కాశీమజిలీకథలు/మొదటి భాగము/అయిదవ మజిలీ
అయిదవ మజిలీ
దండుని కథ
గోపా! యుత్తరదిశకు వటవిటపిమీఁదుగా నరిగిన కంసాలి కుమారుఁడగు దండునకు నాలుగుదినము లరిగినంతనే యా శాఖాంత మగుపడినది. మగుడఁ దలంచియు మితి చాలయున్నదిగానఁ గారడవిగానున్న యాప్రదేశములో వింతలేమైన నుండునేమో చూచిపోయెదంగాక యని నిశ్చయించి యా కొమ్మదిగి యటు నిటు దిరుగుచుండ నొక దండ నందనవనంబునుం బోని యుద్యానవనం బొండు గనంబడినది.
అతం డందులకు వెరఁగందుచు నందు నలుదెసలం బరికింప నొకవంక నలోమణి మణిసోపానములును గాంచనపద్మంబులును సౌవర్ణకువలయంబులును నింద్రనీలరోలంబంబులునుం గలిగి యమృతోపమానంబులగు జలంబులచే నిండింపఁబడిన సరోవరం బొండు నేత్రపర్వము గావించినది. దానిపొంత కరిగి యందలి జలంబుల గ్రోలి దప్పిదీర్చుకొని తత్ప్రాంతమున నున్న లతావితానచ్ఛాయం గొండొకవడి బహువిధకుసుమవాసనల హరించి ప్రసరించు మందమారుతములఁ గతిశ్రమము వాయ విశ్రమించి తదుద్యానవైభవం బరయుచుఁ దాను గూర్చున్న కుంజంబునఁ నొకవింత యగు లతాంతము గానంబడుటయు సంతసముతో నా పూపుఁ ద్రెంచి ముక్కుదరి నిడి తావి నాఘ్రాణించునంతలో నతం డొకచిలుక యయ్యెను.
అట్లు చిలుకరూపు వచ్చినను దొల్లింటి తెలివిగలిగి యుండుటచే నతండు తనలోఁ బలుతెరంగులఁ జింతించుచు నయ్యో! దైవము నన్నిందులకే కాఁబోలు వృక్షశాఖాపదేశంబున గెంటుకొని వచ్చెను. నే నెట్లు పక్షిరూపముతో వసింతు. దీని కవసాన మెట్టి? నన్ను రక్షించువారెవ్వరని యరచుచు నందలి ఫలవృక్షము లెక్కి తత్ఫలరసంబులచే నాకలి యడంచుకొనుచుఁ గొన్ని దినములందుఁ గాలక్షేపము గావించెను.
ఇట్లుండునంత నొకనాఁ డాయుద్యానవనమునకు సోమప్రభ యను విద్యార్థి కూఁతురు విద్యుత్ప్రభ యనునది విహారార్ధము సఖులతో వచ్చి యిచ్చవచ్చి నట్లందంద విహరించుచుండ నయ్యండజయాన నీక్షించి దండుఁడు మెండు వేడుకతో నెగిరి యమ్మగువమ్రోల మృదుమధురములగు పలుకులు వెలయించిన సంతసించి యయ్యించుఁబోడియు దానిం బట్టి గమకించి పయ్యెదపుట్టంబు నడుమునకుఁ జుట్టుకొని మెల్లన యడుగులిడుచు హస్తసంజ్ఞచే సఖుల రొదసేయవలనని వారించుచు నల్లనల్లన దరికరిగినను బెదరక పక్షాంచలంబు లార్చుచు నిలువంబడియున్న యప్పిట్ట నట్టెపట్టుకొని మచ్చిక సేయుటయు నదియు, బెంపుడిదివోలె నమ్మచ్చెకంటి చేయి విడువక పలువేడుకతో నిలువంబడి సరసములగు పలుకులచే నచ్చిలుకలకొలికిని రంజింపఁజేసినది.
అదిమొద లామదవతి యాచిలుకయందు బద్ధానురాగయై తన పలకేలు దానికిఁ బంజరంబయి యుండ నిముశ మేనియు విడువక గారాబముగాఁ బెంచుచుండెను. మరియు దానిం దనకే లెక్కించుకొని వాణియుఁబోలె నాశుకపాణి తనలోకంబున కరిగి యందాప్తులతో నాచిలుకపలుకులు మచ్చికయుఁ దేటపడ నెరింగించుచు నది యడవిచిలుకవలెఁ బారిపోవునది గాదు గాన దాని స్వేచ్చగాఁ దిరుగ విడిచిపెట్టుచుండును.
