయమున నది వచ్చుననే వినియుంటిని గాన దానం బరీక్షించి నీవు రానిచో నొడలు విడువఁదలచియే యాపాలవృక్షముకడ నరుగుచున్నవాఁడ.

ఈదినం బెంత సుదినమో నిన్నుఁ దొడఁగంటి ఇదియ మదీయవృత్తాంత మనుటయు వాని విశ్వాసమునకుఁ దెలివికిని మిగుల మెచ్చుకొనుచు విక్రమసింహుఁ డన్నా! అది సరియేకాని నీ మాటలలో నమృతము సోకినట్లు నావీనుల కనుకూలములగు వాక్యములు కొన్ని వినంబడినవి. పురుషద్వేషిణి విహార సరోవరంబు గంటినంటివి. ఆవాల్గంటియున్న పట్టణ మీప్రాంతమున నుండఁబోలు. ఆప్రోయాలు మిన్నను నాకుఁ గూర్చి మున్ను పట్టిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనవా? యనన నతండు చాలు చాలు. ఈయాపదలతో నింటికరుగరాదా? యాపైదలి నామము వినినంత భయమగుచున్నది. దానిం బెండ్లి యాడుట సులభసాధ్యముకాదు. పెక్కిడుమలఁ బడవలసివచ్చును. ఈపాటి కింటికరిగి మనకై చింతించుచున్న తలితండ్రుల చింత యుడిగించి సుఖంబున రాజ్యము సేయుదుమనిన విని విక్రమసింహుఁడు మోహమున విన్నదనంబు దోపఁ నిస్సురని యిట్లనియె.

అయ్యో! నా కాతొయ్యలిం గూడక ప్రాణంబులు నిలుచునా ? విదేశములోఁగూడ నాస్వాంత మాకాంతమీఁదనే యున్నది. ఆ చిన్నది యున్నతా వెఱింగియు విరాగ వచనంబులు బలుకుచుంటివేమి? వెనుక జెప్పినమాట మరచితివా! ఆవాల్గంటింగూడక నేనింటికిరాను. నాకు రాజ్యమును గీజ్యమునుగూడ నక్కరలేదని యనేకవిధంబుల విరాళింగుందుచున్న యా రాజనందను నోదార్చి బహశ్రుతుం డిట్లనియె.

విక్రమసింహా! మిగుల నిడుములు గడిచితిమిగాన విరాగబుద్ధి నిట్లంటిని. నీవు జింతింపకుము. తృటిలో నీకు నాకుటిలాలకం గూర్తు నమ్మించుఁబోడి విహరించు జలాకరము వీక్షింతువుగాక పోదమురమ్మని యతని వెంటఁబెట్టుకొని యాసరసిదిరి కరిగెను. దానిం జూచిన తోడనే విక్రమసింహునకుఁ బురుషద్వేషిణిం జూచి నట్లయొడలు పులకరింప స్వాంతమున మిగుల సంతసము గలిగినది.

_________

పురుషద్వేషిణికథ

ఇంతలోఁ బురుషద్వేషిణి జలకేళిఁదేల వచ్చుచున్నదనియు బురుషులు దూరముగఁ బోవలయుననియుఁ జాటించు ధ్వనియొకటి వినఁబడినది అదిరిపడి వారు తత్తటాకతీరంబున దట్టముగా నల్లుకొనియున్న యొక్కచె ట్టెక్కి దానికొమ్మలసందున దాగి యా విలాసవతి జాడ జూచుచుండిరి.

పిమ్మట స్త్రీలచే వహింపఁబడిన బంగారుపల్లికి నెక్కి వేత్రపాణులై పెక్కండ్రు పల్లవపాణులు చుట్టును గొలిచిరాఁ జెలికత్తియలం గూడి యచ్చేడియ వేడుకతో నక్కొలను దరికరిగి యందాందోళికము దిగి సఖులతో నత్తటాకంబున జలకేళిం దేలుచున్న సమయంబున నయ్యంబుజానన సోయగం బీక్షించి యామె వయస్య లొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

కలభాషిణి — మంజువాణీ! చూడుచూడు. జలంబుల వెల్లకితలంబడి యీదుచున్న పురుషద్వేషిణి కుచంబులకును, నెఱ్ఱదామర మొగ్గలకును నంతరం బెఱుగ రాకున్నదిగదా?

మంజువాణి — ఔను. చూచుకంబుల నలుపు చిఱతుమ్మెదలు వ్రాలినట్టున్నది.

భ్రమరవేణి – బోఁటీ! నీయుపమ సమంజసమే. నీటిపై వెల్లకితలంబడి దేలియున్న యాప్రోయాలు మిన్న మోమెట్లున్నదో చెప్పుము.

కలభాషిణి - ఓసీ! అమాత్రము తెలిసికొనలేననుకొంటివా? తటాకంబునఁ బ్రతిఫలించిన చంద్రబింబమువలె నున్నది.

భ్రమర – మేలుమేలు. నా యూహతో నీయూహ యేకీభవించినది. కనుల నలమికొనిన కాటుక కళంకమువలె నున్నది సుమీ!

మంజు -- ఈసారి గుబ్బ లెట్లున్నవో చెప్పుము.

కలభా - మొగం బనుచంద్రుని నాశ్రయింప నరుగు చకోరమిథునంబువలె నుండలేదా?

మంజు - భళిరే కలభాషిణీ! మిక్కిలి చక్కని పోలిక దెచ్చితివి.

కలభా - మొగముగూడ నా కొకరీతి నగుపడుచున్నది. చూడుము.

మంజు- ఎట్లు.

కలభా - నాచుపైఁ దేలుచున్న కెందమ్మివలె శిరోజంబులపై నొప్పుచుండ లేదా ?

మంజు – నీవు మిగుల చతురవే, లెస్సగాఁ బోల్చితివి మఱి సరసి గలుషించిన కారణం బెఱింగింతువా?

కలభా- ఎఱిఁగితిని. పద్మపాదయు, మకరజంఘికయు నావార్తనాభియుఁ దరంగవళియుఁ గోకస్తనియు, మృణాళభుజయు, నిందీవరనేత్రయు శైవాలకేశయునగు నీకు శేశయపాణి యా యాయవయవంబులఁ దన్ను నిరసించుచున్నదని కదా

మంజు - చెలులారా! సర్వావయవసుందరయగు నీ సుందరి యరణ్యకౌముదియుంబోలె తన జవ్వనమంతయు వృధసేయుచుఁ బురుషులయెడ ద్వేషించు కారణమెద్దియో యరసితిరా?