విద్యాధరలోకములోఁ దరుచు విమానములు జేయుపని విద్యార్ధులకుఁ బాఠశాలలో నేర్పుచుందురు. చిలుకగానున్న దండుఁడు తన్ను విడిచిపెట్టినప్పుడా పాఠశాలం కరిగి ప్రచ్ఛన్నముగా నుండి సూక్ష్మబుద్ధిగాన నచిరకాలములోనే యాపనిని గ్రహించెను.
ఒకనాఁ డావిద్యుత్ప్రభ తనమాతామహుండైన మయునిఁ జూచుటకు నాచిలుకతో నచ్చటి కరిగి యతనిచే మన్ననలు వడసి కూర్చుండి చిలుకపయినున్న ప్రీతి దేటపడ నతనితో నిట్లనియె.
తాతా! యీ చిలుకం జూచితే ఇది నీవు నాకు విహరింపఁ క్రొత్తగా నిర్మించి యిచ్చిన యుద్యానవనములో దొరికినది. నాకు దీనియందు మక్కువ మిక్కుటము సుమీ! దీనికిని నాయం దట్టి ప్రేముడి గలిగియున్నది. దీనికి బంజర మక్కరలేదు. విడిచివైచినను దాని యిష్టము వచ్చినట్టు తిరిగి పిలిచినంతనే చేరుచుండునని గారాబముగాఁ బలికిన మనుమరాలి పలుకుల కలరి యతం డిట్లనియె.
అమ్మాణీ! చిలుక యనిన జ్ఞాపకము వచ్చినది. నీ యుద్యానవనములోనున్న తటాకంబుదరిఁ దూర్పుదెస నొక పొదరిల్లు గలదు. దాని కుసుమ మెన్నడును నాఘ్రాణింపకుమీ! య ట్లాఘ్రాణించినవారు చిలుక యగుదురు. ఎప్పుడేనిఁ ప్రమాదమున నట్టి పని తటస్థించినచో నా పొదరింటిలోనే వెనుక బాగమున పచ్చరంగుగల యొక కుసుమగుచ్చము గలదు . దాని నాఘ్రాణించిన నట్టిరూపు పోయి తొంటిరూపము వచ్చునని యెరింగించెను. ఆ చిన్నదియు కొన్నిదినంబు లందుండి వెండియుఁ దనలోకముఁ జేరెను.
దండుఁ డామయుని మాటల నాలించి సంతసించుచు దైవకృపకు మెచ్చుకొనుచుఁ దనరూపు మార్చుకొన తెరవు దొరకెనని మురియుచు విద్యాధరకన్యక యావనమున కెప్పుడు పోవునని సమయము నిరీక్షించుచుండెను. మరియు నొకవసంతమున సాయంకాలమున దండుం డప్పురోద్యానవనమునం దగు సహకారతరుశాఖ నధిష్టించి ప్రాంతహాటకతటాకంబున జలకేళిం దేలుచున్న విద్యాధరపల్లవాధరుల సోయగం బరయుచుఁ దదంతికంబున మెలఁగుచుండ నయ్యండజయాన లొండొరులతో సంభాషించుకొను మాట లిట్టు విననయ్యెను.
చెలికత్తెలు — రాగమంజరీ! మన మందరము నిన్నను భూలోకంబున వటస రంబున జలకేళిం దేలితిమికదా! నీవు మాతో రాక యందు జాగుచేసితివేల? అటఁ గ్రొత్త వింతలేమైనం గనంబడినవా యేమి?
రాగమంజరి – అక్కలారా! అక్కడ న న్నొకదానను విడిచి నాచిక్కు లరయక వచ్చితిరి గదా! వినుం డొకమానవుఁ డాచెట్టుచాటున దాగియుండుట మన మెరుగకఁ వలువలు విడిచి జలకేళిఁ దేలితిమి. అప్పుడు చప్పుడుగాకుండ వచ్చి యచ్చనలుఁడు నా వలువను గొని యరిగెను.
చెలి - ఏమేమి? మానవుఁడు వచ్చి నీపుట్టము గొనిపోయెనే. పిమ్మట నేమైనది ?
రాగ – మీరందరు పుట్టంబులఁ గట్టుకొని పయనంపుతొందర నరిగితిరి. నాచీర గనంబడక విభ్రాంతి నొంది నలుదెసలుం బరికింపుచు నే నామఱ్ఱికొమ్మలసందున డాగియున్న యొకచిన్నవానిం జూచి మదీయమాయాపాటవం బంతయుఁ దేటబడ వానిఁ జెట్టు దింపించి యాకోక స్వీకరించి వాని రాయిగా శపించి వచ్చితిని.
చెలి — మేలు, మేలు. వానికి మంచిప్రాయశ్చిత్తముఁ జేసితివి.
రాగ - దైవకృప నాయందుఁ గలుగఁబట్టి వాఁ డాపుట్టము నాకిచ్చెను. లేనిచో నేను వానికి భార్యగా నుండవలసి వచ్చుంజుడీ! దానం జేసియే యాలస్యమైనది.
కుసుమగంధి - హండీ, నీ గుండె యెంత కఠినమే! పాప మతని నెంత కాల మట్లుండ శపించితివి?
రాగ - ఔనౌను. కఠినము గాదా. నీపుట్ట మతఁడు పట్టుకొని వెళ్ళినఁ దెలియును. మరియొకరికి నీతులు చెప్పుట సులభమే!
కుసుమ - శాప మిచ్చి శాపాంతము చెప్పకపోవుట తప్పు గదా.
రాగ - నీకింత వానియందు మక్కువ గలిగినచో నా మఱ్ఱిచెట్టు మొదటనున్న తీగెయాకు జలంబులం గలసి యా రాతిపయి జల్లినచో నతండు మరల పురుషం డగును. అట్లుచేసి యతనిని వరింపుము.
కుసు – నా కట్టి యవసర మేటికి. ధర్మము చెప్పితినిగాని వలచికాదు. ని న్నతఁడు వలచియే నీ వలువను గొనెను గాన నీవే యట్టి పనిచేసి యతనిం బెండ్లి యాడుము. అనుటయు వారి మాటల కందరు పక పక నగి చేతులు తట్టిరి. అట్లు కొంత సేపు జలకేళిందేలి యా రమణు లెల్ల నుల్లంబు లలరఁ దమ తమ నివాసంబుల కరిగిరి.
ఆ మాటలన్నియు విని దండుఁ డోహో! యా మానవుఁడు నా చెలికాఁడగు సాంబుఁడు గావలయు. వానికిఁ బాషాణత్వము ప్రాప్తించెనే కానిమ్ము దై వానుగ్రహము మాయందుఁ బరిపూర్ణముగా నున్నది. లేనిచో నా కీపలుకులు వినఁబడునా! సాంబుడు తొంటిరూపు దాల్చుతెర వెఱుంగఁబడినది. మాకు మంచికాలము వచ్చినది . అని సంతసించుచు నందుండి మరల విద్యుత్ప్రభాభవనమున కరిగి నిజవియోగమునకై కుందు నాసుందరి డెందము కానందము గలుగజేసెను,
విద్యుత్ప్రభ యొకనాఁడు మరల భూలోకోద్యానవనమున విహరింపఁ జిలుకతో వచ్చి యిచ్చవచ్చినతావులఁ గ్రుమ్మరుచు మయునిమాట జ్ఞాపకమువచ్చినతోడనే యా పొదదరి కరిగి తత్కుసుమముల నానవాలు పట్టుచుండ శుకరూపముననున్న దండుఁ డిదియే వేళయని రివ్వున నెగసి యాపువ్వుఁబోఁడి చూచుచుండ నా పచ్చనిపు వ్వాఘ్రాణించునంతఁ దొల్లిటియాకా రమొప్ప ధాత్రి నిలువంబడుటయుఁ గనుంగొని యయ్యంగన వెరగంది యతనితో నిట్లనియె.
ఆర్యా! మీరెవ్వరు? శుకరూప మేమిటికిఁ బూనితిరి? మీ వృత్తాంత మాలింప వేడుక యగుచున్నయది. ఎఱింగింతురే యనుటయు నా యించుఁబోఁడి కతం డిట్లనియె.