సఖులు — మాకునుం దెలియదు. పెక్కుదినములనుండి తెలిసికొనవలయునని తాత్పర్యము గలిగియున్నది.

మంజు - అడిగి తెలిసికొందమా?

భ్రమ— అమ్మయ్యో! ఆమెయొద్ద పురుషులమాట తలపెట్ట నెవ్వరితరంబు.

మంజు - మన మడిగిన గోపము సేయునా?

కలభా - యుక్తిగా నడిగినచో మనకుఁ జెప్పకమాన దనుకొందును.

భ్రమ— అందులకు సమర్ధురాలు మన మంజువాణియే.

మంజు - నేనే యడిగెదను. రండి. భయమాయేమి యని యందఱు నామె యొద్దకరిగి సఖీ! నీళ్ళు చల్లుట మానుము కొంచెము నీతో మాట్లాడవలసిన పని యున్నది.

పురుషద్వేషిణి – సఖులారా! ఇంతలో నాయాటను మాన్పదగిన పని యేమి వచ్చినది?

మంజు — మఱి యేమియునులేదు. సమదు:ఖసుఖులమగు మాతో జెప్పఁదగని రహస్యముండునా.

పురు - మీకు నుడువరాని యేకాంతము నాకేమియును లేదే!

మంజు - అట్లయిన వినుము. నీవు లోకపరిపాటి స్త్రీలవలెఁగాక విరుద్ధంబగు వ్రతము బూని సుఖోచితంబగు కాలంబంతయు నూరక గడుపుచుండుట కెంతయు మాస్వాంతములు చింతిల్లుచున్నవి. కారణం బెద్దియేని కలిగిన నుడివి మాచింతఁ బాపవేడెదను.

పురుషద్వేషిణి — ఓహో! ఇదియా మీ ప్రశ్నము (అని తలవాల్చి యూరకొనును.)

మంజు - చెలీ! ఏమి తల వాల్చుకొని యూరకుంటివి. నేనిట్లడిగితినని కోపమా?

పురు - దానికేమి? పోనిమ్ము. వాలాడికొందము రండు.

మంజు - మన యాటలును. పాటలును, నీటులును జూచి, సంతసించు వారెవ్వరు?

పురు - మనకు మనమే సంతసింతము. ఒరుల సంతోషముతో మనకేమి పని.

మంజువాణి - అయ్యో! స్త్రీవిలాసము పురుషుని, బురుషవిలాసము స్త్రీని సంతోషపెట్టును గాని తన విలాసము తన కెన్నఁడు నానందము గలుఁగజేయదు.

పురు — ఇస్! అట్టి శబ్దము నాకుఁ గర్ణగఠోరముగా నున్నది. ఏమిటి కుచ్చరించితివి?

మంజు - అదియేకదా, నిన్ను మేమడుగుచుంటిమి. వారియెడ నీ కింతక్రౌర్య మేలకలిగినో దెలుపుము .

పురుష - వారి మొగము జూడకపోవుటయేగాక వారి తలంపుగూడ నా మది కసహ్యముగ నుండును.

మంజు – అయ్యో! వెఱ్ఱిదానివలెఁ బలుకుచుంటివి? మనతండ్రులు నన్నలు దమ్ములు బంధువులు మాత్రము మగవారుగారా? వారు హితులును పైవార లహితులునా ?

పురు - (చెవులు మూసుకొని) నాకందఱును సమానులే! నాకు జ్ఞానము వచ్చిన తరువాత నా తండ్రి మొగముకూడఁ జూడలేదు.

మంజు — అట్టికారణము చెప్పినంగాని విడువము.

పురు – నా తలిదండ్రు లడిగినను జెప్పినదానఁగాను. ఆ మాటలు నా కసహ్యము.

అప్పుడు పురుషద్వేషిణి బలవంతము మీద నిట్టు దనవృత్తాంతము జెప్పఁ దొడగెను.

__________

రత్నాంగి కథ

నాకు జాతిస్మృతి గలిగియున్నది. నేను పూర్వజన్మమునం దొకరత్నవర్తకుని కూఁతురను. నా పేరు రత్నాంగి. లేక లేక గలిగితిని. మా తండ్రి నన్ను గారాబముగాఁ బెనుచుచుఁ బ్రాయుమువచ్చినంత కాంతివర్మయను వైశ్యకుమారున కిచ్చి పెండ్లి జేసెను. నేనును బెండ్లియైన గొలది దినములకే, కాపురమునకు వెళ్ళితిని. నా మగండు మంచికుటుంబములోనివాఁడేకాని సహవాసదోసంబుననో పూర్వకర్మయంబుననో జూదరియై తిరుగుచుఁ గ్రమంబునఁ దాత తండ్రులు సంపాదించిన సొమ్మంతయుఁ గర్చుపెట్టఁ దొడంగెను. నేనును బెక్కుసారు లట్టిపని కూడదని బోధించితిని. నా బోధ వానియెడ నుపచరించినది కాదు. ఇంతటిలో ధనమంతయు వ్యయమైన వెనుక నొకనాఁడు జూదంబున దాకట్టుపడియున్న వానిని యొడలి నగ లిచ్చి విడిపించితిని.

అప్పటికైనను సిగ్గులేక నామెత్తతనము గనిపెట్టి నాకు మా తండ్రి యిచ్చిన సొమ్మంతయు నడిగి పుచ్చుకొని జూదంబున నోడిపోయెను. మఱికొన్ని దినంబులు ఋణముచేసి జూదంబాడెను. తుదకు దినఁగూడును గట్టవస్త్రమును లేక మొగము వాచితిమి. అప్పులవారు నా మగనిం బెట్టు నిర్బంధమును జూచి సహింపక యొక్కనాడు నే నతని వెంటబెట్టుకొని పుట్టిన యింటికరిగితిని. నాతండ్రి మా హీనస్థితి దెలియని వాడగుట మమ్ముమిగుల గౌరవించెను. అట్టి గౌరవముతోఁ గొన్ని దినంబు లందుండి యొక్క నాఁడు మగని నిమిత్తము బొంకి యతనితో నిట్లంటి.

నాయనా! మీ యల్లుడు మిగుల భాగ్యవంతుడను విషయము నీ వెఱింగినదియే కదా! ఆయన యిప్పుడు సముద్రవర్తకము చేయ నారంభించెను. కొన్నిదినముల క్రిందట నోడమీద రెండులక్షలు వెలగల సరకులు విదేశమున కెగుమతిచేసెను. ఆ యోడ యింకను రాలేదు, యిక్కడఁ గొన్నిసరకులు గొనవలసియున్నది. కొంత సొమ్ము బదులిచ్చినచో వడ్డీతో వెంటనే తీర్పించెదను. ఈపాటి యుపకార మల్లునికిఁ చేయవోపుదువే యని యడిగిన మాటలకు సంతసించి యతండు తల్లీ! మీరు మాత్రము నా సొత్తుదిన నర్హులుగారా? నాకు మరల నియ్యనక్కర లేదు. అవసరమున్న సొమ్ము తీసికొని పొండని యుత్తరము జెప్పెను.

ఆమాట నా మగనితో రహస్యముగాఁ జెప్పి మరల జూదమాడకుండునట్లును, నదివరకున్న ఋణముల దీర్చి మిగిలిన సొమ్ముతో యథోచితవ్యాపారములు చేయు నట్లును నతనిచే ముమ్మారు ప్రమాణికము చేయించి నాతండ్రియొద్దఁ గొంతసొమ్ము తీసికొని యతని కియ్యక నా యొద్దనే యుంచుకొని వానితో మరల నత్తవారి యూరి కరుగుచుంటిని. ఆ దుర్మార్గు డేమి చేసెనో చూచితిరా?

నే నావిత్తము స్వేచ్ఛావిహారము కీయనని యూహించి మార్గంబున నొక యగాధమందు నూయిగనంబడిన దానివింత నాకు జూపించువానివలె నభినయించుచు నేను దానిలోనికిఁ దొంగిచూచుచుండ నా రెండు పాదంబులు నెత్తి నన్ను దానిలోఁ బడద్రొబ్బి యా ధనంబంతయు దీసికొని యింటికరిగెను. దుష్టులకు జేయరానికృత్యము లుండునా? కూపంబునంబడిన తోడనే దైవకృపచే నీటిమట్టమున గోడలో మొలచిన మఱ్ఱిమొక్క యొక్కటి నా చేతికి దొరికినది. దాని యాధారమున నీటిలో మునుగక తేలియుంటిని. ఇంతలో బాటసారులెవ్వరో యాత్రోవం బోవుచు నీటికై వచ్చి యా బావియందు దేలి కొట్టుకొనుచున్న నన్నుజూచి "మనిషి మనిషి" యని యఱచుచు నతివేగంబునఁ బగ్గంబును గెడలు నాకూతగా నిచ్చి మెల్లన నన్నుఁ బైకిదీసిరి. సముద్రంబు వెడలివచ్చు లక్ష్మియుంబోలె నొప్పుచున్న నన్నుఁజూచి యాపుణ్యాత్ములు విస్మయమందుచు నా వృత్తాంతమడిగి తెలిసికొని మాతండ్రి ప్రసిద్ధియంతకు మున్న వినియున్న వారగుట మిగుల నాదరముతోఁ గొనిపోయి నన్ను మా తండ్రి కప్పగించిరి.

నా తండ్రి నాయవస్థకు మిగులఁ బరితపించుచు అమ్మా! నీమగం డేమయ్యె నూతిలో నేటికి బడితివి! నేను మీ కిచ్చిన ధనము సురక్షితముగా నున్నదా! యని యడిగిన నే నొక్కింత చింతించి నిజము చెప్పిన గాపురము చెడునని యూహించి యిట్లంటి. నాయనా! నేనును మీ యల్లుడును ధనంబుగొని యిచ్చటినుండి మా యూరి కరుగుచుండ నడుమ నడవిలోఁ గొందఱు దొంగలువచ్చి మా ధనంబ౦తయు దోచుకొనుటయేగాక మీ యల్లుని బారఁగొట్టి నన్ను నూతిలో బడద్రొబ్బిపోయిరి. నేనును దైవప్రేరితులగు మార్గస్థుల కరుణను నిన్నుఁ జేరితిని.

నా పతియు నూరుజేరి యుండవచ్చును. ఆయన నాకై తొట్రుపడుచుండును. వేగ నచ్చటి కరుగవలయునని ప్రయాణంబునకుఁ దొందరపడుదానివలె నభినయించుచుఁ దండ్రి నిర్భంధమునఁ గొన్ని దినంబులుండి యొకనాఁడు నా మగని జూడఁబోయెద నని మా తండ్రితోఁ జెప్పితిని. ఆతండందులకు సంతసించి మరల గొంతధనం బిచ్చి నన్నత్తవారింటి కనిపెను.

నా పల్లకీబోయెల నాదము వినినతోడనే నామగఁ డెద్దియో యనుకొని వాకిటకు వచ్చెను. నేనును బిల్లకిదిగి యెదురనున్న పతికి నమన్కరించి లోనికరిగి నన్ను జూచినంత యతఁడు విభ్రాంతుఁడై యేమియు ననలేక నిలచున్నంతఁ దత్కాలోచితవాక్యంబులచే నతని దిగులువాపి పూర్వమువలె ననురాగముతోఁ గాపురము జేయుచుంటిని. నన్నవమానవరచి తెచ్చిన ధన మంతకుమున్నే జూదంబున నోడిపోయెను. ఎప్పటి‌ దారిద్ర్యముతో నొప్పుచున్న వాని దైన్యమునకు మనంబునఁ బెక్కుగతులం జింతించుచు, నెప్పటికై నను బుద్ధివచ్చునేమోయని యప్పుడప్పుడు కొంచెము ధననహాయము చేయచుంటిని.

పాములకుఁ బాలుపోసినను విషమేయగుచున్నట్లు నా జేయు ధనసహాయము వలన నతనికి విపరీతబుద్ధి పుట్టినది. నేను పుట్టింటనుండి మిగుల ధనము తెచ్చితిననియుఁ దలంచి దనకుఁ జూదమాడుటకు నియ్యననియుఁ దలంచి యొక్కనాఁడు నేను నిద్రించుచుండ దయావిహీనుడై కటికివాఁడు పశువుంబలె నాగొంతు దరిగి చంపెను. నేను బలవన్మరణము నొందియుఁ బాతివ్రత్యవిశేషమహిమం జేసి యిట్టి యుత్కృష్టజన్మ మెత్తి జాతిజ్ఞానము గలిగియుంటిని.