నాతీ! నేను మీ తాత మయుని వంశములోని వాఁడనే. నా పేరు దండుఁడు. ఒకానొకకారణమున నీయుద్యానవనమున కరుదెంచి యీపొదరింటిపూ వాఘ్రాణించి యట్టిరూపు గాంచితిని. నా పూర్వపుణ్యవశమున నీ ప్రాపు దొరికినది. మొన్న మీ తాత నుడివిన పలుకులు నాకు వినఁబడినవి కావున నిప్పు డీపుష్ప మాఘ్రాణించి పూర్వపురూప మందితిని. భవదీయదయావిశేషంబున నీ లోకవిశేషములు చూచుటయేకాక, విమానములుచేయు పనిగూడ గ్రహించినాఁడ. నాయందు పరిపూర్ణానుగ్రహ ముంచి సెలవిచ్చినఁ బోయివచ్చెదనని వేడిన నా చేడియ యతని యాకారమునకు, మాటలకు: శీలంబునకు మిగుల మెచ్చుకొనుచు నభిప్రాయసూచకములగు లోచనప్రసారము లతని మొగంబునఁ బరగించుచుఁ గామశరీరపీడితహృదయయై యిట్లనియె.
ఆర్యపుత్రా! నన్నింత నుతింపనేల! నీవు విద్యచేతనేగాక రూపంబునను నసాధారణుండవే. నా పూర్వపుణ్యవశమున నిన్నుఁ బొడగంటి. నీ యట్టి సుందరుఁడు మా విద్యాధరకోటిలో వెదకినను దొరకఁడు. నా మనంబు నీయందు లగ్నమైనది. నన్ను భార్యగా స్వీకరింపుము. మరియు మా తాతయగు మయుం డొకప్పుడు నన్నుఁ జూచి నీకు మానవుఁడు మగఁ డగునని చెప్పియున్నాడు. ఆ సర్వజ్ఞుని మాట దప్పునే! ఇదియునుంగాక నీవును మా కులములోనివాఁడవే యగుట సంబంధమునకుఁ దగియుంటివని చతురోక్తులఁ దన్నాయతివ మిగుల బ్రతిమాలిన సంతసించి యతఁ డప్పుడు యప్పండతిని గాంధర్వవివాహంబునం గైకొని పైకొనిన మోహముతో నక్కలికి నొక్కపూబొదరింటఁ దుంటవిల్కానిక్రీడల నలయించెను.
అదృష్టవంతుల కెందేగినను లాభమే కలుగును గదా? అట్లు కొన్నిదినము లాయుద్యానవనములో విద్యాధరపల్లవాధరిం గూడి యావేడుకాఁడు కామక్రీడలం దేలుచు నొక్కనాఁడు చెలికాండ్రయుదంత మంతఃకరణగోచరమగుటయు సంతాపాయత్తచిత్తుండై యత్తలోదరితో నిట్లనియె.
కాంతా! నా వృత్తాంతమంతయు నీవు వినియున్నదియేగదా. నా చెలికాండ్రు వటవృక్షమూలమున నాకై వేచియుందురు. మే మేర్పరచుకొనిన మితిదాటినది. పోయివచ్చెద సెలవిమ్మని యడిగిన నతని నుడువుల కెడద నడలు దోప నా పడఁతి యిట్లనియె.
అయ్యో! వేడుక చవిచూసి పోయెదననుట యుచితమా! నాకన్న మిత్రు లెక్కుడువారలా? యెన్నియో క్రొత్తతలంపులు మనంబునఁ బెట్టుకొని సిగ్గుచే బయలు పరుపక కాలము గడుపుచుంటి. పోవలదని నిర్బంధించిన నతం డిట్లనియె. దేవీ! నీవు కామరూపిణివిగదా! నే నెక్కడనుండి తలంచిన నక్కడకు వచ్చి నీ యభీష్టముఁ దీర్చు కొనుము. దీనికింత వలవంతఁ గాంతువేమిటి కనిన నబ్బోఁటియు సమ్మతించినది. పిమ్మట దండుఁ డారెండువిధముల కుసుమములను వేరువేర కోసి మూటగట్టికొని వచ్చినదారింబట్టి నాలుగుదినముల కావటవిటపి మూలము జేరెను.