ఎట్టి యుపకారము జేసినను మనంబున నిడికొనక యెన్నో గతులఁ దన్నాశ్రయించుచుండ నాయెడ నొక్కీంచుకేని యక్కటిక ముంచక నన్నుం బరిమార్చెను. వాని క్రూరత్వము వింటివిగద! సీ! వాని నొక్కనిని నననేల? యాజాతి యందట్టి క్రౌర్యము గలిగియున్నది. ఇచ్చకపుమాటలచే మత్తకాశినులు చిత్రవిత్తంబులు హరించి మోసపుచ్చుచుందురు. నాకుఁ దొల్లింటి తెలివి గలిగియున్నది. వాడు చేసిన మోసంబునకు మనంబున నీసు జనింప నాజాతియే చెడుజాతి యని విరసించి యిట్టి యుత్కృష్ఠవ్రతంబు బట్టితిని. మీరు నాకుఁ బ్రాణతుల్యులు గాన నింతవట్టు శమించి యెఱింగించితిని. ఇఁక నెన్నఁడు వారిప్రస్తావము నాచెంతఁ దేరాదు. తెచ్చినచో క్షమింపక శిక్షింప నియమింతునని కన్ను లెఱ్ఱఁజేసి యుగ్రంబుగాఁ బలికినది. అక్కలికిపలుకుల కులికి వారేమియు ననక యామె యానతి కొడంబడిరి. పిమ్మట నాకొమ్మయు జెలులతో మరలఁ గొంతసేపు జలకేళిం దేలి యప్పూబోఁడులు సేవింప నెప్పటియట్ల నిజనివాసంబున కరిగినది.

పిమ్మట విక్రమసింహుఁ డమ్మించుబోణి జూచినది మొదలు పంచేంద్రియవ్యాపారంబులు నయనేంద్రియమంద ప్రసరింప నన్య మెఱుఁగక తదీయరూపవిభ్రమవిలాసంబులు వర్ణించుచు నా చిన్నది యరిగినప్పుడు సైతము వాని మనంబుఁ గన్నుల వెంబడి నాయండజయాన వెన్నంటి యరిగెను. అయ్యతివ ప్రతిమఁ జూచినప్పుడే మోహపరవశుండైన వాఁడు నిజమైన యాకృతిఁ జూచినప్పుడు వివశుడగుట యక్క జము కాదు.

బహుశ్రుతుండును నా పాటలగందుల మాట లాలించుచు నాటలం జూచుచుఁ తదీయవిలాసంబంతయుం గాంచియు నప్రమత్తుడై యామానినులరిగిన పిమ్మట మెల్లన చెట్టుదిగి విక్రమసింహుని దిగుమని పలికిన నతఁ డొడలెరుఁగక చెట్టుకొమ్మ సందున చిక్కుపడి దిగకుండుటకు వెరగందుచు బహుశ్రుతుఁడు మరలఁ జెట్టెక్కి యెట్టకేలకు వానిఁ బ్రబోధితునిఁ జేసి బలాత్కారంబుగఁ జెట్టు దింపించెను.

అప్పుడు విక్రమసింహుఁడు తెలివితెచ్చుకొని విరహతాపముతో అన్నా! పురుషద్వేషిణి యెందేగినది. ఇప్పుడు నన్నా సుందరిం జేర్చుము. యోహో! యా మోహనాంగి సోయగం బీక్షించితివా? అది యంతయు నాకొక కలగానున్నది సుమీ! నిజముగా కలయేకాదుగద. కాదు. అదిగో! ఆ ముద్దులగుమ్మ జలకేళిం దేలిన కొలను కనఁబడుచున్నది. ఆ చిన్నదానిం గూడక నా ప్రాణంబులు నిలువవు. వేగ నట్టిప్రయత్నము చేయ నీ పాదంబుల కిదియే మ్రొక్కుచున్నవాడనని యడుగులంబడిన బహుశ్రుతుఁడు వాని లేవనెత్తి నవ్వుచు, ఆహా! మేటిధైర్యశాలివే. మాటిమాటికి నింత తొందరపడినచోఁ గార్యములు సమకూరునా? ఆ చేడియ లొండొరులాడుకొనిన మాట లాలించితివా? యని యడిగిన నతండన్నా! అప్పుడు నాచిత్తం బమ్మత్తకాశినీవిలాసవర్ణనాయత్తంబై యున్నదిగాక వారి మాటలలో నాకొక్కటియు వినఁబడినదికాదు. ఏమేమి సంభాషించుకొనిరో తెలియఁ జేయుమనివేడిన బహుశ్రుతుండు నాపూవుఁబోణు లాడుకొనిన మాటలన్నియుఁ జెప్పి మిత్రమా! నీవు చింతింపకుము. నీ కార్యము సులభమార్గమున సాధించెదరమ్ము. ఆ పురుషద్వేషిణి యున్న పురంబునకుఁ బోదమని యతని తాపంబు గొంత యుడిగించి వానితో సాయంకాలమున కాపట్టణంబుజేరెను.

వారిరువురు నం దొకపూటకూటి పెద్దమ్మయింట బసజేసి దాని కెల్లరు నిచ్చుదానికన్న నెక్కుడు రొక్కం బిచ్చి భుజించిన వెనుక అమ్మా! ఈ యూరి వింతలేమని యడిగిన నామె వారికిట్లనియె. అయ్యలారా ! వింతలకేమిగాని యొకటివినుండు. సానుమంతంబను పేరంబరగుచున్న యీయూరు భానుమంతుండను రాజు పాలించుచున్నవాఁడు. అతనికి బురుషద్వేషిణి యని సార్థకనామముగల కూఁతురుగలదు. ఆ చిన్నది పురుషులంజూడదు. నిత్యమును బొద్దుట జలకేళిం దేల నూరిఁబయలనున్న విహార సరోవరంబున కరుగుచుండును. అప్పుడు వీధిలోఁబురుషులు నిలిచినచో రాజభటులు శిక్షింతురు. ఎన్నఁడును బ్రొద్దుట వీధిలోని కరుగకుఁడీ యని చెప్పిన విని మరల వారమ్మా! యమ్మానినికి బెండ్లి నైనదియా యని యడిగిరి. దానికా పెద్దమ్మ నవ్వుచు నోహో! గొడ్రాలా! నీకెందరు బిడ్డలని యడిగినట్లు ఆ మగువ మగవారి మొగమే చూడదని చెప్పుచుండ బెండ్లియైనదా యని యడిగిరి. వేయేల? ఆ బాల తండ్రినిగూడ చూడదనియె మరల వారు అవ్వా! అవ్వనిత యట్టి యుగ్రవ్రతము బూనుటకు హేతువెద్దియో తెలియునా యవి యడిగిన నా కారణము నాకుమాత్రమేగాక దాని తలిదండ్రులకు గూడ తెలియదని యుత్తరము జెప్పెను.

వారట్లు కొన్నిదినంబు లామె యింటనుండి తమ వెంటగొని వచ్చిన వజ్రపురవ్వలు పెక్కురొక్కమునకు మార్చి యా పట్టణమునకు జేరియేయున్న విశాలంబగు పొలమొకటి వెలకుఁ దీసికొని గృహనిర్మాణదక్షులగు పెక్కండ్రు శిల్పపుపనివాండ్ర రప్పించి శీఘ్రకాలంబుననే బహుసౌధవీథీమనోహరంబగు నొక పురంబును నప్పురాంతరంబున నొకకోటయుఁ బురబాహోద్యానవనంబున గేళీసరోవరంబును నిర్మించిరి. మఱియు నాయూరిలో భవంతులన్నియుఁ గాపురముండ జనులకు నుచితముగా నిచ్చి ధనసహాయము చేయుచుండిరి. అప్పురంబంతయు స్వల్పకాలములో బహుజనాకీర్ణమై యొప్పినది.

విక్రమసింహునకు వనితాద్వేషి యను పేరు పెట్టి యతని రాజుగాఁజేసి బహుశ్రుతుడు మంత్రియై శుభముహూర్తమునఁ గోటలోఁ బ్రవేశించి కొంత సైన్యమును గూర్చుకొని పెక్కండ్రకు నుద్యోగంబులిచ్చి వారిరువురు రాజచిహ్నములతో నా గ్రామంబు పాలింపఁదొడంగిరి.

విక్రమసింహుడు సింహాసన మెక్కిననాడె యాపురంబు వనితాద్వేషి మహారాజు పాలించుచున్నవా డఁటనియు నాయన ప్రతిదినంబు నుదయమునఁ గేళీసరోవరంబున కరుగుచుండుననియు నప్పుడు స్త్రీ లెవ్వరు బయటకు రాఁగూడదనియు వచ్చినవారు శిక్షింపబడుదురనియుఁ బ్రకటన పత్రికల వ్రాయించి యాయూరి యిండ్లగోడల కంటింపజేయుటయేగాక పురుషద్వేషిణి యున్నపురములోఁగూడ వ్యాపింపఁజేసిరి.

నిత్యము పూర్వదివసంబున వనితాద్వేషి మహారాజుగారును బెక్కుసైన్యము చుట్టునుగొలిచిరా స్త్రీలు దూరముగాఁ బోవలయునో యను చాటింపు ముందు వెలయ నించుమించుగా బురుషద్వేషిణి బయలుదేఱువేళకే బయలుదేఱుచుఁ గేళీసరోవరంబున కరిగి కొంతసే పందు జలక్రీడలనాడి మధ్యాహ్నమున కింటికి వచ్చుచుండును.

పురుషద్వేషిణియు నావిహారదీర్ఘికకు వనితాద్వేషిణి మహారాజుగారు కొత్తగాఁ గట్టిన యూరుమీఁదుగానే యరుగువలయును గాని నప్పుడట్టి చాటింపు విని వెరఁగు పడుచు నెదురుపడకుండ మారుత్రోవను బోవుచుండును. అట్టి చాటింపులు రెండును విని వనితాద్వేషి వచ్చునప్పుడు స్త్రీలును బురుషద్వేషిణి వచ్చునప్పుడు పురుషులును జాటున కరుగచుండి రట్టి బాధలు పడలేక నొక్కనాఁ డాయూరి ప్రజలు రాజునొద్ద కరిగి యిట్లు చెప్పుకొనిరి.

మహారాజా! ఇదివరకే తమ కూఁతురు స్నానార్థమరుగుచుండ వీధులయందెట్టి యగత్యపుపని చేయుచున్నను మగవారు వానిని విడిచి తటాలున లోనికరుగవలసి వచ్చుచున్నది. పులిమీఁద పుట్రయనునట్లు మగవారికేగాక యిప్పుడు స్త్రీలకుగూడ నట్టి యుపద్రవము వచ్చినది. వనితాద్వేషి యను పేరు పెట్టుకొని యెవ్వరో యీ యూరిబైట నొక గ్రామము కట్టుకొని యచ్చట స్త్రీలను బైటకు రానీయక బాధించుచున్నారు. మన పురుషద్వేషిణి పురుషులన్న నెంత యలుగునో యాతండు స్త్రీలుమాటఁ దలపెట్టినంత నంతను నిబ్బడిగా నలుగుచుండునఁట. వారిరువుర వలన నీ యూరి స్త్రీపురుషులు కాపురము సేయనోపరు. బాధలుడిగింతువేని యుందుము. లేనిచో నెక్కడికేని లేచిపోయెదమని మొరపెట్టుకొనిన పౌరులతో నా నృపతి యిట్లనియె. ఔను. ఇదివరకే యా రాజకుమారుని విపరీతచర్యలు వినియుంటిని. మీబాధ లుడిగించెదఁ జింతింపకుడని వారి నోదార్చి యంపి యప్పుడ యొక్కపరిచారకుని, సగౌరవముగా నొక యుత్తరము వ్రాసియిచ్చి వనితాద్వేషి మహారాజునొద్ద కంపెను. వాఁ డాచీటిం గొనిపోయి బహుశ్రుతునితోఁ గూడుకొని కొలువున్న విక్రమసింహుని కిచ్చెను. బహుశ్రుతుఁడు దానిం బుచ్చుకొని చదివి వేరొక్కచీటి యిట్లు వ్రాసెను.