అందెవరిం గానక చింతాకులస్వాంతుఁడై యోహో! నిరూపించుకొనిన మితియుఁ గడచినది. మిత్రులలో నొక్కరుండైన నిక్కడ జేరలేదు. కారణము దెలియదు సాంబుని చరిత్రము నేను వినినదియె కదా? తొలుత వాని శాపవిమోచనము గావించి వానింగూడి మీదటి కార్యం బాలోచించెదం గాక యని మా విద్యాధరకన్యక చెప్పిన యాకు గురుతుపట్టి యది త్రుంచి జలంబులం గలిపి యందున్న రాలపై జల్లుచున్ తరి నజ్జలస్పర్శము గలిగినంత సాంబుఁ డారూపము విడిచి తొంటియాకృతిఁ గైకొని యెదుటనున్న దండునిం గౌఁగలించుకొని యిట్లనియె.
అన్నా! నీవు వచ్చి యెంత సేపైనది. ఇంకను దక్కిన చెలికాండ్రు రాలేదా? ఇం దొకసుందరి యుండవలె నెందేగెనో యెఱుఁగుదువా? అప్పడఁతి, యిప్పుడు నాయొద్ద మాట్లాడుచున్నదే. ఇంతలో నాకు నిద్దురపట్టినది కాఁబోలు. అయ్యయ్యో ! పాపపునిద్దుర నా కిప్పు డేల రావలయు. అయ్యబలఁ వీక్షించినంగాని మేనఁ బ్రాణంబులు నిలువకున్నవి. వయస్యా! అమ్మదవతిని వెదకితెచ్చి నా కన్నులముందర బెట్టి, ప్రాణదానఫలంబు గట్టికొనుము. అని పెక్కుతెరఁగుల విరహవేదన బలియఁ దన్ను బ్రతిమాలుచున్న సాంబునకు నవ్వుచు దండు డిట్లనియె. అయ్యో, సోదరుఁడా! నీ కతయే నీ వెఱుంగక యూరక వెతలఁబడుచుంటివే! అయ్యతివ నీకు మంచి యుపకారమే చేసిపోయినది. విను మది విద్యాధరకన్యక, దాని పేరు రాగమంజరి. దాని చీర నీవు తెచ్చితివని యెఱిఁగి నిన్ను మాయావచనంబుల మరులుగొలిపి రాయిగా శపించి, తనలోకంబున కేగినది. నీ వాయవస్థ నిద్దు రనుకొంటివి. దైవకృపచే నాకుఁ గారణాంతరంబున నీ శాపాంతసూచకములగు పలుకులు వినంబడినవి. దానఁబట్టి నిన్ను దక్కించుకొంటినని తాను మ్రాను వదలి వెళ్ళినది మొదలు మరల నతనితో మాట్లాడుదనుక జరిగిన కథయంతయు నుడివిన వెరఁగుపడి యతం డొక్కింతసేపు విభ్రాంతస్వాంతుఁడై యూరకుండి వెండియు నిట్లనియె.
అన్నా! నీ యదృష్టము కొనియాడఁదగియున్నది. దేవతావనితం బెండ్లి యాడుటయేగాక నన్ను నీ యాపదనుండి దొలఁగించితివి. మఱియు దైవకృప యెట్లున్నదియో కాని నే నెన్నిగతుల మరలింపఁదలఁచుకొన్నను నమ్మగువయందు నాడెందంబు తగులము విడిరాకున్నయది. నన్ను గూడ నీతోటివానిం గావించినఁ గావింపుము. లేనిచో నే నిందు సన్యాసినై క్రుమ్మరియెద. ఇంతకంటె నా మది యొండుగతికి సమ్మతింపకున్నయది. ఈపాటి కార్యము సాధింపుమని వేడుకొనుటయు దండుఁ డిట్లనియె.
సోదరుడా! నీవు దీని కింత వంతఁబడకుము. ఇక్కార్యము సమర్ధించురీతి యా చేడియ లాడుకొనిన మాటలఁ దేటంబడినది . వినుము ప్రతి భానువారంనాఁడు విద్యాధరకన్యక లిందు జలకేళిఁ దేలవచ్చుచుందురు. రేపటిదివసం బట్టిదియే కాన వారు వచ్చి వలువలు విడచి గట్టునం బెట్టి వనకేళిఁ దేలునప్పుడు మునువోలె నీవు రాగమంజరి చీర దెలియకుండ సంగ్రహించి మ్రానుకొమ్మలందున డాగియుండుము. తెలిసికొని యా కుసుమగాత్రి వచ్చి యెన్నిగతుల బ్రతిమాలినను జేరనియ్యకుము. పై కార్యము నేను సమర్థించెదననుటయు నతండు సంతసించి మరునాడు తదాగమనంబున నిరీక్షించుచుండ నయ్యండజయాన లాకసంబుననుండి మెఱపుతీగలో యన దళుక్కురని మెరయు మేనికాంతులు దెసలగ్రమ్మ బుడమికి దిగి యొండొరులు వేడుకఁమాట లాడుకొనుచుఁ బుట్టంబులు గట్టుపయిం బెట్టి జలకేళి దేలుచున్న సమయంబున సాంబుండు మెల్లన నరిగి రాగమంజరి కోక సందిట నిరికించుకొని యరిగి యెప్పటిగతి చెట్టునందు దాగియుండెను.