అయ్యా! తమరు వ్రాసిన యుత్తర మందినది - అందలి సంగతులు బోధపడినవి. మా వనితాద్వేషి మహారాజుగారి నొకసారి యచ్చటికి దయచేయుమని కోరి నందుల కెంతయు సంతసించి యాయన యట్టి ప్రయాణమున కాజ్ఞ యిచ్చియున్నారు. మా రాజుగారి వృత్తాంతమంతయు నిదివఱకే మీరు వినియుండవచ్చును. ఆయన వచ్చునప్పుడు వీథులలో స్త్రీలుండకుండునట్లును, మీ సభలోనికి నాడువారిని రానీయనట్లును, నాజ్ఞ చేసితిమనే జాబు వ్రాయించిన తక్షణము బయలుదేరివచ్చుచున్నారు. అని వ్రాసిన యా రాజభటుని చేతికే యిచ్చియంపి యట్టి యొడంబడికతో నుత్తరము రాగానే, బహుశ్రుతుండు గొన్ని రహస్యములు విక్రమసింహునకు బోధించి పెక్కండ్రు వీరభటులు వేత్రహస్తులై యిరువంకల నలంకరింప నతని బంగారుపల్లకి నెక్కించి తాను దోడ నడుచుచు స్త్రీలు దూరముగాఁ బోవలయునో యనుచాటింపుతోఁ బౌరు లాశ్చర్యపడి చూచుచుండ నతండు రాజసభ కరిగెను.

ఆ వింత జూచుటకై యంతకుమున్ను యా రాజు పౌరులకును సామంతులకును మఱియుఁ బెక్కండ్ర పెద్దమనుష్యులకును వార్త పంపియున్నవాఁడు. వారందఱు వచ్చి సభ నలంకరించిరి. పురుషద్వేషిణియుఁ జెలికత్తెల వలన నా వృత్తాంత మాలించి యతండట్టి వ్రతము పట్టుటకేమి కారణము చెప్పునో వినవలయునవి యా సభాభవనపు గోడప్రక్కకు వచ్చి సఖులతోఁ గూర్చుండి యుండెను. ఆ రాజును విక్రమసింహున కెదురేగి మంత్రితోఁ దోడితెచ్చి సాదరముగా నుచిత పీఠంబులఁ గూరుచుండఁబెట్టెను. అందఱును గూర్చున్న తర్వాత గొంచెముసే పాసభ నిద్రితమైనది వోలె నిశ్శబ్దమైయుండెను. అప్పుడు రాజశాసనంబున లేచి యతని మంత్రి విక్రమసింహుఁడు విన బహుశ్రుతునితో నిట్లనియె.

ఆర్యా! ఆదిని సృష్టికర్త తన శరీరములో నెడమభాగము స్త్రీనిగాను కుడిభాగము పురుషునిగాను జేసెను. అమ్మిథునంబువలననే ప్రజావృద్ధియైనట్లు మన పురాణములు చెప్పుచున్నవిగదా! ఇదియునుంగాక త్రిమూర్తులును భార్యలను శరీరమునందే ధరించుకొనే యున్నారు. దానింబట్టి చూడ ప్రతిపురుషునకు భార్య యుండవలసిన విధి గనంబడుచున్నది. తెలివిమాలిన యబల లెవ్వరేనిఁ బట్టినం బట్టుదురు గాని మీ రాజుగారు ప్రజాసృష్టి ప్రధానహేతుభూతంబగు స్త్రీజాతియందు బగబూని వ్రతంబుఁ బట్టుటకుఁ గారణము తెలియకున్నది. అట్టి హేతువు విను తాత్పర్యముతో మా రాజుగారు మిమ్మిందులకు రప్పించిరి. ఆ వివరం బెఱింగించి మా మనంబునం గల సందియం బుడిగింపుఁడని యడుగునంత నితాంతకోపంబునఁ గన్ను లెఱ్ఱఁజేయుచుఁ జెవులు మూసికొనియున్న విక్రమసింహుని శాంతిపరచుచు బహుశ్రుతుండు మరల వాని కిట్లనియె. ఆర్యా! ఈ రాజు స్త్రీప్రసంగము సహింపనోపఁడు. అట్టి మాటలఁ దలపెట్టినచోఁ నెట్టి హితులనైన నహితులుగా జూచుచుండును. జ్ఞానము వచ్చినది మొద లిట్టి వ్రతము పట్టియున్న వాఁడు. దాని కారణ మడిగి నేనును పెక్కుసారు లవమానింపఁబడితిని. ఇప్పు డిందఱుగోరి యడుగుచుండఁ జెప్పకునికి మంచి పరిపాటిగాదు. అడిగి చూచెదనని యతని దిక్కు మొగంబై యడుగుటకును భయపడు వానివలె నభినయించుచు నల్లన నిట్లనియె.

దేవా! ఎట్టి రహస్యమైనను పదుగురు పెద్దమనుష్యులు గూడి యడిగినప్పుడు దాచక చెప్పవలయునని బృహస్పతి నీతిలో నున్నది. మఱియు వీరు మిమ్మిట్టి యుగ్రవ్రతము పట్టుటకుఁ గారణ మడుగుచుండిరి. కాని వ్రతము మానుకొనుమని చెప్పుట లేదు. తమ యంతరంగమున కట్టి ప్రసంగము సంతోషభంగమైనను సహింప తత్కారణం బెఱుగఁగోరుచున్న యీ సభాసదుల మదుల కామోదము గలుగఁజేయుఁడని యడుగుటయు, గోడమాటునుండి యీమాటను వినుచున్న పురుషద్వేషిణి యారాజకుమారుని యభిప్రాయము తెలిసికొనవలయునని నభిలాష గలిగియున్నది గానఁ జేసన్నలచే సఖులరొద చేయవలదని వారించుచు నతండేమి చెప్పునో యని చెవియొగ్గి వినుచుండెను.