అక్కొమ్మ లట్లు కొంతసేపు క్రీడించి యత్తటాకంబు వెడలి తమతమచీరలం గట్టుకొని వియద్గతి విద్యాధరలోకంబున కరిగిరి. రాగమంజరి మాత్రము తనచీర గనంబడమి నాత్రపడుచు నందందు వస్త్రాపహారకుని వెదకుచు నెట్టకేలకు నాచెట్టునడుమ నున్న సాంబునిగాంచి యచ్చీర సంగ్రహింప ననేకమాయోపాయములం బన్నెనుగాని యతండు దానిమాటలేమియుఁ బాటింపక చీర నియ్యకయే యుత్తరము చెప్పుచుండెను. ఇంతలో దండుఁ డాదరి కరిగి తన్నుఁ జూచి సిగ్గుపడుచున్న యక్కన్నియకు నొకపుట్టంబు గట్టనిచ్చి యబలా! యేమి యిది. ఈతనితో జగడము చేయుచున్నదాన వని యడిగిన నది యిట్లనియె.
పుణ్యాత్మా! మాకు మధ్యవర్తివై ఈ తగవు దీర్పుము. నేను పుట్టంబు విడచి గట్టుపైఁబెట్టి జలకేళిఁ దేలుచుండ నీతండు నావలువ సంగ్రహించుకొనివచ్చె. తెచ్చెఁబో నాయది నా కిచ్చి యిచ్చవచ్చినచో నన్నుఁ బెండ్లియాడుమనుచున్నదాన. నే నెన్ని చెప్పినను నా కోక నా కీకున్నవాఁడు. న్యాయమరసి యది నా కిప్పింపు మనుటయు నతండు నవ్వుచుఁ బువ్వుఁబోఁడి! ఈ తగవు నేను తీర్చునదికాదు. మీ యేలికకూఁతురు విద్యుత్ప్రభ తీర్పఁగలదు. దాని నిందు రావించెద జూడుమని యయ్యంగనసు దలంచుకొనినంత నయ్యింతియు నంతికంబున నిలువబడినం జూచి రాగమంజరి వెరగందుచుండ నయ్యండజయానకు దండుఁ డిట్లనియె.
మగువా! ఈ తగవు వివి న్యాయము చెప్పుము. ఈతండు సాంబుఁడని పేరొందిన నా చెలికాఁడు. విద్యాగుణశీలంబుల నాకు జోడగువాఁడు ఇక్కన్యక విద్యాధరకన్యకయఁట. ఇత్తరుణి యిత్తటాకంబున వనకేళిం దేలుచున్నతఱి నీతం డీనాతిచీర దొంగిలించుకొనిపోయెను. అది యిమ్మని యడిగినను నీయక వేడుకమాటలఁ జెప్పుచున్నవాఁడట. వీని యభిప్రాయ మేమియో యెఱుగను. నీవును సూక్ష్మబుద్ధివిగాన వీని చిత్తం బరసి న్యాయము చెప్పుమని పలికిన నచ్చతురుని పలుకులకు నవ్వుచు నవ్వనిత యిట్లనియె.
ఆర్యా! ఈతండు వస్త్రచోరుఁడని మీ మాటలనే తేటయగుచున్నది గదా! తరచు దొంగలకుఁ బూనరాని బరువెత్తి మోయింటయే తగినశిక్షయైయున్నది. కాన నీతని కీనాతి భార మెడతెగక మోయునట్లు శిక్ష విధించితి ననిన నతం డోహో! మేటి చతురవు నీ మాటలు వివాహశబ్దమున కర్థమగుచున్నది. ఈ నాతి నితని వివాహ మాడమంటివా? ఔనౌను. మగవారి కింతకన్న నెక్కుడు శిక్షగలదా? యదార్థము చెప్పితిని. నీ తీరుపుసూటి యబ్బోటి కెఱింగించి యొప్పింపుమనుటయు నా విద్యుత్ప్రభ తన్నుఁ జూచినది మొదలు వెరచియున్న రాగమంజరి నాదరపూర్వకముగా దరికి జేరి మానినీ! వీరు మానవసామాన్యులుగారు. విద్యాగుణశీలంబుల దేవతలగూడఁ దిరస్కరింపనోపుదురు. నే నింతకుము న్నీదండునిం బెండ్లి యాడితిని. తదీయసహకారుండు సాంబుఁడు నంతవాఁ డతని నీవు బెండ్లి చేసుకొని నీసౌందర్యము సార్ధకము గావించుకొనుము. వీరు తలంచినప్పుడ పోయి మన మిరువురము నభీష్టములఁ దీర్చుకొనియెదము గాక యని తత్కాలోచితములగు మాటల నస్పాటలగంధి నొప్పించి యప్పుడ యప్పడతికిని సాంబునకును తానును మగండును బెండ్లి పెద్దలై పాణిగ్రహణము సేయించి దీవించిరి.
సాంబుఁ డయ్యంబుజనేత్ర నట్లు స్వీకరించి రెండుమూడుదినంబు లందుండునికుంజగృహంబులఁ గందర్పకేళిని దీర్చి యమ్మానిని దానుఁ దలంచినప్పుడు వచ్చుదానిగా నొడంబరచి యంపిపుచ్చెను. దండుఁడును విద్యుత్ప్రభకును గొంతసంతసము గలుగఁజేసి పైఁగల కార్యాతురత్వంబున సాంతవపూర్వకముగా నిజవాసంబున కంపెను.
పిమ్మట సాంబుఁడును దండుఁడును మిత్రులజాడ దెలియగోరి తొలుత వసంతుఁ డరిగిన యతిదీర్ఘంబగు శాఖామార్గంబునం బడి కొన్నిదినంబులు చనినంత శాఖాంతమున వసంతునికిఁ గనంబడిన వింతలన్నియు వారికినిఁ బొడసూపినవి. వానిం దాటించుచుఁ గ్రమంబున నానిర్జనపురంబును, బురాంతరమున నొప్పుకోటయు నతిగూఢంబగు కోటగుమ్మమును దెలిసికొని యమ్మార్గమున లోని కరిగి యనేకకక్ష్యాంతరములు గడచి తుదకు వసంతుఁడు బరుండియున్న గదిలోని కరిగి యతని జూచిరి. అర్ధనిశ్వాసమారుతములలో సగము బ్రతికియున్న వసంతునిఁ జూచినతోడనే దండుఁడు గుండె ఝల్లుమనఁ బేరెలుంగున వసంతా! వసంతా! అన్నా! వసంత! ఇ ట్లుంటివేమి యని చీరియుఁ బ్రతివచనము వడయక తడబడుచుఁ బర్యంకమున నాలుగుమూలలు వెదకిన నందొకచోఁ దాను మున్నతని ప్రాణంబు లిమిడ్చిన కత్తివర గనబడినఁ గొంతధైర్యముతోఁ గైకొని యది సగ మరగఁదీయబడియుండుటయుఁ జూచి గుండెపై జే యిడుకొని సాంబునితో నిట్లనియె.
సఖా! ఇటు చూడుము. నే నతిగూఢముగా నితనిప్రాణంబు లీవరలో నిమిడ్చితిని. ఆరహస్య మెవరి కెఱింగించెనో కాని వా రతని మోసము జేసి పోయిరి. దైవానుగ్రహమున నట్టిపని కొనసాగినదిగాదు. పాప మీవర మొదలంట నరగదీయలేదు. వీనిఁ బ్రతికించెద జూడుమని యావరయరలన్నియు మరలఁదనయంత్రరచనాపాటవంబు దేటపడునట్లు చక్కఁబరచినతోడనే యావసంతుఁడు నిద్రలేచినట్లు లేచి కన్నులు నులిమికొనుచుఁ గళావతీ! కళావతీ! యన పిలుచుచుఁ గన్నులందెరచి యత్తెరవం గానక నెదుర దన యిరువుర నెయ్యురం గని యంతరంగం బుప్పొంగ వారిం గౌఁగిలించుకొని యోహో! మిత్రులార! నన్ను వనితాలోలుండని యెఱింగియా యిట కరుదెంచితిరి. మీరాక నాకు నీరాకరంబునకు రాకయుంబోలె ముదంబు గూర్చుచున్నయది. రాముండును ప్రవరుండును వచ్చినవారు కారేమి? వారు కుశలముగా నున్నారా? ఇం దిరువు రాఁడవాం డ్రుండవలయు నెం దేగిరో యెరిగింతిరా యని యత్యాతురముగా నడుగుటయు దండుఁ డిట్లనియె.