అప్పుడు విక్రమసింహుఁ డెట్టకేలకు మోము పై కెత్తి విధిలేక చెప్పువాఁడుం బలె నెల్లరు విన నిట్లనియె. సభ్యులారా! నేను పూనిన వ్రతంబు సకలలోకవిరుద్ధం బైనను నా చెప్పఁబోవు వృత్తాంతము వినినచో మీకు యుక్తమేయని తోచకమానదు. నాకు జాతిస్మృతి గలిగియున్నది. వినుండు నేను పూర్వజన్మ మందొక వర్తకుని కుమారుండ. నా పేరు కాంతివర్మ, నాకు యుక్తవయస్సు వచ్చినప్పుడు మాతండ్రి పెక్కురు వరదక్షిణలతోఁ గన్య నిత్తుమని వచ్చినను నంగీకరింపక రూపమునకు నాశపడి యొక వర్తకుని కూతురు రత్నాంగి యనుదానిం బెండ్లి చేసెను.

అది పెండ్లియైన కొలదికాలమునకే కాపురమునకు వచ్చినది. "భార్యారూపవతీ శత్రుః" అనునట్లు దాని చక్కదనమే నా దుఃఖమునకు మూలమైనది. దాని దుర్గుణములను గురించి యెన్నియో నీతులు చెప్పి మందలించితిని గాని నాబోధ యేమియు దాని మది కెక్కివది కాదు. నా తలిదండ్రులు నా భార్య కాపురమునకు వచ్చిన వెంటనే చనిపోయిరి. గాన నింటిపెత్తన మంతయు దాని యధీనమేయైనది. అది సొమ్మంతయు దుర్వ్యయము చేయుచు స్వల్పకాలములోనే నన్ను ఋణస్థునిగాఁ జేసెను. ఒకనా డది నేను వలదని యెన్ని విధములఁ జెప్పినను వినక తన పుట్టింటికి లేచిపోవఁ బ్రయత్నించిన నపకీర్తి భయముచే నేనును వెనుకొని యరిగితిని.

నేనుఁగూడ వచ్చుట యిష్టములేక మార్గమధ్యమం దొకనూతిలోఁ దొంగి చూచుచుండ నన్ను బలాత్కారముగా నందు ద్రోసి పుట్టింటి కరిగినది. దైవవశమున నందొక మఱ్ఱిమొక్క నా చేతికిఁ దొరికినఁ బట్టుకొని నీటిపై తేలుచున్న నన్నుఁజూచి యా దారి నరుగుచున్న పుణ్యాత్ములు కొందరు బైకిఁ దీసిరి. క్రౌర్యమనునది స్త్రీ జాతికి సామాన్యమేగదా యని యూహించి యప్పుడుగూడ గోపము వహింపక యత్తవారింటి కరిగితిని.

అందు నన్నుఁ జూచినతోడనే విభ్రాంతయై తెలతెలపోవుచు నిలుచున్న యా తరుణి నెరుగనివాఁడువలె బలుకరించి మంచిమాటలని దాని దిగులు వాపితిని. దాని చెడుగుణంబు లెన్నేని సహించి కొన్ని దినంబు లందుంటినిగాని నా యునికి యిష్టము లేక యొకనాఁడు నేను నిద్రించుచుండ నన్నుఁ గటికివాఁడు పశువుంబలె గొంతుదరిగి చంపినది. అట్లు బలవన్మరణము నొందియు నీతిమార్గముగా సంచరించితిని గాన రాజునై పుట్టి పూర్వజన్మజ్ఞానము గలిగియుంటిని. ఎన్ని చెడుకృత్యములు సేసినను మనంబున నిడుకొనక పెక్కుగతుల దన్ననుసరించి దిరుగుచున్న నన్నెంత చేసెనో వింటిరిగద. సీ! దాని నొక్కదాని నననేల యా జాతియందు యట్టి క్రౌర్యము గలిగియున్నది. "మధుతిష్టతి వాచి యోషి తాం హృది హాలాహలమేవ కేవలం" అను వచనం బెఱింగినవారు స్త్రీలను నమ్ముదురా? తొలిజన్మమం దిన్నిపాట్లు పడితినిగాన నీ జన్మమునందుఁ బెండ్లి యాడనిచో నే కష్టము నుండదని యూహించి యిట్టి వ్రతమును పూనియుంటినని చెప్పుచున్న సమయంబునఁ నా మాటలన్నియు గోడచాటున నుండి యాలించుచున్న పురుషద్వేషిణి తటాలున లేచి యొక గుమ్మము వెంబడి సభాంతరమున కరిగి సభ్యులెల్లరు విస్మయమంది చూచుచుండ విక్రమసింహునితో నోహోహో నీతిమంతుడా! యేమి మాటలు చెప్పుచుంటివి. చాలు చాలు. నీ పూర్వోత్తర మెఱుఁగని వీరియొద్ద జక్కగా బొంకుచుంటివే. ఇప్పుడు నీవు చెప్పిన ఘోరకృత్యము చేసినవాఁడవు నీవా? నేనా? నీవుచేసి యెదుర నామీఁద పెట్టుచుంటివా? ఈ పాటి కూరకుండుమని యహంకారముగా బలికిన నక్కలికి పలుకుల కులుకుఁవాడువలె గన్ను లెఱ్ఱచేయుచు నోహో రత్నాంగి! మరల నా కిచ్చటఁ దటస్థించితివా? నన్నిట్లు గద్దరించినచో వీరు నిన్ను ముద్దరాలనుకొందు రనుకొంటివా ఏమి? అట్టి క్రూరకృత్యము నీవు చేయక నేనే చేసితినా? ఎట్టి క్రూరులై నను మగవారట్టి సాహసములకు దెగింతురా? ఇదియునుంగాక స్త్రీలకుఁ బురుషులకంటె సాహసమెక్కుడని చెప్పు గ్రంథములే సాక్ష్యములని పలికిన నతని నాక్షేపించుచు నా పద్మాక్షి బొంకులు పలుకువారికి సాక్ష్యముల కేమి కొరత. మేలు మేలు. సాక్ష్యము లిప్పించి యా నింద బాపుకొనదలంచిరిగాని యెట్లును నది మిమ్ము బాయదు. చేసితినని యొప్పుకొని పైన మాట్లాడుడనుటయు నతండు భళిభళి మంచి జాణవౌదు. నీదు మాటలకు మోసపోవుదు ననుకొంటివా? ఈ గడుసుతనం బుడుగుము. నేరంబున కొడంబడుమనియె.

ఇట్లయ్యిద్దరును పెద్దతడవు శ్వానంబులవలె మొఱగుచు హస్తంబులు సాచి నీవే నీవే యని పోరాడుచుండు సమయంబున సభ్యులును నా రాజును విస్మయముతోఁ జూచుచుండిరి. అప్పుడు బహుశ్రుతుఁడు నవ్వుచు వారిరువుర తగవులు వారించి యోహో! ధృడవ్రతులారా! మీ వ్రతములు జక్కగానున్నవి. ఇట్లూరక పోరాడనేల ఈ సభ్యులకు వివాదకారణం బెరింగింపుఁడు, పక్షాపక్షంబు లుడిగి వీరే నేరమొకరి యందు స్థాపింతురనుటయు నప్పుడా పురుషద్వేషిణి సభ్యుల దిక్కు మొగంబై ఆర్యులారా! ఈతండు పూర్వజన్మంబున నా మగండు. ఇప్పుడు మీతో నితండు చెప్పిన కథలో తానుజేసిన నేరములన్నియు నా మీఁదబెట్టి యబద్ధము చెప్పుచున్నాడు. అ రత్నాంగిని నేనే. నేను నిద్రించుచుండ నన్ను బలాత్కారముగాఁ జంపెను. అ కోపముచేతనే నేనును పురుషులయెడ క్రౌర్యము బూను యిట్టి వ్రతము బట్టితి. నే జెప్పినదంతయు యథార్థమనిన విక్రమసింహుడును ఆర్యులారా! నాకీ రాజపుత్రిక పూర్వజన్మమందు భార్య. అప్పుడు నన్ను బలాత్కారముగాఁ జంపిన రత్నాంగి యిదే. దీని మూలముగానే నేనిట్టి వ్రతము పట్టితిని. ఇది తానుజేసిన నేరము నా మీఁద పెట్టుచున్నది. దీనిమాటల నమ్మవలదని పలికెను.

ఆ యిద్దరి మాటలను విని సభ్యులేమియు జెప్పలేక యొకరి మొగం బొకరు చూచుకొనుచున్న సమయంబున బహుశ్రుతుండు లేచి సభ్యులారా! వీరి తగవును గురించి నా కొక్కటి తోచుచున్నది. నే జెప్పినట్లు వినెదమని వీరొడంబడెదరేనిఁ జెప్పెదననుటయు నందుల కాచిన్నది యొప్పుకొనిన పిమ్మట విక్రమసింహుండు నెట్టకేల కొప్పుకొనెను.

పిమ్మట బహుశ్రుతుఁడు అయ్యా! వీరిరువురు పూర్వజన్మమునందు దంపతు లైనట్లును నొకరితో నొకరికిఁ బడక బలవన్మరణము నొందినట్లును వీరు చెప్పిన మాటలచేతనే తెల్లమగుచున్నది గదా! వీరిలో నిజముగా నపరాధమెవ్వరుచేసిరో తెలిసికొనుటకు మన వశంబుగాదు. వీరి జన్మమునందు మరల దంపతులై పూర్వ వైరమును స్మరించుకొనక యొండొరులయం దత్యంతానురాగంబున మెలంగినచో దానికి నిష్కృతి యగునని నాకుఁ దోచుచున్నది. ఇప్పటికి వీ రొడంబడదగునని పలికిన విని పురుషద్వేషిణి యేమియుం బలుకక తలవాల్చుకొని విక్రమసింహునిం జూచినది మొదలు వానియందు బద్దానురాగయై యున్నదిగాన బహుశ్రుతుఁడు చెప్పిన తగవు కెంతయు స్వాంతంబున సంతసించుచు విక్రమసింహు డందుల కొడంబడునో యొడంబడడో యను సందియంబు మనంబున బాధింప దా నొడంబడినయట్లు సూచించుచు, దండ్రిమొగంబుపై దృష్టి ప్రసారంబులు బరగించినది.

అ రాజు తదీయాభిప్రాయంబు గ్రహించి తానంతకు మున్నెన్నోదినములు పెండ్లి జేసికొమ్మని బ్రతిమాలినను వినక యప్పు డొప్పుకొనినందులకు మిగుల సంతోషించి, బహుశ్రుతునితో అయ్యా! మా చిన్నది మీరు చెప్పిన యట్టొప్పుకున్నది. మీ రాజకుమారునిఁ గూడ నొప్పింపుడనునంతలో నాకాంతకు సి గ్గెక్కడనుండి వచ్చెనో మేనుగురు పొడువ దిగ్గునలేచి యంతఃపురమున కరిగినది.

బహుశ్రుతుండును రాజుగారితో అయ్యా! మారాజు పెండ్లి యాడుటకు సులభముగా నొప్పుకొనడు. ఇంటియొద్ద నెమ్మదిగా బోధించి యొప్పించెద. ఇందులకు నేను పూచీయని పలికిన విని రాజును సభ్యులును వారి వివాహమును గురించి మిగుల సంతసించిరి. అంతటితో సభచాలించి యెవరి బసకు వారరిగిరి. ఆ పట్టణములోని స్త్రీ పురుషులు వారి వివాహ వృత్తాంతమంతయు విని తమబాధ తగ్గెనని తమ యిండ్లలోఁ బెండ్లియైనంత సంతోషము వహించిరి.

ఆ రాజును శుభముహూర్తమున విక్రమసింహునకు బురుషద్వేషిణి నిచ్చి యధికోత్సవముతో వివాహము గావించెను. విక్రమసింహుడును బహుశ్రుతుని మతి చమత్కృతి గురించి పెక్కుతెరంగుల గొనియాడుచు బురుషద్వేషిణితో గొంతకాల మందుఁ గ్రీడాసౌఖ్యము లనుభవించి యొక్కనాడు బ్రహుశ్రుతునిచే బోధింతుండై భార్యగూడి చతురంగబలయుక్తముగా స్వదేశంబున కరిగి నిజదర్శనాయత్తచిత్తులై యున్న తలిదండ్రుల చింత మానిపి పట్టాభిషిక్తుండై పెద్దకాలము రాజ్యసుఖంబుల ననుభవించెను. గోపా! ఈ చిత్రపట వృత్తాంతమిదియే. ఈ రూప మా పురుషద్వేషిణిది. అని యెఱింగించి యయ్యతివల్లభుండు శిష్యుఁడు చిత్తమని వెంటరా నెనిమిదవమజలీ చేరెను.

__________