మిత్రమా! నీవు నీవృత్తాంత మెఱఁగకుంటివి. అత్తరుణు లిరువురెవ్వరో కాని నిన్ను మోసము జేసి పోయిరి. దైవకృపచే వారిప్రయత్నము కొనసాగినది కాదు. మేము వచ్చునప్పటికి నీవు మృతప్రాయుఁడవై పడియుంటివి. మే మట్టికారణం బెరుఁగక చింతనొందుచు నరగదీసినవరమాత్రము దొరికిన మరల దాని యరల జక్కపరచి నిన్ను బ్రతికించుకొంటిమి. ఇంతియకాని మే మాయింతులవృత్తాంత మేమియు నెరుఁగ మనిన నతండు దీర్ఘనిశ్వాసపూర్వకముగా నయ్యయ్యో! కళావతి! పోయితివా! ఎందుఁ బరితపించుచుంటివే! ఆన్నన్నా! మాయముసలిదానిమాట నమ్మితి గదా? మోసము జేసి నిన్నుఁ దీసికొనిపోయెనే! హా! ప్రాణనాయకీ! నీమక్కువ మరపురాదుకదా! పరిహాసమున కెందైన దాగియుంటివా! కాదు. కా దిదియంతయు ముసలిదానికపటమే తెలిసికొంటి కటకటా! మిత్రులారా! న న్నేల బ్రతుకజేసితిరి. ఈవియోగశోక మెట్లు భరింతునని గుండెలు బాదుకొనుచుఁ బేరెలుఁగున నేడ్చుచున్న వసంతుని నూరడించుచు దండుఁ డిట్లనియె.
అన్నా! చిన్నవానివలె సట్లేడువవచ్చునా? అపువ్వుఁబోఁడి యెవ్వతె? యాముసలిది యెక్కడవచ్చినది. వారి వృత్తాంతము కొంచె మెఱింగింపుము. పై కార్యంపు తెరవరసెదఁగాక యని యడిగిన నతండు దీనస్వరముతో దాను మఱ్ఱిచెట్టు విడిచినది మొదలు కళావతితో రాత్రిగదిలోఁ బరుండువరకును జరిగినకథయంతయు నుడివి యడలుచున్న యతనితో దండుఁ డిట్లనియె.
ఆర్యా! నీవు ధైర్యముగానుండిన కార్యమంతయు నేనే చక్కపరచెదను. ప్రాజ్ఞు లాపదయందు ధైర్యమును విడుతురా? శోకించువానికి సంపదలు నసించునను నార్యోక్తి మరచితిరా! ఊరడిల్లుము. దైన్యము విడువుము. నిన్నుఁ బ్రాణసఖితో శీఘ్రకాలంబునం గూర్తు. నేను గ్రొత్తగా విమానము జేయు శక్తి సంపాదించితిని. తదీయగమనంబున భూలోకమంతయుఁ దిరిగి యత్తరిణి నరయవచ్చునని తనవృత్తాంతమును సాంబునివృత్తాంతము నంతయు నతని కెరిగించి యప్పుడ యయ్యడవి దారువులఁ గొన్ని నరికితెచ్చి శీఘ్రకాలములో నొకకీలురథము నిర్మించి దాని నెక్కి తిరుగుచు నమ్మువ్వురు భూలోకమునం బ్రసిద్ధంబులైన పట్టణంబులన్నిటను గళావతిని వెదకుచుండిరి.
అని యెఱిఁగించునంతఁ బ్రయాణసమయ మగుటయు నయ్యతీంద్రుఁ డంతటితో కథఁ జాలించి పైమజిలీయందు నా గోపాలునకు దదనంతర వృత్తాంతమిట్లు చెప్పఁ దొడంగెను.